అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ ఉద్యమ సంస్థల సమాఖ్య (ఐ.ఎఫ్.ఓ.ఎ.ఎం. –ఐఫోమ్) పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు ఈ నెల 10వ తేదీన ‘ఐ గ్రో యువర్ ఫుడ్’ పేరిట వినూత్న ప్రచారోద్యమాన్ని చేపట్టారు. ప్రజల కోసం రసాయనాల్లేకుండా ఆరోగ్యదాయకంగా చేపట్టిన సేంద్రియ వ్యవసాయం– మార్కెటింగ్ తీరుతెన్నులు.. సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి ప్రజలు చేయగల సహాయం ఏమిటి? వంటి అంశాలపై తమ అభి్రపాయాలతో కూడిన వీడియోలను సేంద్రియ రైతులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
ఐగ్రోయువర్‌ఫుడ్.. బయో పేరిట ఏర్పాటైన ప్రత్యేక వెబ్‌సైట్‌లో, ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్‌కు చెందిన వెబ్‌సైట్/ఎక్స్/యూట్యూబ్/ఇన్‌స్టా తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రపంచ దేశాల సేంద్రియ రైతుల షార్ట్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చూసిన ప్రజలు/వినియోగదారులు తమ అభి్రపాయాలను, సూచనలను పంచుకోవడానికి వీలుంది.
ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ 1972లో ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. వంద దేశాల్లోని సుమారు 700 సేంద్రియ వ్యవసాయ సంస్థలకు ఇప్పుడు ఐఫోమ్ సభ్యత్వం ఉంది. ఆరోగ్యం, పర్యావరణం, న్యాయం, శ్రద్ధ అనే నాలుగు మూల సూత్రాలపై ఆధారపడి సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరింపజేయటమే ఐఫోమ్ తన లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రియ వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించటంతో పాటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజన్సీలకు అక్రెడిటేషన్ ఇస్తుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఆహారోత్పత్తి చేసి ప్రజలకు అందిస్తున్న రైతుల్లో 80% మంది చిన్న, సన్నకారు రైతులేనని ఐఫోమ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో 90% క్షేత్రాలు ఒంటరి రైతులు లేదా రైతు కుటుంబాలే నడుపుతున్నారు. సంస్థలు/కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ క్షేత్రాలు మిగతా పది శాతం మాత్రమే. https://igrowyourfood.bio/
కేరళలో కౌలు సేద్యం చేస్తున్నా..!
నా పేరు షమికా మోనే, మహారాష్ట్రలో పుట్టా. పరిశోధనలు వదలి పెట్టి సేంద్రియ రైతుగా మారా. కేరళలో భూమిని కౌలుకు తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. అనేక రకాల దేశీ వరితో పాటు కూరగాయలు పండిస్తున్నా. పంట విత్తిన దగ్గర నుంచి నూర్పిడి,ప్రాసెసింగ్ వంటి పనులు సాధ్యమైనంత వరకు నేనే చేసుకోవటం అద్భుతమైన అనుభవం. నేను పండించిన ఆహారోత్పత్తుల్ని తింటున్న స్నేహితులు, బంధువులు చాలా సంతోషంగా ఉన్నారు. సీజన్‌కు ముందే డబ్బు పెట్టుబడిగా ఇస్తారు. పంటలు పండించిన తర్వాత.. తమకు అవసరమైన ఆహారోత్పత్తుల్ని తీసుకుంటున్నారు. దేశీ వరి బియ్యం, అటుకులతో చేసిన స్థానిక సంప్రదాయ వంటకాలను పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ‘ఐగ్రోయువర్‌ఫుడ్’ ఉద్యమంలో భాగస్వామిని కావటం సంతోషంగా ఉంది.
– షమిక మోనె, సేంద్రియ యువ మహిళా రైతు, కేరళ
Comments
Please login to add a commentAdd a comment