Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు! | Sagubadi Three Crops Per Year With Organic Farming | Sakshi
Sakshi News home page

Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు!

Published Tue, Apr 16 2024 7:19 AM | Last Updated on Tue, Apr 16 2024 8:09 AM

Sagubadi Three Crops Per Year With Organic Farming - Sakshi

నువ్వుల చేనులో రాజేష్‌ రెడ్డి–భారతి దంపతులు

భూతల్లి కన్న తల్లితో సమానమని భావించే ఈ రైతు దంపతులు తమ సొంత భూమిలో మనసుపెట్టి ఇష్టంగా వ్యవసాయం చేస్తూ ఏడాదికి మూడు పంటలు పండిస్తున్నారు. దీంతో వీరి పొలాలు ప్రదర్శన క్షేత్రాలుగా మారిపోయాయి. పశువులు, గొర్రెలు, కోళ్ల ఎరువులు, జీవామృతంతో పంటలు పండిస్తున్నారు. మంచి దిగుబడులతో పాటు చక్కని ఆదాయం పొందుతున్నారు.

మిట్టపెల్లి రాజేష్‌ రెడ్డి, భారతి ఆదర్శ రైతు దంపతులు. చదివించి పదో తరగతే అయినా తమ 12 ఎకరాల భూమిలో మనసుపెట్టి సేంద్రియ వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇంటికి అవసరమైన అన్నింటినీ సేంద్రియంగా పండించుకొని తింటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వీరిది జగిత్యాల జిల్లాలో మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్‌ గ్రామం.

3 కి.మీ.ల పైపులైను..
ఆ రైతు దంపతులకు వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు పంచప్రాణాలు! వీరికి పన్నెండు ఎకరాల భూమి ఉంది. బావులే ఆధారం. 3 కి.మీ. దూరంలో వున్న ఎస్సారెస్పీ వరద కాల్వ నుంచి పైపులైన్లు వేసుకొని డ్రిప్‌తో సాగు చేస్తున్నారు.

20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నప్పటికీ దిగుబడులు అంతంతే కాని, ఖర్చులు మాత్రం పెరిగాయి. ఇష్టారీతిన రసాయన ఎరువులు వేయడంతో ప్రతి పంటలో పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువై, వాటికి రసాయన మందులు పిచికారీ చేసేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కుటుంబ అదాయం పిల్లల చదువుకు కూడా సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో పాలేకర్‌ పద్ధతిలో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయవచ్చని తెలసుకొని సాగు పద్ధతిని మార్చుకున్నారు.

ఈ దంపతులు ప్రతి ఏడాదీ మూడు పంటలు పండిస్తున్నారు. మేలో తప్ప మిగతా 11 నెలలూ వీరి పొలాల్లో పంటలతో ఉంటాయి. వర్షాలతో సంబంధం లేకుండా, వ్యవసాయ భావుల్లో ఉన్న కొద్దిపాటి నీటితోనే, జూన్‌ రెండో వారంలోనే విత్తనాలు వేస్తుంటారు. వానాకాలం సీజన్‌లో ఆరు ఎకరాల్లో సన్న రకం వరి, రెండెకరాల్లో పసుపు, మూడెకరాల్లో మొక్కజొన్న, ఒక ఎకరంలో మిర్చి పంట సాగు చేశారు. యాసంగి సీజన్‌లో ఆరెకరాల్లో లావు రకం వరి, ఎకరంలో జొన్న, 3 ఎకరాల్లో మొక్కజొన్న, రెండెకరాల్లో నువ్వు సాగు చేస్తున్నారు.

ఖర్చు తగ్గించే సాగు పద్ధతులతో మేలు!
మా భూమిలో రకరకాల పంటలు పండించి, ఆ పంటల్లో అధిక దిగుబడులు తీసినప్పుడు మాకు కష్టం గుర్తుకురాదు. ప్రధానంగా భూతల్లిని కాపాడేందుకు రసాయనాలను పూర్తిగా తగ్గించి, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువు వాడుతున్నాం. వ్యవసాయంతో చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతుంటే, మేం మాత్రం ఇష్టంగా చేస్తున్నాం.. సంతృప్తిని, ఆదాయాన్ని పొందుతున్నాం. ప్రతి రైతు ఖర్చు తగ్గించే పద్ధతులపై దృష్టి పెట్టాలి. మేం అలాగే చేస్తున్నాం. మా పద్ధతిలోకి రావాలని తోటి రైతులను ప్రోత్సహిస్తున్నాం. – మిట్టపెల్లి భారతి, రాజేష్‌ రెడ్డి (9618809924, 9618111367)

వెద వరి.. 30 క్వింటాళ్ల దిగుబడి
వరి సాగు చేయబోయే పొలంలో జూన్‌లో మొక్కజొన్న సాగు చేసి, కంకులు కోసిన తర్వాత మొక్కజొన్న మొక్కలను రోటోవేటర్‌తో పొలంలో కలియ దున్నేస్తారు. ఆ తర్వాత, వరి నారు పోసి, నాటు వేసే బదులు, నేరుగా వెదజల్లి ఎకరానికి 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. అలాగే, పసుపు, మొక్కజొన్న సాగు చేసే భూమిలో రెండు లారీల గొర్రెల ఎరువు, ఒక లారీ మాగిన కోళ్ల ఎరువు వేసి భూసారం పెంచుకుంటూ ఉంటారు. పంటకాలంలో ప్రతి పంటకు జీవామృతాన్ని మూడు సార్లు ఇస్తున్నారు. నాలుగు ఆవులు, మూడు గేదేలను పెంచుతున్నారు. సగటున ఎకరానికి సజ్జలు 12–15, పసుపు 30, మొక్కజొన్నలు 40–45, నువ్వులు 4–6 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు.

భారతి, రాజేష్‌ రెడ్డి దంపతులు తెల్లవారుఝామున 3 గంటలకే వీరి దిన చర్య ప్రారంభం అవుతుంది. ఆవులు, గేదేల నుంచి పాలు పిండి 30 మందికి పాలు పోస్తారు. ఇంట్లో వంట పనులు పూర్తి చేసుకొని ఇద్దరూ తెల్లారేసరికే పొలంలో అడుగుపెడతారు. సా. ఆరు గంటలైతే కానీ ఇంటికి రారు. ఏ ఫంక్షన్‌కు వెళ్లినా సాయంత్రం ఇంటికి రావాల్సిందే!

విలువ జోడించే అమ్ముతారు
భారతి, రాజేష్‌ రెడ్డి దంపతులు తాము పండించిన పంటలను విలువ జోడించి అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. సన్న వరి ధాన్యాన్ని మర ఆడించి బియ్యం క్వింటాకు రూ. 6,500కు విక్రయిస్తున్నారు. మిరపకాయలను ఎండబెట్టి కారం పొడిని కిలో రూ. 280కి వినియోగదారులకు అమ్ముతున్నారు. సజ్జలను బై బ్యాక్‌ పద్ధతిలో కంపెనీలకు క్వింటా రూ.7 వేలకు, పసుపును క్వింటా రూ.11 వేలకు, మొక్కజొన్నను క్వింటా రూ.2,100కు నువ్వులను క్వింటా రూ.14 వేల చొప్పున విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. తమ పిల్లలిద్దరినీ హైద్రాబాద్‌లో ఇంజనీరింగ్‌ చదివిస్తున్నారు. ఫార్మ్‌ అండ్‌ రూరల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో పూర్వ ఉపకులపతి దివంగత జె. రఘోత్తమరెడ్డి స్మాకరకోపన్యాస సభలో భారతి ఉత్తమ సేంద్రియ రైతు పురస్కారాన్ని అందుకోవటం విశేషం. – పన్నాల కమలాకర్‌ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement