తేనెటీగ పెట్టెలతో కూడిన కంచె
‘ఆట్టుకోంబ అమర’ చిక్కుడు పంట పొలంలో మహిళా రైతు చింది
ఆట్టుకోంబ అమర చిక్కుడు మొక్క
లఏనుగులు జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి రాకుండా తిప్పికొట్టేందుకు కేరళవాసులు రెండు పద్ధతులను అవలంభిస్తున్నారు. మొదటిది: తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెలు నిర్మించటం. రెండోది: ప్రత్యేక వాసనను వెదజల్లే దేశవాళీ పొద చిక్కుడు పంటను సరిహద్దు పంటగా సాగు చేయటం. మొదటి పద్ధతి కన్నా రెండో పద్ధతి ఎక్కువ ప్రభావశీలంగా పని చేస్తోందని రైతులు చెబుతున్నారు.
గ్రామ సరిహద్దుల్లో తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెల (బీహైవ్ ఫెన్సెస్)ను ఏర్పాటు చేశారు. ఏనుగులు అడవి నుంచి గ్రామాల వైపు వచ్చే దారిలో ఈ కంచె తీగలను తాకగానే తేనెటీగలు పెద్దపెట్టున శబ్ధం చేస్తూ వాటిని చుట్టుముడతాయి. అవి చేసే శబ్ధం ఏనుగులకు గిట్టదు. అందువల్ల అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకురాలు లూసీ కింగ్ 15 ఏళ్ల క్రితం ఈ పద్ధతిని కనుగొన్నారు. కెన్యా, టాంజానియాలలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి, తేనెటీగల కంచెలు ఏనుగులను సమర్థవంతంగా బెదరగొట్టగలవని నిర్థారించారు. ఆ తర్వాత కేరళలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న అట్ట΄్పాడి తాలూకాలో అనేక గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులకు ఏనుగుల నుంచి కొంతమేరకు ఉపశమనం దొరికింది.
కేరళలో గిరిజనులు మరో సంప్రదాయ పద్ధతిలో కూడా ఏనుగుల సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆట్టుకొంబ అమర (అట్టాప్పడీ డొలిఖోస్ బీన్ లేదా లాబ్‌లాబ్ బీన్) అనే స్థానిక రకం పొద చిక్కుడు పంటను ఏనుగులు గ్రామాల్లోకి వచ్చే మార్గాల్లో సాగు చేయటం ద్వారా వాటì రాకను సహజ పద్ధతిలో నిరోధించవచ్చని గిరిజన రైతులు గుర్తించారు.
అట్టాప్పడీ తాలూకాలోని మూలకొంబు అనే గ్రామవాసి అయిన చింది అనే 65 ఏళ్ల మహిళా రైతు ఏనుగులను నిరోధించేందుకు చెట్టు చిక్కుడును సాగు చేస్తున్నారు. అడవి ఏనుగుల గుంపును తేనెటీగల కంచెలు పూర్తిగా ఆపలేకపోతున్నాయన్నారు. ఆట్టుకోంబ అమర వంటి దేశవాళీ పొద చిక్కుడు పంట ప్రభావం చాలా బాగుందన్నారు. ‘ఈ చిక్కుడు పంటను కంచె పంటగా వేసినప్పటి నుంచి నా పొలం మీద ఏనుగులు దాడి చెయ్యలేదు. అమర చిక్కుళ్లు మంచి ధరకు అమ్ముడు కావటంతో మంచి ఆదాయం కూడా వస్తోంద’ని చింది సంతోషిస్తున్నారు.
ఈ చిక్కుడు రకం పంట వెదజల్లే ఒక రకమైన ఘాటు వాసన ఏనుగులు, తదితర వన్య్రపాణులకు గిట్టకపోవటం వల్లనే అవి వెనుదిరిగి వెళ్లి పోతున్నాయని చెబుతున్నారు. ఈ సంగతి శాస్త్రీయంగా ఇంకా రుజువు కానప్పటికీ, ప్రజలకు ఏనుగుల బెడద మాత్రం తీరింది. కేరళలో అనాదిగా సాగవుతున్న ఆట్టుకొంబ అమర చిక్కుళ్లు విలక్షణమైన రకం కావటంతో మూడేళ్ల క్రితం జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపు వచ్చింది. దీంతో ‘బయోసర్టిఫికేషన్’ ఉన్న ఈ చిక్కుళ్లకు ఏకంగా కిలోకు రూ. వెయ్యి వరకు ధర పలుకుతుండటం మరో విశేషం. మళయాళంలో ‘ఆట్టు’ అంటే మేక. ‘కొంబు’ అంటే కొమ్ము. కేరళ గిరిజన రైతులు సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ‘మేక కొమ్ము’లతో ఏనుగులను జయిస్తున్నారన్న మాట!
Comments
Please login to add a commentAdd a comment