'సాధారణ వరి వంగడాల పంటకు ఉప్పు నీరు తగిలితే ఆకులు పసుపు రంగులోకి మారిపోయి, ఎదుగుదల లోపించి, దిగుబడి తగ్గిపోతుంది. అయితే, కేరళ తీరప్రాంతంలో లోతట్టు మాగాణుల్లో ఉప్పు నీటిలోనూ పొక్కలి వరి వంగడం చక్కగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. ఇందుకు దోహదపడుతున్న మట్టి మర్మమేమిటి? అని అల్లాపుఝలోని సనాతన ధర్మ కాలేజీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేసి ఓ సరికొత్త బ్యాక్టీరియాను కనుగొన్నారు. పొక్కలి రకం వరి సాగయ్యే సేంద్రియ పొలాల్లోని మట్టిలో ఉండే సూడోమోనాస్ తైవానెన్సిస్ (పికె7) వల్లనే ఉప్పు నీటిని ఆ పంట తట్టుకోగలుగుతోందని వారు తేల్చారు.'
కుట్టనాడ్ ప్రాంతంలో విస్తారంగా సాగయ్యే యుఎంఎ అనే రకం వరికి ఉప్పునీటి బెడద ఎక్కువైన నేపథ్యంలో ఈ అధ్యయనం జరిగింది. పికె7తో పాటు పంట పెరుగుదలకు దోహదం చేసే రైజోబ్యాక్టీరియా (ఎస్.టి.–పిజిపిఆర్‌లు) కూడా వాడి యుఎంఎ రకం వరిని ప్రయోగాత్మకంగా సాగు చేసి చూశారు. ఈ బ్యాక్టీరియాలు వాడి సాగు చేస్తే హెక్టారుకు 7,595 కిలోల ధాన్యం దిగుబడి వస్తే.. వాడకుండా సాగు చేస్తే హెక్టారుకు 7,344 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది.
అంటే.. పికె7 బ్యాక్టీరియా ఉప్పు వల్ల కలిగే ప్రతికూలతను తట్టుకొని వరి పంట నిలబడే వ్యవస్థను సృష్టిస్తోందని అర్థమవుతోందని పరిశోధకులు నిర్థారణకు వచ్చారు. 2022 డిసెంబర్ – ఏప్రిల్ 2023 మధ్య కాలంలో జరిగిన ఈ అధ్యయన వివరాలతో కూడిన వ్యాసం జర్నల్ ఆఫ్ అగ్రానమీ అండ్ క్రాప్ సైన్స్‌లో ప్రచురితమైంది. మన చౌడు భూముల్లోనూ వరి, తదితర పంటల సాగుకు ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందేమో మన శాస్త్రవేత్తలు పరిశోధించాలి.
'పొక్కలి’ పొలంలో మట్టి సేకరణ
67.3 లక్షల హెక్టార్లలో చౌడు సమస్య..
మన దేశంలో చౌడు బారుతున్న నేలల (సాల్ట్–ఎఫెక్టెడ్ సాయిల్స్) విస్తీర్ణం ఇటీవల కాలంలో వేగంగా పెరుగుతోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్)కు చెందిన కేంద్రీయ చౌడు నేలల పరిశోధనా సంస్థ (సిఎస్‌ఎస్‌ఆర్‌ఐ) ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం మన దేశంలో 67 లక్షల 30 వేల హెక్టార్ల సాగు భూమి చౌడుబారింది. 2050 నాటికి ఇది రెట్టింపవుతుందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.
భూములు చౌడుబారటం వల్ల మన దేశంలో ఏటా 1.68 కోట్ల టన్నుల పంట దిగుబడిని నష్టపోతున్నాం. ఈ పంట విలువ రూ. 23 వేల కోట్లు (2015 నాటి ధరల ప్రకారం). చౌడు భూముల్లో పంటలు బతకవు. బతికినా పెద్దగా పెరిగి దిగుబడినివ్వవు. వ్యవసాయోత్పత్తిని దెబ్బతీయటమే కాదు సాంఘిక–ఆర్థిక స్థితిగతులను సైతం చౌడు సమస్య అతలాకుతలం చేస్తుంది.
మురుగునీటి పారుదల సదుపాయం సమర్థవంతంగా లేకపోవటం, భూముల్లో అతిగా నీరు నిల్వ ఉండిపోవటం ఇందుకు ప్రధాన కారణాలు. రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులు, పంటలకు అందించే భూగర్భ జలాల నాణ్యత నాసికరంగా ఉండటం కూడా తోడవుతున్నాయి. చౌడు సమస్య మన దేశానికే పరిమితం కాదు.
ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధి దెబ్బతింటోంది. ఏటా వీరికి కలుగుతున్న నష్టం 630 కోట్ల డాలర్లని అంచనా. వంద దేశాల్లో 83.5 కోట్ల హెక్టార్ల భూమి చౌడుబారిన పడింది. ఇందులో మనుషుల పనుల వల్ల చౌడువారిన భూములు 7.6 కోట్ల హెక్టార్లు ఈ నేపధ్యంలో కేరళలో కనుగొన్న కొత్త సూక్ష్మజీవి చౌడు భూముల సాగులో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆశిద్దాం..!
13న బయోచార్ సొసైటీ ఆవిర్భావం!
కట్టె పులల్ల నుంచి పర్యావరణ హితమైన బయోచార్ (బొగ్గుపొడి) ఉత్పత్తిని, వాడకాన్ని పెంపొందించే సదుద్దేశంతో భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది. బొగ్గుపొడి సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుంది. దీంతో పాటు నీటి శుద్ధి, పారిశుద్ధ్యం తదితర అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా బయోచార్‌కు కార్బన్ క్రెడిట్స్ చేకూర్చే పరిస్థితులు ఉండటంతో జీవనోపాధులను పెంపొందించడానికి కూడా ఇది దోహదపడనుంది. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5–7 గంటల మధ్య హైదరాబాద్ యూసఫ్‌గూడలోని ఎన్.ఐ.–ఎం.ఎస్.ఎం.ఇ. కార్యాలయ ఆవరణలో బయోచార్ సొసైటీ ఆవిర్భావ సభ జరగనుంది. ఆర్.కె. మెహతా చైర్మన్‌గా, డా. నక్కా సాయిభాస్కర్‌రెడ్డి ప్రెసిడెంట్‌గా, ఎస్.కె. గు΄్తా కార్యదర్శిగా భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది.
వివరాలకు.. 6305 171 362.
1 నుంచి పల్లెసృజన శోధా యాత్ర..
గ్రామీణుల్లో నిగూఢంగా దాగి ఉన్న తరతరాల జ్ఞానాన్ని శోధించడానికి, ప్రకృతితో మమేకమైన వారి జీవన విధానం గురించి తెలుసుకోవడానికి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి గ్రామం నుంచి గన్నారం గ్రామం వరకు చిన్న శోధాయాత్ర నిర్వహించనున్నట్లు పల్లెసృజన సంస్థ అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం తెలిపారు. మార్చి 1 నుంచి 3 వరకు జరిగే ఈ యాత్రలో రూ.500 రుసుము చెల్లించి ఆసక్తిగల వారెవరైనా ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 98660 01678, 99666 46276.
నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment