Organic Farming
-
‘మూల సంత’ సూర్యకళ : మహిమాన్వితం
మనం జీవించి ఉన్నాం, జీవిస్తున్నాం.. అంటే అనుక్షణం ప్రకృతి నుంచి తీసుకుంటూనే ఉన్నామని అర్థం. మనం తీసుకున్నంత తిరిగి ఇవ్వాలని ప్రకృతి కోరుకోదు. విధ్వంసం చేయకపోతే చాలనుకుంటుంది. ప్రకృతి తనను తాను స్వస్థత పరుచుకుంటుంది. కానీ ఆ సమయం కూడా ఇవ్వనంత వేగంగా కాలుష్యభరితం చేస్తున్నాం. ప్రకృతిని పరిరక్షిస్తూ సాగిన మన భారతీయ జీవనశైలిని మర్చిపోయాం. మనం మరిచిపోయిన ఆరోగ్యకరమైన జీవనశైలిని గుర్తు చేయాలి, ఆచరణలోకి తెచ్చే వరకూ చైతన్యవంతం చేస్తూనే ఉండాలనే ఉద్దేశంతో పదిహేనేళ్లుగా గ్రీన్ వారియర్‌గా మారారు సూర్యకళ మోటూరి. జీవనశైలి మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని, అది మహిళ నుంచే ప్రారంభం కావాలని, అందుకోసం ఆమె మహిళలను చైతన్యవంతం చేయడానికి పూనుకున్నారు. గ్రామభారతి అధ్యక్షబాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక మహిళ సూర్యకళ మహిళాదినోత్సవం సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సూర్యకళ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ చేసి నగరంలోని ఓ ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. జాతీయోధ్యమ నాయకుల జీవితగాథలను చదివినప్పుడు ఆ కాలంలో పుట్టనందుకు ఆవేదన చెందేవారామె. రాజీవ్ దీక్షిత్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు.. ‘దేశం కోసం పని చేయడానికి ఎప్పుడూ ఏదో ఒక సామాజిక అవసరం ఉండనే ఉంటుంది. దానిని తెలుసుకుని పని చేయాలి’ అనే ఆలోచన రేకెత్తింది. సుభాష్ పాలేకర్ శిక్షణలో వాలంటీర్‌గా పని చేసినప్పుడు జరిగిన సంఘటన ఆమెను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించింది. అక్కడికి వచ్చిన ఒక మహిళారైతు ఇచ్చిన కందిపప్పును ఇంటికి తెచ్చుకుని వండుకున్నారు. ఆ రుచి అమృతంలా అనిపించిందన్నారు సూర్యకళ. ప్రతి ఒక్కరూ అలాంటి ఆహారాన్ని తినాలని కోరుకున్నారు. సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో పని చేయసాగారు. ‘శిక్షణా తరగతులు నిర్వహించి సేంద్రియ వ్యవసాయంపై ‘మా గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ’ విజయవంతమైంది. కానీ ఆ ఉత్పత్తులకు మార్కెట్ లేకపోతే ఆ రైతు నిలదొక్కుకునేదెలా అనే ప్రశ్నకు సమాధానంగా ఒక వేదికను రూపొందించాను. ఆర్గానిక్ ఫుడ్ విషయంలో అవగాహన కల్పించడంలో మీడియా చాలా బాగా పని చేస్తోంది. చైతన్యం వచ్చింది కానీ ఉత్పత్తులు అందుబాటులో లేవు. దాంతో ‘మూలసంత’ పేరుతో వాటిని నగరానికి తీసుకొచ్చే బాధ్యత చేపట్టాను. కార్పొరేట్ కంపెనీల్లో మూలసంతలు పెడుతున్నాం. ఇటీవల ఇన్ఫోసిస్‌లో 30 స్టాళ్లతో సంత పెట్టాం. మహిళలను సంఘటిత పరిచి ఆర్గానిక్ ఉత్పత్తులను వారి వంటింటి వరకూ తీసుకెళ్లేలా చేయగలిగాం. నీటి వృథాను అరికట్టడం వంటి విషయాల్లో ఆలోచన రేకెత్తించడం నుంచి పెళ్లి, ఇతర వేడుకల్లో పర్యావరణ హితమైన వేదికల ఏర్పాటు వరకూ కృషి చేశాం. పదిహేనేళ్ల నా ప్రస్థానంలో ఏమి సాధించానని చూసుకుంటే మన వేడుకలు కనిపిస్తాయి. ఆహ్వాన పత్రికల, రిటర్న్ గిఫ్ట్‌లు, భోజనం వడ్డించే ప్లేట్ల వరకూ ప్రతిదీ బయో డీగ్రేడబుల్ థీమ్‌ని అనుసరిస్తున్నారు. మా ప్రయత్నం ఏ మాత్రం వృథా కాలేదు. ఒక మంచి బాట వేయగలిగాం’ అన్నారు సూర్యకళ. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!చోదకశక్తి మనమే! ఇంటిని నడిపేది మహిళే. ఇంట్లోకి వచ్చే ఏ వస్తువూ ప్రకృతికి హానికలిగించేదిగా ఉండకూడదు.. అనే నియమాన్ని మహిళలు పాటిస్తే చాలు. ప్రకృతిని కాపాడుకోడం కోసం మేము వేదికల మీద మాట్లాడితే ఆ ప్రయత్నం చైతన్యవంతం వరకే పరిమితం. ఆచరణ ఇంటి నుంచే మొదలు కావాలి, అది మహిళతోనే మొదలు కావాలి. అందుకే సమాజహితమైన ఏ పని అయినా మహిళల నుంచి మొదలైతే అది విజయవంతమవుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం నిధులు, పొలాలు సమకూరుస్తుంటాం. అంతకంటే ముఖ్యమైన పని పిల్లలకు ఆరోగ్యకరమైన భూమిని అందించడం. మహిని రక్షించే మహిమాని్వతమైన శక్తి మహిళకే ఉంది. మహిళలుగా మనం చేయాల్సిన సమాజసేవ, దేశసేవ ఇది. – సూర్యకళ మోటూరి, గ్రీన్ వారియర్, అధ్యక్షురాలు, గ్రామభారతి -
ఫినిక్స్‌లో సేంద్రీయ వ్యవసాయంపై నాట్స్ అవగాహన
ఫినిక్స్ : అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు వారి కోసం సేంద్రీయ వ్యవసాయం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ ఆధ్వర్యంలో ఫినిక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను ఈ సదస్సులో నాట్స్ నాయకులు వివరించారు. సేంద్రీయ వ్యవసాయం వల్ల నేలతల్లికి కూడా మేలు చేసినట్టవుతుందని ప్రముఖ పర్యావరణ ప్రేమికులు ప్రవీణ్ వర్మ అన్నారు. సేంద్రీయ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను, ఆరోగ్యానికి జరిగే మేలును ఆయన వివరించారు. ఇదే కార్యక్రమంలో ఇంటి ఆవరణలోనే పండించిన సేంద్రీయ ఉత్పత్తులను రైతు బజార్ తరహాలో పెట్టి విక్రయించారు. తాము ఎలా సేంద్రీయ పద్దతుల్లో ఆకుకూరలు పండించింది కూడా పండించిన వారు ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కృషి చేసిన నాట్స్ ఫినిక్స్ సభ్యులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!
రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేస్తున్నారంటే ఇప్పుడెవరూ ఆశ్చర్యపోవడం లేదు. కానీ.. ఎద్దులతోనో, ట్రాక్టరుతోనో దున్నే పనే లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చంటే.. నమ్మలేం. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన దివంగత రైతు శాస్త్రవేత్త రాజు టైటస్ మాత్రం 30 ఏళ్ల పాటు ఇలాగే వ్యవసాయం చేసి సత్ఫలితాలు సాధించారు. ‘ప్రకృతి వ్యవసాయం వెనుకబడినదో లేదా ప్రాచీనమైనదో కాదు. ఆధునికమైనది, వినూత్నమైనది అని రాజు టైటస్ రుజువు చేశారు’ అని ఐసిఎఆర్ ప్రశంసించింది. ఆరేళ్ల క్రితం కన్నుమూసినా.. ఆయన కృషి రైతులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు చెందిన ‘రాజు టైటస్’ ప్రభుత్వోద్యోగి. అయినా కుటుంబ వారసత్వంగా వచ్చిన 13 ఎకరాల పొలాన్ని సాగు చేయటం మానలేదు. 70వ దశకంలో అందరిలానే ఆయనా ‘హరిత విప్లవం’ ఒరవడిలో రసాయన ఎరువులు, కీటకనాశనులు వాడటం మొదలుపెట్టారు. మొదట్లో దిగుబడులు పెరిగి ఆదాయం వచ్చినా పదిహేనేళ్లు తిరిగేసరికి పంట భూమి నిస్సారమయింది. దిగుబడులు తగ్గి నష్టాల పాలై పొలం అమ్మేయాలని నిశ్చయించుకున్నాడు. ఇది జరిగింది 1984లో. రాజు నిర్ణయంతో తల్లి హతాశురాలయింది. గాంధేయవాదులు నడిపే స్వచ్ఛంద సంస్థ ‘ఫ్రెండ్స్ రూరల్ సెంటర్’ కార్యకర్తలతో ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. వారు ఆమె చెప్పినదంతా విని జపాన్ దేశానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ (వన్ స్ట్రా రివల్యూషన్) పుస్తకాన్నిచ్చి మీ సమస్యకు ఈ పుస్తకం పరిష్కారాన్ని చూపుతుందని చెప్పారు. కలుపు తీయకుండా.. దుక్కిదున్నకుండా.. ఎరువులు వేయకుండా.. పురుగు మందులు పిచికారీ వంటి పద్ధతులు అనుసరించకుండానే పంటలను సాగు చేసే పద్ధతుల గురించి పుకుఒకా ఆ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకాన్ని చదివిన రాజు తను సాగులో తను అనుసరిస్తున్న పద్ధతులు అనర్థ హేతువులని అర్థం చేసుకున్నారు.అడ్డంకులను అధిగమించి.. 15 ఏళ్లుగా రసాయన ఎరువులు వేస్తూ పంటభూమిని ధ్వంసం చేస్తున్నానని అర్థం చేసుకున్న రాజు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 1985 నుంచి పుకుఒకా చెప్పిన పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి నేలను దున్నటం, ఎరువులు, పురుగుమందుల వాడకం ఆపేశారు. రకరకాల గడ్డి, చెట్ల విత్తనాలను పొలంలో వెదజల్లి అవి పెరిగాక కత్తిరించి ఆచ్ఛాదనగా వాడేవారు. దీనివల్ల వర్షపు నీరు బయటకు వెళ్లకుండా పొలంలోనే ఇంకి.. నేల గుల్లబారటంతో పాటు తేమను పట్టి ఉంచింది. తొలుత గ్రామస్తులు అవహేళన చేసినా అడ్డంకులను అధిగమించి రాజు ప్రకృతిసేద్యం దిశగా వడివడిగా అడుగులు వేశారు.సోయా విత్తన బంతులు!అంకితభావంతో రాజు టైటస్ చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. 1988లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనటానికి ఇండియా వచ్చిన ఫుకుఒకా ప్రకృతిసేద్యం చేస్తున్న రాజు గురించి తెలుసుకొని ఆయన పొలాన్ని సందర్శించారు. ఫుకుఒకా సలహాలు సూచనలను అనుసరించి రెట్టించిన ఉత్సాహంతో రాజు పనిచేశారు. పుకుఒకా సూచన మేరకు పంటను విత్తుకోవటానికి బదులు.. ఒక పాలు సోయా విత్తనం, ఏడు పాళ్లు మట్టి కలిపి క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండే ‘విత్తన బంతుల’ ను తయారు చేశారు. భార్య శాళిని సహకారంతో.. అడుగుకో బంతి చొప్పున.. పొలంలో వేశారు. దీనివల్ల మొలకెత్తినప్పటి నుంచే మొక్కలు పోషకాలను, సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి ఏపుగా ఎదిగాయి. ఆ ఏడాది దిగుబడి బావుండటంతో పాటు నాణ్యమైన పంట వచ్చింది. సోయా మొక్కల మధ్య ఎత్తుగా పెరిగిన గడ్డిని కత్తిరించి భూమిపైన ఆచ్ఛాదనగా వేశారు. దీనివల్ల పంటలకు మేలు చేసే వానపాములు, మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు ఆశ్రయం లభిస్తుంది. పంటలకు హానిచేసే శతృ పురుగులను ఇవి నిర్మూలిస్తాయి. దీనివల్ల రసాయనిక ఎరువులు, కీటకనాశనుల అవసరం తప్పుతుంది. ఇవి నేలలో చేసే బొరియల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వేర్లు లోతుకంటా చొచ్చుకు΄ోయి తేమను ΄ోషకాలను గ్రహిస్తాయి. నేల గుల్లబారి భూ సారం పెరిగి మంచి పంట దిగుబడులు వస్తాయి. నేలను దున్నాల్సిన అవసరం లేకపోవటం వల్ల ట్రాక్టరు.. ఎద్దుల కోసం అప్పు చేయాల్సిన అగత్యం తప్పింది. రాజు తన పొలంలో నత్రజనిని స్థిరీకరించేందుకు సుబాబుల్ చెట్లను సాగు చేశారు. దీనివల్ల యూరియా రూపంలో రసాయన ఎరవును అందించాల్సిన అవసరం ఉండదంటారాయన. సుబాబుల్ ఆకులు మేకలకు మంచి మేతగా ఉపయోగపడ్డాయి. ఈ చెట్ల కలపతో పాటు మేకల విక్రయం ద్వారా ఆదాయం లభిస్తోంది. ఆ విధంగా 30 ఏళ్లకు పైగా పొలాన్ని దున్నకుండానే సమృద్ధిగా పంటలు పండిస్తూ పేరు΄ పొందారు. వినియోగదారులు అడిగితేనే రైతులు పండిస్తారు!వినియోగదారులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం కోసం డిమాండ్ చేసినప్పుడే రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం మానేస్తారు. ఆరోగ్యకరమైన నేల ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి సాధ్యమనే విషయాన్ని గుర్తిస్తారు’ అనేవారు రాజు టైటస్. మన దేశంలో ప్రజలకు సోకుతున్న పలు జబ్బులకు మూలకారణం ఆహార పంటల సాగులో వాడుతున్న రసాయనాలు. వీటి వల్ల తొలుత మధుమేహం సోకి పలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. నాకు పక్షవాతం వచ్చింది. నా భార్య గుండెజబ్బు వ్యాధిగ్రస్తురాలు. అయినా మేం కోలుకోవటానికి ప్రకృతి సేద్య పంట ఉత్పత్తులే కారణం అన్నారాయన. ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగంమా కుటుంబ అవసరాల కోసం ప్రస్తుతం ఎకరా పొలంలో ధాన్యం, పండ్లు, పాలు, కూరగాయలను సాగు చేస్తున్నాం. ఖరీఫ్‌లో గోధుమ, వరి, మొక్కజొన్న, రబీలో పెసరను సాగు చేస్తున్నాం. రోజురోజుకు వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులే రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఫుకు ఒకా విధానంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సేద్యం మూలసూత్రాలను ఒంటబట్టించుకుంటే ఏ రైతైనా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేయవచ్చు అంటారు రాజు టైటుస్! -
అన్నదాత మెచ్చిన రైతుబిడ్డ
పొలాలే బడులుగా రైతులకు సరికొత్త వ్యవసాయ పాఠాలు చెబుతుంది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట (Akkannapet) మండలంలోని రామవరం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిణి (ఏఈవో) కరంటోతు శ్రీలత. ఆమె పాఠాలు వృథా పోలేదు. సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత నుంచి మల్చింగ్ (mulching) పద్ధతిలో కూరగాయల సాగు వరకు ఎన్నో విషయాలను అవగాహన చేసుకొని కొత్తదారిలో ప్రయాణిస్తున్నారు అన్నదాతలు...అక్కన్నపేట మండలం పంతులు తండాకు చెందిన శ్రీలతకు ఏఈవో ఉద్యోగం వచ్చినప్పుడు ‘నాకు ఉద్యోగం వచ్చింది’ అనే సంతోషం కంటే ‘ఈ ఉద్యోగం వల్ల ఎంతోమంది రైతులకు సహాయంగా నిలబడవచ్చు’ అనే సంతోషమే ఎక్కువ. రైతు కుటుంబంలో పుట్టిన శ్రీలతకు రైతుల కష్టాలు, నష్టాలు తెలియనివేమీ కాదు. సాగులో మెలకువలు పాటించకపోవడం వల్ల పంట దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. అయితే మెలకువలు పాటించకపోవడం నిర్లక్ష్యం వల్ల కాదు... అవగాహన లేకపోవడం వల్లే జరుగుతోందని గ్రహించిన శ్రీలత రంగంలోకి దిగింది.ఆమె పొలం దగ్గరికి వస్తే ఎక్కడి నుంచో అగ్రికల్చరల్ ఆఫీసర్ (Agriculture Officer) వచ్చినట్లు ఉండదు. తెలిసిన వ్యక్తో, చుట్టాలమ్మాయో వచ్చినట్లుగా ఉంటుంది. ఎలాంటి బేషజాలు లేకుండా అందరితో కలిసిపోయి వారి సమస్యలు తెలుసుకుంటుంది. పొలం దగ్గరికి వచ్చినప్పుడు శ్రీలత కూడా రైతుగా మారిపోతుంది. తానే స్వయంగా ట్రాక్టర్‌తో వరి పొలం దున్నుతుంది. వరిలో కాలిబాటల ప్రయోజనాల గురించి చెబుతుంది. ఎరువులు ఎంత మోతాదులో చల్లాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్షంగా చేసి చూపిస్తోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నూతన సాగు పద్ధతులను తెలుసుకుంటూ, వాటిని తన క్లస్టర్ పరిధిలోని రామవరం, గండిపల్లి, కుందన్‌వానిపల్లి, మైసమ్మవాగు తండా రైతులకు చెబుతుంటుంది. రసాయనిక మందుల వినియోగం లేకుండా సేంద్రియ పద్దతిలో సాగు చేసే విధంగా రైతులనుప్రోత్సహిస్తోంది. గిరిజన గ్రామాల్లో సైతం మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు ఎక్కువగా సాగు చేసేలా చేస్తోంది. చదవండి: చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సేంద్రియ ఎరువులప్రాధాన్యత గురించి ఒకటికి పదిసార్లు చెప్పడమే కాదు సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలని అనే అంశంపై ప్రత్యేక వీడియోను తయారు చేసింది. జీవ ఎరువుల వినియోగంపై కూడా ప్రత్యేక వీడియోను తయారు చేసి రైతులకు అవగాహన కలిగిస్తోంది.క్షేత్రస్థాయిలోకి...రైతు అంటే నా దృష్టిలో ఒక పొలానికి యజమాని మాత్రమే కాదు... మన ఇంటి వ్యక్తి. మనకు అన్నం పెట్టే అన్నదాత. రైతుకు మంచి జరిగితే లోకానికి మంచి జరిగనట్లే. నా ఉద్యోగం ద్వారా రైతులకు ఏదో రకంగా మేలు చేసే సలహాలు, సూచనలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. – శ్రీలత – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట– మాలోతు శ్రీనివాస్, సాక్షి, అక్కన్నపేట -
ప్రపంచ సేంద్రియ సాగు పైపైకి!
రసాయన అవశేషాల్లేని సేంద్రియ ఆహారోత్పత్తుల సాగు, వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా ఏటేటా విస్తరిస్తోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 188 దేశాల్లో 9.89 కోట్ల హెక్టార్లకు సేంద్రియ సాగు విస్తరించింది. 2022తో పోల్చితే 2023లో సేంద్రియ / ప్రకృతి సాగు విస్తీర్ణం 2.6 శాతం (25 లక్షల హెక్టార్లు) పెరిగింది. జర్మనీలోని నరెంబర్గ్లో జరుగుతున్న అంతర్జాతీయ సేంద్రియ ఆహారోత్పత్తుల వాణిజ్య ప్రదర్శనలో మంగళవారం విడుదలైన ‘ద వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2025’ వార్షిక సర్వే నివేదిక ఈ తాజా గణాంకాలను వెలువరించింది. స్విట్జర్లాండ్ సేంద్రియ పరిశోధనా సంస్థ (ఎఫ్ఐబీఎల్), ఐఫోమ్–ఆర్గానిక్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ సర్వే నివేదికను వెలువరించాయి. – సాక్షి సాగుబడి, హైదరాబాద్అత్యధిక రైతులు మన వాళ్లే..ప్రపంచవ్యాప్తంగా 43 లక్షల మంది రైతులు సేంద్రియ సాగు చేస్తుండగా, 24 లక్షల మంది సర్టిఫైడ్ సేంద్రియ రైతులు మన దేశంలోనే ఉన్నారు. ఉగాండా (4.04 లక్షలు), ఇథియోపియా (1.21 లక్షలు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా, విస్తీర్ణం పరంగా చూస్తే 5.3 కోట్ల హెక్టార్లలో సర్టిఫైడ్ సేంద్రియ సేద్యంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. 4.5 లక్షల హెక్టార్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం సాగు భూమిలోని 2.1 శాతంలో సర్టిఫైడ్ సేంద్రియ సేద్యం జరుగుతోంది.వినియోగంలో ఫస్ట్ అమెరికా2023లో ప్రపంచ సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారం 136 బిలియన్ యూరోల (రూ.12,17,920 కోట్ల)కు పెరిగింది. 59 బిలియన్ యూరోల వాటాతో అమెరికా అతిపెద్ద సేంద్రియ మార్కెట్‌గా నిలిచింది. జర్మనీ, చైనా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సేంద్రియ ఆహారం కొనుగోలుపై స్విట్జర్లాండ్ వాసులు అత్యధికంగా డబ్బు వెచ్చిస్తున్నారని ఈ సర్వే తెలిపింది. అనేక ఏళ్లుగా ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ స్థిరంగా పెరుగుతుండటం విశేషం. మున్ముందు కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రైతుగా మారాడు..! కట్‌చేస్తే..
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు అతడిని నగర జీవితం నుంచి గ్రామం బాట పట్టేలా చేశాయి. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ బతకాలనుకున్నాడు. చివరికి అదే అతడికి కనివిని ఎరుగని రీతిలో లక్షలు ఆర్జించేలా చేసి..మంచి జీవనాధారంగా మారింది. ఒకరకంగా ఆ ఆరోగ్య సమస్యలే ఆర్థిక పరంగా స్ట్రాంగ్‌గా ఉండేలా చేయడమే గాక మంచి ఆరోగ్యంతో జీవించేందుకు దోహదపడ్డాయి. ఇంతకీ అతడెవరంటే..అతడే హర్యానాకి చెందిన జితేందర్ మాన్(Jitender Mann). ఆయన చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో 20 ఏళ్లు టీసీఎస్ ఉద్యోగిగా పనిచేశారు. అయితే ఆ నగరాల్లో కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో నలభైకే రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి రోగాల బారినపడ్డారు. జస్ట్ 40 ఏళ్లకే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రాను రాను ఎలా ఉంటుందన్న భయం ఆయన్ని నగర జీవితం నుంచి దూరంగా వచ్చేయాలనే నిర్ణయానికి పురిగొలిపింది. అలా ఆయన హర్యానాలోని సొంత గ్రామానికి వచ్చేశారు. అక్కడే తన భార్య సరళతో కలిసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా రెండు ఎకరాల్లో సేంద్రియ మోరింగ ఫామ్(organic moringa farm)ని ప్రారంభించారు. అలాగే ఆకుల్లో పోషకవిలువలు ఉన్నాయని నిర్థారించుకునేలా సాంకేతికత(technology)ని కూడా సమకూర్చుకున్నారు. అలా అధిక నాణ్యత కలిగిన మోరింగ పౌడర్ని ఉత్పత్తి చేయగలిగారు ఈ జంట(Couple). వారి ఉత్పత్తులకు త్వరితగతిన ప్రజాదరణ పొంది..ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు,ముంబై వంటి నగరాలకు వ్యాపించింది. ఈ పౌడర్‌కి ఉన్న డిమాండ్ కారణంగా నెలకు రూ. 3.5 లక్షల ఆదాయం తెచ్చిపెట్టింది ఆ దంపతులకు. అలా ఇప్పుడు నాలుగు ఎకరాలకు వరకు దాన్ని విస్తరించారు. అత్యున్నత నాణ్యతను కాపాడుకోవడమే ధ్యేయంగా ఫోకస్ పెట్టారిద్దరు. అందుకోసం ఆకులను కాండాలతో సహా కోసి రెండుసార్లు కడిగి ఏడు నుంచి తొమ్మిది కాండాలను కలిపి కడతామని అన్నారు. తద్వారా ఆకుని సులభంగా ఎండబెట్టడం సాధ్యమవుతుందని జితేందర్ చెబుతున్నారు. ఆకులను పెద్ద ఫ్యాన్ల కింద నియంత్రిత గ్రీన్హౌస్ సెటప్‌లో ఎండబెట్టడం జరుగుతుంది. అందువల్ల 12 గంటలలోనే ఆకులను కాండాల నుంచి తీసివేసి ముతక పొడిగాచేసి జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు. అంతేగాదు ఈ దంపతులు తాము నేలను దున్నమని చెబుతున్నారు. తాము కలుపు మొక్కలు, ఇతర ఆకులనే రక్షణ కవచంగా చేసుకుంటారట. అలాగే హానికరమైన రసాయన ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులను ఉపయోగించమని చెబుతున్నారు. ఇలా జితేందర్ వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడంతోనే ఆయన లైఫ్ మారిపోయింది. ఇదివరకటిలా ఆరోగ్య సమస్యలు లేవు. మంచి ఆరోగ్యంతో ఉన్నాని ఆనందంగా చెబుతున్నాడు. అలాగే ప్యాకేజింగ్ కోసం పొడిని పంపే ముందే తాము కొన్ని జాడీలను తమ కోసం పక్కన పెట్టుకుంటామని చెప్పారు. ఈ మొరింగ పౌడర్ వినియోగం తమకు మందుల అవసరాన్ని భర్తీ చేసేస్తుందని అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ధీమాగా చెబుతున్నారు. అలాగే జితేంద్ర దంపతులు తాము గ్రామానికి వెళ్లాలనుకోవడం చాలామంచిదైందని అంటున్నారు. "ఎందుకంటే మేము ఇక్కడ కష్టపడి పనిచేయడం తోపాటు ఆరోగ్యంగా ఉంటున్నాం. పైగా కాలుష్యానికి దూరంగా మంచి జీవితాన్ని గడుపుతున్నాం అని సంతోషంగా చెబుతోంది ఈ జంట. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: లెడ్‌లైట్ థెరపీ: అన్ని రోగాలకు దివ్యౌషధం..!) -
గోకృపామృత సేద్యం, మెరుగైన ఫలితాలు
ఇరవై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతు కరుటూరి పాపారావు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ ఆయన స్వగ్రామం. 8 ఎకరాల్లో పదేళ్లుగా పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. అరెకరంలో వివిధ రకాల పసుపు, పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. 2012లో బాసరలో సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొని స్ఫూర్తి పొందిన పాపారావు 2015 నుంచి 8.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. పంట వ్యర్థాలను కాలబెట్టకుండా జనుము, జీలుగతో కలిపి కుళ్లబెట్టి భూమిని సారవంతం చేస్తున్నారు ΄ పాపారావు. తన వ్యవసాయ క్షేత్రంలో 5వేల లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేసి బెల్లం, మజ్జిగ, మదర్ కల్చర్ కలిపి గోకృపామృతం.. దేశీ ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి, పుట్టమట్టి కలిపి జీవామృతం తయారు చేస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి పైప్లైన్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. పురుగుల నియంత్రణ కోసం వేప కషాయం, పుల్లటి మజ్జిగ, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు.ఏడాది పాత బియ్యం..పంట నూర్పిడి అనంతరం నిల్వ, ప్రాసెసింగ్ అంతా సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ పోషక సంపన్న ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తుండటం రైతు పాపారావు మరో ప్రత్యేకత. వరి పొలం గట్ల మీద కందిని కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. కందులను ఇసుర్రాయితో ఆడించి సహజ విధానంలో పప్పుగా మార్చుతున్నారు. ధాన్యం దిగుబడి రసాయన సాగుతో పోలిస్తే సగమే వస్తోంది. కూలీల అవసరమూ ఎక్కువే. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి గన్నీ బ్యాగుల్లో నింపి ఏడాది పాటు నిల్వ చేస్తున్నారు. నిల్వ సమయంలో పురుగు పట్టకుండా ఉండేందుకు వావిలాకు, గానుగ ఆకు, సీతాఫలం ఆకు ధాన్యం బస్తాల వద్ద ఉంచుతున్నారు. ఏడాది దాటిన తరువాత ధాన్యాన్ని ముడి బియ్యం ఆడించి 10 కిలోల సంచుల ద్వారా ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతున్నారు.పచ్చి పసుపు ముక్కలు..పసుపు తవ్విన తరువాత ఉడకబెట్టి, పాలిష్ చేసి అమ్మటం సాధారణ పద్ధతి. అలాకాకుండా, పచ్చిగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి, నీడలో ఎండబెట్టి పసుపు పొడిని తయారు చేయిస్తున్నారు. ఉడకబెడితే పోషకాలు తగిపోతాయని ఇలా చేస్తున్నానని అంటున్నారు పాపారావు. నల్ల పసుపు, సేలం, కృష్ణ సేలం రకాల పసుపును సాగు చేస్తున్నారు. మునగాకును నీడలో ఆరబెట్టి ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఆయన 50 రకాలకు పైగా కూరగాయలు, సుగంధ, ఔషధ, పండ్ల రకాలను సేంద్రియ పద్ధతిలో పండిస్తు న్నారు. తాను పండించే పంటలతో పాటు పప్పులు, బెల్లం, పల్లీలు ఇతర జిల్లాలు, రాష్ట్రాల సేంద్రియ రైతుల నుంచి సేకరించి వాట్సప్ ద్వారా విక్రయిస్తున్నారు. పలువురు ప్రకృతి వ్యవసాయదారులను కలుపుకొని వాట్సప్‌లో‘నేచురల్ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్స్ గ్రూపు’ ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయక ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పాపారావును ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు పురస్కారంతో అనేక ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. ప్రకృతి సాగుకు మరింత తోడ్పాటునివ్వాలి అన్ని రకాల పంటలను రైతు పండించి, సంప్రదాయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి వినియోగదారుడికి నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో నా వంతు కృషి చేస్తున్నాను. రైతులు అన్ని రకాల పంటలు పండించాలి. అన్ని పనులూ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవాలి. ప్రతి రైతూ ఈ లక్ష్యంతోనే ముందుకెళ్లాలి. ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం మరింత తోడ్పాటు ఇవ్వాలి. – కరుటూరి పాపారావు (96188 11894), జైతాపూర్, ఎడపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా -
నిత్య ఆదాయం..పచ్చ తోరణం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నిత్య కల్యాణం.. పచ్చతోరణం అనే నానుడిని అక్కడి రైతులు ‘నిత్య ఆదాయం.. పచ్చతోరణం’గా మార్చేసుకున్నారు. 300 ఏళ్లుగా వారసత్వ సాగునే కొనసాగిస్తూ అలనాటి వ్యవసాయ పద్ధతులను నేటికీ ఆచరిస్తున్నారు. సేంద్రియ విధానంలో ఆకు కూరల్ని పండిస్తున్నారు. తమ గ్రామం నుంచే ఆకు కూరల సాగు తెలుగు రాష్ట్రాలకు విస్తరించిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎనీ్టఆర్ జిల్లా నందిగామ మండలంలోని కంచల గ్రామంలోకి అడుగు పెడితే... మునేరు ఒడ్డున.. పోషకాల వడ్డన మునేరుకు ఒడ్డున గల కంచల గ్రామంలో ఇసుకతో కూడిన తువ్వ (మెతక) నేలలు ఉండటంతో ఆ గ్రామ రైతులు ఆకు కూరల సాగుకు అనువుగా మలచుకున్నారు. ఈ నేలలో పండించిన ఆకు కూరలు రుచికి పెట్టింది పేరుగా మారాయి. పోషకాల పుట్టినిల్లుగా రెండు తెలుగు రాష్ట్రాలకు పోషక విలువలతో కూడిన ఆకు కూరలను నిత్యం ఇక్కడి రైతులు సరఫరా చేస్తున్నారు. తమ తాత ముత్తాతలు ఏ విధానంలో ఆకు కూరల్ని పండించారో నేటికీ అదే పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. పశువుల పేడ, వానపాముల ఎరువు వినియోగించడం వల్ల మంచి నాణ్యతతో కూడిన ఆకు కూరలు ఉత్పత్తి చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. మార్కెట్లో కంచల ఆకు కూరలకు డిమాండ్ ఉంది. తాము పండించిన ఆకు కూరలను రైతులే నేరుగా విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, కోదాడ, హైదరాబాద్ వరకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఏడాది మొత్తం రోజూ ఆదాయం వచ్చే ఆకు కూరలకు కాలంతో సంబంధం లేకుండా పండిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండటంతో తమ పూర్వీకులు ఆకు కూరల సాగును ఎంచుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఎకరాకు రూ.30 వేల కౌలు రెండు వేలకు పైగా జనాభా ఉన్న కంచల గ్రామంలో కులం, మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆకు కూరలను కలిసిమెలిసి సాగు చేస్తున్నారు. వీరికి చెరువుల కింద సాగు భూమి ఉన్నప్పటికీ ఆ భూమిలో తినడానికి వరి పండిస్తూ.. మెట్ట భూములను కౌలుకు తీసుకుని మరీ ఆకు కూరలను సాగు చేస్తున్నట్టు చెప్పారు. ఏడాదికి కౌలు రూపంలో ఎకరానికి రూ.30 వేల వరకు చెల్లిస్తున్నామన్నారు. కౌలు, పెట్టుబడి పోగా ఎకరానికి రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వార్షికాదాయం పొందుతున్నట్టు చెప్పారు. గ్రామంలో 1,000కి పైగా ఎకరాల్లో ఆకు కూరలు పండిస్తున్నట్టు పేర్కొన్నారు. మునేరు పొంగితే నష్టమే..భారీ వర్షాలు కురిసినప్పుడు మునేరు పొంగి పంటలకు నష్టం వాటిల్లుతోంది. గతేడాది ఆగస్ట్‌లో వచ్చిన వరదలకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని రైతులు చెప్పారు. సొంత విత్తనాలతోనే.. కంచల రైతులు విత్తనాలను సొంతంగానే తయారు చేసుకుంటున్నారు. తోటకూర, బచ్చలికూర, పాలకూర, గోంగూర, పొన్నగంటికూర, మెంతికూర, చుక్కకూర, కొత్తిమీర, కరివేపాకు వంటి ఆకు కూరలను సాగు చేస్తూ వీటినుంచి వచ్చే విత్తనాలనే సేకరిస్తున్నారు. తమకు సరిపడా ఉంచుకుని ఇతర గ్రామాల రైతులకు విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. కంచల గ్రామ ఆకు కూరలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో మార్కెట్లో లభించే విత్తనాల కంటే ఇక్కడి విత్తనాలకు డిమాండ్ ఎక్కువ.సొంతంగా విత్తనాల తయారీ మేం పండిస్తున్న ఆకు కూరల విత్తనాలను మేమే తయారు చేసుకుంటాం.దీంతో మంచి దిగుబడులు సాధిస్తున్నాం. విత్తనాల ఖర్చూ తగ్గుతుంది. మేం పండించే ఆకు కూరలతో పాటు ఇక్కడి విత్తనాలకు కూడా మంచి డిమాండ్ ఉంది..– ఎం.భూలక్ష్మి, ఆకు కూరల రైతువరదలతో తీవ్ర నష్టం మా పెద్దోళ్ల కాలం నుంచి ఆకు కూరలనే పండిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. రూ.లక్షల్లో ఆదాయం రాకపోయినా రోజువారీ కూలీ రూ.500కి తగ్గకుండా ఆదాయం వస్తుంది. ఇటీవల మునేరు వరదతో తీవ్రంగా నష్టపోయాం. – చలమల సుబ్బారావు, ఆకు కూరల రైతు -
అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో అగాధాన్ని సృష్టించింది. మరెందరో జీవితాల్ని అతలాకుతలం చేసింది. అంతేకాదు కోవిడ్-19 సృష్టించిన విలయం కారణంగా ఆత్మీయులను కోల్పోయినవారిలో, ఉద్యోగాలను పోగొట్టుకున్నవారిలో జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని ఆవిష్కరించింది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వారిలో ఒకరు కావ్య ధోబ్లే. కోవిడ్ రోగుల మధ్య నెలల తరబడి పనిచేస్తూ, రోజుకు అనేక మరణాలను చూడటం, స్వయంగా కరోనా బాడిన నేపథ్యంలో జీవితంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. అదే ఆమె విజయానికి, సంతోషకరమైన జీవితానికి పునాది వేసింది. ఏంటి ఆ నిర్ణయం? కావ్య సాధించిన విజయం ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో.కావ్య ధోబ్లే-దత్ఖిలే ముంబైలో ఒక నర్సు. కావ్య ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనలో పెరిగింది. బహుశా ఆ కోరికే ఆమెన నర్సింగ్పైపు మళ్లించిందేమో.జనరల్ నర్సింగ్,మిడ్‌వైఫరీలో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత, ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్ (సియోన్ హాస్పిటల్)లో పనిచేయడం ప్రారంభించింది. తరువాత ను టాటా క్యాన్సర్ హాస్పిటల్లో రెండు సంవత్సరాలు పనిచేసింది. దీనితో పాటు, కావ్య 2017లో నర్సింగ్‌లో బి.ఎస్సీ పూర్తి చేసింది. ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక సంవత్సరం బోధించిన తర్వాత,ముంబైలోని సియోన్ ఆసుపత్రికి స్టాఫ్ నర్సుగా చేరింది. 2019 నుండి 2022 వరకు సియోన్ హాస్పిటల్లో ఆయన పనిచేసిన కాలంలోనే కరోనా మహమ్మారి విజృంభించింది.ఉద్యోగం మానేసి, సంచలన నిర్ణయం కావ్య కూడా కరోనా బారిన పడి దాదాపు మరణం అంచుల దాకా వెళ్లి వచ్చింది. ఎన్నో మరణాలను చూసింది. కానీ తన రోగనిరోధక శక్తి తనను కాపాడిందనే విషయాన్ని అర్థం చేసుకుంది. అలాగే వ్యవసాయం అంటే మక్కువ ఉన్న ఆమె మనం పండించే, రసాయనాలతో నిండిన ఆహారం వ్యాధులకు హేతువని తెలుసుకుంది. అందుకే సమస్య మూలాన్ని తొలగించాలని గట్టిగా నిర్ణయించుకుంది. అంతే నెలకు రూ. 75వేల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేసింది. ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించినా, ఆమె భర్త రాజేష్ దత్ఖిలే క్యావకు మద్దతు ఇచ్చాడు. 2022లో, ఆమె తన ఉద్యోగాన్ని వదిలి భర్త గ్రామానికి వెళ్లింది.నర్సింగ్ నుండి జీరో ఇన్వెస్ట్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకుఆహారానికి ఆధారం వ్యవసాయం. అందుకే ఎలాంటి రసాయనాలు వాడని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది కావ్య. పట్టుదలగా కృషి చేసింది. వర్మీ కంపోస్ట్ బిజినెస్‌తో లక్షలు సంపాదిస్తోంది. రాజేష్ కుటుంబానికి పూణేలోని జున్నార్‌లోని దత్ఖిలేవాడి గ్రామంలో ఒక ఎకరం భూమి ఉంది. ఇందులో 5 గుంతల (0.02 ఎకరాలు) వర్మీకంపోస్ట్ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని వదిలి, వర్మీకంపోస్ట్ వంటి సేంద్రీయ ఇన్పుట్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కావ్య స్థానిక రైతులతో మాట్లాడింది. ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై ఒక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి సంవత్సరంలో టర్నోవర్ రూ. 24 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 50 లక్షల టర్నోవర్ టార్గెట్ పెట్టుకుంది. కావ్య ప్రతి నెలా దాదాపు 20 టన్నుల రిచ్ వర్మీకంపోస్ట్‌ను తయారు చేస్తుంది. 50 శాతం లాభం మార్జిన్‌తో 50 కిలోల బ్యాగు ధర రూ. 500 లకు విక్రయిస్తుంది. ప్రస్తుతం 30 లక్షల వార్షిక టర్నోవర్‌తో విజయ వంతంగా దూసుకుపోతోంది. వోల్జా డేటా ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వర్మీకంపోస్ట్ ఎగుమతిదారు. ఆ తర్వాత టర్కీ, ఇండోనేషియా,వియత్నాం ఉన్నాయి. ఈ రంగంలో అవార్డును కూడా అందుకుంది. ప్రారంభంలో తప్పని సవాళ్లుసేంద్రీయ వ్యవసాయం, వర్మీ కంపోస్ట్ గురించి కావ్య రైతులతో మాట్టాడినప్పుడల్లా, ఆమెకు లభించే సమాధానం, 'మీరు దీన్ని చేసి మాకు చూపించండి' అని. దీంతో ఆగస్టు 2022లో, అతను ఒక రైతు నుంచి ఒక కిలో వానపాములతో జీరో పెట్టుబడితో వర్మీ కంపోస్ట్ తయారీనీ మొదలు పెట్టింది. ప్రారంభించాడు. అక్టోబర్ 2022 నాటికి, వర్మీకంపోస్ట్ సిద్ధమైంది. మార్చిలో, కావ్య కృషి కావ్య బ్రాండ్ కింద వర్మీకంపోస్ట్ వాణిజ్య అమ్మకాలను ప్రారంభించింది. దాని ఫలితాలను రైతులు స్వయంగా అనుభవించారు. వారి విజయాలను తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసేది. ఒక రైతు ఐదు టన్నుల వర్మీకంపోస్టును రూ. 50,000 (కిలోకు రూ. 10) కు కొనుగోలు చేశాడు. రెండు వేల మంది రైతులకు ఇవ్వడానికి ఒక ఫౌండేషన్ 2,000 కిలోల వానపాములను కొనుగోలు చేసింది. కావ్య కిలో రూ.400కి అమ్మింది. ప్రతి రెండు నెలలకు 200 కిలోల వానపాములు, 35వేల కిలోల వర్మీ కంపోస్టును విక్రయిస్తుంది. అంతేకాదు ఆమె శిక్షణ తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తున్నారు.తన చుట్టూ ఉన్నరైతుల్లో ఈ మార్పు తీసుకురాగలిగినందుకు చాలా సంతోషం అంటుంది కావ్య. వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు?వర్మీకంపోస్ట్కు అవసరమైన ప్రధానమైనవి ఆవు లేదా గొర్రెలు , మేక పెంట, చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, బయోగ్యాస్ ప్లాంట్ స్లర్రీ లాంటి సేంద్రియ వ్యర్థాల మిశ్రమానికి వానపాములు కలుపుతారు, అవి ఎరువుగా రూపాంతరం చెందుతాయి.కేవలం రూ.500 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. కంపోస్ట్‌ను ఎత్తైన పడకల మీద, డబ్బాలు, చెక్క డబ్బాలు, సిమెంటు ట్యాంకులు లేదా గుంటలు, వెదురు, ప్లాస్టిక్ కంటైనర్లు లేదా మట్టి కుండలలో కూడా తయారు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 జాతుల వానపాములు ఉన్నాయి. అయితే స్థానిక జాతులను ఉపయోగించడం అనువైనది ఎందుకంటే అవి తక్షణమే అందుబాటులో ఉంటాయి, పైగా స్థానిక వాతావరణానికి బాగా సరిపోతాయి. భారతదేశంలో, సాధారణంగా ఉపయోగించే వానపాము జాతులు పెరియోనిక్స్ ఎక్స్కవాటస్, ఐసెనియా ఫోటిడా , లాంపిటో మౌరిటీ లాంటివి ఉన్నాయి. View this post on Instagram A post shared by Kavya Dhoble - Datkhile (@kavya.dhoble) -
స్ఫూర్తిదాయక ‘సాగుబడి’
హరిత విప్లవం పుణ్యమాని ఆహారోత్పత్తిలో మనదేశం స్వయం సమృద్ధి సాధించింది. ఆహార ధాన్యాలు, కూరగాయాలు, పండ్లు అధికంగా పండించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన వ్యవసాయ రంగం ఎదిగింది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇంకోవైపు విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుచేసిన ఆహార ఉత్పత్తులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతున్నాయి. అధికోత్పత్తి ఆశతో మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఔషధాలు, మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయి. ప్రజలు, మూగజీవాల ఆరోగ్యాలకు హానికరంగా మారడంతో పాటు నేల సారాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయక ఉత్పాదకత, ఆహార భద్రత, పర్యావరణ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నింటికి విరుగుడుగా రసాయనేతర సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం మళ్లీ తెరమీదకు వచ్చింది.భూ సారానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిన రసాయనిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా.. అతి తక్కువ సాగు ఖర్చుతో ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయం పురుడు పోసుకుంది. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో దీని గురించి రైతులకు, ఔత్సాహికులకు తెలియకుండా పోయింది. సరిగ్గా అలాంటి సమయంలోనే సాక్షి దినపత్రిక ఈ గురుతర బాధ్యతను భుజాన వేసుకుంది. పునరుజ్జీవన వ్యవసాయ కథనాలకు ‘సాగుబడి’ పేరుతో ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించి ముందడుగు వేసింది. ప్రకృతి, సేంద్రియ రైతుల స్ఫూర్తిదాయక కథనాలతో పాటు రైతు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చింది. విత్తు దగ్గరి నుంచి విక్రయం వరకు.. అన్నదాతలకు ఉపయుక్తమైన సమాచారాన్ని ‘సాగుబడి’ సాధికారికంగా అందించింది. స్వల్ప వ్యవధిలోనే ‘సాగుబడి’ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు దిక్సూచిగా అత్యంత ఆదరణ చూరగొంది. ఇంటి పంటలు, సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు చేరువ చేసింది.చదవండి: తక్కువ ఖర్చుతో.. పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్‘సాగుబడి’లోని 2014-16 మధ్య కాలంలో ప్రచురితమైన ప్రకృతి వ్యవసాయ ప్రేరణాత్మక కథనాలను పుసక్తంగా ప్రచురించారు సీనియర్ జర్నలిస్ట్ పంతంగి రాంబాబు. ప్రకృతి, సేంద్రియ సాగుకు సంబంధించిన అన్ని అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రకృతి వ్యవసాయంలో లబ్దప్రతిష్టులైన వారు, రైతు శాస్త్రవేత్తల ఇంటర్వ్యూలతో పాటు రైతులకు అవసరమయ్యే సమాచారాన్నంతా అందించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రచురించిన ఈ పుస్తకాన్ని చూస్తేనే అర్థమవుతుంది రచయిత నిబద్దత. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వారితో పాటు సేంద్రియ సాగు గురించి తెలుసుకోవాలకునే వారికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. రచయిత చెప్పినట్టుగా ఈ పుస్తకం ప్రకృతి వ్యవసాయానికి పెద్దబాలశిక్ష వంటిదే.సాగుబడి (మొదటి భాగం)ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి కథనాలుపేజీలు: 320;వెల: 600 /- ; రచన, ప్రతులకు:పంతంగి రాంబాబు,8639738658👉ఆన్లైన్లో సాగుబడి పుస్తకం కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
సేద్యంలో మహిళా సైన్యం!
దేవతల స్వంత దేశంగా భావించే భూమిపై తమకంటూ సొంతమైన కుంచెడు భూమి లేని నిరుపేద మహిళలు వారు. కేరళ ప్రభుత్వం ఇచ్చిన చిన్న ఆసరాతో సాగునే నమ్ముకోని వేరే ఉపాధికి నోచుకోని ఆ మహిళలు చేయి.. చేయి కలిపారు. సాగుబాటలో వేల అడుగులు జతకూడాయి. మహిళల నుదుటి చెమట చుక్కలు చిందిన బీడు భూములు విరగపండాయి. పైరు పరవళ్లు తొక్కాయి. వ్యవసాయం లాభసాటి కాదనే మాటలు నీటిమీది రాతలుగా తేలాయి. కేరళలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ సేద్యం జరుగుతోంది. వ్యవసాయంలో మాదే పైచేయి సుమా అంటున్నారు కేరళ మహిళా రైతులు.భూమిలేని మహిళల ఆర్థిక స్వావలంభన కల్పించే దిశగా కేరళ ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న కార్యక్రమం కుడుంబశ్రీ. కేరళ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ 1998లో ఊపిరి΄ోసుకున్న ‘కుడుంబ శ్రీ’ కేరళ గడ్డపై మహిళా సంఘటిత శక్తికి ప్రతీకగా ఎదిగింది. ఆ రాష్ట్రం మొత్తం ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉపాధి. ముఖ్యంగా తమకంటూ సొంత వ్యవసాయ భూములు లేని కుటుంబాలే ఎక్కువ. స్థానిక సాగు భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించటం వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేది. వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎక్కువగా మహిళలే కావటంతో పనులు దొరక్క తీవ్ర ఒడిదుడుకులకు లోనవ్వాల్సివచ్చేది. రాష్ట్ర భూ సంస్కరణల చట్టం కౌలుపై నిషేధం విధించింది. అనధికారికంగా కౌలుకు ఇస్తే తమ భూమిపై అధికారం శాశ్వతంగా కోల్పోతామనే భయం యజమానుల్లో ఉండేది. కూలి పనులు మానుకొని సొంత వ్యవసాయం చేయాలనుకునేవారికి అది అందని ద్రాక్ష అయింది. సంఘటిత శక్తే తారక మంత్రం.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోను కేరళ ప్రభుత్వం వెనుకడుగేయలేదు. సామూహిక వ్యవసాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూమిలేని మహిళలకు ΄÷లం, పంటతో అనుబంధం కల్పించటమే లక్ష్య సాధనలో తొలి అడుగుగా కొంతమంది భూమిలేని మహిళలను కలిపి 15–40 మంది మహిళలను కలిపి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, వ్యక్తిగత వ్యవసాయ భూములను గుర్తించి సంఘాలకు దఖలు పరిచారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు సాగులో సేంద్రియ పద్ధతులకు పెద్ద పీట వేశారు. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు మహిళా రైతుల కోసం ఏర్పాటు చేశారు. మంచి దిగుబడులను సాధించిన సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించేవారు. అన్ని జిల్లాల్లో 201 క్లస్టర్లలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ / ప్రకృతి సేద్యం జరుగుతోంది. నాబార్డు సహకారంతో కుడుంబశ్రీ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. రుణాలు తీసుకోవటం తిరిగి చెల్లించటంలో ఆయా సంఘాల్లోని మహిళా సభ్యులందరిది ఉమ్మడి బాధ్యత. ఒక్క తిరువనంతపురం జిల్లాలోనే ఆరువేల గ్రూపులు ఏర్పాటయ్యాయి. వీటిలో సుమారు 30 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఆదునిక పద్ధతుల్లో అరటి సాగుపై కేర ళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన శిక్షణతో తక్కువ కాలంలోనే రెండింతల దిగుబడులు సాధించారు. వనితా కర్మసేన పేరుతో కుడుంబశ్రీ కోసం వ్యవసాయ పరికాలను, యంత్రాలను ఉపయోగించటంలో మహిళలకు శిక్షణ ఇచ్చారు. కొనుగోలుకు రుణాలు ఇచ్చారు. ప్రతి సంఘానికి తమ సొంత పరికరాలు ఉన్నాయి. దీంతో వారే శ్రామికులుగా మారటంతో ఖర్చును ఆదా చేయగలిగారు. పంటను నష్ట΄ోయిన సందార్భాల్లో నాబార్డ్ మహిళా రైతులకు అండగా నిలిచింది. 47 వేల పై చిలుకు సంఘాలు, లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నాయి. జీడిమామిడి, కొబ్బరి, వరి, అరటి, పైనాపిల్ పండ్లతోటలు, ఆకుకూరలు, గుమ్మడి, బఠాణీ, సొర, అల్లం, బెండ, మిరప, వంటి పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. తాము పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విక్రయించటంతో మంచి లాభాలు కళ్లజూశారు. ఆరు నెలలు తిరగకుండానే రుణాలు తిరిగి చెల్లించారు. ఒక్కో సీజన్లోనే ఈ సంఘాలు రూ. లక్ష వరకు నికరాదాయం ఆర్జించేవి. దీంతో తమకంటూ సొంత ఇళ్లను నిర్మించుకున్నారు. చిన్న వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకులు గతంలో మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవి కాదు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. 10543 స్వయం సహాయక సంఘాలకు రూ. 123 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకుల దృష్టిలో మహిళారైతులు అంటే మంచి పరపతిగల మహిళలు. (చదవండి: కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..) -
సేంద్రియ రైతులకు ఆహ్వానం
సాక్షి, సిద్దిపేట/రంగారెడ్డి జిల్లా/నందిగామ: భారతదేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగానిది కీలకపాత్ర అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. రైతుల ఆర్థిక ప్రగతే దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా పనిచేస్తుందని చెప్పారు. మెదక్ జిల్లాలోని తునికి గ్రామంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో బుధవారం నిర్వహించిన సేంద్రియ రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. మెదక్ జిల్లాలో 655 మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలో చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. తునికి గ్రామం తనకు మార్గదర్శకమని చెప్పారు. తునికి సేంద్రియ సాగు రైతులంతా మూడు రోజులపాటు ఢిల్లీలోని తన గృహానికి అతిథులుగా రావాలని ఆహ్వానించారు. స్థానిక మార్కెటింగ్ పెంచాలి 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి కిసాన్ దివస్‌ను ప్రారంభించగా.. త్వరలో అత్యంత వైభవంగా రజతోత్సవం నిర్వహించుకోబోతున్నామని ఉపరాష్ట్రపతి చెప్పారు. ఇందులో దేశంలోని 730పైచిలుకు కేవీకేలు, 150 ఐకార్ సంస్థలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పండించిన పండ్లు, కూరగాయలను అక్కడే విక్రయిస్తే.. ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రతీ భారతీయుడు జాతీయవాదంపై విశ్వాసంతో ఉండాలని పిలుపునిచ్చారు. సేంద్రియ సాగు పెరగటం శుభ పరిణామం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సేంద్రియ వ్యవసాయ సమ్మేళనంలో 500 కుటుంబాలు పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రైతులు సేంద్రియ సాగు దిశగా అడుగులు వేస్తూ.. రసాయనిక సాగును క్రమంగా తగ్గిస్తుండటం శుభ పరిణామం అని సంతోషం వ్యక్తంచేశారు. కేవీకేలో 43,337 మంది పురుషులు, 16,937 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉండటం గొప్ప విజయమన్నారు. ఈ కార్యక్రమంలో సేంద్రియ రైతులు నరేందర్ రెడ్డి, ధనలక్ష్మిని ఉపరాష్ట్రపతి ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సతీమణి సుదేష్ ధన్‌ఖడ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్‌రావు, ఆర్ఎస్ఎస్ కార్యదర్శి భాగయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి దంపతులకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీలు డాక్టర్ కె.లక్ష్మణ్, వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి, డీజీపీ జితేందర్, తదితరులు ఘన స్వాగతం పలికారు. కన్హా శాంతివనంలో ధ్యానం.. రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనం దేశంలో అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుందని జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. బుధవారం ఉపరాష్ట్రపతి దంపతులు కన్హా శాంతివనాన్ని సందర్శించారు. హార్ట్ఫుల్నెస్, శ్రీరామచంద్ర మిషన్ గురూజీ కమ్లేష్ పటేల్ (దా జీ)తో కలిసి వారు ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. కమ్లేష్ పటేల్ వలన ప్రతి ఒక్క రూ ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ధన్‌ఖడ్ దంపతులు రాత్రి కాన్హాలోనే బసచేశారు. గురువారం ఉదయం ధ్యానం చేసిన అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు. -
19 ఏళ్ల ఐటీ ఉద్యోగానికి బై చెప్పి, ప్రకృతి సేద్యంతో లాభాలు
దేశ విదేశాల్లో అధికాదాయాన్నిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంతకంతకూ పెరిగే పని ఒత్తిడి, తీవ్ర అసంతృప్తి నుంచి బయటపడటానికి ప్రకృతితో తిరిగి మమేకం కావటం ఒక్కటే మార్గమని మునిపల్లె హరినాద్(52) భావించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి కుమారుడు హరినాద్. 1994లో బీటెక్ పూర్తి చేసి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆస్ట్రేలియా, అమెరికా, యూకేలలో పనిచేశారు. నెలకు రూ. 1.5 లక్షల జీతంతో మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ 2013లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎడతెగని పని వత్తిడితో నలుగుతూ కుటుంబానికి సమయం ఇవ్వలేని స్థితిలో ఎంత చేసినా సంతృప్తినివ్వని ఉద్యోగాన్ని కొనసాగించటం కన్నా.. సొంతూళ్లో కుటుంబ సభ్యులతో కలసి ప్రశాంతంగా జీవిస్తూ వారసత్వ భూమిలో సాధారణ రైతుగా కొత్త జీవితాన్ని ప్రారంభించటంలో నిజమైన ఆనందం ఉందని ఆయన భావించారు. ముందు నుంచే అధ్యయనంవిదేశాల్లో ఉన్న సమయంలో అక్కడి సూపర్ మార్కెట్లలో లభించే ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆకర్షితులయ్యారు. ఖర్చు ఎక్కువైనా కల్తీలేని ఆహార పదార్ధాలను తాను కూడా ఎందుకు పండించేలేననే పట్టుదలతో ఇంటర్నెట్లో ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనే అంశాలపై మూడేళ్లపాటు అధ్యయనం చేశారు. రసాయనిక అవశేషాల్లేని, పోషకాల సమతుల్యతతో కూడిన ఆరోగ్యాదాయకమైన ఆహారాన్ని పండించటమే ముఖ్యమైన పనిగా తలచి ఉద్యోగానికి 2013లో రాజీనామా ఇచ్చారు. ఆ కొత్తలోనే మధురైలో జరిగిన పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో హరినాధ్ పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ఇతర రైతులతో పరిచయాలు పెంచుకొని వారి క్షేత్రాలను సందర్శించి, వ్యవసాయం చేస్తూ నేర్చుకున్నారు. వారసత్వంగా సంక్రమించిన 2.5 ఎకరాల మాగాణి, అర ఎకరం మెట్టలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. (చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!)దిబ్బపై ఉద్యాన పంటలుమాగాణిలో సార్వాలో వరి, దాళ్వాలో మినుములు, పెసలు, నువ్వులు తదితర పంటలను హరినా«ద్ సాగు చేస్తున్నారు. మాగాణి పక్కనే 3 అడుగుల ఎత్తు దిబ్బగా ఉన్న అరెకరంలో పండ్లు, దుంపలు తదితర పంటలు పండిస్తున్నారు. అరటి, జామ, బొ΄్పాయి, కొబ్బరి, మునగ, కంద, అల్లం, కంద, మద్ది, మామిడి, టేకు పెంచుతున్నారు. తమ ప్రాంతంలో ఖరీఫ్‌లో వరి కోతలు అయ్యాక, రబీలో మొక్కజొన్న పూర్తయ్యాక పంట వ్యర్థాలను ఉత్తరాదిలో మాదిరిగా తగుల బెడుతున్నారని హరినా«ద్ తెలిపారు. గత ఏడాది ఇతర ΄÷లాల నుంచి వ్యాపించిన మంటలకు తమ అరెకరంలోని ఉద్యాన పంటలు కాలిపోయాయన్నారు. గోదావరి ఇసుకలు, కట్టుయానం...ప్రకృతి సేద్యానికి అనువైన దేశీ వరి రకాల సాగుపై హరినాద్ దృష్టి కేంద్రీకరించారు. వ్యవసాయం చేసిన అనుభవం లేక΄ోయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఒక్కో పని నేర్చుకుంటూ నిలదొక్కుకున్నారు. కాశీవిశ్వనాద్ (130 రోజులు) అనే సన్న తెల్ల వరి రకాన్ని 8 ఏళ్ల పాటు వరుసగా సాగు చేశారు. బీపీటీ కన్నా సన్నని ఈ రకం ధాన్యాన్ని పూర్తిగా ప్రకృతి సేద్యంలో ఎకరానికి అత్యధికంగా 25 బస్తాల దిగుబడి పొందారు. ఈ ఏడాది నుంచి 1.25 ఎకరాల్లో గోదావరి ఇసుకలు (110 రోజులు) సాగు చేస్తున్నారు. ఇది తెల్ల, సన్న రకం. త్వరలో నూర్పిడి చేయనున్నారు. ఎకరానికి 20 బస్తాల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. మరో 1.25 ఎకరాల్లో కట్టుయానం (180 రోజులు) అనే రెడ్ రైస్‌ను సాగు చేస్తున్నారు. ఇది 15 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావచ్చని చెప్పారు.సంపూర్ణ సంతృప్తి, సంతోషం!ఉద్యోగ బాధ్యతల్లో అసంతృప్తి, పని ఒత్తిడితో ఏదో తెలియని వేదనకు గురయ్యాను. వారానికి 5 గంటలు నిద్రతో సరిపెట్టుకొని, పర్సనల్ పనులనూ మానుకొని, 3–4 నెలల ΄ాటు పనిచేసి ్ర΄ాజెక్టు పూర్తి చేసిన రోజులున్నాయి. డబ్బు వస్తుంది. కానీ, ఆ వత్తిడిమయ జీవితంలో సంతృప్తి, ఆనందం లేవు. గత 9 ఏళ్లుగా కుటుంబీకులతో ఉంటూ ప్రకృతి సేద్యం చేసే భాగ్యం కలిగింది. కుటుంబం అంతా మద్దతుగా నిలిచారు. రసాయనాల్లేకుండా వరి ధాన్యం తొలి ఏడాది 10 బస్తాల దిగుబడి తీయటం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు 25 బస్తాల దిగుబడినిచ్చే స్థాయికి ΄÷లం సారవంతమైంది. ఈ ఏడాది జీవామృతం కూడా ఇవ్వలేదు. పూర్తి ప్రకృతి వ్యవసాయం అంటే ఇదే. రైతుగా మారి 6 కుటుంబాలకు ఏడాది ΄÷డవునా ఆరోగ్యదాయకమైన ఆహారం అందిస్తున్నా. అనేక ఆరోగ్య సమస్యలు తగ్గాయని, షుగర్‌ను నియంత్రించటం సులువైందని వారు చెబుతుంటే సంతృప్తిగా ఉంది. సొంతూళ్లో ప్రకృతి సేద్యం సంపూర్ణంగా సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. – మునిపల్లె హరినాద్ (93805 16443). మునిపల్లె, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా ఈ ఏడాది జీవామృతమూ లేదు!పొలం దుక్కి చేయటం, రొటోవేటర్ వేయటం, దమ్ము చేయటం వంటి పనులను సొంత చిన్న ట్రాక్టర్‌తో స్వయంగా చేసుకోవటం నేర్చుకున్నారు హరినా«ద్. పచ్చిరొట్ట పంటలను కలియదున్నటం, జీవామృతం పిచికారీ, కాలువ నుంచి తోడుకునే నీటితో కలిపి ఆవు మూత్రం పారించటం చేస్తుంటారు. ఈ సంవత్సరం అవేవీ చెయ్యలేదన్నారు. అయినా, గోదావరి ఇసుకలు రకం ధాన్యం ఎకరానికి 20 బస్తాలకు తగ్గకుండా వస్తాయని సంతోషంగా తెలిపారు. నాట్లు, కలుపు తీత, కోతలు మనుషులతోనే చేయిస్తున్న హరినాద్కు ఎకరా వరి సాగుకు రూ. 35 వేల నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతోంది. అన్నీ అనుకూలిస్తే రసాయనిక రైతులకు 40–45 బస్తాలు, తనకు 25 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని, అయినా తనకు మంచి ఆదాయమే వస్తున్నదన్నారు. ఆ ప్రాంతంలో అందరూ కౌలు రైతులే. కోత కోసి ఆ రోజే అమ్మేస్తుంటారు. హరినా«ద్ నెలకోసారి ధాన్యం మర పట్టించి కనీసం 6 కుటుంబాలకు నెల నెలా పంపుతూ ఉంటారు. కిలో బియ్యం రూ. వందకు అమ్ముతున్నారు. తాను నిర్ణయించిన ధరకు నేరుగా వినియోగదారులకు అమ్మటం వల్ల తనకు ఇతర రైతుల కన్నా అధికాదాయమే వస్తోందని హరినా«ద్ తెలిపారు. నేలను బాగు చేసుకుంటూ ఇతరులకూ ఆరోగ్యదాయక ఆహారాన్ని అందిస్తున్నానన్న సంతృప్తితో చాలా ఆనందంగా ఉన్నానని ఆయన తెలిపారు. – సయ్యద్ యాసిన్, సాక్షి, పొన్నూరు, గుంటూరు జిల్లా -
ఎర్ర ఆకులతో అరటి చెట్టు.. ఎక్కడైనా చూశారా?
ఎర్ర అరటి పండు మనకు అక్కడక్కడా కనిపిస్తుంది. అయితే, ఎర్ర ఆకులతో కూడిన అరటి చెట్టు అరుదనే చెప్పాలి. దీని ఆకు మాదిరిగానే కాయ కూడా ఎర్రగానే ఉంటుంది. కర్ణాటకలోని సిర్సికి చెందిన రైతు ప్రసాద్ కృష్ణ హెగ్డే ఈ అరుదైన అరటి వంగడాన్ని సంరక్షిస్తున్నారు. దీనితో పాటు ఆయన మరో 80 అరటి రకాలను తన పొలంలో పెంచుతూ అరటి పంటల్లో వైవిధ్యాన్ని కాపాడుతున్నారు. ప్లాస్టిక్ బనానా అనే మరో రకం కూడా ఈయన దగ్గర ఉంది. దీని ఆకులను భోజనం చేయటానికి వాడతారట. మైసూరులో ఇటీవల 3 రోజుల పాటు సహజ సమృద్ధ, అక్షయకల్ప ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘అరటి పండుగ’ సందర్భంగా ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. 550 అరటి రకాలను సంరక్షిస్తున్న కేరళకు చెందిన వినోద్ నాయర్ 75 రకాల అరటి పండ్లను ఈ ఉత్సవంలో ప్రదర్శించటం మరో విశేషం. వినోద్ నాయర్‌తో పాటు 100 దేశీ అరటి రకాలను సంరక్షిస్తున్న తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్‌ను సైతం ఘనంగా సత్కరించారు.ఆహార నిపుణురాలు, రచయిత్రి రత్న రాజయ్య అరటి పండుగలో మాట్లాడుతూ ఏదో ఒకే రకం అరటిని సాగు చేయటం ప్రమాదకరమని, ఏదైనా మొండి తెగులు సోకిందంటే మొత్తం ఆ అరటి రకమే అంతరించిపోతుందన్నారు. భవిష్యత్తు తరాల కోసం అరటి రకాల్లో జీవవైవిధ్యాన్ని మన తరం పరిరక్షించుకోవాలని పలుపునిచ్చారు.ఎర్ర అరటి జగత్ప్రసిద్ధంసహజ సమృద్ధ ఎన్జీవో డైరెక్టర్ జి. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘అరటి బంగారంతో సమానం. అరటి ప్రపంచం పెద్దది. వందలాది వంగడాలున్నాయి. మానవ జీవితంలో పుట్టుక దగ్గరి నుంచి చావు వరకు అనేక సందర్భాల్లో, ఆచార వ్యవహారాల్లో అరటి పండు సాంస్కృతిక అవసరం ఉంటుంది. ప్రతి రకం రుచి, రంగు, సైజు, చెట్టు ఎత్తులో వైవిధ్యభరితంగా ఉంటాయ’న్నారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి అరటి రకాలున్నాయి. ఆఫ్రికన్ జంజిబార్ స్ప్రౌట్ లాంగ్ బనానా, ఇండోనేషియా జావా బ్లూ బనానా, హవాయికి చెందిన తెల్ల చారల అరటితో పాటు దక్షిణాసియాకు సంబంధించి ఎర్ర అరటి రకాలు జగత్ప్రసిద్ధి గాంచాయన్నారు.చదవండి: తాటి తేగలతోనూ వంటకాలు!అరటికి భారతదేశం పుట్టిల్లు. ఇక్కడ ఎన్నో వందల రకాల అరటి వంగడాలు కనిపిస్తాయి. భింకెల్ అనే రకం అరటి చెట్టు ఎత్తయిన దూలం మాదిరిగా ఉంటుంది. కేరళకు చెందిన పొడవాటి రకం అరటి గెలకు వెయ్యి కాయలుంటాయి. ప్రపంచంలోకెల్లా ఇదే అతి పొడవైన అరటి రకం. కొడిగుడ్డు అంత చిన్న అరటి కాయ రకం కూడా ఉంది అన్నారు కృష్ణప్రసాద్. కర్ణాటకకు ప్రత్యేకమైన అరటి రకాలు ఉన్నాయన్నారు. వాణిజ్యపరంగా డిమాండ్ ఉన్న కావెండిష్ బ్రీడ్ల అరటి పంటలను సాగు చేయటం ప్రారంభమైన తర్వాత దేశీ వంగడాలు మరుగున పడిపోయాయంటున్నారు కృష్ణప్రసాద్. ఒకే రకం అరటి సాగు చేస్తే పనామా కుళ్లు తెగులు సోకే ముప్పు ఉందని చెబుతూ, ఈ తెగులు సోకిందంటే పంటంతా తుడిచిపెట్టుకుపోవటం ఖాయమన్నారు.కార్డమమ్, నెండ్ర ఆర్గానిక్ సాగుకు అనుకూలంసేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన అరటి పండ్లకు ఈ రోజుల్లో అధిక డిమాండ్ ఉందన్నారు కృష్ణప్రసాద్. సేంద్రియంగా సాగు చేయటం వల్ల భూమి కరువు బారిన పడకుండా ఉంటుంది. రసాయనాలకు ఖర్చుపెట్టే డబ్బు ఆదా అవుతుంది అన్నారాయన. కార్డమమ్, నేండ్ర అరటి రకాలు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయటానికి అనువైనవే కాక, మార్కెట్ డిమాండ్ రీత్యా కూడా ఇవి మేలైనవని దేశీ విత్తన నిపుణుడు కూడా అయన కృష్ణప్రసాద్ వివరించారు. అరటి సాళ్ల మధ్యన ముల్లంగి, ఆకుకూరలు, గుమ్మడి, బీన్స్, పసుపు, చిలగడదుంప పంటలను సాగు చేసుకోవచ్చని కృష్ణప్రసాద్ వివరించారు. ఇతర వివరాలకు.. 94821 15495. -
మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది?
హరిత విప్లవానికి పట్టుగొమ్మ వంటి పంజాబ్ రాష్ట్రంలో రైతులు పునరలోచనలో పడ్డారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అత్యధిక మోతాదులో వాడుతూ ఏడు దశాబ్దాలుగా మార్కెట్ కోసం వరి, గోధుమ వంటి పంటలు పండిస్తూ వచ్చిన రైతులు.. ఆ ఆహారం తిని తమ కుటుంబ సభ్యులు వ్యాధిగ్రస్తులుగా మారుతుండటాన్ని గురించారు. తమ కుటుంబం కోసమైనా రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించుకోవటమే ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గమని పంజాబ్ రైతులు ఎట్టకేలకు గ్రహిస్తున్నారు.తేజ్‌పాల్ సింగ్ 30 ఎకరాల ఆసామి. పొలం అంతా (గత సెప్టెంబర్‌లో) పచ్చని వరి పంటతో నిండి ఉంది. పటియాలా జిల్లా కక్రాల గ్రామ పొలిమేరల్లోని తన వరి పొలానికి 4 టన్నుల యూరియా వేశానని, పురుగుల మందు ఒకసారి చల్లానని చెప్పారు. ఇది మార్కెట్లో అమ్మటం కోసం అతను పండిస్తున్నాడు. ఈ పంట అమ్మటం కోసం కాదుఈ ప్రధాన పొలానికి పక్కనే అతనిదే 4 ఎకరాల పొలం మరొకటి ఉంది. అందులో కొంత మేరకు వరి పంట, దాని పక్కనే కూరగాయల తోట కూడా ఉంది. ‘ఈ 4 ఎకరాల పంట అమ్మటం కోసం కాదు, మా కుటుంబం కోసమే పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నా. పచ్చిరొట్ట ఎరువు, వర్మీకంపోస్టు, జీవన ఎరువులు ఈ పొలంలో వాడుతున్నా. మా కుటుంబం తినగా మిగిలినవి ఏమైనా ఉంటే అమ్ముతా’ అన్నారు తేజ్‌పాల్ సింగ్.ఈ మార్పు ఎందుకొచ్చిందని అడిగితే.. మూడేళ్ల క్రితం తన భార్య అనారోగ్యం పాలైంది. టెస్ట్ చేయిస్తే యూరిక్ యాసిడ్ పెరిగిందన్నారు. ఆ రోజుల్లో మరో దగ్గరి బంధువుకు కేన్సర్ వచ్చింది. అప్పటి నుంచి మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది అని ఆలోచించటం మొదలు పెట్టాడు. తాను రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తుల్ని పరీక్ష చేయించాడు. యూరియా, పొటాష్, పురుగుమందుల అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఆ ఆహారంలో ఉన్నట్లు తేలింది.మా కోసం ఆర్గానిక్ పంటలు‘అప్పుడు నేను నిర్ణయించుకున్నా. మా కుటుంబం తినేదంతా సేంద్రియ పద్ధతుల్లోనే పండించుకోవాలని గట్టి నిర్ణయానికొచ్చా. అప్పటి నుంచి ఈ 4 ఎకరాల్లో మా కోసం ఆర్గానిక్ పంటలు పండించుకొని తింటున్నాం. నా భార్య దేహంలో యూరిక్ యాసిడ్ తగ్గింది. మేం తింటున్న సేంద్రియ ఆహారం రుచిగా, నాణ్యంగా ఉంది. ఈ ఆహారం అంతకు ముందు తిన్న దానికన్నా ఎంతో మేలైనదని మాకు అర్థమైంది’ అన్నారు తేజ్‌పాల్ సింగ్. ఇది ఆయన ఒక్కడి మాటే కాదు. తినే ఆహారంలో రసాయనాల అవశేషాల్లేకపోతే ఆరోగ్యం బాగుంటుందని గట్టిగా గుర్తించిన రైతులు చాలా మందే కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు.చదవండి: సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?కొద్ది నెలల క్రితం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం.. పంజాబ్‌లో 2023–24లో ఎకరానికి 103 కిలోల రసాయనిక ఎరువులు వాడారు. దేశవ్యాప్తంగా రైతులు వాడుతున్న 58 కిలోలతో పోల్చితే ఇది దాదాపుగా రెట్టింపు. 1980–2018 మధ్యలో పంజాబ్ రైతులు వాడిన ఎన్‌పికె ఎరువులు ఏకంగా 180% పెరిగిందట.దీనికి తగ్గట్టే జబ్బులూ పెరిగాయి. ఐసిఎంఆర్ సంస్థ నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం.. పంజాబ్‌లో 2021లో 39,521 మంది కేన్సర్ బారిన పడితే.. అది 2024 నాటికి 42,288కి పెరిగింది. పొలాల్లో రసాయనాల వాడకం పెరగటానికి, మనుషుల్లో జబ్బులు పెరగటానికి మధ్య సంబంధం స్పష్టంగానే కనిపిస్తోంది. ఇది పంజాబ్ రైతులు, వినియోగదారులూ గుర్తిస్తున్నారు. మన సంగతేంటి? -
ప్రకృతి చోద్యం!
ఎలాంటి రసాయనాలు వాడకుండా పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం. దీనివల్ల భూసారం పెరగడంతో పాటు రైతులకు పెట్టుబడి తగ్గుతుంది. అంతేకాకుండా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. అందువల్లే గత ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాయి. ఇందుకోసం వ్యవసాయశాఖలోనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాయి. కానీ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం లెక్కలు ఘనంగా కనిపిస్తున్నా... క్షేత్రాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయం జిల్లాలో రికార్డుల్లోనే సాగుతోంది. అధికారులు వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగుతోందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నామమాత్రానికే పరిమితమైంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విభాగం ఉన్నా... ఉత్తుత్తి హడవుడే తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రకృతి వ్యవసాయం కింద జిల్లాలో సాగుచేసిన ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు ఉన్నట్లుగా శాస్త్రీయంగా నిర్ధారణ కావడంతో ప్రకృతి సేద్యం...అంతా చోద్యంగా మారింది. లెక్కల్లో మాత్రం 34,024 ఎకరాల్లో... 2024–25 సంవత్సరంలో జిల్లాలోని 141 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 53,834 మంది రైతులతో 75,534 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. ప్రకృతి వ్యవసాయ విభాగం లెక్కల ప్రకారం ఇప్పటికే 32,607 మంది రైతులు 34,024 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ 32,707 మంది రైతుల్లో 5 శాతం మంది కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్లే జిల్లాలో వేలాది మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు చెబుతున్నప్పటికి.. సరి్టఫికేషన్ మాత్రం అతి కొద్ది మందికే వస్తోంది. అది కూడా స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకే దక్కుతోంది. సాగుకు సిబ్బంది వెనుకంజ ప్రకృతి వ్యవసాయ విభాగంలో 367 మంది పనిచేస్తున్నారు. వాస్తవానికి వీరంతా వారికున్న భూమిలో ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రధానంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరీ వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులకు అదర్శంగా నిలవాలి. కానీ వీరిలోనే 60 శాతం మంది ప్రకృతి వ్యవసాయాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. రైతులకు ఆదర్శంగా ఉండాల్సిన సిబ్బందే కాడికిందపడేస్తే ఇక రైతులు ఎందుకు పట్టించుకుంటారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కొందరు మాస్టర్ ట్రైనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. విచ్చలవిడిగా కెమికల్స్ వాడుతున్నా.. ప్రకృతి వ్యవసాయం అంటూ నమ్మిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చల విడిగా కెమికల్స్ వాడకం జిల్లాలో చాలా మంది పేరుకే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆచరణలో మాత్రం అంతా కెమికల్స్ వ్యవసాయమే. ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంటే రసాయన ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గాలి. కానీ వివిధ మండలాల్లో లెక్కకు మించి రసాయన ఎరువులు వినియోగిస్తుండటం గమనార్హం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.50 లక్షల టన్నుల వరకు రసాయన ఎరువుల వినియోగం ఉంది. జిల్లాల పునరి్వభజన తర్వాత కర్నూలు జిల్లాలో 1.50 లక్షల టన్నుల వరకు వినియోగమవుతోంది. 2024–25 ఖరీఫ్‌లో 1,27,567.657 టన్నుల రసాయన ఎరువులను వినియోగించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. సాగు విస్తీర్ణం పెంచుతాం జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపుతున్నారు. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి శిక్షణ ఇస్తున్నాం. జీవామృతం, కషాయాల తయారీపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసే సిబ్బంది కూడ ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది 54,834 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారిప్రకృతి వ్యవసాయం అంటే... ప్రకృతి వ్యవసాయం అంటే ఎలాంటి పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకుండా పంటలు పండించడం. పంటల సాగులో ద్రవ, ఘన జీవామృతాన్ని మాత్రమే వినియోగించడం. చీడపీడల నివారణకు కషాయాలు, బ్రహ్మస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం తదితర వాటిని వినియోగించడం. ఏ రకంగానూ ఇటు పురుగుమందులు, అటు రసాయన ఎరువులు వినియోగించకపోవడం. అలా..వరుసగా మూడేళ్లు సాగు చేస్తే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా పరిగణిస్తారు. కానీ అధిక దిగుబడుల కోసం చాలా మంది వి చ్చల విడిగా రసాయన మందులు వాడుతున్నారు. కల్లూరు మండలం లక్ష్మీపురం పంచాయతీలో 631 మంది మహిళలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ పంచాయతీలో ముగ్గురు మాత్రమే 100 శాతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందుకే సరి్టఫికేషన్ కూడా ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు చెబుతున్న లెక్కలన్నీ ఇలాగే ఉంటున్నాయి. పాలేకర్ స్ఫూర్తితో 150 మంది రైతులు.. ఎవరి ప్రమేయం లేకుండా స్వచ్ఛందగా జిల్లాలోని 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరు దాదాపు పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నారు. వీరు సుబాష్ పాలేకర్ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం విశేషం. ప్రకృతి వ్యవసాయ విభాగం చెబుతున్న వారిలో 5 శాతం కూడ ప్రకృతి వ్యవసాయం చేసే వారు లేరు. ఈ 150 మంది రైతుల ఉత్పత్తులతోనే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హడావుడి చేస్తున్నారు.34,024 ఎకరాలు అధికారుల లెక్కల ప్రకారం ప్రకృతి సాగు విస్తీర్ణం367 ప్రకృతి సాగు విభాగంలోని సిబ్బంది75,534 ఎకరాలు ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయం లక్ష్యం? ? ప్రస్తుతం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు -
చలికాలంలో పిండినల్లి, చీడపీడలు : ఇవి చల్లుకుంటే చాలు
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసు కోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.ఘా చ్ఛాదన: కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులుటమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నేమసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండి΄ోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామరపురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలురసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి.వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బు పొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ΄్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు.రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే?రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి. – డా. గడ్డం రాజశేఖర్ సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ -
దేశవాళీ సేద్యకారుడు
దాదాపు సగం జనాభాలో మధుమేహం కనిపిస్తే తెలిసొచ్చింది .. నేల నెరిగి సాగు చేయాలని! భూమాతను గౌరవిస్తే ఆరోగ్య సిరిని ఒంటికందిస్తుందని! కనుమరుగవుతున్న దేశవాళీ ధాన్యానికి మళ్లీ నారుపోయాలని! అందుకే ఇప్పుడు కర్షకలోకమంతా సేంద్రియ సాగు వైపు మళ్లింది! ఆ బాటలోనే.. ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం వాసి పొట్టిపోతుల పోతురాజు కూడా నడుస్తూ తోటి రైతులకు స్ఫూర్తి పంచుతున్నారు.పుడమితల్లి బాగుంటే ఆ తల్లిని నమ్ముకున్న జనం కూడా బాగుంటారు. భావితరాల ఆరోగ్యానికీ భరోసా ఉంటుంది. అదే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయానికి నాగలి పట్టింది ‘ఆర్గానిక్ ప్లానెట్’. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ మూవ్ టు నేచర్, నేచర్ ఫ్రెండ్లీ నినాదాలతో వేదభారత్ నేచురల్ ఫుడ్ ప్రోడక్ట్స్ పేరిట దేశవాళీ బియ్యాన్ని అందిస్తోంది. ‘భూమి మీది.. విత్తనం, మార్గదర్శనం మావి! పండించిన పంటకు మార్కెటింగ్ సహకారం కూడా మాదే’ అంటూ తెలుగు రాష్ట్రాల రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గేలా చేస్తోంది. అలా పోతురాజు కూడా సేంద్రియ సాగుకు ఆకర్షితుడయ్యారు. తొలుత ఎకరం విస్తీర్ణంలో నారు పోశారు. కలుపు తీయలేదు. ఎరువు వేయలేదు. నెల దాటినా పైరు పెద్దగా ఎదగలేదు. పది బస్తాల దిగుబడే వచ్చింది. ఇరుగు పొరుగు రైతులు నిరుత్సాహపరచారు. అయినా పోతురాజు దైర్యం వీడలేదు. రెండో ఏడాది విస్తీర్ణం పెంచారు. పట్టువదలకుండా ఆరేళ్లుగా ప్రకృతి వ్యవసాయం బాటలోనే సాగుతున్నారు. ఇప్పుడది పది ఎకరాలకు విస్తరించింది. ఆరోగ్యంతో పాటు, మధుమేహాన్ని క్రమంగా తగ్గించే గుణం కలిగిన నవారా, కాలాభట్టి, బహురూపి, మైసూరు మల్లిగ లాంటి దేశవాళీ రకాల వరిని మాత్రమే పండిస్తూ.. ఎకరాకు 25 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు. ఎకరాకు 80 వేల రూపాయల ఆదాయాన్ని అందుకుంటున్నారు. 210 రోజుల్లో పంటకు వచ్చే మాపిలై సాంబ రకాన్ని, కూరగాయలు, పండ్లు, ఆయిల్ పామ్‌ను పండించే ఆలోచనలో ఉన్నారు. సతీమణి నాగమణి సహకారంతో దేశవాళీ సేంద్రియ ధాన్యం సాగులో పోతురాజు చేస్తున్న కృషికి ప్రధాని కార్యాలయం నుంచీ ప్రశంసలు అందాయి. మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశమూ అతనికి వచ్చింది. ∙వై.మురళీకృష్ణ, రిపోర్టర్ , తాడేపల్లిగూడెం27 రకాలు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించేందుకు 27 రకాల విత్తనాలను వేదభారత్ సరఫరా చేస్తోంది. వాటిల్లో బహురూపి, చింతలూరి సన్నాలు, మైసూర్ మల్లిగ, నారాయణ కామిని, నవారా, బర్మాబ్లాక్, రక్తశాలి (ఎర్రబియ్యం), సిద్ధ సన్నాలు, రాజోలు సన్నాలు, కేతిరి మహరాజ్ , కుజు పటాలియా, దూదేశ్వర్ మొదలైన రకాలున్నాయి. -
సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు
ఈనెల22, 23 తేదీల్లో బయోడైనమిక్సేద్యంపై శిక్షణ దేశ విదేశాల్లో చిరకాలంగా కొందరు రైతులు అనుసరిస్తున్న సేంద్రియ సేద్య పద్థతుల్లో బయోడైనమిక్ సేద్యం ఒకటి. రైతులు స్వయంగా తయారు చేసుకునే ఆవు కొమ్ము ఎరువు తదితర సేంద్రియ ఎరువులను సూక్ష్మ పరిమాణంలో వేస్తూ చేసే రసాయన రహిత సేద్య పద్ధతి ఇది. టైమ్ టేబుల్ ప్రకారం ప్రతి వ్యవసాయ పనినీ నిర్దేశిత రోజుల్లో మాత్రమే చేయటం ఇందులో ప్రత్యేకత. బయోడైనమిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో బెంగళూరులోని బెంగళూరు ఇంటర్నేషనల్ సెంటర్లో రైతు శిక్షణా శిబిరం జరగనుంది. బయోడైనమిక్ సేద్యంలో అనుభవం కలిగిన రైతులు శిక్షణ ఇస్తారు. క్షేత్ర సందర్శన ఉంటుంది. ప్రవేశ రుసుము (శిక్షణ, భోజనం సహా): రూ. 1,500. వసతి ఎవరికి వారే చూసుకోవాలి. ఆసక్తి గల వారు ముందుగా గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇతర వివరాలకు.. 97386 76611 సంప్రదించవచ్చు. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ΄్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) దేశంలోనే పేరెన్నికగల వ్యవసాయ శిక్షణా సంస్థ. సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులు, ఎఫ్పిఓలు/ సహకార సంఘాల నిర్వాహకులు, రైతు శాస్త్రవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు లోతైన శాస్త్రీయ అవగాహన, ఆచరణాత్మక శిక్షణ కల్పించడానికి ఎన్‌ఐపిహెచ్‌ఎం 3 నెలల సర్టిఫికెట్ కోర్సు తెలుగు/హిందీ భాషల్లో నిర్వహించనుంది.నూటికి నూరు శాతం రసాయనాల్లేకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయదలచిన వారికి ఇది సదవకాశం. నవంబర్ 27 నుంచి వచ్చే మార్చి 5 వరకు ఈ కోర్సు ఉంటుంది. వివిధ కేంద్ర వ్యవసాయ సంస్థలతో కలసి ఎన్‌ఐపిహెచ్‌ఎం నిర్వహించే ఈ కోర్సులో 3 దశలుంటాయి. మొదట 21 రోజులు రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐపిహెచ్‌ఎం ఆవరణలో శాస్త్రీయ అంశాల బోధన. తర్వాత అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రాంతంలో 2 నెలలు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు. ఆ తర్వాత ఎన్‌ఐపిహెచ్‌ఎంలో 10 రోజుల తుది దశ శిక్షణ ఉంటాయి. ఇంటర్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ డిప్లొమా చేసిన 18 ఏళ్లు నిండిన అన్ని సామాజిక వర్గాల స్త్రీ పురుషులు అర్హులు. గ్రామీణ యువతకు ప్రాధాన్యం. కోర్సు ఫీజు: రూ. 7,500. శిక్షణా కాలంలో ఉచిత వసతి కల్పిస్తారు. భోజనానికి రోజుకు రూ.305 అభ్యర్థి చెల్లించాలి. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. దరఖాస్తులను నవంబర్ 22 లోగా పోస్టు/మెయిల్ ద్వారా పంపవచ్చు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్ డా.కె. దామోదరాచారి (95426 38020)ని సంప్రదించవచ్చు. -
Sagubadi: ‘ఐ గ్రో యువర్ ఫుడ్’.. ఉద్యమం!
అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ ఉద్యమ సంస్థల సమాఖ్య (ఐ.ఎఫ్.ఓ.ఎ.ఎం. –ఐఫోమ్) పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు ఈ నెల 10వ తేదీన ‘ఐ గ్రో యువర్ ఫుడ్’ పేరిట వినూత్న ప్రచారోద్యమాన్ని చేపట్టారు. ప్రజల కోసం రసాయనాల్లేకుండా ఆరోగ్యదాయకంగా చేపట్టిన సేంద్రియ వ్యవసాయం– మార్కెటింగ్ తీరుతెన్నులు.. సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి ప్రజలు చేయగల సహాయం ఏమిటి? వంటి అంశాలపై తమ అభి్రపాయాలతో కూడిన వీడియోలను సేంద్రియ రైతులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.ఐగ్రోయువర్ఫుడ్.. బయో పేరిట ఏర్పాటైన ప్రత్యేక వెబ్సైట్లో, ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్‌కు చెందిన వెబ్సైట్/ఎక్స్/యూట్యూబ్/ఇన్‌స్టా తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రపంచ దేశాల సేంద్రియ రైతుల షార్ట్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చూసిన ప్రజలు/వినియోగదారులు తమ అభి్రపాయాలను, సూచనలను పంచుకోవడానికి వీలుంది.ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ 1972లో ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. వంద దేశాల్లోని సుమారు 700 సేంద్రియ వ్యవసాయ సంస్థలకు ఇప్పుడు ఐఫోమ్ సభ్యత్వం ఉంది. ఆరోగ్యం, పర్యావరణం, న్యాయం, శ్రద్ధ అనే నాలుగు మూల సూత్రాలపై ఆధారపడి సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరింపజేయటమే ఐఫోమ్ తన లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రియ వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించటంతో పాటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజన్సీలకు అక్రెడిటేషన్ ఇస్తుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఆహారోత్పత్తి చేసి ప్రజలకు అందిస్తున్న రైతుల్లో 80% మంది చిన్న, సన్నకారు రైతులేనని ఐఫోమ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో 90% క్షేత్రాలు ఒంటరి రైతులు లేదా రైతు కుటుంబాలే నడుపుతున్నారు. సంస్థలు/కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ క్షేత్రాలు మిగతా పది శాతం మాత్రమే. https://igrowyourfood.bio/కేరళలో కౌలు సేద్యం చేస్తున్నా..!నా పేరు షమికా మోనే, మహారాష్ట్రలో పుట్టా. పరిశోధనలు వదలి పెట్టి సేంద్రియ రైతుగా మారా. కేరళలో భూమిని కౌలుకు తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. అనేక రకాల దేశీ వరితో పాటు కూరగాయలు పండిస్తున్నా. పంట విత్తిన దగ్గర నుంచి నూర్పిడి,ప్రాసెసింగ్ వంటి పనులు సాధ్యమైనంత వరకు నేనే చేసుకోవటం అద్భుతమైన అనుభవం. నేను పండించిన ఆహారోత్పత్తుల్ని తింటున్న స్నేహితులు, బంధువులు చాలా సంతోషంగా ఉన్నారు. సీజన్‌కు ముందే డబ్బు పెట్టుబడిగా ఇస్తారు. పంటలు పండించిన తర్వాత.. తమకు అవసరమైన ఆహారోత్పత్తుల్ని తీసుకుంటున్నారు. దేశీ వరి బియ్యం, అటుకులతో చేసిన స్థానిక సంప్రదాయ వంటకాలను పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ‘ఐగ్రోయువర్ఫుడ్’ ఉద్యమంలో భాగస్వామిని కావటం సంతోషంగా ఉంది.– షమిక మోనె, సేంద్రియ యువ మహిళా రైతు, కేరళ -
సేంద్రియ సాగు, ప్రాసెసింగ్‌పై 3 రోజుల శిక్షణ
ప్రకృతి/ సేంద్రియ సాగు విధానం, కషాయాలు, మిశ్రమాల తయారీతోపాటు పంట దిగుబడులకు విలువ జోడింపు ద్వారా అధికాదాయం పొందటం వంటి అంశాలపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నాబార్డు సహకారంతో రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. డ్రోన్ల వాడే పద్ధతులు, యంత్రపరికరాలతో సులువుగా వ్యవసాయ పనులు చేసుకోవటంపై కూడా శిక్షణ ఇస్తారు. ఏపీలోని 30 మంది రైతులకే ఈ అవకాశం. వసతి, భోజన సదుపాయం ఉంది. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనదలచిన రైతులు 97053 83666/ 90739 73999కు ఫోన్ చేసి తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. -
రసాయనిక ఆహారం వల్లే రోగాలు..!
సాక్షి, హైదరాబాద్: భూతాపాన్ని పెంపొందించటం ద్వారా రైతులను ఆత్మహత్యలకు గురిచేయటంతో పాటు వినియోగదారులను రోగగ్రస్తంగా మార్చుతున్న రసాయనిక వ్యవసాయాన్ని నిషేధించాలని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాశ్ పాలేకర్ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకుంటూ సంపూర్ణ ఆహార స్వావలంబన ద్వారా అన్ని విధాలా సమృద్ధిని సాధించటం సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిని అనుసరించటం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.ఫిలింనగర్ క్లబ్లో మంగళవారం సాయంత్రం పలువురు సినీ ప్రముఖులు, సామాజిక వేత్తలతో జరిగిన చర్చాగోష్టిలో డా. పాలేకర్ ప్రసంగించారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు కె.ఎస్. వరప్రసాద్‌రెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్, టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, నాఫ్స్క్వాబ్ మాజీ అధ్యక్షులు కొండ్రు రవీంద్రరావు, ఆధ్యాత్మికవేత్త సత్యవాణి, సినీ రచయిత భారవి, నాబార్్డ పూర్వ సీజీఎం మోహనయ్య, సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ తదితరులతో పాటు వందలాది మంది ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు పాల్గొన్నారు.డా. పాలేకర్ మాట్లాడుతూ, రసాయనిక వ్యవసాయం వల్ల బియ్యం, గోధుమలను మాత్రం ఉత్పత్తి చేసుకుంటున్నామని, వంటనూనెలు, పప్పుధాన్యాలను విదేశాల నుంచి లక్షల టన్నుల దిగుమతి చేసుకుంటున్నామని విమర్శించారు. రసాయనిక వ్యవసాయోత్పత్తులు దేశ ప్రజలను మధుమేహం, కేన్సర్ వంటి భయంకర జబ్బుల పాలు జేస్తున్న విషయాన్ని పాలకులు, సమాజం ఇప్పటికైనా గుర్తించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంలోనూ టన్నుల కొద్దీ పశువుల ఎరువులు వేయటం వల్ల రసాయనిక వ్యవసాయంలో మాదిరిగానే కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున వెలువడి భూతాపాన్ని పెంపొందిస్తున్నాయని ఆయన తెలిపారు.రసాయనిక వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవటం వల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యల పాలవుతున్నారని, రైతు కుటుంబాల్లోని యువత వ్యవసాయేతర రంగాల్లోకి వలస వెళ్లటం వల్ల భవిష్యత్తులో వ్యవసాయం చేసే రైతులు కరువయ్యే దుర్గతి నెలకొనబోతోందన్నారు.సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో నేలలో సూక్ష్మజీవులను పెంపొందించే జీవామృతం, ఘన జీవామృతం వంటి మైక్రోబియల్ కల్చర్‌ను కొద్ది మొత్తంలో వేస్తే సరిపోతుందని, టన్నుల కొద్దీ పశువుల ఎరువులు వేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాలను ఆకళింపు చేసుకొని 5 లేయర్ పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి తొలి ఏడాదిలోనే రూ. 1.5 లక్షల ఆదాయం వస్తుందని, ఆరేళ్ల నుంచి ఏటా ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం వస్తుందని.. రైతులు సాగు చేస్తున్న నమూనా క్షేత్రాలు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. భూములను పునరుజ్జీవింపజేసుకుంటూ భవిష్యత్తులో పెరిగే జనాభాకు ఆహార కొరత లేకుండా చూడాలంటే ప్రకృతి నియమాలను అనుసరిస్తూ ఎస్.పి.కె. వ్యవసాయ పద్ధతిని అనుసరించాలన్నారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇదొక ప్రజా ఉద్యమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని, తెలుగు రాష్టా్రల్లో ప్రతి గ్రామానికీ ఈ వ్యవసాయాన్ని తీసుకెళ్లడానికి అందరూ సహకరించాలని పాలేకర్ కోరారు.7 వేల మందితో మెగా శిక్షణా శిబిరం..2015 ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు రంగరెడ్డి జిల్లాలోని కన్హ శాంతివనంలో 7 నుంచి 10 వేల మంది రైతు కుటుంబీకులతో మెగా శిక్షణా శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు శిబిరం నిర్వాహకులు, సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ ప్రకటించారు. డా. పాలేకర్ ఈ 9 రోజుల శిబిరంలో రోజుకు పది గంటల పాటు శిక్షణ ఇస్తారన్నారు. 7 వేల మంది రైతులు, 3 వేల మంది రైతుల జీవిత భాగస్వాముల్ని సైతం ఈ శిబిరానికి ఆహ్వానిస్తున్నామన్నారు. తెలుగు రాషా్ట్రల్లో ప్రతి గ్రామానికీ సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నదే లక్ష్యమని విజయరామ్ వివరించారు.శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు కె.ఎస్. వరప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ పాలేకర్ వ్యవసాయ పద్ధతిపై రైతు శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పడానికి తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు. ఆధ్యాత్మికవేత్త సత్యవాణి మాట్లాడుతూ పాలేకర్ కారణజన్ములని, ఈ వ్యవసాయ పద్ధతిని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఇవి చదవండి: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు -
బయోచార్ కంపోస్టు.. నిజంగా బంగారమే!
– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే క్రమంలో ఇటీవల అందుబాటులోకి వస్తున్న ఒక పద్ధతి ‘బయోచార్’ వినియోగం. దీన్నే మామూలు మాటల్లో ‘కట్టె బొగ్గు’ అనొచ్చు. పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీన్ని తయారు చేసుకొని పొలాల్లో వేసుకోవచ్చు.– బయోచార్ ఎరువు కాదు.. పంటలకు వేసే రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ కనీసం 30–40% ఎక్కువ ఉపయోగపడేందుకు బయోచార్ ఉపయోగపడుతుంది అంటున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి.– మట్టిలో పేరుకుపోయిన రసాయనిక అవశేషాలను తొలగించడానికి, వరిసాగులో మిథేన్ వాయువు కాలుష్యాన్ని తగ్గించడానికి బయోచార్ తోడ్పడుతుంది.– ఒక్కసారి వేస్తే వందల ఏళ్లు నేలలో ఉండి మేలు చేస్తుంది.. సీజనల్ పంటలకైనా, పండ్ల తోటలకైనా బయోచార్ నిజంగా బంగారమే అంటున్న డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖి.బయోచార్.. ఈ పేరు చెప్పగానే ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి(55) పేరు చప్పున గుర్తొస్తుంది. 20 ఏళ్ల క్రితం నుంచి ‘బయోచార్’ అనే పేరును ఖరారు చేసి.. వ్యవసాయకంగా, పర్యావరణపరంగా దీని ప్రయోజనాల గురించి దేశ విదేశాల్లో విస్తృతంగా పరిశోధనలు, క్షేత్ర ప్రయోగాలు చేస్తూ ఇప్పటికి 5 పుస్తకాలను వెలువరించారు. వెబ్సైట్ ద్వారా ఈ ఓపెన్ సోర్స్ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసంగాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆయనతో ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..బయోచార్ (కట్టె బొగ్గు) అంటే..?వ్యవసాయ వర్గాల్లో ఈ మధ్య తరచూ వినవస్తున్న మాట బయోచార్. బయో అంటే జీవం.. చార్ (చార్కోల్) అంటే బొగ్గు. బయోచార్ అంటే ‘జీవం ఉన్న బొగ్గు’ అని చెపొ్పచ్చు. భూసారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్బనం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు. అంటే ఇది అస్థిర కర్బనం (ఒలేటైల్ కార్బన్). దీన్ని పెంపొందించుకోవటానికి ఫిక్స్డ్ కార్బన్ ఉపయోగపడుతుంది. అదే బయోచార్.బయోచార్ కోసం కట్టెలు కాలబెట్టడం వల్ల అడవులకు, పర్యావరణానికి ముప్పు లేదా?బొగ్గు నల్ల బంగారంతో సమానం. బంగారం అని ఎందుకు అన్నానంటే.. ప్రపంచంలో తయారు చేయలేనిది, డబ్బుతో కొనలేనిది మట్టి ఒక్కటే. హరిత విప్లవం పేరుతో మట్టిని మనం నాశనం/ విషతుల్యం/ నిర్జీవం చేసుకున్నాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బయోచార్. అడవులను నరికి బయోచార్ తయారు చేయమని మనం చెప్పటం లేదు. పత్తి కట్టె, కంది కట్టె, వరి పొట్టు వంటి పంట వ్యర్థాలను వట్టిగానే తగులబెట్టే బదులు వాటితో బయోచార్ తయారు చేసుకోవచ్చు. వూరికే పెరిగే సర్కారు తుమ్మ వంటి కంప చెట్ల కలపతో లేదా జీడి గింజల పైపెంకులతో కూడా బయోచార్ తయారు చేసుకోవచ్చు. వరి పొట్టును బాయిలర్లలో, హోటళ్ల పొయ్యిల్లో కాల్చిన తర్వాత మిగిలే వ్యర్థాలను కూడా బయోచార్గా వాడుకోవచ్చు.పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో, పెద్దగా పొగ రాకుండా, 450 నుంచి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్చితే (ఈ ప్రక్రియనే ‘పైరోలిసిస్’ అంటారు) తయారయ్యే నల్లని కట్టె బొగ్గే బయోచార్. ఆరుబయట కట్టెను తగుటబెడితే బూడిద మిగులుతుంది. ఈ పద్ధతిలో అయితే బూడిద తక్కువగా బయోచార్ ఎక్కువగా వస్తుంది. రైతు స్థాయిలో ఇనుప డ్రమ్ములో లేదా కందకం తవ్వి కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. బయోచార్ వందల ఏళ్ల ΄ాటు మట్టిలో ఉండి మేలుచేసే సూక్ష్మజీవరాశికి, పోషకాలకు, మొత్తంగా పర్యావరణానికి ఎంతగానో తోడ్పడుతుంది. సాగు నీటిలో విషాలను పరిహరిస్తుంది. దీనితో వ్యవసాయంలో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలతో పోల్చితే.. దీన్ని తయారు చేసేటప్పుడు వెలువడే కొద్ది΄ాటి పొగ వల్ల కలిగే నష్టం చాలా తక్కువ.‘బయోచార్ కంపోస్టు’ అంటే ఏమిటి?బయోచార్ అంటే.. పొడిగా ఉండే కట్టె బొగ్గు. దీన్ని నేరుగా పొలాల్లో వేయకూడదు. బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని వేయాలి. చిటికెడు బొగ్గులో లెక్కలేనన్ని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. నేరుగా వేస్తే మట్టిలోని పోషకాలను బొగ్గు పెద్దమొత్తంలో పీల్చుకుంటుంది. అందువల్ల వట్టి బయోచార్ను మాత్రమే వేస్తే పంటకు పోషకాలు పూర్తిగా అందవు. అందుకనే. వట్టి బయోచార్ను కాకుండా బయోచార్ కంపోస్టును తయారు చేసుకొని వేస్తే ఈ సమస్య ఉండదు.మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు లేదా బయోగ్యాస్ స్లర్రీ లేదా జీవామృతం లేదా పంచగవ్య వంటి.. ఏదైనా సేంద్రియ ఘన/ ద్రవరూప ఎరువులలో ఏదో ఒకదాన్ని బయోచార్ను సమ΄ాళ్లలో కలిపి కుప్ప వేసి, బెల్లం నీటిని చిలకరిస్తూ రోజూ కలియదిప్పుతూ ఉంటే 15 రోజుల్లో బయోచార్ కంపోస్టు సిద్ధం అవుతుంది. అప్పుడు దీన్ని పొలాల్లో వేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. మన పొలంలో మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవటం ముఖ్యం. బయోచార్ ఒకటి రెండు సీజన్లలో ఖర్చయిపోయే ఎరువు వంటిది కాదని రైతులు గుర్తుంచుకోవాలి. వంద నుంచి వెయ్యేళ్ల వరకు నేలలో స్థిరంగా ఉండి మేలు చేస్తుంది.రసాయనిక ఎరువులు వాడే రైతులకు కూడా బయోచార్ ఉపయోగపడుతుందా? బయోచార్ సేంద్రియ ఎరువులు లేదా రసాయనిక ఎరువులు వాడే రైతులు కూడా వాడుకోవచ్చు. కట్టెబొగ్గుతో యూరియా, ఫాస్పేటు వంటి వాటిని కలిపి వేసుకోవచ్చు. వట్టిగా యూరియా వేస్తే 20–30 శాతం కన్నా పంటకు ఉపయోగపడదు. అదేగనక బయాచార్తో యూరియా కలిపి వేస్తే 30–40% ఎక్కువగా పంటకు ఉపయోగపడుతుంది. బొగ్గులోని ఖాళీ గదులు ఉంటాయి కాబట్టి యూరియాను కూడా పట్టి ఉంచి, ఎక్కువ రోజుల ΄ాటు పంట మొక్కల వేర్లకు నెమ్మదిగా అందిస్తుంది.వరి సాగుకూ ఉపయోగమేనా?వరి పొలాల్లో నీటిని నిల్వగట్టే పద్ధతి వల్ల మిథేన్ వంటి హరిత గృహ వాయువులు గాలిలో కలుస్తూ వాతావరణాన్ని అమితంగా వేడెక్కిస్తున్నాయి. రసాయనిక ఎరువులు వాడే పొలాల వాయుకాలుష్యం మరింత ఎక్కువ. ఈ పొలాల్లో బయోచార్ వేస్తే.. నీటి అడుగున మట్టిలో ఆక్సిజన్‌ను లభ్యత పెరుగుతుంది. మిథేన్ తదితర హరిత గృహ వాయువులను బొగ్గు పీల్చుకుంటుంది. కాబట్టి, వాతావరణానికి జరిగే హాని తగ్గుతుంది. అందుకనే బయోచార్ వాడితే కార్బన్ క్రెడిట్స్ పేరిట డబ్బు ఇచ్చే పద్ధతులు కూడా సమీప భవిష్యత్తులోనే అమల్లోకి రానున్నాయి.బయోచార్‌పై మరింత సమాచారం కోసం చూడండి.. www.youtube.com/@biocharchannelhttps://biochared.comఏ పొలానికి ఎంత వెయ్యాలో తెలిసేదెలా?మీ భూమికి ఖచ్చితంగా ఎంత మొత్తంలో బయోచార్ కంపోస్టు వేస్తే సరిపోయేదీ ఒక టెస్ట్ ద్వారా మీరే స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ విషయం ఎవరినో అడిగితే తెలియదు. మీ పొలంలో ఎత్తయిన ప్రదేశంలో 5 చిన్న మడులు చేసుకొని, వాటిల్లో బయోచార్ కంపోస్టును వేర్వేరు మోతాదుల్లో వేసి.. ఆ 5 మడుల్లోనూ ఒకే రకం పంటను సాగు చేయండి. 3 నెలల్లో మీకు ఫలితం తెలిసిపోతుంది. 1 చదరపు మీటరు విస్తీర్ణం (ఈ విసీర్ణాన్ని మీరే నిర్ణయించుకోండి)లో పక్క పక్కనే 5 మడులు తయారు చేసుకోండి. అంటే.. మొత్తం 5 చ.మీ. స్థలం కేటాయించండి. ఒక్కో దాని మధ్య గట్టు మాత్రం ఎత్తుగా, బలంగా వేసుకోండి.1వ మడిలో బయోచార్ కంపోస్టు అసలు వెయ్యొద్దు. 2వ మడిలో బయోచార్ కంపోస్టు 0.5 కిలో, 3వ మడిలో 1 కిలో, 4వ మడిలో 2 కిలోలు, 5వ మడిలో 4 కిలోలు వెయ్యండి. ఈ 5 మడుల్లో 3 నెలల్లో చేతికొచ్చే ఒకే రకం పంట విత్తుకోండి లేదా కూరగాయ మొక్కలు నాటుకోండి.– బయోచార్ కంపోస్టుపై శిక్షణ ఇస్తున్న డా. సాయి భాస్కర్ రెడ్డిబయోచార్ కంపోస్టు విషయంలో వత్యాసాలు ΄ాటించి చూడటం కోసమే ఈ ప్రయోగాత్మక సాగు. ఇక మిగతా పనులన్నీ ఈ మడుల్లో ఒకేలా చేయండి. అంటే నీరు పెట్టటం, కలుపు తీయటం, పురుగుమందులు లేదా కషాయాలు పిచికారీ చేయటం అన్నీ ఒకేలా చెయ్యండి.ఆ పంటల్లో పెరిగే దశలో వచ్చే మార్పులన్నిటినీ గమనించి, రాసుకోండి. ప్రతి వారానికోసారి ఫొటోలు/వీడియో తీసి పెట్టుకోండి. కాండం ఎత్తు, లావు, పిలకలు/కొమ్మల సంఖ్య, పూత, దిగుబడి, గింజ/కాయల సైజు, ఆ మొక్కల వేర్ల పొడవు వంటి అన్ని విషయాలను నమోదు చేయండి. 3 నెలల తర్వాత ఆ పంట పూర్తయ్యే నాటికి బయోచార్ కంపోస్టు అసలు వేయని మడితో వేర్వేరు మోతాదుల్లో వేసిన మడుల్లో వచ్చిన దిగుబడులతో పోల్చిచూడండి. బయోచార్ కంపోస్టు ఏ మోతాదులో వేసిన మడిలో అధిక దిగుబడి వచ్చిందో గమనించండి. ఇదే మోతాదులో మీ పొలం అంతటికీ వేసుకోండి. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Sagubadi: విపత్తులకు తట్టుకునే ప్రకృతి సేద్యం.. గొప్పేంటి?
2023 డిసెంబర్ 4,5 తేదీల్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో పంటలను, ముఖ్యంగా వరి పంటను, నేలమట్టం చేసింది. అయితే, ఆ తీవ్రమైన గాలులు, వర్షాన్ని తట్టుకొని నిలబడే ఉన్నాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి పొలాలు. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి చేలు నేలకు వాలిపోయి, నీట మునిగి ఉంటే.. వీటి పక్కన పొలాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ వరి పంట మాత్రం చెక్కుచెదరకుండా దర్జాగా నిలబడి ఉండటం గురించి అప్పట్లోనే వార్తా కథనాలు చదివిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మిచాంగ్ తుపానే కాదు అంతకుముందు కూడా అనేక విపత్కర పరిస్థితుల్లోనూ ఇది స్పష్టంగా కళ్లకు కట్టిన వాస్తవం. అయితే, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైన ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు డాక్టర్ ఫిల్ లీ ఈ నెల మొదటి వారంలో ఏపీలో పర్యటించారు. అనంతపురం తదితర జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు తుపానును, కరువును దీటుగా తట్టుకొని నిలబడుతూ సుభిక్షంగా, ఉత్పాదకంగా నిలవటానికి వెనుక గల శాస్త్రీయ కారణాలను డా. ఫిల్ లీ అన్వేషించారు. అనేక కోస్తా జిల్లాల్లో మిచాంగ్ తుపానుకు నేలకొరిగిన రసాయనిక వరి పొలాల్లో గడ్డికి, పక్కనే పడిపోకుండా నిలబడిన వరి పొలాల్లో గడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసాలేమిటో తన వెంట తెచ్చిన అధునాతన మైక్రోస్కోప్ ద్వారా పరిశోధించారాయన. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వరి మొక్క కాండంలో కణ నిర్మాణం రసాయనిక వ్యవసాయంలో కన్నా బలంగా, ఈనెలు తేలి ఉండటాన్ని ఆయన గుర్తించారు. రసాయనాలతో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు నేలకొరిగింది (ఎడమ ఫైల్), ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు తట్టుకుంది (కుడి ఫైల్) "మిచాంగ్ తుపాను నాటి రసాయనిక, ప్రకృతి సేద్య వరి పంటలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డా. ఫిల్ లీ అధ్యయనం" "ప్రకృతి సేద్యంతో ఒనగూడుతున్న అద్భుత ఫలితాలను కళ్లకు కట్టిన అధ్యయన ఫలితాలు" "ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత పెరుగుతుంది. అందువల్లనే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఈ పంటలకు వస్తోందనడానికి ఇప్పుడు విస్పష్టమైన రుజువులు దొరికాయి". – డాక్టర్ ఫిల్ లీ, ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు, ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి మొక్కలు చాలా బలంగా ఉన్నాయి. ఇది ప్రకృతి సేద్య బలానికి నిదర్శనం’ అన్నారు డా. ఫిల్ లీ. అదేవిధంగా, ఏప్రిల్ మొదటి వారంలో అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన రసాయనిక, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగవుతున్న పంటలను పరిశీలించారు. ఆయా పొలాల్లో మట్టి నమూనాలను కూడా సేకరించి అధ్యయనం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి కాండం (మైక్రోస్కోప్ ఎడమ చిత్రం), రసాయనాలతో పండించిన వరి కాండం (కుడి చిత్రం) బంతి పూలను ఏకపంటగా సాగు చేస్తున్న రసాయనిక పొలంలోని మట్టిలో జీవం తక్కువగా ఉందని గుర్తించారు. ఆ పొలం పక్కనే బంతితో పాటు 12 పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలంలోని మట్టి నమూనాలను పరిశోధించగా.. మట్టి కణాల నిర్మాణం, ఆ మట్టిలో వైవిధ్యపూరితమైన సూక్ష్మజీవరాశి ఎంతో సుసంపన్నంగా ఉన్నట్లు గుర్తించానని డా. ఫిల్ లీ వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో పెరుగుతున్న జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత వల్లనే పంటలకు వైపరీత్యాలను తట్టుకునే శక్తి వస్తోందనడానికి విస్పష్టమైన రుజువులు దొరికాయని ఆయన తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వీడియోలు ‘ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిటీ నాచురల్ ఫార్మింగ్’ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలో 20,21 తేదీల్లో ఆర్గానిక్ మేళా.. తిరుపతి టౌన్ క్లబ్ కూడలిలోని మహతి ఆడిటోరియంలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఉ. 10.30 గం. నుంచి రాత్రి 8 గం. వరకు స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ 2 ఫార్మర్’ ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తులు ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. రైతులు నేరుగా తమ ఆర్గానిక్ పంట ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముకోగలిగే ఏర్పాటు చేయటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని కనెక్ట్ 2 ఫార్మర్ వ్యవస్థాపకులు శిల్ప తెలిపారు. 20న కషాయాల తయారీపై గంగిరెడ్డి, దేశవాళీ పండ్లు / పూల మొక్కల గ్రాఫ్టింగ్‌పై జె.ఎస్. రెడ్డి శిక్షణ ఇస్తారు. కంపోస్టింగ్‌పై డా.సింధు అవగాహన కల్పిస్తారు. 21న 5 దొంతర్ల పండ్లు, కూరగాయల సాగుపై, ఇంకుడుగుంతల నిర్మాణంపై విజయరామ్ ప్రసంగిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రకృతివనం ప్రసాద్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 63036 06326. ఇవి చదవండి: Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు! -
Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు!
భూతల్లి కన్న తల్లితో సమానమని భావించే ఈ రైతు దంపతులు తమ సొంత భూమిలో మనసుపెట్టి ఇష్టంగా వ్యవసాయం చేస్తూ ఏడాదికి మూడు పంటలు పండిస్తున్నారు. దీంతో వీరి పొలాలు ప్రదర్శన క్షేత్రాలుగా మారిపోయాయి. పశువులు, గొర్రెలు, కోళ్ల ఎరువులు, జీవామృతంతో పంటలు పండిస్తున్నారు. మంచి దిగుబడులతో పాటు చక్కని ఆదాయం పొందుతున్నారు. మిట్టపెల్లి రాజేష్ రెడ్డి, భారతి ఆదర్శ రైతు దంపతులు. చదివించి పదో తరగతే అయినా తమ 12 ఎకరాల భూమిలో మనసుపెట్టి సేంద్రియ వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇంటికి అవసరమైన అన్నింటినీ సేంద్రియంగా పండించుకొని తింటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వీరిది జగిత్యాల జిల్లాలో మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామం. 3 కి.మీ.ల పైపులైను.. ఆ రైతు దంపతులకు వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు పంచప్రాణాలు! వీరికి పన్నెండు ఎకరాల భూమి ఉంది. బావులే ఆధారం. 3 కి.మీ. దూరంలో వున్న ఎస్సారెస్పీ వరద కాల్వ నుంచి పైపులైన్లు వేసుకొని డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నప్పటికీ దిగుబడులు అంతంతే కాని, ఖర్చులు మాత్రం పెరిగాయి. ఇష్టారీతిన రసాయన ఎరువులు వేయడంతో ప్రతి పంటలో పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువై, వాటికి రసాయన మందులు పిచికారీ చేసేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కుటుంబ అదాయం పిల్లల చదువుకు కూడా సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో పాలేకర్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయవచ్చని తెలసుకొని సాగు పద్ధతిని మార్చుకున్నారు. ఈ దంపతులు ప్రతి ఏడాదీ మూడు పంటలు పండిస్తున్నారు. మేలో తప్ప మిగతా 11 నెలలూ వీరి పొలాల్లో పంటలతో ఉంటాయి. వర్షాలతో సంబంధం లేకుండా, వ్యవసాయ భావుల్లో ఉన్న కొద్దిపాటి నీటితోనే, జూన్ రెండో వారంలోనే విత్తనాలు వేస్తుంటారు. వానాకాలం సీజన్లో ఆరు ఎకరాల్లో సన్న రకం వరి, రెండెకరాల్లో పసుపు, మూడెకరాల్లో మొక్కజొన్న, ఒక ఎకరంలో మిర్చి పంట సాగు చేశారు. యాసంగి సీజన్లో ఆరెకరాల్లో లావు రకం వరి, ఎకరంలో జొన్న, 3 ఎకరాల్లో మొక్కజొన్న, రెండెకరాల్లో నువ్వు సాగు చేస్తున్నారు. ఖర్చు తగ్గించే సాగు పద్ధతులతో మేలు! మా భూమిలో రకరకాల పంటలు పండించి, ఆ పంటల్లో అధిక దిగుబడులు తీసినప్పుడు మాకు కష్టం గుర్తుకురాదు. ప్రధానంగా భూతల్లిని కాపాడేందుకు రసాయనాలను పూర్తిగా తగ్గించి, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువు వాడుతున్నాం. వ్యవసాయంతో చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతుంటే, మేం మాత్రం ఇష్టంగా చేస్తున్నాం.. సంతృప్తిని, ఆదాయాన్ని పొందుతున్నాం. ప్రతి రైతు ఖర్చు తగ్గించే పద్ధతులపై దృష్టి పెట్టాలి. మేం అలాగే చేస్తున్నాం. మా పద్ధతిలోకి రావాలని తోటి రైతులను ప్రోత్సహిస్తున్నాం. – మిట్టపెల్లి భారతి, రాజేష్ రెడ్డి (9618809924, 9618111367) వెద వరి.. 30 క్వింటాళ్ల దిగుబడి వరి సాగు చేయబోయే పొలంలో జూన్‌లో మొక్కజొన్న సాగు చేసి, కంకులు కోసిన తర్వాత మొక్కజొన్న మొక్కలను రోటోవేటర్‌తో పొలంలో కలియ దున్నేస్తారు. ఆ తర్వాత, వరి నారు పోసి, నాటు వేసే బదులు, నేరుగా వెదజల్లి ఎకరానికి 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. అలాగే, పసుపు, మొక్కజొన్న సాగు చేసే భూమిలో రెండు లారీల గొర్రెల ఎరువు, ఒక లారీ మాగిన కోళ్ల ఎరువు వేసి భూసారం పెంచుకుంటూ ఉంటారు. పంటకాలంలో ప్రతి పంటకు జీవామృతాన్ని మూడు సార్లు ఇస్తున్నారు. నాలుగు ఆవులు, మూడు గేదేలను పెంచుతున్నారు. సగటున ఎకరానికి సజ్జలు 12–15, పసుపు 30, మొక్కజొన్నలు 40–45, నువ్వులు 4–6 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. భారతి, రాజేష్ రెడ్డి దంపతులు తెల్లవారుఝామున 3 గంటలకే వీరి దిన చర్య ప్రారంభం అవుతుంది. ఆవులు, గేదేల నుంచి పాలు పిండి 30 మందికి పాలు పోస్తారు. ఇంట్లో వంట పనులు పూర్తి చేసుకొని ఇద్దరూ తెల్లారేసరికే పొలంలో అడుగుపెడతారు. సా. ఆరు గంటలైతే కానీ ఇంటికి రారు. ఏ ఫంక్షన్‌కు వెళ్లినా సాయంత్రం ఇంటికి రావాల్సిందే! విలువ జోడించే అమ్ముతారు భారతి, రాజేష్ రెడ్డి దంపతులు తాము పండించిన పంటలను విలువ జోడించి అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. సన్న వరి ధాన్యాన్ని మర ఆడించి బియ్యం క్వింటాకు రూ. 6,500కు విక్రయిస్తున్నారు. మిరపకాయలను ఎండబెట్టి కారం పొడిని కిలో రూ. 280కి వినియోగదారులకు అమ్ముతున్నారు. సజ్జలను బై బ్యాక్ పద్ధతిలో కంపెనీలకు క్వింటా రూ.7 వేలకు, పసుపును క్వింటా రూ.11 వేలకు, మొక్కజొన్నను క్వింటా రూ.2,100కు నువ్వులను క్వింటా రూ.14 వేల చొప్పున విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. తమ పిల్లలిద్దరినీ హైద్రాబాద్‌లో ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఫార్మ్ అండ్ రూరల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో పూర్వ ఉపకులపతి దివంగత జె. రఘోత్తమరెడ్డి స్మాకరకోపన్యాస సభలో భారతి ఉత్తమ సేంద్రియ రైతు పురస్కారాన్ని అందుకోవటం విశేషం. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
నారి వారియర్
మంజు వారియర్....పేరులోనే కాదు ఆమె వేసే ప్రతి అడుగులో సాహసం ఉంటుంది. కళకు సామాజిక స్పృహ జోడించి ముందుకు వెళుతోంది. యాక్టర్, రైటర్, డ్యాన్సర్, బ్రాండ్ అంబాసిడర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది... కేరళలోని తిరువనంతపురం కల్పాక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని మహిళా సభ్యులు సొంతంగా కూరగాయలు పండించడం ప్రారంభించారు. అందరూ ఆశ్చర్యపోయేలా పెద్ద వెజిటెబుల్ గార్డెన్‌ను సృష్టించారు. ‘కల్పాక క్వీన్స్’గా పేరు గాంచారు. వెజిటెబుల్ గార్డెన్ సృష్టించడానికి కల్పాక క్వీన్స్‌కు ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ అనే సినిమా స్ఫూర్తి ఇచ్చింది. సమాజాన్ని సినిమా ప్రభావితం చేస్తుందా? సినిమాను సమాజం ప్రభావితం చేస్తుందా?... అనే చర్చ మాట ఎలా ఉన్నా సమాజంపై సినిమా చూపే ప్రభావం తక్కువేమీ కాదు. మంచి లక్ష్యానికి మంచి సినిమా వెన్నుదన్నుగా నిలుస్తుంది. మంజు వారియర్ రీఎంట్రీ మూవీ ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ ఈ కోవకు చెందిన సినిమానే. మంజు వారియర్ ఈ సినిమాలో నిరూపమ రాజీవ్ అనే పాత్ర పోషించింది. నిరూపమ రాజీవ్ అనే వివాహిత టెర్రస్ ఫార్మింగ్‌కు సంబంధించిన ప్రయాణం సినిమా మూల కథ. ‘స్త్రీలు తమలో ఉన్న శక్తి సామర్థ్యాలపై దృష్టి సారించి వెలికి తీస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి’ అంటుంది వారియర్. ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ సినిమా విడుదలైన తరువాత మంజు వారియర్ ఎక్కడికి వెళ్లినా మహిళలు దగ్గరికి వచ్చి ‘మీ సినిమా స్ఫూర్తితో టెర్రస్ ఫార్మింగ్ మొదలు పెట్టాం’ అని చెప్పేవాళ్లు. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ‘కుటుంబశ్రీ’కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంతో మంది మహిళలను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు నడిపిస్తోంది మంజు వారియర్. పదిహేడు సంవత్సరాల వయసులో ‘సాక్ష్యం’ సినిమాతో మలయాళ చిత్రసీమలోకి అడుగు పెట్టిన వారియర్ ‘తూవల్’ ‘కొట్టరం’ ‘సల్లాపం’...మొదలైన సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. చిత్రసీమలోకి రావడానికి ముందు దూరదర్శన్ సీరియల్స్‌లో నటించింది. జెండర్–ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జెండర్ పార్క్’ ప్లాట్‌ఫామ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వారియర్ క్యాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్‌లను నిర్వహిస్తుంటుంది. ‘చతర్ముఖం’ అనే మలయాళం సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసింది మంజు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘సినిమా నిర్మాణంలో రిస్క్‌లు, బాధ్యతలు ఉంటాయి. నా చుట్టుపక్కల వాళ్ల సహకారంతో నిర్మాతగా ఎలాంటి సవాళ్లు, ఒత్తిడి ఎదుర్కోలేదు. ‘కాయట్టం’ సినిమాకు సహనిర్మాతగా ఉన్నప్పుడు చిత్ర నిర్మాణం గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలు పెట్టాను. నా జీవితంలో ఏది ప్లాన్ చేసుకోలేదు. ఆ సమయానికి ఏది ఆసక్తిగా ఉంటే అది చేస్తూ పోయాను. సినిమా నిర్మాణాన్ని నా జీవితంలో కొత్త ప్రయోగంగా భావిస్తాను’ అంటుంది మంజు వారియర్. క్లాసికల్ డ్యాన్సర్‌గా మంజు వారియర్ తెచ్చుకున్న పేరు తక్కువేమీ కాదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుంచి వారియర్ నాట్యప్రతిభ గురించి ప్రముఖ నాట్యకారుడు ఎన్వీ క్రిష్ణన్‌కు తెలుసు. ‘మంజు గిఫ్టెడ్ డ్యాన్సర్. మన దేశంలోని అద్భుతమైన భరతనాట్య కళాకారులలో ఆమె ఒకరు’ అంటాడు క్రిష్ణన్. భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న మంజు వారియర్ తన కూతురు మీనాక్షి డ్యాన్స్ టీచర్ గీతా పద్మకుమారన్ నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంది. ‘వారియర్‌కు కూచిపూడి నేర్పడం ఒక అద్భుత అనుభవం. తక్కువ సమయంలోనే డ్యాన్స్ నేర్చుకుంది. అద్భుతమై ఎక్స్ప్రెషన్స్ ఆమె సొంతం’ అంటుంది గీత. ‘సల్లాపం’ అనే పుస్తకంతో రైటర్‌గా కూడా తన ప్రతిభ చాటుకుంది వారియర్. ‘సల్లాపం’ తన జ్ఞాపకాల సమాహారం. వీణ వాయించడం నేర్చుకున్న వారియర్ ఎన్నో వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మంజు వారియర్ బహుముఖ ప్రతిభకు మరోసారి ఫిదా అయ్యారు అభిమానులు. సంతోషమే నా బలం ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా... ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. సంతోషమే నా బలం. నా జీవితంలో ఎప్పుడూ ఏది ప్లాన్ చేసుకోలేదు. అయితే మంచి విషయాలు నా దారిలో ముందుకు వచ్చి కనిపిస్తాయి. వాటితో కలిసి ప్రయాణిస్తాను. సాహిత్య కార్యక్రమాల్లో మాట్లాడడానికి ముందు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చెప్పబోతున్నానో, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో... ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటాను. – మంజు వారియర్ -
విప్రోలో ఉద్యోగం వదిలి.. వ్యవసాయంతో రూ.205 కోట్లు సంపాదన
దేశంలోనే దిగ్గజ ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం.. దాదాపు 17 ఏళ్లు పనిచేసిన అనుభవం.. ఉద్యోగానికి రాజీనామా.. ఏదైనా ఐటీ కంపెనీ స్థాపిస్తాడేమోనని అనుకుంటాం. కానీ వ్యవసాయం ప్రారంభించాడు. ఏటా ఏకంగా రూ.205 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఏ పద్ధతులు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాడు? అంత సంపాదన ఎలా సాధ్యమైందో ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన శశికుమార్ 17 ఏళ్లపాటు ఐటీరంగంలో సేవలందించారు. అందులో 13 ఏళ్లు దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ విప్రోలో విధులు నిర్వర్తించారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయానికి మాత్రం ప్రత్యామ్నాయం లేదని గ్రహించారు. రసాయనాలు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, సేంద్రియ ఆహారం అందించాలని భావించారు. దాంతో ఆర్గానిక్ పద్ధతులతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తను చేస్తున్న ఉద్యోగం మానేశారు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పడంతో వారూ తనకు సహాయం అందించారు. దాంతో 2010లో 9 మంది మిత్రులు కలిసి అక్షయకల్ప ఆర్గానిక్‌ని ప్రారంభించారు. శశికుమార్ మొదట్లో కేవలం ముగ్గురు రైతులతో పాల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే అక్షయకల్ప ఆర్గానిక్ నిర్వాహకులు పాలతో ఆగకుండా.. సేంద్రియ కూరగాయలు, పండ్లను పండించడం ప్రారంభించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని ప్రజలకు ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరిస్తూ వారికి చేరువవుతున్నారు. ఆర్గానిక్ పద్ధతులతో పండిస్తున్న రైతుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. రైతుల ఆదాయాలను పెంచుతున్నారు. ప్రస్తుతం అక్షయకల్ప ఆర్గానిక్ ద్వారా పాలఉత్పత్తిలో భాగంగా 700 మంది రైతులు సహకారం అందిస్తున్నారు. దాదాపు 60,000 లీటర్ల సేంద్రియ పాలను ఉత్పత్తి చేస్తున్నట్లు శశికుమార్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో మార్కెటింగ్ సేవలందించేందుకు 500 మందికి పైగా శిక్షణ ఇస్తున్నారు. సేంద్రియ పాలపై మొదట్లో వినియోగదారులకు అవగాహన కల్పించడం పెద్ద సవాలుగా మారిందని శశికుమార్ తెలిపారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో తన స్నేహితులు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారని చెప్పారు. ఇటీవల రూ.10 కోట్లతో కొత్త డెయిరీ ప్లాంట్ ప్రారంభించామన్నారు. దాని ద్వారా రోజుకు లక్ష లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: 11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత సేంద్రియ కూరగాయలు, పండ్ల వ్యాపారం గతంలో కంటే మెరుగవుతుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో అక్షయకల్ప ఆర్గానిక్ స్టార్టప్ రూ.205 కోట్లు ఆర్జించింది. 2023-24లో ఆదాయం మరో 25 శాతం పెరుగుతుందని శశి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ 5 వేల గ్రామాలు, 5 వేల మంది రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. -
ఆర్గానిక్ పాలకు అధిక డిమాండ్ ఉంది
-
తేనెటీగలు సంచార జాతికి చెందినవి
-
సంపద కేంద్రంలో ప్రకృతి వనం
కంకిపాడు(పెనమలూరు): అది చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రం. నిన్నటి వరకూ ప్రజలకు అంత వరకే తెలుసు. ప్రస్తుతం ప్రకృతి విధానంలో కూరగాయల మొక్కల సాగు జరుగుతోంది. ఎరువులు, పురుగు మందులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా సంపద కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు కంకిపాడు పంచాయతీ పాలకవర్గం పాటుపడుతూ స్థానిక సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది. మండల కేంద్రమైన కంకిపాడులో గత పాలకపక్షం హయాంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని నిర్మించారు. ఈ పాలకపక్షం అధికారం చేపట్టాక సంపద వృద్ధి, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించింది. ప్రస్తుతం వర్మికంపోస్టు, పొడి చెత్త విక్రయాలు సాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం సంపద కేంద్రంలో ఉన్న ఖాళీ స్థలంలోనూ సంపద సృస్టించేందుకు పంచాయతీ పాలకవర్గం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఐదు నెలల క్రితం సంపద కేంద్రం ప్రాంగణంలో వృథాగా ఉన్న స్థలాన్ని బాగుచేయించారు. ఆ ప్రాంతంలో వర్మీకంపోస్టు, మట్టి కలిపి మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేశారు. వంగ, బెండ, గోరు చిక్కుడు, టమాటా, మిర్చి మొక్కలు నాటారు. తీగజాతికి చెందిన సొర, బీర, కాకర, పొట్లను కూడా సాగుచేస్తున్నారు. వీటికి పందిరి అవసరం లేకుండా ప్రాంగణంలో కొంచెం ఎత్తు మాత్రమే ఉన్న చెట్లకు పాదులను పాకిస్తున్నారు. తోటకూర, పాలకూర, గోంగూర నారుపోసి సంరక్షించారు. అరటి, జామ, దానిమ్మ, పనస, మామిడి, ఉసిరి వంటి పండ్ల జాతి మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలు తెగుళ్లు, పురు గుల బారిన పడకుండా నిత్యం పంచాయతీ సిబ్బంది సంరక్షిస్తున్నారు. మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేందుకు, మంచి ఫలసాయం లభించేందుకు ఎప్పటికప్పుడు వర్మికంపోస్టు, సేంద్రీయ ఎరువును మొక్కలకు అందిస్తున్నారు. ఆదాయం పెంపు దిశగా.. ఇప్పటికే చెత్త నుంచి సంపద కేంద్రం నుంచి వర్మీ కంపోస్టు, పొడి చెత్త విక్రయాలు జరుగుతు న్నాయి. వీటి తోపాటుగా అన్ని సీజన్లలో ప్రకృతి విధానంలో కూరగాయ మొక్కలను పెంచి వాటి ఉత్పత్తులను విక్రయించటం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు పంచాయతీ చర్యలు తీసుకుంది. వర్మీకంపోస్టు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు ఆర్గానిక్ కూరగాయలకు ఆసక్తి చూపుతారు. అదే ఉద్దేశంతో ప్రకృతి విధానాన్ని సంపద కేంద్రంలో అమలు చేస్తోంది. ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తులను మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆరోగ్యంపై అవగాహన, శ్రద్ధ పెరిగాయి. ఆర్గానిక్ పద్ధతిలో పెరిగిన కూరగాయలను భుజించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే కారణంతో ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేసిన కూరగాయలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావా లని నిర్ణయించుకున్నాం. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వృథాగా ఉన్న ఖాళీ స్థలాన్ని మొక్కల పెంపకానికి వినియోగి స్తున్నాం. కేంద్రం ప్రాంగణం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు పెంచి విక్రయించటం ద్వారా పంచాయతీకి కూడా ఆదాయం సమకూరుతుంది. – రాచూరి చిరంజీవి, ఉప సర్పంచ్, కంకిపాడు -
హైబ్రీడ్ రకాల సాగుకే మొగ్గుచూపుతున్న అన్నదాతలు
-
పుష్ప శ్రీవాణి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వ్యవసాయం
-
ఆర్గానిక్ పంటలకు మార్కెట్లో మంచి ధర దక్కుతుంది
-
లే‘టేస్ట్’ ట్రెండ్..!
మండపేట: నాటుకోడి... కౌజుపిట్ట... కొర్రమీను... ఇదీ ఇప్పుడు ట్రెండ్.. అటు రెస్టారెంట్లలో అందరి దృష్టి వీటిపైనే ఉంటోంది. ఇటు పెంపకంలోనూ వీటిపైనే యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. కొందరు ఉద్యోగం చేస్తూనే తమకున్న ఆసక్తి మేరకు కొద్దిపాటి స్థలంలో గేదెలు, ఆవులు, నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలు వంటివి ఒకేచోట పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇదే తరహాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం పాలతోడు గ్రామానికి చెందిన పిల్లా విజయ్‌కుమార్ కేవలం ఆరు సెంట్ల స్థలంలో నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలను ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాడు. నెలకు రూ.40వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ చదివిన విజయ్‌కుమార్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సివిల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. చిన్నతనం నుంచి పశుపోషణ, కోళ్ల పెంపకంపై ఆసక్తి కలిగిన అతను తన సొంతూరులో ఆరు సెంట్ల స్థలంలో నాలుగేళ్ల కిందట మూడు గేదెలు, రెండు ఆవులతో డెయిరీఫాం, నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాడు. డెయిరీఫాం బాగానే ఉన్నా కార్మికుల సమస్యతో దానిని మధ్యలోనే ఆపేశాడు. అనంతరం కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టాడు. భీమవరం నుంచి మేలుజాతి కోడిపుంజులు, పెట్టలను తీసుకువచ్చి గుడ్లు ఉత్పత్తి చేయించి ఆర్గానిక్ తరహాలో పెంచడం ప్రారంభించాడు. ఆ తర్వాత హోటళ్లలో కౌజుపిట్టలకు మంచి గిరాకీ ఉందని గుర్తించి... రెండేళ్లుగా వాటిని కూడా పెంచుతున్నాడు. అంతటితో ఆగకుండా గతంలో ఏర్పాటుచేసిన డెయిరీ ఫాంలో పశువుల కోసం నిర్మించిన నీటి తొట్టెలలో ఏడాది నుంచి కొర్రమీను చేపల పెంపకం ప్రారంభించాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూనే వారానికి ఒకసారి ఒకసారి వచ్చి అన్నీ చూసుకుని వెళతాడు. ఆయనకు కుటుంబ సభ్యులు సాయం చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోల ఆధారంగా ఎప్పటికప్పుడు మెళకువలు తెలుసుకుంటూ కోళ్లు, చేపలు, కౌజుపిట్టల పోషణ చేస్తున్నాడు. యూట్యూబ్‌లో చూసి గుడ్లను పొదిగించేందుకు ఇన్వర్టర్పై పని చేసే ఇంక్యుబేటర్‌ను సొంతంగా ప్లేవుడ్‌తో తయారు చేసుకున్నాడు. దానిలోనే కోడిగుడ్లు, కౌజుపిట్ట గుడ్లు పొదిగిస్తున్నారు. ఆదాయం బాగుంది నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీనుల పెంపకం లాభసాటిగా ఉంది. వీటిని పూర్తి ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచుతాం. గుడ్ల ఉత్పత్తికి వినియోగించే కోడి పుంజు రూ.75 వేలు కాగా, పెట్ట రూ.25 వేలు చొప్పున భీమవరంలో కొనుగోలు చేశా. ప్రస్తుతం వందకు పైగా కోళ్లు, 2,500 నుంచి 3,000 వరకు కౌజుపిట్టలు, 1,000 నుంచి 1,200 వరకు కొర్రమీను చేపలు పెంచుతున్నాం. మేత, ఇతర ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోంది. – పిల్లా విజయ్‌కుమార్, పాలతోడు, మండపేట మండలం -
బ్లాక్ రైస్, రెడ్ రైస్ సాగుతో అధిక దిగుబడిని పొందిన రైతు
-
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంపై విదేశీయుల ఆసక్తి
-
సేంద్రియ వ్యవసాయంతో రైతుకు కలుగుతున్న లాభాలు
-
ఆరోగ్యకర జీవనానికి ఔషధ మొక్కలు
-
మల్లేశ్వరమ్మ సహకార వెలుగులు
చిన్న, సన్నకారు మహిళా రైతులు సంఘటితమైతే ఆర్థికాభివృద్ధితో పాటు మంచి ఆహారం కూడా మారుమూల గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందనటానికి శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం ఓ తాజా ఉదాహరణ. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె మండలం ముసలిరెడ్డిగారిపల్లి కేంద్రంగా 2014లో ఈ సొసైటీ ఏర్పాటైంది. సుస్థిర వ్యవసాయ కేంద్రం ఈ సొసైటీకి ఆది నుంచి అండగా నిలుస్తోంది. మల్లేపల్లి తదితర పరిసర గ్రామాలకు చెందిన 301 మంది సన్న, చిన్నకారు మహిళా రైతు కుటుంబాలలో ఆర్థిక, ఆహార భద్రతా వెలుగులు నింపుతున్న ఈ సొసైటీకి సీనియర్ ఎన్‌పిఓపి సర్టిఫైడ్ సేంద్రియ రైతు వడ్డెమాని మల్లేశ్వరమ్మ అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. చదువు లేకపోయినా.. కఠోర శ్రమ, పట్టుదలతో సొసైటీ వార్షిక వ్యాపారాన్ని రూ.65 లక్షలకు పెంచగలిగిరామె. ఆమె కృషిని ‘నాబార్డు’ మెచ్చింది. నాబార్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ బాబు.ఎ., మార్కెటింగ్, సహకార శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి చేతుల మీదుగా ఇటీవల విజయవాడలో ఉత్తమ మహిళా రైతు పుస్కారాన్ని మల్లేశ్వరమ్మ అందుకోవటం విశేషం. సేంద్రియ సేద్యం ఇలా.. మల్లేశ్వరమ్మ, చంద్రశేఖరరెడ్డి దంపతులు ముసలిరెడ్డిగారిపల్లి పరిసరాల్లోని 4 చోట్ల ఉన్న 9 ఎకరాల వారసత్వ భూముల్లో సేంద్రియ సేద్యం చేస్తున్నారు. 2 ఎకరాల్లో మూడేళ్ల క్రితం బత్తాయి మొక్కలు నాటారు. అందులో అంతరపంటగా సాగు చేస్తున్న పత్తి ప్రస్తుతం కోతకు వచ్చింది. గతంలో వేరుశనగ తదితర ఆహార పంటలనే వేసే వారమని, అడవి పందుల బాధ పడలేక పత్తి వేశామని ఆమె తెలిపారు. ఆగస్టు ఆఖరుకు పత్తి తీత పూర్తవుతుంది. సగటున చెట్టుకు 35 కాయలు వచ్చాయి. ఎకరానికి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ రెండెకరాల్లో పత్తికి ముందు పెసర, మినుము సాగు చేశారు. మరో రెండెకరాల్లో పూర్తిగా పత్తి సాగు చేస్తున్నారు. 4 ఎకరాలను బొప్పాయి నాటడానికి సిద్ధం చేశారు. ఊరికి ఆనుకొని ఉన్న ఎకరంలో 32 రకాల కూరగాయలను ఇటీవలే విత్తామని మల్లేశ్వరమ్మ తెలిపారు. సిఎస్ఎ క్షేత్ర సిబ్బంది తోడ్పాటుతో ఏ పంటైనా సేంద్రియంగానే సాగు చేస్తుండటం విశేషం. మూడేళ్లకోసారి దిబ్బ ఎరువు వేస్తారు. ప్రతి ఏటా టైప్ 2 ఘనజీవామృతం, వేపపిండి, కానుగ పిండి ఎరువుగా వేస్తున్నారు. అవసరాన్ని బట్టి ద్రవ జీవామృతం, దశపర్ణి కషాయం, వేపనూనె పిచికారీ చేస్తున్నారు. గుంటక, సైకిల్ వీడర్‌తో కలుపు సమస్యను కొంత మేరకు అధిగమిస్తున్నారు. ఈ 9 ఎకరాలు మెయిన్ కేసీ కెనాల్‌కు దగ్గర్లో ఉండటంతో భూగర్భ జలానికి కొదువ లేవు. ఒకే బోరుతో నీటిని తోడుతూ భూగర్భ పైపు లైను ద్వారా నాలుగు పొలాల్లోని పంటలకు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. పెసర, మినుము, ధనియాలు, వాము, ఆవాలు, పత్తి, కంది, వేరుశనగ, గోధుమ తదితర పంటలు సీజన్‌కు అనుగుణంగా సాగు చేస్తున్నారు. సేంద్రియంగానే సంతృప్తికరమైన దిగుబడులు తీస్తున్నామని మల్లేశ్వరమ్మ వివరించారు. 48 మందికి సేంద్రియ సర్టిఫికేషన్ శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘంలో దాదాపు 11 గ్రామాలకు చెందిన 301 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 48 మంది సేంద్రియ సేద్యం చేస్తున్నారు. మల్లేశ్వరమ్మ సహా పది మంది ఎన్‌పిఓపి థర్డ్‌పార్టీ సేంద్రియ సర్టిఫికేషన్ పొందారు. విదేశాలకూ ఎగుమతి చేయొచ్చు. మరో 40 మంది పీజీఎస్ సర్టిఫికేషన్ పొందారు. రైతులకు విత్తనాలు తదితర ఉత్పాదకాలను తెప్పించి తక్కువ ధరకు సొసైటీ అందిస్తుంది. దీనితో పాటు కొర్రలు, అండుకొర్రలు, వేరుశనగలు, తెల్లజొన్న, గోధుమలు, ధనియాలు, కందులు, పెసలను సుమారు 15 క్వింటాళ్ల వరకు సభ్య రైతుల నుంచి కొనుగోలు చేసి సొసైటీ నిల్వ చేసి, ఏడాది పొడవునా శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి రుణం తీసుకోకుండా సొసైటీ సొంత డబ్బుతోనే పరిమితంగా కొంటున్నామన్నారు. మల్లేశ్వరమ్మ తన సొంత ఇంటిలోనే కొన్ని గదులను కేటాయించి సొసైటీ ముడి ధాన్యాలను నిల్వ చేశారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలను మరపట్టే యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. డిమాండ్ మేరకు ధాన్యాలను శుద్ధి చేయించి సరసమైన ధరకు విక్రయిస్తున్నారు. కందులను సంప్రదాయ పద్ధతుల్లో పప్పుగా తయారు చేస్తున్నారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా పురుగు సమస్య ఉండదని తెలిపారు. ఇరుగు పొరుగు గ్రామాల వాళ్లు కూడా వచ్చి కొనుక్కెళ్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఉన్న కొందరికి కూడా పంపుతున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు. సోలార్ డ్రయ్యర్లతో ఒరుగులు, పొడులు టొమాటోలు, నిమ్మకాయల వంటి పంటలకు మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి, సోలార్ డ్రయ్యర్ల ద్వారా ఒరుగులు తయారు చేసి విక్రయించడం ఈ సొసైటీ చేస్తున్న మరో మంచి పని. రహేజా సోలార్ స్టార్టప్ సంస్థ 3 టన్నుల సామర్థ్యం గల 6 సోలార్ డ్రయ్యర్లను ఈ సొసైటీకి సిఎస్ఎ ద్వారా 80% సబ్సిడీపై 5 నెలల క్రితం అందించింది. గతంలో టొమాటో ఒరుగులు తయారు చేసి కిలో రూ. 340కి అమ్మినట్లు మల్లేశ్వరమ్మ తెలిపారు. 20 కిలోల టొమాటోలను ఎండబెడితే కిలో ఒరుగులు వస్తాయి. రెండోరకం టొమాటోలు కిలో రూ. 8 చొప్పున కొని ఎండబెట్టి రహేజా సంస్థకే అమ్మామని తెలిపారు. ఇప్పుడు నిమ్మకాయల ఒరుగులు చేస్తున్నారు. 11 కిలోలకు 1 కిలో ఒరుగులు వస్తున్నాయి. ధర రూ.340కి అమ్ముతున్నారు. కరివేపాకు, మునగాకులను సైతం ఈ డ్రయ్యర్లలో ఎండబెట్టి పొడులను ఆర్డర్లపై సరఫరా చేస్తున్నామని ఆమె వివరించారు. సొసైటీ పనులు చేసే మహిళా సభ్యులకు వేతనానికి అదనంగా రోజుకు రూ. 5లను వారి పేరున భవిష్యనిధిగా జమ చేస్తున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు. ఈ మహిళా రైతుల సహకార సంఘం సేవలు మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలని ఆశిద్దాం. మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి ఉంది పజలకు ఆదాయం ఉంది, డబ్బుంది. కానీ, మంచి ఫుడ్డు లేదు. ఈ ఆలోచనతోనే సేంద్రియ ఆహారాన్ని పండించి అందించాలన్న ఆలోచన వచ్చింది. రసాయనాల్లేకుండా పండించిన రాగి సంగటి, కొర్రన్నం, సింగిల్ పాలిష్ బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు ఇంటిల్లపాదీ తింటున్నాం. దీని వల్ల మా ఆరోగ్యం ఎంతో బాగుంది. మా ఊళ్లో వాళ్లు 60% మా దగ్గర కొంటారు. బెంగళూరు, హైదరాబాద్‌లలో 18 కుటుంబాలకు కూడా పార్శిల్ ద్వారా పంపుతున్నాం. మా కుటుంబానికి, ప్రజలకు కూడా మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి చాలా ఉంది. ఈ కీర్తి చాలు. – వడ్డెమాని మల్లేశ్వరమ్మ (62815 06734), అధ్యక్షులు, శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం, ముసలిరెడ్డిగారిపల్లి, వేంపల్లె మం., వైఎస్సార్ కడప జిల్లా. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
సేంద్రియ వ్యవసాయంతో రైతులకు కాసుల వర్షం
-
సేంద్రియ పంటలతో ఆరోగ్యంతో పాటు ఆదాయ మార్గం
-
ఏడాదికి మూడు పంటలు పండిస్తూ మంచి లాభాలు
-
సెమీ ఆర్గానిక్ పద్ధతిలో బంగినపల్లి మామిడి ... లక్షల్లో ఆదాయం
-
అధిక ఎరువులు వాడితే అనర్థమే
నవాబుపేట: రసాయన ఎరువులు అధికంగా వాడితే అనర్థమే అని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా దిగుబడి తగ్గి, పెట్టుబడులు పెరుగుతాయని అంటున్నారు. సాధారణంగా నేల స్వభావం, భూసారాన్ని బట్టి ఎరువులు వాడాలి. కానీ రైతులంతా ఒకే రకమైన ఎరువులను వినియోగిస్తున్నారు. వరి సాగులో ఎకరాకు 50కేజీల డీఏపీ, 100 కేజీల యూరియా వాడాలి. కానీ రైతులు ఎకరాకు రెండు బస్తాలకు తగ్గకుండా డీఏపీ వేస్తున్నారు. పైరు నాటే సమయంలో బస్తాకు అదనంగా 25 కేజీల పొటాష్‌ను కలిపి వేయాల్సి ఉన్నా రైతులు వేయడం లేదు. వరికి యూరియాను నాలుగు సార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల చొప్పున వాడాలి. పొట్టదశలో యూరియాకు 25 కేజీల పొటాష్‌ను కలిపి వాడాలి. అయితే రైతులు చాలా వరకు నాటిన 20 రోజులకు 50 కేజీలు, మధ్యలో 50 కేజీలు వాడుతున్నారు. ఇక పత్తి పంట విషయానికి వస్తే విత్తేకంటే ముందే ఎకరాకు మూడు నాలుగు అంగుళాల లోతున పడేలా 50 కేజీల డీఏపీ వాడాలి. అయితే వర్షాధారంగా సాగు చేసే పంటల్లో విత్తనాలు మొలుస్తాయో లేదోనని పత్తి విత్తేటప్పుడు ఎరువులు వేయడం లేదు. కనీసం 25సెం.మీ. లోతులో భూమిలో పదును ఉండేలా వర్షం పడినప్పుడు ఎరువుతో పాటు పత్తి గింజలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. పత్తితో పాటు అన్ని ఖరీఫ్ పంటలకు 50 కేజీల వరకు మాత్రమే డీఏపీ వాడాలి. అయితే రైతులు పైరు ఎదుగుదల దశలో రెండు మూడు బస్తాలు వరకు డీఏపీని పై పాటుగా చల్లుతున్నారు. దీని వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పోషకాలు ఉన్న కాంప్లెక్స్ ఎరువులు రెండు బస్తాలు వాడితే సరిపోతుంది. అధిక భాస్వరంతో నష్టం అధిక మోతాదులో భాస్వరం వాడడం వల్ల దిగుబడులపై క్రమంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలి రెండేళ్ల పాటు దిగుబడులు బాగా వచ్చినా ఆ తర్వాత ఎరువులు వాడినా దిగుబడులు రానంతగా నేల దెబ్బతింటుంది. భాస్వరం భూమి లోపలి పొరల్లో నిల్వ ఉండి నేల గట్టిగా మారి పంటలకు నష్టం కలిగిస్తుంది. సమతూల్యత ఏది? ప్రతి మొక్కకూ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. రైతులు అవగాహన లోపంతో కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల్లో ఉండని పోషకాలను అదనంగా చేర్చి వాడాల్సిన విషయం రైతులకు తెలియదు. ఉదాహరణకు 28 – 28 – 0, డీఏపీలోను పొటాష్ ఉండదు. ఈ ఎరువులు వినియోగించినప్పుడు పైరు ఎదుగుదల దశలో పైపాటుగా యూరియాను వాడాలి. దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నా పైపాటుగా కూడా వాడుతుండడంతో ఎరువుల్లో పోషకాలు సరిగ్గా మొక్కకు చేరక వృథా అవుతున్నాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని రైతులు గుర్తించకపోవడంతో పంటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. సేంద్రియ ఎరువులు తప్పని సరి రైతులు రసాయన, సేంద్రియ ఎరువులు సగం మోతాదులో వాడాల్సి ఉంది. కేవలం రసాయన ఎరువులే వాడటం వల్ల భూ సారం తగ్గిపోయి నిస్సారంగా మారుతుంది. మొదట్లో బాగానే దిగుబడులు వచ్చినా క్రమంగా భూ సారం తగ్గి దిగుబడులు రావు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల బరువు నేలలు గుళ్ల బారి వేర్లు చక్కగా పెరగటానికి సహాయపడుతుంది. అవగాహన కల్పిస్తున్నాం ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మోతాదుకు మించి ఎరువులు వాడడం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తున్నాం. ఏ పంటకు ఏ సమయంలో ఎంత ఎరువు వాడాలి అనేది తెలిస్తే పంట దిగుబడిలో ప్రయోజనం కనిపిస్తుంది. ఆ దిశగా రైతులకు సూచనలు ఇస్తున్నాం. అంతేకాకుండా భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాం. – ప్రసన్నలక్ష్మి, ఏఓ -
జీరో బడ్జెట్ ఆర్గానిక్ వ్యవసాయం ... లక్షల్లో ఆదాయం
-
తూములూరు రుచులు ఊరు
మొదట అక్కడ సేంద్రియ వ్యవసాయం మొదలైంది. తర్వాత స్త్రీలు సేంద్రియ తినుబండారాలు మొదలుపెట్టారు. రేకుల షెడ్డే వారి వంటశాల. అరవై పైబడిన బసవ పూర్ణమ్మ వారి మేస్త్రి. రాగి లడ్డు, జొన్నలడ్డు, నల్ల అరిసెలు, నువ్వుండలు... ఆ కారం... ఈ పచ్చడి... ఎక్కడా రసాయనాల ప్రస్తావన ఉండదు. ఆముదం, కాటుక, కుంకుమ కూడా తయారు చేస్తున్నారు. వీరికి ఆర్డర్లు భారీగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న ఊరు స్త్రీల వల్ల కరకరలాడుతోంది. కళకళలాడుతోంది. 2018లో మొదలైంది ఈ కథ. ‘అమ్మా... మేము పండిస్తున్న సేంద్రియ పంటలకు మంచి డిమాండ్ వస్తోంది. కాని ఇవే సేంద్రియ పదార్థాలతో చిరుతిండ్లు చేయించి అమ్మమని అందరూ అడుగుతున్నారు. నువ్వు తయారు చేస్తావా?’ అని అడిగాడు అవుతు వెంకటేశ్వర రెడ్డి తన తల్లి బసవ పూర్ణమ్మతో. ఆమెకు పల్లెటూరి పిండి వంటలు చేయడం వచ్చు. పండగలకు పబ్బాలకు పల్లెల్లో ఎవరు మాత్రం చేయరు? ‘అదెంత పనిరా చేస్తాను’ అంది. అలా గుంటూరు జిల్లాలోని కొల్లిపరకు ఆనుకుని ఉండే తూములూరు అనే ఊళ్లో సేంద్రియ చిరుతిళ్ల తయారీ మొదలైంది. బసవ పూర్ణమ్మ ఇంటిలో వేపచెట్టు కింద ఉండే పశువుల కొట్టాం కాస్తా వంటల షెడ్డుగా మారింది. ఊళ్లో వంటలు చేయడం ఆసక్తి ఉన్న స్త్రీలకు ఇదొక ఉపాధిగా ఉంటుందని వారిని తోడుకమ్మని ఆహ్వానించింది బసవ పూర్ణమ్మ. అలా ‘విలేజ్ మాల్’ అనే బ్రాండ్‌తో ‘కొల్లిపర మండల వ్యవసాయదారుల సంఘం’ అనే లేబుల్ కింద తూములూరు చిరుతిండ్ల తయారీ మొదలైంది. రసాయనాలు లేని తిండి ‘మా అబ్బాయీ, ఇంకొంత మంది రైతులు 2015 నుంచి కొల్లిపర చుట్టుపక్కల ఊళ్లలో సేంద్రియ పద్ధతిలో వరి, పసుపు,అరటి, నిమ్మ పండించడం మొదలుపెట్టారు. వీళ్లకు ‘గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం’ అనే సంఘం ఉంది. రైతులంతా కలిసి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ పంటను మంచి రేటుకు అమ్ముతున్నారు. ఆ సమయంలోనే మార్కెట్లో కల్తీ నూనెలతో, పిండ్లతో తయారై వస్తున్న పిండి వంటలు తినలేక సేంద్రియ పిండివంటల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మా అబ్బాయి ప్రోత్సాహంతో రంగంలోకి దిగాను. మొదట వేరుశనగ ఉండలు చేశాం. నిడదవోలు, మాండ్య లాంటి చోట్ల నుంచి సేంద్రియ బెల్లం తెప్పించి చేశాం. రుచి భలే ఉండటంతో డిమాండ్ వచ్చింది. అలా ఒక్కోటి పెంచుకుంటూ వెళ్లాం. ఇవాళ 30 రకాల చిరుతిళ్లు తయారు చేస్తున్నాం’ అని చెప్పింది బసవపూర్ణమ్మ. రాగిలడ్డు, జొన్న లడ్డు, నల్లబియ్యం అరిసెలు, నువ్వుండలు, పప్పుండలు, జంతికలు, కొబ్బరి లడ్డు, చెక్కలు ఇవి కాకుండా కరివేపాకు కారం, మునగాకు కారం వీరు తయారు చేస్తున్నారు. ఇక మామిడి, గోంగూర పచ్చడి గుంటూరు జిల్లా ప్రత్యేకం. అవీ చేస్తున్నారు. ‘సేంద్రియ నూనె పేరుతో అమ్ముతున్న నూనెలు కూడా కరెక్ట్‌గా లేవు. చాలా నూనెలు ట్రై చేసి రాజస్థాన్‌లో ఒక చోట నుంచి మంచి సేంద్రియ నూనె తెప్పించి ఈ పిండివంటలకు వాడుతున్నాం’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ. ఆమె అజమాయిషీలో సాగే వంటశాలకు వెళితే చెట్టు కింద కట్టెలపొయ్యి మీద ఆముదం గింజలు కుతకుత ఉడికిస్తుంటారు కొందరు. వరండాలో జీడిపాకం ఆరబెట్టి, ఉండలు చుడుతుంటారు కొందరు. చిరుధాన్యాలతో లడ్డూలు, నల్లబియ్యంతో అరిసెలు చేస్తారు మరికొందరు. అంతా కళకళగా ఉంటుంది. ఆముదం, కుంకుమ ‘మార్కెట్లో సిసలైన ఆముదం దొరకడం లేదు. మా చిన్నప్పుడు ఎవరి ఆముదం వారే తయారు చేసుకునేవాళ్లం. అందుకనే ఆముదం కూడా తయారు చేస్తున్నా. లీటరు 800 పెట్టినా ఎగరేసుకుని పోతున్నారు. పసుపు నుంచి కుంకుమ తయారు చేసే పద్ధతి ఉంది. అలా స్వచ్ఛమైన కుంకుమ తయారు చేస్తున్నా. ఆముదం గింజల నుంచే కాటుక తయారు చేయవచ్చు. అదీ చేస్తున్నా. మా చిరుతిండ్ల కంటే వీటిని ఎక్కువమంది మెచ్చుకుని కొనుక్కుంటున్నారు’ అని తెలిపింది బసవపూర్ణమ్మ. ఈ మొత్తం పనిలో పదిహేను మంది ప్రత్యక్షంగా మరో పదిహేనుమంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కోటి టర్నోవర్‌కు... వచ్చే మార్చికంతా కోటి టర్నోవర్‌కు ఈ పిండి వంటల పరిశ్రమ చేరుకోవచ్చని అంచనా. తూములూరు పిండి వంటలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా కేంద్రాల్లో అమ్ముడుపోతున్నాయి. కొందరు సరుకు తీసుకుని తమ బ్రాండ్ వేసుకుని అమ్ముకుంటున్నారు. సరుకు రవాణ మొత్తం ఆర్.టి.సి. కార్గొ మీద ఆధారపడటం విశేషం. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సంఘం నగరాల్లో నిర్వహించే ప్రదర్శనల్లో తూములూరు పిండివంటల స్టాల్ కచ్చితంగా ఉంటోంది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నిర్వహించే సమావేశాలకూ ఈ పిండివంటలనే ఆర్డరు చేస్తున్నారు. ‘ఈ రోజుల్లో ఆడవాళ్లకు పిండివంటలు చేసుకోవటం కష్టమవుతోంది. దీనికితోడు రసాయన అవశేషాలు లేని ఆహారపదార్థాలు దొరకటం దుర్లభంగా తయారైంది. అందుకే మాకు డిమాండ్ వస్తోంది. మరింతమంది రైతులను కలుపుకుని సేంద్రియ పంటలతో పిండివంటలను పరిశ్రమ స్థాయికి చేర్చాలనే ఆలోచన సంఘ సభ్యుల్లో ఉంది. అప్పుడు మా వంటశాలను విస్తరించాల్సి వస్తుంది’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
ఆర్గానిక్ మహోత్సవ్ అదిరింది
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆర్గానిక్ మహోత్సవ్‌లో రూ.140 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు నగరంలోని గాదిరాజు ప్యాలెస్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ సంయుక్తంగా ఈ భారీ మేళాను నిర్వహించాయి. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్రంలో తొలిసారిగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ మేళాలో సేంద్రియ విధానంలో పండించిన వరి, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, బెల్లం, మామిడి పండ్లు, తేనె తదితర సేంద్రియ సహజ ఉత్పత్తులను 123 స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. ప్రత్యేకంగా ఒక ఆర్గానిక్ ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. సందర్శకులు వివిధ సేంద్రియ వంటకాలను ఆరగించి సంతృప్తి చెందారు. బహుళజాతి సంస్థల ప్రతినిధులు రాక దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు సింగపూర్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, బహుళజాతి సంస్థల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు ప్రతినిధులు, చిరుధాన్యాల ఉత్పత్తి, సాగుదారులు, కొనుగోలుదారులు భారీగా హాజరయ్యారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించారు. ఈ మేళాకు మూడు రోజుల్లో 22 వేల మందికి పైగా సందర్శకులు వచ్చారు. 12కు పైగా సంస్థలు రైతుల తరఫున రైతు సాధికార సంస్థతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. వీటిలో బెంగళూరుకు చెందిన ఫలద ఆగ్రో ప్యూర్ అండ్ ష్యూర్ సంస్థ రూ.90 కోట్లు, సాగ్లిష్ హార్వెస్ట్ రూ.10 కోట్లు, సింగపూర్‌కు చెందిన జీఎన్ ఆర్గానిక్ రూ.10 కోట్లతో పాటు ఈ–మిల్లెట్స్, స్వచ్ఛ మిల్లెట్స్, బిగ్ బాస్కెట్, గాట్ కాటన్ తదితర సంస్థలు వెరసి రూ.140 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రకృతి వ్యవసాయ రైతులతో ప్రతినెలా ఉత్పత్తుల కొనుగోలుకు ముందుకొచ్చాయి. జీవనశైలి వ్యాధులకు దూరంగా ఉండాలంటే జీవన విధానం మార్చాలనే ఇతివృత్తంతో సేంద్రియ పంటలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆర్గానిక్ మహోత్సవ్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆర్గానిక్ మేళాకు హాజరైన ఆయా సంస్థల ప్రతినిధులకు నిర్వాహకులు సరి్టఫికెట్లు అందజేశారని రైతు సాధికార సంస్థ సీనియర్ థిమాటిక్ లీడ్ ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రకృతి సాగే పరిష్కారం!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలను ఆరోగ్యంగా ఉంచాలి. 98% ప్రాణవాయువును మొక్కలే ఇస్తున్నాయి. 80% ఆహారం పంటల ద్వారానే వస్తోంది. భూతాపోన్నతి కారణంగా విజృంభిస్తున్న పురుగులు, తెగుళ్ల వల్ల దిగుబడి 40% మేరకు దెబ్బతింటున్నది. ఈ నష్టం విలువ ఏడాదికి 22,000 కోట్ల డాలర్లని ఎఫ్.ఎ.ఓ. లెక్కగట్టింది. మన దేశంలో కత్తెర పురుగు, నల్ల తామర పురుగు, రుగోస్ తెల్లదోమ.. వంటివి ఇందుకు ఉదాహరణలు. అయితే, పొలాలు, పర్యావరణ వ్యవస్థలకున్న ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యంపై ఈ నష్టం తీవ్రత ఆధారపడి ఉంటుందని ఎఫ్.ఎ.ఓ. స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. సాగు పద్ధతి మార్చుకుంటే వీటి తీవ్రత తగ్గినట్లు ఏపీ రైతు సాధికార సంస్థ అధ్యయనంలో తేలింది. రసాయనిక వ్యవసాయంలో పురుగుల తీవ్రత, దిగుబడి నష్టం 50 శాతం పైగా ఉంటే.. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో 10% మాత్రమే. ప్రధాన పంట సాగుకు ముందు 30 రకాల పచ్చిరొట్ట (నవధాన్య) పంటలు సాగు చేసే రైతుల జీవవైవిధ్య క్షేత్రాల్లో ఒక్కో ఏడాది గడిచేకొద్దీ చీడపీడల బెడద అంతకంతకూ తగ్గుతోందని కూడా ఈ అధ్యయనం చెబుతోంది. ఈ నెల 12న ‘అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం. మన దేశంలో ఇటీవల సంవత్సరాల్లో పంటలకు పెను నష్టం కలుగజేస్తున్న కత్తెర పురుగు, నల్ల తామర పురుగు, రుగోస్ తెల్లదోమ.. వంటి పురుగులే ఇందుకు ఉదాహరణలు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు ఈ పురుగులు తీవ్ర నష్టం కలిగిస్తుండగా, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతుల పొలాల్లో ఈ పురుగుల తీవ్రత, నష్టం చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలుచేస్తున్న రైతు సాధికార సంస్థ అధ్యయన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 30 రకాల పచ్చిరొట్ట పంటలు వేసిన తర్వాత ఆహార/వాణిజ్య పంటలు సాగు చేయటంయటం వల్ల వాతావరణ మార్పులను, చీడపీడలను తట్టుకొని నిలబడి మంచి దిగుబడులను ఇచ్చే శక్తి ప్రకృతి సేద్య క్షేత్రాలకు పెరుగుతున్నట్లు అర్థం అవుతున్నది. రైతులు వచ్చే ఖరీఫ్‌లో సాగు చేసే ప్రధాన పంటకు చీడపీడల బెడద తక్కువగా ఉండాలన్నా, భూసారం పెరగాలన్నా.. ఇప్పుడే పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలి. ఏ జనుమో, జీలుగో వేస్తే చాలదు.. ముప్పై పంటల విత్తనాలను చల్లేయాలి అంటున్నది ఏపీ రైతు సాధికార సంస్థ. మిత్ర పురుగులే రైతుల సైన్యం ప్రకృతి సేద్యం దిగుబడి సాధించటంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు కూడా నెరవేరుతున్నాయి. జీవవైవిధ్యం. ఒకే పంట వేయటం కాదు. అనేక పంటలు కలిపి సాగు చేయటం అనేది ప్రకృతి సేద్యంలో ఓ ముఖ్యమైన మూలసూత్రం. బహుళ పంటలు ఉన్న పొలంలో పురుగులు గానీ, తెగుళ్లుగానీ అదుపులో ఉంటాయి. రకరకాల పంటలున్న చేనులో అనేక రకాల మిత్ర పురుగులు మనుగడ సాధ్యపడుతుంది. రసాయనిక పురుగుమందులు వాడే పొలాల్లో శత్రు పురుగులతో పాటు ఈ మిత్ర పురుగులు కూడా నాశనమవుతాయి. కాబట్టి, చీడపీడలు ఉధృతం అవుతున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో మిత్ర పురుగులే రైతుల సైన్యం. ప్రకృతి సేద్యం చేయటంతోపాటు.. ఏడాది పొడవునా ఇటువంటి బహుళ పంటలతో భూమిని కప్పి ఉంచితే (365 డేస్ గ్రీన్ కవర్) ఇంకా మంచిది. ఈ పద్ధతులు పాటించే ప్రకృతి సేద్య క్షేత్రాల్లో చీడపీడల సమస్య చాలా తక్కువగా కనిపిస్తోందని ఏపీ రైతు సాధికార సంస్థ తెలిపింది. ముఖ్యంగా, కత్తెర పురుగు, నల్లతామర వంటి పురుగుల విషయంలో ఇది ప్రస్ఫుటంగా నమోదైంది. 90% తగ్గిన కత్తెర పురుగు విజయనగరం, ప.గో., గుంటూరు జిల్లాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న 49 ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, మరో 49 రసాయనిక వ్యవసాయ క్షేత్రాల్లో కత్తెర పురుగు తీవ్రతపై ఏపీ రైతు సాధికార సంస్థ అధ్యయనం చేసింది. కత్తెర పురుగు తీవ్రత పురుగుమందులు చల్లిన పొలాల్లో 5% మాత్రమే తగ్గితే, ప్రకృతి సేద్య పొలాల్లో 90% తగ్గిందని ఈ అధ్యయనంలో తేలింది. నల్ల తామర: ఇక్కడ 9.87% అక్కడ 57% లక్షల ఎకరాల్లో మిరప పంటకు గతంలో నష్టం కలిగింది. రసాయనిక పురుగుమందులు ఎన్ని వాడినా నల్లతామర తగ్గలేదు. కానీ ప్రకృతి వ్యవసాయంలో నియంత్రణలోకి వచ్చింది. ఏపీ రైతుసాధికార సంస్థ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని 70 ప్రకృతి వ్యవసాయ మిరప తోటల్లో, 73 రసాయనిక మిరప తోటల్లో అధ్యయనం చేసింది. నల్లతామర కలిగించిన నష్టం ప్రకృతి సేద్య మిరప పొలాల్లో 9.87% కాగా, రసాయనిక మిరప పొలాల్లో 57.53% వరకు ఉందని గుర్తించారు. ప్రకృతిసేద్యం చేస్తున్న మిరప పొలాల్లో అక్షింతల పురుగులు, క్రైసోపెర్ల అనే రెక్కల పురుగులు వంటి మిత్ర పురుగులు విస్తారంగా నల్లతామర పురుగుల్ని తింటూ నియంత్రించినట్లు కనుగొన్నారు. రసాయనిక పురుగుమందులు చల్లే మిరప పొలాల్లో ఇవి కనిపించలేదు. పంటలకొద్దీ మిత్రపురుగులు పీఎండీఎస్లో నవధాన్య పంటలుగా ఎన్ని ఎక్కువ పంటలు సాగు చేస్తే ఆ తర్వాత సీజన్లో మిత్రపురుగుల సంఖ్య ఎక్కువగా ఉండి చీడపీడల బెడద తగ్గినట్లు రైతు సాధికార సంస్థ గుర్తించింది. వేర్వేరు జిల్లాల్లో కొన్ని పొలాల్లో 27 రకాలు, మరికొన్ని పొలాల్లో 19 రకాలు, ఇంకొన్ని పొలాల్లో 9 రకాల నవధాన్య పంటలను సాగు చేయించారు. 9,19 రకాలు సాగు చేసిన పొలాల్లో కన్నా 27 రకాలు సాగు చేసిన పొలాల్లో మిత్ర పురుగుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఎన్ని ఎక్కువ పంటలు సాగు చేస్తే అన్ని ఎక్కువ మిత్రపురుగులుంటాయి. పీఎండీఎస్‌తో తగ్గుతున్న చీడపీడల తీవ్రత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా వానకు ముందే 30 రకాల ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు తదితర పంటల విత్తనాలను (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్– పీఎండీఎస్) వానకు ముందే విత్తితే.. భూమి సారవంతం అవుతుంది. భూమి తేమగా ఉంటే నేరుగా విత్తనాలు వేస్తున్నారు. తేమ లేకపోతే విత్తనాలకు మట్టి, ఘనజీవామృతం తదితరాలను పట్టించి ‘విత్తన గుళికలు’ (సీడ్ పెల్లెట్స్) తయారు చేసి వేసవిలోనే వానకు ముందే విత్తుతున్నారు. ఇది ఏపీలో ముఖ్యంగా అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రకృతి వ్యవసాయదారులు అనుసరిస్తున్న వినూత్న ఆవిష్కరణ. ఈ ఏడాది ఇతర జిల్లాల్లో కూడా ఈ పద్ధతిని రైతులకు ఆర్బీకేల ద్వారా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు పరిచయం చేస్తున్నారు. వరుసగా రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు వేసవిలో 30 రకాల పీఎండీఎస్ పంటలు పండించిన పొలాల్లో ఆ తర్వాత సీజన్లో సాగు చేసిన 123 క్షేత్రాల్లో చీడపీడల బెడదపై అధ్యయనం చేశారు. మూడేళ్లుగా వేసవిలో పీఎండీఎస్ పంటలు సాగు చేసిన పొలాల్లో అన్ని రకాల చీడపీడల బెడద రసాయనిక పొలాలతో పోల్చినప్పుడు 66 శాతం తగ్గిపోయినట్లు గుర్తించటం విశేషం. రైతు దేవుళ్ల చేతుల్లోనే భవిత! 50–60 ఏళ్ల విషపూరిత వ్యవసాయం వల్ల మన భూములు, వాతావరణం, గాలి, నీరు నాశనమయ్యాయి. క్లైమెట్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ఆరో ప్రళయం రాబోతోంది. పోషకార/ఆహార భద్రతకూ ముప్పు రానుంది. దీని నుంచి రక్షించగల శక్తి ఒక్క రైతు చేతులోనే ఉంది. రసాయనిక వ్యవసాయం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు యావత్తు భూగోళాన్ని చల్లబరిచే శక్తి కూడా ప్రకృతి/పునరజ్జీవ వ్యవసాయానికి ఉంది. రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయటంతో పాటు.. 30 రకాల నవధాన్య (పీఎండీఎస్) పంటల సాగును వేసవిలో, పంట సీజన్లకు మధ్యలో ప్రతి పొలంలోనూ సాగు చేయాలి. ఇన్ని పంటలు ఎందుకంటే ప్రతి పంట మొక్క వేర్ల దగ్గర వేర్వేరు రకాల మేలు చేసే సూక్ష్మజీవరాశి పెరుగుతోంది. ఎన్ని ఎక్కువ పంటలు వేస్తే అన్ని ఎక్కువ రకాల సూక్ష్మజీవరాశి తిరిగి భూమిలోకి చేరుతున్నది. మట్టిలో సూక్ష్మజీవుల వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే మన భూమి అంత సారవంతమవుతోంది. అంత శక్తివంతమవుతోంది. అంతగా చీడపీడల బెడద తగ్గుతుంది. కరువును, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడి 20–30% అధిక దిగుబడులు వస్తున్నాయి. ప్రతి పొలంలో పీఎండీఎస్ పంటలు సాగు చేయాలి. వాన నీరు పూర్తిగా పొలాల్లో ఎక్కడికక్కడే పూర్తిగా ఇంకుతుంది. ఇది అనంతపురం రైతు దేవుళ్ల అద్భుత ఆవిష్కరణ. ఈ ఏడాది ఏపీలో ఇతర జిల్లాల్లో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. 10 వేల మంది రైతులను మాస్టర్ ట్రైనర్లుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. అనేక ఇతర రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి. – టి. విజయకుమార్, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ చిరుధాన్యాల శుద్ధి, విలువ జోడింపు, మార్కెటింగ్‌పై ఈ నెల 18–19 తేదీల్లో పులివెందులలోని ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఆవరణలో ఔత్సాహికులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (ఐఐపిఎం) శిక్షణ ఇవ్వనుందని లైవ్లిహుడ్ ఇంక్యుబేషన్ సెంటర్ కోర్సు డైరెక్టర్ డా. నబీరసూల్ తెలిపారు. ఎఫ్.పి.ఓలు, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, చిరుధాన్యాల వ్యాపారులు, గ్రామీణ యువతకు ఇది ఉపయోగకరం. భోజన వసతి సదుపాయాలు ఉన్నాయి. ఫీజు రూ. 5 వేలు. వివరాలకు.. డా. నబీరసూల్ – 630297 72210 -పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ప్రకృతిని, ఆవులను నమ్ముకున్నారు.. 40 సెంట్లు.. రూ.3 లక్షలు!
ఈ రైతు దంపతులు ప్రకృతిని, తనకున్న రెండు ఆవులను నమ్ముకున్నారు.. పేడ, గోమూత్రంతో ఘనజీవామృతం, జీవామృతాలను తయారు చేసుకొని ఏడేళ్లుగా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.. వీరి స్వయం కృషికి పంచభూతాలు సాయం చేస్తున్నాయి. మామిడి తోట మధ్యలో 40 సెంట్లలో ఫిబ్రవరి నుంచి అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ ప్రతి వారం మంచి ఆదాయం పొందుతున్నారు. అందుకే దీన్ని ‘ఏటీఎం నమూనా’గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రూ. 1,20,000 ఆదాయం వచ్చింది. కేవలం ఈ అంతరపంటల ద్వారా మొత్తం రూ.3 లక్షలకు పైగా ఆదాయం పొందే అవకాశం ఉందంటున్న నారాయణ, పార్వతి దంపతుల కృషిపై ‘సాక్షి’ ఫోకస్.. స్వయంకృషితో పాటు ప్రకృతిని నమ్ముకుంటే రైతు సుభిక్షంగా ఉంటాడనడానికి హెచ్. నారాయణ, పార్వతి దంపతులే నిదర్శనం. వీరి స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామం. తమకున్న 3.70 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. అంతర పంటల్లోనూ మంచి ఆదాయం తమకున్న రెండు నాటు ఆవులను సంరక్షిస్తూ పేడ, గో మూత్రంతో ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం తయారు చేసుకొని పంటలకు వాడుతున్నారు. స్వయం కృషికి తోడుగా అతి తక్కువ పెట్టుబడితోనే మామిడిలో, అంతర పంటల్లోనూ మంచి ఆదాయం ఆర్జిస్తూ ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మామిడి తోటలోని 40 సెంట్ల స్థలాన్ని ఫిబ్రవరి 13న ఎంపిక చేసుకొని బోదెలు సిద్ధం చేసుకున్నారు. ఐదు వరసల్లో 5 రకాల పంటలను విత్తుకున్నారు. గోరుచిక్కుడు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, అలసంద, మొక్కజొన్నతో పాటు మెంతాకు, కొత్తిమీర, గోంగూర సాగు చేస్తున్నారు. బోరు నీటిని అందిస్తున్నారు. ఘనజీవామృతం వేస్తున్నందు వల్ల నీరు కూడా ఎక్కువ అవసరం రావటం లేదు. ఒక్క తడి ఇస్తే 15–20 రోజులు ఉంటుంది. కెమికల్ వేసిన పొలం అయితే ఐదారు రోజులకే నీరు మళ్లీ అడుగుతుంది. తోట పనులను నారాయణ, ఆయన భార్య కలసి చేసుకుంటున్నారు. ప్రతి శుక్రవారం మార్కెట్లో, ఇంటి దగ్గర కూరగాయలు అమ్ముతున్నారు. గోరుచిక్కుడు ద్వారా 30 వేలు ఇప్పటివరకు గోరుచిక్కుడు (చోలా కాయల) ద్వారా రూ.30 వేలు, ముల్లంగి ద్వారా రూ.50 వేలు, కొత్తిమీరలో రూ.20 వేలు, మెంతాకు, గోంగూరలలో మరో రూ.20 వేలు ఆదాయం వచ్చింది. ముల్లంగి, ఆకుకూరలు తీసేవి తీస్తూ ఉంటే మళ్లీ విత్తుతున్నారు. మొక్కజొన్న, అలసంద, క్యారెట్, బీట్రూట్ పంటలు మరో ఒకటిన్నర నెలల్లో చేతికొస్తాయి. క్యారెట్, బీట్రూట్ మంచి ధర పలుకుతాయని, మొత్తంగా 40 సెంట్లకు రూ.3 లక్షలకు పైగానే ఆదాయం వస్తుందని, ఇదంతా నికరాదాయమేనని నారాయణ ధీమాగా చెబుతున్నారు. రూ. 1,500లతో విత్తనాలు కొనటం తప్ప వేరే ఏ ఖర్చూ లేదన్నారు. రసాయనాలు వేయకుండా పంటలను పసిబిడ్డల్ని చూసుకున్నట్లు చూసుకుంటున్నామని నారాయణ చెప్పారు. అంతర పంటల ద్వారా నిరంతరం ఆదాయం వస్తోందని చెబుతూ.. ఇదే ఏటీఎం మోడల్ పంటల వల్ల లాభం అన్నారు. తనను చూసి తన పక్క పొలం రైతు కూడా 20 సెంట్లలో ఈ నమూనాలో పంటలు వేశాడన్నారు. క్లస్టర్లో మరో 25 మంది రైతులు వేశారన్నారు. మామిడిలోనూ మంచి ఆదాయం మామిడి పంటను కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే నారాయణ దంపతులు సాగు చేస్తున్నారు. ఘనజీవామృతం, జీవామృతాన్ని వినియోగిస్తూ మంచి దిగుబడి, ఆదాయం పొందుతున్నారు. గత ఏడాది మామిడి 8 టన్నుల దిగుబడి రాగా రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే 6 టన్నులు పంట కోత కోశారు. మరో 3 టన్నులు పంట చేతికొస్తుంది. మామిడి ద్వారా రూ.3 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని నారాయణ చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయని, రుచిగా ఉంటున్నాయని వినియోగదారులు సంతోషంగా మంచి ధరకు తీసుకుంటున్నారని నారాయణ, పార్వతి ఆనందంగా చెబుతున్నారు. వీరి పొలాన్ని ఇటీవల పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ బి.రాజశేఖర్, ఏపీ రైతు సాధికార సంçస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి తదితరులు సందర్శించి అభినందించారు. ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు నేను అయిష్టంగానే ప్రకృతి వ్యవసాయాన్ని ఏడేళ్ల క్రితం మొదలు పెట్టాను. డీపీఎం లక్ష్మానాయక్, మాస్టర్ ట్రైనర్ శివశంకర్ అన్ని విషయాలూ అర్థమయ్యేలా చెప్పి సహకరించారు. ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. పంటలకు ఎలాంటి తెగుళ్లు, వైరఃస్లు రాలేదు. పండ్ల తోటల్లో కూడా ఐదారు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే ఒకదాని తర్వాత ఒకటి మనకు పంట చేతికొస్తుంది. మంచి నికరాదాయం వస్తుంది. ఇది రైతులకు ఎంతో మేలైన పద్ధతి. భూమి కూడా గుల్లబారి బాగుంటుంది. వాన నీరు బాగా ఇంకుతుంది. సహజ సిద్ధమైన ఎరువులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు తింటే మనిషి ఆరోగ్యం కూడా బాగుంటుంది. నన్ను చూసి కొందరు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. – హెచ్.నారాయణ (95504 84675), ప్రకృతి వ్యవసాయదారుడు, మల్లాపురం గ్రా., కళ్యాణదుర్గం మం., అనంతపురం జిల్లా స్వయంగా చూస్తే గానీ నమ్మలేరు.. పది రకాల కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తూ అనంతపురం జిల్లాలో రైతులు సుమారు 400 మంది అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో అధికాదాయం పొందుతున్నారు. స్వయంగా వచ్చి చూస్తే గానీ ఇంత ఆదాయం వస్తున్నదని నమ్మకం కలగదు. నారాయణ, పార్వతి రైతు దంపతులు తమ మామిడి తోటలో 40 సెంట్లలో అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటికి రూ. 1,20,000 ఆదాయం వచ్చింది. మరో రెండు నెలల్లో ఈ ఆదాయం రూ. 3 లక్షలకు పెరుగుతుందని రైతు ధీమాగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గౌతమి, ఏపీ రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ టి. విజయకుమార్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ బి.రాజశేఖర్ కూడా ఇటీవల నారాయణ తోటను సందర్శించారు. అంత ఆదాయాన్ని పొందే అవకాశాలు ప్రకృతి వ్యవసాయంలో ఉన్నాయన్నది ఈ తోటలను స్వయంగా చూసిన వారికి అర్థం అవుతుంది. వారానికి రెండు, మూడు సార్లు కూరగాయలను విక్రయిస్తూ నిరంతరం ఆదాయం పొందుతున్నారు. అందువల్లనే ఈ నమూనాను ‘ఏటీఎం మోడల్’ అని పిలుస్తున్నాం. – లక్ష్మానాయక్ (83310 57583), ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్, అనంతపురం జిల్లా - ఈదుల శ్రీనివాసులు, సాక్షి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా -
సేంద్రీయ వ్యవసాయంపై అక్షయ్ కుమార్,వీరేంద్ర సెహ్వాగ్ పెట్టుబడులు!
సేంద్రీయ ఎరువులతో సేంద్రీయ పద్దతులతో పండించే పంటనే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఇప్పుడీ ఆర్గానిక్ ఫార్మింగ్‌పై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్,టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు కోట్లలో పెట్టుబడులు పెట్టారు. టూబ్రదర్స్ ఆర్గానిక్ ఫార్మ్స్ (టీబీఓఎఫ్) అనే స్టార్టప్ సంస్థ ఫండింగ్ రౌండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా..అందరికీ మెరుగైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం టూబ్రదర్స్ ఆర్గానిక్ ఫార్మ్స్ (టీబీఓఎఫ్) ప్రయాణంలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సేంద్రీయ వ్యవసాయం ద్వారా గ్రామీణ వర్గాల సాధికారత కోసం సంస్థ దృష్టి ,నిబద్ధతను నమ్ముతున్నాను" అని అక్షయ్ కుమార్ అన్నారు. ఆరోగ్యకరమైన సేంద్రీయ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, గ్రామీణ రంగాన్ని అభివృద్ధి చేయడంపై కంపెనీ బలమైన ప్రాధాన్యత కారణంగా తాను tbofలో పెట్టుబడి పెట్టానని ఆయన పేర్కొన్నారు. రైతులు, సమాజంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించే దిశగా సంస్థ నిబద్ధత తనను ప్రేరేపించిందని కాబట్టే పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైనట్లు వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. -
మలేసియాలో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి: రారాజులా లాభాల పంట
విదేశంలో ఉద్యోగం.. ఐదెంకల ఐటీ ఉద్యోగం. అయినా ఇవేవీ సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకే లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి తనకెంతో ఇష్టమైన రైతుగా మారి పోయాడు. మలేషియాలో ఉద్యోగానికి బైబై చెప్పేసి ఆర్గానిక్ ఫామింగ్ (సేంద్రీయ వ్యవసాయం) ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు. ఒడిశాలోని రాయగడ జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సత్య ప్రబిన్ వినూత్న వ్యవసాయ పద్ధతులతో విజయం సాధించి సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాడు. బీటెక్ పూర్తి చేసిన సత్య, మలేషియా ఐటీ కంపెనీలో టెకీగా 11 ఏళ్లు పని చేశాడు. నెలకు రూ.2 లక్షల వేతనం సౌకర్య వంతమైన జీవితం. అయినా అతనికి వ్యవసాయం మీద ఉన్న మక్కువ పోలేదు. ముఖ్యంగా తన చిన్నతనంలో తండ్రి జీవనోపాధి కోసం కూరగాయలు పండించేవారు. అది అతని మనసులో ఎపుడూ మెదులుతూ ఉండేది. వన్ ఫైన్ మార్నింగ్ ఇక ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి వెళ్లి వ్యవసాయాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయ కుండా చకచకా పనులన్నీ చక్క బెట్టుకుని తనకున్న అభిరుచుని నెరవేర్చుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు. 2020లో సొంత గ్రామానికి వచ్చేసి 34 ఎకరాల భూమిలో డ్రిప్ సిస్టమ్, సేంద్రీయ ఎరువులు వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం ప్రారంభించాడు. అంతే నమ్ముకున్న భూమి అతనికి గొప్ప విజయాన్ని అందించింది. సేంద్రీయ పద్ధతుల్లో భూమి సారాన్ని కాపాడుకుంటూ, వ్యవసాయంలో చక్కటి ఫలాలను అందుకుంటూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచాడు. సంకల్పం, పట్టుదల, వ్యవసాయంపై మక్కువతో కష్టపడి పనిచేస్తే విజయం తప్పక వరిస్తుందని ఆయన చేసి చూపించాడు. రైతుగా సత్య సాధించిన విజయాలు సమాజంలోని ఇతరులకు ఆదర్శంగా నిలవడమే కాదు ఆయన వ్యవసాయ విధానం అద్వితీయంగా, వినూత్నంగా ఉండడంతో స్థానికుల అభిమానాన్ని, అధికారుల దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు తన గ్రామం, చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 60 మందిని ఎంచుకుని వ్యవసాయాన్ని ముందుకు నడిపించాడు. తద్వారా అనేక కుటుంబాలకు అండగా నిలబడటమే కాదు, స్థానిక ఆర్థికవ్యవస్థకుగణనీయమైన ఎనలేని సహకారాన్ని అందించాడు. కలెక్టర్లు, ఇతర స్థానిక ఉ ఉన్నతాధికారులు పలువురి ప్రశంసలందుకున్నాడు. చుట్టుపక్కల సన్నకారు రైతులంతా సత్యను ఆదర్శంగా తీసుకుని సేంద్రియ ఎరువులతో తమ భూమిలో కూరగాయలు పండించి స్వయం సమృద్ధి సాధించి ఆర్థికస్థితిని మెరుగు పరుచుకోవాలని పిలుపునిచ్చారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో అందరి ఆరోగ్యానికి తోడ్పటమే కాదు, స్థానికి ఆర్థిక పరిపుష్టికి తన వంతు సాయం అందించడం విశేషంగా నిలిచింది. వ్యవసాయంలో రారాజుగా నిలవాలన్న ఆత్మవిశ్వాసమే ఆయనను ఈరోజు విజయ వంతమైన రైతుగా నిలబెట్టి, ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచింది. -
గ్రీన్ లైఫ్: అవును... మిద్దెలపై డబ్బులు కాస్తాయి!!
ఆరోజు మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొని ఇంటికి తీసుకువచ్చింది కేరళలోని కొట్టాయంకు చెందిన రెమాదేవి. కూరగాయలను కడుగుతున్నప్పుడు ఒకరకమైన రసాయనాల వాసన వచ్చింది. ఆ సమయంలో పిల్లలు, వారి భవిష్యత్ గుర్తుకు వచ్చింది. అదే సమయంలో తాను ఒక నిర్ణయం తీసుకుంది... ‘ఇంటికి అవసరమైన కూరగాయలు ఇంటిదగ్గరే పండించుకుంటాను’ అలా మిద్దెతోటకు శ్రీకారం చుట్టింది రెమాదేవి. అమ్మమ్మ రంగంలోకి దిగింది. సేంద్రియ వ్యవసాయంలో అమ్మమ్మది అందెవేసిన చేయి. ఆమె సలహాలు, సూచనలతో మిద్దెతోట పచ్చగా ఊపిరిపోసుకుంది. కొంత కాలానికి... ఇంటి అవసరాలకు పోగా మిగిలిన కూరగాయలను అమ్మడం మొదలుపెట్టారు. తమకు ఉన్న మరో రెండు ఇండ్లలోనూ మిద్దెతోట మొదలుపెట్టింది రెమాదేవి. అలా ఆదాయం పెరుగుతూ పోయింది. మిద్దెతోటపై ఆసక్తి ఉన్న వాళ్లు రెమాను రకరకాల సలహాలు అడిగేవారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ‘రెమాస్ టెర్రస్ గార్డెన్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. ‘మిద్దెతోటకు పెద్దగా ఖర్చు అక్కర్లేదు’ అని చెబుతూ ఆ తోటపెంపకానికి సంబంధించిన ఎన్నో విషయాలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెబుతుంది. వంటగది వ్యర్థాలతో మనకు కావల్సిన ఎరువులు ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోల ద్వారా చూపుతుంది. దీంతోపాటు సోషల్ మీడియా ఫార్మింగ్ గ్రూప్స్ ద్వారా విత్తనాలు అమ్ముతుంది రెమాదేవి. కేవలం విత్తనాల అమ్మకం ద్వారానే నెలకు 60,000 రూపాయల ఆదాయం అర్జిస్తుంది. రెమాదేవిని అనుసరించి ఎంతోమంది మిద్దెతోటలను మొదలుపెట్టి రసాయన–రహిత కూరగాయలను పండించడమే కాదు, తగిన ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు. మంచి విషయమే కదా! -
ఊరంతా బాగుండాలి.. అందులో నేనుండాలి! ఎమ్మే బీఈడీ చదివి ఇప్పుడిలా..
ఎమ్మే బీఈడీ చదివినా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ.. ఎకరం కౌలు పొలంలో 20 రకాలకుపైగా కూరగాయల సాగు.. గ్రామస్తులకు, స్కూలు పిల్లల మధ్యాహ్న భోజనానికి కూరగాయలు సరఫరా.. తిరుపతి జిల్లా ఎస్బీఆర్ పురం వాసి కోనేటి శైలజ ఆదర్శ సేద్యం ఎమ్మే బీఈడీ చదివినా ఉద్యోగం కోసం ఎదురు చూడలేదు. తన కుటుంబంతో పాటు... గ్రామంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. ఎకరం భూమిని లీజుకు తీసుకొని అందులో 20 రకాలకుపైగా కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. పండించిన పంటను మార్కెట్లో విక్రయించకుండా... తన ఊర్లో వారికి, అంగన్వాడీ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కోనేటి శైలజ. శైలజ స్వస్థలం తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం గ్రామం. పుట్టినిల్లు.. మెట్టినిల్లు కూడా అదే ఊరు. అందరూ వ్యవసాయంపై ఆధారపడ్డవారే. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ, ప్రైవేటు కాలేజ్‌లో బీఈడీ పూర్తి చేశారు. వ్యవసాయదారుడు మాధవ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సొంత భూమిలో మామిడి తోట సాగులో ఉంది. ఏపీ రైతు సాధికార సంస్థ ప్రోత్సాహంతో శైలజ ప్రకృతి సేద్యంలో కూరగాయల సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలోనే ఎకరం భూమిని లీజుకు తీసుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో 20 రకాల కూరగాయల సాగు ప్రారంభించారు. ఇప్పటివరకు పెట్టిన ఖర్చు రూ.13,500 చేశారు. శైలజ తోటలో కిలో పచ్చిమిర్చి రూ. 60, క్యారెట్, బీట్రూట్ రూ. 50, టొమాటో, వంగ, బెండ, గోరుచిక్కుడు, కాకర, అలసంద రూ. 40, ముల్లంగి (కట్ట) రూ.15, గోంగూర(కట్ట) రూ. 10 చొప్పున అమ్ముతున్నారు. మొన్నటి వరకు రూ.17,500 ఆదాయం వచ్చింది. ఏడాది పొడవునా రోజూ కూరగాయలను ప్రజలకు అందించాలన్నదే తన లక్ష్యమని శైలజ వివరించారు. మధ్యాహ్న భోజనంలో ఇవే కూరలు శైలజ పండించే కూరగాయలను గ్రామస్తులకే విక్రయిస్తున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ, ప్రాథమిక, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్నారు. ఘనజీవామృతం, ఆవు పేడ, పంచితం, మజ్జిగతో కషాయాలను తయారు చేసి పంటలకు ఉపయోగిస్తుండటాన్ని గ్రామస్తులు ఆసక్తిగా చూస్తుంటారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను రైతు సాధికర సంస్థ సిబ్బంది, శైలజ, ఆమె భర్త మాధవ వర్మ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది కూరగాయలు కొంటున్నారు. అంగన్వాడీ పిల్లలు, స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే కూరగాయలు కూడా శైలజ పండిస్తున్నవే. ‘శైలజ పండించిన కూరగాయలను ధర కాస్త ఎక్కువైనా కొని వాడుతున్నా. పిల్లలు కూరలు రుచిగా ఉన్నాయని చెబుతుంటే సంతోషంగా ఉందంటున్నారు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు పూర్ణ. గ్రామస్తులు, స్కూలు పిల్లల కోసమే! ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నేను పండించే కూరగాయలు తిని మా ఊరివాళ్లంతా ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు. ప్రస్తుతం నేను పండించే కూరగాయలు మా ఊరి వాళ్లకే సరిపోతున్నాయి. గ్రామస్తులు, స్కూలు పిల్లల తరువాతే ఎవరికైనా. ఏడాది పొడవునా కూరగాయలు పండించి ఇవ్వాలన్నదే నా తపన. – కోనేటి శైలజ, (9912197746),ఎస్బీఆర్ పురం, వడమాలపేట మం., తిరుపతి జిల్లా కొసమెరుపు: గ్రామానికి చెందిన వెంకట్రామరాజు శైలజ పండించే కూరగాయలను కొనుగోలు చేసి చెన్నైలో ఉంటున్న తన కుమారుడు డాక్టర్ రామకృష్ణంరాజుకు వారానికి ఒక రోజు పంపుతుండటం మరో విశేషం. – తిరుమల రవిరెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి. ఫొటోలు: కేతారి మోహన్‌కృష్ణ నిర్వహణ: పంతంగి రాంబాబు చదవండి: BCCI: వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసం.. తగునా? -
సేంద్రియ సాగుబాట.. దేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్‌వైపు రైతుల అడుగులు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయం.. ఇప్పుడు ఈ పదం పంటల సాగులో ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకాలం అధిక దిగుబడి ఆశతో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడిన రైతులు దానివల్ల భూమి నిస్సారంగా మారడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితమవడం, పురుగుమందుల అవశేషాలున్న పంట ఉత్పత్తులను ఆహారంగా వినియోగిస్తూ ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారని క్రమంగా గుర్తిస్తున్నారు. నెమ్మదిగా మళ్లీ సేంద్రియ సాగువైపు మళ్లుతున్నారు. బుడిబుడి అడుగులు.. దేశంలో ప్రస్తుతం 39.4 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. అందులో వ్యవసాయం చేస్తున్న భూమి 21.5 కోట్ల ఎకరాలు ఉంది. ఇందులో 66 లక్షల ఎకరాల్లో మాత్రమే సర్టిఫైడ్ ఆర్గానిక్ సాగు జరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే పూర్తి సాగు విస్తీర్ణంలో సేంద్రియ సాగు కేవలం 3.24 శాతమేనన్నమాట. అయినప్పటికీ గత కొన్నేళ్లతో పోలిస్తే సేంద్రియ సాగు దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయని అర్థమవుతోంది. సర్టిఫికేషన్ లేకుండా సేంద్రియ సాగు చేస్తున్న రైతులు కూడా ఉన్నారు. ఈ విస్తీర్ణం దాదాపు సర్టిఫైడ్ సేంద్రియ సాగు కంటే ఏడెనిమిది రెట్లు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆదర్శంగా సిక్కిం.. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన సిక్కిం చిన్న రాష్ట్రమే అయినా.. సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఆ రాష్ట్ర రైతులకు ప్రోత్సాహకాలు కల్పించడంలో అక్కడి ప్రభుత్వం ముందంజలో ఉండడమేకాక... వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే యత్నం చేస్తోంది. దేశంలో మొట్టమొదటి పూర్తి సేంద్రియ సాగు (ఆర్గానిక్ ఫామింగ్) సర్టిఫికేషన్ పొందిన రాష్ట్రం కూడా సిక్కిం ఒక్కటే కావడం విశేషం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయ రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా ప్రధాన దేవాలయాలకు సరఫరా చేసే ఆహారపదార్థాలను సేంద్రియ సాగు ద్వారా పండించినవే వినియోగించేలా ముందుకు సాగుతోంది. మధ్యప్రదేశ్ అగ్రస్థానం.. సేంద్రియ సాగుపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ప్రస్తుతం విస్తీర్ణపరంగా చూస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏపీ సైతం గత రెండేళ్లుగా దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోంది. భారీగా రైతులు సేంద్రియ సాగువైపు మళ్లేలా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఏపీలో దాదాపు 10 శాతం మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆరేడు లక్షల ఎకరాల వరకు సేంద్రియ సాగు జరుగుతున్నట్లు అంచనా. సేంద్రీయ వ్యవసాయంలో అనుభవం గడించిన వారితోనే మిగిలిన రైతాంగానికి శిక్షణ ఇప్పిస్తుండటంతో రైతులు ఆకర్షితులు అవుతున్నారు. గుజరాత్, హరియాణా కూడా సేంద్రియం వైపు వడివడిగా అడుగులేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు తమ దగ్గర సాగైన సేంద్రియ పంటలను విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. సేంద్రియ ఉత్పత్తుల విలువ రూ.14,800 కోట్లు దేశంలో సాగవుతున్న సేంద్రియ ఉత్పత్తుల మొత్తం విలువ రూ.14,800 కోట్లు. ఇందులో విదేశాలకు దాదాపు రూ.11,500 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా.. రూ.2వేల కోట్ల విలువైన ఉత్పత్తులు రిటైల్ మార్కెట్లకు వెళుతున్నాయి. మిగిలిన ఉత్పత్తులను రైతులు నేరుగా విక్రయించుకుంటున్నారు. ఎందుకు ఈ సేంద్రియం..? సేంద్రియ సాగుతో ప్రధానంగా రైతులు చేసే వ్యయం గణనీయంగా తగ్గుతుంది. సంప్రదాయ వ్యవసాయంతో వచ్చే ఆదాయం కంటే కూడా సేంద్రియ వ్యవసాయంతో లాభాలు ఎక్కువ. దీనికితోడు పొలాలు సారవంతం కావడం, భూగర్భ జలాలు కలుషితం కావు. సేంద్రియ సాగుతో అటు ప్రకృతికి, ఇటు ప్రజలకు మేలు జరుగుతుంది. అయితే దేశంలోని రైతులంతా సేంద్రియ సాగు బాట పట్టేలా అడుగులేయడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వాలు కూడా సేంద్రియ సాగు వైపు రైతులను మళ్లించడానికి వీలుగా తగిన ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉంది. రైతుకు నమ్మకం కలిగిస్తున్నాం.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయంపై నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాం. 2030–31 నాటికి రాష్ట్రంలోని రైతులంతా ప్రకృతి సాగు వైపు మళ్లించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రైతు భరోసా కేంద్రాలే ప్రకృతి సాగుపై శిక్షణ ఇచ్చే కార్యాలయాలు. రైతులు ఒకేసారి మారాలంటే మారరు. అందుకు ఓపికగా వారిని మార్చడానికి ప్రయత్నించాలని సీఎం జగన్మోహన్రెడ్డి చెబుతున్నారు. అలా రైతులను ఒప్పించడం వల్లే 10 శాతం మంది సేంద్రియ సాగువైపు మళ్లారు. సాధారణ ఉత్పత్తుల కంటే ఆర్గానిక్ ఉత్పత్తులకు 10 శాతం అధిక ధరలు లభిస్తున్నాయి. మధ్యప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల నుంచి రైతులు ఏపీలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడానికి వస్తున్నారు. – విజయ్‌కుమార్ ఐఏఎస్, ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ప్రపంచంలోనే ఎక్కువ మంది రైతులు మన దగ్గరే.. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వారిలో ప్రపంచంలో అత్యధిక రైతులు భారత్‌లోనే ఉన్నారు. వారికి సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే ఎక్కువ మంది ఈ సాగుపట్ల మొగ్గు చూపుతారు. ప్రభుత్వాలు దీనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. సేంద్రియ సాగు సర్టిఫికేషన్‌పై రైతుల్లో ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – సీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
రోజుకు రూ. 1500.. ఎకరంన్నరలో ఏటా 4 లక్షలు! ఇలా చేస్తే లాభాలే!
ఏదో ఒక పంట సాగుపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఆదాయపరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటాయి. ముఖ్యంగా, ఎకరం, రెండెకరాల భూమి మాత్రమే కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఏక పంటల సాగుతో తగినంత ఆదాయం పొందలేక అప్పుల పాలవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ దుస్థితి నుంచి రైతులు బయటపడాలంటే సమీకృత సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం. సమీకృత సేద్యం అంటే.. చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చెయ్యటం అన్నమాట. నిరంతర ఆదాయం వచ్చేలా సమీకృత సేంద్రియ సేద్యం చేపట్టి.. నిరంతరం ఆదాయం పొందే మార్గాలను ఆచరించి చూపుతున్నారు సూర్యాపేట జిల్లాకు చెందిన రైతు దంపతులు వాసికర్ల శేషుకుమార్, లక్ష్మీప్రియ. ఎమ్మే చదువుకొని రెక్కల కష్టాన్ని నమ్ముకునే చిన్న, సన్నకారు రైతు దంపతులకు ఏడాది పొడవునా అనుదినం ఆదాయాన్ని అందించే విధంగా సమీకృత సేంద్రియ సేద్య పద్ధతులను విజయవంతంగా ఆచరించి చూపిస్తున్నారు వాసికర్ల శేషుకుమార్(53), లక్ష్మీప్రియ దంపతులు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన శేషుకుమార్(53) ఎమ్మే చదువుకొని గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. అభ్యుదయ భావాలు కలిగిన ఆయన 25 ఎకరాల్లో డ్రమ్‌సీడర్, వెద పద్ధతుల్లో వరి పండిస్తున్నారు. నాగార్జునసాగర్ కాల్వ పక్కనే పొలం ఉండటంతో సాగు నీటికి దిగులు లేదు. వరి సాగు నష్టదాయకంగా పరిణమిస్తున్న నేపథ్యంలో వరికి బదులుగా.. కాయకష్టం చేసే రైతు కుటుంబాలకు రోజూ ఆదాయాన్నిచ్చే సమీకృత సేంద్రియ వ్యవసాయ నమూనా వైపు ఏడాదిన్నర క్రితం దృష్టి సారించారు. నాలుగు రకాలుగా నిరంతరం ఆదాయం పొందటమే ఎకరంన్నర విస్తీర్ణంలో సమీకృత సేంద్రియ సేద్యం చేపట్టారు. ఈ క్షేత్రం ప్రదర్శన క్షేత్రంగా, రైతులకు శిక్షణా కేంద్రంగా మారింది. శేషు అనుసరిస్తున్న సమీకృత సేంద్రియ సేద్య నమూనా రైతులను ఆకర్షిస్తోంది. కూరగాయలు, పశుగ్రాస పంటలతో పాటు దీర్ఘకాలిక పండ్ల చెట్లను పూర్తి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. దీనితో పాటు.. మేకలు గొర్రెలు, నాటుకోళ్లు, పుట్టగొడుగులు, ముత్యాల పెంపకాన్ని చేపట్టి ఒకటికి నాలుగు రకాలుగా నిరంతరం ఆదాయం పొందటమే ఈ నమూనాలో ప్రత్యేకత. 5 వేల ఆల్చిప్పల్లో ముత్యాల సాగు ఎకరంన్నరలో మొదట గొర్రెలు, మేకలు పెంచేందుకు ప్రత్యేకంగా ఎలివేటెడ్ షెడ్‌ను రూ. 5 లక్షల ఖర్చుతో నిర్మించారు. షెడ్ పైఅంతస్థులో మేకలు, గొర్రెలు పెరుగుతూ ఉంటే.. షెడ్ కింద కొంత భాగంలో నాటు కోళ్ళ పెంపకకానికి శ్రీకారం చుట్టారు. షెడ్ కింద మిగతా భాగంలో ఒక డార్క్ రూమ్‌ను నిర్మించి పాల పుట్టగొడుగుల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. 3 సిమెంటు ట్యాంకులు నిర్మించి స్థానికంగా సేకరించిన 5 వేల ఆల్చిప్పల్లో 3 నెలల క్రితం ముత్యాల సాగు ప్రారంభించారు. వంగ, టమాటో, మిర్చి, బోడ కాకర.. ఇంకా.. ఈ సమీకృత వ్యవసాయం క్షేత్రం చుట్టూ ప్రత్యేకంగా కంచె ఏర్పాటు చేశారు. చుట్టూతా కొబ్బరి, డ్రాగన్‌ఫ్రూట్ తదితర దీర్ఘకాలిక పండ్ల మొక్కలు నాటారు. ప్లాస్టిక్ షీట్‌తో మల్చింగ్ చేసి.. బోడ కాకర, బీర, సొర, కాకర సాగు చేపట్టారు. వంగ, టమాటో, మిర్చి, బోడ కాకర, బీర, సొర, నేతి బీర, కాకర, పొట్ల, చిక్కుడు, మునగ, బంతి, గులాబీ తదితర రకాల పంటల సాగు చేపట్టారు. పశువుల కోసం నేపియర్, దశరధ గడ్డి, మొక్కజొన్న గడ్డిని పెంచుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడా చోటు వృథా కాకుండా అధిక సాంద్రతలో అనేక పంటలు, పండ్ల మొక్కలు నాటారు. ఈ క్షేత్రంలో ఎలాంటి రసాయనాలను ఉపయోగించటం లేదు. ఒకటికి నాలుగు దారుల్లో ఆదాయం పొందే సాగు పద్ధతిపై చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు స్ఫూర్తినిస్తున్న శేషుకుమార్ దంపతులు ధన్యులు. – మొలుగూరి గోపి, సాక్షి, నడిగూడెం, సూర్యాపేట జిల్లా చిన్న రైతులు నిత్యం ఆదాయం పొందాలి వరి పంట సాగులో పెట్టుబడులు బాగా పెరిగాయి. కూలీల కొరత ఇబ్బందిగా మారింది. దీంతో నిత్యం ఆదాయం పొందే విధంగా ఈ సమీకృత వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. తక్కువ భూమిలో విభిన్న రకాల పంటల సాగు చేపట్టాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికతో ముందుకువెళ్తున్నాం. – వాసికర్ల లక్ష్మీప్రియ, సమీకృత సేంద్రియ మహిళా రైతు, సిరిపురం, సూర్యాపేట జిల్లా సులువుగా సేంద్రియ పుట్టగొడుగుల పెంపకం సమీకృత వ్యయసాయ క్షేత్రంలో షెడ్డులో సేంద్రియ పద్ధతుల్లో పాల పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు. వరిగడ్డి ముక్కలను, మట్టిని ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి చేసి, పుట్టగొడుగుల పెంపకానికి పాలిథిన్ బ్యాగ్‌లను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పరిశుద్ధమైన 27 డిగ్రీల వాతావరణంలో గాలి, వెల్తురు తగలని చీకటి గదిలో జరుగుతుంది. బ్యాగ్‌లలో నింపిన గడ్డిపై మైసీలియం అనే శిలీంధ్రం అభివృద్ధి చెందిన తర్వాత బ్యాగ్‌లను మామూలు గదిలోకి మార్చుతారు. వారం తర్వాత నుంచి పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది. వరిగడ్డి ముక్కలను స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్స్ సహాయంతో ఆవిరి ద్వారా శుద్ధి చేసే ప్రత్యేక పద్ధతిని శేషు అనుసరిస్తున్నారు. దీని వల్ల గడ్డి వెంటనే తడి ఆరిపోతుందన్నారు. ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకం సులభతరమైందని శేషు చెప్పారు. ముత్యాల సాగును ఒక్క రోజులో నేర్చుకోవచ్చు ఎకరంన్నరలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్న శేషుకుమార్ దంపతులు ప్రత్యేక షెడ్లో మూడు సిమెంటు ట్యాంకులను నిర్మించి ముత్యాల సాగు చేపట్టారు. దేవతా రూపాల్లో డిజైనర్ ముత్యాలైతే 14 నెలల్లో, ఎం.ఓ.పి. న్యూక్లియస్‌ల ద్వారా గుండ్రటి ముత్యాలైతే 18 నెలల్లో దిగుబడి వస్తుందన్నారు. ఒక ఆల్చిప్పకు రెండు ముత్యాలు వస్తాయి. నాణ్యతను బట్టి ధర ఉంటుంది. సగటున ధర రూ. 150–200 ఉంటుంది. ఒక రోజు శిక్షణతో మహిళలు కూడా ముత్యాల సాగును నేర్చుకోవచ్చు. చిన్న రైతులకు దారి చూపాలని.. భూమి తక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతు దంపతులు ఏదో ఒకే పంట సాగుపై ఆధారపడితే తగినంత ఆదాయం రాదు. సమీకృత సేంద్రియ సాగు చేపడితే రోజువారీగా మంచి ఆదాయం పొందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకని, ఎకరంన్నర పొలంలో ఈ క్షేత్రాన్ని రూపొందించాం. ఎకరంన్నర భూమిలో భార్య, భర్త స్వయంకృషి చేస్తే అన్ని ఖర్చులూ పోను రూ. 4 లక్షలకు పైగా నికరాదాయం వస్తోంది. ఈ సందేశం రైతులందరికీ తెలియజెప్పాలనేదే మా తపన. రోజుకు రూ.1,500 ఆదాయం వస్తున్నది. రెండు వేలకు పెంచాలనేది లక్ష్యం. ప్రతి రైతూ ముందుకు రావాలి. ప్రభుత్వం అవగాహన కల్పించాలి. – వాసికర్ల శేషుకుమార్ (91824 06310), సమీకృత సేంద్రియ రైతు, సిరిపురం, సూర్యాపేట జిల్లా చదవండి: నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల సాగు.. నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలివే! 70 ఎకరాలు 30 పంటలు.. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా -
నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలివే.. ఇలా చేశారంటే..
బెర్లిన్.. జర్మనీ రాజధాని నగరం. యూరోపియన్ యూనియన్లోకెల్లా జనసమ్మర్దం ఎక్కువగా ఉండే నగరం. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పంటలు సాగు చేసుకోవడానికి అనువైన కాలం. మిగతా నెలల్లో మంచుకురుస్తూంటుంది. అర్బన్ అగ్రికల్చర్ కార్యకలాపాల సంప్రదాయం బెర్లిన్ నగరానికి కొత్తేమీ కాదు. కమ్యూనిటీ గార్డెన్లు, కిచెన్ గార్డెన్లలో కూరగాయలు, పండ్ల సాగు సుదీర్ఘకాలంగా జరుగుతున్నదే. అయితే, నగరవాసులకు అవసరమైన కూరగాయలు మాత్రం ఎక్కడి నుంచో నగరానికి తరలించక తప్పటం లేదు. ఈ పరిస్థితిని మార్చలేమా? వ్యాపకంగా సాగుతున్న అర్బన్ అగ్రికల్చర్‌ను మరింత సీరియస్‌గా తీసుకొని ఖాళీ జాగాల్లో పండిస్తే నగర కూరగాయల అవసరాలు ఎంత మేరకు తీరుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో భాగంగా మొట్ట మొదటిసారిగా ఇటీవల సమగ్ర అధ్యయనం జరిగింది. బెర్లిన్ కూరగాయల వినియోగంలో 82 శాతం వరకు నగరంలోనే పండించుకోవచ్చని ఈ అధ్యయనంలో తేలింది! 200 కమ్యూనిటీ గార్డెన్లు.. పోట్స్‌డ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్‌లో పరిశోధకుడిగా ఉన్న డియెగో రిబ్స్కీ బృందం ఈ అధ్యయనం చేసింది. నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల సాగుకు పేదలకు కేటాయించిన తోటలు, భవనాలపై బల్లపరుపుగా ఉన్న పై కప్పులు, సూపర్ మార్కెట్ పార్కింగ్ స్థలాలతో పాటు మూసివేసిన శ్మశానవాటిక స్థలాల్లో ఎంత మేరకు కూరగాయలు సాగు చేయొచ్చో అధ్యయనం చేశారు. బెర్లిన్‌లో ఇప్పటికే 200 కంటే ఎక్కువ కమ్యూనిటీ గార్డెన్లు ఉన్నాయి. పేదలు కూరగాయలు పండించుకోవడానికి ప్రభుత్వ స్థలాల్లో కేటాయించిన చిన్న ప్లాట్లు 73,000 కంటే ఎక్కువగానే ఉన్నాయి. వీటికి తోడుగా, భవనాల పైకప్పులు, నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, పెద్ద గృహ సముదాయాల మధ్య పచ్చటి ప్రదేశాలలో కూడా కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే గొప్ప అవకాశం ఉందని ఈ అధ్యయనం ద్వారా గుర్తించారు. కార్ల సంఖ్యను తగ్గించే ప్రణాళికలు రచిస్తున్నందున పార్కింగ్ స్థలాలను కూడా కూరగాయలు పండించడానికి ఉపయోగించుకోవచ్చని రిబ్స్కీ అన్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ కూరగాయలు.. బెర్లిన్‌లోని మొత్తం 4,154 హెక్టార్లలో కూరగాయలు పండించవచ్చని అధ్యయనంలో తేలింది. నగర వైశాల్యంలో ఇది దాదాపు 5 శాతం. ఈ భూమి మొత్తంలో కూరగాయలు పండిస్తే బెర్లిన్ కూరగాయల డిమాండ్‌లో 82 శాతం స్థానికంగా తీరిపోతుందని రబ్స్కీ పేర్కొన్నారు. అయితే, ఈ కల సాకారమవ్వాలంటే నీరు, మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 75.3 కోట్ల యూరోల పెట్టుబడి అవసరం. వినటానికి అంతా డబ్బా అనిపిస్తుంది గానీ.. 2020వ సంవత్సరంలో బెర్లిన్ స్థూల దేశీయోత్పత్తిలో ఇది దాదాపు 0.5 శాతం మాత్రమే. సవాళ్లు అనేకం.. నగరంలో తోట పనిని ప్రోత్సహించి ఈ కలను సాకారం చేయాలంటే అధిగమించాల్సిన సవాళ్లు తక్కువేమీ కాదు. ‘స్థలం ఉంది, కానీ ఇంకా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, తోట పనిని ఎవరు చేయబోతున్నారు? ప్రైవేట్ తోటమాలులను నియమించి సాగు చేయిస్తామా? లేదా వ్యాపార నమూనా అవసరమా? పేదలకు కేటాయించిన తోటల్లో ఉత్పత్తిని పెంచగలమా? నగరంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఎటువంటి పరిస్థితులను సృష్టించగలం? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి ఉంటుందని అధ్యయనకారులు అంటున్నారు. ‘స్థానికంగా కూరగాయల సాగు బహుశా చాలా ఖరీదైన పని కావచ్చు. అయితే, సేంద్రియంగా పండిస్తాం. కాబట్టి, కొత్త బ్రాండ్‌ను సృష్టించుకోవచ్చు. అందుకని సూత్రప్రాయంగా ఇది సానుకూల పరిణామమని నేను నమ్ముతున్నాను’ అన్నారు పోట్స్‌డ్యామ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మారియన్ డి సిమోన్. నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలు.. సేంద్రియ కూరగాయల లభ్యత పెరగడంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి వారుగా ఉండిపోయిన నగర ప్రజలను కమ్యూనిటీ గార్డెన్లు ఒకచోటకు చేర్చుతాయి. పచ్చని ప్రదేశాలు ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణం, జీవవైవిధ్యానికి మేలు చేస్తాయి. స్థానిక ఆహార ఉత్పత్తితో దూరం నుంచి కూరగాయల రవాణా వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలున్న అర్బన్ గార్డెనింగ్పై సీరియస్‌గా దృష్టి పెట్టడం బెర్లిన్కే కాదు, మన నగరాలకూ ఎంతో అవసరం. కానీ, మన పాలకులు గుర్తించేదెన్నడో కదా?! -పంతంగి రాంబాబు చదవండి: ఫంగల్ వ్యాధుల్ని నివారించే తెల్లముల్లంగి! -
రైతు ఇంట ప్రకృతి పంట.. విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయం
రాజాం(విజయనగరం జిల్లా): పెరుగుతున్న జనాభా వల్ల ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఆహారకొరతను తీర్చేందుకు... అధిక దిగుబడుల సాధనకు రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని అమాంతం పెంచారు. ఫలితంగా ఆహార ఉత్పత్తులు కషితమవుతున్నాయి. ప్రమాదకరంగా మారి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి మానవాళిని రక్షించేందుకు, ఆరోగ్యకర పంటలను ఉత్పత్తిచేసేందుకు వ్యవసాయశాఖ అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం సత్ఫలితాలిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కారణంగా ఇటీవల కాలంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఆరోగ్యకర ఆహార ఉత్పత్తుల ఎగుమతికి ఆస్కా రం కలుగుతోంది. రైతులకు తక్కువ పెట్టుబడితోనే ఆదాయం సమకూరుతోంది. 33 వేల ఎకరాల్లో... జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం 2.20 లక్షల హెక్టార్లు కాగా, ఇందులో 33 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో కేవలం 10 పంచాయతీల్లో, పదిహేను ఎకరాల్లో ప్రారంభమైన సాగు 2022వ సంవత్సరం రబీనాటికి 33 వేలఎకరాలకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 157 పంచాయతీల్లో ప్రకృతి సేద్యం జరుగుతోంది. 32 వేల మంది రైతులు సాగులో భాగస్వాములయ్యారు. ఖరీఫ్‌లో 90 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి చేశారు. 390 మంది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఈ విధానాన్ని అమలుచేసేందుకు రైతులకు సహకరిస్తున్నారు. గ్రామాల్లో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్బీకేల సాయంతో.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. పచ్చిరొట్ట విత్తనాలను రాయితీపై పంపిణీ చేస్తోంది. సేంద్రియ, ప్రకృతి సాగును ప్రోత్సహిస్తోంది. పంటల సాగులో సూచనలు, సలహాలు అందిస్తోంది. యంత్ర పరికరాలను సమకూర్చుతోంది. సాగును లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గ్రామ పంచాయతీల్లో సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువులుగా మార్చి రైతులకు రాయితీపై అందిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో వరి, చెరకు, మొక్కజొన్న , మినుములు, పెసర, ఆముదం, నువ్వులు, వేరుశనగ, రాగులు, కొర్రలు, సామలు తదితర పంటలను ప్రకృతి సేద్యంలో రైతులు సాగుచేస్తున్నారు. ఎరువుల తయారీ చాలా సులభం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ ఎరువు తయారీ చాలా సులభం. ఆవుపేడ, వేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆవుమూత్రం ప్రధానమైన ముడిసరుకులు. వీటిని తగిన మోతాదులో ప్రకృతి వ్యవసాయం అధికారులు, సిబ్బంది సలహాలతో ఒక రోజు వ్యవధిలో ఎరువులు తయారు చేయవచ్చు. అగ్ని అస్త్రం, ఘన, ధ్రవ జీవామృతాలు, భీజామృతాలు, కషాయాలు తయారుచేసి వరి, మొక్కజొన్న, చెరకు వంటి పంటలతో పాటు చిరుధాన్యాలు, కూరగాయల పంటల్లో వినియోగించవచ్చు. వీటి వలన పంటలో వైవిధ్యం కనిపించడంతో పాటు పంటపొలాలు సారవంతంగా మారి నేలల్లో ఆర్గాన్, కార్బన్ ఉత్పత్తులు పెరుగుతాయి. వీటి ఫలితంగా వచ్చే దిగుబడి ప్రతీ మనిషికి ఆరోగ్యంగా ఉండడంతో పాటు అనేక పోషకాలు కలిగిఉంటాయి. మంచి ఫలసాయం మేము కూరగాయల పంటలకు ఎక్కువుగా సేంద్రియ ఎరువు, జీవామృతాలు వినియోగిస్తున్నాం. మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటలు స్థానికంగానే అమ్ముడవుతున్నాయి. – పొగిరి అన్నంనాయుడు, మామిడిపల్లి, సంతకవిటి మండలం ఎరువుల వినియోగాన్ని తగ్గించాం వరి, మొక్కజొన్న పంటకు గతంలో ఎక్కువుగా యూరియా, డీఏపీలు వినియోగించేవాళ్లం. ఇప్పుడు పశువుల గెత్తం, ఆవు పేడ, కషాయాలు, పచ్చిరొట్ట ఎరువులు వినియోగిస్తున్నాం. పంటలో చీడపీడలు తగ్గి, దిగుబడి పెరుగుతోంది. – టి.అప్పలనాయుడు, లక్ష్మీపురం, రాజాం మండలం -
న్యూ లీఫ్ మైక్రోగ్రీన్స్‌లో 83 పోషకాలు.. ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఆహారోత్పత్తుల్లో పోషక విలువల సాంద్రతను బట్టి వాటి నాణ్యతను నిర్ణయించే పద్ధతి ఒకటుంది. సేంద్రియ/ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండించిన ఆహారంలో రసాయనిక ఎరువులతో పండించిన పంటల్లో కన్నా ఎక్కువ సంఖ్యలో పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరుబయట పొలాల్లో పండించే పంటలకే కాదు.. మహానగరాల్లో భవనాల్లో వర్టికల్ ఫామ్స్‌లో పండించే పంటలకూ వర్తిస్తుంది. ప్రకృతిలో 92 సహజ రసాయనిక మూలకాలు ఉంటాయి. ఇందులో పంటలకు 18 పోషకాలు అత్యవసరమని, వీటిలో 15 మట్టి నుంచి, 3 వాతావరణం నుంచి అందుతున్నాయని ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతోంది. ఈ లెక్క రసాయనిక వ్యవసాయంలో పండించిన ఆహారానికి సంబంధించినదని భావించవచ్చు. న్యూ లీఫ్ మైక్రోగ్రీన్స్‌లో 83 పోషకాలు తాము ప్రత్యేక సేంద్రియ ఎరువులతో మట్టిలో పండించే మైక్రోగ్రీన్స్‌లో 83 రకాల పోషకాలు ఉంటాయని దుబాయ్‌లోని వర్టికల్ అర్బన్ ఫార్మింగ్ సంస్థ న్యూ లీఫ్ వ్యవస్థాపకుడు ఆడమ్ పిట్స్ ప్రకటించారు. దుబాయ్‌లో 715 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిలువుగా పేర్చిన ట్రేలలో నియంత్రిత వాతావరణంలో మైక్రోగ్రీన్స్ పండిస్తున్న అర్బన్ వ్యవసాయ క్షేత్రం న్యూ లీఫ్. ఈ సంస్థ వందల కొద్దీ రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లకు ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్, పచ్చివే తినదగిన పువ్వుల (ఎడిబుల్ ఫ్లవర్స్)ను పండించి, తాజాగా విక్రయిస్తోంది. ఆడమ్ తన ఇండోర్ ఫార్మింగ్ ప్రయాణాన్ని ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్న తండ్రి కోసం క్రెసెస్ వంటి మైక్రోగ్రీన్స్ పండించటానికి న్యూ లైఫ్‌ను ప్రారంభించి.. ఇప్పుడు 58 రకాల మైక్రోగ్రీన్స్, ఎడిబుల్ ఫ్లవర్స్‌ను దుబాయ్ ప్రజలకు అందిస్తున్నారు. పోషక నాణ్యతకు మూలం మట్టి ‘దుకాణాలలో విక్రయించే దాదాపు మైక్రోగ్రీన్స్ మొక్కలన్నీ హైడ్రోపోనికల్‌గా పండించినవే. అయితే, మేం ప్రత్యేకంగా తయారు చేసుకున్న సేంద్రియ మట్టి మిశ్రమంలోనే మైక్రోగ్రీన్స్‌ను పెంచుతున్నాం. పోషక నాణ్యతకు మూలస్తంభం మట్టి. హైడ్రోపోనిక్ లేదా ఏరోపోనిక్ పద్ధతులను ఉపయోగించకుండా గత ఇరవై సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన మట్టి మిశ్రమంలో పెంచుతున్నాం అని వివరించారు ఆడమ్. ‘మట్టిని ఉపయోగించడం అంటే.. మనకు చాలా ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల సహాయం తీసుకోవటమే. ఇవి మొక్కలు పోషకాలను తీసుకోవడానికి సహాయపడతాయి. మా సూపర్‌ఫుడ్ మైక్రోగ్రీన్స్ 83 రకాల పోషకాలను కలిగి ఉంటాయి. సూక్ష్మజీవులు లేకుండా ఇది సాధ్యం కాద’ని ఆడమ్ వివరించారు. పంటను పండించిన తర్వాత మొక్కల వ్యర్థాలను తిరిగి మట్టిలోనే కలిపేస్తాం. ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు మరింతగా వృద్ధి చెంది, తదుపరి పంటకు ఉయోగపడుతున్నాయి. మట్టి ఆధారిత సాగులో మైక్రోగ్రీన్స్, ఆకుకూరల అధిక నాణ్యతను వినియోగదారులు గ్రహించి అభినందిస్తున్నారని ఆడమ్ అన్నారు. ‘ఎడారి వాతావరణంలో ఉత్తమమైన మైక్రోగ్రీన్స్‌ను పెంచడం చాలా విశేషం. ఇండోర్ ఫార్మింగ్‌తో మీరు ఏ నగరం మధ్యలో అయినా మట్టిలోనే అద్భుతమైన ఉత్పత్తులను పండించవచ్చ’ని ఆడమ్ అనుభవంతో చెబుతున్నారు. మైక్రోగ్రీన్స్ ప్రయోజనాలెన్నో ►విత్తిన 2 వారాల్లో వేలెడంత పొడవున్న మొక్కలను మారాకు వేయకముందే కత్తిరించిన మైక్రోగ్రీన్స్‌లో.. ఇదే పరిమాణంలో బాగా పెరిగిన ఆకుకూరల కంటే 9 రెట్లు ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ (వ్యాధితో పోరాడటానికి సహాయపడే సమ్మేళనాలు) ఉంటాయి. ►పొటాషియం, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి వివిధ రకాల ఖనిజాలూ పుష్కలంగా ఉన్నాయి. ►వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటే గుండె జబ్బులు, అల్జీమర్స్, డయాబెటిస్, కొన్ని క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ►పొలంలో మట్టిని పరీక్షించి సేంద్రియ/ప్రకృతి సాగుకు సేంద్రియ ధ్రువీకరణ ఇవ్వటం కంటే.. ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రత, ఎన్ని ఎక్కువ రకాల పోషకాలు ఉన్నాయో పరీక్షించి, దాని ఆధారంగా సర్టిఫికేషన్ ఇవ్వటం మేలేమో! – పంతంగి రాంబాబు చదవండి: Alzheimer's: కండరాల కదలికలు చురుగ్గా ఉన్న వారికి రిస్క్ తక్కువే! ఏం చేయాలంటే.. పెసర, మినుములేనా? బ్రహ్మీ, వస సాగు.. భలే బాగు! ఏడాదికి నికరాదాయం ఎంతంటే.. -
పెసర, మినుములేనా? బ్రహ్మీ, వస సాగు.. భలే బాగు! ఏడాదికి నికరాదాయం ఎంతంటే..
మాగాణి రేగడి భూముల్లో వరి, పెసర, మినుము మాత్రమేనా? ఇంకే ఇతర పంటలూ సాగు చేసుకోలేమా? ఉన్నాయి. ఔషధ పంటలున్నాయి. ఎకరానికి ఏటా రూ. లక్షకు తగ్గకుండా నికరాదాయం ఇచ్చే బ్రహ్మీ, వస వంటి దీర్ఘకాలిక ఔషధ పంటలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కొందరు రైతులు ఈ పంటలను నీటి వసతి ఉన్న మాగాణి నల్లరేగడి భూముల్లో సాగు చేస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు. ఛత్తీస్‌గఢ్ ఔషధ మొక్కల బోర్డు వీరిని ప్రోత్సహిస్తోంది. ఆయుర్వేద ఔషధ పరిశ్రమదారులతో కొనుగోలు ఒప్పందాలు చేయించి సాగు చేయిస్తుండటం విశేషం. బహ్మీ, వస పంటల సాగులో అక్కడి ముగ్గురు రైతుల అనుభవాలను పరిశీలిద్దాం.. బ్రహ్మీ.. 4 నెలలకో కోత బ్రహ్మీ (Bacopa monneiri) నేల మీద పాకే తీగజాతి దీర్ఘకాలిక పంట. బ్రహ్మీ పంటను వరి పంటకు మాదిరిగానే దమ్ము చేసి, 2–3 అంగుళాల మొక్క కటింగ్‌ను నాటాలి. ఒకసారి నాటితే చాలు. 5 ఏళ్ల పాటు మళ్లీ నాటక్కర లేదు. 4 నెలలకోసారి పంట కోతకు వస్తుంది. అయితే, ఏడాది పొడవునా పంట పొలాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. పొలం అంతా బ్రహ్మీ మొక్కలు అల్లుకుపోతాయి కాబట్టి కలుపు సమస్య ఉండదు. అయితే, పంట కోతకు వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి కలుపు తీసి, తర్వాత కొడవళ్లతో నేల మట్టానికి బ్రహ్మీ మొక్కలను కోస్తారు. ఆ తర్వాత కొంచెం ఎరువు చల్లి నీటి తడి ఇస్తే చాలు.. పంట మళ్లీ ఏపుగా పెరుగుతుంది. ప్రతి కోతకు ఎకరానికి 3,000–6,000 కిలోల పచ్చి బ్రహ్మీ మొక్కల దిగుబడి వస్తుంది. ఆరుబయట గచ్చు మీద ఎండబెడితే.. కొద్ది రోజుల్లో 600–700 కిలోల ఎండు బ్రహ్మీ సిద్ధమవుతుంది. దీని ధర మార్కెట్లో రూ. 40–50 వరకు ఉంటుంది. అంటే కోతకు రూ. 30 వేల చొప్పున.. ఏడాదిలో 3 కోతలకు.. రూ. 90 వేల వరకు రైతుకు ఆదాయం వస్తుంది. ప్లాంటింగ్ మెటీరియల్‌ను రైతులకు మొదటిసారి ఔషధ మొక్కల బోర్డు ఇస్తుంది. పెరిగిన పంట నుంచి తీసి 2–3 అంగుళాల ముక్కలను నాటుకుంటున్నారు. మొక్కలను ఎలా నాటుకోవాలో రైతులకు శిక్షణ ఇస్తారు. బ్రహ్మీ మొండి మొక్క. నిర్వహణ పెద్దగా అవసరం లేదు. ఒకటి, రెండు సార్లు కలుపు తీస్తే చాలు. ఎరువులు వాడాలని లేదు. జీవామృతం వాడినా సరిపోతుంది. వస.. 9 నెలల పంట పసుపు పంట మాదిరిగా వస (Bach-Acorus calamus) 2–3 అడుగుల ఎత్తున పెరుగుతుంది. 9 నెలల పంట. కొమ్ములను నాటుకోవాలి. మొక్కలు పెంచైనా నాటుకోవచ్చు. 9 నెలలకు కొమ్ములు తవ్వి తీసి, ఎండ బెట్టి, పాలిషింగ్ చేసి ఔషధ కంపెనీలకు విక్రయించాలి. 20–30 ఎకరాలకు ఒకటి చొప్పున పాలిషింగ్ మిషన్ అవసరం. ఎకరానికి 10–20 క్వింటాళ్ల వస కొమ్ముల దిగుబడి వస్తుంది. ఎకరానికి ఖర్చు రూ.20 వేలు పోను, రూ. 60 వేలు–లక్ష వరకు నికరాదాయం వస్తుంది. ఎకరానికి ఏటా రూ. 70 వేల నికరాదాయం అశ్వని శబారియా.. గొరెల్లా పెండ్ర మర్వాహి జిల్లా పెండ్ర పట్టణ శివారులో ఈ యువ రైతు 10 నెలల క్రితం 9 ఎకరాల్లో బ్రహ్మీ, 2.5 ఎకరాల్లో వస సాగు ప్రారంభించారు. బీకాం చదువుకున్న అశ్వని ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. తిపాన్ నది ఒడ్డున దేవుడి మాన్యం నల్ల రేగడి భూమిని కౌలుకు తీసుకొని, బోర్ల ద్వారా నీటిని తోడుకుంటూ సాగు చేస్తున్నారు. బ్రహ్మీ నాటు మొక్కలు, వస విత్తన కొమ్ములను ఛత్తీస్‌గఢ్ ఔషధ మొక్కల బోర్డు ద్వారా తీసుకున్నారు. వర్మీ కంపోస్టు, వేపపిండి చల్లి దుక్కి చేసిన తర్వాత మొక్కలు నాటారు. తర్వాత ఎరువులేమీ వేయటేదు. వారానికి రెండు సార్లు తగుమాత్రంగా నీటి తడి ఇస్తున్నారు. ఈ రెండు పంటలకూ నీరు నిల్వ ఉండక్కరలేదు. మట్టిలో తేమ బాగా ఉంటే చాలు. బ్రహ్మీ పంటను అశ్వని 10 నెలల్లో 3 సార్లు కోసి, ఎండబెట్టి విక్రయించారు. బ్రహ్మీ సాగు ద్వారా ఎకరానికి ఏడాదికి 3 కోతల్లో రూ. 90 వేల ఆదాయం. అన్నీ కలిపి రూ. 20 వేల ఖర్చవుతోంది. రూ. 70 వేలు నికరాదాయమని అశ్వని తెలిపారు. బ్రహ్మీలో వరి కన్నా ఎక్కువ ఆదాయం వస్తున్నదన్నారు. బ్రహ్మీ కొనుగోలుదారులను ఛత్తీస్‌గఢ్ ఔషధ మొక్కల బోర్డు పరిచయం చేసిందన్నారు. ఆన్లైన్లో నేరుగా విక్రయించడానికి ఇండియామార్ట్. కామ్ వెబ్సైట్లో కూడా తాను రిజిస్టర్ చేసుకున్నారు. మార్కెటింగ్ సమస్య లేదంటున్నారు రైతు అశ్వని శబారియా (81203 57007). ప్రకృతి సేద్యంలో ఏపుగా బ్రహ్మీ డోమన్‌లాల్ సాహు.. బలోదబజార్ జిల్లా గైత్ర గ్రామంలో 25 ఎకరాల సొంత భూమిలో వరి, కంది, శనగ తదితర పంటలను 4 ఏళ్లుగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేస్తూ రసాయనిక ఎరువులు వాడే రైతులతో సమానంగా దిగుబడులు తీస్తున్నారు. 6 నెలల క్రితం బోర్డు ద్వారా మొక్కలు తెప్పించి 2 ఎకరాల నల్లరేగడిలో నాటారు. పంట కోతకు సిద్ధంగా ఉంది. ఎకరానికి వర్మీకంపోస్టు 2 క్వింటాళ్లు, 100 కిలోల ఘనజీవామృతం చల్లి దమ్ము చేసి, బ్రహ్మీ మొక్కలు నాటారు. వర్మీవాష్, వేస్ట్‌డీకంపోజర్, ద్రవ జీవామృతం 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. పంట ఆరోగ్యంగా పెరిగింది. ఛత్తీస్‌గఢ్ ఔషధ మొక్కల బోర్డు ద్వారా విక్రయిస్తానని సాహు (62651 71801) తెలిపారు. రూ. 50–60 వేల నికరాదాయం సుగత్‌సింగ్ (66) జాంజ్‌గిర్ ఛాంప జిల్లా ఖటోల గ్రామానికి చెందిన సింగ్ వందెకరాల్లో సేద్యం చేసే రైతు. వరి, గోధుమ, పప్పుధాన్యాలు పండిస్తారు. 2021 జూలైలో ఛత్తీస్‌గఢ్ ఔషధ మొక్కల బోర్డు సూచన మేరకు నల్లరేగడి భూమి 3 ఎకరాల్లో బ్రహ్మీ, 2 ఎకరాల్లో వస నాటారు. ఎకరానికి 4 క్వింటాళ్ల సిటీ కంపోస్టు దుక్కిలో వేసి, అవసరం మేరకు నీటి తడులు ఇస్తున్నారు. బ్రహ్మీ పంటను కోసి గచ్చుపై ఎండబెడుతున్నారు. వరిలో ఎకరానికి రూ. 30–35 వేలు నికరాదాయం వస్తుంటే.. బ్రహ్మీ, వసలో రూ. 50–60 వేల వరకు వస్తోందని సింగ్(83055 61057) తెలిపారు. మామిడి చెట్ల నీడలో సర్పగంధ మొక్కలను 16 నెలల క్రితం వేశారు. మరో 2 నెలల్లో కోతకు రానుంది. మార్కెటింగ్ సమస్య లేదు! ఔషధ మొక్కల సాగు ద్వారా రైతులు సాధారణ పంటలతో పోల్చితే అధిక నికరాదాయం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వరి సాగు చేసే నల్ల రేగడి, లోతట్టు ప్రాంతాల్లో దీర్ఘకాలిక ఔషధ పంటలైన బ్రహ్మీ, వసను సాగు చేసుకోవచ్చు. ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం పొందే వీలుంది. విత్తనాలు, మొక్కలను బోర్డు ద్వారా అందించి రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఔషధాల తయారీదారులు, వ్యాపారులతో ముందే టైఅప్ చేసుకొని తగిన జాగ్రత్తలతో అవగాహన ఒప్పందం చేసుకొని మార్కెటింగ్ సమస్య లేకుండా చేస్తున్నాం. రైతుల ఉత్పత్తులకు మంచి ఆదాయం వచ్చేలా చేస్తున్నాం. ఎకరానికి ఏడాదికి రూ. పది లక్షల వరకు ఆదాయం వచ్చే ఔషధ పంటలు కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రంలోని రైతులకైనా, సంస్థలకైనా కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు మా బోర్డు సిద్ధంగా ఉంది. – జె.ఎ.సి.ఎస్.రావు (96769 95404), సీఈఓ, ఛత్తీస్‌గఢ్ ఔషధ మొక్కల బోర్డు, పూర్వ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, రాయపూర్. -నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
కమ్యూనిటీ గార్డెనింగే దివ్యౌషధం! తీసుకునే ఆహారంలో ఒక్క గ్రాము పీచు పెరిగినా..
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం నలుగురితో చేయీ చేయీ కలిపి ఉమ్మడిగా సేంద్రియ కూరగాయ పంటలు పండించుకోవటం కన్నా కొత్త సంవత్సరంలో అమలు చేయదగిన ఆరోగ్యదాయక తీర్మానం మరొకటి ఉండబోదు. కమ్యూనిటీ గార్డెనింగ్.. ప్రజల ఆరోగ్యంపై చూపే ప్రభావాలపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ నిర్వహించిన ఓ శాస్త్రీయ అధ్యయనం శాస్త్రీయతను విడమర్చింది. ఈ దిశగా జరిగిన తొట్టతొలి రాండమైజ్డ్, కంట్రోల్డ్ స్టడీ ఇది. దీనికి అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నిధుల్ని సమకూర్చింది. ‘లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ జర్నల్‌లో జనవరి 4న ప్రచురితమైన ఈ స్టడీ ఆసక్తి రేపుతోంది. తిరుగులేని సాక్ష్యాలు డయాబెటిస్, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులతోపాటు, మానసిక సమస్యలను ప్రభావశీలంగా నివారించే శక్తి కమ్యూనిటీ గార్డెనింగ్‌కు ఉందనడానికి ఈ అధ్యయన ఫలితాలు తిరుగులేని సాక్ష్యాలుగా నిలిచాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జిల్ లిట్ వ్యాఖ్యానించారు. కొలరాడో యూనివర్సిటీ బౌల్డర్‌లో పర్యావరణ అధ్యయనాల శాఖ ప్రొఫెసర్‌గా ఆమె పనిచేస్తున్నారు. డెన్వర్ ప్రాంతానికి చెందిన 291 మందిపై అధ్యయనం చేశారు. వీరిలో ఎవరికీ గతంలో కమ్యూనిటీ గార్డెనింగ్ చేసిన అనుభవం లేదు. సగటు వయసు 41 ఏళ్లు. సగం మంది అల్పాదాయ వర్గాల వారు. 145 మందిని ‘ఎ’ గ్రూప్‌గా, 146 మందిని ‘బి’ గ్రూప్‌గా విడదీశారు. ‘ఎ’ గ్రూప్ వారికి ఒక ఏడాది తర్వాత గార్డెనింగ్ మొదలుపెడుదురు గాని అని చెప్పారు. ‘బి’ గ్రూప్ వారికి స్వచ్ఛంద సంస్థ డెన్వర్ అర్బన్ గార్డెన్స్ ద్వారా శిక్షణ ఇప్పించారు. డెన్వర్ ఏరియాలో ఒక స్థలం కేటాయించి, కూరగాయ విత్తనాలు, మొక్కలు ఇచ్చి, సామూహికంగా ఇంటిపంటలు సాగు చేయించారు. ఈ రెండు గ్రూపుల్లోని వారి శారీరక కొలతలు, ఆరోగ్య వివరాలు, మానసిక ఆరోగ్య స్థితిగతులు, ఎంత సేపు గార్డెనింగ్ చేస్తున్నారు, ఏమేమి తింటున్నారు.. వంటి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేశారు. ఒక్క గ్రామైనా ప్రభావం ఎక్కువే సగటున అమెరికావాసులు ఆహారం ద్వారా రోజుకు 16 గ్రాముల పీచు తీసుకుంటున్నారు. 25–38 గ్రాములు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కొద్ది కాలం గడిచేసరికి.. కమ్యూనిటీ గార్డెనింగ్ చేస్తున్న ‘బి’ గ్రూప్ వారు ‘ఎ’ గ్రూప్ వారి కన్నా 1.4 గ్రాములు (7%) అధికంగా పీచుపదార్థం (కూరగాయలు, పండ్ల రూపంలో) తింటున్నారని తేలింది. ఒక్క గ్రాము పీచుపదార్థం పెరిగినా ఒక్క గ్రాము పీచుపదార్థం పెరిగినా శరీరంలో వాపు నివారణ, రోగనిరోధక శక్తి పెంపుదలపైన.. ఆహార శోషణ, పెద్దపేగుల్లోని సూక్ష్మజీవరాశి స్థితిగతులపైన ఎక్కువ ప్రభావం కనిపించిందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినాలోని క్యాన్సర్ నివారణ–నియంత్రణ కార్యక్రమం సంచాలకుడు జేమ్స్ హెబెర్ట్ అన్నారు. వారానికి కనీసం 150 నిమిషాలైనా శారీరక శ్రమ చేయాలి. పరివర్తన అమోఘం అమెరికన్లలో 25% మంది మాత్రమే చేస్తున్నారు. కమ్యూనిటీ గార్డెనింగ్ చేస్తున్న ‘బి’ గ్రూప్ వారి శారీరక శ్రమ వారానికి 42 నిమిషాలు పెరిగింది. వీరిలో మానసిక ఆందోళన, వ్యాకులత గణనీయంగా తగ్గాయి. కమ్యూనిటీ గార్డెనింగ్ చేసేవారికి ఒనగూరే ప్రయోజనాలు ప్రతి సీజన్‌కూ పెరుగుతాయని ప్రొ. లిట్ భావిస్తున్నారు. ఈ ఫలితాలు డెన్వర్ అర్బన్ గార్డెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిండా అప్పెల్ లిప్సియస్ను ఆశ్చర్యపరచలేదు. 43 ఏళ్లుగా ఏడాదికి 18 వేల మందికి కమ్యూనిటీ గార్డెనింగ్‌లో లిండా శిక్షణ ఇస్తుంటారు. ‘వీరిలో వచ్చిన పరివర్తన అమోఘం. కొందరిలో మార్పు ప్రాణ రక్షణ స్థాయిలోనూ ఉండొచ్చ’ని లిండా అంటున్నారు. ‘కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఎవరి ఇంట్లో వారు పెంచుకోవచ్చు. అయితే, ప్రకృతిలో ఆరుబయట నలుగురూ కలసి గార్డెనింగ్ పనిలో నెలల తరబడి భాగస్వాములు కావటం అద్భుత ఫలితాలనిస్తోంది. కూరగాయలు, పండ్ల వినియోగం పెరగడంతో పాటు తోటి వారితో సంబంధ బాంధవ్యాలు వికసించాయి. మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం చాలానే ఉంది. దీని ప్రభావశీలతకు శాస్త్రీయ రుజువులు దొరికాయి’ అన్నారు ప్రొ. లిట్. కమ్యూనిటీ గార్డెన్ల బృహత్ బహుళ ప్రయోజనాలను గుర్తించడంలో వైద్యులు, విధాన నిర్ణేతలు, లాండ్ ప్లానర్లకు ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడతాయని ప్రొ. లిట్ సంతోషపడుతున్నారు. అర్థం ఏమిటంటే.. జీవనశైలి వ్యాధుల చికిత్సలో భాగంగా సామూహిక ఇంటిపంటల సాగును రోగులకు సీరియస్‌గా ప్రిస్క్రైబ్ చేసే రోజులు వచ్చేశాయి! – పంతంగి రాంబాబు -
విరబూసిన ప్రకృతి సేద్య పద్మాలు: పగలు సేద్యం.. రాత్రి వైద్యం.. దేశీ వరి వంగడాలే ప్రాణం!
2023 పద్మశ్రీ పురస్కార గ్రహీతల్లో వ్యవసాయంతో సంబంధం ఉన్న వారంతా (ప్రసిద్ధ ఆక్వా శాస్త్రవేత్త డా. విజయ్‌గుప్తా మినహా) దేశీ వంగడాలతో ప్రకృతి, సేంద్రియ తరహా సేద్య పద్ధతులను ప్రాచుర్యంలోకి తెచ్చిన వారే. అంతేకాదు, నెక్రమ్ శర్మ (హిమాచల్ ప్రదేశ్) 9 పంటల మిశ్రమ ప్రకృతి సాగు చేస్తున్నారు. పతయత్ సాహు (ఒడిషా) ఔషధ మొక్కలను సాగు చేస్తూ ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. చెరువాయల్ రామన్ (కేరళ) దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమకారుడు. తులారామ్ ఉపేతి (సిక్కిం) 80 ఏళ్లుగా వారసత్వ సేంద్రియ సేద్యం చేస్తున్న కురువృద్ధుడు కావటం విశేషం. పురాతన ‘అటవీ కృషి’ పద్ధతిని పునరుద్ధరించి సిరిధాన్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చిన డా. ఖాదర్ వలి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరులో జన్మించినా మైసూరులో స్థిరపడినందున కర్ణాటక కోటాలో ఎంపికయ్యారు. వీరి కృషి గురించి రేఖామాత్రంగా... తొమ్మిది పంటల మిశ్రమ సేద్యం నెక్రమ్ శర్మ (59).. మంచు కొండల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో మండి జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు. ఈ ఏడాది ఆ రాష్ట్రం నుంచి పద్మశ్రీకి ఎంపికైంది ఆయనొక్కరే. ప్రభుత్వ ఉద్యోగం కోసం విఫలయత్నం చేసిన ఆయన తదనంతరం సేద్యాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. నాలుగున్నర ఎకరాల వారసత్వ భూమిలో 38 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక వ్యవసాయం వల్ల భూసారం దెబ్బతింటున్నదని గుర్తించి, 22 ఏళ్ల క్రితమే సుభాష్ పాలేకర్ బాటలో ప్రకృతి సేద్యంలోకి మళ్లారు. కనీసం 3 డజన్ల పంటలకు చెందిన దేశీ విత్తనాలను ఆయన పరిరక్షిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. పది వేల మంది రైతులకు ఆయన ఉచితంగా దేశీయ విత్తనాలు పంచిన ఘనత ఆయనిది. ‘నౌ అనజ్’ (9 పంటలు) అనే పురాతన ప్రకృతి సేద్య పద్ధతిని శర్మ పునరుద్ధరించారు. పొలంలో కనీసం 9 రకాల పంటలు కలిపి మిశ్రమ సాగు చేస్తున్నారు. తిండి గింజలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, తీగజాతి పంటలను కలిపి ఒకే పొలంలో సాగు చేస్తారు. వానాకాలంలో 9 పంటలు, శీతాకాలంలో మరో 9.. ఏటా 18 పంటలను ఆయన సాగు చేస్తున్నారు. 20 ఏళ్లుగా దేశీ విత్తన పరిరక్షణపై కృషి చేస్తున్నారు. 8 రకాల చిరుధాన్యాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రకృతి సాగు వల్ల 50% నీటి అవసరం తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. దేన్నీ బయట నుంచి తెచ్చి వేసే అవసరం లేదంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధిస్తున్నానని, మంచి ఆహారాన్ని ఇష్టపడే స్నేహితులే తనకు బలమని అన్నారు. ‘రోజుకు 14 గంటలు పనిచేస్తున్నాను. పద్మశ్రీ అవార్డు బాధ్యతను పెంచింది. ఇక 18 గంటలు పనిచేస్తా’నంటున్నారు నెక్రమ్ శర్మ వినమ్రంగా. పగలు సేద్యం.. రాత్రి వైద్యం పతయత్ సాహు (67).. విశిష్ట వ్యవసాయ వైద్యుడు. ఒడిషాలోని కలహండి జిల్లా నందోల్ ఆయన స్వగ్రామం. 40 ఏళ్లుగా దాదాపు 3 వేల ఔషధ మొక్కలను తన ఎకరంన్నర భూమిలో పూర్తి సేంద్రియంగా పెంచుతూ.. ఆ మూలికలతోనే ప్రజలకు వైద్యం చేస్తున్నారు. ప్రతి మొక్క గుణగణాల గురించి తడుముకోకుండా అనర్ఘళంగా చెప్పగలరాయన. పగలు ఔషధ మొక్కల తోట పనులు స్వయంగా చేసుకుంటూ బిజీగా గడిపే సాహు.. రాత్రిపూట ప్రజలకు వైద్యం చేస్తారు. ఇంతని ఫీజు అడగరు. ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. యుక్తవయసులోనే ఆసక్తితో ఔషధ మొక్కలు సేకరించి పెంచటం అలవాటు. తాత ఆయుర్వేద వైద్యుడు. చదువు అయ్యాక తాత దగ్గరే సంప్రదాయ ఆయుర్వే వైద్యం నేర్చుకున్నారు. ఇప్పుడున్న 3 వేల జాతుల ఔషధ మొక్కల్లో చాలా వరకు స్వరాష్ట్రంలో అరణ్యాల్లో నుంచి అటవీ అధికారులతో పాటు వెళ్లి ఎన్నో అరుదైన మొక్కలను సేకరించారు. 500 రకాలను ఒడిషా ఔషధ మొక్కల బోర్డు తోడ్పాటుతో ఇతర రాష్ట్రాల నుంచి సేకరించి సంరక్షిస్తున్నారు. ఔషధ మొక్కల జీవవైవిధ్యానికి ఆయన క్షేత్రం నిలయంగా మారింది. వ్యవసాయంతో వైద్యంతో అనుసంధానం చేయటం విశేషం. అరుదైన ఔషధులను పరిరక్షిస్తూ వాటి ప్రయోజనాలను అక్షరబద్ధం చేసి కొత్త తరానికి అందించటం గొప్ప సంగతి. ‘సిరి’ధాన్యాలే నిజమైన ఆహార పంటలు! డాక్టర్ ఖాదర్ వలి (65).. సంప్రదాయ ప్రకృతి సేద్య పద్ధతి ‘అటవీ కృషి’ (కడు కృషి) పునరుద్ధరించి సిరిధాన్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చిన అరుదైన స్వతంత్ర శాస్త్రవేత్త. కమతం చిన్నదైనా అందులో 20% విస్తీర్ణంలో అడవిని పెంచుకుంటూ.. మిగతా స్థలంలో సీజనల్ పంటలు సాగు చేయటమన్నది ‘అటవీ కృషి’లో ఒక అంశం. ‘కడు చైతన్యం’ పేరిట ద్రవరూప ఎరువును రూపొందించారు. రసాయనాల్లేకుండా వర్షాధారంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగే మనకు, ప్రకృతికి మేలు చేసే సేద్యమని ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు. కొర్రలు, అండుకొర్రలు, అరికలు, ఊదలు, సామలు వంటి ‘సిరిధాన్యాలు’ తింటూ హోమియో/ఆయుర్వేద మందులు వాడుతుంటే.. మధుమేహం నుంచి కేన్సర్ వరకు ఏ జబ్బయినా 6 నుంచి 2 ఏళ్లలోగా తగ్గిపోతాయంటారు డా. ఖాదర్. వరి, గోధుమలకు బదులు రోజువారీ ప్రధాన ఆహారంగా సిరిధాన్యాలను ఒక్కో రకాన్ని రెండు, మూడు రోజులు మార్చి మార్చి తినాలి. కొత్తగా అలవాటు చేసుకునే వారు 6 వారాల పాటు అన్నంగా కాకుండా అంబలి రూపంలో, కూరలు నంజుకుంటూ, తాగాలన్నది ఆయన సూచన. ఐదేళ్ల క్రితం డా. ఖాదర్‌ని ‘సాక్షి సాగుబడి’ తెలుగువారికి తొలిసారి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. నీలి విప్లవ మార్గదర్శి మోదడుగు విజయ్ గుప్తా (83).. ఆక్వాకల్చర్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన శాస్త్రవేత్త. సముద్రతీర ప్రాంత పట్టణం బాపట్లలో జన్మించారు. మత్స్యకారుల జీవితాల్లో మార్పు తేవాలన్న ఆసక్తితో కృషి చేసి అంతర్జాతీయ స్థాయి మత్స్యశాస్త్రవేత్తగా ఎదిగారు. ఆగ్నేయాసియాలో నీలి విప్లవానికి మార్గదర్శకుడిగా పేరుగాంచారు. 22 దేశాల్లోని చిన్న రైతులు, గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు పౌష్టికాహారం అందించే విధంగా చేపల పెంపకం పద్ధతులను రూపొందించారు. మలేషియాలోని అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫిష్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మన దేశంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని చేపల వినియోగాన్ని తలసరిన 5 కిలోల నుంచి 15 కిలోలకు పెంపొందించడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చని విజయ్ గుప్తా సూచిస్తున్నారు. ఆక్వా శాస్త్రవేత్తగా ఆయన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ప్రపంచ ఆహార బహుమతి (2005)ని, మొదటి సన్హాక్ శాంతి బహుమతి(2015)ని గెలుచుకున్నారు. సేంద్రియ సేద్య కురువృద్ధుడు తులారామ్ ఉపేతి.. 98 ఏళ్లు ఉపేతి గత 80 ఎనభయ్యేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. 2023లో పద్మశ్రీ పురస్కారం పొందిన వ్యవసాయదారుల్లోకెల్లా ఈయనే పెద్ద. సిక్కిం తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా అభివృద్ధి చెందింది. సేంద్రియ వ్యవసాయం ద్వారా పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో అక్కడి రైతులు ముఖ్యపాత్ర పోషించారు. ఐదో తరగతి చదివిన ఉపేతి చిన్నతనం నుంచి సేంద్రియ వ్యవసాయాన్ని వారసత్వంగా కొనసాగించారు. ఇతర రైతులకు మార్గనిర్దేశం చేశారు. సిక్కిం భారత్‌లో కలవక ముందు టిబెట్‌లోని యటుంగ్‌కు భుజాలపై మోసుకెళ్లి ధాన్యం, మొక్కజొన్నలను అమ్మేవారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న తులారామ్ ఐదారేళ్ల క్రితం వరకు స్వయంగా పొలానికి వెళ్లి పనులు చేయించేవారు. దేశీ వరి వంగడాలే ప్రాణం! చెరువాయల్ రామన్(72).. కేరళకు చెందిన ఆదివాసీ సేంద్రియ రైతు. దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమకారుడు కూడా. వయనాడ్ ప్రాంతంలో మనంతవాడి పంచాయతీలోని కమ్మన గ్రామంలో ఆయన నివశిస్తారు. రామన్ 150 ఏళ్ల నాటి వారసత్వ పూరింట్లోనే, విత్తనాల కుండల మధ్యనే, ఇప్పటికీ నివాసం ఉంటున్నారు. స్థానికంగా ‘గార్డియన్ ఆఫ్ నేటివ్ పాడీ’గా ప్రసిద్ధి చెందారు. రామెట్టన్ అని కూడా ఆయన్ను పిలుస్తారు. ఔషధ గుణాలు, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే గుణం వంటి ప్రత్యేకతలు కలిగిన స్వదేశీ వరి రకాలు శతాబ్దాలుగా మన దేశంలో వాడుకలో ఉన్నాయి. అయితే, హైబ్రిడ్, జన్యుమార్పిడి వరి రకాల రాకతో దేశీ రకాలు చాలా వరకు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెరువాయల్ రామన్ తన 4 ఎకరాల పొలంలో 1.5 ఎకరాలను 22 ఏళ్ల క్రితం దేశీ వరి సాగుకు కేటాయించారు (మిగతా పొలంలో ఇతర పంటలు పండిస్తున్నారు). 54 దేశవాళీ రకాల వరిని ప్రతి ఏటా పండిస్తూ సంరక్షిస్తున్నారు. తన జీవితాన్ని దేశీ విత్తనాల పరిరక్షణకే అంకితం చేశారు. వయనాడ్ ప్రాంతంలో కురిచ్య గిరిజన జాతిలో పుట్టిన ఆయన ఆసుపత్రి వార్డెన్‌గా ఉద్యోగం చేసేవారు. అయితే, తమ గిరిజన కుటుంబాలు పురాతన దేశీ వరిసేద్యానికి క్రమంగా స్వస్తి చెబుతుండటాన్ని గుర్తించి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. 2004 నుంచి దేశీ వరి రకాలను ఉద్యమ స్ఫూర్తితో తాను సాగు చేయటమే కాదు. ఆ ప్రాంతంలో రైతులను కూడగట్టి సంఘంగా ఏర్పరిచి దేశీ వరి సాగును విస్తృతం చేశారు. అపురూపమైన దేశీ వరి విత్తనాలు డబ్బు కన్నా విలువైనవని ఆయన భావన. అందుకే విత్తనాలను అమ్మరు. ఉచితంగా ఇస్తారు. పండించిన తర్వాత అంతే పరిమాణంలో విత్తనాలను తనకు తిరిగి ఇవ్వాలి. అదొక్కటే షరతు. కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ‘జీనోమ్ సేవియర్ పురస్కారం’ ప్రదానం చేసి గౌరవించింది. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చదవండి: అల్లుడు బియ్యం అదుర్స్! -
సేంద్రీయ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి: దేశంలోనే సేంద్రీయ సేద్యంలో అగ్రస్థానంలో ఉన్న ఏపీకి 2020, 2021 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఒక లక్ష హెక్టార్లలో సేంద్రీయ సేద్యానికి అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఇటీవల లోక్ సభలో వెల్లడించారు. 2019–20 నుంచి ఇప్పటివరకు ఏపీలో 1,44,465 హెక్టార్లు సేంద్రీయ వ్యవసాయం కిందకు వచ్చినట్లు తెలిపారు. 2020–21లో భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద 8 రాష్ట్రాల్లో 4.09 లక్షల హెక్టార్లలో సేంద్రీయ సేద్యానికి అనుమతి ఇచ్చామన్నారు. ఇందులో అత్యధికంగా ఏపీలో లక్ష హెక్టార్లకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం, భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చదవండి: వాహ్ వైజాగ్.. సాటిలేని మేటి సిటీ 2019–20 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ 2 పథకాల కింద సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు శిక్షణ, సామర్ధ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మూడేళ్లలో రైతుల క్లస్టర్ల ఏర్పాటు, సామర్ధ్యం పెంపునకు హెక్టార్‌కు రూ.12,200 సాయాన్ని అందించినట్లు చెప్పారు. హ్యాండ్ హోల్డింగ్, సర్టిఫికేషన్, అవశేషాల విశ్లేషణ్‌కు హెక్టారుకు మూడేళ్లలో రూ. 2 వేల ఆర్థిక సాయం అందించామన్నారు. సహజ సేద్య ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రచారం, విలువ జోడింపునకు రైతులకు హెక్టార్‌కు మూడేళ్లలో రూ.8,800 డీబీటీ ద్వారా ఇచ్చామన్నారు. ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్ వరకు, ధృవీకరణ, మార్కెటింగ్, పంటకోత తర్వాత నిర్వహణకు పూర్తి మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు. -
Omaha City: ఇంటి పంటలకు నెలవు
ఒమాహా నగరఒమాహా.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన నెబ్రాస్కాలోని ముఖ్య నగరం. ఇక్కడ సేంద్రియ ఇంటి పంటల ఉద్యమం తామర తంపరగా విస్తరించింది. నగరంలో ఎటు చూసినా చిన్న చిన్న కమ్యూనిటీ కిచెన్ గార్డెన్స్ ఉంటాయి. అక్కడక్కడా విస్తారమైన అర్బన్ గార్డెన్లు కనిపిస్తాయి. సుమారు 5 లక్షల జనాభా గల ఒమాహాలో ఆఫ్రికన్ అమెరికన్లు(12%), ఆసియన్లు(5%) సహా వివిధ జాతులవారుంటారు. వారంతా తమవైన సంప్రదాయ సేంద్రియ ఇంటిపంటల సాగు ద్వారా కమ్యూనిటీలను పోషించుకునే పనిలో వున్నారు అంటే అతిశయోక్తి లేదు. నగరంలోని ఖాళీ స్థలాల్లో పంటలు పండించేందుకు 2014లో ఒమాహా ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనుమతించిన తర్వాత కమ్యూనిటీ గార్డెన్ల సంఖ్య 58కి పెరిగింది. ఖాళీ స్థలాలను ఆకర్షణీయమైన హరిత ప్రదేశాలుగా మార్చారు. ఆహార లభ్యత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం కూరగాయలు, ఆకుకూరలను పెంచుతున్నారు. కమ్యూనిటీ గార్డెన్లు కిరాణా దుకాణాలకు ఎప్పుడూ చూసి ఎరుగని దేశీయ ఆహారోత్పత్తులను అందిస్తూండటం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలనాటి విక్టరీ గార్డెన్స్ మాదిరిగా.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒమాహాలో ‘విక్టరీ గార్డెన్స్’ ఉండేవని మేరీ కార్పెంటర్ తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘కూరగాయలు, పండ్లు పెంచుకునే పెరటి తోట ప్రతి ఒక్కరికీ ఉండేది. ఆస్పరాగస్, బంగాళదుంపలు, టొమాటోలు, బ్లాక్ రాస్ బేర్రీస్, ద్రాక్ష వంటివన్నీ యుద్ధ కాలంలో పండించుకొని తినే వాళ్ళం. తరువాతి కాలంలో కిరాణా దుకాణాల్లో సంవత్సరం పొడవునా అన్నీ అమ్మటంతో ఆ తోటలు చాలా వరకు అదృశ్యమయ్యాయి. 80 ఏళ్ల తర్వాత మళ్లీ పెరటి తోటలు కొత్తగా వెలుస్తున్నాయి.. మంచిదే’ అన్నారు మేరీ హ్యాపీగా. తమదైన తాజా ఆహారంపై ఆసక్తి ఒమాహా ‘ఆధునిక అర్బన్ అగ్రికల్చర్ గురు’గా చెప్పదగిన వ్యక్తి జాన్ పోర్టర్. నెబ్రాస్కా ఎక్స్టెన్షన్ ఆఫీస్‌లో విద్యాధికారి. ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని స్థానికంగా పెంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి, ఆ ఉద్యమం వెనుక ఉన్న కథపై ఆసక్తిని కల్పించినందున నగరంలో తోటలు విస్తరిస్తున్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి దాన్ని మరింత పెంచింది. అన్నింటికంటే, తమదైన తాజా ఆహారం తినాలన్న ఆకాంక్ష ఇందుకు మూలం అన్నారు జాన్. సిటీ స్ప్రౌట్స్‌లో తొలి అడుగులు.. సిటీ స్ప్రౌట్స్ ఒమాహాలో సేంద్రియ ఇంటి పంటల సాగును అలవాటు చేసిన స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యమైనది. ఇప్పుడు ఈ సంస్థ 45 చిన్నపాటి గార్డెన్ ప్లాట్లను నిర్వహిస్తోంది. ఉత్తర ఒమాహాలోని డెకాటూర్ అర్బన్ ఫార్మ్‌లో పండ్ల చెట్లు, బెర్రీ పొదలను భారీ సంఖ్యలో పెంచుతోంది. కమ్యూనిటీ గార్డెన్స్, అర్బన్ ఫామ్‌ల మధ్య వ్యత్యాసం గురించి చెబుతూ సిటీ స్ప్రౌట్స్ మేనేజర్ షానన్ కైలర్ .. ‘నిర్దిష్ట కమ్యూనిటీ కోసం తరచుగా ఎత్తైన మడుల్లో కూరగాయలను పండించేది కమ్యూనిటీ గార్డెన్. అర్బన్ వ్యవస్థ క్షేత్రం కూరగాయలు, పండ్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంది. సిటీ స్ప్రౌట్స్ ప్రతిరోజూ వందలాది స్థానిక కుటుంబాలకు తాజా ఆహారాన్ని ఉచితంగా అందిస్తుంది. తాజా ఆహారాన్ని అందించటానికి అర్బన్ ఫారమ్స్ నిజంగా చక్కని మార్గం’ అంటారు. నాన్సీ విలియమ్స్ ‘నో మోర్ ఎంప్టీ పాట్స్’ను ద్వారా ఆహార స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ‘పాప్–అప్ ఒయాసిస్’ గార్డెన్.. దేశీయ వంగడాలు సాగయ్యే కమ్యూనిటీ గార్డెన్. గత దశాబ్దంలో ఒమాహాలో ఉద్భవించిన డజన్ల కొద్దీ కొత్త కమ్యూనిటీ గార్డెన్లలో ఇదొకటి. హార్టికల్చరిస్ట్ నాన్సీ స్కాట్ తదితరులు అందులో పంటలు పండిస్తున్నారు. గస్ వాన్ రోన్న్ ‘ఒమాహా పెర్మాకల్చర్’ను స్థాపించి ఒమాహాలోని ఆడమ్స్ పార్క్ పరిసరాల్లోని ఖాళీ స్థలాలను ఆర్గానిక్ గార్డెన్స్‌గా మార్చారు. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
గేటెడ్ కమ్యూనిటీలో నివాసం.. పెరట్లో కూరగాయల సాగు, కోళ్లు, కుందేళ్ల పెంపకం! ఇంకా
ఆఫ్రికా దేశమైన కెన్యాలోనూ అర్బన్ ప్రజలు సేంద్రియ ఇంటిపంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. దేశ జాతీయోత్పత్తిలో 30% వ్యవసాయం నుంచి పొందుతున్న కెన్యాలో విష రసాయనాల వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు కూరగాయలు, ఆకుకూరలు వీలైనంత వరకు ఇంటి దగ్గరే ఏదో విధంగా తిప్పలుపడి సేంద్రియంగా పండించుకుంటున్నారు. కోవిడ్ కాలంలో ఆహార కొరత, ధరల పెరుగుదలతో కొంతమంది కెన్యన్లు అర్బన్ ప్రాంతాల నుంచి తిరిగి గ్రామాలకు వెళ్ళిపోయారు. అక్కడ ఆహారం చౌకగా ఉండటంతో పాటు సొంతంగా కూరగాయలు పండించుకోవడానికి పెరటి స్థలాలు చాలా గ్రామీణ కుటుంబాలకు అందుబాటులో ఉంటాయి. అయితే, కోవిడ్ మహమ్మారి అర్బన్ అగ్రికల్చర్ విస్తరణకూ ఊపునిచ్చింది. ఆహార సరఫరా తగ్గిపోవటంతో ఆరోగ్యదాయకమైన ఆహార భద్రత కోసం అర్బన్ ప్రాంతాల్లో సొంతంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వ్యాపకం ఇటీవల ఊపందుకుంది. ఇంటి స్థాయిలో ఆహార భద్రతను కల్పించడానికి కెన్యా ప్రభుత్వం ‘మిలియన్ కిచెన్ గార్డెన్స్ ప్రాజెక్ట్’లో భాగంగా రెండేళ్ల క్రితం కూరగాయల విత్తనాలు, వ్యవసాయ కిట్లను పంపిణీ చేసింది. అర్బన్ గార్డెనింగ్ చానల్ నగరంలో ఉంటున్నా ఇంటి దగ్గరే సొంత ఆహారాన్ని పెంచుకోగలుగుతున్న అదృష్టవంతుల్లో న్యాంబురా సిమియు ఒకరు. 35 ఏళ్ల శాస్త్రవేత్త అయిన ఆమె తన కుటుంబంతో పాటు కెన్యా రాజధాని నగరం నైరోబీ శివార్లలోని గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. తన ఇంటి వెనుక పెరట్లో తన నలుగురు కుటుంబానికి సరిపడా కూరగాయలను పండిస్తున్నారు. అంతేకాదు, 200 వరకు కోళ్లు, కుందేళ్లను సైతం పెరట్లో పెంచుతున్నారు. ఏడాది పొడవునా కూరగాయలు, గుడ్లు, మాంసాలతో కూడిన సేఫ్ ఫుడ్‌ను కుటుంబానికి సమకూర్చుతున్నారు. అర్బన్ రైతులకు శిక్షణ ఇస్తున్నారు. అందుకోసం తన పేరుతోనే యూట్యూబ్‌లో అర్బన్ గార్డెనింగ్ చానల్‌ను నిర్వహిస్తున్నారు. పురుగుమందులకు బదులు కుందేలు మూత్రం వాడుతున్నారు. తెగుళ్ళను అరికట్టడానికి ‘కంపానియన్ ప్లాంటింగ్’ వంటి సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఉపాధి మార్గంగానూ.. యువ అర్బన్ ఫార్మింగ్ ఎంటర్ ప్రెన్యూర్స్లో నైరోబీ వాసి ఎల్జీ చెబెట్ ఒకరు. సృజనాత్మకంగా కిచెన్ గార్డెనింగ్ నమూనాలను నిర్మించటంలో ఆమె దిట్ట. కుటుంబం కోసం కూరగాయలు, ఆకుకూరలు పండించటం మాత్రమే కాదు, దాన్నే ఉపాధి మార్గంగానూ ఎంచుకున్నారామె. కెన్యా ఆర్గానిక్ కిచెన్ గార్డెన్స్ సంస్థను నెలకొల్పారు. పెరట్లో, మేడ మీద, గచ్చు మీద ఏ కొంచెం స్థలం వున్నా సరే గృహస్థుల అభిరుచి, అవసరాలకు తగినట్లుగా ఎడిబుల్ లాండ్స్కేప్ గార్డెన్స్‌ను అందంగా డిజైన్ చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆహార సరఫరాకు అంతరాయం కలిగిన తర్వాత పరిమిత స్థలంలోనే కొంతమంది నగరవాసులు తమ వంట గదుల్లో, బాల్కనీల్లో కూరగాయలను పెంచడం ప్రారంభించారని ఎల్జీ చెబెట్ చెప్పారు. రెండు చదరపు మీటర్లు చాలు.. ‘ఆహారోత్పత్తి అనేది ప్రభుత్వ విధాన స్థాయిలో, ఇంటి స్థాయిలోనూ ఒక ముఖ్యమైన పని’ అని ప్రజలు గ్రహించారని రూట్–టు–ఫుడ్ ఇనీషియేటివ్ సంస్థను నిర్వహిస్తున్న ఇమాన్యుయేల్ అటాంబా అన్నారు. ప్రజలు, వారు తినే ఆహారం, దాన్ని ఎలా పండిస్తారు అనే విషయాలపై అవగాహన లోపించింది అన్నారాయన. ‘నగరంలో కూరగాయలు పెంచడం మంచిది కాదని భావించే వ్యక్తులు ఉన్నారు. ఇది మురికి పని లేదా చేయవలసిన పని కాదని అనుకుంటున్న మహానుభావులు కూడా వున్నార’ని న్యాంబురా సిమియు చెప్పారు. ఒక వ్యక్తికి సరిపడా కూరగాయలు పెంచుకునే కిచెన్ గార్డెన్‌కు కేవలం రెండు చదరపు మీటర్ల భూమి చాలు. పట్టణ వ్యవసాయానికి నీరు, స్థలం అవసరం. వీటిని నగరంలో ఏర్పాటు చేసుకోవటం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. కెన్యా నగరాలూ, పట్టణాల్లో వుండే చాలా మందికి ఈ వనరులు అందుబాటులో లేవు. ముఖ్యంగా నగర జనాభాలో ఎక్కువ మంది నివసించే మురికివాడల్లో మరీ కొరతగా వుంది అంటున్నారు ఆటంబ. సంప్రదాయ వ్యవసాయానికి అవసరమైన నీరు, స్థలంలో నాలుగింట ఒకవంతు కంటే తక్కువ ఉపయోగించి ఆహారాన్ని పండించే హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. - పంతంగి రాంబాబు చదవండి: Spineless Cactus: 5 ఎకరాల జామ తోట చుట్టూ ముళ్లు లేని బ్రహ్మజెముడు! ఈ ఉపయోగాలు తెలుసా.. కూర వండుకుని తింటే -
ప్రకృతి సేద్యంలో ఏపీ ఫస్ట్
ప్రకృతి వ్యవసాయం 17 రాష్ట్రాలకు విస్తరించింది. మొత్తం 16.78 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో అత్యధికంగా 6.30 లక్షల మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లోనే (2.90 లక్షల హెక్టార్లలో) ప్రకృతి సేద్యం చేస్తుండగా.. గుజరాత్లో 2.49 లక్షల మంది రైతులు (అత్యధికంగా 3.17 లక్షల హెక్టార్లలో) ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన జాతీయ పోర్టల్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కృషి భవన్లో ‘జాతీయ ప్రకృతి సేద్య కార్యక్రమం’ సారథ్య సంఘం మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తోమర్ ప్రకృతి వ్యవసాయంపై జాతీయ పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రకృతి సేద్య విస్తరణ కార్యక్రమాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం ఉపయోగించి రసాయన రహితంగా పంటలు పండించడాన్ని ప్రకృతి సేద్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర శాఖలతో సమన్వయం చేసుకుని మార్కెట్లను అనుసంధానించాలని అధికారులను కోరారు. తద్వారా, రైతులు తమ ఉత్పత్తులను మరింత సులభంగా విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు హాజరయ్యారు. ఈ పోర్టల్‌ను కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గురించి పూర్తి సమాచారం, అమలు విధానం, వనరులు, అమలు పురోగతి వివరాలను తెలిపే ఈ పోర్టల్ దేశంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మంత్రి తెలిపారు. 2021 డిసెంబర్ తర్వాత 17 రాష్ట్రాల్లో 4.78 లక్షల హెక్టార్లకు పైగా అదనపు వ్యవసాయ భూములను ప్రకృతి సేద్యం కిందకు తీసుకువచ్చినట్టు మంత్రి తోమర్ వెల్లడించారు. గంగా నది ఒడ్డున నాలుగు రాష్ట్రాల్లో 1.48 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం జరుగుతున్నట్లు తెలిపారు. – సాక్షి, సాగుబడి డెస్క్ -
Cuba: పట్టణ సేంద్రియ వ్యవసాయంతో వినూత్న పరిష్కారం..
క్యూబా.. నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు సంస్కృతికి ప్రపంచంలోనే అతి పెద్ద ఉదాహరణగా నిలిచింది. 70% క్యూబా ప్రజలు అర్బన్ ప్రాంతాల్లో నివాసం ఉంటారు. దేశానికి కావాల్సిన ఆహారంలో 50% ఇప్పుడు సేంద్రియ ఇంటిపంటలే అందిస్తున్నాయి. స్థానిక సహజ వనరులతో ఆరోగ్యదాయకమైన పంటలు పండించుకుంటూ ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోగలమని క్యూబా ప్రజలు ప్రపంచానికి చాటుతున్నారు. సోవియట్ యూనియన్ పతనానికంటే ముందు వరకు క్యూబా.. పెట్రోల్, డీజిల్‌తోపాటు 60%పైగా ఆహారోత్పత్తుల్ని, రసాయనిక ఎరువులు, పురుగుమందులను సైతం ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటూండేది. పొగాకు, చక్కెర తదితరాలను ఎగుమతి చేస్తూ ఆహారోత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటూ ఉండేది. ఆ దశలో సోవియట్ పతనం(1990–91)తో కథ అడ్డం తిరిగింది. అమెరికా కఠిన ఆంక్షల నేపథ్యంలో సోషలిస్టు దేశమైన క్యూబా అనివార్యంగా ఆహారోత్పత్తిలో స్వావలంబన దిశగా అడుగేయాల్సి వచ్చింది. క్యూబా ఆకలితో అలమటించిన కష్టకాలం అది. ఈ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో క్యూబా సమాజం ఉద్యమ స్ఫూర్తిని చాటింది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ పొలాలుగా మారిపోయాయి. అర్బన్ ప్రజలు సైతం తమ ఇళ్ల పరిసరాల్లోనే సీరియస్‌గా సేంద్రియ ఇంటిపంటల సాగు చేపట్టారు. గ్రామీణ రైతులు కూడా పొలాల్లో ఎగుమతుల కోసం చెరకు, పొగాకు వంటి వాణిజ్య పంటల సాగు తగ్గించి ఆహార పంటల సాగు వైపు దృష్టి సారించారు. సగం కంటే తక్కువ రసాయనాలతోనే రెండు రెట్లు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయవలసి వచ్చింది. డీజిల్ లేక ట్రాక్టర్లు మూలనపడ్డాయి. పూర్తిగా ఎద్దులతోనే వ్యవసాయం చేయాల్సి వచ్చింది. అటువంటి సంక్షోభం నుంచి ‘పట్టణ సేంద్రియ వ్యవసాయం’ వినూత్న పరిష్కారాన్ని ఆవిష్కరించింది. నగర/పట్టణ ప్రాంతాల్లో స్థానిక సేంద్రియ వనరులతోనే జీవవైవిధ్య వ్యవసాయ సూత్రాల ఆధారంగా సేద్యం సాధ్యమేనని రుజువైంది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ క్షేత్రాలుగా మారాయి. అక్కడ వీటిని ‘ఆర్గానోపోనికోస్’ అని పిలుస్తున్నారు. ‘సమీకృత సస్య రక్షణ, పంటల మార్పిడి, కంపోస్టు తయారీ, భూసార పరిరక్షణ చర్యలు పెద్ద ఎత్తున అమలయ్యాయి. అడుగు ఎత్తున మడులను నిర్మించి, డ్రిప్‌తో పంటలు సాగు చేశారు. వర్మి కంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులతో పాటు 25% మట్టిని కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి ఈ ఎత్తు మడుల్లో పంటల సాగుకు వినియోగిస్తున్నారు. ఇలా అమలు చేసిన పర్మాకల్చర్, వర్మికల్చర్ తదితర సాంకేతికతలనే ఇప్పుడు క్యూబా ఇతర దేశాలకు అందిస్తోంద’ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ క్యూబా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ స్టీఫెన్ విల్కిన్సన్ చెప్పారు. 1993లో క్యూబా వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రపంచంలోనే తొట్టతొలి పట్టణ వ్యవసాయ విభాగం ఏర్పాటైంది. నగరాలు, పట్ణణాల్లో పంటల సాగుకు ఆసక్తి చూపిన కుటుంబానికి లేదా చిన్న సమూహానికి ఎకరం పావు (0.5 హెక్టారు) చొప్పున ప్రభుత్వం స్థలం కేటాయించింది. వాళ్లు తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకొని తింటూ.. మిగిలినవి ఇతరులకు అమ్ముతుంటారు. ఈ ప్లాట్లు కాకుండా.. నగరం మధ్యలో, పరిసరాల్లో 5–10 ఎకరాల విస్తీర్ణంలో డజన్ల కొద్దీ పెద్దస్థాయి సేంద్రియ క్షేత్రాలు (ఆర్గానోపోనికోలు) ఏర్పాటయ్యాయి. సహకార సంఘాలే వీటిని నిర్వహిస్తున్నాయి. బచ్చలి కూర, పాలకూర, టమాటాలు, మిరియాలు, గుమ్మడికాయలు, బత్తాయిలు, ఔషధ మొక్కలు, అనేక ఇతర పంటలను భారీ పరిమాణంలో పండించి తక్కువ ధరకు ప్రత్యేక దుకాణాల్లో సహకార సంఘాలు విక్రయిస్తూ ఉంటాయి. హవానా నగరంలో దేశాధినేత కార్యాలయానికి అతి దగ్గర్లోనే 3 హెక్టార్లలో ‘ఆర్గానోపోనికో ప్లాజా’ క్యూబా ఆహార సార్వభౌమత్వాన్ని చాటుతూ ఉంటుంది. 1995 నాటికే క్యూబా రాజధాని నగరం హవానాలో ఇలాంటి 25,000 సేంద్రియ తోటలు వెలిశాయి. 2020 నాటికి వీటి సంఖ్య 30 వేలకు చేరింది. ఆ విధంగా క్యూబా సమాజం తనపై విరుచుకుపడిన ఆంక్షలను, ఆకలిని అర్బన్ అగ్రికల్చర్ ద్వారా జయించింది. (క్లిక్ చేయండి: అర్బన్ ఫుడ్ హీరో మజెదా బేగం!) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
అర్బన్ ఫుడ్ హీరో మజెదా బేగం!
కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆహార, ఆదాయ కొరత సమస్యల నుంచి బయటపడటానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పేద కుటుంబాలకు.. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) కొత్త బతుకు బాట చూపింది. అందుబాటులో ఉన్న స్థలాల్లో మెరుగైన పద్ధతుల్లో సేంద్రియ కూరగాయల సాగు నేర్పించింది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో వ్యవసాయక కుటుంబాల్లో పుట్టి పొట్ట చేతపట్టుకొని నగరాలకొచ్చి స్థిరపడిన పేదలకు స్వీడన్ నిధులతో ఎఫ్.ఎ.ఓ. అర్బన్ గార్డెనింగ్‌లో ఇచ్చిన శిక్షణ వారికి కొత్త భరోసా ఇస్తోంది. దీంతో 2.2 కోట్ల జనాభాతో కాంక్రీటు నివాసాలతో కిటకిటలాడే ఢాకా నగరం అంతటా కోవిడ్ కష్టకాలంలో సేంద్రియ కూరగాయ తోటలు వెలిశాయి. ఇవి పేదలకు సేంద్రియ ఆహారాన్ని రుచి చూపించాయి! ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో శిక్షణకు హాజరైన తర్వాత నాకు తెలిసింది’ అని మజెదా బేగం ఆనందంగా చెబుతోంది. ఢాకాలో నివాసం ఉండే పేద కుటుంబాల్లో ఆమె కుటుంబం ఒకటి. భర్త, ఐదుగురు పిల్లలతో కలసి రెక్కల కష్టం మీద మజెదా బేగం కుటుంబాన్ని లాక్కొస్తుంటుంది. కోవిడ్ విరుచుకుపడే సమయానికి టీ స్టాల్ నడుపుకుంటూ, చిన్నా చితకా వస్తువులు అమ్ముతూ, మురికివాడలో జీవనం సాగించేవారు. టీ స్టాల్ ప్రారంభించిన తర్వాత జీవన పరిస్థితులు అంతకుముందుకన్నా మెరుగుపడినప్పటికీ, వచ్చే ఆదాయం కుటుంబానికి పూర్తిగా సరిపోయేది కాదు. ఐదుగురు పిల్లలకు మరింత మెరుగైన పోషకాహారాన్ని అందించడం ఎలాగూ సాధ్యపడదు. అయితే, ఆహార వ్యవసాయ సంస్థ తోడ్పాటు వల్ల మజెదా ఏర్పాటు చేసుకున్న అర్బన్ కిచెన్ గార్డెన్ ఈ కొరత తీర్చింది. అసంఘటిత రంగంలో ఆహార, ఆర్థిక అభద్రత మధ్య జీవనం సాగించే అనేక మందిలాగే మజెదా కుటుంబాన్ని కూడా కోవిడ్ దారుణంగా దెబ్బ తీసింది. లాక్డౌన్ వల్ల జీవనాధారమైన టీ స్టాల్‌ను మూసివేయవలసి వచ్చినప్పుడు మజెదా చేతిలో డబ్బేమీ లేదు. పనులు దొరకడం కష్టమైపోయింది. పైగా, ఆమె భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ విధంగా ఏడుగురితో కూడిన కుటుంబానికి ఆమే జీవనాధారమైంది. అయినా, ఆమె నిరాశ పడకుండా ధైర్యంగా నిలబడింది. వ్యవసాయం అంటే ఆమెకు బాల్యం నుంచి ఉన్న ఇష్టం ఇప్పుడు ఉపయోగపడింది. ఇళ్లకు దగ్గర్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో సేంద్రియ కూరగాయలు పండించటం, కుటుంబం తినగా మిగిలిన కూరగాయలను అమ్మి ఆదాయం పొందటంలో పేద మహిళలకు ఎఫ్.ఎ.ఓ. శిక్షణ ఇచ్చింది. దీంతో, ఢాకా నగరం మధ్యలో ఇళ్ల వెనుక స్థలాలు, ఖాళీ స్థలాల్లో, నదీ తీర ప్రాంతాల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లు వెలిశాయి. మజెదా కూడా కూరగాయల సాగు చేపట్టింది. ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలో, చీడపీడల్ని ఎలా అదుపులో ఉంచాలో అంతకుముందు నాకు తెలీదు. కానీ ఇప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో ఇప్పుడు తెలిసింది. ఇప్పటికైనా రైతును కావడం గొప్ప అదృష్టం’ అంటోంది మజెదా సంతృప్తితో. పురుగుమందులు వాడకుండా తమ కళ్ల ముందే ఆమె పండించే కూరగాయలకు స్థానికంగా చాలా డిమాండ్ ఉంది. కూరగాయల తోట ద్వారా తన కుటుంబ అవసరాలు పోను నెలకు 1500 టాకాల (సుమారు రూ. 2 వేలు) ఆదాయం పొందుతోంది మజెదా. ఐదుగురు బిడ్డలున్నా ఎన్నడూ లేనిది ఇప్పుడు ఒక బిడ్డను ఆమె బడికి పంపగలుగుతోంది. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలవగలిగినందుకు తనకు చాలా గర్వంగా ఉందని మజెదా పట్టలేని సంతోషంతో చెబుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం–2022 సందర్భంగా ఎఫ్.ఎ.ఓ. ఆమెను ‘ఫుడ్ హీరో’గా గుర్తించి గౌరవించింది అందుకే! (క్లిక్ చేయండి: నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం!) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
మైండ్‌బ్లోయింగ్ ఐడియా.. మట్టి లేకుండా వ్యవసాయం, ఏడాదికి 70 లక్షల ఆదాయం!
భారత్ గతంలో వ్యవసాయ ఆధారిత దేశంగా ఉండేది. అధిక శాతం జనాభా ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉండేవారు. అయితే ఏళ్లు గడిచే కొద్దీ వ్యవసాయానికి సాయం లేక డీలా పడిపోయింది. దీంతో వ్యవసాయ భూములు కాలం గడిచే కొద్దీ కనుమరుగవుతూ ఉన్నాయి. మరోవైపు ఇటీవల కొందరు రసాయనాల ద్వారా పంటలు పండిస్తున్నట్లు చాలా ఘటనల్లో నిరూపితమైంది. దీంతో ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకమైంది. ఈ తరుణంలో ఎటువంటి రసాయనాలు కలపకుండా సేంద్రీయ పద్ధతిలో సహజంగా పండించిన కూరగాయలు, పండ్లకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మట్టి లేకుండా వ్యవసాయం.. అందుకే వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఓ వ్యక్తి తన ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చి ఏడాదికి 70 లక్షల సంపాదిస్తూ అందరికీ షాకిస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్ కి చెందిన రామ్ వీర్ సింగ్ అనే రైతు అతని ఇంటి మీద పంట వేయడమే కాకుండా లాభాల బాట పట్టించి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు. గతంలో జర్నలిస్ట్‌గా పని చేసిన ఈయన.. తనకున్న వనరులతో వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. అందుకే వింపా ఆర్గానిక్ అండ్ హైడ్రోపోనిక్స్ అనే స్టార్టప్ ని ప్రారంభించి హైడ్రోపోనిక్ పద్దతిని తెలుసుకుని, దానికి అనుగుణంగా తన ఇంటిలో పై ఉన 3 అంతస్తులను వ్యవసాయ క్షేత్రంగా మలచుకున్నాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పద్ధతితో సాగుకు మట్టి అవసరం లేదని, 90 శాతం నీటిని పొదుపు చేయవచ్చు. ఇందులో రసాయనాలు కూడా వాడాల్సిన అవసరం లేదు. కేవలం పీవీసీ పైపుల సహాయంతో అతని బాల్కనీలో పంటలు పండిస్తున్నాడు. స్ట్రా బెర్రీ, కాలీ ఫ్లవర్, బెండకాయలు వంటి 10 వేల రకాల మొక్కలను 3 అంతస్తుల్లో లేయర్స్ గా వేసి పండిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరో విషయం ఏమిటంటే ఈ విషయంలో ఇతర రైతులకు కూడా రామ్ వీర్ సహాయం చేస్తున్నాడు. This man earns 70 lakhs growing vegetables in a 3 storey house without soil or chemicals.#growingvegetables #housegardening #chemicalfree #jounalist #uttarpradesh pic.twitter.com/aZ3N6KFCWN — The Better India (@thebetterindia) October 20, 2022 చదవండి: క్రెడిట్ స్కోరు పెంచుకోవాలా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! -
18 ఎకరాలు: బత్తాయి, వరి, సీతాఫలం సాగు.. బియ్యం కిలో రూ. 80 చొప్పున! ఇంకా..
జీవనమే నిత్య పోరాటమైతే వ్యవసాయం అనుక్షణ యుద్ధమే అంటారు ఒంటరి మహిళా రైతు శశికళ. ఎం.ఎ., బీఈడీ చదివిన ఆమె భర్త ఆకస్మిక మృతితో ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేపట్టారు. 2005 నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఆవులంటే ఇష్టంతో గోశాలను ఏర్పాటు చేసి వర్మీ కంపోస్టు, వర్మీ కల్చర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. పచ్చదనాన్ని అమితంగా ఇష్టపడే ఆమె నర్సరీ ఏర్పాటు చేసుకొని లాండ్స్కేప్ కన్సల్టెంట్‌గా ఎదిగారు. క్షణం తీరిక లేకుండా పనుల్లో మునిగిపోయే శశికళ రైతుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇటు రైతుగా, అటు ఒంటరి మహిళగా దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను వజ్రసంకల్పంతో ఎదుర్కొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 17 ఏళ్లుగా 18.5 ఎకరాల్లో మొక్కవోని దీక్షతో సమీకృత సేంద్రియ వ్యవసాయం కొనసాగిస్తున్న కర్ర శశికళ స్వగ్రామం (నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం) దుగ్గెపల్లి. సొంతంగా తయారు చేసుకున్న వర్మీ కల్చర్‌తో బత్తాయి తోటను చీడపీడల నుంచి కాపాడుకోగలగటం ఆమెను దృఢచిత్తంతో సేంద్రియ వ్యవసాయం వైపు తొలి అడుగులు వేయించాయి. సొంతంగా తయారు చేసుకునే వర్మీ కంపోస్టుకు అనేక జీవన ఎరువులు కలిపి తయారు చేసిన ‘వర్మీ కల్చర్’ను ప్రధానంగా శశికళ ఉపయోగిస్తున్నారు. దీనితోనే వరి, బత్తాయి, పశుగ్రాసం తదితర పంటలతో పాటు నర్సరీ మొక్కలను సాగు చేస్తున్నారు. వర్మీ కల్చర్‌ను ఇతర రైతులకూ విక్రయిస్తూ ఆదాయం గడిస్తున్నారు. – నాతి రమేష్, సాక్షి, త్రిపురారం, నల్లగొండ జిల్లా వరి.. రెండేళ్లకో పంట! తనకున్న వనరులను ప్రణాళికాబద్ధంగా ఉపయోగిస్తూ ముందడుగు వెయ్యటం శశికళ సేద్యం ప్రత్యేకత. సొంత భూమి 18.5 ఎకరాలకు గాను 6 ఎకరాల్లో బత్తాయి, 5 ఎకరాల్లో వరి పంట, 2 ఎకరాల్లో సీతాఫలం తోట సాగు చేస్తున్నారు. 2 ఎకరాల్లో దేశీ జాతుల గోశాలను ఏర్పాటు చేసి.. వర్మీ కల్చర్ ఉత్పత్తి చేస్తున్నారు. పుణేలో శిక్షణ పొంది 3.5 ఎకరాల్లో మూడేళ్లుగా నర్సరీని నిర్వహిస్తూ.. లాండ్స్కేప్ కన్సల్టెంట్‌గా ఎదుగుతున్నారు. అనుదినం 20 మంది మహిళా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని బియ్యం చేసి నేరుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని పరిచయస్తులకు కిలో రూ. 80 చొప్పున అమ్ముతున్నారు. ఒక సీజన్లో పండించిన ధాన్యం నిల్వచేసి రెండేళ్లపాటు బియ్యం విక్రయిస్తుంటారు. రెండేళ్లకు ఒక సీజన్లో మాత్రమే వరి పండిస్తారు. ఉదా.. ప్రస్తుత వానాకాలంలో 5 ఎకరాల్లో 5204 సన్న రకం వరి పంటను సాగు చేస్తున్నారు. యాసంగిలో గానీ, వచ్చే ఏడాది రెండు సీజన్లలో గానీ వరి పండించరు. ఈ మూడు సీజన్లలో తమ ఆవుల కోసం పశుగ్రాసం పండిస్తారు. మార్కెట్ అవసరం మేరకు ఏ పంటైనా పండించటం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని శశికళ అనుభవపూర్వకంగా చెప్తున్నారు. వరి పంటకు దుక్కి దశలో ఓ సారి, చిరు పొట్ట దశలో మరోసారి వర్మీ కల్చర్‌ను వేస్తున్నారు. దీంతో పాటు ద్రవరూప ఎరువు వర్మీవాష్‌ను పైప్లైన్ల ద్వారా అందిస్తున్నారు. వర్మీ కల్చర్ ప్రొడక్ట్ ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తున్నదన్నారు. 70 కిలోల ధాన్యం బస్తాలు ఎకరానికి 35 వరకు పండుతాయన్నారు. పూర్తిస్థాయి శ్రద్ధతో 3 దఫాలు వర్మీకల్చర్, 4 దఫాలు పంచగవ్య వాడటం ద్వారా శ్రీవరిలో ఎకరానికి 55 బస్తాల ధాన్యం దిగుబడి(2008లో) సాధించిన అనుభవం ఆమెది. ప్రస్తుతం నర్సరీ, లాండ్‌స్కేపింగ్ రంగంలోకి అడుగుపెట్టడం వల్ల వరి సాగుపై అంతగా శ్రద్ధ చూపలేకపోతున్నామన్నారు. 6 ఎకరాల్లో బత్తాయి మొక్కలు నాటి మూడేళ్లయ్యింది. ఏడాదికి రెండుసార్లు వర్మీకల్చర్, హ్యూమిక్ యాసిడ్‌ను వాడుతున్నారు. వచ్చే ఏడాది పంట కాపు వస్తుంది. 2 ఎకరాల్లో రెండేళ్ల క్రితం సీతాఫలం తోటను సాగు చేస్తున్నారు. ఏడాదికి రెండు సార్లు వర్మికల్చర్, హ్యూమిక్ యాసిడ్‌ను వాడుతున్నారు. కాపు మొదలవుతోంది. ఏటా 100 టన్నుల వర్మీ కల్చర్ 2 ఎకరాల్లో ఏర్పాటైన గోశాలలో 45 దేశీ జాతుల ఆవులు, 25 ఎద్దులు 7 లేగదూడలు ఉన్నాయి. పేడ, మూత్రం, చేపల చెరువు వ్యర్థ జలాలను వర్మీ కల్చర్ ఉత్పత్తికి వాడుతున్నారు. ఏడాదికి సుమారు 100 టన్నుల వర్మీ కల్చర్‌ను తయారు చేస్తున్నారు. వర్మీ కల్చర్‌ను స్వంత వ్యవసాయానికి వినయోగిస్తూ ఇతర రైతులకు కిలో రూ. 15 చొప్పున విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. 450 రకాల మొక్కల ఉత్పత్తి పుణే వెళ్లి 20 రోజులు శిక్షణ పొందిన తర్వాత శశికళ తన వ్యవసాయ క్షేత్రంలోనే 3.5 ఎకరాల్లో నర్సరీని ఏర్పాటు చేశారు. లాండ్‌స్కేపింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధి సాధిస్తున్నారు. ఇన్డోర్, అవుట్ డోర్, బోన్సాయ్ మొక్కలు.. అంటుకట్టిన పండ్లు, పూల మొక్కలు సుమారు 450 రకాల మొక్కలు ఉన్నాయి. కొన్ని రకాల మొక్కలను పూణె, కోల్కత్తా, బెంగుళూరు నుంచి తెప్పిస్తున్నారు. నిమ్మ, నారింజ, ఉసిరి, బత్తాయి అంటు మొక్కలను, ఎవెన్యూ ప్లాంటేషన్‌కు వాడే రకరకాల మొక్కలను సొంతంగా ఉత్పత్తి చేస్తున్నారు. నర్సరీలో పెంచిన మొక్కలను స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపల్ ఆఫీసులకు విక్రయిస్తున్నారు. ప్రైవేటు గృహాల్లో లాండ్‌స్కేపింగ్‌కు వినియో విక్రయిస్తూ శశికళ ఆదాయం పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయంలో నిలదొక్కుకోవడంతో పాటు నర్సరీ రైతుగా, లాండ్స్కేప్ నిపుణురాలిగా ఎదుగుతున్న శశికళ మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తీరికలేని పనంటే ఇష్టం..! తీరిక లేని పనిలో నిమగ్నం కావటం అంటే ఇష్టం. పరిగెట్టి సంపాయించాలని కాదు. స్వతంత్ర జీవనం పట్ల, పచ్చదనం పట్ల మనసులో ఉన్న ఇష్టం కొద్దీ నర్సరీ–లాండ్‌స్కేపింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ఈ రంగం పుంజుకుంటున్నది. అమ్ముడుపోకుండా మిగిలిన మొక్కలను పెద్ద (21 ఇంచ్‌ల) కవర్లలోకి మార్చి తర్వాత నెమ్మదిగా ఎక్కువ ధరకు అమ్ముతున్నాను. 20 మందికి పనికల్పించాను. వ్యవస్థ సజావుగా నడిచే అంత ఆదాయం అయితే వస్తోంది. వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. సేంద్రియ వ్యవసాయంలో ఖర్చులు అదుపు చేసుకుంటేనే మంచి ఆదాయం వస్తుంది. ఒకే పంటపై ఆధారపడకుండా నర్సరీ ప్రారంభించాను. కష్టమైనా నష్టమైనా వ్యవసాయంలోనే నాకు సంతృప్తి. అమ్మానాన్న, బాబు సపోర్ట్ ఉండటంతో ఒంటరి మహిళనైనా పట్టుదలతో జీవన పోరాటం సాగిస్తున్నాను. పురుషులకు లేని సమస్యలు మహిళా రైతులను ఇంటాబయటా ఇబ్బంది పెడుతుంటాయి. తప్పదు. ఎదుర్కోవాల్సిందే! – కర్ర శశికళ (91824 43048), సేంద్రియ రైతు, లాండ్‌స్కేపింగ్ కన్సల్టెంట్, దుగ్గెపల్లి, త్రిపురారం మం., నల్లగొండ జిల్లా చదవండి: Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. ఎకరంలో కూరగాయల పందిరి సాగు.. ఏడాదికి లక్ష వరకు ఆదాయం! ఇక సోరకాయతో నెలలో 50 వేల వరకు.. -
ఆదివాసీ రైతు.. అభివృద్ధి పథంలో సాగుతూ..
బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా): పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు ఎటువంటి రసాయనాలను వినియోగించకుండా ఆరోగ్యవంతమైన పంటలు పండించేలా కృషి చేస్తున్న ఆదివాసీ జీడిమామిడి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సీఈఓ సోడెం ముక్కయ్యను వైఎస్సార్ అచీవ్మెంట్ పురస్కారం వరించింది. గిట్టుబాటు ధరతో పాటు నేరుగా పంటలను విక్రయించుకునేలా రైతులకు తోడ్పాటునందించేలా గురుగుమిల్లిలో 2019లో నాబార్డు సహకారంతో ఆయన ఆదివాసీ జీడిమామిడి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటుచేశారు. అలాగే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఆదివాసీ జీడిమామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పారు. ఆయా సంస్థల ద్వారా ఏటా లక్షలాది రూపాయల అమ్మకాలు చేస్తున్నారు. దీంతోపాటు 200 ఎకరాల్లో జీడిమామిడి పంటలను ప్రోత్సహించడంతోపాటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల ద్వారా రైతులు పంటలు పండించేలా ముక్క య్య కృషి చేస్తున్నారు. ప్రస్తుతం వీరి సంస్థలో 714 మందికి పైగా రైతులు పనిచేస్తున్నారు. వ్యవసా యాభివృద్ధి లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది గురుగుమిల్లి వంటి మారుమూల గ్రామంలో పనిచేస్తున్న నేను వైఎస్సార్ సాఫల్య పురస్కారానికి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ గుర్తింపుతో మరింత బాధ్యత పెరిగింది. గిరిజన ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధికి మరింత కృషి చేస్తా. – సోడెం ముక్కయ్య -
Natural Farming: ప్రకృతి వ్యవసాయానికి ఏపీ చేదోడు
సమస్త జీవకోటి భారాన్ని మోసేది నేల. గతం నుండి మన తరానికి సంక్రమించిన వారసత్వ సంపద నేల. నేలను సారవంతంగా ఉంచే కారకాలు అపరిమితమైనవి కాదు, పరి మితమైనవి. విచ్చలవిడిగా భూమిని వాడిపడేస్తే... అది త్వరలోనే వట్టిపోతుంది. మనం ఈ భూమి మీద నివసిస్తున్నట్లే భవిష్యత్తు తరాలూ మనుగడ సాగించాలంటే... వారికి పనికి రాని నేలను కాక... సజీవమైన భూమిని అప్పగించాల్సిన బాధ్యత మనదే. మనుషుల నిర్లక్ష్యం, పేరాశ కారణంగా సాగు భూమి నిస్సారమైపోతోంది. నేల సేంద్రియ కర్బన పదార్థాలను కోల్పోయి పంటల సాగుకు పనికి రాకుండా పోతున్నది. వ్యవసాయంలో విచక్షణారహితంగా రసాయనాలను వాడటం వల్ల నేల నిస్సారమవుతున్నది. అధిక మొత్తంలో రసాయనాలు వాడిన ఫలి తంగా వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు తిన్న జీవజాలం అనారోగ్యం పాలవుతుంది. కన్న తల్లి పాలు కూడా పంటలపై చల్లే రసాయనాల కారణంగా విషతుల్య మవుతున్నాయని రాజస్థాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు డాక్టర్ ఇంద్రసోని పాల్ తెలిపారు. విషతుల్యమైన వ్యవసాయ ఉత్పత్తుల వల్ల పిల్లల రోగ నిరోధక శక్తి నశిస్తుందనీ, తెలివితేటలు, జ్ఞాపకశక్తి దెబ్బతింటాయనీ ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. అందుకే వ్యవసాయ విధానం ప్రకృతికి దగ్గరగా ఉండాలనే నినాదం ఇప్పుడు ఊపందుకుంది. అందులో భాగంగా నేలలోని సారం దీర్ఘకాలం మన గలిగే నిర్వహణ పద్ధతులు ప్రచారం చేస్తున్నారు. మట్టి ఆరోగ్యమే మనిషి ఆరోగ్యం అని తాత్వికతతో వ్యవసాయాన్ని సాగించాలి. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికీ, పర్యావరణాన్ని సుస్థిరమైనదిగా తయారు చేయ డానికీ, రైతుల జీవన ప్రమాణాలు పెంచడానికీ, సహజ వనరు లను ఉపయోగించి మంచి ఫలసాయం సాధించడానికీ, ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా ‘రైతు సాధికార సంస్థ’ ద్వారా జీరో–బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమాలను అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం, వినియోగదారుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి బహుళ లక్ష్యాలతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. రైతుల సాగు ఖర్చులను తగ్గించడం, రైతుల దిగుబడిని మెరుగుపరచడం, వారి నష్టాలను తగ్గించడం, లాభదాయ కమైన ధరలను పొందడం ద్వారా వారి నికర ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అధిక ధర కలిగిన కృత్రిమ ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు ఉపయోగించకుండా ప్రకృతికి అనుగుణంగా గోమూత్రం, గో పేడ, వేప ఆకులు, స్థానిక వనరులతో... ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, అగ్నిఅస్త్రం, బ్రహ్మాస్త్రం వంటివాటిని తయారుచేసుకుని వ్యవసాయంలో ఉపయోగించడానికి ప్రోత్సహిస్తోంది. ఇందువల్ల నేలలో జీవ పదార్థం అధికమవ్వడమే కాక మొత్తంగా భూసారం పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా మానవ ఆరోగ్యమే కాక, నేల ఆరోగ్యాన్నీ కాపాడవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. (క్లిక్ చేయండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!) – ఎ. మల్లికార్జున, ప్రకృతి వ్యవసాయ శిక్షకుడు -
శ్రీవారికి సేంద్రీయ ధాన్యం
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. సేంద్రియ విధానంలో సాగు చేసిన (ఆర్గానిక్) పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా స్వామివారి ప్రసాదాలు, అన్న ప్రసాదాల్లో కూడా సేంద్రియ బియ్యం వినియోగించాలని ఆలోచనతో ఈ రకం ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఎంఎస్పీ కంటే పది శాతం ధర అధికంగా ఇచ్చి కొనుగోలు చేయడానికి రైతులను ఎంపిక చేసి ఒప్పందాలు చేసుకుంటోంది. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రత్యేక సర్టిఫికెట్ అందజేస్తోంది. వారు పండించిన పంటను మాత్రమే టీటీడీ కొనుగోలు చేయనుంది. కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రసాయనిక ఎరువుల రహిత పంటలు పండించేలా రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల్లో పండించిన పంటలకు ప్రభుత్వమే నేరుగా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. అందులో భాగంగా కొన్ని ఎంపిక చేసిన పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసేలా ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గతేడాది నాలుగు జిల్లాల్లో శనగ పంటను ఎంపిక చేయగా, ఈ ఏడాది వరి పంటను ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లా ఎంపిక ఈ ఏడాది ప్రకృతి సాగు పద్ధతుల్లో వరి ధాన్యాన్ని పెద్ద ఎత్తున పండించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రాష్ట్రంలో వరి అధికంగా సాగయ్యే పలు జిల్లాలను ఎంపిక చేశారు. అందులో భాగంగా మేలు రకం వరి సాగుకు పెట్టిన పేరైన నెల్లూరు జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. జిల్లాలో ఈ రబీ సీజన్ నుంచి వరి పంటను సేంద్రియ విధానంలో సాగు పద్ధతులను పాటించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఎంపిక చేసిన రైతులకు ఈ తరహా సాగు విధానంలో అవగాహన కల్పించేందుకు ఒప్పిస్తున్నారు. గుడ్లూరు మండలంలోని చేవూరులో 25 మంది రైతులతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. దీని ప్రకారం రైతులు కచ్చితంగా అధికారులు సూచించిన సేంద్రియ సాగు పద్ధతుల్లోనే పంటలు పండించాలి. ఎటువంటి రసాయనిక ఎరువులను వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే ఉపయోగించాలి. రైతులకు సేంద్రియ ఎరువులను సరఫరా చేయడంతో పాటు సాగులో వారికి ఆ శాఖ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తారు. ఇలా పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే ప్రత్యేకంగా మార్కెటింగ్ చేయిస్తుంది. 2,640 టన్నుల ధాన్యం సరఫరాకు టీటీడీతో ఒప్పందం ప్రకృతి సాగు పద్ధతుల్లో పండించిన వరి ధాన్యాన్ని మార్కెటింగ్ కోసం ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డుతో ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. జిల్లా నుంచి 2,640 టన్నుల మేలు రకం (సన్నబియ్యం) ధాన్యం సరఫరా చేసేందుకు అంగీకరించారు. ఇందుకు 1,300 ఎకరాల్లో వరిని సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఎకరాకు 2 టన్నుల చొప్పున దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 870 ఎకరాల్లో సాగు చేసేలా రైతులతో ఒప్పందం చేసుకున్నారు. మిగతా విస్తీర్ణానికి రైతులను ఒప్పించి పనిలో అధికారులున్నారు. సన్న రకాలే సాగు రైతుల ద్వారా ప్రధానంగా మూడు రకాలైన సన్న బియ్యం రకాల వరిని పండించనున్నారు. వీటిలో నెల్లూరు సన్నాలు (ఎన్‌ఎల్‌ఆర్34449), సాంబమసూరి (బీపీటీ 5204), రాజేంద్రనగర్ సన్నాలు (ఆర్ఎన్ఆర్15048) రకాలను పండించాలి. సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతుల్లోనే వరి పంటను ఈ రబీ సీజన్లో సాగు చేయించనున్నారు. ఈ విధంగా పండించిన పంటను ప్రభుత్వం సాధారణంగా ధాన్యానికి క్వింటాకు ఇచ్చే మద్దతు ధర కంటే 10 శాతం అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయనున్నారు. ఈ సేకరించిన ధాన్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద ట్రస్ట్‌కు సరఫరా చేయనున్నారు. పండించిన శనగ పంటను గతేడాది టీటీడీకి సరఫరా చేశారు. సేంద్రియ వ్యవసాయ రైతులకు సర్టిఫికెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగు చేసే రైతుల ఉత్పత్తులకు గుర్తింపు ఇచ్చేలా ఈ ఏడాది నుంచి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించిన పంటలను ప్రత్యేకంగా మార్కెటింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ ధర కంటే అధిక ధర రైతులకు లభిస్తుందని చెబుతున్నారు. అన్ని రకాల పంటలు సాగు చేసే రైతులకు ప్రకృతి వ్యవసాయశాఖ నుంచి సర్టిఫికెట్లు జారీ చేస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. రసాయన రహితంగా ధాన్యం ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల్లో రబీ సీజన్లో ధాన్యం పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రసాయన రహిత ధాన్యాన్ని టీడీటీకి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. ఇందు కోసం పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాను ఎంపిక చేశారు. 2640 టన్నుల ధాన్యం ఉత్పత్తి కోసం కొంత మంది రైతులతో ఒప్పందం చేసుకుని మేలు రకం ధాన్యాన్ని జెడ్బీఎన్ఎఫ్ సిబ్బంది పర్యవేక్షణలో పండించేలా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా సేంద్రియ ఎరువులను వినియోగించి పండించిన ధాన్యా న్ని మాత్రమే తీసుకుంటాం. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రత్యేకంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. – డీ మాలకొండయ్య, జెడ్బీఎన్ఎఫ్, డీపీఎం -
గిరిజన రైతులకు ఎఫ్‌పివో దన్ను! కాఫీ పండ్లు కిలో రూ. 50, మిరియాలు 400– 430కి కొని!
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి వ్యవసాయదారుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, నాణ్యమైన విత్తనాలను అందించడంలో తనదైన వ్యూహంతో ముందుకెళ్తోంది ‘మా భూమి’ ఎఫ్.పి.ఓ.! 2012–13లో గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామంలో పది మంది రైతులు కలిసి ‘శ్రీ వెంకటేశ్వర రైతు క్లబ్’ను ఏర్పాటు చేసుకున్నారు. డి.పారినాయుడు నేతృత్వంలోని జట్టు ట్రస్టుతో పాటు నాబార్డు సహకారం తీసుకున్నారు. రూ.5 లక్షల యంత్ర సామాగ్రిని 90 శాతం రాయితీపై సమకూర్చుకొని విత్తన శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత గరుగుబిల్లి మండలంలోని రైతు క్లబ్లన్నింటినీ ఏకం చేసి.. మా భూమి రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్‌పి.ఓ.ను) కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించారు. 4 మండలాలకు చెందిన 573 మంది రైతులు ఈ ఎఫ్.పి.ఓ.లో సభ్యులుగా, 15 మంది డైరెక్టర్లుగా వున్నారు. ఆరేళ్ల క్రితం నుంచి ఎఫ్.పి.ఓ. ప్రకృతి వ్యవసాయ విధానం వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, వేపపిండి, కషాయాలను తయారు చేసి రైతులకు విక్రయిస్తోంది. వీటి రవాణాకు ఎస్బీఐ సీఎస్ఆర్ నిధులతో రూ.7 లక్షల వ్యాన్ సమకూరింది. నూనె గానుగను రైతుసాధికార సంస్థ తోడ్పాటుతో ఏర్పాటు చేశారు. వివిధ సంస్థల నుంచి దఫదఫాలుగా రూ. 70 లక్షల రుణాలు తీసుకొని వ్యాపారాభివృద్ధికి ఉపయోగించారు. 2016–17లో రూ.18 లక్షల వ్యాపారం ద్వారా రూ. 80 వేల నికర లాభం గడించిన ఎఫ్.పి.ఓ... 2020–21 నాటికి రూ.70.02 లక్షల వార్షిక టర్నోవర్‌తో రూ.46 వేల నికరాదాయం ఆర్జించటం విశేషం. రైతుల్లో 90% చిన్న, సన్నకారు రైతులే. పెరుగుతున్న సాగు ఖర్చులు, తగ్గుతున్న దిగుబడులు, దళారుల దగాలు, ప్రకృతి వైపరీత్యాలు.. ఇవీ ఈ బడుగు రైతుల సమస్యలు. ఈ సమస్యలను తట్టుకొని రైతులు నిలబడాలంటే.. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లటంతో పాటు తమ ఉత్పత్తులకు విలువను జోడించి, గిట్టుబాటు ధరలకు అమ్ముకోగలగటం ముఖ్యం. బడుగు రైతులను ఈ దిశగా సమైక్యంగా నడిపించడంలో ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఏపీ రైతులకు చెందిన అటువంటి రెండు ఎఫ్.పి.ఓ.లు 2022–23కు సంబంధించి జాతీయ స్థాయి ‘జైవిక్ ఇండియా’ అవార్డుల్ని గెలుచుకోవటం విశేషం. ఈ నెల 23న ఆగ్రాలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. పాడేరు, పార్వతీపురం ప్రాంత రైతులకు విశేష సేవలందిస్తున్న ఈ రెండు ఎఫ్.పి.ఓ.ల విజయగాథలు రైతు లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. గిరిజన రైతులకు ఎఫ్‌పివో దన్ను! కాఫీ, మిరియాలు, పసుపు కొనుగోళ్లతో రైతులకు మంచి ఆదాయం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలోని ఎం. నిట్టాపుట్టు గ్రామం కేంద్రంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పివో) 2018లో ఏర్పాటైంది. 549 మంది రైతులు షేర్ హోల్డర్లుగా ఉన్నారు. 11 పంచాయతీలకు చెందిన 75 గ్రామాల్లోని 3,685 మంది గిరిజన రైతుల ద్వారా 9,575 ఎకరాల్లో ఈ ఎఫ్.పి.ఓ. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పనే లక్ష్యంగా గిరిజన రైతులకు అండగా నిలుస్తోంది. గత మూడేళ్లుగా కాఫీ పండ్లు, పాచ్మెంట్, మిరియాలు, పసుపు ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తోంది. బ్యాంకుల సహకారంతో నిట్టాపుట్టు ఎఫ్‌పివో వ్యాపారంలో రాణిస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ ఎఫ్పివోగా గుర్తింపు పొందింది. కాఫీ, మిరియాలు, పసుపు తదితర ఉత్పత్తుల వ్యాపారం ద్వారా 2019–20లో రూ.29.9 లక్షలు, 2020–21లో రూ.1.91 కోట్ల టర్నోవర్ సాధించింది. కాఫీ పండ్లను కిలో రూ.50కు, మిరియాలను రూ.400–430కి, పసుపును రూ.65–80కు ఎఫ్.పి.ఓ. కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది. సీజన్లో రోజుకు 35–45 మంది గిరిజనులకు పని కల్పిస్తూ రూ.350ల రోజు కూలీ చెల్లిస్తున్నారు. గిరిజన రైతులు రసాయనాలు వాడకుండా పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికెట్లు సాధించి గిట్టుబాటు ధర రాబట్టడంలో ఎం.నిట్టాపుట్టు ఎఫ్‌టీవో మంచి పేరు తెచ్చుకుంది. – ఎన్.ఎం. కొండబాబు, సాక్షి, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా ∙మాభూమి ఎఫ్.పి.ఓ.లో విత్తనాల ప్రాసెసింగ్ యంత్రం దళారులు లేకుండా నేరుగా వ్యాపారం మాభూమి విత్తన కంపెనీ ద్వారా నాణ్యమైన విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నాం. ఆరోగ్యానికి మేలు చేసే వరి దేశీయ రకాలైన నవారా, కాలాభట్, రత్నచోడి, ఢిల్లీ బాస్మతి, చిట్టి ముత్యాలు, సుగంధ సాంబ విత్తనాలను రైతులకు అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించటం, దళారుల్లేకుండా నేరుగా వ్యాపారం నిర్వహించడం వంటి పనులు చేస్తున్నాం. – తాడేన మన్మథనాయుడు (63649 93344), మాభూమి ఎఫ్ఏవో కమిటీ సభ్యుడు, లక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలం ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం కృషి మాభూమి ఎఫ్ఏవో ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం హైదరాబాద్‌లోని స్కంద ఆర్గానిక్–42 కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ కంపెనీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి సర్టిఫికేట్‌ను మంజూరు చేస్తారు. ఇంటర్నేషనల్æ కంట్రోల్ సిస్టమ్(ఐసీఎస్) సర్టిఫికెట్ ఉంటే రైతులు పండించిన ఉత్పత్తులను లాభాలున్న చోట ఎక్కడైనా విక్రయించుకొనేందుకు అవకాశం ఉంటుంది. – ఎం. నూకం నాయుడు (94400 94384), సీఈవో, మాభూమి ఎఫ్‌పీవో, తోటపల్లి తూకాలు, ధరల్లో మోసాలకు స్వస్తి దళారుల తూకాలు, ధరల్లో మోసాలకు స్వస్తి చెప్పి తోటి గిరిజనులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఎఫ్‌పీవోను ప్రారంభించాం. కాఫీ, మిరియాలు, పసుపు మార్కెటింగ్ బాధ్యతలు చేపట్టి రైతులకు మంచి లాభాలు అందిస్తున్నాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో చిరుధాన్యాలను కూడా కొనుగోలు చేస్తాం. ప్రకృతి వ్యవసాయంపై అన్ని గ్రామాల్లోనూ విస్తృత ప్రచారం చేస్తున్నాం. – పరదాని విజయ (63000 39552) , చైర్పర్సన్, ఎం.నిట్టాపుట్టు ఎఫ్‌టీవో, జి.మాడుగుల మం., అల్లూరి సీతారామరాజు జిల్లా రెండేళ్లుగా ఎఫ్పీవోకే అమ్ముతున్నా... ఎఫ్‌పీవో ద్వారా రెండేళ్లుగా మంచి లాభాలు వస్తున్నాయి. ఈ ఏడాది కిలో రూ.50ల ధరతో 200 కిలోల కాఫీ పండ్లు, రూ.250ల ధరతో 500 కిలోల పాచ్మెంట్ కాఫీ గింజలను అమ్మాను. మిరియాలు కిలో రూ.460కి ఎఫ్‌పివో కొనుగోలు చేసింది. – పరదాని లక్ష్మయ్య, నిట్టాపుట్టు గ్రామం, జి.మాడుగుల మం. ,ఏఎస్సార్ జిల్లా – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, విజయనగరం చదవండి: Sagubadi: కాసుల పంట డ్రాగన్! ఎకరాకు 8 లక్షల వరకు పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా! -
ప్రకృతి సాగులో ఏపీ భేష్
సాక్షి, అమరావతి/అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి సాగును ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుతమని గ్రౌండ్స్ వెల్ ఇంటర్నేషనల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీవ్ బ్రేసియా ప్రశంసించారు. సంస్థ ఆధ్వర్యంలో వారం రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధుల బృందం గురువారం అనంతపురంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ టి.విజయకుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిశీలనలో తమ అనుభవాలను విదేశీ ప్రతినిధులు పంచుకున్నారు. స్టీవ్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయ విధానం అమలుచేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని కొనియాడారు. ప్రత్యేకంగా రైతు సాధికార సంస్థ ఏర్పాటుచేసి వ్యవసాయ భూమిని సారవంతం చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేయిస్తున్న తీరు అమోఘమన్నారు. రైతుల సంక్షేమం, భూ పరిరక్షణకు చేపడుతున్న చర్యలతో ప్రపంచానికే ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇందుకు ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. సమావేశానికి హాజరైన 15 దేశాల ప్రతినిధులు అందరూ నేర్చుకోవాలి : నేపాల్ నేపాల్ ప్రతినిధి నవరాయ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ఇక్కడ రైతులు ఆచరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు ఆదర్శనీయమన్నారు. నేపాల్‌లో పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తామన్నారు. ఇక ‘మేం విన్నది ఇక్కడ ప్రత్యక్షంగా చూశాం. పంట వైవిధ్యత, నీటి పొదుపు చర్యలు ఎంతో మెరుగ్గా వున్నాయి. బీజామృతంతో విత్తనశుద్ధి చేసి గుళికలు తయారుచేయడం ప్రపంచంలో మరెక్కడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక క్రమపద్ధతిలో చేస్తున్న ప్రకృతి సాగు ద్వారా భూమి సారవంతం కావడంతో పాటు వాతావరణంలో స్పష్టమైన మార్పులు వస్తున్నట్లుగా గమనించాం. ప్రకృతి సాగులో మహిళల పాత్ర ఎంతో ఉంది’.. అని ఘనా∙దేశ ప్రతినిధి డాన్ బనాకూ అన్నారు. ప్రభుత్వ కృషి బాగుంది హోండూరస్ దేశ ప్రతినిధి ఎడ్విన్ ఎసకొటో మాట్లాడుతూ.. ఇక్కడ పర్యటించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుని వెళ్తున్నామన్నారు. మా దేశంలో ఈ విధానాన్ని సులువుగా అమలుచెయ్యగలుగుతామన్న నమ్మకం కలిగిందన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు అదనపు ధర చెల్లించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి బాగుందన్నారు. అలాగే, ఇక్కడ ఆచరిస్తున్న విధానాలను తమకు అనుకూలంగా మలుచుకుని ఆచరిస్తామని... ప్రకృతి సాగులో మహిళల భాగస్వామ్యం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని బుర్కినా ఫాసో దేశ ప్రతినిధి ఫాటూ భట్ట అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి సేద్యం: మంత్రి కాకాణి ఇక ప్రకృతి వ్యవసాయానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నారని.. ప్రస్తుతం నాలుగువేల ఆర్బీకేల పరిధిలో అమలవుతున్న ప్రకృతి సాగును భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కృషిచేస్తున్నట్లు మంత్రి కాకాణి వెల్లడించారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రైతుసాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు మెక్సికో ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నేపాల్ ప్రభుత్వం నుంచి కూడా తనకు ఆహా్వనం అందిందని చెప్పారు. -
ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న మహిళా రైతు ఓబులమ్మ
తలకు మించిన భారంగా, నష్టదాయకంగా మారిన రసాయనిక వ్యవసాయంతో విసిగి వేసారి ఆరేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం చేపట్టిన మహిళా రైతు కుటుంబం రైతు లోకానికే ఆదర్శంగా నిలిచింది. అంతేకాదు, జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జైవిక్ ఇండియా జాతీయ ఉత్తమ రైతు పురస్కారాన్ని గెల్చుకోవటం విశేషం. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం టి. కొత్తపల్లెకు చెందిన బండి ఓబులమ్మ, తిరుమలయ్య దంపతులు 2016 నుంచి కొద్ది విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించి.. తదనంతరం పదెకరాలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించారు. నిమ్మ తోటలో అంతర పంటలు సాగు చేస్తున్నారు. దేశీ వరిని సాగు చేస్తున్నారు. కొంత విస్తీర్ణంలో ఏడాది పొడవునా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ.. స్వయంగా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తూ నిరంతర ఆదాయం గడిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం పూర్తిగా నిలిపివేశారు. మూడు ఆవులను కొనుగోలు చేసి, పేడ, మూత్రంతో ఘనజీవామృతం, జీవామృతం స్వయంగా తయారు చేసి వాడుతున్నారు. అవసరం మేరకు కషాయాలు వాడి పంటలు పండిస్తున్నారు. తొలుత యూట్యూబ్‌లో ప్రకృతి సేద్యపు విజయగాథలు చూసి స్ఫూర్తి పొంది శ్రీకారం చుట్టారు. తదనంతరం గ్రామ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఏపీ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది సూచనలు, సలహాలు పాటిస్తూ.. పర్యావరణానికి, ప్రజలకు ఆరోగ్యదాయకమైన సేద్య రీతిలో తిరుగులేని పట్టు సంపాదించారు. అంతేకాదు, సొంతంగా ప్రజలకు అమ్ముకోవటంలోనూ విజయం సాధించారు. కలిసొచ్చిన నోటి ప్రచారం పండించిన కూరగాయలు, ఆకుకూరలను తాము తినటంతో పాటు ఓబులమ్మ స్వయంగా ఇంటింటికీ వెళ్లి అమ్ముతుండటం విశేషం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆరోగ్యదాయక ఉత్పత్తుల విశిష్టత గురించి గ్రామాల్లో ఆయమ్మకు ఈయమ్మకు చెప్పడం మొదలు పెట్టారు. వీటిని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలియజెప్తూ అమ్మేవారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తామర తంపరగా పాకిపోయింది. వారి గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే మైదుకూరు పట్టణంలోని కూరగాయల వ్యాపారులకూ ఈ విషయం తెలిసింది. వారి నుంచి కడప, పొద్దుటూరులో కూరగాయల వ్యాపారులకు కూడా తెలిసింది. వారు నేరుగా ఓబులమ్మ తోట దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుక్కెళ్లటం అలవాటైంది. దీంతో ఓబులమ్మ పండించే ప్రకృతి వ్యవసాయ పంట దిగుబడులకు మార్కెటింగ్ సమస్యతో పాటు రవాణా ఖర్చు కూడా మిగిలింది. ఖర్చు తగ్గడంతో మంచి రాబడి ప్రారంభమైంది. దీంతో ఓబులమ్మ తన భర్త తిరుమలయ్యతో కలిసి క్రమంగా ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం పెంచుతూ వచ్చారు. 2018 నుంచి తమకున్న మొత్తం 10 ఎకరాల్లోనూ ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. అల్లుడు శివరామయ్య, కుమార్తె ఆదిలక్ష్మిల సహకారంతో ప్రకృతి వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తూ దిగ్విజయంగా ఓబులమ్మ, తిరుమలయ్య దంపతులు ప్రకృతి వ్యవసాయంలో ముందుడుగు వేస్తున్నారు. నిమ్మ తోటలో అంతర పంటలు మొదల్లో 2 ఎకరాల్లో నిమ్మ మొక్కలు నాటి.. అంతరపంటలుగా వంగ, మిరప, ఆరటి, బొప్పాయి వంటి తదితర పంటలను సాగు చేశారు. నిమ్మ, అరటి, బొప్పాయి పండ్లను పొలం వద్దనే వ్యాపారులకు అమ్మేవారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన కూరగాయలు, ఆకుకూరలను మాత్రం ఆలవాటు కొద్దీ ఉదయాన్నే గ్రామాగ్రామానికి తిరిగి అమ్మడం నేటికీ కొనసాగిస్తున్నారు ఓబులమ్మ. 2020లో మరో 6 ఎకరాల్లో నిమ్మ మొక్కలు నాటారు. ఈ ఆరు ఎకరాల్లో కూడా అంతర్ పంటగా ప్రతి 50 సెంట్లలో టమోటా, మిరప, వంగ, గోంగూర, పాలకూర, చుక్కాకు వంటివి సాగు చేశారు. పండ్లు, కూరగాయలను పొలం వద్దే కొనుగోలు చేసుకొని తీసుకు వెళ్తుండటంతో ఓబులమ్మకు మార్కెటింగ్ సమస్య లేకుండా పోయింది. (క్లిక్: ఎకరాకు 8 లక్షల పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా!) అధిక ధరకే అమ్మకాలు గతేడాది 10 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా రూ. 6.99 లక్షల నికరాదాయం వచ్చిందని ఓబులమ్మ తెలిపారు. రూ. 4.8 లక్షలు ఖర్చవ్వగా వివిధ పంటల అమ్మకం ద్వారా రూ. 11,79 లక్షల ఆదాయం వచ్చింది. 3 ఎకరాల్లో నువ్వులు, 2 ఎకరాల్లో కొర్రలు, 2 ఎకరాల్లో మైసూరు మల్లిక, బహురూపి దేశీ వరిని ఓబులమ్మ సాగు చేశారు. మిగతా 3 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలను సాగు చేశారు. నువ్వుల ద్వారా రూ. లక్ష, నిమ్మకాయల ద్వారా రూ.4.70 లక్షలు, మైసూరు మల్లిక, బహురూపి బియ్యం ద్వారా 1.13 లక్షలు, కొర్ర ధాన్యం ద్వారా రూ. 56 వేలు, మిర్చి ద్వారా రూ. 2.78 లక్షలు, టమాటోలు తదితర కూరగాయల ద్వారా రూ. 1.62 లక్షల ఆదాయం వచ్చింది. కూరగాయలు, ఆకుకూరల అమ్మకం ద్వారా ప్రతి రోజూ కొంత రాబడి వస్తున్నది. మార్కెట్లో సాధారణ కూరగాయల చిల్లర కన్నా కిలోకు 2–3 రూపాయల అధిక ధరకు విక్రయిస్తున్నట్లు ఓబులమ్మ వివరించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో నిమ్మ తోటలో అంతరపంటలుగా 2 ఎకరాల్లో ఉల్లి, 1.5 ఎకరాల్లో కొత్తిమీర, 50 సెంట్లలో వరి పంటలను సాగు చేస్తున్నారు. ఇతర వివరాలకు ఓబులమ్మ అల్లుడు శివరామయ్య (98485 58193)ను సంప్రదించవచ్చు. – గోసుల ఎల్లారెడ్డి, సాక్షి, కడప అగ్రికల్చర్ మా కష్టాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుంచి సాగు ఖర్చు భారీగా తగ్గింది. నా భర్త తిరుమలయ్యతోపాటు అల్లుడు శివరామయ్య, కుమార్తె ఆదిలక్ష్మితో కలిసి వివిధ పంటలను సాగు చేస్తున్నాను. పురుగు మందులకు బదులు నీమాస్త్రం, దశపర్ణి కషాయం, వేపనూనె, కానుగ నూనెలను వాడతాం. ఎరువులకు బదులుగా జీవామృతం, ఘనజీవామృతం వేసుకుంటాం. వీటిని మేమే తయారు చేసుకుంటాం, పంటల సాగుకు ముందు నవధాన్యాలను విత్తి, ఎదిగిన తర్వాత పొలంలో కలియదున్నుతాం. తర్వాత వేసే పంటలకు అది సత్తువగా పనికొస్తుంది. పండ్లను వ్యాపారులే వచ్చి కొనుక్కుంటున్నారు. కూరగాయలను ఇంటింటికీ తీసుకెళ్లి అమ్ముతున్నా. మా కష్టాన్ని గుర్తించిన ప్రకృతి వ్యవసాయ అధికారులు అవార్డుకు దరఖాస్తు చేయించారు. జైవిక్ ఇండియా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. – బండి ఓబులమ్మ, ప్రకృతి వ్యవసాయదారు, టి. కొత్తపల్లె, మైదుకూరు మం., వైఎస్సార్ జిల్లా -
నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం!
పారిస్.. ఫ్రాన్స్ రాజధాని. అత్యంత జనసాంద్రత కలిగిన యూరోపియన్ రాజధానులలో ఒకటి. కాంక్రీటు అరణ్యంగా మారిపోవటంతో పచ్చని ప్రదేశాల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. అన్నే హిడాల్గో అనే మహిళ 2014లో మేయర్‌గా ఎన్నికైన తర్వాత పారిస్ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణ పచ్చదనంతో అన్నే సంతృప్తి చెందలేదు. విస్తారమైన వాణిజ్య సముదాయాల పైకప్పులను పచ్చని సేంద్రియ పంట పొలాలుగా మార్చాలని ఆమె సంకల్పించారు. అర్బన్ కిచెన్ గార్డెన్స్ నిర్మించే సంస్థలను ప్రోత్సహించడానికి నిర్మాణాత్మక కార్యాచరణ చేపట్టి సఫలీకృతులవుతున్నారు. పారిస్‌లో అర్బన్ అగ్రికల్చర్ విస్తీర్ణాన్ని 100 హెక్టార్లకు విస్తరించాలన్న లక్ష్యానికి చేరువలో ఉన్నారు మేయర్ అన్నే హిడాల్గో. పారిస్కల్చర్ రూఫ్టాప్లపైన, పాత రైల్వే ట్రాక్ పొడవునా, భూగర్భ కార్ల పార్కింగ్ ప్రదేశాల్లోనూ, ఖాళీ ప్రదేశాల్లో సేంద్రియ పంటలు, పుట్టగొడుగుల సాగును ప్రోత్సహిస్తు న్నారు. ‘ద పారిస్కల్చర్స్’ పేరిట అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్‌లకు ప్రోత్సాహం ఇచ్చే పథకానికి మేయర్ శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అత్యాధునిక మిద్దె (రూఫ్‌టాప్) పొలాలు నగరం అంతటా వెలుస్తున్నాయి. వాటిల్లో ‘నేచర్ అర్బైన్’ అతి పెద్దది. దక్షిణ పారిస్‌లో అద్భుతమైన కొత్త ఎగ్జిబిషన్ హాల్ భవనం పైన 14,000 చదరపు మీటర్ల (3.45 ఎకరాల) విస్తీర్ణంలో ఈ రూఫ్‌టాప్ ఫామ్ ఏర్పాటైంది. రోజుకు వెయ్యి కిలోల సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్ గ్రీన్స్, స్ట్రాబెర్రీ తదితర పండ్లను ఉత్పత్తి చేస్తున్న ‘నేచర్ అర్బైన్’లో 20 మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్ క్షేత్రంగా ఇది పేరుగాంచింది. పారిస్ వాసులకు లెట్యూస్, టొమాటోలు, స్ట్రాబెర్రీలు, దుంపలు, తులసి, పుదీనా, ఇతర తాజా 35 రకాల సేంద్రియ పండ్లు, కూరగాయ లతో పాటు ఔషధ, సుగంధ మొక్కలను ‘నేచర్ అర్బైన్’ అందిస్తోంది. కరోనా మహమ్మారి మొదటి దఫా లాక్డౌన్ ముగిసిన తర్వాత .. నగరాల్లోనే సాధ్యమైనంత వరకు సేంద్రియ ఆహారోత్పత్తుల ఆవశ్యకతను చాటిచెబుతూ ‘నేచర్ అర్బైన్’ ప్రారంభమైంది. ఆక్వాపోనిక్స్.. హైడ్రోపోనిక్స్.. రూఫ్‌టాప్ పొలంలో రసాయన ఎరువులు, పురుగుమందులు, శిలీంద్రనాశినులు వాడరు. ఆక్వాపోనిక్స్, హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. మట్టిని వాడరు. పోషకాలు, ఖనిజాలు, జీవన ఎరువులతో కూడిన పోషక ద్రావణం కలిపిన నీటిని మొక్కల వేర్లకు అందిస్తూ పంటలను 10% నీటితోనే సాగు చేస్తున్నారు. నిలువు ప్లాస్టిక్ స్తంభాలలో లెట్యూస్, తులసి, పుదీనా మొక్కలు ఏరోపోనిక్స్ పద్ధతిలో ఏపుగా పెరుగుతుంటాయి. (క్లిక్ చేయండి: పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!) వీటికి ఎదురుగా, సన్నగా, అడ్డంగా ఉండే ట్రేలలో కొబ్బరి పొట్టులో నోరూరించే దేశవాళీ చెర్రీ టొమాటోలు, నాటు వంకాయలు, టొమాటోలు, కీర దోస తదితర కూరగాయలను పెంచుతున్నారు. పారిస్ వాసులు స్వయంగా తామే ఈ రూఫ్‌టాప్ పొలంలో పంటలు పండించుకోవడానికి ఎత్తు మడులతో కూడిన ప్లాట్లను ఏడాదికోసారి అద్దెకిస్తారు. 140 కూరగాయల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. నగరవాసులకు సాగు నేర్పడానికి పారిస్ నగరపాలక సంస్థ ఒక ప్రత్యేకమైన స్కూల్‌ను కూడా ప్రారంభించింది. పారిస్ నగరపాలకుల ప్రయత్నాల వల్ల స్థానికుల ఆహారపు అవసరాలు తీరేది కొద్ది మేరకే అయినప్పటికీ, తద్వారా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఒనగూరే బహుళ ప్రయోజనాలు మాత్రం అమూల్యమైనవి! – పంతంగి రాంబాబు -
పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!
మురికివాడల్లో నిరుపేదల సంక్షేమం కోసం ఆహార ధాన్యాలు, పప్పులు ఉప్పులను ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం మనకు తెలుసు. వాటితో పాటు సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలను అందుబాటులోకి తెస్తోంది రియో డి జనీరో (బ్రెజిల్) నగరపాలక సంస్థ! రియో ఎంతో అందమైన నగరం. అంతే కాదు.. విశాలమైన మనసున్న మహానగరం కూడా! సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను మడుల్లో పెంచటాన్ని నేర్పించటం ద్వారా సేంద్రియ ఆహారాన్ని వెనుకబడిన ప్రజల్లోనూ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే బృహత్తర లక్ష్యాన్ని పెట్టుకున్నారు రియో నగర మేయర్ ఎడ్వర్డో పేస్. తొలినాళ్లలో ప్రభుత్వ నిధులతో గార్డెన్లను నిర్వహించటం, తదనంతరం స్థానికులే స్వయంగా నిర్వహించుకుని కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది రియో నగర పర్యావరణ శాఖలోని ప్రత్యేక ఉద్యాన విభాగం. పేదల ఇళ్ళకు దగ్గర్లోనే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసింది. వీటిల్లో వేలకొలది ఎత్తు మడులు నిర్మించి, అక్కడి వారితోనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయించి, ఇంటింటికీ పంపిణీ చేస్తోంది. 2006లో ప్రారంభమైన ఈ అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ‘హోర్టాస్ కారియోకాస్’ (‘రియోవాసుల కూరగాయల తోట’ అని దీని అర్థం) సంఖ్య గత 16 ఏళ్లలో 56కి పెరిగింది. వీటిలో 29 మురికివాడల్లో, 27 నగరంలోని పాఠశాలల్లో ఉన్నాయి. దాదాపు 50,000 కుటుంబాలు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నాయి. గత సంవత్సరానికి మొత్తం 80 టన్నుల ఆకుకూరలు, కూరగాయలను వీటిలో పండించి, పంపిణీ చేశారు. ఇది కొందరికి తాజా ఆహారం దొరికింది. మరికొందరికి ఈ గార్డెన్స్‌లో పని దొరకటంతో ఆదాయం సమకూరింది. కరోనా కష్టకాలంలో ఈ గార్డెన్లు తమని ఎంతో ఆదుకున్నాయని ప్రజలు సంతోషపడుతున్నారు. ఆహారం ఎంతో అవసరమైన జనం నివాసమున్న చోటనే కమ్యూనిటీ అర్బన్ గార్డెన్లను మరింతగా విస్తరించాలని రియో నగర పాలకులు సంకల్పించారు. రియో నగర ఉత్తర ప్రాంతంలోని మూడు మురికివాడల్లో నిర్మించిన గార్డెన్లను విస్తరింపచేసి ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్‌ను నెలకొల్పాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. ఆ గార్డెన్ ఏకంగా 15 ఫుట్ బాల్ కోర్టులంత ఉంటుందట. అంటే, దాదాపు 11 హెక్టార్ల విస్తీర్ణం అన్నమాట! 2024 నాటికి ఈ కల సాకారం కాబోతోంది! ప్రతినెల లక్ష కుటుంబాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం పొందుతాయి. అర్బన్ అగ్రికల్చర్‌కు ఉన్న శక్తి ఏపాటిదో దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటున్నారు జూలియో సీజర్ బారోస్. ‘హోర్టాస్ కారియోకాస్’ పథకం అమలుకు రియో డి జనీరో మునిసిపల్ పర్యావరణ విభాగం తరఫున ఆర్గానిక్ గార్డెనింగ్ డైరెక్టర్ హోదాలో శ్రీకారం చుట్టిన అధికారి ఆయన. ‘మా ప్రాజెక్ట్ లక్ష్యం అందమైన తోటను నిర్మించడం కాదు. నగరంలోనే సేంద్రియ ఆహారాన్ని పండించి ఎంత మందికి అందించగలమో చూడాలన్నదే’ అని బారోస్ చెప్పారు. మురికివాడల్లో నివాసం ఉండే వారినే తోట మాలులుగా, సమన్వయకర్తలుగా నియమిస్తారు. వారికి స్టైఫండ్ ఇస్తారు. పండించిన కూరగాయల్లో 50% మురికివాడల్లోని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. మిగిలిన 50% తోటమాలులకు ఇస్తారు. వాళ్ళు ఇంట్లో వండుకొని తినొచ్చు లేదా అక్కడి వారికే సరసమైన ధరలకు అమ్ముకోనూ వచ్చు. ప్రతి తోటకు కొంత కాలమే ప్రభుత్వ సాయం అందుతుంది. చివరికి స్వతంత్రంగా మారాల్సి ఉంటుంది అని బారోస్ చెప్పారు. ఆర్థిక లాభాలతో పాటు, ఒకప్పుడు పరిసరాల్లో సాధారణంగా ఉండే మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి ప్రజలు దూరంగా ఉండటంలో ఈ ప్రాజెక్ట్ మరింత పెద్ద సామాజిక ప్రయోజనాన్ని అందిస్తుందని బారోస్ అంటారు. – పంతంగి రాంబాబు -
కూరగాయలు, పండ్ల నిల్వలో విప్లవం.. 2 నెలల వరకు చెక్కు చెదరవు!
పండ్లు, కూరగాయల నిల్వ పద్ధతిలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అస్సాంలోని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు ఉద్యాన పంటల రైతులకు తీపికబురు చెప్పారు. విస్తృత పరిశోధనల ఫలితంగా సముద్రపు నాచు వంటి సహజ పదార్థాలతో ఓ సేంద్రియ లేపన పదార్థాన్ని ఆవిష్కరించారు. ఈ ద్రావణంలో కూరగాయలు, పండ్లను ముంచి తీసి పక్కన పెడితే సరి. లేదంటే ఈ పదార్థంతో కవరును తయారు చేసి అందులో పండ్లు, కూరగాయలను నిల్వ చేసినా చాలు. వారం, రెండు వారాలు కాదు.. ఏకంగా రెండు నెలల వరకు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కుళ్లిపోయిన టమాటోలు, ఉల్లిపాయలు, పండ్లను చెత్తకుప్పల్లో పారబోయాల్సిన దుస్థితికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది. అంతేకాదు.. ‘పచ్చి సరుకు’ కాబట్టి తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి ఉద్యాన రైతులు విముక్తి పొందే రోజు కూడా దగ్గర్లోనే ఉందని చెప్పొచ్చు! కూరగాయలు, పండ్లను పొలంలో పండించడానికి రకాన్ని బట్టి 3 నుంచి 12 నెలల సమయం పడుతుంది. ఇంతా కష్టపడి పెంచి చెట్ల నుంచి కోసిన తర్వాత, ప్రజలకు అందించేలోగా, కొద్ది రోజుల్లోనే వడలిపోతుంటాయి. ఇంకొన్ని రోజులైతే కుళ్లి పనికిరాకుండా పోతుంటాయి కూడా. ఈ క్రమంలో ఉద్యాన పంటల రైతులకు, చిరు వ్యాపారులకు తీవ్రనష్టం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల కూరగాయలు, పండ్లకైతే అత్యధికంగా 20% వరకు నష్టం జరుగుతోంది. ధర మరీ పతనమైతే పారబోయాల్సిన దుస్థితి. ఈ కష్టాల నుంచి రైతులను, వ్యాపారులను గట్టెక్కించే సరికొత్త సేంద్రియ లేపన పదార్థాన్ని గౌహతిలోని ఐఐటీకి చెందిన రసాయన ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు, పరిశోధకులు కనుగొన్నారు. తాజాదనాన్ని, పోషకాలను, రంగును, రూపురేఖలను కోల్పోకుండా పండ్లు, కూరగాయలను నిల్వ చేయొచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి వాటిని మెత్తబడిపోకుండా, మొలక రాకుండా చూసుకోవచ్చు. ఏకంగా రెండు నెలల వరకూ కాపాడుకోవచ్చని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన ఈ లేపనం పూసిన పండ్లు, కూరగాయలను తిన్న వారికి ఎటువంటి హానీ జరగదని శాస్త్రీయ పరీక్షల్లో రుజువైందంటున్నారు. బంగాళాదుంపలు, టొమాటోలు, పచ్చి మిరపకాయలు, స్ట్రాబెర్రీలు, ఖాసీ మాండరిన్ రకం నారింజ పండ్లు, ఆపిల్స్, పైనాపిల్స్, కివీ పండ్లపై ఈ పదార్థాన్ని ఇప్పటికే పరీక్షించి.. వీటిని దాదాపు రెండు నెలల పాటు తాజాగా ఉంచగలిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనా బృందానికి కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ విమల్ కటియార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వైభవ్ వి గౌడ్ మార్గదర్శకత్వం నెరిపారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సస్టైనబుల్ పాలిమర్స్‌కు చెందిన పరిశోధకులు తబ్లీ ఘోష్, కోన మొండల్, మాండవి గోస్వామి, శిఖా శర్మ, సోను కుమార్ విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. లేపనంలో ఏముంది? డునాలియెల్లా టెర్టియోలెక్టా అనే సముద్రపు నాచు సారానికి పాలీసాకరైడ్లను కలిపి ఈ లేపన పదార్థాన్ని రూపొందించారు. ఈ సముద్రపు నాచు యాంటీఆక్సిడెంట్లతో పాటు.. కెరోటినాయిడ్లు, ప్రోటీన్లు వంటి వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను ఉత్పత్తి చేయడానికి, అదే విధంగా జీవ ఇంధనం ఉత్పత్తికి కూడా ఈ సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను వెలికితీసిన తర్వాత మిగిలే అవశేషాలను వ్యర్థాలుగా భావించి పారేసేవారు. అయితే, గౌహతి ఐఐటి పరిశోధకులు ఈ అవశేషాలను చిటోసాన్ అనే పిండి పదార్థంతో కలిపి లేపన పదార్థాన్ని రూపొందించే పద్ధతిని కనుగొన్నారు. సూక్ష్మక్రిములు, శిలీంధ్రాల నాశని లక్షణాలు కలిగిన ఈ పదార్థాలతో తయారైన లేపన పదార్థం తిన్న వారికి ఎటువంటి నష్టం కలగదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. (క్లిక్: ఇంటి పంట: రూఫ్‌టాప్ పొలం.. 5.7 ఎకరాలు!) ఈ విధంగా తయారు చేసిన లేపన పదార్థంలో మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే మెరుగైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇది 40 డిగ్రీల వరకు వేడికి తట్టుకుంటుంది. లేపనం రాసిన తర్వాత చెదిరిపోకుండా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో నుంచి నీటి ఆవిరి బయటకుపోకుండా అడ్డుకుంటుంది. కాంతిని అడ్డుకునే శక్తి దీనికి ఉందని అనేక పరీక్షల ద్వారా నిర్థారణైందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు ఈ పూతను జీవ భద్రత కోణంలోనూ పరీక్షించారు. వివిధ జీవ ప్రక్రియల అధ్యయనానికి ప్రయోగశాల ప్రమాణంగా పరిగణించే ‘బిహెచ్కె21 సెల్ లైన్’ ద్వారా పరీక్షించి చూశారు. ఈ లేపన పదార్థం విషపూరితమైనది కాదని, తినదగిన ఆహార ప్యాకేజింగ్ పదార్ధంగా సురక్షితంగా ఉపయోగించవచ్చని పరీక్షల్లో తేలిందన్నారు. (క్లిక్: నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..) ఈ అధ్యయన ఫలితాలు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అడ్వాన్సెస్, అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ‘ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ సహా అనేక ప్రతిష్టాత్మక శాస్త్రీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పండ్లు, కూరగాయల వృథాను అరికట్టడంతో పాటు, రైతుల వెతలను తగ్గించి మంచి ఆదాయాన్నిచ్చే ఈ అద్భుత లేపనం త్వరలోనే అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఆకృతి, రంగు, రుచి, పోషకాలు చెక్కుచెదరవు! భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంచనా ప్రకారం 5 నుంచి 16 శాతం పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత నిల్వ సామర్థ్యం లేక వృథాగా పాడైపోతున్నాయి. వాస్తవానికి ఈ నష్టం బంగాళాదుంప, ఉల్లిపాయలు, టొమాటో వంటి కొన్ని పంటల్లో కోత అనంతర నష్టం 19% వరకు ఉండొచ్చు. ప్రజలు ఎక్కువగా తినే ఈ కూరగాయల ధర ఆ మేరకు పెరిగిపోతోంది. ఈ లేపన పదార్ధాన్ని పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 40 డిగ్రీల సెల్షియస్ వరకు కాంతిని, వేడిని, ఉష్ణోగ్రతను ఈ లేపనం చాలా స్థిరంగా తట్టుకుంటుంది. తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగదు. సురక్షితమైనది. లేపనం చేసిన పండ్లు, కూరగాయల ఆకృతి, రంగు, రుచి, పోషక విలువలు చెక్కుచెదరదు. ఈ లేపన పదార్థాన్ని నేరుగా కూరగాయలు, పండ్లపై పూయవచ్చు లేదా ఈ పదార్థంతో కవర్‌ను తయారు చేసి కూరగాయలు, పండ్లను అందులో నిల్వ చేయవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఎలా ఉపయోగించినా కూరగాయలు, పండ్ల నిల్వ సామర్థ్యాన్ని పొడిగించవచ్చు. ఇది సాధారణ ‘డిప్ కోటింగ్ టెక్నిక్’. పెద్దగా ఖర్చు పెట్టకుండానే పంట కోత అనంతరం దిగుబడులను సులభంగా దీర్థకాలం నిల్వ చేసుకోవచ్చు. – ప్రొ. విమల్ కటియార్, అధిపతి, కెమికల్ ఇంజనీరింగ్ విభాగం, ఐఐటి, గౌహతి, vkatiyar@iitg.ac.in -
నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..
ఆయన ఓ విశ్రాంత ఉద్యోగి. నెలకు రూ.3 లక్షలు జీతం. ప్రైవేటు కంపెనీలో డిజిఎంగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు ఘట్రాజు వెంకటేశ్వరరావు. వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో అమ్మమ్మ గారి ఊరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామానికి వచ్చి తమ 4.5 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ వరి రకాల సాగు చేపట్టారు. సుమారు రెండేళ్లు నిల్వ చేసిన ధాన్యాన్ని ఆరోగ్యదాయకమైన దేశీ బియ్యం విక్రయిస్తూ లాభాలతో ఆత్మసంతృప్తిని ఆర్జిస్తున్నారు. ఆయన అనుభవాల సారం ఆయన మాటల్లోనే.. ‘‘ప్రముఖ కంపెనీలో ముంబైలో ఉద్యోగం చేశాను. డీజీఎంగా బాధ్యతలు నిర్వహణ. ఐదేళ్ల క్రితం వీఆర్ఎస్ తీసుకుని హైదరాబాద్‌కు వచ్చేశాను. అప్పటికే ప్రకృతి సేద్యంపై ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రకతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతుల్లో పాలొని మెళకువలు నేర్చుకున్నా. ఆచరణలో పెట్టేందుకు అమ్మమ్మ వాళ్ల ఊరైన కోలవెన్ను వచ్చి స్థిరపడ్డా. 4.5 ఎకరాల్లో తులసీబాణం, నారాయణ కామిని, నవారా, కాలాభట్, మార్టూరు సన్నాలు, రత్నచోడి, బహురూపి వంటి దేశీ వరి రకాలు సాగు చేస్తున్నా. రెండు ఆవులను తెచ్చుకున్నా. ఏటా సాగు ఆరంభంలో 40 ట్రక్కుల ఘన జీవామృతాన్ని పొలంలో చల్లుతున్నా. పంటకు అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. వర్రలతో బావిని కట్టించి 1200 లీటర్ల జీవామృతం తయారుచేసి 15 రోజులకోసారి చల్లుతున్నా. పంట ఆరోగ్యంగా ఎదుగుతున్నది. తెగుళ్ల బెడద లేదు. ఆవ పిండి చెక్క కూడా జీవామృతంలో కలిపి వాడుతున్నా. ఎకరాకు రూ. 25–30 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. 25–28 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తున్నది. పంటను ఆశించే పురుగు నివారణకు వేపపిండి చల్లుతాను. పోషకాలు జీవామతం ద్వారా అందుతాయి. మరీ అవసరం అయితే, అగ్ని అస్త్రం చల్లుతాను. ఎలాంటి పురుగైనా నాశనం అవుతుంది. దేశవాళీ విత్తన పంట నిల్వ, మార్కెటింగ్ విషయాలు చాలా ప్రధానమైనవి. పంట చేతికి వచ్చాక కనీసం 10 నెలల నుంచి రెండేళ్ల వరకూ పంటను మాగబెట్టిన ధాన్యాన్ని మిల్లులో ఆడించి నాణ్యమైన బియ్యాన్ని బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చిన్, చెన్నై ప్రాంతాల్లో ఉన్న నేరుగా విక్రయిస్తున్నా. నవారా, కాలాభట్ స్థానికంగా కిలో రూ. 90కి, బయట ప్రాంతాలకు రూ. 120కే అందిస్తున్నా, రవాణా ఖర్చు కూడా కలిపి. ఇతర రకాల బియ్యం కిలో రూ.75కే ఇస్తున్నా. ప్రతి రైతూ ప్రకృతి విధానం వైపు అడుగులు వేస్తే దిగుబడులు, ఆరోగ్యం, ఆదాయం, భూసారం పెంపుదల సాధ్యమే. ప్రభుత్వం రైతు భరోసా, ఇతర సబ్సిడీలు అందిస్తున్నది. వీటితో పాటు ప్రకృతి విధానంలో పండించిన పంటకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ సదుపాయాలు విస్తరించి, అదనపు వసతులు కల్పిస్తే కొత్త రైతులు కూడా ఈ విధానంలోకి వచ్చేస్తారు.’’ – ఈ.శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా వడ్లు ఎంత మాగితే అన్నం అంత ఒదుగుతుంది. ధాన్యం నిల్వ చేయకుండా తినటం వల్ల కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. పంట నాణ్యంగా ఉంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే ప్రకృతి విధానం వల్ల భూసారం పెంపొందుతుందని గుర్తించాను. (క్లిక్: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఎలా తయారు చేసుకోవాలంటే!) – ఘట్రాజు వెంకటేశ్వరరావు (92255 25562), కోలవెన్ను -
స్ఫూర్తి..: జీవనాడిని విస్తరించింది.. రూ.60 లక్షల వ్యాపారం
పచ్చని ఆకులో భోజనం మన సంప్రదాయం అదే మన ఆరోగ్య రహస్యం. ఆ జీవనాడిని పట్టుకొని అదే వ్యాపారంగా మార్చుకున్నారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వాసి మాధవి విప్పులంచ. బాధించిన క్యాన్సర్ నుంచి కోలుకొని అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు మరలి పచ్చని విస్తరాకు ప్లేట్లను రాష్ట్రంతోపాటు ఇతర దేశాలకూ సరఫరా చేస్తున్నారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన విప్పులంచ మాధవి బీఫార్మసీ చేసి, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేశారు. తిమ్మారెడ్డిపల్లిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ మోదుగ, అడ్డాకులతో ప్లేట్లు తయారు చేస్తూ, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, యేటా రూ.60 లక్షలు సంపాదిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రి టూరిజాన్ని వృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న మాధవిని ఆమె పర్యావరణ ప్రయాణం గురించి అడిగితే ఎన్నో విశేషాలను వివరించింది. ‘‘పుట్టి పెరిగింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనుగుర్తి గ్రామం. అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాన్న చింతల బలరాం కళాశాల ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యారు. అమ్మ సరోజిని రిటైర్డ్ ఫార్మసిస్ట్. నేను డిగ్రీవరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. ఆ తర్వాత అమ్మ సలహా తో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ పూర్తి చేశాను. చదువుకునే సమయంలోనే పెళ్లైంది. ఇద్దరు కొడుకులు. నా చదువు పూర్తయిన తర్వాత నా భర్త వేణుగోపాల్‌తో కలిసి ఉద్యోగరీత్యా పూణె వెళ్లాను. అక్కడ పూణె హాస్పిటల్లో ఫార్మసిస్ట్‌గా మూడేళ్ల పాటు పని చేశాను. ఆ తర్వాత బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేసి, 2007లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాం. స్కూల్‌తో మొదలు కొన్ని రోజుల్లోనే ప్రైమరీ పాఠశాలను ప్రారంభించాను. సాయంత్రం వేళల్లో యోగా శిక్షకురాలిగా పనిచేశాను. వ్యవసాయం అంటే ఉన్న ఆసక్తితో సేంద్రియ సేద్యం వైపు దృష్టి పెట్టాను. అంతా సాఫీగా సాగుతుందనుకున్న క్రమంలో కొద్దిరోజుల తేడాతో నాన్న, అక్క మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది. క్యాన్సర్ నుంచి కోలుకుని.. వారి మరణం బాధ నుంచి కోలుకోక ముందే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డాను. అయినా భయపడకుండా ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకున్నాను. ఆ సమయంలో యోగా శిక్షణ నన్ను మరింత బలంగా చేసింది. ఏడాదిన్నర కాలంలో క్యాన్సర్‌ను జయించాను. ఆ సమయంలోనే కూరగాయలు, పంటల సాగులో రసాయనాల వాడకం, కలుషితమైన వాతావరణమే నా వ్యాధికి కారణమని గ్రహించాను. నాలాగే చాలామంది ఇలాంటి సమస్యలకు లోనవుతుంటారని కూడా తెలుసుకున్నాను. అప్పుడే ప్రకృతి సేద్యం చేస్తూ ఉన్నంతలో మంచి ఆహార పంటల ఉత్పత్తులను సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో నా భర్త సహకారంతో 2017లో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. అందులో 20 వేల వరకు మామిడి, జామ, అరటి, బత్తాయి, సపోట తోటలు పెట్టాం. ఇతర కూరగాయలు పంటలను çపండించడం మొదలుపెట్టాం. సేంద్రియ ఎరువు తయారీకి 15 ఆవులను పెంచుతున్నాం. వాటి మూత్రం, పేడతో జీవామృతం తయారుచేసి మొక్కలకు అందిస్తున్నాం. పచ్చని విస్తరాకులు పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్‌ను చూసినప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. నా చిన్నతనంలో ఆకులతో కుట్టిన విస్తరాకుల్లోనే భోజనం చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది. మన సంస్కృతిలో భాగమైన విస్తరాకుల తయారీని ముందు చేత్తోనే చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దీనినే 2019లో ‘ఆర్గానిక్ లీఫ్ టేబుల్’ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించాను. ఈ విస్తరాకు ల విక్రయానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్ సైతం ఏర్పాటు చేశాను. దీంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ నిత్యం పోస్టులు చేయడం ద్వారా కొనుగోలుదారులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. విదేశాలకూ ఎగుమతి జర్మనీ, హాంకాంగ్, అమెరికా దేశాలకు సైతం మా విస్తరాకులు ఎగుమతి అవుతున్నాయి. వీటి తయారీకి కావాల్సిన అడ్డాకులను ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మోదుగ ఆకులు మన నేలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఆకుల సేకరణ కష్టంగా ఉంది. ఇబ్బందులను అధిగమిస్తూనే రోజూ 10 వేల వరకు విస్తరాకులను తయారు చేస్తున్నాం. దాదాపు 20 మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాను. ప్రతి యేడు రూ.60 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. రానున్న రోజుల్లో మేం పండిస్తున్న సేంద్రియ కూరగాయలు, పండ్లతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుని వచ్చినవారికి మా స్థలంలో ఒక పిక్నిక్ స్పాట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వచ్చినవాళ్లకు రెండు మూడు రోజులపాటు వసతి సదుపాయాలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంటూ, అగ్రి టూరిజం చేయాలనేదే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను’ అని వివరించారు మాధవి. పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్‌ను చూసి నప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: కె.సతీశ్‌కుమార్ -
Organic Farming: నలభై ఎకరాల భూమి.. ప్రకృతి సేద్యం.. ఆరోగ్యసిరిగా...
బాధ్యతల బరువు దించుకున్నాక సామాన్యుల కోసం ఏమైనా చేయగలనా అనుకుంది. సొంత లాభం కొంతమానుకుని నలుగురికి ఉపయోగపడాలని అనుకున్న ఆలోచన ఆమెను వ్యవసాయం దిశగా నడిపించింది. ప్రకృతి సేద్యంతో పదిమందికి చేయూతనిస్తూ తన జీవనాన్ని అర్థవంతంగా మార్చుకుంటోంది ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని కొల్లావారిపల్లెకు చెందిన శవన హైమావతి. ఆరోగ్యసిరిగా అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. కొడుకు, కూతురు విదేశాలలో స్థిరపడ్డారు. చిన్నకొడుకు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త మరణం తర్వాత ఒంటరి జీవితం ఆమెను వ్యవసాయం వైపు దృష్టి మళ్లించేలా చేసింది. వారసత్వంగా ఉన్న భూమిని తనే స్వయంగా సాగులోకి తీసుకురావాలనుకుంది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో తన ద్వారా తన చుట్టూ ఉన్నవారి ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంది. పదిహేనేళ్లుగా ప్రకృతిసేద్యంతో పంటసిరులను కురిపిస్తోంది హైమావతి. ప్రయోగాలతో సేద్యం... హైమావతి కుటుంబానికి పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న భూమి నలభై ఎకరాలు ఉంది. అందులో మొదట్లో కొద్దిపాటి భూమిని స్వయంగా సేద్యం చేసుకుంటూ, ప్రకృతి సేద్యంపట్ల అవగాహన కల్పించుకుంటూ చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ వచ్చింది. పదిహేనేళ్లుగా చేస్తున్న ఈ సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు 34 ఎకరాలకు విస్తరించింది. సుభాష్ పాలేకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సమావేశాలకు హాజరవుతూ, వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ప్రకృతిసేద్యంలో పూర్తి నైపుణ్యం సాధించింది. రసాయనాలు వాడకుండా ఎరువులు మొదలుకొని పురుగు మందుల వరకు అన్నీ సొంతంగా తయారు చేస్తుంది. స్వయంగా ఎరువుల తయారీ... స్కూల్ చదువు దగ్గరే ఆగిపోయిన హైమావతి ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలో ఎంతోమందికి సలహాలు ఇచ్చేంతగా ఎదిగింది. ఎరువుల కోసం పాడి ఆవుల పెంపకాన్ని చేపట్టింది. పురుగులు, తెగుళ్లను నివారించేందుకు స్వయంగా మిశ్రమాలను తయారుచేస్తూ చుట్టుపక్కల గ్రామాల రైతులకు అవగాహన కలిగిస్తోంది. ఎండిన ఆకులతో, మగ్గబెట్టిన చెత్తాచెదారం, పండ్లు, కూరగాయల వ్యర్థాలతో ఎరువులు, యూరియా వంటివి తయారు చేస్తూ రసాయనాల వాడకం లేకుండానే అధిక దిగుబడులు సాధిస్తోంది. నామమాత్రపు ధర... మామిడి, చెరకు, నిమ్మ, జామ, సపోట, నేరేడు, ఉసిరి, పనస, చీనీ.. పండ్ల తోటల సాగుతోపాటు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు. వీటిని తన చుట్టుపక్కల వారికి ఇవ్వడంతో పాటు మిగతా వారికి నామమాత్రపు ధరలతో అందిస్తున్నారు. అందరికీ ఇవ్వగా మిగిలిన ఉత్పత్తులను రాజంపేట పాత బస్‌స్టాండు వద్ద షాపును ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా అందజేయడంతో పాటు మిగతా ఉత్పత్తులను తక్కువ ధరకు అందిస్తోంది. అందరి ఆరోగ్యం ఈ కంప్యూటర్ యుగంలో ఎక్కడ చూసినా కల్తీ సరుకులే. వీటితో ఎంతోమంది అనారోగ్యం బారిన పడటం చూస్తున్నాను. రసాయనాలు లేని సేంద్రియ వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులను అందరూ ప్రోత్సహించాలి. అందుకే ఈ పనిని ఎంచుకున్నాను. ఎటువంటి లాభాలూ ఆశించకుండా నా చుట్టూ ఉన్నవారికి సేంద్రియ ఆహారం అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. – శవన హైమావతి పురస్కారాల పంట... ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న హైమావతిని ప్రతి యేటా అవార్డులు వరిస్తున్నాయి. ఈ ఏడాది మహిళా దినోత్సవ సందర్భంగా మాతృభూమి ఫౌండేషన్ నుంచి తెలంగాణ గవర్నర్ తమిళసై చేతుల మీదుగా హైమావతికి అవార్డును ప్రదానం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రతిది క్షుణ్ణంగా తెలుసుకుంటూ నేడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న హైమావతికి అభినందనలు చెబుదామా!- – బసిరెడ్డి వెంకట నాగిరెడ్డి, సాక్షి, అన్నమయ్యజిల్లా చదవండి: Sagubadi: మూడు చక్రాల బుల్లెట్ బండి! లీటర్ డీజిల్‌తో ఎకరం దున్నుకోవచ్చు! -
సేంద్రియ సైనికులు... అందరికీ ఆదర్శంగా
డుంబ్రిగుడ: భిన్న ఆలోచనలకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడవ్వడంతో ఇద్దరు రైతు మిత్రులు లాభలబాటలో పయనిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మంచి దిగుబడులు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. డుంబ్రిగుడ మండలం సొవ్వ పంచాయతీ దేముడువలస గ్రామానికి చెందిన త్రినాథ్, పాంగి తిరుపతిలు బావబావమరుదులు. వీరిద్దరూ ఆరెకరాల విస్తీర్ణంలో బీన్స్, వంకాయ, బీరకాయ, మిరప , కాకరకాయ, క్యాబేజి, మొక్కజొన్న సాగు చేపట్టారు. పూర్తిగా సేంద్రియ ఎరువులు వారే స్వయంగా తయారు చేయడంతోపాటు తోటి రైతులకూ అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అలాగే స్థానిక వ్యవసాయాధికారుల సహకారంతో ఐదేళ్లుగా అనేక రకలైన కూరగాయలను సాగు చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. అలాగే అంతర పంటలు సైతం సాగుచేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సొవ్వ టు వైజాగ్ ఈ పంటలను విశాఖలోని వివిధ రైతు బజార్లకు, అరకు వారపు సంతలకు ప్రతి వారం 30 టన్నుల నుంచి 50 టన్నుల వరకు విక్రయాలు చేస్తుంటారు. కాలంతో సంబంధం లేకుండా నిత్యం కూరగాయలు పండిస్తు ఆదర్శంగా నిలుస్తున్నారు. పశువుల పేడ, మూత్రం వినియోగించి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. అలాగే వేప కషాయం తయారు చేసి పంటలకు పిచికారి చేస్తున్నారు. (చదవండి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం) -
Purva Jindal: ఫ్యాషన్ డిజైనర్ నుంచి రైతుగా.. రోజుకు 7 వేలు సంపాదిస్తూ!
‘‘జీవితంలో ఏదైనా పెద్దగా సాధించాలని అనుకుంటే చిన్నపాటి రిస్క్ చేయక తప్పదు. ధైర్యంగా ముందడుగు వేసినప్పుడే అనుకున్నది సాధించగలం’’ అంటోంది పూర్వ జిందాల్. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన పూర్వ.. బీడు భూమిని పంటపొలంగా మార్చి సేంద్రియ కూరగాయలు పండిస్తోంది. తను లక్షలు సంపాదిస్తూ మరికొంత మందికి ఉద్యోగాలిచ్చి ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. రాజస్థాన్‌కు చెందిన పూర్వ జిందాల్ కుటుంబం ఏళ్లుగా వస్త్ర వ్యాపారం రంగంలో రాణిస్తోంది. కుటుంబ నేపథ్యం టెక్స్టైల్స్ బిజినెస్ కావడంతో తండ్రి ఎన్కే జిందాల్ ప్రోత్సాహంతో ముంబైలో ఫ్యాషన్ డిజైనింగ్ లో ఎమ్బీఏ చదివింది. చదువు పూర్తయ్యాక కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో చురుగ్గా పొల్గొనేది. కొన్నాళ్ల తరువాత పూర్వకు కొత్తగా ఏదైనా చేయలన్న ఆలోచన వచ్చింది. ఇదే సమయంలో ఇంట్లో రెండు మూడు కూరగాయ మొక్కల్ని పెంచుతుండేది. పెరట్లో పెరిగిన కూరగాయలతో వండిన కూర చాలా రుచిగా ఉండడం గమనించింది. కరోనా సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం అవసరమని వైద్యులు చెప్పడంతో..సేంద్రియ పంటలను ఆహారంగా చేర్చుకున్నప్పుడే మంచి ఇమ్యూనిటీ లభిస్తుంది అని గ్రహించింది. ఈ రెండు సంఘటనలతో దుస్తుల డిజైనింగ్‌ను వదిలేసి సేంద్రియ పంటలు పండించాలని నిర్ణయించుకుంది. కానీ కుటుంబంలో ఎవరికీ వ్యవసాయంపై అవగాహన లేదు. తన సర్కిల్లో వ్యవసాయం చేసిన అనుభవం ఉన్నవారు కూడా లేరు. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా సేంద్రియ పంటలు ఎలా పండించాలి? అనేదానికి సంబంధించిన సమాచారం వెతకడం ప్రారంభించింది. అనుభవం ఉన్న రైతులు, వ్యవసాయ రంగ నిపుణుల వద్ద నుంచి సేంద్రియ పంటల గురించిన సమాచారం తెలుసుకుని సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకుంది. తరువాత రాజస్థాన్‌లోని ఔజిరా గ్రామంలో కొంత భూమిని ఐదేళ్ల కాలపరిమితితో కౌలుకు తీసుకుంది. రాళ్లూరప్పలతో నిండిన బంజరు భూమి కావడంతో.. సంప్రదాయ పద్ధతుల్లో శుభ్రం చేసి ఆవుపేడ, సేంద్రియ కంపోస్టును వేసి పంట పొలంగా మార్చింది. దీనిలో బఠాణీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టొమాటో, బంగాళ దుంపలు, శనగలు, చెర్రీలు, ఆకుకూరలను పండించడం ప్రారంభించింది. సేంద్రియ ఎరువులు కావడంతో పంటలన్నీ చీడపీడలు లేకుండా ఏపుగా పెరిగాయి. బాగా పండాయి కూడా. అలా పండిన కూరగాయలన్నింటిని దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మార్కెట్‌కు తరలించి తానే విక్రయిస్తూ రోజుకి ఆరు నుంచి ఏడువేల రూపాయలను ఆర్జిస్తోంది. తన దగ్గర పనిచేసే ఏడుగురు సిబ్బందికి నెలవారి జీతాలు, మిగతా వారికి రోజువారి కూలికి నాలుగు వందల రూపాయల చొప్పున ఇస్తూ ఉపాధి కల్పిస్తోంది. ఆరోగ్యం అవగాహన.. కుటుంబంలో వ్యవసాయం చేసే తొలి వ్యక్తి తానే కావడంతో పంటలు పండించడంపై అవగాహన వచ్చేంత వరకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది పూర్వ. సాధారణ కూరగాయలకంటే సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు ధర ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడే కాకుండా భవిష్యత్‌లోనూ సేంద్రియ పంటలకు మంచి డిమాండ్ ఉంటుందని భావించి తన పంటలను ‘సాఖి ఆర్గానిక్’ పేరిట విస్తరించింది. వాట్సాప్ ఆర్డర్లను స్వీకరించి నేరుగా కస్టమర్ల ఇంటికే కూరగాయలను డెలివరీ చేస్తోంది. పూర్వ పంటల గురించి తెలిసిన వారంతా ఆమె వద్ద కూరగాయలు కొనడానికి ఆసక్తి కనబరుస్తుండడంతో విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. ఈ ప్రోత్సాహంతో ‘ఆగ్రో టూరిజం’పైన అవగాహన కల్పిస్తోంది. గ్రామాలకు దూరంగా నగరాల్లో నివసించేవారిని నెలలో రెండు రోజులు తన పొలానికి ఆహ్వానించి సేంద్రియ వ్యవసాయం గురించి వివరిస్తోంది. ఇలా వచ్చిన వారికి సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు ఎలా పండిస్తున్నారు, ఈ కూరగాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో వివరిస్తూ వారిలో ఆసక్తి కల్పిస్తోంది. విభిన్న ఆలోచనలకు ధైర్యం తోడైతే సాధించలేనిదంటూ ఏది లేదనడానికి పూర్వ జిందాల్ సేంద్రియ వ్యవసాయమే తార్కాణం. చదవండి: Dragon Fruit: ఒక్కసారి మొక్క నాటితే 20-30 ఏళ్లు పంట.. ఎకరాకు 14 లక్షల ఆదాయం! -
సొంతూరిపై మమకారంతో.. ఓ ‘సాఫ్ట్వేర్’ ఉద్యోగి విజయగాథ ఇదీ..
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఓ యువకుడు సాగు బాట పట్టాడు. వ్యవసాయంపై ఆసక్తితో సొంతూరిలోనే ఉద్యాన పంటలు పండిస్తున్నాడు. సేంద్రియ పద్ధతుల్లో దానిమ్మ, మామిడి తోటలు సాగు చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామానికి చెందిన మధుకేశవరెడ్డి విజయగాథ ఇదీ. చదవండి: కిలో రూ.500.. అయినా తగ్గేదేలే! తుగ్గలి(కర్నూలు జిల్లా): ప్రకృతి వైపరీత్యాలు.. మార్కెట్ మాయాజాలం..రెక్కల కష్టానికి దొరకని ప్రతిఫలం.. వెరసి వ్యవసాయం వద్దనుకుంటున్న రోజుల్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సాగు బాట పట్టి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా ఏటా రెండు నెలలు గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేస్తున్నాడు. దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామానికి చెందిన రేమట చిన్న తిమ్మారెడ్డి లక్ష్మిదేవమ్మల కుమారుడు మధుకేశవరెడ్డి హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. అమెరికాలోని మిన్నెసోటా స్టేట్‌లో ఎంఎస్(మాస్టర్ ఆఫ్‌సైన్స్) చేసి, ఎన్రిచ్ కన్సల్టింగ్ కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. వ్యవసాయంపై ఇష్టం మధుకేశవరెడ్డి ఐదో తరగతి వరకు స్వగ్రామంలో, ఆ తరువాత కోడుమూరు మండలం లద్దగిరిలో చదివాడు. ఆ సమయంలో వ్యవసాయంపై ఇష్టం పెంచుకున్నాడు. చదువుకుంటూనే పొలానికి వెళ్లి వ్యవసాయ పద్ధతులను తెలుసుకునేవాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఫ్లోరిడాలో పనిచేస్తున్నాడు. టెక్సాస్ తదితర ప్రాంతాల్లో వ్యవసాయ విధానం ఎలా ఉందో అధ్యయనం చేశాడు. మామిడి తోట.. సొంతూరిపై మమకారంతో.. అమెరికా నుంచి ప్రతి సంవత్సరం స్వగ్రామానికి వచ్చేవాడు. ఇక్కడ ఉన్న పొలాలను పరిశీలించి పండ్లతోటల సాగు చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. ఐదేళ్ల క్రితం సోదరులు మద్దిలేటి రెడ్డి, మహేశ్వరరెడ్డి సహకారంతో 40 ఎకరాల్లో దానిమ్మ, 25 ఎకరాల్లో మామిడి తోటల పెంపకం చేపట్టాడు. దానిమ్మ సాగుకు ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టాడు. శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటూ.. అమెరికాలో ఉంటూనే ఎప్పటికప్పుడు దానిమ్మ, మామిడి ఇతర పంటలపై శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటున్నాడు. అక్కడి నుంచే సోదరులకు ఆన్లైన్ వీడియో కాల్ చేసి సాగుకు అవసరమైన సూచనలిస్తూ వచ్చాడు. పది ఎకరాల మామిడి తోట నుంచి రూ.20 లక్షల ఆదాయం పొందాడు. అనుకూలిస్తే దానిమ్మ కూడా ఆశించిన దిగుబడులు రావచ్చని చెబుతున్నాడు. సేంద్రియ పద్ధతులతో.. సేంద్రియ పద్ధతుల్లో తోటలు సాగు చేస్తున్నారు. ఇందు కోసం 30కి పైగా ఆవులను పెంచుతున్నారు. రసాయన ఎరువులు పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువు వాడుతున్నారు. ఊర్లో పలువురు రైతులకు మధుకేశవరెడ్డి ఆర్థిక సాయం కూడా చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో స్వగ్రామానికి వచ్చి ఏటా రెండు నెలలు పాటు ఇక్కడే ఉంటూ పండ్ల తోటల సాగులో నిమగ్నమై ఎంతో అనుభూతిని పొందుతున్నాడు. ఈయన ప్రోత్సాహంతో గ్రామంలో పలువురు పండ్ల తోటల సాగువైపు వెళుతున్నారు. హార్టికల్చర్ హబ్‌గా కర్నూలు మాది ఆది నుంచి వ్యవసాయ కుటుంబం. నాన్న ఉన్నన్నాళ్లు సేద్యం ఎంతో బాగా చేశాడు. చదువుకునే రోజుల్లో నేను కూడా సెలవుల్లో ఇంటికి వస్తే సేద్యం చేసేవాడిని. వర్షాధారమైన ఈ ప్రాంతంలో రైతులకు సేద్యం గిట్టుబాటు కావడం లేదు. దీంతో నేను పండ్ల తోటల సాగు చేసి రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నా. భూమి అనుకూలించి, నీటి వసతి బాగా ఉంటే దానిమ్మ సాగులో మంచి లాభాలు ఆర్జించవచ్చు. అయితే శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని పంటపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే నష్టపోవాల్సి వస్తోంది. పెట్టుబడులు పెట్టడం ముఖ్యం కాదు. నిరంతరం పర్యవేక్షణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్ చేసుకోవడం ముఖ్యం. మా తోటలు చూసి తెలంగాణకు చెందిన నా స్నేహితుడు కూడా ఉద్యాన పంటల సాగు చేపట్టాడు. రానున్న రోజుల్లో కర్నూలు జిల్లా హార్టికల్చర్ హబ్‌గా మారిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. నా విజయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. – రేమట మధుకేశవరెడ్డి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, తువ్వదొడ్డి -
నేరుగా అమ్మితేనే గిట్టుబాటు..!
రసాయన ఎరువులతో పండించిన పంట దిగుబడుల నుంచి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండటం, ఖర్చులు కూడా అంతకంతకూ పెరుగుతుండటంతో చెరుకూరి రామారావు ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. గత ఎనిమిదేళ్లుగా ప్రకృతి/సేంద్రియ సేద్య పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు, చెరకు, వరి తదితర పంటలు పండిస్తూ.. తాము పండించిన పంట దిగుబడులను వీలైనంత వరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి నికరాదాయం పొందుతున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామంలో 25 ఎకరాల్లో అనేక రకాల కూరగాయలు, అనేక రకాల పండ్లను సాగు చేస్తున్నారు. పొలంలోనే ఏర్పాటు చేసిన నీటి గుంత (బయో డైజెస్టర్)లోనే సేంద్రియ ద్రావణాన్ని తయారు చేసుకొని, నీటితో పాటు, ప్రతి రోజూ డ్రిప్ ద్వారా పంటలకు అందిస్తున్నారు. ప్రస్తుతం 3 ఎకరాల్లో దొండ, 3 ఎకరాల్లో బోడకాకర (ఆగాకర), రెండెకరాల్లో జామ, బొప్పాయి, 7 ఎకరాల్లో చెరకు పంట, ఎకరంన్నరలో అరటి సాగులో ఉన్నాయి. బీర, కాకర, సొర, పొట్ల, వరి పంటల సాగు కోసం పొలాన్ని సిద్ధం చేస్తున్నారు. రసాయన అవశేషాల్లేని కూరగాయలు, పండ్లతోపాటు నాలుగు గానుగల ద్వారా వెలికితీసిన ఆరోగ్యదాయకమైన గానుగ నూనెలను ఉత్పత్తి చేస్తున్నారు. గానుగల నుంచి వెలువడే చెక్క (ఆయిల్ కేక్)ను బయో డైజెస్టర్‌లో నానబెట్టి పంటలకు వాడుతున్నారు. ఆర్.ఆర్. ఆర్గానిక్స్ పేరుతో ఖమ్మంలో, రైతుబజార్లో దుకాణాలు ఏర్పాటు చేసి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు. వివిధ సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ అనుభవాలను రంగరించి రామారావు విస్తారమైన తన క్షేత్రానికి అనుగుణంగా, తక్కువ ఖర్చుతో పోషక ద్రావణాన్ని తయారు చేసుకొని పంటలకు అందిస్తున్నారు. సుభాష్ పాలేకర్, చౌహాన్ క్యు, పొన్నుస్వామి, చింతల వెంకటరెడ్డి వంటి నిపుణులు సూచించిన రసాయన రహిత సేద్య పద్ధతులను అవసరం మేరకు అనుసరిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఎకరానికి 5 ట్రాక్టర్ల పశువుల ఎరువు తోలి దుక్కి చేసిన తర్వాత ఎత్తుమడులపై కూరగాయ పంటలను సాగు చేయటం రామారావుకు అలవాటు. పంటలకు ప్రతి రోజూ డ్రిప్ ద్వారా నీటితో పాటు సేంద్రియ పోషక ద్రావణాన్ని కూడా అందిస్తేనే మంచి దిగుబడులు సాధించటం సాధ్యమవుతుందని ఆయన అనుభవం ద్వారా గ్రహించారు. బయో డైజెస్టర్‌తో మేలు పొలంలో ఏర్పాటు చేసిన ఫాం పాండ్నే రామారావు బయో డైజెస్టర్గా వినియోగించుకుంటున్నారు. 20 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు, 12 అడుగల లోతులో 2 లక్షల నీటి సామర్ధ్యం కలిగిన గుంత (ఫాం పాండ్) తవ్వారు. ఈ గుంతలో 500 మైక్రాన్ల ప్లాస్టిక్ (టార్పాలిన్) షీట్‌ను పరచారు. నీటితో నింపిన తర్వాత, ఒక ట్రాక్టర్ ట్రక్కు కోళ్ల ఎరువు వేస్తారు. 4 ప్లాస్టిక్ (ఉల్లి గడ్డలు వేసే) సంచులలో ఒక్కో దాంట్లో 25 కిలోల చొప్పున నూనె తీసిన గానుక చెక్కను నింపి, వాటిని నీటి గుంతలో వేలాడ గడతారు. అదే నీటిలో కూరగాయ వ్యర్థాలు, పండ్ల వ్యర్థాలు వేస్తారు. 20 కిలోల చొప్పున బియ్యం నింపిన సంచులు నాలుగింటిని కూడా గుంత నీటిలో వేలాడ దీస్తారు. గానుగ చెక్కలతో కూడిన ప్లాస్టిక్ సంచులను, బియ్యం సంచులను పోషకాలు సరిగ్గా నీటిలో కలిసేందుకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రపు వేళల్లో కొద్ది సేపు అటూ ఇటూ ఊపుతూ కదిలిస్తుంటారు. ఇవన్నీ కుళ్లి పంట మొక్కల పెరుగుదలకు తోడ్పడే సేంద్రియ పోషక ద్రావణం తయారవుతుంది. మూడంచెల ఫిల్టర్ వ్యవస్థ గుంతలో తయారైన సేంద్రియ ద్రావణాన్ని మూడంచెలలో వడకట్టి, సూక్ష్మ సేద్య పద్ధతిలో పైర్లకు అందిస్తున్నారు. నీటి గుంతలో ఓ వైపున ఇనుప పైపుల ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి, దాని చుట్టూ 50 శాతం షేడ్‌నెట్‌ను చుట్టారు. 200 లీటర్ల సామర్ధ్యం కలిగిన ప్లాస్టిక్ డ్రమ్ముకు చుట్టూ రంధ్రాలు పెట్టి, ఆ డ్రమ్ము చుట్టూ 30 శాతం షేడ్‌నెట్ కట్టారు. 10 ఇంచుల పీవీసీ పైపునకు రంధ్రాలు చేసి, 120 స్టీల్ మెష్‌ను చుట్టి డ్రమ్ములోకి దించారు. ఒకటిన్నర హెచ్‌పీ విద్యుత్ మోటర్ ఫుట్ బాల్‌కు జాలీ కట్టి పీవీసీ పైపులో అమర్చారు. నీటి గుంతలో తయారైన సేంద్రియ పోషక ద్రావణాన్ని మూడంచెల్లో ఫిల్టర్ అయ్యేలా ఏర్పాటు చేసి, ప్రధాన నీటి పంపునకు అనుసంధానం చేశారు. సకల పోషకాలనూ అందించే ఈ ద్రావణం మనుషుల ప్రమేయం లేకుండా ప్రతి రోజూ డ్రిప్ ద్వారా మొక్కలకు అందుతుంది. రామారావు రూపొందించిన విధంగా నీటి గుంత (బయో డైజెస్టర్)ను నిర్మించడానికి సుమారుగా రూ. 60 వేలు ఖర్చవుతుంది. ఒకసారి దీన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా ఏళ్ల పాటు ప్రతి సీజన్‌కూ ఉపయోగపడుతుంది. – గుండా జవహర్ రెడ్డి, సాక్షి, ఖమ్మం వ్యవసాయం రైతుబజార్ రిటైల్ ధరకు అమ్మినా చాలు! పదేళ్ల క్రితం తిరుపతిలో జరిగిన సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొన్న స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం చేపట్టాను. తొలి దశలో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాను. పలు రసాయన రహిత సేద్య పద్ధతుల్లో ఉపయోగకరమైన అంశాలను అనుసరిస్తూ.. సేంద్రియ పద్ధతుల్లో కూడా రసాయనిక రైతులకు దీటుగా దిగుబడులు తీయటం సాధ్యమేనని మా అనుభవాలు చెబుతున్నాయి. రైతులు పొలంలోనే పామ్ పాండ్ తవ్వుకొని, షీట్ పరచి, ఆ నీటి కుంటలో పోషక ద్రావణాన్ని సునాయాసంగా తయారు చేసుకోవచ్చు. ప్రతి రోజూ నీటితోపాటు డ్రిప్ ద్వారా పోషక ద్రావణాన్ని అందించి మంచి దిగుబడులు సాధించవచ్చు. కూరగాయలు సాగు చేసే రైతులు సాధారణ మార్కెట్లో రసాయనిక వ్యవసాయదారులతో పాటు తమ కూరగాయలను టోకు ధరకు అమ్మితే గిట్టుబాటు కాదు. నేరుగా వినియోగదారులకు రిటైల్‌గా అమ్ముకుంటేనే గిట్టుబాటవుతుంది. అధిక ధరకు అమ్మాల్సిన అవసరం కూడా లేదు. ప్రకృతి / సేంద్రియ కూరగాయలను రైతుబజారు రిటైల్ ధరలకు నేరుగా వినియోగదారులకు అమ్ముకున్నా రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ప్రతి పట్టణం, నగరం మధ్యలో రైతుబజార్లు ఏర్పాటు చేయాలి. ఖమ్మం నగరంలో నుంచి రైతుబజార్‌ను ఊరి బయటకు తరలించిన తర్వాత మా కూరగాయలు, పండ్లను అమ్ముకోవటం కనాకష్టంగా మారింది. ఆదాయమూ తగ్గిపోయింది. – చెరుకూరి రామారావు (79954 30697), సేంద్రియ కూరగాయల రైతు, కోయచెలక, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా -
సేంద్రీయ సేద్యం.. రసాయన ఎరువులకు స్వస్తి
రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న పంట నాణ్యత.. రైతులను సంప్రదాయ సేద్యంపై వైపు నడిపిస్తోంది. సహజ సిద్ధ (ఆర్గానిక్) పంట ఉత్పత్తులకు మార్కెట్లోనూ మంచి డిమాండ్ఉండడం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులకు లాభాసాటిగా ఉండాలనే లక్ష్యంతో ప్రకృతి సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం సైతం తోడ్పాటును అందిస్తోంది. పెట్టుబడులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులతో జిల్లాలో ఏటా సహజ సేద్యం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. విడవలూరు/నెల్లూరు(సెంట్రల్): ప్రకృతి వ్యవసాయం లాభసాటిగా మారడంతో రైతులకు వరంగా మారింది. ప్రస్తుతం రసాయనిక ఎరువుల ధరలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతుండడంతో సాగు పెట్టుబడి అధికం అవుతుంది. పంట నాణ్యత లేకపోవడంతో దళారుల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాలు వస్తుండడం, సేంద్రియ సేద్య (ఆర్గానిక్) ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్, రేటు లభిస్తుండడంతో రైతులు సైతం ఆ తరహా సేద్యంపై ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సేంద్రియ సేద్యాన్ని ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంతో జిల్లాలో ఏటేట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 67 వేల ఎకరాల్లో సాగు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయానికి మహిళా రైతులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. విడవలూరు, వింజమూరు తదితర మండలాల్లో మహిళా రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. వీరు ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేయడంతో గతంలో వీరికి ఆదర్శ మహిళా రైతుగా బిరుదులు కూడా దక్కాయి. జిల్లాలో ఈ ఏడాది 53,764 మంది రైతులు 67,356 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో 222 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్ర«ధానంగా ఆత్మకూరు, ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తరహా సాగు విస్తీర్ణం పెరిగింది. 18 రకాల పంటలు జిల్లాలో ఎక్కువగా 18 రకాల పంటలను ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువగా పండిస్తున్నారు. ప్రధానంగా వరి పంట అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. వరితో పాటు జొన్నలు, సజ్జలు, రాగులు, మినుములు, కందులు, పెసలు, పిల్లిపిసర, జనుము, జీలుగ, మొక్కజొన్న, కొర్రలు, గోగులు, గోరుచిక్కుళ్లు, కాకర, బీర, సొరకాయలు, బెండ, టమాటాలు ఎక్కువగా వీటిని ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నారు. 110 గ్రామాల ఎంపిక ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎడగారులో వరి సాగు పండించేందుకు జిల్లాలో 110 గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు బీజామృతం (విత్తన శుద్ధి), జీవామృతం (పంట సత్తువ), నీమామృతం (గుడ్డు దశ నాశనం), బ్రహ్మాస్త్రం (లబ్ధిపురుగు నివారణ) అగ్నాస్త్రం (అగ్గి తెగులు నివారణ) అజోల్లా (నత్రజని అందించడం) వంటి వాటిపై అవగాహన కల్పించడంతో పాటు వాటి తయారీ విధానం, వాడుక విధానాన్ని తెలుపుతున్నారు. ప్రకృతి వ్యవసాయమే అనివార్యం ఈమె పేరు రొడ్డా వెంగమ్మ. ఊటుకూరు సర్పంచ్, వింజమూరు మండలం. ఈమె 5 ఎకరాల్లో మామిడి తోట, 5 ఎకరాల్లో వరి, అర ఎకరాలో కంది, అర ఎకరాలో కూరగాయలను పండిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులతో సాగు చేయడంతో పెట్టుబడులు పెరిగి, ఆర్థికంగా నష్టపోయారు. దీంతో ఆమె ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించారు. తొలుత కొంత సేంద్రియ విధానంలో సాగు చేసి సత్ఫలితాలు సాధించారు. దీంతో పూర్తిగా ప్రకృతి సేద్యం చేయడం ద్వారా ఖర్చులు తగ్గించుకున్నారు. అధిక దిగుబడులతో రాబడి పెరిగిందని చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల కషాయాలను స్వయంగా తయారు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. మూడేళ్ల నుంచి వరి పంట సాగు ఈమె పేరు చౌటూరు రమణమ్మ, విడవలూరు. ఈమె తనకున్న రెండు ఎకరాల సొంత పొలంలో వరి సాగు చేస్తున్నారు. గిరిజన మహిళ కావడంతో పెద్దగా విద్యను అభ్యసించలేదు. ఈమె కూడా అందరిలాగే రసాయనిక ఎరువులు, పురుగు మందులతో సాగు చేసింది. పెద్దగా రాబడి లేకపోవడంతో సాగు కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయంపై అంతపట్టు లేకపోయినప్పటికీ, ప్రకృతి సేద్యంతో ఖర్చులు తగ్గుతాయని, రాబడి పెరుగుతుందని ప్రకృతి సేద్యం సిబ్బంది సూచనలతో ఆ వైపు అడుగులు వేసింది. వారి పర్యవేక్షణలో మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం ద్వారానే వరి సాగు చేస్తున్నారు. దీంతో ఈమెకు ఉత్తమ మహిళా రైతుగా బిరుదు లభించింది. అవగాహన కల్పిస్తున్నాం ప్రకృతి వ్యవసాయం సాగుపై జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయం సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రైతులు కూడా సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అన్ని విధాలుగా రైతులకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. – ప్రభాకర్, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ చాలా బాగుంది ప్రకృతి వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాను. వరితో పాటు, ఇతర పంటలను సాగు చేస్తున్నాను. పంటకు పోషకాలు అందించేందుకు అవసరమైన ప్రకృతి పరమైన పోషకాలు సిద్ధం చేసుకోవడం, వాటిని తయారు చేసుకోవడం కొంచెం కష్టంగా ఉన్నా.. ఖర్చులు భాగా తగ్గుతున్నాయి. అధిక దిగుబడులతో లాభాలు వస్తున్నాయి. – ఇందకూరు అనిల్‌రెడ్డి, రైతు, అశ్వనీపురం, ఆత్మకూరు మండలం -
Kakinada: నల్ల తామరకు ‘ఉల్లి’ కళ్లెం! ఆదర్శంగా దుర్గాడ రైతులు..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. అలాంటి ఉల్లి రైతులకు తల్లిగా మారింది. కుళ్లిన ఉల్లిపాయలతో తయారు చేసిన కషాయం పొట్టి మిర్చి మొదలు అనేక ఇతర పంటలకూ సంజీవినిగా మారింది. అనుకోని ఉపద్రవాలకు పకృతి వ్యవసాయమే ధీటుగా సమాధానం చెబుతుందని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన రైతులు నిరూపించారు. దుర్గాడ గ్రామంలో సుమారు వెయ్యి మంది చిన్నా, పెద్దా రైతులు ఉంటారు. పొట్టి మిర్చి అనే అరుదైన దేశవాళీ రకం రౌండ్ మిర్చికి దుర్గాడ పెట్టింది పేరు. వందలాది మంది రైతులు ఈ రకం మిర్చిని ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే సాగు చేశారు. ఈ ఏడాది మిర్చి తోటలను నల్ల తామర (త్రిప్స్ పార్విస్పైనస్) సర్వనాశనం చేసింది. దుర్గాడలో సుమారు 300 ఎకరాల వరకు ఉల్లి సాగవుతోంది. కుళ్లిపోయిన ఉల్లి పాయలతో తయారు చేసిన కషాయం మిరప తోటలను, ఇతర తోటలను రసంపీల్చే పురుగుల నుంచి రక్షించడానికి ఉపయోగపడటం విశేషం. ‘ఉల్లి కషాయంతో ముడత విడిపోతుండటంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా రైతులోకంలో పాకిపోయింది. గత డిసెంబర్లో అనేక జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి కూడా రైతులు దుర్గాడ వచ్చి ఉల్లి కషాయాన్ని తీసుకెళ్లి పంటలను రక్షించుకున్నారు. లీటరు రూ.30కి విక్రయిస్తున్నాం. అప్పట్లో రోజుకు 500–600 లీటర్ల వరకు అమ్మాం. మిర్చితోపాటు అనేక ఇతర పంటల్లోనూ రసం పీల్చే పురుగులన్నిటినీ ఉల్లి కషాయం కంట్రోల్ చేసింది. దుర్గాడలో ఉల్లి కషాయం వాడని రైతు లేరు. ఈ ఏడాది ఆ గ్రామానికి చెందిన వెయ్యి మందికి పైగా రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తామంటున్నారు..’ అని ఏపీ ప్రకృతి వ్యవసాయ విభాగం ఎంసీఆర్పీ వెంకట రమణ ‘సాక్షి’తో చెప్పారు. మిరప, మామిడి, పత్తి, మునగ, దోస, సొర, క్యాప్సికం, బంతి, చామంతి, టమాటా, దొండ వంటి అనేక పంటలపై దాడి చేస్తున్న రసంపీల్చే పురుగుల నియంత్రణకు ఉల్లి కషాయం చాలా ఉపయోగపడిందని ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది చెబుతున్నారు. ఉల్లి కషాయంతో పాటు, కుళ్లిన చేపలతో మీనామృతం, అల్లం వెల్లుల్లితో తయారైన అగ్నిఅస్త్రం, దేశవాళీ ఆవు పెరుగుతో తయారైన పులిసిన మజ్జిగతో ప్రకృతి వ్యవసాయంలో చక్కని ఫలితాలు సాధిస్తూ దుర్గాడ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయనిక వ్యవసాయం చేస్తున్న ముర్రె మన్నెయ్య అనే మిర్చి రైతు నల్ల తామర తాకిడికి పంటను పీకేద్దామనుకున్నాడు. పక్క పొలానికి చెందిన రైతు సూచన మేరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మారి అనేక దశపర్ణి కషాయం, ఉల్లి కషాయం, పుల్లమజ్జిగ, పంచగవ్య పిచికారీ చేసి పంటను పూర్తిగా రక్షించుకున్నారు. అసలేమీ రాదనుకున్న ఎకరంన్నర పొలంలో సుమారు పది క్వింటాళ్ల మిర్చి దిగుబడి పొందారు. నష్టాలపాలయ్యే దశలో సాగు పద్ధతి మార్చుకొని లాభాలు పొందాడు. ప్రతి ఇల్లూ కషాయ విక్రయ కేంద్రమే! దుర్గాడలో పంట సీజన్లో సుమారు 15 టన్నుల వరకు ఉల్లిపాయలు పాడైపోతూ ఉంటాయి. గతంలో వీటిని పారేసే వారు. కానీ ప్రస్తుతం ఉల్లి కషాయం తయారీలో కుళ్లిన ఉల్లి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో దానికీ ఆర్థిక విలువ వచ్చింది. మామూలు ఉల్లి కేజీ రూ. 20 ఉంటే పనికి రాని ఉల్లి కేజీ రూ. 3–5 వరకు పలుకుతోంది. ఇళ్ల దగ్గర పూల మొక్కలకు బదులుగా సీతాఫలం, ఉమ్మెత్త, వేప తదితర ఔషధ మొక్కలను పెంచటం ప్రారంభించారు. ప్రతీ ఇంటి వద్దా దేశవాళీ ఆవులు దర్శనమిస్తున్నాయి. గ్రామం మొత్తంలో సుమారు 70 మంది రైతులు తమ ఇళ్ల వద్ద ఉల్లి కషాయం తయారు చేసి అమ్మటం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. ప్రతి రైతూ ఉల్లి కషాయం వాడారు ప్రకృతి వ్యవసాయంలో ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు పొట్టి మిర్చి దిగుబడి వచ్చేది. అయితే, ఈ ఏడాది నల్లతామర విరుచుకు పడటంతో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడే రైతులు చాలా మంది పూర్తిగా నష్టపోయి తోటలు పీకేసి నువ్వులు వేశారు. ప్రకృతి వ్యవసాయంలో ఉన్న మిరప చేలు ఉల్లి కషాయం వల్ల తట్టుకున్నాయి. దిగుబడి 15 క్వింటాళ్లకు తగ్గింది. దుగ్గాడలో రసాయన సేద్యం చేసే రైతులు సహా ప్రతి రైతూ ఏపీ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం తయారు చేసి ఇచ్చిన ఉల్లి కషాయం వాడి ఉపశమనం పొందారు. తోటలు తీసేద్దామనుకున్న రసాయన రైతులు కొందరు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించి తోటలను నిలబెట్టుకున్నారు. – ఎలియాజర్(94416 56083), ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్టు మేనేజర్, కాకినాడ జిల్లా ఉల్లి కషాయం బాగా పని చేస్తోంది ఉల్లి కషాయం పంటలను ఆశించే రసంపీల్చే పురుగులను బాగా కట్టడి చేస్తోంది. పకృతి వ్యవసాయం డీపీఎం గారు ఉల్లి కషాయం తయారీ విధానాన్ని వివరించగా ప్రయోగాత్మకంగా తయారు చేసి చూసాను. మొదట్లో నా పొలంలో పిచికారీ చేస్తే పురుగుల తీవ్రత తగ్గి పంట నిలబడింది. దీంతో ఎక్కువ మోతాదులో తయారీ ప్రారంభించా. ప్రతి రోజూ 20–50 లీటర్ల ఉల్లి కషాయం తయారు చేస్తున్నాను. ఇప్పటి వరకు సుమారు 80 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుచేసిన మిర్చి పంట నల్ల తామర పురుగును తట్టుకుని నిలబడడంతో మిగిలిన రైతులు కూడా వాడడం ప్రారంభించారు. సొంతంగా దేశవాళీ ఆవులను పెంచుతూ భారీగా ఉల్లి కషాయం, జీవామృతం, మీనామృతం, అగ్ని అస్త్రం వంటి మందులు తయారు చేసి స్థానిక రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఇతర ప్రాంతాల రైతులు కూడా వచ్చి ఉల్లి కషాయం కొనుక్కెళ్తున్నారు. – గుండ్ర శివ చక్రం (95537 31023), రైతు, ఉల్లి కషాయం తయారీదారుడు, దుర్గాడ, కాకినాడ జిల్లా ఉల్లి కషాయం తయారీ, వాడకం ఇలా.. ఉల్లి కషాయానికి కావాల్సినవి: ఉల్లి పాయలు (కుళ్లినవైనా పర్వాలేదు) – 20 కేజీలు, వేపాకు – 5 కేజీలు, సీతాఫలం ఆకు – 2 కేజీలు, ఉమ్మెత్తాకు – 1 కేజీ, గోమూత్రం – 20 లీటర్లు, గోవు పేడ – 2 కేజీలు. తయారు చేసే విధానం: ఉల్లి పాయలు, వేపాకులు, సీతాఫలం ఆకులు, ఉమ్మెత్తాకులను మెత్తగా దంచి ముద్దగా చేసి దానికి ఆవు పేడ కలిపి సిద్ధం చేసుకోవాలి. ఒక పొయ్యిపై పెద్ద పాత్రను పెట్టి 20 లీటర్ల గోమూత్రాన్ని పోసి, దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఆకులు, ఉల్లి మిశ్రమాన్ని దానిలో కలుపుకోవాలి. మూడు పొంగులు వచ్చే వరకు అర గంట పాటు మరగబెట్టాలి. తరువాత చల్లారనిచ్చి, వడకట్టి ఒక పరిశుభ్రమైన డ్రమ్ములో భద్రపరచుకోవాలి. ఇలా దాదాపు 20 లీటర్ల ఉల్లి కషాయం తయారవుతుంది. మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఉల్లి కషాయాన్ని వారానికి ఒకసారి చొప్పున మూడు వారాల పాటు పిచికారీ చేయడం వల్ల చీడపీడల నుంచి పంటకు ఉపశమనం లభిస్తుంది. వాడే విధానం: 4 లీటర్ల ఉల్లి కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి చేలల్లో పిచికారీ చేసుకోవాలి. ఉల్లి కషాయం కలిపిన సుమారు 150 లీటర్ల ద్రావణం ఎకరానికి అవసరమవుతుంది. ఉద్యానవన పంటలకు ఆకులు మొదళ్లు తడిచేలా పిచికారీ చేసుకోవడం వల్ల అన్ని రకాల పురుగులు నశిస్తాయని రైతులు చెబుతున్నారు. దుర్గాడలో ఉల్లి కషాయాన్ని పకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు లీటరు రూ. 30లకు విక్రయిస్తున్నారు. – వీఎస్‌వీఎస్ వరప్రసాద్, సాక్షి, పిఠాపురం, కాకినాడ జిల్లా -
ఇక్కట్లు లేని ‘ఇల’ పంటలు!
కుటుంబం అవసరాలకు సరిపోయే అన్ని ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలు, కొన్ని రకాల పండ్లను రసాయనాలు వాడకుండా స్వయంగా సాగు చేసుకోవటమే ఆర్గానిక్ టెర్రస్ కిచెన్ గార్డెనింగ్ ముఖ్య ఉద్దేశం. అయితే, అనుకున్న కొద్ది మంది మాత్రమే ఆ ఆశలను సక్రమంగా తీర్చుకోగలుగుతారు. కొందరు ఉత్సాహంగా ప్రారంభిస్తారు. తమకున్న స్థలానికి తగిన డిజైన్, ప్రణాళిక, తగిన వస్తువులు దొరక్క కిచెన్ గార్డెనింగ్ ప్రక్రియలో ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కొవడానికి నానా తంటాలు పడతారు. ఎంత కష్టపడినా ఫలితం లేక చివరికి చాలా మంది చేతులెత్తేస్తారు. ఇక వేసవి సమస్యలు సరేసరి. సరిగ్గా ఈ సమస్యలన్నిటినీ అధిగమించేందుకు దోహదపడటమే లక్ష్యంగా ఇల హోం గార్డెన్స్ కన్సల్టెన్సీ అనే స్టార్టప్ ఆవిర్భవించింది. ఆర్గానిక్ టెర్రస్/కిచెన్ గార్డెనింగ్‌లో ఆధునిక పద్ధతులపై సుదీర్ఘ స్వీయానుభవం కలిగిన శాస్త్రవేత్త డా. జి. శ్యామసుందర్ రెడ్డి, మాటీవీలో ‘భూమిపుత్ర’ సిరీస్ ప్రొడ్యూసర్, ఫ్రీలాన్స్ పాత్రికేయుడు కె.క్రాంతికుమార్ రెడ్డి ఉమ్మడిగా ‘ఇల’ ను హైదరాబాద్ కేంద్రంగా నెలకొల్పారు. టెర్రస్ కిచెన్ గార్డెనింగ్‌లో సమస్యలను అధిగమించడంతోపాటు పుష్టికరమైన ఆహారాన్ని పుష్కలంగా ఇంటిపైనే పండించుకునేందుకు దోహదపడే ప్రత్యేకమైన కుండీ ‘ఇల’కు డా. శ్యామసుందర్‌రెడ్డి రూపుకల్పన చేశారు. చదరపు గజం విస్తీర్ణంలో వృత్తాకారంలో ఉండే ఈ కుండీని ప్రతికూల పరిస్థితుల్లోనూ పుష్టికరమైన ఇంటిపంటల దిగుబడినిచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీర్ఘకాలం మన్నే ఫైబర్ బేస్ పైన, చుట్టూతా జీఏ మెష్, లోపల వైపు గ్రీన్ షేడ్‌నెట్.. అన్నిటికీ మించి ప్రత్యేకంగా రూపొందించిన సేంద్రియ మట్టి మిశ్రమం దీని ప్రత్యేకత. ఎర్రమట్టి, కోకోపిట్, బయోచార్, వర్మీకంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులు, వర్మిక్యులేట్ తదితరాలతో కూడిన మట్టి మిశ్రమం.. మొక్కల వేరు వ్యవస్థ సులభంగా విస్తరించేలా, బలంగా ఎదిగేలా, గాలి పారాడేలా, ఆరోగ్యదాయకమైన అధికోత్పత్తిని అందించేలా డిజైన్ చేసిన కుండీలే తమ ప్రత్యేకత అని ‘ఇల’ సీఈవో క్రాంతి (83096 15657) తెలిపారు. ఇల కుండీలకు డ్రిప్‌ను అమర్చి క్రమం తప్పకుండా తగుమాత్రంగా తేమను అందిస్తూ వారానికో, రెండు వారాలకోసారి నిర్దేశిత పిచికారీలు చేస్తుంటే చాలు.. సులభంగా నిర్వహించుకుంటూ చక్కని ఇంటిపంటలు పండించుకొని తినొచ్చని స్వీయానుభవంతో చెబుతున్నారు దేవరం శ్రీనివాసరెడ్డి, రమ దంపతులు. మే నెల మండుటెండల్లో సైతం ముదురు ఆకుపచ్చగా అనేక ఇంటిపంటలకు నెలవుగా వీరి టెర్రస్ కిచెన్ గార్డెన్ కనువిందు చేస్తోంది. సివిల్ కాంట్రాక్టర్ అయిన శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ వనస్థలిపురం ఎఫ్.సి.ఐ. కాలనీలో నిర్మించుకున్న ఇంటిపైన 3 నెలల క్రితం 40 ‘ఇల’ కుండీలను ఏర్పాటు చేసుకున్నారు. టెర్రస్ మధ్యలో సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. వాటి చుట్టూతా ఉత్తరం వైపు ఒక వరుస, తూర్పు వైపు రెండు వరుసలుగా కుండీలు ఏర్పాటు చేసుకున్నారు. డ్రిప్‌తో ఇచ్చిన నీరు చుక్క కూడా నేలపై పడదు. ప్రస్తుతం పాలకూర, గోంగూర, చుక్కకూర, పొన్నగంటి, బచ్చలి, తోటకూర, చెట్టు బచ్చలి, కొత్తిమీర, పుదీనాతోపాటు.. క్యారట్, మిరప, వంగ, టమాటో, చెర్రీ టమాటో, చెట్టు చిక్కుడు, గోకర (గోరుచిక్కుడు) పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. ఎండలు మండే మే నెలలోనూ షేడ్‌నెట్ లేకుండానే పండిన కాళీఫ్లవర్ వీరి ఇంటిపంటల సుసంపన్నతకు నిదర్శనంగా నిలిచింది. ఏర్పాటు చేసుకున్న నెల రోజుల నుంచే ఆకుకూరలు కొనటం పూర్తిగా మానేశామని, బయట కొనే వాటితో పోల్చితే తాము పండించుకున్న ఆకుకూరలు, కూరగాయల రుచే వేరని.. వంకాయ కూర రుచి ఎంతో బాగుందని శ్రీనివాసరెడ్డి (98480 39532), రమ సంతోషంగా చెప్పారు. ఆరోగ్యం కోసం ఏమైనా చేయాలంటే ముందు మన ఆహారాన్ని రసాయన రహితం చేసుకోవాలి. అందుకు అద్భుత సాధనం టెర్రస్‌పై ఇంటిపంటలే అనటం అతిశయోక్తి కాదు. ilahomegardens.com. -
పంట భద్రుడై... ఆదర్శ రైతుగా నిలిచాడు
ఉపాధ్యాయ వృత్తికి అవసరమైన అర్హతలు కలిగిన ఓ పట్టభద్రుడు వ్యవసాయంపై దృష్టి సారించాడు. పదిమంది రైతులు సాగు చేస్తున్న పద్ధతికి భిన్నంగా ఆలోచించి వాణిజ్యపంట సాగు చేపట్టాడు. ఇంతవరకు పార్వతీపురం మన్యం జిల్లాలో కనీవినీ ఎరుగని డ్రాగన్ పండ్ల తోట పెంపకం చేపట్టి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాక్షి, పార్వతీపురం: ఈ ఫొటోలోని డ్రాగన్ తోట వేరే ఏ ప్రాంతంలోనిదో కాదు. సంప్రదాయంగా పండిస్తున్న వరి, మొక్క జొన్న, అరటి, పామాయిల్ పంటపొలాల్లోనిదే. ఈ వాణిజ్య పంటను ఓ యువరైతు పండిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ మండలం లుంబూరు గ్రామానికి చెందిన యువరైతు లండ ఏసుబాబు రెండెకరాల్లో డ్రాగన్ పంటను సాగుచేస్తున్నారు. ఈ తోట వేసి ఏడాది కావస్తోంది. ఇప్పుడిప్పుడే పూతదశకు రావడంతో, అక్కడక్కడ పిందెలు కాస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ రెండెకరాల పంటలో తొలిపూత వచ్చే అవకాశం ఉందని రైతు సాక్షికి వెల్లడించారు. ఈ పంట నుంచి తొలి పూతలో పెద్దగా దిగుబడి ఉండదని, రెండేళ్ల తరువాత ఎకరాకు 3 టన్నుల వరకూ డ్రాగన్ పండ్లు రానున్నాయని తెలిపాడు. నల్గొండలోని ప్రముఖ రైతు రాజారెడ్డి నర్సరీ నుంచి మొత్తం 3,000 మొక్కలు తీసుకొచ్చి సాగుచేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ పండ్లకు టన్ను ధర రూ.2 లక్షలు పైబడి ఉందని చెబుతున్నాడు. లీజు భూముల్లో సాగు పాలకొండ మండలంలోని లుంబూరు గ్రామం పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని ఈ యువ రైతు 20 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నాడు. ముళ్లపొదలు కూడా మొలకెత్తని ఈ భూమిని ఏడాదికి ఎకరాకు లీజు రూ.14 వేలు చొప్పున ఒప్పందం కుదుర్చుకుని డ్రాగన్ సాగు ప్రారంభించాడు. బీఎస్సీ బీఈడీ చేసిన ఈ రైతు పలుచోట్ల డ్రాగన్ పండ్లకు ఉన్న డిమాండ్‌ను గుర్తించి ఈ పంట సాగుతో లాభాలు వస్తాయనే ఉద్దేశ్యంతో ఏడాది క్రితం సాగు మొదలుపెట్టాడు. ఒక హెక్టార్లో డ్రాగన్ సాగుకు ప్రభుత్వం 30 శాతం మేర రాయితీతో విత్తన మొక్కలను అందిస్తున్న నేపథ్యంలో ఈయన కూడా ప్రభుత్వం నుంచి రూ. 30 వేల మేర రాయితీ పొందాడు. మొత్తం భూమిని సాగుకు అనుకూలంగా మార్చి బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేశాడు. సిమెంట్ స్తంభాలు, చక్రాలతో తోటకు అనుగుణంగా పందిళ్లు నిర్మించాడు. ఈ మొత్తం ఏర్పాట్లకు తోట పెంపకానికి ఇప్పటివరకూ ఎకరాకు రూ.5 లక్షల మేర ఖర్చయిందని రైతు ఏసుబాబు చెప్పాడు. ఒక స్తంభం నుంచి మరో స్తంభానికి మధ్య 8 నుంచి పది అడుగుల వ్యత్యాసంతో డ్రాగన్ మొక్కలు వేయగా ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. సేంద్రియ పద్ధతిలో సాగు యువరైతు సాగును సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాడు. పేడగత్తెం, కుళ్లిన ఎండుగడ్డి, జీవా మృతాల ద్వారానే సాగు చేపట్టాడు. రసాయనిక ఎరువులను వినియోగించి, సాదారణ పంటలు సాగుచేసే రైతులకు ఏసుబాబు చేస్తున్న సాగు ఆదర్శంగా మారింది. బీడు భూమిలో రూ.10 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టి సాగులోకి తీసుకు రావడంతో పాటు అధునాతన సాగును ప్రారంభించడంతో పలువురు రైతు ఏసుబాబును అభినందిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంట కావడంతో ఈ పండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందని పాలకొండ ఉద్యానవనశాఖాధికారిణి టి.అమరేశ్వరి అన్నారు. ఈ వినూత్న సాగు చేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో యువరైతు ఏసుబాబు ముందుకు రావడం విశేషమని వెల్లడించారు. బాగుంటుందనే ఉద్దేశంతో.. వాణిజ్యపంటల సాగు ఆసక్తితోనే చేపట్టాను. నా స్నేహితుడి సాయం కూడా ఉంది. నిరుపయోగంగా ఉన్న ఈ ప్రాంతంలో లీజుకు తీసుకుని డ్రాగన్ తోటలు వేశాను. ప్రస్తుతం పూతదశకు చేరుకున్నాయి. ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది బాగా పూత వస్తుంది. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఎల్. ఏసుబాబు, యువరైతు, లుంబూరు. -
ఏడాది పొడవునా పచ్చని పంటలు!
ప్రకృతి సిద్ధంగా సమగ్ర పోషణ, సస్య రక్షణ పద్ధతులను అనుసరించటం ద్వారా ఆరుబయట పొలాలతో పాటు పాలీహౌస్‌లలోనూ ఏడాది పొడవునా ఆరోగ్యదాయకమైన వివిధ సేంద్రియ ఉద్యాన పంటలు నిశ్చింతగా పండించవచ్చని ఈ రైతులు నిరూపిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ప్రకృతి సాగు చేస్తూ ప్రతిరోజూ నమ్మకమైన దిగుబడులు తీస్తూ, హైదరాబాద్ నగరంలో ఎంపికచేసిన చోట్ల నేరుగా ప్రజలకు విక్రయిస్తుండటం విశేషం. మేడ్చల్–మల్కజ్గిరి జిల్లాలో ఆధునిక పద్ధతుల్లో ఆరోగ్యదాయక సేద్యం జరుగుతోంది. హార్ట్ట్ ట్రస్టు వ్యవస్థాపకులు, గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేత సుబ్రమణ్యం రాజు ఆధ్వర్యంలో పలువురు రైతులు సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. శామీర్‌పేట మండలం పొన్నాల గ్రామంలో మూడు ఎకరాల్లో ఐదు పాలీహౌస్‌లు నిర్మించుకున్న పెన్మెత్స పెద్దిరాజు, గొట్టుముక్కల రాము ఏడాది పొడవునా అనేక రకాల ఆకుకూరలను పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నారు. మండుటెండల్లోనూ పాలీహౌస్‌లలో వీరు ఆకుకూరలను చీడపీడలు, పోషక లోపాలు లేకుండా పండిస్తున్న తీరు ఔరా అనిపించక మానదు. కొత్తిమీర, మెంతికూర, పాలకూర, పెరుగు తోటకూర, ఎరుపు తోటకూర, కాడ తోటకూర, గంగవాయిలు, గోంగూర, బచ్చలి కూరలను పాలీహౌస్‌లలో ఎత్తు మడులపై సాగు చేస్తున్నారు. పుదీన, కరివేపాకులను ఆరుబయట మడుల్లో పండిస్తున్నారు. పాలీహౌస్లో సాగు చేస్తున్న బీర, సొర, కాకర, కీర పంటలను సైతం వచ్చే నెల నుంచి దిగుబడి వస్తుందన్నారు. 3 వేల చదరపు మీటర్ల విస్తీర్ణం గల పాలీహౌస్లో పశువుల ఎరువు, వర్మీకంపోస్టు మిశ్రమంతో 48 ఎత్తుమడులు ఏర్పాటు చేశారు. ప్రతి మడి 40 చదరపు మీటర్లుంటుంది. ట్రైకోడెర్మావిరిడితో విత్తన శుద్ధి చేస్తారు. జీవామృతం, గోకృపామృతం, వేస్ట్‌డీకంపోజర్ వంటి ద్రవరూప ఎరువులను ఫైబర్ ట్యాంకులలో తయారు చేసుకుంటున్నారు. నిర్ణీత సమయాల్లో ఎయిరేటర్ల ద్వారా ఈ పోషక ద్రావణాలను ఆటోమేటిక్‌గా కలియబెట్టుకుంటూ.. ఆధునిక పద్ధతుల్లో వాల్వుల ద్వారా నేరుగా బెడ్స్‌కు వారానికోసారి డ్రిప్‌ల ద్వారా అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అదే విధంగా ఫిష్ అమినో యాసిడ్, పంచగవ్యలను వారానికోసారి పిచికారీ చేస్తున్నారు. సస్యరక్షణ కోసం బవేరియా, మెటారైజియం, వర్టిసెల్లంలను పిచికారీ చేస్తున్నారు. ఆకుకూర మొక్కలను పీకి, వేర్లను కత్తిరించి, 200 గ్రా. కట్టలు కట్టి మార్కెట్‌కు తరలిస్తున్నారు. మార్కెట్ అవసరాలను బట్టి ప్రణాళికా బద్ధంగా విత్తుకోవటం వల్ల ఏడాది పొడవునా ఆకుకూరల దిగుబడి వస్తోంది. చ.మీ. విస్తీర్ణంలో కొత్తిమీర, మెంతికూర 900 గ్రాములు.. పాలకూర 1.7 కిలోలు.. మిగతావి 1.2 కిలోల దిగుబడి సాధిస్తున్నామని గొట్టుముక్కల రాము (76598 55588) చెప్పారు. చిల్లుల్లేని ఆకులతో కూడిన నాణ్యమైన ఆర్గానిక్ ఆకుకూరలను ఉత్పత్తి చేస్తుండటం విశేషం. అంతేకాదు, రసాయన అవశేషాల్లేని నాణ్యమైన ఆకుకూరలను వారానికి మూడు రోజులు (కేబీఆర్ పార్క్ వద్ద శనివారం ఉదయం, పబ్లిక్ గార్డెన్లో ఆదివారం ఉదయం, విల్లాల్లో బుధవారం) హైదరాబాద్ నగరంలో నేరుగా ప్రజలకు విక్రయిస్తుండటం విశేషం పండూరు మామిడిపై ప్రత్యేక శ్రద్ధ మేడ్చల్ మండలం పూడూరులో 18 ఎకరాల్లో భూపతిరాజు అజయకుమార్ (9849033414) వైవిధ్య భరితమైన మామిడి తదితర పండ్ల జాతులను, ప్రత్యేకించి పండూరు మామిడి రకాన్ని, సాగు చేస్తున్నారు. టమాటో, వంగ దేశీయ రకాలను సాగు చేస్తూ విత్తనోత్పత్తి చేపడుతున్నారు. గిర్ ఆవుల డెయిరీని నిర్వహిస్తున్నారు. గత ఏడాది పండూరు మామిడి మొక్కలు నాటి మధ్యలో మిరప, కీర, బెండ, నిమ్మ తదితర పంటలను సాగు చేస్తున్నారు. సుబ్రమణ్యం రాజు సూచనల మేరకు వివిధ రకాల ద్రావణాలను పంటలకు నియమబద్ధంగా అందిస్తున్నారు. పండ్ల చెట్లకు సీజన్లో నెలకోసారి, కూరగాయలకు పది రోజులకోసారి పిచికారీ చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. హైదరాబాద్‌లోని కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న జాతీయ పంటల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) తోడ్పాటుతో శతృపురుగుల జీవనియంత్రణ కోసం బ్రాకన్ రకం మిత్ర పురుగులను పొలాల్లో వదులుతూ మంచి ఫలితాలు పొందుతున్నామని సుబ్రమణ్యం రాజు(7659855588) చెప్పారు. భూమిలో పోషకాల లోపం రాకుండా పోషక ద్రావణాలు ఇస్తూ, సస్యరక్షణకు పిచికారీలు చేస్తూ మిత్ర పురుగులను వృద్ధి చేసుకుంటూ ఉంటే ఉద్యాన రైతులు చక్కని దిగుబడులు తీయవచ్చన్నారు. వాతావరణాన్ని బట్టి అనుదినం అప్రమత్తంగా గమనిస్తూ, తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే చాలు.. పూర్తి ఆర్గానిక్ పద్ధతుల్లో ఆరుబయట పొలాల్లోనే కాదు పాలీహౌస్‌లలో కూడా ఏడాది పొడవునా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల దిగుబడులు సాధించవచ్చనటానికి ఈ రైతుల అనుభవాలే నిదర్శనాలు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
సేంద్రియ సాగుకు ‘భరోసా’
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పడంతోపాటు ఆర్బీకేల ద్వారా చైతన్యం చేస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి సేద్యంపై ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న రైతులను కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లుగా ఆర్బీకేల్లో నియమించి శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడంలో ఈ చర్యలు ఎంతో దోహదం చేస్తున్నాయని తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, ప్రతి 2 వేల జనాభాకు ఒక ఆర్బీకేను ఏర్పాటు చేసి రైతన్నలు కోరిన ఏ సేవలనైనా గ్రామంలోనే అందచేస్తున్నట్లు వివరించారు. సహజ, ప్రకృతి వ్యవసాయ విధానాలపై నీతి ఆయోగ్ సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్ సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఇంకా ఆయనేమన్నారంటే.. వన్‌స్టాప్ సెంటర్లుగా ఆర్బీకేలు గ్రామీణ ప్రాంతాల్లో 10,778 ఆర్బీకేలను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ఇన్పుట్స్ కూడా అందిస్తోంది. రైతులకు సాగు విధానాలపై మెరుగైన పరిజ్ఞానాన్ని అందించడంతోపాటు పంట కొనుగోలు కేంద్రాలుగా కూడా వ్యవహరిస్తున్నాయి. వ్యవసాయ కార్యకలాపాలకు వన్‌స్టాప్ సెంటర్లుగా ఆర్బీకేలు నిలుస్తున్నాయి. ఈ–క్రాప్.. పొలంబడులు.. సలహా మండళ్లు ఆర్బీకేలు సాగు చేస్తున్న రైతుల సమాచారాన్ని ఈ–క్రాప్ ద్వారా నమోదు చేసి ప్రభుత్వ పథకాలు, సేవలను అనుసంధానం చేస్తున్నాయి. వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు, డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటలబీమా, సాగుచేస్తున్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటలకు ఎంఎస్పీ ధరలు... ఇవన్నీ సమర్థవంతంగా అమలు చేయడంలో ఈ–క్రాప్ డేటా ఉపయోగపడుతుంది. ఈ–క్రాప్ చేయించుకున్న రైతులకు భౌతికంగా రశీదు ఇవ్వడంతోపాటు డిజిటల్ రశీదులు కూడా ఇస్తున్నాం. సామాజిక తనిఖీ కోసం పేర్లను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నాం. ల్యాబ్‌లతోనూ ఆర్బీకేలు అనుసంధానమయ్యాయి. నిపుణుడైన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ) ప్రతి ఆర్బీకేలో ఉంటారు. వ్యవసాయ క్షేత్రాల్లో వీరు పొలంబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాగు ఖర్చులను తగ్గించడమే కాకుండా పర్యావరణ అనుకూల విధానాలతో మంచి దిగుబడులను సాధించేలా రైతులకు ఈ కార్యక్రమాలు తోడుగా నిలుస్తున్నాయి. బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను కూడా నియమించాం. పంటల ప్రణాళికను సూచించడం, ఆర్బీకేల కార్యక్రమాల పర్యవేక్షణ, సమర్థంగా అమలుకు వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశాం. వ్యవసాయంలో మంచి అనుభవం ఉన్న 80,359 మంది ప్రగతిశీల రైతులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. రైతులు పండించిన పంటలకు ఎంఎస్పీ కన్నా ధర తగ్గితే నేరుగా మార్కెట్లో జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు చెల్లించేలా ఈ నిధిని వినియోగిస్తున్నాం. ఎంఎస్పీ ధర నిర్ణయించని పంటలను సాగు చేస్తున్న రైతులను కూడా ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకుంటున్నాం. హెక్టారులో సగం కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు రాష్ట్రంలో 50 శాతం మంది ఉన్నారు. ఒక హెక్టారు అంతకన్నా తక్కువ భూమి ఉన్న రైతులు 70 శాతం మంది ఉన్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ ద్వారా ఏడాదికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయంగా వీరికి అందిస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 80 శాతం పంటలకు 50 నుంచి 80 శాతం వరకూ పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా ద్వారా అందచేస్తున్నాం. వ్యవసాయానికి ఉచితంగా పగటి పూటే 9 గంటల విద్యుత్తు అందిస్తూ రైతులకు మద్దతుగా నిలిచే కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. -
సేంద్రియ గ్రామాలు
సాక్షి, అమరావతి: సేంద్రియ సాగును రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. సహజ సాగు విధానాలను కేవలం ప్రయోగశాలలు, కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయకుండా రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలన్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికీ అవగాహన పెంపొందించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంపై గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టెయినబుల్ ప్లానెట్ (జీఏఎస్‌పీ) సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో చర్చించారు. వ్యవసాయదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల గురించి తెలియచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ధరల్లో వ్యత్యాసం కనిపించాలి.. సహజ సాగు ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించి ప్రోత్సహించేలా సర్టిఫికేషన్ చేపట్టాలి. సాధారణ సాగు పద్ధతుల ఉత్పత్తులకు, సహజ సాగు ఉత్పత్తుల ధరల మధ్య తేడా స్పష్టంగా కనిపించాలి. రసాయనాలు, కృత్రిమ ఎరువులను వినియోగించి పండించే ఆహార ఉత్పత్తులు కేన్సర్ లాంటి వ్యాధులకు దారి తీస్తున్నాయి. ప్రత్యేకంగా యూనివర్సిటీ సహజసాగు విధానాలు కేవలం ప్రయోగశాలకే పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయిలో అమలు కావాలి. మన దగ్గరున్న ఆర్బీకేలు లాంటి వ్యవస్థలను వినియోగించుకోవడం ద్వారా సహజ సాగు విధానం ద్వారా ఆశించిన మార్పులను సాధించగలుగుతాం. మీ సహకారంతో వ్యవస్ధలో మంచి మార్పులు తేవచ్చు. సహజ సాగులో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్ధాయిలో నిలబెట్టేలా ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. దీనిపై అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. సహజసాగులో గ్రాడ్యుయేషన్ ప్రవేశపెట్టాలని సూచించాం. తద్వారా మెరుగైన శిక్షణ పొందిన విద్యార్ధులు బయటకు వస్తారు. గ్రామాల్లో సరికొత్త వ్యవస్థ.. దేశ చరిత్రలోనే తొలిసారిగా వ్యవసాయ రంగంలో సరికొత్త వ్యవస్ధను తీసుకొచ్చాం. రాష్ట్రంలో దాదాపు 13 వేల పంచాయతీలు ఉండగా 10,777 రైతు భరోసా కేంద్రాలను గ్రామాల్లోనే ఏర్పాటు చేశాం. అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు ఆర్బీకేల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో కియోస్క్‌ను కూడా ఏర్పాటు చేశాం. గ్రామాల్లోనే విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తూ రైతును చేయి పట్టుకుని నడిపించే బాధ్యత తీసుకున్నాం. సకాలంలో అందించడంతోపాటు నకిలీలు, కల్తీలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ఆర్బీకేలు కేంద్రంగా విక్రయాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వమే విత్తనాలు, ఎరువుల నాణ్యతను నిర్ధారించిన తర్వాత రైతులకు అందిస్తున్నాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను దగ్గరుండి చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి పంటనూ, ప్రతి ఎకరాను ఇ–క్రాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసి జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రైతుతో పాటు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేస్తున్నాం. తద్వారా రైతులకు ప్రభుత్వం తరఫున అన్ని రాయితీలు అందేలా చర్యలు తీసుకున్నాం. పంట నష్టపోతే ఈ వివరాల సాయంతో పరిహారాన్ని వేగంగా చెల్లిస్తున్నాం. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా అర్హత కలిగిన ప్రతి రైతుకూ ఇ–క్రాప్ ద్వారా పారదర్శకంగా సాయం అందచేస్తున్నాం. సహజ సాగు కేంద్రాలుగా ఆర్బీకేలు ఆర్బీకేలు భవిష్యత్తులో సహజ సాగుకు కేంద్రాలుగా మారనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 2 వేల మందికి ఒక ఆర్బీకే అందుబాటులో ఉంది. సహజసాగు విధానాలను ప్రోత్సహించేలా వీటిని సాంకేతికంగా పటిష్టం చేస్తాం. సహజ సాగు కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ) ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన ఉపకరణాలను అందుబాటులో ఉంచడం ద్వారా రైతన్నలకు అవగాహన పెరుగుతుంది. వ్యర్థాలపై స్పష్టమైన విధానం.. ఎకో టూరిజం ద్వారా పెద్ద సంఖ్యలో స్ధానిక యవతకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. దీనిపై అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగానికి అనువుగా మార్చి సముద్ర తీరాలను శుభ్రం చేయడం అభినందనీయం. రాష్ట్రంలో ఇప్పటికే ఇలాంటి వ్యర్ధాల సేకరణపై స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తున్నాం. నాన్ బయో డీ గ్రేడబుల్ వ్యర్థాల రీ సైక్లింగ్, పునర్వినియోగానికి సంబంధించి జీఏఎస్‌పీ లాంటి సంస్థల సహకారాన్ని తీసుకుంటాం. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ పీఎస్ ప్రద్యుమ్న, జీఏఎస్‌పీ ఛైర్మన్ ఎరిక్ సోలమ్, జీఏఎస్‌పీ సెక్రటరీ జనరల్ సత్య త్రిపాఠి, పార్లీ ఫర్ ది ఓషన్స్ ఫౌండర్ సైరల్ గట్చ్, ఎకో టూరిజం ఇన్వెస్టర్ అదితి బల్బిర్, ఎస్ 4 కేపిటల్ పీఎల్సీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ పోరన్ మలాని పాల్గొన్నారు. -
20 ఎకరాల్లో ప్రకృతి సేద్యం.. 200కు పైగా కుటుంబాలకు నేరుగా విక్రయిస్తూ..
ఇటు రైతు ఆదాయ భద్రతకు, అటు వినియోగదారుల ఆరోగ్య భద్రతకు దేశీ వంగడాలతో ప్రకృతి సేద్యమే ఆశాదీపమని చాటిచెబుతున్నారు యువ రైతు యనమల జగదీష్‌రెడ్డి. దేశంలో ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి ముఖ్య కారకుడైన సుభాష్ పాలేకర్ బాటలో పయనిస్తున్నారు. రసాయనిక అవశేషాల్లేని అమృతాహార ఉత్పత్తులను హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలోని 200కు పైగా కుటుంబాలకు నేరుగా విక్రయిస్తూ ‘ఫ్యామిలీ ఫార్మర్’గా గుర్తింపు పొందారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం దండువారిపల్లెకు చెందిన జగదీష్‌రెడ్డి వ్యవసాయ కుటుంబంలో పుట్టి పాలిటెక్నిక్ కోర్సును మధ్యలో ఆపేసి వ్యవసాయం బాట పట్టారు. 20 ఎకరాల పొలంలో తొలుత అందరి మాదిరిగానే రసాయనిక వ్యవసాయం చేశారు. ఆశించిన ఫలితం లేక పోగా రసాయనాల వాడకం వల్ల పర్యావరణంతో పాటు ప్రజారోగ్యానికి హాని కలుగుతోందని పాలేకర్ ద్వారా తెలుసుకొని ప్రకృతి సేద్యం చేపట్టారు. వ్యవసాయ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అయిన భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.ఎ.ఆర్.ఐ.) నుంచి మూడేళ్ల వ్యవధిలో రెండు అవార్డులను సొంతం చేసుకున్నారు. 2019లో ఐ.ఎ.ఆర్.ఐ. ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డును అందుకున్నారు. ‘ఐ.ఎ.ఆర్.ఐ. ఫెలో అవార్డు’ను గత నెల 11న పూసాలో జరిగిన కృషి విజ్ఞాన్ మేళాలో అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జగదీష్‌రెడ్డిని అభినందించటం విశేషం. 2012లో తిరుపతి నగరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై పాలేకర్ 5 రోజుల శిక్షణా తరగతుల్లో జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. రసాయనిక వ్యవసాయం రైతులకు ఎన్ని విధాలా నష్టదాయకంగా పరిణమించిందో శాస్త్రీయంగా వివరిస్తూ పాలేకర్ ఇచ్చిన సందేశం ఆయనను ఆకట్టుకుంది. ఆ విధంగా పాలేకర్ స్పూర్తితో జగదీష్‌రెడ్డి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఏడేళ్లుగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. ఎంత ఆరోగ్యదాయక పోషకాలను పండిస్తున్నాం? జగదీష్‌రెడ్డి 13 ఎకరాల్లో మామిడి, 5 రకాల దేశీ వరి, కొద్ది విస్తీర్ణంలో చెరకు, వేరుశనగ, చిరుధాన్యాలు తదితర పంటలు పండిస్తున్నారు. దేశీ వరి రకాల దిగుబడి తక్కువైనప్పటికీ ఆరోగ్య రక్షక పోషకాల గనులైనందున ప్రజలు ఆదరిస్తున్నారని, దిగుబడి ఎంతని కాకుండా ఎంత ఆరోగ్యదాయక పోషకాలను పండిస్తున్నామన్నది అందరూ గ్రహించాలని ఆయన అంటారు. పంటలకు ముందు జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేసి కలియదున్నుతారు. దేశీయ ఆవు పేడ, మూత్రం తదితరాలతో ఘనజీవామృతం, జీవామృతం, బీజామృతం, ఆచ్ఛాదన వంటి ప్రకృతి వ్యవసాయ మౌలిక సూత్రాలను పాటిస్తున్నారు. మామిడి తోటలో చెట్ల మధ్య దుక్కి చేయకుండా సాగు చేస్తుండటం విశేషం. నవార, ఇంద్రాణి, కుజిపటాలియా తదితర దేశీ రకాల ధాన్యాన్ని మర పట్టించి ముడి బియ్యంతోపాటు.. ఈ బియ్యంతోపాటు ఔషధ, సుగంధ ద్రవ్యాలను జోడించి పోషక పొడుల (బూస్టర్ పౌడర్స్)ను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ పొడులతో హెల్త్ డ్రింక్స్ తయారు చేసుకొని తాగుతున్న వారు జీవనశైలి వ్యాధులను జయించడంతో పాటు మందులు వాడాల్సిన అవసరం తగ్గిపోతున్నదని ఆయన తెలిపారు. చెరకుతో బెల్లం తయారు చేసుకుంటారు. చిరుధాన్యాలతో మురుకులు, వేరుశనగలతో బెల్లం ఉండలు, పల్లికారం పొడులతోపాటు గానుగ నూనెలను సైతం ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తాను పండించిన పంటలతో తయారు చేసిన 20 రకాల ఉత్పత్తులను ప్రజలకు నేరుగా విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రాణహిత పేరుతో కంపెనీని ఏర్పాటు చేశానని, అమెజాన్ ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తానన్నారు. ‘పంటల సాగు కోసం రసాయన ఎరువులు, పురుగుల మందులను విచ్చల విడిగా వినియోగిస్తూ భూమిని కలుషితం చేయడం తగదు. రసాయనాల మూలంగా సాగు భూమి సహజత్వాన్ని, జీవాన్ని కోల్పోతోంది. పంటలు సాగు చేసుకుని జీవిస్తూనే.. భూమి సహజత్వాన్ని, సారవంతమైన భూమిని యథాతథంగా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది..’ అంటున్నారు జగదీష్‌రెడ్డి. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ఆవశ్యకత, సాగు పద్ధతులు, దళారులు లేని డైరెక్ట్ మార్కెటింగ్ మెళకువల గురించి వాట్సప్, ఫేస్బుక్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పాలేకర్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యంతో ఆరోగ్యకరమైన పంటలను సాగు చేస్తున్నారని జగదీష్‌రెడ్డి అన్నారు. ప్రకృతి సేద్యంపై సలహాల కోసం తనకు ఫోన్ చేయవచ్చన్నారు. – బాబన్నగారి శివశంకర్, సాక్షి, బంగారుపాళెం, చిత్తూరు జిల్లా ‘ఫ్యామిలీ ఫార్మర్’ అవసరాన్ని గుర్తెరగాలి ప్రకృతి ఆహారానికి రోజురోజుకూ విలువ పెరుగుతోంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు నికరాదాయాన్ని పెంచుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాక, రైతు కుటుంబం – సమాజం ఆరోగ్యదాయకంగా మనుగడ సాగించడానికి, భూమి – పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నది. పోషకాల గనులైన దేశీ వంగడాలతో ప్రకృతి వ్యవసాయం చేయటం ముఖ్యం. తదుపరి తరం ఆరోగ్యంగా ఉండే ఆహారం ప్రాధాన్యాన్ని సమాజంలో అందరూ గ్రహించాలి. ఫ్యామిలీ ఫార్మర్ అవసరాన్ని గుర్తెరగాలి. అప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అవసరం రాకుండా ఉంటుంది. ఆరుగాలం కష్టించి పనిచేసి ప్రకృతి వ్యవసాయం చేసే రైతుతో ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఒక్కరూ నెలకు కనీసం 5 నిమిషాలు మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. – యనమల జగదీష్‌రెడ్డి (94400 44279), ఐఎఆర్ఐ ఇన్నోవేటివ్ ఫార్మర్, ఫెలో అవార్డుల గ్రహీత, దండువారిపల్లె, బంగారుపాళెం మండలం, చిత్తూరు జిల్లా -
పచ్చని కెరీర్: మట్టిలో మాణిక్యాలు
రైతులు తమ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులుగా తయారు చేయడానికి ఇష్టపడని రోజులివి. అలాంటి సమయంలో ఓ ఎనిమిదేళ్ల పాపాయి మిహిక ‘నేను పెద్దయిన తర్వాత మా అమ్మానాన్నల్లాగ రైతునవుతాను’ అని చెబుతోంది. ఆ అమ్మానాన్నలు కూడా రైతు కుటుంబంలో పుట్టిన వాళ్లు కాదు. అమ్మ ప్రతీక్ష ఒక ఐఏఎస్ అధికారి కూతురు. తండ్రి ప్రతీక్ శర్మ. ఇద్దరూ బ్యాంకు ఆఫీసర్లుగా కెరీర్ ప్రారంభించారు. పట్టణాలు, నగరాల్లో నివసించే చాలామందిలో ఉన్నట్లే మరి ఏ ఇతర నైపుణ్యం లేని వాళ్లే వ్యవసాయం చేస్తారని, అది చదువుకున్న వాళ్లు చేసే పని కాదనే అభిప్రాయమే ప్రతీక్షలో కూడా ఉండేది. అలాంటి ప్రతీక్ష తాను తల్లయ్యే సమయంలో ‘మనం ఏం తినాలి? ఏం తింటున్నాం’ అని ఆలోచనలో పడింది. పాశ్చాత్యదేశాల సూచనలతో వాళ్లు తయారు చేసిన క్రిమిసంహారక మందులకు మన వ్యవసాయ క్షేత్రాలు బలవుతున్నాయని గ్రహించి తీవ్రమైన మానసిక వేదనకు గురైంది. అయితే అన్నింటినీ తెలుసుకుని నిస్సహాయంగా ఊరుకోలేదామె. ‘పాశ్చాత్యదేశాల సూచనలు కాదు మనం అనుసరించాల్సింది, ఆ దేశాలు వ్యవసాయంలో పాటిస్తున్న పద్ధతులను అనుసరించాలి’ అనే అవగాహనకు వచ్చారు భార్యాభర్తలిద్దరూ. ఆ ప్రయోగం ఇప్పుడు ‘గ్రీన్ అండ్ గ్రైన్స్’ పేరుతో ప్రయోగాత్మక వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు. ప్రతీక్ తండ్రి ప్రవీణ్ శర్మది మధ్యప్రదేశ్, హోషంగా జిల్లా, దోలారియా గ్రామం. ఆయన ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. విదేశీ సాహిత్యాన్ని ఇష్టపడేవారు. ఆ కలెక్షన్లో భాగంగా ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించిన పుస్తకాలు కూడా వచ్చి చేరాయి. అలాగే వ్యవసాయరంగంలో ఉపయోగించే అధునాతన యంత్రపరికరాలను రైతులకు పరిచయం చేసే బాధ్యతను కూడా చేపట్టారాయన. 2003లో తండ్రి పోయే నాటికి ప్రతీక్ బ్యాంకు ఉద్యోగంలో ఉన్నాడు. ‘‘నాన్నతోపాటే ఆయన ఆశయాన్ని పూడ్చిపెట్టడం నాకిష్టం లేకపోయింది. అందుకే అప్పటి వరకు నాన్న ఏం చేశాడనే వివరాల్లోకి వెళ్లాను’ అంటాడతడు. ప్రతీక్ష గర్భం దాల్చినప్పటి నుంచి వాళ్ల ఆలోచన ‘మనం ఏం తినాలి? ఏం తింటున్నాం? పుట్టబోయే పాపాయికి ఏం తినిపిస్తాం’ అని కొత్త మార్గంలో సాగింది. దాంతో ఉద్యోగాన్ని సొంత గ్రామానికి దగ్గరలోని భోపాల్‌కు బదిలీ చేయించుకున్నారు. వారాంతంలో వ్యవసాయం మొదలుపెట్టాడు ప్రతీక్. పొరపాట్లన్నీ పాఠాలే! ప్రతీక్ సేద్యం తొలి ఏడాది కుప్పకూలిందనే చెప్పాలి. తాను అవలంబించాలనుకున్న కొత్త పద్ధతిని పొలంలో పని చేసే వాళ్లకు అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి. తనకు చేతకానిది కూడా అదే. దాంతో మొదట స్థానిక భాష మీద పట్టు తెచ్చుకున్నాడు. సాగులో దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకున్నాడు. పంట నేల, మట్టి, రైతు వేటికవే భిన్నమైనవి. ఆ మూడింటి సమష్టి కృషి ఏ రెండు చోట్ల ఒకలా ఉండవని గ్రహించాడు. తనదైన ప్రత్యేకమైశైలిని అలవరుచుకున్నాడు. అలాగే విత్తనాలు, ఎరువుల, పురుగుమందుల ఖర్చు మితిమీరి పోకుండా జాగ్రత్తపడాలని కూడా తెలిసివచ్చింది. అలాగే తన ఉత్పత్తిని మార్కెట్ చేయడం తన చేతుల్లో లేదనే మరో వాస్తవం కూడా. 2016లో ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిస్థాయిలో రైతుగా మారిపోయాడు. అప్పుడు ‘ఫార్మ్ టూ ఫోర్క్’ పేరుతో కొత్త మార్కెటింగ్ విధానాన్ని మొదలుపెట్టాడు. మధ్యవర్తుల అవసరం లేకుండా రైతుల నుంచి నేరుగా వినియోగదారులను అనుసంధానం చేశాడు. నగరాల్లోని అవుట్లెట్లకు నేరుగా రైతులే తమ ఉత్పత్తులను చేరవేసేటట్లు నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. పంటకు అవసరమైన డబ్బు కోసం దళారీలు, వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదిప్పుడు. అలాగే పంటను దళారులు కొని పంట కోసం తీసుకున్న డబ్బు, దాని వడ్డీని జమ చేసుకుని మిగిలిన డబ్బు రైతు చేతిలో పెట్టే దుస్థితి లేదు. ప్రతీక్ష, ప్రతీక్ దంపతుల ప్రయోగంతో ఇప్పుడు ఫార్మ్ టూ ఫోర్క్ గొడుగు కింద రెండు వేల మంది రైతులున్నారు. అయితే ఇది అంత సులువుగా ఏమీ జరగలేదు. బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు ఇప్పించడంలో వీళ్లే ముందు నిలిచారు. మట్టిసారాన్ని పరిరక్షించుకోవడమెలాగో రైతులకు నేర్పించారు. ఇలా ఏడేళ్లుగా అకుంఠిత దీక్షతో శ్రమించి ఈ విజయాన్ని సాధించారు ఈ దంపతులు. బ్యాంకు సేవలు సరైన విధంగా అందుబాటులో లేకపోవడం వల్లనే రైతు దళారుల మీద ఆధారపడాల్సి వస్తోంది. బ్యాంకు సేవలను సకాలంలో అందేటట్లు చేయగలగడంతో దళారీ వ్యవస్థ కబంద హస్తాల నుంచి రైతులను, పంటలను కాపాడడం సాధ్యమైందంటారు ఈ దంపతులు. -
సేంద్రియ సాగు.. లాభాలు బాగు
పెరవలి: పంటసాగులో రసాయన ఎరువుల వినియోగం పెరగడంతో పంట భూములు చౌడుబారి పోతున్నాయి. దీంతో పెట్టుబడి ఎక్కువ రాబడి తక్కువ అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే రైతులు సేంద్రీయ సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. అందుబాటులో ఉన్న వనరుల్ని ఉపయోగించుకుని సేంద్రీయ సాగుతో లాభాలు ఆర్జిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం రైతులు సేంద్రియ సాగు చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. వరిలో 50 బస్తాల వరకూ దిగుబడి పెరవలి మండలంలో సేంద్రీయ పద్ధతిలో వాణిజ్య పంటలైన బొప్పాయి, అరటి, జామ పంటలతో పాటు కూరగాయల పంటలైన వంగ, బెండ, దొండ, చిక్కుడు, పొట్ల, బీర, కాకర పాదులు పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా వరిసాగు చేసి భళా అనిపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎకరానికి 40 నుంచి 50 బస్తాల దిగుబడులు సాధించి లాభాలు ఆర్జిస్తున్నారు. మండలంలో సేంద్రీయ పద్దతిలో అన్నవరప్పాడు, మల్లేశ్వరం, ఖండవల్లి, ముక్కామల, తీపర్రు, కాకరపర్రు గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలో సాగు చేపట్టాలని వ్యవసాయాధికారులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు రైతులతో అవగాహన సదస్సులు పెట్టి ప్రోత్సహిస్తున్నారు. దీంతో రైతులు ముందుకు వచ్చి సాగు చేపట్టారు. సేంద్రీయ సాగుతో లాభాలు రసాయన ఎరువుల వినియోగం అధికంగా వాడడం వల్ల భూములు చౌడు బారిపోతున్నాయి. అంతేకాకుండా పచ్చిరొట్ట పైర్ల సాగు పట్ల నిర్లక్ష్యం వహించడంతో నేడు ఈ పరిస్థితి ఏర్పడింది. సేంద్రీయ వ్యవసాయంలో పశువుల ఎరువు, పచ్చిరొట్ట పైర్ల సాగు వంటివి ప్రధాన భూమిక వహిస్తాయి. అందుకు జనుము, జీలుగ, పిల్లిపిసర వంటి పంటలను వేస్తే భూమికి ఎకరానికి రెండు టన్నుల ఎరువు అందుతుందని ఇది మంచి ఫలితం ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన పంటకు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. కేవలం కషాయాలు, పశువుల ఎరువుతో ఈ సాగు చేయవచ్చని తద్వారా భూసారం పెరిగి తెగుళ్ళ వ్యాప్తి తగ్గుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తెగుళ్ల నివారణ ఇలా పంటలపై వచ్చే తెగుళ్ళ నివారణకు రకరకాల కషాయాలు తయారుచేసి పంటలపై పిచికారీ చేస్తే తెగుళ్ళు దరిచేరవు. ముఖ్యంగా బ్రహ్మాస్త్రం, అగ్నిఅస్త్రం, నీమాస్త్రం, బీజామృతం, ఘన జీవామృతం, ద్రవజీవామృతం, పంచగవ్య వంటి వాటిని తయారుచేసి తెగుళ్ళను నివారిస్తున్నామని రైతులు, అధికారులు చెబుతున్నారు. ఎకరానికి రూ. 50 వేల లాభం అరటి సాగు చేపట్టి రెండేళ్లైంది. గత ఏడాది ఎకరం చేలో లాభం రూ.50 వేలు వచ్చింది. పెట్టుబడి తక్కువ నాణ్యమైన దిగుబడి రావటంతో ఈ పంటకు మార్కెట్టులో మంచి ధర లబించింది. దీంతో ప్రస్తుతం అరటితో పాటు వరి సాగు చేస్తున్నాను. రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం మానేసి తెగుళ్ళ నివారణకు కేవలం కషాయాలు వాడుతున్నాం. – ఈ.కన్నయ్య, రైతు, ఖండవల్లి కూరగాయలతో మంచి లాభాలు సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేశాను. గత ఏడాది అర ఎకరం వేస్తే మంచి ఆదాయం వచ్చింది. దీంతో ఇప్పుడు మూడు ఎకరాల్లో అన్నిరకాల కూరగాయలు పండిస్తున్నాను. పెట్టుబడి తక్కువ.. అంతే కాకుండా భూసారం మెరుగుపడి మంచి దిగుబడులు వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయమే మేలు. –కె శ్రీరామమూర్తి రైతు, ఖండవల్లి రైతుల్ని ఒప్పించడానికి కష్టపడ్డాం సేంద్రీయ సాగు పెంచాలనే ఉద్దేశ్యంతో రైతులతో ముఖాముఖి చర్చలు జరిపి వారిని పోత్సహించాం. మొదట ఈ సాగు చేయడానికి రైతులను ఒప్పించడానికి చాల ఇబ్బందులు పడ్డాం. నేడు జిల్లాలో 25,300 మంది రైతులు, 35,340 ఎకరాల్లో సాగు చేసేందుకు మార్గం ఏర్పడింది. ఒక్క పెరవలి మండలంలో 1500 ఎకరాల్లో వివిధ పంటలు వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల పంటలు ఉత్పత్తి చేయటం వలన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పర్యటనకు వచ్చి పంటలను స్వయంగా పరిశీలించారు. –తాతారావు, సేంద్రీయ సాగు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ -
తన నివాసంలో కూరగాయలు సాగు చేస్తున్నపుష్ప శ్రీవాణి
-
పట్టభద్రుడి ప్రకృతి సేద్యం..
పంటల్లో క్రిమి సంహారక మందుల ప్రభావం రోజురోజుకీ అధికమవుతోంది. ఆహార పదార్థాల్లో విష పదార్థాలూ పెరిగిపోతున్నాయి. దీంతో ఆధునిక రైతులు.. రసాయన సేద్యానికి స్వస్తి పలికి.. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రకృతి విపత్తుల్లోనూ అందరికన్నా మిన్నగా వ్యవసాయంలో రాణిస్తున్నారు. ఆశావహమైన, ఆరోగ్యదాయకమైన దిగుబడులు సాధిస్తూ లాభాల బాట పడుతున్నారు. అందుకు సాక్ష్యమే ఈ యువ రైతు. ఇతనిది గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం. 37 ఏళ్ల ఈ రైతు పేరు కంగోను బాల శశికాంత్. బీఏ చదివారు. పుడమి ఆరోగ్యంగా ఉండాలి.. మనం పండించే పంట ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఆలోచనతో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ లాభాల బాట పడుతున్నాడు. తామర పురుగును తట్టుకొని.. ఈ ఏడాది మిర్చి రైతులను నల్ల తామర పురుగు ఆగమాగం చేసింది. పురుగు తాకిడికి మిర్చి సాగు చేసిన వారిలో అత్యధిక శాతం మంది రైతులు పంటను పీకేసి ఇతర పంటలు వేసుకున్నారు. మిర్చి పంటను కొనసాగించి అనేక రకాల రసాయన క్రిమిసంహారక మందులు పిచికారీ చేసిన రైతులు మాత్రం ఎకరాకు క్వింటా నుండి మూడు క్వింటాళ్ల వరకు దిగుబడులతో సరిపెట్టుకోవలసి వచ్చింది. శాస్త్రవేత్తలకు కూడా పూర్తిస్థాయిలో అంతుచిక్కని ఈ పురుగుతో యావత్ మిర్చి రైతాంగం తీవ్ర నష్టాలను చవిచూసింది. ఈ రైతు మాత్రం ప్రకృతి వ్యవసాయంతో పురుగు తీవ్రతను నియంత్రించగలిగారు. సీవీఆర్ పద్ధతిలో పురుగు కట్టడి.. ఈ ఏడాది ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని 80 సెంట్లు భూమిలో బ్యాడిగీ 355 రకం, 20 సెంట్లులో నవ్య రకం మిర్చిని శశికాంత్ సాగు చేశారు. ఇతని పంటనూ తామర పురుగు ఆశించింది. సీవీఆర్ పద్ధతిని అనుసరించి మట్టి ద్రావణం పిచికారీతో పురుగు తీవ్రతను కట్టడి చేయగలిగారు. పంటపై పురుగు ప్రభావం తగ్గింది. సాధారణంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా మిర్చి దిగుబడులు ఎకరాకు 20–25 క్వింటాళ్ల వరకూ వస్తుంది. అయితే నల్ల తామరపురుగు తాకిడికి ఈ రైతు పొలంలోనూ దిగుబడి సగానికి తగ్గింది. ఎకరాకు 11 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎకరాకు కౌలు రూ. 60 వేలు, ఇతరత్రా మరో రూ. 60 వేల చొప్పున రూ. 1.20 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. దోమ, పురుగు నుంచి పంటకు రక్షణ చేకూర్చేందుకు పసుపు జిగురు అట్టలు, అక్కడక్కడా బంతిపూల మొక్కలు, టొమాటో మొక్కలు, నువ్వులు, ఆవాల మొక్కలతో పాటు గట్ల వెంబడి ఎత్తుగా పెరిగే మొక్కలను సాగు చేశారు. ధర ఆశాజనకం.. కేవలం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన మిరపకాయలకు బహిరంగ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మార్కెట్లో రసాయనాలతో పండించిన మిర్చి క్వింటా సుమారు రూ. 19 వేలు ఉంటే, ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేసిన ఈ రకం ధర రూ. 30 వేల నుంచి 40 వేల వరకు పలుకుతోంది. శశికాంత్ పండించిన మిరపకాయలు చూడటానికి వంకర్లుగా. ముడతలుగా కనిపించినప్పటికీ, ఈ రకం గురించి తెలిసిన వాళ్లు మాత్రం వదిలిపెట్టరు. ఈ మిరప కాయను ఎక్కువగా పచ్చళ్లకు, రంగుల తయారీకి వినియోగిస్తారు. – జి. వికర్తన్ రెడ్డి, సాక్షి, ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు మన నేలలో మనం పోషక విలువలతో పండించిన పంటను విదేశీయుల కన్నా.. మనవారికే ఎక్కువగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో స్వంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నాను. వెబ్సైట్లు, వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటున్నాను. హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ వంటి నగరాలలోని వారు కేజీ రూ. 500 చొప్పున నేరుగా కొంటున్నారు. పంట పండించటంలో కన్నా అమ్ముకోవడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నది. – కె. బాల శశికాంత్ (97030 74787), ముట్లూరు, వట్టిచెరుకూరు మం., గుంటూరు జిల్లా వేసవిలో కూరగాయల సాగుపై శిక్షణ సేంద్రియ విధానంలో వేసవిలో కూరగాయల సాగుపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతి పేట దగ్గర గల నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో ఫిబ్రవరి 6 (ఆదివారం)న రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు డా. యాదగిరి, చౌటుప్పల్ మహిళా రైతు రజితారెడ్డి, కీసర రైతు రమేష్ శిక్షణ ఇస్తారు. వంగ, బెండ, టొమాటో, గోరుచిక్కుడు, బీర, కాకర, సొర, తోటకూర, పాలకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీర సాగు పద్ధతులు, కషాయాలు, ద్రావణాల తయారీ తదితర విషయాలపై శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల రైతులు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి.. 98493 12629, 70939 73999. -
టీచరమ్మ స్కూలు సేద్యం.. ‘థ్యాంక్స్ టు కోవిడ్’
పిల్లలకు పాఠాలు చెప్తే వాళ్లు భవిష్యత్ ఫలాలు ఇస్తారు. కాని ఖాళీగా ఉన్న స్థలంలో పంటలు వేస్తే ఇప్పుడే వారు ఆరోగ్యంగా తిని ఎదుగుతారు. బెంగళూరులోని ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌కి ఆ ఆలోచనే వచ్చింది. వెంటనే ఆ బడి ఆవరణంతా సేంద్రియ సేద్యం మొదలెట్టింది. ఇంకేముంది... రోజుకు కిలోల కొద్ది పండ్లో, కాయలో, కూరలో దిగుబడికి వస్తున్నాయి. నేలకు పాఠం చెప్తే అది తెచ్చుకున్న ఆకుపచ్చటి మార్కులు ఇవి. స్కూల్లో తోట పెంచితే రెండు రకాల సీతాకోక చిలుకలు కనిపిస్తాయి. ఒక రకం యూనిఫామ్ వేసుకున్నవి. ఒక రకం రంగు రంగుల రెక్కలల్లారుస్తూ మొక్కలపై వాలేవి. పిల్లలకు ఏ మంచి చూపినా ఇష్టమే. వారు ఆడమంటే ఆడతారు. పాడమంటే పాడతారు. మొక్కలు పెంచమంటే పెంచుతారు. క్లాసుల్లో వేసి సిలబస్‌లు రుబ్బడమే చదువుగా మారాక పిల్లలకు బెండకాయ చెట్టు, వంకాయ మొలకా కూడా తెలియకుండా పోతున్నాయి. ‘థ్యాంక్స్ టు కోవిడ్’ అంటారు సుశీలా సంతోష్. ఆమె బెంగళూరులోని ఎలహంకలో ఉన్న విశ్వ విద్యాపీఠ్ స్కూల్‌కు డైరెక్టర్. ఆ స్కూల్‌కు మరో రెండు క్యాంపస్‌లు ఉన్నా ఎలహంక బాధ్యతలు చూస్తున్న సుశీలా సంతోష్ చేసిన పని ఇప్పుడు తీగలు, పాదులుగా మారి స్కూల్‌ను కళకళలాడిస్తూ ఉంది. ‘2021 మార్చి ఏప్రిల్ నుంచి లాక్డౌన్ మొదలయ్యింది. 1400 మంది పిల్లలు చదివే క్యాంపస్ మాది. మధ్యాహ్నం భోజనాలు మా స్కూల్లోనే చేస్తారు. కనుక స్టాఫ్ ఎక్కువ. కాని లాక్డౌన్ వల్ల బస్ డ్రైవర్లు, ఆయాలు, వంట మాస్టర్లు, అడెండర్లు అందరూ పనిలేని వారయ్యారు. వారంత చుట్టుపక్కల పల్లెల వారు. పని పోతుందేమోనని భయపడ్డారు. కాని వారిని మేము తీసేయ దలుచుకోలేదు. అలాగని ఖాళీగా పెడితే వారికి కూడా తోచదు. అలా వచ్చిన ఆలోచనే ఆర్గానిక్ ఫార్మింగ్. స్కూలు తోట. పదండి... ఏదైనా పండిద్దాం అన్నాను వారితో. అప్పుడు చూడాలి వారి ముఖం’ అంటుంది సుశీలా సంతోష్. స్కూలులో ప్రెయర్ గ్రౌండ్ తప్ప మిగిలిన ఏ ప్రదేశమైనా పంట యోగ్యం చేయాలని వారు నిశ్చయించుకున్నారు. ‘ఇంతకు ముందు వీరిలో కొందరికి సేద్యం తెలుసు కనుక మా పని సులువయ్యింది’ అంటారు సుశీల. ఆమె సారధ్యంలో స్కూల్ పెరడు, బిల్డింగుల మధ్య ఉన్న ఖాళీ స్థలం, కాంపౌండ్ వాల్స్‌కు ఆనుకుని ఉండే నేల... ఇంకా ఎక్కడెక్కడ ఏ స్థలం ఉన్నా అదంతా కాయగూరలు, పండ్ల మొక్కలు, ఇవి కాకుండా 40 రకాల హెర్బల్ ప్లాంట్లు వేసి వాటి బాగోగులు చూడటం మొదలెట్టారు. ‘మాకు చాలా పెద్ద కిచెన్ ఉంది. దాని టెర్రస్‌ను కూడా తోటగా మార్చాం’ అన్నారు సుశీల. స్కూలులోపల ఉన్న నీటి వ్యవస్థనే కాక వంట గదిలో వాడగా పారేసే నీటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ (ఆ నీరు అరటికి చాలా ఉపయోగం) 200 అరటి చెట్లు పెంచడం మొదలెట్టారు. ఇవి కాకుండా ఆకు కూరలు, కాయగూరలు, క్యారెట్, క్యాబేజీ వంటివి కూడా పండించ సాగారు. ‘మూడు నెలల్లోనే ఏదో ఒక కాయగూర కనిపించడం మొదలెట్టింది. స్టాఫ్ మధ్యాహ్న భోజనానికి వాడగా మిగిలినవి చుట్టుపక్కల వారికి పంచడం మొదలెట్టాం. మరి కొన్నాళ్లకు మేమే వాటితో వండిన భోజనాన్ని కోవిడ్ పేషెంట్స్‌కు సాధారణ రేట్లకు అమ్మాం. ఆరోగ్యకరమైన భోజనం తక్కువ ధరకు కాబట్టి సంతోషంగా తీసుకున్నారు. మా స్టాఫ్‌కు ఇదంతా మంచి యాక్టివిటీని ఇచ్చింది’ అంటారు సుశీల. ఈ సంవత్సర కాలంలో స్కూలు ఆవరణలో సీజనల్ పండ్లు, కాయగూరలు స్కూల్ స్టాఫ్ తమ అనుభవం కొద్దీ పండిస్తూ స్కూలు ఆవరణను ఒక పంట పొలంలా మార్చారు. ‘ఇప్పుడు స్కూల్‌కు వచ్చిన పిల్లలు ఇదంతా చూసి సంబరపడుతున్నారు. వారిని మేము ఈ సేద్యంలో ఇన్వాల్వ్ చేయదలిచాం. స్కూల్ కొరికులం కూడా ఆ మేరకు మార్చాం. పిల్లలకు పంటల గురించి తెలియాలి. తమ తిండిని తాము పండించుకోవడమే కాదు నలుగురి కోసం పండించడం కూడా వారికి రావాలి. మార్కెట్లోని తట్టలో కాకుండా కళ్లెదురుగా ఉంటే మొక్కకి టొమాటోనో, తీగకి కాకరో వేళ్లాడుతూ కనిపిస్తే వాళ్లు పొందే ఆనందం వేరు’ అంటారు సుశీల. మన దగ్గర కూడా చాలా స్కూళ్లల్లో ఎంతో ఖాళీ స్థలం ఉంటుంది. ‘స్కూలు సేద్యం’ కొంత మంది టీచర్లు ప్రోత్సహిస్తుంటారు. కాని ప్రతి స్కూల్లో సుశీల లాంటి మోటివేటర్లు ఉంటే సిబ్బంది పూనుకుంటే ప్రతి స్కూలు ఒక సేంద్రియ పంటపొలం అవుతుంది. మధ్యాహ్న భోజనం మరింత రుచికరం అవుతుంది. ఇలాంటి స్కూళ్లను గ్రీన్ స్కూల్స్ అనొచ్చేమో. -
సేంద్రియ విధానం... కొత్త పురుగు.. పరుగో పరుగు
పిఠాపురం: ‘త్రిప్స్ పార్విస్పైనస్’.. ఇండోనేషియా నుంచి వచ్చిన కొత్త రకం తామర పురుగు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో విధ్వంసం సృష్టిస్తోంది. రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మిరప, మామిడి, చింత, పత్తి, మునగ, దోస, సొర, క్యాప్సికమ్, బంతి, చామంతి వంటి ఉద్యాన పంటలను చిదిమేస్తోంది. ఈ పురుగు ఉధృతిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగి అధ్యయనం చేపట్టాయి. కాగా, ఈ కొత్త పురుగును తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రైతులు సేంద్రియ విధానాలతో కట్టడి చేస్తున్నారు. గ్రామంలో 650 ఎకరాల్లో మిరప సాగు చేయగా.. సేంద్రియ పద్ధతులు పాటించిన 80 ఎకరాల్లో మిరప చేను కొత్త పురుగును తట్టుకుని నిలబడింది. దీంతో మిగిలిన రైతులు కూడా సేంద్రియ మందుల వాడకం ప్రారంభించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. కుళ్లిన ఉల్లితో కషాయం దుర్గాడ గ్రామంలో కొంత విస్తీర్ణంలో ఉల్లి కూడా పండిస్తుంటారు. ఉల్లి కుళ్లి పోతే పనికి రాదని పారేసేవారు. ఇప్పుడు ఆ కుళ్లిన ఉల్లి మరో పంటకు ప్రాణం పోస్తోంది. కుళ్లిన ఉల్లితో రైతులు కషాయం తయారు చేస్తున్నారు. 70 కేజీల ఉల్లి, 20 కేజీల వేపాకు, 20 కేజీల సీతాఫలం ఆకు, 70 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రం, 5 కేజీల ఉమ్మెత్త ఆకు, 4 లీటర్ల నీరు కలిపి 4 గంటలు ఉడకబెట్టి జీవామృతం తయారు చేస్తున్నారు. దీనినుంచి సుమారు 100 నుంచి 110 లీటర్ల జీవామృతం తయారవుతుండగా.. ఎకరానికి 6 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటితో కలిపి మిరప పంటపై పిచికారీ చేస్తుంటే కొత్త పురుగుతోపాటు ఇతర పురుగులు సైతం చనిపోతున్నట్టు రైతులు చెబుతున్నారు. దీనిని వారానికి ఒకసారి చొప్పున మూడు వారాలపాటు పంటకు పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల కొత్త తామర పురుగు పూర్తిగా పోతోందని, దెబ్బతిన్న పంట కూడా తిరిగి ఊపిరి పోసుకుంటోందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. నాలుగో వారంలో పులియబెట్టిన మజ్జిగ పిచికారీ చేస్తున్నామని, దీనివల్ల పంటకు చల్లదనం వస్తుందని చెబుతున్నారు. దేశవాళీ ఆవు పాలతో తయారైన మజ్జిగ మాత్రమే ఇందుకు ఉపయోగపడుతుందంటున్నారు. కాగా, ఉల్లి కషాయాన్ని పొరుగు రైతులకు లీటరు రూ.30 చొప్పున అమ్ముతున్నారు. కుళ్లిన చేపలతో మీనామృతం మరోవైపు ఇతర చీడపీడల నుంచి రక్షించుకునేందుకు మీనామృతాన్ని ఇక్కడి రైతులు వినియోగిస్తున్నారు. పిండినల్లి, పూత రాలడం వంటి సమస్యకు కుళ్లిన చేపలతో మీనామృతం తయారు చేస్తున్నారు. 70 కేజీల కుళ్లిన చేపలు, 70 కేజీల పాత బెల్లం, 70 లీటర్ల నీరు కలిపి 21 రోజులు ఊరబెడుతున్నారు. ఊరిన తరువాత 10 లీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల మీనామృతం చొప్పున కలిపి పిచికారీ చేస్తున్నారు. మీనామృతంను లీటరు రూ.100కు విక్రయిస్తున్నారు. అల్లం, వెల్లుల్లితో అగ్ని అస్త్రం మరోవైపు రసం తొలిచే పురుగు, గొంగళి పురుగు, కాయ తొలిచే పురుగుల నుంచి కాపాడుకునేందుకు అల్లం, వెల్లుల్లి కషాయాన్ని వినియోగిస్తున్నారు. కేజీ అల్లం, 500 గ్రాముల వెల్లుల్లి, కేజీ పొగాకు, 2 కేజీల వేపాకులను 48 గంటలపాటు నీటిలో నానబెట్టి దానిని మిర్చి పంటలపై పిచికారీ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నట్టు ఇక్కడి రైతులు చెబుతున్నారు. పరిశీలిస్తున్నాం కొత్త పురుగు ఉధృతి ఇటీవల బాగా పెరిగింది. దీనిపై ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. సేంద్రియ మందులతో కొత్త పురుగు ఉధృతి తగ్గినట్టు కనిపిస్తోంది. దుర్గాడలో రైతులు పాటిస్తున్న సేంద్రియ విధానాలపై ఉద్యాన శాస్త్రవేత్తలకు సమాచారం ఇచ్చాం. వారు వచ్చి నిర్ధారిస్తే సేంద్రియ మందుల తయారీ మరింత పెరిగే అవకాశం ఉంది. – శైలజ, ఉద్యాన అధికారి, పిఠాపురం కొత్త పురుగును తరిమికొడుతున్నారు స్థానిక రైతులు సేంద్రియ పద్ధతులతో కొత్త పురుగును తరిమికొడుతున్నారు. రసాయనక ఎరువులు, మందుల కంటే ఇవి బాగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉల్లి కషాయం వాడిన పొలాల్లో మిరప పంట కొత్త పురుగును తట్టుకుని నిలబడింది. అలా వాడిన పొలాల్లో పంట మళ్లీ పుంజుకుంటోంది. – అనంతకుమార్, డిజిటల్ మాస్టర్ ట్రైనర్, ప్రకృతి వ్యవసాయం పరిశీలించి నిర్ధారిస్తాం సేంద్రియ మందుల వినియోగం వల్ల కొత్త పురుగు తగ్గుతున్నట్లు చెబుతున్నారు. అయితే వాటిని పరిశీలించి ఎంతవరకు తగ్గుతుంది, ఎలా పని చేస్తుందనేది నిర్ధారించాల్సి ఉంది. త్వరలో తూర్పు గోదావరి జిల్లా పర్యటించి పంటలను పరిశీలించి నిర్ధారిస్తాం. – శిరీష, ఉద్యాన శాస్త్రవేత్త, గుంటూరు ఉల్లి కషాయం కొత్త పురుగును కట్టడి చేస్తోంది కుళ్లిన ఉల్లి, వేపాకులతో తయారు చేస్తున్న కషాయం కొత్త పురుగును బాగా కట్టడి చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఇప్పటివరకు సుమారు 80 ఎకరాల్లో మిర్చి పంటలు కొత్త పురుగును తట్టుకుని నిలబడ్డాయి. దీంతో మిగిలిన రైతులు సేంద్రియ మందులు వాడటం ప్రారంభించారు. సొంతంగా దేశవాళీ ఆవులను పెంచుతూ బారీగా ఉల్లి కషాయం, మీనామృతం, అగ్ని అస్త్రం వంటి మందులు తయారు చేసి స్థానిక రైతులకు అందుబాటులోకి తెస్తున్నాము. దీనివల్ల మా ఏరియాలో కొత్త పురుగు ఉధృతి చాలా వరకు నియంత్రించబడింది. – గుండ్ర శివచక్రం, రైతు, దుర్గాడ -
అలా పరిమితం కావడం సరికాదు!
కేంద్ర ప్రభుత్వం రసాయనిక వ్యవసాయం నుంచి, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టడం ఆహ్వానించదగిన పరిణామం. ఇది మాత్రమే చాలదు. కేవలం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జడ్.బి.ఎన్.ఎఫ్.) ఒక్కదాని పైనే దృష్టి కేంద్రీక రించడంలో అర్థం లేదు. ప్రకృతి వ్యవసాయం అనేది జపాన్‌కు చెందిన డా. మసనోబు ఫుకుఓకా వాడుకలోకి తెచ్చిన విషయం. దీనితోపాటు ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం, బయోడైనమిక్ వ్యవసాయం వంటి అనేక రసాయనికేతర వ్యవసాయ పద్ధతులు అమల్లో ఉన్నాయి. మొత్తంగా కలిపి సమగ్ర సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మరింత మేలు జరుగుతుంది. కేవలం దేశీ ఆవులు, కేవలం జీవామృతం చాలు అనలేం. మన దేశంలో 85% భూముల్లో వర్షాధారంగానే వ్యవసాయం జరుగుతోంది. రైతుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. అనంతపురం వంటి కరువు పీడిత జిల్లాలో మేం దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. మెట్ట భూములు జీవాన్ని కోల్పోయాయి. మట్టిని సారవంతం చేసుకుంటేనే ఈ భూముల్లో వ్యవసాయాన్ని చేపట్టగలం. భూసారం, నీటి పారుదల బాగా ఉండే ప్రాంతాల్లో జీవామృతం సరిపోవచ్చు. కానీ మెట్ట ప్రాంతాల్లో విధిగా కంపోస్టు తయారు చేసుకోవాలి. అంటే రైతుకు పశువులు కావాలి. దేశీ ఆవు మంచిదే. 2 వేల దేశీ ఆవులు రైతులకు పంచాం. అయితే, ఇతర ఆవులైతే పాలు ఎక్కువ ఇస్తాయి కాబట్టి రైతుకు ఆసరాగా కూడా ఉంటుంది. పాలు తక్కువ ఇచ్చే ఆవులను చిన్న రైతు పెంచుకోవటం భారమే. వారికి ప్రభుత్వం అండగా ఉండాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం మంచిదే. అయితే, జడ్.బి.ఎన్.ఎఫ్.కు మాత్రమే పరిమితం కావటం అరకొర ప్రయత్నమే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేచర్ బేస్డ్ వ్యవసాయ పద్ధతుల్లో ఉన్న అనుభవాలను సైతం ఇముడ్చుకునే విధంగా ప్రభుత్వ విధానం సమగ్రంగా ఉంటే బాగుంటుంది. (చదవండి: ప్రకృతి సేద్యమే వెలుగు బాట) - సి.కె. గంగూలి (బబ్లూ) సహ వ్యవస్థాపకులు, టింబక్టు కలెక్టివ్, చెన్నేకొత్తపల్లి -
ప్రకృతి సేద్యమే వెలుగు బాట
ప్రకృతి వ్యవసాయ బాటన నడుస్తున్న రైతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వమూ ఈ బాటకు వచ్చింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ రంగంలోకి వచ్చాక ప్రకృతి వ్యవసాయ విస్తరణకు కొత్త ఊపు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ఆదేశాలతో, ఇన్నాళ్లూ రసాయనిక సేద్యంపైనే దృష్టి పెట్టిన భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థలన్నీ.. ఇప్పుడు ప్రకృతి సేద్యాన్ని చేపడుతున్నాయి. వ్యవసాయ కోర్సుల్లో ప్రకృతి సేద్య పాఠ్య ప్రణాళిక రచనకు సైతం పీజేటీఎస్ఏయూ వీసీ డా. ప్రవీణ్‌రావు సారధ్యంలో శాస్త్రవేత్తల కమిటీ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో పలువురు వ్యవసాయ రంగ ప్రముఖుల అభిప్రాయాలు.. ‘సాక్షి సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. కమిటీలో ప్రకృతి వ్యవసాయదారులకూ చోటివ్వాలి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాచుర్యంలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. రసాయనిక వ్యవసాయం సృష్టించిన సంక్షోభాన్ని పరిష్కరించడంతోపాటు భూతాపోన్నతి సమస్యకు కూడా ఇది సరైన పరిష్కారం. అయితే, వ్యవసాయ విద్య కోసం సిలబస్ తయారు చేయడానికి ప్రకృతి వ్యవసాయంలో బొత్తిగా అనుభవం లేని విద్యావేత్తలతోనే కమిటీ వేయటం సరికాదు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా రైతులే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రైతు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇది ప్రజా ఉద్యమం. దీనికి నాయకత్వం వహిస్తున్న వారికి ఈ కమిటీలో భాగస్వామ్యం ఉండాలి. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, సెనెగల్, క్యూబా వంటి దేశాల్లో ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో డా. పాలేకర్, డా. నమ్మాళ్వార్, దీపక్ సచ్దే, భాస్కర్ సావే, సుభాష్ శర్మ, చింతల వెంకటరెడ్డి, భరత్ మనసట, కపిల్ షా.. ఆస్ట్రేలియాకు చెందిన డా. వాల్టర్ యన వంటి వారెందరో శాస్త్ర విజ్ఞానాన్ని సంప్రదాయ విజ్ఞానంతో మేళవించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై విశేష కృషి చేశారు.. చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వెనుక సార్వత్రికమైన సైన్స్ ఉంది. ప్రిన్సిపుల్స్ ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. సాగు పద్ధతులే ప్రాంతాన్ని బట్టి వైవిధ్యపూరితంగా ఉంటాయి. పాఠ్యప్రణాళిక తయారు చేసే కమిటీలో ప్రకృతి వ్యవసాయంలో కృషి చేస్తున్న రైతులు, రైతు సంస్థలతోపాటు ఆం.ప్ర., హిమాచల్‌ప్రదేశ్ వంటి ప్రభుత్వాల ప్రతినిధులకూ చోటు ఉండాలి. – టి. విజయకుమార్ ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రకృతి సేద్య విభాగం, ఏపీ వ్యవసాయ శాఖ, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ, గుంటూరు vjthallam@gmail.com మహిళా సంఘాల పాత్ర కీలకం ఇది వ్యవసాయ పరిశోధన, విద్యా రంగాల్లో ఐసిఎఆర్ అనుబంధ సంస్థలు కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకొని ముందుకు సాగినా.. ప్రకృతి వ్యవసాయం విస్తరణ వీళ్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.. ప్రకృతి వ్యవసాయం ఆచరణ ఇప్పటికే ముందుకు వెళ్లింది. దీని వెనకాల సైన్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. పర్వాలేదు. విస్తరణ ముఖ్యంగా రైతు నుంచి రైతుకు, మహిళా రైతుల నుంచి మహిళా రైతులకు ఎలా ముందుకు పట్టుకెళ్లాలి అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఏపీసిఎన్ఎఫ్ ప్రభుత్వ కార్యక్రమంలో ఆచరించి, సత్ఫలితాలను చూపటం జరుగుతోంది. ఇదే విధానాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరిస్తే మంచిదని మా అభిప్రాయం. అదేవిధంగా, ప్రకృతి వ్యవసాయం ముందరికి వెళ్లాలీ అంటే.. ఒక్కొ క్క రైతుతోటి వ్యక్తిగతంగా పనిచేయ వలసి వచ్చిన పాత నమూనా ప్రకారం కాకుండా.. క్షేత్ర స్థాయి సామాజిక సంస్థల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు పట్టుకెళ్లాలి. ఏపీలో కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ ప్రభుత్వ కార్యక్రమంలో మహిళా సంఘాల ద్వారా ఇలాంటి కృషి జరుగుతోంది. ఇదే మాదిరి మహిళా సంఘాల వ్యవస్థను రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్‌లో దేశమంతా రకరకాల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గతంలోనే నెలకొల్పటం జరిగింది. కాబట్టి, ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలంటే.. కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీలపైనే ఆధారపడకుండా.. కమ్యూనిటీ సంస్థలను ముఖ్యంగా క్షేత్ర స్థాయి మహిళా సంఘాలను ఆధారం చేసుకొని కృషి చేయాలి. వేరే రాష్ట్రాల్లో కూడా అందరి రైతులకూ ప్రకృతి వ్యవసాయాన్ని అలవాటు చేయాలంటే ఏపీలో మాదిరిగా చేయాలి. – కవిత కురుగంటి సమన్వయకర్త, అలియన్స్ ఫర్ సస్టయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా), బెంగళూరు kavitakuruganti@gmail.com సేంద్రియ నిపుణులకూ కమిటీలో చోటివ్వాలి మంచి ప్రయత్నం. అనేక సంవత్సరాలుగా వ్యవసాయ విద్యలో మార్పు తేవటానికి మేము, ఇంకా చాలా మంది ప్రయత్నాలు చేసినా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అడ్డుపడుతూ వస్తోంది. ప్రైవేటు యూనివర్సిటీల ద్వారా కూడా ఈ ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. ఇప్పుడు ఒక ప్రయత్నం చేయటానికి కమిటీ వేయటం అభినందించాల్సిన విషయం. అయితే, ఈ కమిటీలో చాలా మంది ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల పైన పనిచేసిన వాళ్ళు కాదు.. దాంతో ఫలితం ఎంత అన్నది అనుమానమే. అలాగే కేవలం వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచే కాకుండా, సేంద్రియ వ్యవసాయం పైన పనిచేస్తున్న ఇతరులను కూడా ఈ కమిటీ సభ్యులుగా నియమిస్తే బావుంటుంది. – డా. జీ వీ రామాంజనేయులు స్వతంత్ర వ్యవసాయ శాస్త్రవేత్త, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ ramoo@csaindia.org ప్రభుత్వ నిర్ణయం ఆనందదాయకం వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ సంస్థలు ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసి, పరిశోధనా ఫలితాలను ప్రజలకు అందజేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఆనందదాయకం. సేంద్రియ వ్యవసాయంపై ఎం.ఎస్.సి. కోర్సు చేయదలచిన విద్యార్థులకు పాఠ్య ప్రణాళికను ఐ.సి.ఎ.ఆర్. ఇప్పటికే తయారు చేసింది. డిసెంబర్ 3న కేంద్ర వ్యవసాయ మంత్రి దీన్ని విడుదల చేశారు. సమగ్ర వ్యవసాయం, సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం – ఇటువంటి పలు రకాల పేర్లతో ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. ఒక్కొ క్క అడుగూ ముందుకు వేయడమే సరైన యోజన అవుతుంది. విధానాలు వేరైనా, రసాయనాలు వేయని పంటలు మంచివి అనేది మొదట అడుగు. ఒక్కొక్క విధానంపై పరిశోధనా ఫలితాలు అందిన తర్వాత మరొక అడుగు ముందుకు వేయవచ్చు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి అధ్యక్షతన నియామకమైన కమిటీ ఈ విషయమై పరిశోధన జరిపి, ఆచరణయోగ్యమైన ఒక కార్యక్రమ రూపాన్ని (రోడ్ మ్యాప్‌ను) ఇవ్వగలదని ఆశిద్దాం. – పి. వేణుగోపాల్‌రెడ్డి చైర్మన్, ఏకలవ్య ఫౌండేషన్, హైదరాబాద్ pvg@ekalavya.net సేంద్రియ, ప్రకృతి సేద్యంపై రైతులకు శిక్షణ వెంకటరామన్నగూడెంలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో సేంద్రియ సాగు వ్యవసాయ విధానాలను వివిధ ఉద్యాన పంటల్లో పరిశీలించి స్థిరీకరించాం. ‘ఉద్యాన పంటల్లో సేంద్రియ వ్యవసాయం’ పేరుతో 3 నెలల సర్టిఫికెట్ కోర్సు ప్రారంభానికి పాఠ్య ప్రణాళికను, నియమ నిబంధనలను సిద్ధం చేశాం. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు సేంద్రియ సాగు విధానాలపై 25 రోజుల శిక్షణ నిర్వహించాం. ‘ఉద్యాన పంటలలో సేంద్రియ సాగు విధానాలు’ పుస్తకాన్ని కూడా రైతులకు అందుబాటులో ఉంచాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కె.వి.కె.ల ద్వారా వివిధ పంటల్లో సేంద్రియ సాగు చేస్తున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి సాగు పద్ధతులను నిర్వచించి, తగు రీతిన ప్రచారం చేసేలా నెలవారీ ప్రణాళికలను రూపొందిస్తున్నాం. ప్రతి కె.వి.కె.లో ఒక ఎకరం ప్రదర్శన క్షేత్రంలో సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేసి.. రైతులకు, విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించబోతున్నాం. వివిధ జిల్లాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం జరిగే క్షేత్రాలను శాస్త్రవేత్తలు సందర్శిస్తున్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణకు, సలహాల కోసం విశ్వవిద్యాలయ పరిధిలోని పరిశోధనా స్థానాలు, కె.వి.కె.లను రైతులు సంప్రదించవచ్చు. – డా. టి. జానకిరామ్ ఉప కులపతి, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం vc@drysrhu.edu.in వ్యవసాయ అనుబంధ రంగాలకూ వర్తింపజేయాలి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, విద్యారంగంలో కూడా ఇందుకు అనుగుణంగా మార్పు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సరైన దిశగా ముందడుగు. హరిత విప్లవ ప్రారంభం అయినప్పటి నుంచి రసాయనిక ఎరువులు, పురుగుమందులు, సాగు నీటిని విచక్షణారహితంగా వాడి భూసారాన్ని క్షీణింపజేసుకున్నాం. భూసారాన్ని పెంపొందించుకోవడానికి ఇప్పటికైనా సేంద్రియ పదార్థాన్ని భూమికి అందించడం ప్రారంభించాలి. వివిధ పంటలు, ఉద్యాన తోటలు, పశుపోషణ, చేపలు, రొయ్యల సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గించటం ద్వారా ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ప్రజలకు అందించడం ఇప్పటి అవసరం. ఖర్చు తగ్గించుకొని, ఆదాయాన్ని పెంచుకోవాలి. పంటల మార్పిడి ద్వారా, ప్రకృతి సేద్యం ద్వారా నాణ్యమైన, పోషకాల సాంద్రతతో కూడిన వైవిధ్యపూరితమైన సమతుల ఆహారాన్ని ప్రజలకు అందించటం సాధ్యమవుతుంది. – డా. విలాస్ కె తొనపి సంచాలకులు, భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ director.millets@icar.gov.in ప్రయోగాల ఫలితాలను రైతులకు అందిస్తాం మా విశ్వవిద్యాలయ పరిశోధనా క్షేత్రంతో పాటు రైతుల క్షేత్రాల్లో సమగ్ర ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి వివిధ పంటలపై పరిశోధనాత్మక సాగును సమదృష్టితో చేపడతాం. ఆ క్షేత్రాల్లో గడించే అనుభవాల ఆధారంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. – డా. ఎ. విష్ణువర్ధన్‌రెడ్డి ఉప కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు vicechancellor@angrau.ac.in -
వర్క్ ఫ్రం హోమ్.. మరోపక్క ప్రకృతి వ్యవసాయం
రవి కుమార్, సునంద యువ దంపతులు. లాక్డౌన్ నేపథ్యంలో సొంతూరు వెళ్లిపోయారు. రసాయన రహితంగా పండించిన ఆహారంతోనే ఆరోగ్యం చేకూరుతుందన్న స్పృహతో రసాయనాల్లేని వ్యవసాయం ప్రారంభించారు. రవి ఆన్లైన్లో ఉద్యోగం చేస్తూనే 8 ఎకరాల నల్లరేగడి భూమిలో భార్య తోడ్పాటుతో ఆఫ్‌లైన్‌లో వర్షాధార సేద్యం చేస్తున్నారు. పూర్తిగా సీవీఆర్ పద్ధతిలో మట్టి సేద్యంతో తొలి ఏడాదే మంచి దిగుబడులు తీసి భళా అనిపించుకుంటున్నారు ఈ ఆదర్శ యువ రైతులు. మాదాని రవి, సునంద ఎమ్మెస్సీ చదువుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటూ అతను ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే, ఆమె ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తుండే వాళ్లు. వారికి ఇద్దరు పిల్లలు. రవి స్వగ్రామం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని విజయనగరం. 40 ఎకరాల భూమి కలిగిన అతని తల్లిదండ్రులు వరి, పత్తి తదితర పంటలను రసాయనిక పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. బాల్యం నుంచీ రవికి వ్యవసాయం అంటే మక్కువ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రవి, సునంద ప్రకృతి వ్యవసాయ విషయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. సుభాష్ పాలేకర్ ప్రసంగాలు విని, పుస్తకాలు, పత్రికలు చదివి, రైతుల విజయగాధల వీడియోలు చూసి స్ఫూర్తి పొందారు. వారాంతాల్లో వీలైనప్పుడల్లా స్వయంగా కొన్ని క్షేత్రాలకు వెళ్లి చూసి, వివరాలు తెలుసుకొని వచ్చేవారు. ఇంట్లో ఎవరో ఒకరికి నెలకోసారైనా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. మార్కెట్లో దొరికే వంటనూనెలు వాడటం ఆపేసి గానుగ నూనె వాడటం మొదలు పెట్టిన తర్వాత క్రమంగా ఆస్పత్తికి వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయిందని.. ఆ తర్వాత బియ్యం, పప్పులు కూడా మార్చుకున్నామని సునంద చెప్పారు. ఆ విధంగా రసాయనాల్లేని ఆహారంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని గుర్తించిన తర్వాత.. నగర పరిసరాల్లో భూమిని కౌలుకు తీసుకునైనా వారాంతాల్లో మనమే ఎందుకు పంటలు పండించుకోకూడని ఆలోచించారు. ఆ ప్రయత్నాలు సాగుతుండగా కరోనా వచ్చిపడింది. నవారతో ప్రారంభం లాక్డౌన్ కారణంగా వర్క్‌ఫ్రం హోం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో వీరి కుటుంబం సొంత గ్రామానికి మకాం మార్చింది. తొలుత గత ఏడాది ఫిబ్రవరిలో 3–4 సెంట్ల భూమిలో నవార విత్తారు. ‘మా అత్త మామల ద్వారా దుక్కి చేయటం, గొర్రుతో విత్తనం వేయటం వంటి ప్రతి పనినీ కొత్తగా నేర్చుకున్నాం. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడటం అక్కడి రైతులందరికీ బాగా అలవాటు. అవి లేకుండా పంటలు ఎలా పండిస్తారని ప్రశ్నించేవారు. అయినా వెనక్కి తగ్గ లేదు’ అన్నారు సునంద. మొదట వ్యవసాయం చాలా కష్టంగా అనిపించినా పట్టు వదలకుండా ముందుకు సాగారు. మొదట ఆకు కూరలు, కూరగాయలు సాగు చేశారు. వేసవిలో పెరట్లో గోంగూర మొక్కలకు పిండి నల్లి సోకినప్పుడు మట్టి ద్రావణం ఆశ్చర్యకరమైన ఫలితాలనిచ్చింది. దాంతో వ్యవసాయం అంతా పద్మశ్రీ అవార్డు గ్రహీత, సీనియర్ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) చెప్పిన విధంగా కేవలం మట్టి ద్రావణం పద్ధతిలోనే సాగు చేసి మంచి దిగుబడులు తీయొచ్చన్న నమ్మకం కుదిరింది. అదే పద్ధతి అనుసరిస్తున్నాం అని సునంద వివరించారు. పంట ఏదైనా కేవలం మట్టి ద్రావణమే ఈ ఏడాది వానాకాలంలో 8 ఎకరాల నల్లరేగడి నేలలో వర్షాధారంగా వరి, సోయాబీన్, కంది, సజ్జ, కొర్రలు, రాగి తదితర పంటలు ఎడ్ల గొర్రుతో విత్తారు. పంటలు ఏవైనా మట్టి ద్రావణమే ప్రతి 10 రోజులకోసారి పిచికారీ చేస్తుండటం విశేషం. 200 లీటర్ల నీటిలో 30 లోపలి మట్టి (భూమిలో 2 అడుగుల లోతు నుంచి తీసి ఎండబెట్టిన పొడి మట్టి), అర లీటరు అముదంను కలిపి ఈ ద్రావణాన్ని అన్ని పంటలకు 10 రోజులకోసారి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. పంట పూత/పిందె దశలో 3 పిచికారీలకు మాత్రం ఈ ద్రావణానికి రాక్ డస్ట్ 5 కిలోలు కలిపి పిచికారీలు చేయాలి. దీనితో పాటు.. 30 కిలోల లోపలి మట్టికి అర లీటరు ఆముదం కలిపి.. ఆ మట్టి మిశ్రమాన్ని పంట మొక్కల కింద 20 రోజులకు ఒకసారి ఎరువుగా వేయాలి. ఈ మట్టి మిశ్రమం వేసిన తర్వాత వారం వరకు జీవామృతం వంటి ద్రావణాలు వేయకూడదు. ఇంతే. పంటలన్నిటికీ ఇవే ఇస్తున్నామని సునంద, రవి వివరించారు. సోయా.. ఎకరానికి 11 క్విం. సునంద, రవి వానాకాలంలో 3 ఎకరాల నల్లరేగడి నేలలో వర్షాధారంగా సోయా విత్తారు. సాళ్ల మధ్య 1.5 అడుగులు పెట్టారు. కలుపు మందు చల్లకుండా నాగళ్లతో 2 సాళ్లు పైపాటు చేయించారు, ఓసారి కూలీలతో కలుపు తీయించారు. సీవీఆర్ మట్టి ద్రావణం మాత్రం పిచికారీ చేశారు. పూత, పిందె దశలో మినుము, పెసర, నవార వడ్లు, బొబ్బర్లను ఒక్కో రకం ఒక్కోసారి మొలకల ద్రావణాన్ని కూడా కలిపి పిచికారీ చేశామని సునంద వివరించారు. ఇంకేమీ వెయ్యలేదు. అయినా, సగటున ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించటం విశేషం. వత్తుగా విత్తుకొని రసాయనిక సేద్యం చేసిన వారికన్నా ఎక్కువ దిగుబడి సాధించడం సాగులో పూర్వానుభవం లేని తమకు ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని సునంద, రవి ఆనందిస్తున్నారు. 2 ఎకరాల్లో కంది విత్తారు. అంతర పంటలు వేశారు. 5 క్వింటాళ్ల కొర్రలు, 2 క్లింటాళ్ల సజ్జలు (సగానికిపైగా చిలకలు తినగా మిగిలినవి), 5 క్వింటాళ్ల కొర్రల దిగుబడి వచ్చింది. ఇవి కోసిన తర్వాత కుసుమ విత్తారు. 3 ఎకరాల్లో అధిక పోషకాలతో కూడిన ఇంద్రాణి, కుజూపటాలియా, కాలాబట్టి, నవార, మాపిళ్ళె సాంబ వంటి దేశీ వరి రకాలను సాగు చేసి 30 క్వింటాళ్ల దిగుబడి పొందటం విశేషం. ధైర్యంగా మట్టి ద్రావణంతో సేద్యం చేపట్టి నలుగురూ ఇదేమి సేద్యం అని తప్పుపడుతున్నా ముందుకు సాగి.. చివరకు గ్రామస్తులతో ఔరా అనిపించుకున్నారు రవి, సునంద వ్యవసాయంలోకి రాదలచిన యువతకు మార్గదర్శకులు. – కమ్రె నరేష్, సాక్షి, కౌటాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్ని ఇబ్బందులున్నా ఆనందంగా ఉంది నేను ఇంటి వద్ద నుంచి ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య సునంద ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇంటి పనులతో పాటు వ్యవసాయం చూసుకుంటున్నది. నేను విధుల్లో ఉన్న సమయంలో నా భార్య సునంద పొలం పనులు చూసుకుంటుంది. ఇద్దరం కలిసి ఇష్టపూర్వకంగా సహజ వ్యవసాయం చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా ఫలితాలను చూసి మాకెంతో ఆనందంగా ఉంది. సహజ పద్ధతిలో పండించిన పంటతో మంచి ఆరోగ్యం చేకూరుతుంది. యువ రైతులందరూ సహజ పద్ధతిలో పంటల సాగు చేపట్టాలి. అప్పుడే భూమి సారవంతం కావడంతో పాటు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. – మాదాని రవి, యువ రైతు, విజయనగరం, కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సీవీఆర్ మట్టి సేద్య పద్ధతి చాలు! వ్యవసాయం చేయడానికి శ్రద్ధతో పాటు చాలా ఒపిక ఉండాలి. అటు ఉద్యోగం.. ఇటు పిల్లల్ని చూసుకుంటూ సహజ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నాం. ఏసీలో ఉండే మీరు ఎందుకు వ్యసాయం చేస్తున్నారు? మందులు (రసాయనిక ఎరువులు, పురుగుమందులు) వాడకుండా పంటలు ఎలా పండుతాయని చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ, ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేస్తున్నాం. పంట దిగుబడిని చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది. సీవీఆర్ మట్టి సేద్య పద్ధతి ఒక్కటి అనుసరిస్తే చాలని మా అనుభవంలో శాస్త్రీయంగా నేర్చుకున్నాం. సంతృప్తిగా ఉంది. NSU Nandanam natural farms యూట్యూబ్ ఛానల్ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తున్నాం. – సునంద (77995 44705), యువ రైతు, విజయనగరం, కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా -
ఆ 93 పల్లె సీమల్లో అంతా ప్రకృతి సేద్యమే!
‘‘అమాయకమైన మనసుకే నిండైన ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది..’’ అంటాడు ఓ తత్వవేత్త. విజయనగరం జిల్లా మారుమూల గ్రామాల్లోని గిరిజన రైతులను చూస్తే ఈ మాట ఎంత నిజమో తెలుస్తుంది. రసాయనిక వ్యవసాయం వల్ల మనకు, పశుపక్ష్యాదులకు, ప్రకృతికి ఎంత హాని జరుగుతోందో అర్థం చేసుకున్న ఆ అన్నదాతలు వెనువెంటనే ప్రకృతి వ్యవసాయంలోకి మారిపోయారు. ఒకరు, ఇద్దరు.. పది మంది కాదు.. ఊళ్లకు ఊళ్లే ఒకటి తర్వాత మరొకటి పూర్తిగా ప్రకృతి సేద్య గ్రామాలుగా మారిపోతున్నాయి (వీటినే అధికారులు ‘బయో గ్రామాలు’గా పిలుస్తున్నారు). కొండబారిడితో ప్రారంభమైన బయో గ్రామాల ప్రస్థానం మూడేళ్లలో 93కు చేరింది. మరికొన్ని గ్రామాలు ఈ వరుసలో ఉన్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు ఒక్క గ్రాము కూడా వాడకుండా నేల తల్లికి ప్రణమిల్లుతున్నాయి. బయో గ్రామాల చిన్న, సన్నకారు రైతులు ప్రకృతిని ప్రేమిస్తూ ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, పర్యావరణ పరంగా దినదినాభివృద్ధి సాధిస్తుండటం చాలా గొప్ప సంగతి. ‘ప్రపంచ నేలల పరిరక్షణ దినోత్సవం’ (డిసెంబర్ 5) సందర్భంగా.. బయో గ్రామాల నిర్మాతలైన భూమి పుత్రులందరికీ వినమ్ర ప్రణామాలు! కొండబారిడి.. విజయనగరం జిల్లా కురుపాం మండలంలో మారుమూల పల్లె. నాడు నక్సల్బరి ఉద్యమానికి పురుడు పోసిన ‘కొండబారిడి’ గ్రామామే.. నేడు సంపూర్ణ ప్రకృతి వ్యవసాయ విప్లవానికి నాంది పలికింది. పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో కొండబారిడి ‘తొలి బయో గ్రామం’గా మారటం విశేషం. ప్రకృతి వ్యవసాయ ప్రేమికులకు పాఠశాలైంది. కొండబారిడి స్ఫూర్తితో తదుపరి రెండేళ్లలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో మరో 92 (2019లో 51, 2020లో మరో 41) గిరిజన గ్రామాలు వంద శాతం ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా మారాయి. వరితో పాటు రాగి తదితర చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. జీడిమామిడి తదితర తోటల్లోనూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. బయో గ్రామాల్లో వరి, రాగి పంటలను ‘శ్రీ’ విధానంలోనే రైతులు సాగు చేస్తున్నారు. ‘అన్నపూర్ణ’ నమూనాలో ఇంటింకి అరెకరం స్థలంలో కూరగాయలు, పండ్లు తదితర 20 రకాల పంటలు పండిస్తున్నారు. 365 రోజులూ భూమికి ఆకుపచ్చని ఆచ్ఛాదన కల్పిస్తున్నారు. గతంలో సేంద్రియ కర్బనం 0.5 శాతం మేరకు ఉండేది ప్రకృతి సేద్యం వల్ల రెండేళ్ల క్రితం 120 జీడిమామిడి తోటల్లో రెండేళ్ల క్రితం భూసార పరీక్షలు చేసినప్పుడు 0.75 శాతానికి పెరిగిందని జట్టు కార్యనిర్వాహక ట్రస్టీ డా. పారినాయుడు ‘సాక్షి’తో చెప్పారు. పండించిన ధాన్యాన్ని మహిళా స్వయం సహాయక బృందాల మహిళా రైతులు రోకళ్లతో దంచి కిలో రూ. 65 రూపాయలకు నేరుగా ప్రజలకు అమ్ముతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మూడు చోట్ల వీరి ఆహారోత్పత్తులను విక్రయించేందుకు స్టాల్స్‌ను తెరిచారు. కొండబారిడి సహా మొత్తం 93 బయోగ్రామాల్లోని 3,690 మంది రైతులు 10,455 ఎకరాల్లో రైతులు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరంతా కాయకష్టం చేసుకునే చిన్న, సన్నకారు రైతులే. అంతా వర్షాధార సేద్యమే. వరి సాగు ఖర్చు ఎకరానికి రూ. 3 వేల నుంచి 4 వేల వరకు తగ్గింది. అంతకు ముందు ఎకరానికి 20 బస్తాల (75 కిలోల) ధాన్యం పండేది ఇప్పుడు 30 బస్తాలకు పెరిగింది. అంటే.. దాదాపు 40 నుంచి 50 శాతం అధిక దిగుబడి పొందుతున్నారు. పొల్లు లేకపోవడం, గింజ బరువు పెరగడంతో నికర బియ్యం దిగుబడితో పాటు రైతు ఆదాయం కూడా పెరిగింది. 93 బయో గ్రామాల్లో రైతులతో పాటు ప్రజలంతా ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యదాయక ఆహారం తింటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. బయో గ్రామాల్లో 98 మంది కోవిడ్ బారిన పడినప్పటికీ ఏ ఒక్కరూ చనిపోలేదు. మలేరియా కేసులు నమోదు కాలేదు. గత పదేళ్ల గణాంకాలు సేకరించగా.. బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యల తీవ్రత 30–40% మేరకు తగ్గిందని డా. పారినాయుడు వివరించారు. మరో 83 గ్రామాల్లో 80% మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారని, వచ్చే రెండేళ్లలో ఈ గ్రామాలు కూడా పూర్తి బయో గ్రామాలుగా మారనున్నాయని ఆయన సంతోషంగా చెప్పారు. ‘స్కోచ్’ అవార్డుకు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైతు సాధికార సంస్థ, జట్టు ట్రస్టు, రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ శాఖ అధికారుల సహాయ సహకారాలు ప్రకృతి సేద్యంలో రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గిరిజన రైతుల అపూర్వ విజయాలను చూపి ముచ్చటపడిన జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి ‘స్కోచ్’ అవార్డు కోసం ప్రతిపాదనలు పంపారు. నేలల సంరక్షణ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ‘అమృత భూమి’ పేరుతో ‘జట్టు’ ఆధ్వర్యంలో కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కూడా ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటించటం విశేషం. – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, విజయనగరం -
గో ఆధారిత వ్యవసాయానికి టీటీడీ చేయూత
తిరుపతి కల్చరల్(చిత్తూరు జిల్లా): గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తాము కూడా అండగా ఉంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రైతుల నుంచి పంట ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. జాతీయ గో మహాసమ్మేళనం శనివారం తిరుపతిలో వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారికి గో ఆధారిత ఉత్పత్తులతో నైవేద్యం, దేశీయ ఆవు పాలతో చిలికిన వెన్న సమర్పించేందుకు నవనీత సేవ చేపట్టామన్నారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాలతో దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామన్నారు. ప్రస్తుతం 74 ఆలయాల్లో గుడికో గోమాత కార్యక్రమం మొదలుపెట్టామని.. త్వరలో ఈ సంఖ్యను 100 ఆలయాలకు పెంచుతామన్నారు. గోవుల విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. అనంతరం మాతా నిర్మలానంద యోగ భారతి ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. కార్యక్రమంలో టీటీడీ సభ్యులు పోకల అశోక్‌కుమార్, మొరం శెట్టి రాములు, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మయ్య, సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, ఎస్వీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి, యుగతులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్, సేవ్ ఫౌండేషన్ అధ్యక్షుడు విజయరామ్ పాల్గొన్నారు. -
సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం: మంత్రి సింగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కంపెనీల లాబీయింగ్ కారణంగా వ్యవసాయ క్షేత్రాల్లో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం పెరిగిందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. తద్వారా మనిషికి ఆరోగ్యకరమైన ఆహారం అందడం లేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2017 నుంచి ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని చెప్పారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుడు గోరటి వెంకన్న అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2017–18 నుంచి 2019–20 వరకు రాష్ట్రంలో 29,200 ఎకరాల విస్తీర్ణం కలిగిన 584 క్లస్టర్లలో సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 2021–22 సంవత్సరానికి గాను జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 750 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయానికి ప్రతిపాదించామన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటివరకు బడ్జెట్లో రూ. 7,201.57 కోట్లు కేటాయించగా, రూ. 2,598.19 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. రైతు వేదికల ద్వారా సేంద్రియ వ్యవసాయంపై రైతాంగానికి అవగాహన, శిక్షణ కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. సవరించిన పేస్కేళ్ల అమలు: మంత్రి సబిత యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోర్టు కేసుల కారణంగా ఆగినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జనవరి 2016 నుంచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని బోధనా సిబ్బందికి సవరించిన యూజీసీ వేతన స్కేళ్లను అమలు చేసేందుకు ప్రభుత్వం 2019లోనే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 3,350 మంది సిబ్బందికి పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. మిగతా వారికి ఇచ్చేందుకు సర్కార్‌ను గ్రాంట్ అడిగినట్లు వివరించారు. అంతకుముందు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కలిపి 3,000 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 2017లోనే 1,061 పోస్టుల భర్తీకి జీవో ఇచ్చినప్పటికీ అమలు కాలేదని వివరించారు. కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్లను బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చి ఏడాదైనా అమలు కాలేదని, కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి 10 శాతం పన్నును ఆదాయపన్ను శాఖ వసూలు చేయడాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు అకాడమీ స్కాంలో నిధుల రికవరీ చేయాలి: ఎంఎస్ ప్రభాకర్ తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్లను తస్కరించిన స్కాంలో నిందితులను అరెస్టు చేయడమే కాకుండా నిధులను రికవరీ చేయాలని సభ్యుడు ఎం.ఎస్.ప్రభాకర్ కోరారు. అవసరమైతే నిందితులపై పీడీ యాక్ట్ పెట్టాలని సూచించారు. అందుకు మంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ నిందితుల నుంచి నిధులను రికవరీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. గిరిజన తెగలకు... ఆదిలాబాద్‌లో గిరిజన తెగల్లో ఒకటైన మన్నెవర్లను కొలవర్లుగా మార్చారని, అయితే మన్నెవర్లుగా ఉన్నప్పుడు వారికి లభించిన లబ్ధి ఇప్పుడు అందడం లేదని సభ్యుడు పురాణం సతీష్ సభ దృష్టికి తెచ్చారు. 55 వేల మంది మన్నెవర్లు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సైనిక సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని టి.జీవన్‌రెడ్డి కోరారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, దసరా సెలవుల్లో బడులను సంస్కరించాలని ఆయన సూచించారు. -
త్వరలోనే ఏపీలో ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీని తీసుకొస్తాం: కన్నబాబు
సాక్షి, అమరావతి: ఏపీలో త్వరలో ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీని తీసుకొస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని మరింత విస్తృతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో స్పష్టమైన ప్రణాళికలు చేస్తున్నాం అన్నారు. ఎఫ్పీఓలు, ఎన్జీఓలు, అధికారులు, శాస్త్రవేత్తలతో మంత్రి కన్నబాబు సోమవారం అమరావతి ఏపీఐఐసీ బిల్టింగ్‌లో సమావేశం నిర్వహించారు. రైతులు, ఎఫ్పీఓలు, ఎన్జీఓల నుంచి సేంద్రియ వ్యవసాయపు అనుభవాలు, సలహాలను మంత్రి కన్నబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ‘‘రైతులకు రెట్టింపు ఆదాయంతో పాటు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ప్రజలకు చేరేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఆర్బీకే కేంద్రంగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సీఎం ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయానికి సహాయంగా రెండు దశల్లో 5,000 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం’’ అన్నారు. (చదవండి: సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలి: కన్నబాబు) పొలంబడి ద్వారా వ్యవసాయ, ఉద్యాన వన వర్సిటీలు.. రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులను చైతన్య పరచాలి. ఉత్పత్తులు తగ్గకుండా రసాయనాలు, పురుగు మందులను తగ్గిస్తూ, క్రమేపి వాటి వినియోగాన్ని కనీస స్థాయికి తీసుకురావాలి. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ భావితరాలకు ఆరోగ్యకరమైన వ్యవసాయాన్ని అలవాటు చేయాలి’’ అన్నారు. (చదవండి: కోవిడ్ సాగు: షుగర్ క్వీన్.. తియ్యటి పంట) ఈ సమావేశంలో పాల్గొన్న రైతులు, ఎప్‌పీఓలు, ఎన్జీఓలు సర్టిఫికేషన్, శిక్షణ, పనిముట్ల పంపిణి, మార్కెటింగ్ సౌకర్యాలు, ఆర్గానిక్ ఉత్పత్తులపై విస్తృత ప్రచారం, రైతులకు కసాయాలు, ఘన జీవామృతం అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై సలహాలిచారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ ఉన్నతాధికారులు టి విజయ కుమార్, స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య , అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్ , హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ , యూనివర్సిటీ వీసీ జానకిరామ్ , ఏపీ సీడ్స్ ఎండి శేఖర్ బాబు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర , సీడ్స్ సర్టిఫికేషన్ డైరెక్టర్ త్రివిక్రమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: కొత్త బంగారు లోకం.. సతత హరిత పంటలు -
మిద్దె తోటల సాగుపై 54 వాట్సప్ గ్రూప్‌లు
ప్రకృతి/ సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు, మిద్దె తోటల సాగుపై నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఊపందుకుంటున్నది. మిద్దె తోటల నిర్మాణంపై మౌలిక అవగాహన కల్పించడంతోపాటు రోజువారీ నిర్వహణ, చీడపీడల సమస్యలపై సందేహాలు తీర్చుకునేందుకు మాటసాయం కల్పిస్తే సేంద్రియ ఆహారాన్ని ఉన్నంతలో స్వయంగా పండించుకోవటం నేర్చుకునే పట్టణ ప్రాంతీయులకు మేలు జరుగుతుంది. ఈ లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల్లోని 46 జిల్లాలు, దేశంలోని ఆరు మెట్రో నగరాలలో నివాసం ఉండే తెలుగు వారి సౌకర్యార్థం మిద్దె తోటల నిపుణుడు తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఆధ్వర్యంలో వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటయ్యాయి. ప్రతి జిల్లాకూ ఒక గ్రూపు ఏర్పాటైంది. కృష్ణా జిల్లాకు రెండు గ్రూపులు అదనంగా ఏర్పాటు చేసినట్లు తుమ్మేటి తెలిపారు. ఏ జిల్లాలో నివాసం ఉండే వారు ఆ జిల్లా వాట్సప్ గ్రూపులో చేరవచ్చు. సేంద్రియ ఇంటిపంటలు, మిద్దెతోటల సాగు తప్ప ఇతర విషయాలకు ఈ గ్రూపులలో తావుండదు. ప్రభుత్వాల నుంచి, స్థానిక సంస్థల నుంచి రాయితీలు పొందడానికి సమష్టి గొంతుకను వినిపించడానికీ ఈ గ్రూపులు వేదికగా ఉపకరిస్తాయి. ఫేస్‌బుక్‌లోని తన వాల్‌పై అన్ని జిల్లాల గ్రూపు అడ్మిన్ల నంబర్లను తుమ్మేటి పేర్కొన్నారు. https://facebook.com/ragotamareddy.tummeti చాలా గ్రూపులకు రఘు అడ్మిన్‌గా ఉన్నారు. ఆయన మొబైల్ నంబరు 90001 84107. గ్రూపులో చేరే ఆసక్తిగల వారు ఏ జిల్లావారైనా ఆయనను వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చు. -
Terrace Garden: ఎవరికి వారు పండించుకొని తినాలి!
‘‘డబ్బు సంపాయించుకుంటే చాలు ఆహారం కొనుక్కొని తింటే సరిపోతుంది అని అందరూ అనుకుంటున్నారు. ప్రజల్లో ఈ ధోరణి పాతుకుపోయింది. ఈ కారణంగానే మార్కెట్లో అమ్మే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగులో రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఎక్కువ మోతాదులో వాడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎవరికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను అవకాశం ఉన్న వారంతా తమ ఇళ్లపైన, పెరట్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసుకోవటమే ఈ సమస్యకు సరైన పరిష్కారం. ఈ పని నేను చేస్తూ ఇతరులకూ చెప్పాలనుకున్నాను. మూడేళ్ల క్రితం కొత్త పక్కా భవనం నిర్మించుకునేటప్పుడే మిద్దె తోటలకు తగిన (వాటర్ ఫ్రూఫింగ్, సిమెంటు తొట్లు నిర్మించటం..) ఏర్పాట్లు చేసుకున్నాను.. ’’ అంటున్నారు కనుకుంట్ల విద్యాసాగర్‌రెడ్డి. నల్లగొండ జిల్లా నకరేకల్‌లో స్వగృహంలో తమ ఇద్దరు పిల్లలతో పాటు నివాసం ఉంటున్న విద్యాసాగర్ రెడ్డి, కోకిల దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. సేంద్రియ ఇంటిపంటల సాగుపై చాలా మక్కువ. 2 వేల చదరపు గజాల టెర్రస్‌పై గత మూడేళ్లుగా ఇంటిపంటలు పండించుకొని తింటున్నారు. ఆకుకూరలు కొనటం లేదు. పాలకూర, బచ్చలికూర, పొన్నగంటి, మునగ వంటి ఐదారు రకాలు ఏడాది పొడవునా సాగు చేస్తున్నారు. దొండ, బీర, వంకాయలు వంటి కనీసం మూడు, నాలుగు రకాల కూరగాయలతోపాటు పచ్చిమిర్చి ఇప్పుడు కాపు దశలో ఉన్నాయి. టమాటో, బెండ, గోకర (గోరుచిక్కుడు).. వంటివి ఇప్పుడు విత్తబోతున్నారు. ప్రణాళికాబద్ధంగా పంటలు దఫ దఫాలుగా విత్తుకోవటం/నాటుతున్నారు. పోషకాల లోపం రాకుండా, చీడపీడల బెడద తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసి, మొక్కలకు అప్పుడప్పుడూ వేస్తుంటారు. మడుల్లో మట్టిని వేసవిలో తీసి.. పశువుల ఎరువు, కొబ్బరి పొట్టు, జీవన ఎరువులు కలుపుతారు. సేంద్రియ పద్ధతుల్లో పండించుకునే ఇంటిపంటలకు చీడపీడలు రాకుండా ముందే∙జాగ్రత్తపడాలంటారు విద్యాసాగర్‌రెడ్డి. నిత్యం మొక్కలను గమనిస్తూ ఉండాలి. పసుపు నీళ్లు, వేపాకు రసం/కషాయం, మిగిలిపోయిన వంట నూనె, వెల్లుల్లి రసం, పుల్లటి మజ్జిగ, పచ్చిమిర్చి రసం వంటి ద్రావణాలను పిచికారీ చేస్తున్నారు. అన్ని పట్టణాల్లో సబ్సిడీ ఇవ్వాలి మిద్దె తోటల్లో దేశవాళీ విత్తనాలు వాడితేనే రుచి బాగుంటుందని ఆయన అంటారు. పిల్లలు, పెద్దలు మిద్దె తోటల పనుల్లో నిమగ్నం కావటం వల్ల టీవీ, ఫోన్ల వాడకం తగ్గిందన్నారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేస్తున్నారు. డ్రమ్ముల్లో పట్టి ఉంచి మొక్కలకు పోస్తుండటం, ఇంట్లో ఏసీ పెట్టుకోకపోవడం విశేషం. ప్రతి నగరం, పట్టణంలో మిద్దె తోటల సాగుకు అవసరమైన సామగ్రి, పరికరాలు, సంప్రదాయ విత్తనాలను సబ్సిడీపై అందుబాటులోకి తెస్తే మరింత మంది ఇంటి పంపటలు సాగు చేసుకోగలుగుతారని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విద్యాసాగర్‌రెడ్డి (98498 21212) ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. -
మట్టిని వాడకుండా కూరగాయల సాగు.. ప్రత్యక్ష శిక్షణ
పట్టణ/నగర ప్రాంతాల్లో కూరగాయల సాగు, టెర్రస్ కిచెన్ గార్డెనింగ్ ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో మట్టిని వాడకుండా, కొబ్బరి పొట్టుతోనే నారు మొక్కలు, కూరగాయల సాగుకు ప్రాముఖ్యం పెరుగుతోంది. శుద్ధి చేసిన కొబ్బరి పొట్టును బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించిన ఆర్క మైక్రోబియల్ కన్సార్షియం ద్రావణంతో పులియబెడితే.. పోషకాలతో కూడిన సేంద్రియ కొబ్బరి పొట్టు (అర్క ఫర్మెంటెడ్ కోకోపీట్– ఎ.ఎఫ్.సి.) సిద్ధమవుతుంది. దీన్ని తయారు చేసుకోవటం.. మట్టి వాడకుండా కుండీలు, మడుల్లో నారు మొక్కలను, కూరగాయ మొక్కలను సాగు చేసుకోవటంపై ఆగస్టు 13న ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు శిక్షణ ఇవ్వనున్నారు. బెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్‌కు వెళ్లి ప్రత్యక్ష శిక్షణ పొందేవారు రూ. 2,000, జూమ్ ఆప్ ద్వారా ఆన్లైన్లో శిక్షణ పొందగోరే వారు రూ. 500 ఫీజుగా చెల్లించి, ఆగస్టు 11లోగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆసక్తి గల వారెవరైనా శిక్షణకు అర్హులే. సేంద్రియ ఇంటిపంటల సాగును ఉపాధి మార్గంగా ఎంచుకోదలచిన వ్యక్తులు, స్టార్టప్‌లు, ఎఫ్.పి.ఓ.లు, వ్యవసాయ/ఉద్యాన విద్యార్థులు/పట్టభద్రులు ఎవరైనా శిక్షణ పొందవచ్చు. అభ్యర్థులు ఈ కింది లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. https://forms.gle/tBYyusdJ9D2hgvQD6 bessthort@gmail.com నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్పై అడ్వాన్స్డ్ కోర్సు పంటల సాగులో పురుగులు, తెగుళ్లకు సంబంధించిన మౌలికాంశాలను అర్థం చేసుకొని రసాయన రహిత పద్ధతుల్లో చీడపీడలను అరికట్టేందుకు ఉపయోగపడే మెలకువలను నేర్పించడానికి ఆగస్టు 5–7 తేదీల్లో గ్రామీణ అకాడమీ ‘నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్పై అడ్వాన్స్డ్ కోర్సు’పై శిక్షణ ఇవ్వనుంది. జూమ్ ఆప్ ద్వారా మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ) కార్యనిర్వాహక సంచాలకులు, వ్యవసాయ శాస్త్రవేత్త డా. జీ వీ రామాంజనేయులు ఆంగ్లంలో శిక్షణ ఇస్తారు. ఫీజు రూ. 2,500. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 99850 16637 https://grameenacademy.in/courses/ సద్దుపల్లిలో ప్రతి శనివారం రైతులకు శిక్షణ ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు నాగరత్నంనాయుడు ప్రతి శనివారం తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం (రామోజీ ఫిలిం సిటీ ఎదురు రోడ్డు) సద్దుపల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతి శనివారం ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు ఆయన శిక్షణ ఇస్తారు. ఆగస్టు 2 (సోమవారం) ఉ. 11 గంటలకు శిక్షణా తరగతులను ప్రారంభిస్తున్నట్లు ‘రైతునేస్తం’ వేంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 94905 59999 -
సమీకృత సేద్యం.. సంతోషం!
ప్రకృతి వ్యవసాయ పితామహుడు డా. సుభాష్ పాలేకర్ శిక్షణ అందించిన స్ఫూర్తితో రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి.. ఏడేళ్లుగా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న బండారు వెంకటేశ్వర్లు, పుష్పలత దంపతుల కృషి చక్కని ఫలితాలనిస్తోంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెంలోని తమ 12 ఎకరాల సొంత భూమిలో సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఐసీఏఆర్ అందించే జాతీయ స్థాయి హల్దార్ సేంద్రియ రైతు పురస్కారానికి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. నల్గొండలో, తూ.గో. జిల్లా సర్పవరంలో పాలేకర్ శిక్షణా శిబిరాలకు హాజరై 2014లో రెండు నాటు ఆవులను కొనుక్కొని ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. డిగ్రీ పూర్తి చేసిన ఆయనకు కుమారుడు, కుమార్తె ప్రైవేటు ఉద్యోగులు. దంపతులు ఇద్దరే సాధ్యమైనంత వరకు వ్యవసాయ పనులు చేసుకుంటారు. అవసరమైతేనే కూలీలను పిలుస్తారు. వరి, వేరుశనగ వంటి పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలు.. మొత్తం 14 రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఫామ్ పాండ్‌లో చేపల సాగుతో సమీకృత ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేశారు. గడ్డిపల్లి కేవీకె శాస్త్రవేత్తలు, ఉద్యాన, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆదర్శ సేద్యం చేస్తున్నారు. భూసారాన్ని పెంచేందుకు పశువుల ఎరువు, ఘనజీవామృతం, వేప పిండి, కొబ్బరి చెక్క, కానుగ చెక్క, జీవామృతం, వేస్ట్ డీకంపోజర్తోపాటు జీవన ఎరువులను సైతం వాడుతున్నారు. పంటల మార్పిడితోపాటు సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తున్నారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇంగువ ద్రావణం, వేప గింజల కషాయం, వంటి వాటితోనే సేద్యం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. వైరస్ లేని బొప్పాయి సాగు వెంకటేశ్వర్లు గత మూడేళ్లుగా బొప్పాయి సాగు విస్తీర్నం పెంచుకొని కరోనా నేపథ్యంలో మంచి ఆదాయం గడించడం విశేషం. బొప్పాయిలో కలుపుతీతకు పవర్ వీడర్‌ను స్వయంగా ఉపయోగిస్తున్నారు. 8.5 ఎకరాల్లో బొప్పాయి కాసులు కురిపిస్తుంటే ఎకరంలో నిమ్మ తోటపై రూపాయి కూడా రావటం లేదన్నారు. ఎకరాకు 33 బస్తాల ధాన్యం దిగుబడి వరి సాగులో డ్రమ్ సీడర్‌తో వరి సాగు చేస్తున్నారు. వానాకాలంలో సాంబ మసూరి వరిలో ఎకరాకు 33 బస్తాల దిగుబడి సాధిస్తూ క్వింటా బియ్యం రూ. 5,500 చొప్పున తన ఇంటి దగ్గరే అమ్ముతున్నారు. ఆ పొలంలో శీతాకాలంలో పుచ్చ సాగు చేస్తున్నారు. అరటి, నేరేడు, మామిడి, ఉసిరి, సపోట, ఇంకా పలు రకాల పండ్ల చెట్లనూ పెంచుతున్నారు. అన్ని ఖర్చులూ పోను 12 ఎకరాల్లో ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం మిగులుతున్నదని వెంకటేశ్వర్లు సంతోషంగా చెప్పారు. 50 శాతం ప్రభుత్వ రాయితీపై ఫాం పాండ్‌ను నిర్మించి డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. దీనిలో నీటిని నిల్వ చేసుకొని, ఉద్యానవన పంటలను సాగు చేసుకుంటూ దానిలో చేపలను పెంచుకుంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఖర్చులు పోను రూ.50 వేలు మిగిలాయని వెంకటేశ్వర్లు చెబుతున్నారు. – మొలుగూరి గోపి, సాక్షి, నడిగూడెం, సూర్యాపేట జిల్లా నిలువు పందిళ్లు మేలు! తీగజాతి కూరగాయల సాగుకు రాతి స్తంభాలతో శాశ్వత ప్రాతిపదికన పందిళ్లు వేసే కన్నా.. వెదురు బొంగులు, ప్లాస్టిక్ తాళ్లు, పురికొసలతో కూడిన తాత్కాలిక నిలువు పందిళ్లు వేసుకోవటం రైతులకు ఎంతో మేలని హల్దార్ సేంద్రియ రైతు జాతీయ పురస్కారం అందుకున్న బండారు వెంకటేశ్వర్లు తెలిపారు. నిలువు పందిళ్లకు ఎకరానికి రూ. 50 వేల లోపు ఖర్చవుతుంది. శాశ్వత పందిళ్లు వేసుకోవడానికి ఇంకా అధిక పెట్టుబడి అవసరం. నిలువు పందిళ్లను పంట అయిపోగానే తీసేసి పక్కన పెట్టుకొని, మళ్లీ సులువుగా వేసుకోవచ్చు. ఆ స్థలంలో పంట మార్పిడికి కూడా ఇవి అనుకూలం. శాశ్వత పందిరి వేసుకుంటే.. ఆ స్థలంలో ప్రతిసారీ కూరగాయ పంటలే వేసుకోవాలి, పంట మార్పిడికి అవకాశాలు తక్కువ. పిచాకారీలకు, కూరగాయల కోతకు నిలువు పందిళ్లే మేలు. నిలువు పందిళ్లలో పంటలకు గాలి, వెలుతురు బాగా తగులుతుంది. దిగుబడీ బాగుంటుంది. వీటిలో పాముల బెడద కూడా తక్కువ. సేంద్రియ మార్కెట్లు నెలకొల్పాలి అప్పటి కలెక్టర్ ముక్తేశ్వరరావు ప్రోత్సాహంతో పాలేకర్ శిక్షణ పొందాను. పుస్తకాలు చదివి అవగాహన పెంచుకున్నాను. సీనియర్ రైతుల స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయంలోకి మారాను. తొలి రెండేళ్లు కష్టనష్టాలు చవిచూసి, మానేద్దామనుకున్నా. మా పొలానికి వచ్చి చూసిన అప్పటి కలెక్టర్ సురేంద్రమోహన్ వెన్నుతట్టి ప్రోత్సహించడంతో కొనసాగించాను. గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్తలు, అధికారుల తోడ్పాటుతో ఇప్పుడు నిలదొక్కుకున్నాను. నా భార్య, నేను పగలంతా పొలం పనులు చేసుకుంటాం. మరీ అవసరమైతేనే కూలీలను పిలుస్తాం. రెండేళ్లుగా పండించినవన్నీ తోట దగ్గరే ఏదో ఒక ధరకు అమ్మేస్తున్నా. నికరాదాయం బాగానే ఉంది. ప్రభుత్వమే ప్రత్యేక సేంద్రియ మార్కెట్లు నెలకొల్పి, ప్రచారం కల్పించి ప్రజల్లో చైతన్యం తేవాలి. రసాయన ఎరువులకు ఇస్తున్న రాయితీ మాదిరిగానే వేప పిండి తదితర వాటికి కూడా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తేనే ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తుంది. – బండారు వెంకటేశ్వర్లు (77027 10588), ఐసీఏఆర్ హల్దార్ సేంద్రియ రైతు జాతీయ అవార్డు గ్రహీత, నరసింహుల గూడెం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా సేంద్రియ సేద్యంపై శిక్షణ ఇస్తున్నాం బండారు వెంకటేశ్వర్లు దంపతులు రోజంతా పొలం పని చేస్తారు. కరోనా కాలంలో బొప్పాయికి వచ్చిన గిరాకీ వల్ల వారి కష్టానికి తగిన ఆదాయం వచ్చింది. మా కేవీకేలో రైతులకు సేంద్రియ సేద్యంలో పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నాం. జీవన ఎరువులు, వర్మీకంపోస్టు, అజొల్లా వంటి ఉత్పాదకాలను తయారు చేసి రైతులకు ఇస్తున్నాం. సేంద్రియ రైతులకు మార్కెటింగే సమస్య. ప్రభుత్వమే తీర్చాలి. సబ్సిడీపై ఆవులు, జీవన ఎరువులు ఇవ్వాలి. – డా. లవకుమార్ (98490 63796), సమన్వకర్త, శ్రీ అరబిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కేవీకే, గడ్డిపల్లి, సూర్యాపేట జిల్లా బండారు వెంకటేశ్వర్లు 2014 నుంచి తన సొంత భూమి 12 ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తూ సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడకపోవటం వల్ల మొదటి ఏడాది నుంచీ ఖర్చులు బాగా తగ్గాయి. అయితే, దిగుబడులు మొదటి ఏడాది బాగా తగ్గాయి. క్రమంగా పెరిగి మూడేళ్లకు దిగుబడి మంచి స్థాయికి పెరిగింది. గత ఐదేళ్లలో ఖర్చులు పోను నికరాదాయం గణనీయంగా పెరిగింది. 2016–17లో రూ. 7,57,238 నికరాదాయం పొందగా 2020–21 నాటికి ఇది రూ. 13,98,738కు పెరగటం విశేషం. -
సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలి: కన్నబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ పాలసీ తీసుకొచ్చేందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్నతాధికారుల కమిటీతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గురువారం సమావేశమయ్యారు. రైతులకు రెట్టింపు ఆదాయం, నాణ్యమైన ఉత్పత్తులు, భూసారాభివృద్ది, ప్రజారోగ్యం ప్రధాన లక్ష్యాలుగా సేంద్రియ వ్యవసాయ పాలసీ వుండాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు అన్నారు. రైతాంగానికి మేలు చేసే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో రైతులకు రసాయనాలు, పురుగు మందుల వినియోగం తగ్గించేలా అవగాహనా పెంచాలని ఆయన సూచించారు. బయో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇతర రసాయనాల వినియోగంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. డిమాండ్ మేరకే ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని.. సేంద్రియ వ్యవసాయ పద్దతులపై విస్తృతంగా రైతుల్లో అవగాహనా పెంచాలన్నారు. కొత్త పంటల సాగు ప్రారంభం నుంచే వారిని సేంద్రియ వ్యవసాయ విధానంపై ప్రోత్సాహించాలన్నారు. కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల సూచనలు అభిప్రాయాలను సేకరించి ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే ఆర్గానిక్ పాలసీని తీసుకొస్తామని మంత్రి కన్నబాబు అన్నారు. సెరికల్చర్ ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష సెరికల్చర్ ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. పట్టుసాగుకు నూతన రైతులను ప్రోత్సహించాలని మంత్రి అన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన 400 మంది విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్లకు పూర్తి స్థాయిలో సాంకేతిక శిక్షణ ఇవ్వాలన్నారు. రైతుల ఆర్థిక ప్రయోజనాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. పట్టు ధరలు తగ్గకుండా ఎక్కువ మంది రీలర్లను ప్రోత్సహిస్తూ తగిన ముందుస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కన్నబాబు సూచించారు. -
పద్మశ్రీ రాధామోహన్ ఇకలేరు
భువనేశ్వర్: పద్మశ్రీ ప్రొఫెసర్ రాధా మోహన్ స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలువురు ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. దివంగత ప్రొఫెసర్ నేపథ్యం నయాగడ్‌లో 1943వ సంవత్సరం జనవరి నెల 30వ తేదీన జన్మించిన ఆయన అర్థశాస్త్రం ఆనర్స్‌తో డిగ్రీ ఉత్తీర్ణులై 1965వ సంవత్సరంలో స్థానిక ఉత్కళ విశ్వ విద్యాలయం నుంచి అప్లైడ్ ఎకనమిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుడిగా పని చేశారు. 2001వ సంవత్సరంలో పూరీ ఎస్సీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ హోదాలో విరామం పొందారు. కీలక బాధ్యతలు రాష్ట్ర సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, విద్య, యువజన సేవలు, గ్రామీణ అభివృద్ధి శాఖల్లో కీలక పదవుల్లో ఆయన విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే రాష్ట్ర ప్రణాళిక బోర్డు, రాష్ట్ర వాటర్ షెడ్ మిషన్ సలహా కమిటీ, విద్య టాస్క్‌ఫోర్స్, వన్య ప్రాణుల సలహా కమిటీ, ఎన్ఎస్ఎస్ సలహా కమిటీ, సంయుక్త అటవీ నిర్వహణ స్టీరింగ్ కమిటీ, భారత ప్రభుత్వ ఎన్ఎస్ఎస్ ఎవాల్యూషన్ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌గా ప్రతిష్టాత్మక హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ప్రజాసేవకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రతిష్టాత్మక ఉత్కళ సేవా సమ్మాన్ పౌరసత్కార పురస్కారం ప్రదానం చేసింది. కుమార్తెతో కలిసి పద్మశ్రీ వ్యవసాయ రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు కేంద్రప్రభుత్వం గత ఏడాది ఆయనతో పాటు కుమార్తె సబరమతికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఆహార అరణ్యం ఆవిష్కర్తలుగా తండ్రీకూతుళ్లు విశేష గుర్తింపు పొందారు. సంభవ్ సంస్థ ఆధ్వర్యంలో ఔత్సాహిక వ్యక్తులు, రైతులకు సేంద్రియ సాగులో మెలకువలు తెలియజేసి వ్యవసాయ రంగంలో కొత్త మలుపులు ఆవిష్కరించిన తండ్రీకూతుళ్లను పద్మశ్రీ పురస్కారం వరించింది. గ్లోబల్ రోల్ ఆఫ్ ఆనర్ ఆర్థికవేత్త పర్యావరణవేత్తగా మారి సేంద్రియ సాగులో విభిన్న రీతుల ఆవిష్కరణలో కీలక పాత్రధారిగా ఆయన గుర్తింపు సాధించారు. పర్యావరణ రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఐక్య రాజ్య పర్యావరణ కార్యక్రమం యూఎన్ఈపీ కింద గ్లోబల్ రోల్ ఆఫ్ ఆనర్ ఆయనకు ప్రదానం చేయడం విశేషం. ఆయన ఆవిష్కరించిన సంభవ్ సంస్థ సేంద్రియ సాగులో దేశ వ్యాప్తంగా రైతాంగానికి రిసోర్స్ సెంటర్‌గా వెలుగొందుతోంది. -
కోవిడ్ సాగు: షుగర్ క్వీన్.. తియ్యటి పంట
సీమా రథీశ్ లెక్కల టీచర్. కేరళలోని కసర్గోడ్ జిల్లా, ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం. గత ఏడాది నుంచి కోవిడ్ స్కూళ్ల టైమ్‌టేబుల్‌ను, క్యాలెండర్లను తలకిందులు చేసింది. సీమ ఉద్యోగ జీవితం కూడా కొద్దిపాటి ఒడిదొడుకులకు లోనయింది. ఉద్యోగాలు లేని కారణంగా కొందరు, ఆన్లైన్లో ఇంటినుంచి పని చేయడం అనే వెసులుబాటు వల్ల కొందరు పట్టణాలు, నగరాల నుంచి గ్రామాల బాట పట్టారు. సీమ కూడా భర్తతోపాటు తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లి ఊరికే కాలక్షేపం చేయలేదామె. గత ఏడాది నవంబరులో పుచ్చకాయ మొక్కలు నాటింది. సేంద్రియ పద్ధతిలో సాగు చేసింది. ఈ ఎండాకాలం నాటికి ఐదు టన్నుల తియ్యటి కాయలు కాశాయి. కాయలు కేజీ పాతిక లెక్కన అమ్మింది. అమ్మో! ఇంత ధరా!! అని నోరెళ్లబెట్టిన వాళ్లకు ‘ఇది షుగర్క్వీన్ వెరైటీ పుచ్చకాయ. సేంద్రియ ఎరువులతో పండించాను. తియ్యదనంలో తేడా ఉంటే అప్పుడు అడగండి. మరో కాయ కోసం రాకుండా ఉండగలరేమో చూడండి’ సున్నితంగా సవాల్ విసిరింది సీమ. ఆమె అన్న మాట నిజమే అయింది. కాయలన్నీ మంచి ధరకు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ నెలాఖరుకు ఖర్చులు పోను రెండు లక్షలు మిగిలాయి. పంట పండింది! ‘‘లాక్డౌన్ తర్వాత నేను, మా వారు మా సొంతూరు మీన్గోత్కు వెళ్లాం. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న ఉన్నప్పుడు పదిహేను ఎకరాలు సాగుచేసేవాడు. ఇప్పుడు మా అన్న, అమ్మ మా కుటుంబ వ్యవసాయం చూసుకుంటున్నారు. లాక్డౌన్లో మా ఉద్యోగాల్లో ఎదురైన ఒడిదొడుకులు గమనించిన మా అన్నయ్య ‘వ్యవసాయం ఇప్పుడు లాభసాటిగానే ఉంటోంది. ప్రయత్నించకూడదూ’ అని సలహా ఇచ్చాడు. సాగు చేయకుండా ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో కలుపుతీసి, రాళ్లు ఏరివేసి, మంచి ఎరువు వేసి సాగుకు అనువుగా మట్టిని గుల్లబరిచాం. నషీద్ అనే స్నేహితుడి సూచన ప్రకారం షుగర్ క్వీన్ రకం పుచ్చమొక్కలు నాటాం. మొత్తం ఐదు లక్షలు ఖర్చయింది. ఖర్చులు పోగా తొలి పంట ఆదాయం రెండు లక్షలు. ఇప్పుడు బెండకాయ, మిర్చి, ఉల్లిపాయ పంటలు వేస్తున్నాను. కోవిడ్ పూర్తిగా తగ్గిపోయి పూర్తిస్థాయిలో మా ఉద్యోగాలు గాడిన పడినా సరే... ఉద్యోగం చేస్తూనే వ్యవసాయాన్ని కొనసాగిస్తాను. కోవిడ్ చాలా నేర్పించింది. నేను వ్యవసాయం చేయగలనని నాకు తెలియచేసింది’’ అంటోంది సీమ. చదవండి: Oxygen Train: లోకో పైలట్ శిరీషకు ప్రధాని ప్రశంస -
Urban Eco Farming: వీకెండ్స్ వ్యవసాయం
ఫైనాన్స్ రంగంలో పని చేసే విశాఖకు చెందిన ప్రణయశ్రీకి సెంటు పంట భూమి కూడా లేదు. కానీ, వారం వారం ఆమె తన కుటుంబంతో సహా పొలానికి వెళుతుంటారు. ఆమె కుటుంబంలో ఎవరికీ వ్యవసాయం తెలియదు. కానీ, వారే తమ కుటుంబానికి కావలసిన కూరగాయలను సేంద్రియ విధానంలో పండించుకుంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..! అవును.. ‘అర్బన్ ఏకో ఫార్మింగ్’ వినూత్న ప్రయత్నంతో ప్రణయశ్రీకి ఇది సుసాధ్యమవుతోంది.. ఇలా..! నగరవాసులైన నవతరం చేస్తున్న ఆధునిక సహజ వ్యవసాయ పోకడ ఇది. మన కూరగాయలు మనం పండించుకోవడానికి మనకి ఎకరాల కొద్దీ పొలం ఉండనక్కర లేదు. కుటుంబానికి మూడు మడులు (600 చదరపు అడుగులు) చాలు. సేంద్రియ ఆహారంపైన, వీకెండ్స్‌లో మనకి నచ్చిన కూరగాయాల్ని పండించుకోవచ్చు. అది కూడా ఎటువంటి హానికరమైన ఎరువులు వాడకుండా.. సేంద్రియ విధానంలోనే. విశాఖ, విజయనగరం శివారు ప్రాంతాల్లో ఈ తరహా వ్యవసాయం ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది. ప్రస్తుతం సేంద్రియ ఆహారోత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. రసాయనాల్లేని ఆహారంపై ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారు. వీలున్నవారు తమ ఇళ్లపైనే ’సేంద్రియ ఇంటి పంటలు’ పెంచుకుంటున్నారు. అయితే, ఆ అవకాశం లేని వారు నగరానికి దగ్గరలో ఇంటిపంట మడులను అద్దెకు తీసుకొని వారాంతాల్లో సేంద్రియ సేద్యం చేస్తున్నారు. విశాఖకు చెందిన ఉషా గజపతిరాజు తమ అపార్ట్మెంట్ భవనంపైనే సేంద్రియ కూరగాయలు, పండ్లను అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఇంటిపంటలపై ఎందరికో శిక్షణ ఇస్తున్నారు. అయితే, సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉండి, ఇంటిపై సాగు చేసుకునే అవకాశం లేక సతమతమయ్యే వారి కోసం ఉష కొత్త ఆలోచన చేశారు. విజయనగరం జిల్లా బసవపాలెంలో 30 ఎకరాలలో ’అర్బన్ ఎకో ఫామ్స్’ను ప్రారంభించి, ప్రజలను భాగస్వాములు చేస్తున్నారు. కుటుంబానికి మూడు మడులు అద్దెకిచ్చి.. వారాంతాల్లోæ వారే వచ్చి కూరగాయలు పండించుకునేలా మెలకువలను నేర్పిస్తున్నారు. ఆ పంటల బాగోగులను అర్బన్ ఎకో ఫామ్స్ సిబ్బంది చూసుకుంటారు. వినియోగదారులకు మడులు చూసుకోవడానికి వెళ్లలేకపోతే కూరగాయలను ఆ సిబ్బందే డోర్ డెలివరీ చేస్తారు. నలుగురున్న ఒక కుటుంబానికి నెలకి సరిపడా కూరగాయలు పండించడానికి మూడు ’బెడ్లు’ (600 చదరపు అడుగుల స్థలంలో మూడు ఎత్తు మడులు) అవసరం అవుతాయి. ఇందులో బీర, బీట్ రూట్, క్యారెట్, ముల్లంగి, తోటకూర, గోంగూర, స్వీట్ కార్న్, ఆనప, వంగ, కాకర, బెండ, దోస, మిరప, ఉల్లి కాడలు.. ఇలా అనేక రకాలైన పంటలను ఆ మడుల్లో సాగు చేస్తారు. వీటితో పాటు కొందరు వినియోగదారుల కోసం జామ, బొప్పాయి మొక్కలు కూడా నాటుతున్నారు. తృప్తిగా పండించుకొని తింటున్నాం.. మన పరిసరాలన్నీ కాలుష్యమయమే. ఇది ఎవరూ కాదనలేని నిజం. నగరాలు, పట్ణణాలైతే ఇక కాలుష్యంతో కలిసి జీవనం సాగించాల్సిందే. తిండిలో అన్నీ కెమికల్సే. ఇది అనేక జబ్బులకు కారణం అవుతోంది. ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని గ్రహిస్తున్న చాలామంది సేంద్రియ విధానంలో పండిస్తున్న ఉత్పత్తులంటే ఆసక్తి చూపుతున్నారు. సాధారణ కూరగాయల ధరలతో పోలిస్తే సేంద్రియ విధానంలో పండిన కూరగాయల ధరలు ఎక్కువగా ఉండటం, పైగా అవి నిజంగానే ఆర్గానిక్ వెజిటబుల్సా కాదా? అనే అనుమానం కూడా వస్తుంది. అటువంటి సమయంలో నాకు ’అర్బన్ ఎకో ఫామ్స్’ కోసం తెలిసింది. వెంటనే నేను కొన్ని మడులను అద్దెకు తీసుకున్నాను. అందులో కొన్ని రకాల కూరగాయల్ని పెంచుతున్నాను. నేను నెలకి కూరగాయలకు ఎంత ఖర్చు పెడుతున్నానో, దీనికీ అంతే ఖర్చు అవుతుంది. పైగా సేంద్రియ విధానంలో కూరగాయాల్ని నేనే పండించుకుని తింటున్నాననే తృప్తి కలుగుతోంది. నాకు వ్యవసాయం కొత్తే అయినా, క్రమక్రమంగా తెలుసుకుంటూ.. సేంద్రియ వ్యవసాయంలో మెలకువలు నేర్చుకుంటున్నాను. – మనిష్, విశాఖపట్నం వారానికోసారి పొలానికి పిక్నిక్ అర్బన్ ఎకో ఫామ్ నగర శివారు ప్రాంతంలో ఉండటంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చాలామంది వీకెండ్స్ ఎంజాయ్ చేసేందుకు ఇటువంటి ప్రదేశాలకు రావాలనుకుంటారు. ఇప్పుడు ఎకో ఫామ్స్‌లో ఫ్లాట్స్ తీసుకోవడం వలన వీకెండ్స్ ఎంజాయ్ చేయడంతో పాటు సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. కానీ ఉద్యోగం చేసే నాకు వ్యవసాయం తెలియదు. ఎకో ఫామ్స్‌లో నాకిష్టమైన కాయగూరల్ని పండించుకుంటున్నాను. నా కుటుంబంతో వారం, వారం ఇక్కడికి పిక్నిక్లా వచ్చి, వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. మట్టితోనూ, మొక్కలతోనూ సమయాన్ని గడపడం ఆనందంగా ఉంది. ఇప్పుడు మేము పండించిన కాయగూరల్నే ఇంటిల్లపాదీ తింటున్నాం.’’ – డాక్టర్ జయ, విశాఖపట్నం చేస్తూ నేర్చుకోవడం..! నిజానికి నేను వత్తి రీత్యా డైటీషియన్‌ని. ఖాళీ సమయాల్లో టెరస్ర్ ఫార్మింగ్, చెత్త నుంచి కంపోస్టు తయారు చేయటం నేర్చుకున్నాను. ఈ క్రమంలో ప్రజలు సేంద్రియ ఉత్పత్తులపై చూపిస్తున్న ఆసక్తిని గమనించాను. అయితే, మార్కెట్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పేరుతో లభించేవన్నీ నిజమైన ఆర్గానిక్ పదార్థాలు కావని భావించి.. నేనే స్వయంగా సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో ఆసక్తి ఉన్న వారిని భాగస్వాములను చేశాను. ఒక్కొక్కరికి ఫ్లాట్ల చొప్పున కొంత స్థలం కేటాయించి (గరిష్టంగా 600 అడుగులు) వారికి కావల్సిన కూరగాయలు పండిస్తాం. అలా పండించిన వాటిని వారానికోసారి వారి ఇంటికే స్వయంగా అందిస్తాం. విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు సాగు చేసే విధానాన్ని ఫోటోలు తీసి కస్టమర్ల సెల్ఫోన్లకు పంపిస్తాను. ఆసక్తి ఉన్న వినియోగదారులు కావాలంటే వారే తమ ఫ్లాట్లలో పంటలు పండించుకుంటారు. చాలామంది వీకెండ్లో వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంపై అవగాహన లేని వారికి మేం ఇక్కడ నేర్పిస్తాం. లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో ఇక్కడ ఫార్మింగ్ సాగుతుంది. ఈ ఎకో ఫార్మ్‌లో 25 రకాలైన కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. వీటిలో వినియోగదారులు తమ అభిరుచి మేరకు ఏవైనా 12 రకాలను ఎంచుకొని, వారి ఫ్లాట్స్‌లో పండించుకోవచ్చు లేదా మేమే వారి కోసం పండిస్తాం. ఫార్మింగ్ మొదలు పెట్టిన 40 రోజుల నుంచి ప్రతి వారం వినియోగదారుడికి 8 కిలోలు.. వారు పండించుకున్న కూరగాయలను, ఆకుకూరలను బాక్సులలో పెట్టి అందిస్తాం. 600 అడుగుల స్థలాన్ని అద్దెకివ్వడం నుంచి ఇంటికి కూరగాయలు అందించడం వరకు అన్ని మేమే చేస్తాం. వారి స్థలంలో వేసుకునే మొక్కలు, విత్తనాలు, సేంద్రియ ఎరువులన్నీ మేమే సమకూరుస్తాం. ఆవు పేడ, మూత్రం, మొక్కల ఆకులతో తయారు చేసిన ఎరువులే వాడతాం. వీకెండ్స్, హాలీడేస్‌లో ఇక్కడి వచ్చి స్వయంగా పండించుకోవడం వారికి ఆనందాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం వారికి మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది. – ఉషా గజపతిరాజు, (9949211022) ‘అర్బన్ ఏకో ఫార్మింగ్’ నిర్వాహకురాలు – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం -
మనిషి లేని ‘నిజాయితీ దుకాణం’.. ఎక్కడ ఉందంటే?
ప్రధాన రహదారి పక్కనే చిన్న షెడ్డులో తాజా సేంద్రియ కూరగాయాలతో ‘నిజాయితీ దుకాణం’ వినియోగదారులకు దృష్టిని ఆకట్టుకుంటుంది. ఆ షెడ్డులో ఎవరూ ఉండరు. ఏ కూరగాయల ధర ఎంత అన్నది బోర్డుపై రాసి పెట్టి ఉంటుంది. రోడ్డున వెళ్లే వారు తమకు అవసరమైన కూరగాయలను తీసుకొని.. వాటికి తగినంత డబ్బును షెడ్డులో ఉన్న ఓ కవర్లో వేస్తారు. లేదంటే ఫోన్‌పే, గుగూల్‌పే ద్వారా చెల్లిస్తుంటారు. ఇంతకీ ఈ దుకాణం ఎవరిది, మనుషులపై ఇంత నమ్మకం ఉంచిన ఆ మనిషి ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి. వృత్తులన్నిటికీ తల్లి వంటిది వ్యవసాయం. కరోనా ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన నేపథ్యంలో.. ఇతర వృత్తుల్లో స్థిర పడిన వాళ్లు ఇప్పుడు తిరిగి పల్లెలకు చేరుకొని వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేపడుతున్నారు. ఈ కోవకే చెందుతారు ఎడ్మల మల్లారెడ్డి. ప్రైవేటు పాఠశాల నడిపే మల్లారెడ్డి మరల సేద్యంలోకి వచ్చారు. తన ఏడెకరాల భూమిలో ప్రణాళికాబద్ధంగా సమగ్ర వ్యవసాయ విధానం చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు. కూరగాయల నుంచి కుందేళ్ల వరకు, కొత్తిమీర నుంచి అంజీర పండ్ల వరకు పండిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేయటమే కాకుండా, ఆ పంటను వినూత్నంగా ‘నిజాయితీ రైతు దుకాణం’ ఏర్పాటు చేసి వినియోగదారులకు సరసమైన ధరలకు విక్రయిస్తున్నారు. స్ఫూర్తిదాయకమైన ఈ ‘రైతు ఉపాధ్యాయుడి’ అనుభవాలను తెలుసుకుందాం.. అంజీర తోటలో రైతు మల్లారెడ్డి ఎడ్మల మల్లారెడ్డి స్వగ్రామం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్. కోవిడ్‌తో ఏడాది క్రితం నుంచే పాఠశాలలు మూతపడ్డాయి. ఎప్పుడు తెరిచే పరిస్థితులు వస్తాయో తెలియదు. ఆయనది వ్యవసాయ కుటుంబం. ఏడెకరాల సొంత వ్యవసాయ భూమి ఉంది. అప్పటి వరకు కౌలుకు ఇచ్చిన ఆ భూమిలో ఇక తానే వ్యవసాయం చేస్తానని గ్రామస్థులకు చెప్పాడు. అయితే, ‘ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న మాకే గిట్టుబాటు కావడం లేదు, నీవేమి వ్యవసాయం చేస్తావు, స్కూల్‌ను బాగా నడిపించుకో..’ అని మొహం మీదే చెప్పారు. అయితే, మల్లారెడ్డి సవాలుగా తీసుకున్నారు. అందరిలాగ వ్యవసాయం చేస్తే మన ప్రత్యేకత ఏంటి, సాధారణ రైతులకు భిన్నంగా సేంద్రియ పద్ధతిలో సమగ్ర వ్యవసాయం చేసి అదాయం పొందాలనుకున్నాడు. కసితో వ్యవసాయానికి శ్రీకారం చుట్టి, ప్రస్తుతం అందరికీ ఆదర్శం అయ్యారు. ప్రణాళికాబద్ధంగా సాగులోకి.. ఏడు ఎకరాల భూమిని ఐదారు ప్లాట్లుగా విభజించి, డ్రిప్ ఏర్పాటు చేసుకుని, చుట్టూ కంచే వేశారు. ఒక ప్లాట్‌లో– కోళ్లు, బాతులు, సీమ కోళ్లు.. రెండో ప్లాట్‌లో– జామ, బొప్పాయి, అరటి తోట.. మూడో ప్లాట్‌లో– మామిడి, సీతాఫలం మొక్కలు.. నాలుగో ప్లాట్‌లో– అంజీర, ఆపిల్ బెర్.. ఐదో ప్లాట్‌లో– కూరగాయ మొక్కలు పెంచుతున్నారు. బెంగళూర్, హైద్రాబాద్ నర్సరీల నుంచి పండ్ల మొక్కలు తెప్పించి.. పశువుల ఎరువు, గొర్రెల ఎరువు వేసి నాటారు. పొట్ల, బీర, సొర, కాకర, నేతిబీర, దోస, మునగ, వంకాయ వంటి 25 రకాల దేశీ రకాల కూరగాయ విత్తనాలను హైద్రాబాద్ నుంచి తీసుకువచ్చి సాగు చేస్తున్నారు. ఏడెకరాల్లో గుంట భూమి ఖాళీ లేకుండా దాదాపు 2 వేల రక రకాల పండ్లు, కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. పంటలన్నిటినీ పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పండిస్తుండటం, జగిత్యాలకు కేవలం 5 కి.మీ. దూరంలోనే ఉండటంతో, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ కస్టమర్లుగా నేరుగా తోట వద్దకే వచ్చి పండ్లు, కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. ఏటీఎం తరహాలో 365 రోజులు తోటలో కూరగాయలు, పండ్లను అందుబాటులో ఉంచుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు మల్లారెడ్డి. డిమాండ్‌ను బట్టి నాటు కోళ్లను పెంచుతూ, బాతులు, సీమ కోడి గుడ్లు అమ్ముతూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. గొర్రెల పెంపకం, చేపల పెంపకం ప్రారంభించబోతున్నారు. ఆ కుక్కలంటే కోతులకు హడల్! మల్లారెడ్డి తోటలో ఎక్కువగా పండ్ల మొక్కలు ఉండటంతో కోతులు ఎక్కువగా వస్తున్నాయి. పొలంలో రెండు ‘బాహుబలి’ కుక్కలు పెంచుతున్నారు. రాత్రింబవళ్లు అవే కాపాలా కాస్తుంటాయి. కోతులు వస్తే ఈ కుక్కలు వాటిని ఉరికిస్తుంటాయి. దీంతో, ఈ తోటలోకి కోతులు వచ్చే పరిస్థితి లేదు. అలాగే, పట్టణానికి దగ్గరలో ఉండటంతో తల్లితండ్రులతో కలిసి పిల్లలు వచ్చేలా, మామిడి చెట్ల మధ్యలో పిల్లలు ఆటలాడుకునే వస్తువులను ఏర్పాటు చేశారు. ‘అగ్రి టూరిజం’ దృష్టితో తోటను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ నిజాయితీ దుకాణం! ప్రధాన రహదారి పక్కనే ఉన్న తన తోటలో పండిన కూరగాయలను తోట దగ్గరే ‘నిజాయితీ దుకాణం’ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. చిన్న షెడ్డు వేశారు. అందులో కూరగాయలు పెట్టి, ఏ కూరగాయల ధర ఎంత అన్నది బోర్డుపై రాసి పెడుతుంటారు. ఆ షెడ్డులో ఎవరూ ఉండరు. రోడ్డున వెళ్లే వారు తమకు అవసరమైన కూరగాయలను తీసుకొని.. వాటికి తగినంత డబ్బును షెడ్డులో ఉన్న ఓ కవర్లో వేస్తారు. లేదంటే ఫోన్‌పే, గుగూల్‌పే ద్వారా చెల్లిస్తుంటారు. కోళ్లు, బాతు గుడ్లను కూడా తోటలోనే అమ్ముతుంటారు. రోజుకు రూ. 3 – 4 వేల వరకు ఆదాయం పొందుతూ మల్లారెడ్డి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సీనియర్ రైతులకే సేంద్రియ సమగ్ర సేద్య పాఠాలు నేర్పుతున్నారు! నిజాయితీ + నమ్మకం = విజయం! అందరిలాగా చేస్తే మనల్ని ఎవరూ గుర్తించరు. ఆరోగ్యదాయకంగా, వినూత్నంగా చేయాలి, దాని ద్వారా మనం ఆదాయం పొందాలి. వినియోగదారుల మనసులను చూరగొనాలి. నిజాయితీ, నమ్మకంతో చేస్తే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. తొలుత కొన్ని కష్టాలు తప్పవు. కష్టాలను అధిగమిస్తే విజయాలు చేకూరతాయని నేను నమ్ముతా. సమగ్ర సేంద్రియ వ్యవసాయంలో తృప్తితో పాటు మంచి ఆదాయమూ పొందుతున్నాను. – ఎడ్మల మల్లారెడ్డి (99598 68192), లక్ష్మీపూర్, జగిత్యాల జిల్లా -
Mohanlal: రైతుగా మారిపోయిన మలయాళ సూపర్ స్టార్
నటుడిగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కానీ ఇప్పుడు అతడు నటనలో కాకుండా మరో పనిలో లీనమయ్యాడు. లాక్డౌన్లో తన ఇంటి వద్ద సేంద్రీయ పంటలు పండించాడు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో ఆయన మొక్కలకు నీళ్లు పడుతూ, వాటి సంరక్షణ చూస్తూ రైతుగా మారిపోయాడు. సోరకాయలు, మిరపకాయలు, టమాటలు, వంకాయలు, బీరకాయలు, కాకరకాయలు.. ఇలా చాలా రకాల కూరగాయలతో పాటు ఆకుకూరలను పండించినట్లు తెలుస్తోంది. వాటన్నింటినీ అతడే స్వహస్తాలతో తెంపుతుండటం విశేషం. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తన టీమ్‌తో కలిసి ఈ వీడియోను టీజర్ మాదిరిగా కట్ చేయించి రిలీజ్ చేశాడు మోహన్ లాల్. ఈ సందర్భంగా అందరూ బాల్కనీల్లో లేదా టెర్రస్ల మీద నచ్చిన కూరగాయలను పండించుకోవచ్చని సూచించాడు. View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) ఇదిలా వుంటే ఆయన నటించిన 'దృశ్యం 2' ఈ మధ్యే ఓటీటీలో విడుదలై అద్భుత స్పందన రాబట్టుకుంది. ఈ క్రమంలో 'ఆరాట్టు' అనే మరో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న 'మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ' చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్ (మోహన్‌లాల్ తనయుడు) కీలక పాత్రలు పోషించారు. 16వ శతాబ్దానికి చెందిన నేవల్ కమాండర్ కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చదవండి: మోహన్‌లాల్ కూతురిని ఆశీర్వదించిన బిగ్ బీ -
ప్రకృతి వ్యవసాయంపై బ్లూమ్ అధ్యయనం: కురసాల
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలోనూ రైతులు గతేడాది కంటే అధిక దిగుబడి సాధించారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏపీ ప్రజా నిర్వాహక ప్రకృతి వ్యవసాయంపై బ్లూమ్ అధ్యయనం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కన్నబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా కలిగే ఆరోగ్య లాభాలపై అధ్యాయనం చేసేందుకు, రాష్ట్ర ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఎంవోయూ తీసుకున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు మరింత ఆదాయం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారని, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో దిగుబడి పెంచేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
కొత్త బంగారు లోకం.. సతత హరిత పంటలు
మానవాళికి, పశు పక్ష్యాదులకు ప్రాణాధారమైన నేల తల్లి ఆచ్ఛాదన లేక మండుటెండల్లో అల్లాడిపోతోంది. వాతావరణంలో పెరిగిపోతున్న తాపం ధాటికి జీవాన్ని కోల్పోతోంది. ఇటువంటి సంక్షోభ కాలంలో సాధారణ పేద రైతులు ఆకుపచ్చని పంటలతో భూతల్లికి వస్త్రం కప్పుతున్నారు. ఏడాది పొడవునా ప్రతి రోజూ పొలం అంతటా పచ్చని పంటలు పండిస్తున్నారు. సాంత్వన పొందిన ఆ తల్లి ప్రేమతో ఇస్తున్న కూరగాయలు, ధాన్యాలను కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరిస్తూ ఆనందంగా ఉన్నారు. అపురూపమైన ఈ రైతులు నీటి వసతి ఉన్నవారో, సుభిక్షమైన ప్రాంతవాసులో అనుకుంటే పొరపాటు. ఎడారిగా మారిపోతున్న అనంతపురం జిల్లాలో! అదికూడా.. వర్షాధార వ్యవసాయ భూముల్లో!! ‘భూమాతను పునరుద్ధరించుకుందాం’ అన్న నినాదంతో ఈ నెల 22న ‘ధరిత్రీ దినోత్సవం’ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా.. కరువు సీమలో ఎండాకాలంలోనూ పచ్చని పంటలతో భూమాతను తమ గుండెలకు హత్తుకుంటున్న కొందరు రైతుల సుసంపన్నమైన అనుభవాల సమాహారమే ఈ కథనం. ప్రకృతి వ్యవసాయానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం’లో ఒకానొక సరికొత్త ఆవిష్కరణ ‘వర్ష రుతువు కన్నా ముందుగానే విత్తనాలు విత్తుకోవటం’. దీన్నే ఆంగ్లంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అంటారు. ఈ పద్ధతిలో ఏడాదిలో 365 రోజులూ పంటలతో భూమిని కప్పి ఉంచడం.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు చల్లకుండా ఉండటం వల్ల భూమాత తిరిగి జీవాన్ని సంతరించుకుంటున్నది. ఏడాది పొడవునా ఆకుపచ్చని పంటలతో పి.ఎం.డి.ఎస్. పంట భూములు కళకళలాడుతుండటం విశేషం. సాధారణంగా నీరు నదుల్లోనే ఉంటుందనుకుంటాం. కానీ, నదుల్లో కన్నా పది రెట్లు ఎక్కువ నీరు గాలిలో ఉంది. గాలిలో తేమ రూపంలో నీరుంది. ఆ తేమను గ్రహించి నేలను చెమ్మగిల్లేలా చేస్తూ వర్షం లేని కాలాల్లోనూ పంటలు నిలిచేలా.. సహజసిద్ధంగానే ఏడాది పొడవునా పచ్చగా ఉండేలా చేయటమే.. వినూత్నమైన పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగు పద్ధతి విశిష్టత. ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ సాయిల్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ యన సిద్ధాంతం మూలాధారంగా ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. దీని ద్వారా కరువును జయించడం, స్థానికంగా ఆహార భద్రతను కల్పించడమే కాకుండా.. భూతాపోన్నతిని సైతం తగ్గించే అవకాశం ఉందని డా. యన స్పష్టం చేస్తున్నారు. తమకున్న పొలంలో కొద్దిపాటి విస్తీర్ణాన్ని మాత్రమే చిన్న, సన్నకారు, పేద రైతులు.. ముఖ్యంగా మహిళా రైతులు పి.ఎం.డి.ఎస్. పద్ధతిలోకి మార్చుతున్నారు. ఆ పొలాలు ప్రస్తుత ఎర్రని ఎండల్లోనూ పచ్చగా అలరారుతూ కూరగాయలను అందిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. తమ పంట పొలాల్లో ఎప్పుడూ పచ్చగా ఉండే ‘ఆహారపు అడవి’ని సృష్టిస్తున్నారు! గత మూడేళ్లుగా ఒక్క అనంతపురం జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అంతటా కొంత మంది రైతులు పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు. వీరి కుటుంబాలకు ఏడాది పొడవునా కూరగాయలు వంటి పంటలతో అమృతాహారం అందుతున్నది. తినగా మిగిలిన కూరగాయలను అమ్ముకుంటూ చెప్పుకోదగ్గ ఆదాయాన్ని సైతం సమకూర్చు కుంటున్నారు. పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగు అంటే..? సాధారణంగా వర్షం పడి భూమి పదును అయిన తర్వాత దున్ని విత్తనం వేస్తారు రైతులు. అయితే, ఈ పద్ధతిలో రైతులు చేస్తున్నదేమిటంటే.. వర్షం రాక మునుపే, ఎండాకాలంలోనే, నేల పొడిగా ఉన్నప్పుడే.. ఎకరానికి 600 కిలోల ఘన జీవామృతం వేస్తున్నారు.. దుక్కి చేసి నవధాన్య విత్తనాలకు మట్టి, పేడతో లేపనం చేసి విత్తన బంతులు తయారు చేసి చల్లుతున్నారు. ఆ పైన వేరుశనగ కాయల పొట్టు, కంది పొట్టు, శనగ పొట్టు వంటి పంట వ్యర్థాలను రెండు, మూడు అంగుళాల మందాన వేస్తున్నారు. భూతల్లికి ఆచ్ఛాదనగా కప్పుతున్నారు. గాలిలో ఉన్న తేమను ఈ ఆచ్ఛాదన ఒడిసిపట్టి ఘనజీవామృతానికి, మట్టి కణాలకు అందిస్తోంది. ఆ విధంగా ప్రకృతి సాగు ద్వారానే వాతావరణంలోని తేమను ఒడిసిపట్టి పంట పొలాన్ని సస్యశ్యామలం చేస్తున్న వైనం ప్రపంచానికే ఆదర్శప్రాయం. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగుదారులందరికీ ‘సాక్షి సాగుబడి’ జేజేలు పలుకుతోంది! – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ మెట్ట రైతులందరికీ ఈ సాగు పద్ధతిని నేర్పిస్తాం! ప్రకృతి వ్యవసాయం, వర్షానికి ముందే విత్తనాలు వేయటం వంటి సరికొత్త పద్ధతులను అనుసరించడం వల్ల ఎకరం, అరెకరం భూములను వర్షాధారంగా సాగు చేసే రైతులు కూడా ఏడాది పొడవునా అనేక రకాల కూరగాయలు పండించగలుగుతున్నారు. వారు తినగా మిగిలిన కూరగాయలు అమ్మి రూ. 60 వేల నుంచి రూ. 1,50,000 వరకు నికరాదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు, భూసారం పెంపుదలకు, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. ఏడాదంతా పొలాన్ని పంటలతో పచ్చగా ఉంచుతున్న పుష్పావతి, చంద్రకళ వంటి రైతులు ఏపీలో ప్రస్తుతం 110 మంది ఉన్నారు. 2021–22 సంవత్సరంలో కనీసం 1,500 మంది రైతులతో 365 రోజులూ పచ్చని పంటలు ఉండేలా ప్రకృతి వ్యవసాయం చేయిస్తాం. మున్ముందు రాష్ట్రంలో మెట్ట రైతులందరికీ ఆహార, ఆదాయ, పర్యావరణ భద్రతను కల్పించే ఈ పద్ధతిని నేర్పించాలన్నది మా లక్ష్యం. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షులు, ఏపీ రైతు సాధికార సంస్థ vjthallam@gmail ఎడారిలో పంటల ఒయాసిస్సు పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సేద్యంలో అరెకరంలో 16 పంటలు పండిస్తున్న బండారి పుష్పావతి మండు వేసవిలోనూ పైరు పచ్చని నిరంతర వర్షాధార సేద్యం 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అరెకరంలో రూ. 61,818ల నికరాదాయం వచ్చే ఒకటి, రెండు నెలల్లో రానున్న మరో రూ. 26,800 ఆదాయం రాయలసీమ... అందులోనూ... అనంతపురం జిల్లా... కరువుకు ఓ చిరునామా... అలాంటి జిల్లాలో నీరు చుక్క లభ్యం కాని గుండాల తాండా క్లస్టర్‌లోని ‘గుండాల’ ఓ గిరిజన గ్రామం. ఆ గ్రామంలోని కోడలు పిల్ల బండారి పుష్పావతి. ఆమె భర్త పేరు డేవిడ్... ఆమె చదువుకున్నది 10వ తరగతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం’ కార్యక్రమంలో గ్రామస్ధాయి కార్యకర్తగా ఆమె గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆమె అత్త వారి తరపున లెక్కకయితే స్వంతంగా 6 ఎకరాల మెట్ట భూముంది. కానీ ఎప్పుడూ లక్ష రూపాయలకు మించి ఆదాయం చూడలేదు.. బ్రతుకు బండి సాఫీగా సాగాలంటే ఏదో రూపంలో బ్రతుకు తెరువు వెదుక్కోవలసిందే. ఇటు ఉపాధి హావిూ పనులతోపాటు పెద్ద రైతుల వద్ద కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితులలో ప్రకృతి వ్యవసాయం మార్గదర్శనం చేసింది. ఈ విభాగం జిల్లా మేనేజర్‌గా చేస్తున్న లక్ష్మానాయక్ ఆమెలో ప్రేరణ కలిగించారు. ‘వర్ష రుతువు రాక ముందే పొలంలో విత్తనాలు చల్లుకొనే’ ఒక వినూత్న పద్ధతిని పరిచయం చేశారు. ఒక వైపు ఆదాయంతోపాటు మరో వైపు వందలాది సందర్శకుల అభిమానాన్ని కూడా స్వంతం చేసుకున్నారు పుష్పావతి. 2018లో అర ఎకరాలో దుక్కి చేసి ప్రారంభించిన పచ్చని పంటల సాగు మూడేళ్ల తర్వాత ఇప్పుడు కూడా విరామ మెరుగని దిగుబడులను అందజేస్తుంటే ఆశ్చర్యమే కదా! నేటికీ ఆ పొలంలో 16 రకాల పంటలు అప్పుడే వర్షంలో తడిసి కేరింతలు కొడుతున్న పసి పిల్లల్లా మిలమిలా మెరిసిపోతున్నాయి. వంగ, టమాట, మిరప, క్యాబేజీ, ముల్లంగి, అలసందలు, క్లస్టర్ బీన్స్, గోంగూర, తోటకూర, పాలకూర, కాకర, వేరుశనగ, బంతి పంటలు మరో ఒకటి, రెండు నెలలు దిగుబడులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. బహువార్షిక రకాలయిన కంది, ఆముదం అయితే ఒక సంవత్సరంలోనే మూడు దఫాలు దిగుబడులిచ్చాయి. తిండి గడవక ప్రతి ఏటా వలస పోయే ఆ కుటుంబం వలస మాటే మర్చిపోయింది. వచ్చిన దిగుబడిలో తమ కుటుంబం యావత్తూ తినగా మిగిలిన పంట అమ్మడం వలన వచ్చిన డబ్బులతో ఇతర ఖర్చులు కూడా గట్టెక్కుతున్నాయని చెబుతున్న పుష్పవతి కళ్ళల్లో ఏదో కొట్టొచ్చిన మెరుపు. ఆ ఆనందంతో మొత్తం దిగుబడులు, ఖర్చులు టకటకా చెప్పేశారు. ఈ అరెకరంలో పెరుగుతున్న కూరగాయ పంటల ద్వారా 2020 ఏప్రిల్ నుంచి జూలై వరకు వచ్చిన మొత్తం ఆదాయం రూ. 15,178. ఖర్చులు పోను నికరాదాయం రూ.10,738. అదే సంవత్సరం ఖరీఫ్‌లో మొత్తం రూ. 38,540ల దిగుబడి రాగా, ఖర్చులు పోను రూ. 32,630ల నికరాదాయం వచ్చింది. ఇంకా రబీలో ఖర్చులు పోను రూ.18,450 నికరాదాయం చేతికందింది. ఇప్పటి వరకు గత ఏడాదిలో రూ. 61,818 నికరాదాయం వచ్చింది. మరో రెండు నెలల్లో వంగ మీద రూ.9 వేలు, కంది మీద రూ. 3 వేలు, ఆముదం మీద రూ. 4 వేలు, క్యాబేజీ మీద మరో రూ. 4 వేలు, ముల్లంగి మీద రూ. 4 వేలు, గోరుచిక్కుడు మీద రూ. 400, టమాటా మీద రూ. 2 వేలు, బీర, గోంగూర పంటల ద్వారా రూ. 400 (మొత్తం మరో రూ. 26,800) ఆదాయం వస్తుందని పుష్పావతి ధీమాగా చెప్పారు. ఇంత ఆదాయం తీసుకుంటున్న ఈమె అరెకరం పి.ఎం.డి.ఎస్. పొలానికి నీటి వసతి లేదు. అంతా వర్షాధారమే. 4 అంగుళాల మందంలో ఆచ్ఛాదనగా వేసిన శెనక్కాయల పొట్టుతోపాటు నెలకు రెండు సార్లు 100 లీటర్లు చొప్పున ద్రవ జీవామృతాన్ని క్రమం తప్పకుండా పంటలకు పుష్పావతి అందిస్తున్నారు. అత్యవసర పరిస్ధితులలో గత మూడేళ్లలో కేవలం 5 సార్లు ట్యాంకర్లతో (బోదెలకు ఇరువైపులా వున్న నీటి కాలువల ద్వారా) పంట రక్షక తడులు అందించారు. పుష్పావతి సేద్యం గురించి తప్పక తెలుసుకోవలసిన మరో విశేషం వుంది. వీళ్ళకున్న 6 ఎకరాల భూమిలో అరెకరంలో పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగు మినహాయిస్తే మిగిలిన 5.5 ఎకరాలలో గత ఖరీఫ్‌లో ఏక పంటగా వేరుశనగ వేశారు. ఖర్చులు పోను నికరంగా మిగిలింది కేవలం రూ. 90 వేలు మాత్రమే. అంటే ఒక అరెకరంలో పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగు ద్వారా తీసుకున్న నికరాదాయం 5.5 ఎకరాల్లో వచ్చిన నికరాయంతో దాదాపుగా సమానమన్నమాట. వచ్చే నెలలో మరో అరెకరాలో 365 రోజులు కొనసాగే పంటల సాకు శ్రీకారం చుడతానని చెబుతున్నారు పుష్పావతి. ఈమె పొలానికి ఆనుకొని వున్న పొలం రైతులకు బోరుబావి వున్నప్పటికీ గత ఖరీఫ్‌లో వేరుశనగను సాగు చేసి, రబీలో భూమిని ఖాళీగా వుంచేశారు. అయితే, పుష్పావతి పొలంలో వస్తున్న మార్పులను గమనిస్తున్నారు. ఆచ్ఛాదన చల్లదనానికి భూమిపైకి వస్తున్న వానపాములను, పంట దిగుబడులను చూసి పక్క రైతులు తాము కూడా పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సేద్యం చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. మండు వేసవిలోనూ పచ్చని పంటలతో నేలతల్లికి రక్షణ కల్పిస్తూ.. తమ కుటుంబానికి ఆహార, ఆదాయ భద్రతను అందిస్తున్న చల్లని తల్లి పుష్పావతి (91821 75892)కి జేజేలు. అరెకరంలో రూ.79 వేల నికరాదాయం లీడ్ ఫార్మర్ చంద్రకళ అనుభవం అరెకరంలో పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సేద్యం చేపట్టిన పరిశపోగుల చంద్రకళ దంపతులు గత ఏడాదిలో తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు పండించుకోవడమే కాకుండా రూ. 79 వేల నికరాదాయాన్ని కూడా పొందారు. అనంతపురం జిల్లా పూడేరు మండలం జయపురానికి చెందిన చంద్రకళ ప్రకృతి వ్యవసాయ విస్తరణ విభాగంలో లీడ్ ఫార్మర్‌గా పనిచేస్తూ ఆదర్శప్రాయమైన సేద్యం చేస్తున్నారు. తమకున్న ఎకరం డి.పట్టా మెట్ట భూమిలోని అరెకరంలో గత ఏడాది ఏప్రిల్‌లో పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సేద్యం ప్రారంభించారు. ప్రభుత్వ సహకారంతో తీసిన బోరు బావికి ఉద్యాన శాఖ బిందు సేద్య పరికరాలను మంజూరు చేసింది. సజ్జ, జొన్న, కొర్ర, నువ్వులు, ఆవాలు, ధనియాలు, అలసందలు, పెసలు, ఆనప, చిక్కుడు, కాకర, బీర, బంతి, ఆముదం, ఉలవలు, కందులు, మినుములు (ఉద్దులు), వేరుశనగ సాగు చేస్తున్నారు. చివరి దుక్కిలో 150 కేజీల ఘనజీవామృతం, 500 కేజీల టైప్2 ఘనజీవామృతం వేసుకొని కలియదున్నారు. 4 అడుగుల వెడల్పుతో బోదెలు (మట్టి పరుపులు) వేసుకొని, ఇరువైపులా 2 అడుగుల వెడల్పున కాలువలు తీశారు. ప్రతి 4 నెలలకొకసారి రిలే పంటలు వేసిన ప్రతి సారీ 150 కేజీల చొప్పున ఘనజీవామృతం చల్లుకున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని మొక్కంతా తడిసి క్రిందకు జారేలా క్రమం తప్పకుండా పిచికారీ చేశారు. 3 ట్రాక్టర్లతో తెచ్చిన వేరుశనగ పొట్టును పొలమంతా 4 అంగుళాల ఎత్తులో సమతలంగా ఆచ్చాదనగా పరిచారు. ఈ ఆచ్ఛాదన వలన నీటి అవసరం తగ్గడంతోపాటు.. వేరుశనగ పొట్టు కొద్దికొద్దిగా కుళ్ళుతూ మొక్కలకు సారాన్ని అందించడం వలన పంటలన్నీ ఆరోగ్యంగా నిగనిగలాడుతు న్నాయి. బీజ రక్షతో విత్తనశుద్ధి చేసి.. అలసంద, జొన్న పంటలను సరిహద్దు పంటలుగా వేసుకున్నారు. బంతి, ఆముదం పంటలను ఎర పంటలుగా నాటారు. పంటల వైవిధ్యం పాటించారు. ఒక వరుసలో 45 రకాల పంటలుండేలా జాగ్రత్త తీసుకున్నారు. వంగ తరువాత టమోటా, ఆ తరువాత మిరప, క్యాబేజీ మళ్ళీ వంగ.. ఈ విధంగా బహుళ పంటలు పొలమంతా వేశారు. దోమపోటు రాకుండా నీమాస్త్రంను, పూత రాలకుండా పుల్లటి మజ్జిగ పిచికారీ చేశారు. రసాయన అవశేషాలు లేని ముల్లంగి దుంపల కూర తినడం వలన తన భర్తకు వచ్చిన మొలల వ్యాధి శస్త్రచికిత్స చేయకుండానే నయమయ్యిందని చంద్రకళ ఆనందంగా చెప్పారు. వచ్చే ఖరీఫ్‌లో ఆముదం, క్యాబేజీ, క్యారట్, బీట్రూట్ పంటలు వేసుకొని రాబోయే సంవత్సరం మరింత ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తానని చంద్రకళ (99637 17844) ఆశాభావంతో ఉన్నారు. (ఇన్పుట్స్ : డా. డి.పారినాయుడు, జట్టు ట్రస్టు) -
ప్రకృతి సేద్యం: పల్లెబాట పట్టిన సాఫ్ట్వేర్ యువ జంట
ఏడేళ్ళ క్రితం ఈ యువ దంపతులు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. మంచి జీతం, మహానగరంలో నివాసం.. ఇవేమీ వారికి తృప్తిని ఇవ్వలేదు. సహోద్యోగి కుమార్తె సహా బంధు మిత్రులలో కొందరు కేన్సర్ మహమ్మారి బారిన పడ్డారు. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే అందుకు మూల కారణమని గ్రహింపు కలిగింది. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి స్ఫూర్తినిచ్చి దారిచూపింది. అలా.. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి ఆరోగ్యవంతమైన జీవనాన్ని వెతుక్కుంటూ స్వగ్రామానికి మకాం మార్చారు. సమీకృత ప్రకృతి వ్యవసాయం చేపెట్టి విజయపథంలో ముందడుగు వేస్తూ జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకున్నారు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకూర్మపల్లి గ్రామం ఓ మారుమూల పల్లెటూరు. అయిదు వందల జనాభా కూడా లేని ఈ పల్లెటూరు పేరు ఇటీవల జాతీయ స్థాయిలో వినిపించింది. గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మావురం లక్షా్మరెడ్డి కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. కుమారుడు మల్లికార్జున్ రెడ్డి బీటెక్ చదివి హైదరాబాద్‌లో స్టాప్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేశారు. ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన సంధ్యతో 2010లో వివాహం జరిగింది. ఎంబీఏ పూర్తి చేసిన సంధ్య కూడా మూడేళ్ళు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున్‌రెడ్డి సహోద్యోగి కుమార్తెకు కేన్సర్ జబ్బుపాలైంది. అదేవిధంగా తమ గ్రామానికి చెందిన వారు ముగ్గురికి కేన్సర్ వచ్చింది. ఇతరత్రా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారెందరో. తమ సహాయం కోసం ఊరి నుంచి వచ్చిన వారితో పాటు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు.. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే ఈ జబ్బులకు మూల కారణం అన్న నిశ్చితాభిప్రాయం కలిగింది. అదే కాలంలో పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానం కూడా మల్లికార్జున్‌రెడ్డి, సంధ్య దంపతులను ప్రభావితం చేసింది. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి స్వగ్రామంలో ప్రకృతి సేద్యం చేపట్టారు. విద్యార్థినులతో మల్లికార్జునరెడ్డి తినేవన్నీ సేంద్రియంగా పండించుకున్నవే.. మల్లిఖార్జున్ రెడ్డి, సంధ్యారెడ్డి సొంత భూమి 14 ఎకరాల్లో సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించారు. ఇంటికి అవసరమైన ఆహార పదార్థాలన్నిటినీ రసాయనాలు లేకుండా పండించుకుంటున్నారు. ధాన్యంతో పాటు, నూనెల కోసం పల్లీలు, నువ్వులు, పెసర, కంది పప్పులు, మిర్చి, ఉల్లి, ఎల్లి గడ్డలు, కొత్తిమీర, ఆవాలు, అల్లం వంటి పంటలను తగిన మోతాదులో సాగు చేసుకుంటున్నారు. రసాయనాలు లేని అమృతాహారాన్ని స్వీకరిస్తూ ఇంటిల్లపాదీ పిల్లా పాపలతో పాటు ఆనందంగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు యువన (7), ఆద్విక (5). వీరి ఆలనా పాలనా చూస్తూనే, ఇంటి పనితో పాటు వ్యవసాయ పనులు కూడా చేస్తున్నారు సంధ్య. ఎకరానికి రూ. లక్ష నికరాదాయం మల్లికార్జునరెడ్డి నిత్యం స్వయంగా పొలం పనిలో నిమగ్నమై ఉంటారు. వరి నాట్ల కాలంలో రోజుకు 23 కి.మీ. మేర నడుస్తూ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇతర కాలాల్లో రోజుకు 7 కి.మీ. మేర నడుస్తూ పొలం పనులు చేస్తుంటారు. వెద పద్ధతిలో వరి విత్తనాన్ని తానే స్వయంగా రోజుకు 3 ఎకరాల్లో విత్తటం, ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేయటం ద్వారా ఖర్చును ఎకరానికి రూ. 25 వేలకు తగ్గిస్తున్నానని మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. ఇతరులకు ఎకరానికి రూ. 50 వేలు ఖర్చవుతోందన్నారు. ప్రస్తుతం 18 ఎకరాల్లో విత్తన కంపెనీలతో ఒప్పందం (క్వింటా రూ. 2 వేలు) చేసుకొని వరి విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. పశువుల ఎరువు, మాగబెట్టిన కోళ్ల ఎరువు, జీవామృతం, జీవన ఎరువులు వాడుతున్నారు. తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని ఏడేళ్లలో 0.5 నుంచి 1.5కి పెంచుకున్నారు. ఎకరానికి ఏటా (2 పంటలు) 60 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్నారు. ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం పొందుతున్నారు. వర్షపు నీటిని నేల బావిలోకి ఇంకింపజేస్తూ నీటి భద్రతను సాధించారు. పొలంలో మల్లికార్జునరెడ్డి, పశువులకు మేత వేస్తూ.. ఎకరంన్నరలో వస పంట సాగు ఎరంన్నరలో వస కొమ్ములను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. నల్ల నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు కూడా దీని సాగుకు అనుకూలం. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఔషధ మొక్కల విభాగంతో (క్వింటా రూ. 9 వేలు) కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. మరో నెల రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. ఎకరానికి కనీసం 20 క్వింటాళ్లు రావచ్చని ఆశిస్తున్నారాయన. పంటలతో పాటు 3 ఆవులు, 10 పొట్టేళ్లు, 54 నల్ల మేకలు, 50 వనరాజా కోళ్లను సాగు చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు ఈ యువ దంపతులు. వ్యవసాయ విద్యార్థులకు 6 నెలలు సాగు పనులు నేర్పిస్తున్నారు. మల్లికార్జునరెడ్డి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ–ఢిల్లీ) బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ జాతీయ అవార్డును ఇటీవలఅందుకున్న తర్వాత రైతు సందర్శకుల తాకిడి పెరగటం విశేషం. – వెల్మ విజేందర్ రెడ్డి, సాక్షి, చొప్పదండి వద్దన్న వారే అభినందిస్తున్నారు ఏడేళ్ళ క్రితం గ్రామంలో ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని వచ్చాం. పట్టణంలో సాఫ్ట్వేర్ జాబ్ వదిలి పల్లెటూరుకు ఏం పోతారు అని చాలా మంది అన్నారు. సమీకృత వ్యవసాయంతో పంటల సాగును లాభాల బాట పట్టించాం. మా ఆయన ఉదయం నుండి రాత్రి వరకు పంటల సాగుతో పాటు ఆవులు, గొర్రెలు, మేకలు, చేపల పెంపకం, నాటు కోళ్ళ పెంపకం పనుల్లో తలమునకలై ఉంటారు. ఇంటికి కావల్సిన పంటలను పండించడం చేస్తున్నాను. జాతీయ స్థాయిలో మాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. అప్పుడు పల్లెటూరుకు వద్దన్న వారే ఇప్పుడు అభినందిస్తున్నారు. – మావురం సంధ్యారెడ్డి, పెద్దకూర్మపల్లి వరి విస్తీర్ణం తగ్గిస్తా సాగు ఖర్చులు సగానికి సగం తగ్గించుకోవచ్చని నేను రుజువు చేశాను. వెద వరి, నీటి ఆదా తదితర పద్ధతులతోపాటు విత్తన వరి ఒప్పంద సేద్యం ద్వారా ఎకరానికి ఏటా రూ. లక్ష నికరాదాయం పొందుతున్నాను. వరి విస్తీర్ణాన్ని సగం తగ్గించి, ఆరుతడి పంటలు సాగు చేస్తా. పంటలతోపాటు పశువులు, కోళ్లు, చేపలను పెంచితేనే రైతుకు రసాయన రహిత ఆహార భద్రత, ఆదాయ భద్రత ఉంటుంది. నా అనుభవాలతో ఆహార–వ్యవసాయ సంస్థ కోసం పుస్తకం రాస్తున్నా. ఎఫ్.పి.ఓ. ఏర్పాటు చేసి రైతులకు బాసటగా నిలవాలన్నది లక్ష్యం. – మావురం మల్లికార్జునరెడ్డి (97040 90613), ఐఎఆర్ఐ ఉత్తమ ఇన్నోవేటివ్ రైతు అవార్డు గ్రహీత, పెద్దకూర్మపల్లి, చొప్పదండి మం, కరీంనగర్ జిల్లా -
గోకృప అమృతంతో ఎరువు చేసేదెలా?
పంచగవ్య, జీవామృతం, వేస్ట్ డీ కంపోజర్.. వంటి ద్రావణాలు లేనిదే ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం అడుగు ముందుకు పడదు. ఈ జాబితాలో ఇప్పుడు కొత్తగా ‘గోకృప అమృతం’ ద్రావణం వచ్చి చేరింది. భూసారం పెంపుదలకు, చీడపీడల నివారణకూ ఇది ఉపయోగపడుతుందని.. ఇదొక్కటి ఉంటే చాలు యూరియా, డీఏపీ, విష రసాయనాల అవసరమే ఉండదని ‘గోకృప అమృతం’ ఆవిష్కర్త గోపాల్ భాయ్ సుతారియా చెబుతున్నారు. ఎకరానికి ప్రతి ఏటా దేశీ ఆవు పేడతో తయారు చేసిన ఎరువు 4 వేల కిలోలు వేసి, ఎకరానికి నెలకు ఒకసారి 1,500 లీటర్ల గోకృప అమృతం ద్రావణం ఇస్తూ ఉంటే.. చక్కని దిగుబడులు వస్తాయని ఆయన అంటున్నారు. ఇప్పటికే 65 రకాల స్వల్పకాలిక పంటలు, పండ్ల తోటలపై అనేక రాష్ట్రాల్లో వాడిన రైతులు చక్కని ఫలితాలు పొందుతున్నారన్నారు. గోపాల్ భాయ్ చెబుతున్న పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ‘ప్రతి ఎకరానికి ఒక దేశీ ఆవు’ అవసరమవుతుంది.. గోకృప అమృతం! గోకృప అమృతం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తున్న కొత్త మాట ఇది. పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. సుభాష్ పాలేకర్ ‘జీవామృతం’ను ప్రాచుర్యంలోకి తెచ్చిన కనీసం పదేళ్ల తర్వాత.. వేస్ట్ డీ కంపోజర్ నాలుగేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి.. దేశవిదేశాల్లో అతి తక్కువ కాలంలోనే విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘గోకృప అమృతం’ (ప్రోబయోటిక్ బాక్టీరియల్ కల్చర్) కొద్ది నెలల క్రితం రైతుల ముందుకు వచ్చింది. అహ్మదాబాద్ (గుజరాత్) లోని బన్సీ గిర్ గోశాల వ్యవస్థాపకులు గోపాల్ భాయ్ సుతారియా దీన్ని రూపొందించి, ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. తాము శాస్త్రవేత్తలు, ఆయుర్వేద నిపుణులు, రైతుల తోడ్పాటుతో చాలా సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి గోకృప అమృతంను రూపొందించాం అని ఆయన అంటున్నారు. దేశీ ఆవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యిలలోని మేలుచేసే 70 రకాల సూక్ష్మజీవరాశికి మరో 21 రకాల ఓషధులను సమన్వయపరచి గోకృప అమృతాన్ని రూపొందించామన్నారు. ఇది భూమికి, పంటలకే కాకుండా మనుషులు ఇతర జీవరాశికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. ‘గోకృప అమృతం’ తయారీ పద్ధతి దాదాపుగా వేస్ట్‌డీకంపోజర్ ద్రావణం మాదిరిగానే ఉంటుంది. గోకృప అమృతం మదర్ కల్చర్ (తోడుగా వేసే మూల ద్రావణం) ఒక లీటరును 200 లీటర్ల నీటిలో పోసి, రెండు కిలోల బెల్లం, 2 లీటర్ల దేశీ ఆవు తాజా మజ్జిగ కలపాలి. రోజూ కలియదిప్పాలి. ఐదారు రోజుల్లో ‘గోకృప అమృతం’ వాడకానికి తయారవుతుంది. ‘పంచగవ్యాలలోని సూక్ష్మజీవులు, ఔషధ మొక్కల రసాలతో కూడినది కావటం వల్ల మళ్లీ ఆవు పేడ, మూత్రం జోడించాల్సిన అవసరం లేదు. గుజరాత్‌తోపాటు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో దీన్ని కొద్ది నెలలుగా చాలా మంది రైతులు వాడి సత్ఫలితాలు పొందారు సుమారు 65 పంటలపై ప్రయోగాలు జరిగాయని, రైతులతోపాటు శాస్త్రవేత్తలు సైతం దీనిపై ఆసక్తి చూపిస్తున్నార’ని గోపాల్ భాయ్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా సిద్ధిపేట జిల్లా మర్రిముచ్చలలో ఇటీవల గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘గోకృప అమృతం’ పరిచయ సభ జరిగింది. సభకు హాజరైన వందలాది మందికి ఒక్కో లీటరు చొప్పున గోకృప అమృతం ద్రావణాన్ని ఉచితంగా పంచి పెట్టారు. సమస్త వ్యవసాయ రసాయనాల బెడద నుంచి గోకృప అమృతం రైతులకు, భూమాతకు సంపూర్ణంగా విముక్తి కలిగించగలదని గోపాల్ భాయ్ ఆశిస్తున్నారు. తన మాటలను రైతులు గుడ్డిగా నమ్మవద్దని అంటూ.. జీవామృతం, వేస్ట్‌డీకంపోజర్, గోకృప అమృతాలను పక్కపక్కనే మడుల్లో వేర్వేరుగా వాడి, స్వయంగా తమ పొలంలో ఫలితాలను కళ్లారా చూసి, సంతృప్తి చెందిన తర్వాతే పంట పొలాల్లో వాడుకోవాలని గోపాల్ భాయ్ సూచిస్తున్నారు. రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ గోకృప అమృతం ఎక్కడ దొరుకుతుంది? గోకృప అమృతం ద్రావణం (ప్రోబయోటిక్ బాక్టీరియా కల్చర్)ను ఒకసారి ఇతరుల నుంచి తీసుకున్న రైతులు దాన్ని నీరు, బెల్లం, మజ్జిగలను తగిన మోతాదులో కలిపి మళ్లీ మళ్లీ తయారు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. అహ్మదాబాద్ (గుజరాత్)లోని బన్సీ గిర్ గోశాల వెబ్‌సైట్‌ను చూడొచ్చు.. www.bansigir.in తెలుగు రాష్ట్రాల్లో గోకృప అమృతం ద్రావణం మదర్ కల్చర్‌ను పొందాలనుకునే రైతులు, ఇంటిపంటలు / మిద్దె తోటల సాగుదారులు ‘గ్రామభారతి’కి ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చు: 97057 34202, 62817 77517. చీడపీడల నియంత్రణ ఎలా? స్వల్పకాలిక పంటలు, పండ్ల తోటలపై పురుగులు, తెగుళ్ల నియంత్రణకు వారానికి ఒకసారి గోకృప అమృతం 13 లీటర్లకు 2 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేయాలి. పంట ఏ దశలో ఉన్నా వారానికోసారి ఇదే మోతాదులో పిచికారీ చేయవచ్చు. పంటలపై పురుగులు, తెగుళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటే వారానికి రెండు లేదా మూడు సార్లు కూడా ఇదే మోతాదులో పిచికారీ చేయవచ్చు. ‘గోకృప అమృతం’లో ఏమి ఉన్నాయి? గోకృప అమృతం తయారీకి కావాల్సిన సామగ్రి: గోకృప అమృతం ద్రావణం ఒక లీటరు, 2 కిలోల బెల్లం (ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించినది), 2 లీటర్ల దేశీ ఆవు తాజా మజ్జిగ 200 లీటర్ల బ్యారెల్ నిండా నీరు. గోకృప అమృతం తయారీ విధానం రసాయనాలు, ఆయిల్ లేని శుభ్రమైన బ్యారెల్‌ను తీసుకొని 200 లీటర్ల నీటిని నింపండి. అందులో 1 లీటరు గోకృప అమృతం ద్రావణం, 2 లీటర్ల తాజా దేశీ ఆవు మజ్జిగ కలపండి. 2 కేజీల ప్రకృతి వ్యవసాయంలో పండించిన బెల్లంను (ద్రవరూపంలోకి మార్చి) కలపండి. బ్యారెల్‌ను నీడలో ఉంచి, పైన గుడ్డ కప్పి ఉంచాలి. రోజుకు 2 సార్లు కర్రతో సవ్య దిశలో 2 నిమిషాలు తిప్పండి. 5 నుంచి 7వ రోజు నుంచి గోకృప అమృతం వ్యవసాయానికి వాడకానికి సిద్ధమవుతుంది. అర్జెంటుగా కావాలంటే చిన్నపాటి ఎయిరేటర్ను అమర్చుకుంటే ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ ద్రావణం వాడకానికి సిద్ధమవుతుంది. గోకృప అమృతంతో ఎరువు చేసేదెలా? దేశీ ఆవు పేడతో గోకృప అమృతం ద్రావణాన్ని కలిపి ఎరువు తయారు చేసుకోవచ్చు. నీడలో 2 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పున మడిలాగా పేడను వేసి.. అందులో అక్కడక్కడా కన్నాలు పెట్టి 20 లీ. గోకృప అమృతం పోయాలి. 15 రోజులకు ఒకసారి గడ్డపారతో మిశ్రమాన్ని కలిసేలా తిప్పాలి. రోజూ లేదా రెండు రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా మిశ్రమంలో తేమ తగ్గకుండా నీటిని చల్లాలి. 40 నుంచి 45 రోజుల్లో గోకృప అమృతంతో ఎరువు తయారవుతుంది. పంట ఏదైనప్పటికీ ప్రతి ఎకరానికీ ప్రతి ఏటా 4 టన్నుల ఈ ఎరువు వేయాలి. పెద్ద ఆవు ఏటా 4 టన్నుల పేడ, 8 వేల లీటర్ల మూత్రం ఇస్తుందని ఓ అంచనా. గోకృప అమృతాన్ని భూమికి ఇచ్చేదెలా? గోకృప అమృతం ద్రావణాన్ని ఏ పంటకైనా తొలిసారి ‘ఎకరాని’కి వెయ్యి (1,000) లీటర్లు భూమికి ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి నెలా ఎకరానికి 1,500 లీటర్ల గోకృప అమృత ద్రావణం పారించాలి. దీన్ని ఒకేసారి 1500 లీటర్లు ఇవ్వొచ్చు లేదా 15 రోజులకోసారి 750 లీటర్లు అయినా పారించవచ్చు. ఆ విధంగా ఆ పంట ఎంత కాలం ఉంటే అంతకాలం నెలకు ఎకరానికి 1,500 లీటర్ల చొప్పున గోకృప అమృతం ద్రావణం ఇస్తూనే ఉండాలి. డ్రిప్ పద్ధతిలో గోకృప అమృతం భూమికి ఇవ్వటం సులభం. ఇందులో పేడ కలపటం లేదు కాబట్టి వడకట్టాల్సిన అవసరం ఉండదు. డ్రిప్ లేటరల్స్లో ఇరుక్కుపోవటం వంటి సమస్య ఉండదు. కాలువ ద్వారా సాగు నీటిని పొలంలో పారిస్తున్నప్పుడు దానితోపాటుగా గోకృప అమృతాన్ని కలిపి సులభంగా ఇవ్వవచ్చు. పంటలపై నీటిని వెదజల్లే స్ప్రింక్లర్ల ద్వారా కూడా నీటితోపాటు గోకృప అమృతాన్ని కలిపి ఇవ్వొచ్చు. అత్యవసర కీటక నియంత్రణ ఎలా? పంటపై పురుగుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఆవు మూత్రం, పులిసిన మజ్జిగ కూడా కలిపి పిచికారీ చేయాలి. 2 లీటర్ల ‘తాజా’ దేశీ ఆవు మూత్రం, 2 లీటర్ల బాగా పులిసిన దేశీ ఆవు మజ్జిగ (రాగి రేకు వేసి ఉంచిన 45 రోజుల తర్వాత తీసిన దేశీ ఆవు మజ్జిగ), 2 లీటర్ల గోకృప అమృతం కలపాలి. ఈ 6 లీటర్లకు నీటిని 9 లీటర్లు కలిపి పంటకు పిచికారీ చేయండి. మొదటగా 10 లేదా 25 మొక్కలపై ఈ అత్యవసర పురుగుల మందును ప్రయోగించి ఫలితాన్ని చూసి, ఆ తర్వాతే మిగిలిన పంట మీద ప్రయోగించండి. ముఖ్య సూచన: ఈ అత్యవసర క్రిమిసంహారక ద్రావణం అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. 21న పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ పుట్టగొడుగుల పెంపకంపై హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్‌లో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21 (ఆదివారం) ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణా కార్యక్రమం జరగనుంది. ప్రొఫెసర్ బి. రాజేశ్వరి, పుట్టగొడుగుల రైతు శ్రీమతి కొప్పుల శ్రీలక్ష్మి (రాజమండ్రి) అవగాహన కల్పిస్తారు. పేరు రిజిస్ట్రేషన్ కోసం 70939 73999, 96767 97777 నంబర్లలో సంప్రదింవచచ్చు. -
వ్యవసాయం పద్మశ్రీ తెస్తుందని ఊహించలేదు
కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం దక్షిణాదిలోనే మొట్ట మొదటిదన్న విషయం తెలిసిందే. దీనికున్న మరో విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంది. అదేమిటంటే.. ఈ విద్యాసంస్థ ఏభయ్యేళ్ల క్రితం నుంచే ‘రైతులకు సేంద్రియ వ్యవసాయా’న్ని నేర్పిస్తూ ఉంది! అందుకు ప్రత్యక్ష నిదర్శనం 104 ఏళ్ల పాపమ్మాళ్!! రసాయనిక రైతుగా 30 ఏళ్ల వ్యవసాయానుభవం తర్వాత.. 50 ఏళ్ల క్రితం.. కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ‘సేంద్రియ వ్యవసాయం’ నేర్చుకున్నారు. అనుదినం తానే నడుము వంచి పొలం పనులు చేసుకుంటున్న ఈ ‘మహా రైతమ్మ’ను పద్మశ్రీ పురస్కారం వరించింది.ఆమెను ‘సాక్షి’ పలుకరించింది.. తోట పనిలో పాపమ్మాళ్ మీరు వ్యవసాయంలోకి మీరెలా వచ్చారు? పొట్ట కూటి కోసం ఎంతకష్టమైనా పడకతప్పదు. 1914లో పుట్టాను. చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు. వారు నడిపే టీ బంకు మూతపడటంతో చెల్లితో కలిసి నానమ్మ దగ్గరకు చేరుకున్నాను. నానమ్మది కూడా ఫలసరుకుల దుకాణం పెట్టుకుని జీవితాన్ని నెట్టుకొచ్చే పేద కుటుంబం కావడంతో.. ఆమెకు సహకరిస్తూ రెండో క్లాసులోనే చదువు మానేశాను. 20 ఏళ్లకే పెళ్లయింది. పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. పిల్లలు లేకపోవడంతో సోదరి పిల్లలనే నా పిల్లలుగా చేరదీశాను. పొదుపు చేసిన సొమ్ముతో పది ఎకరాలు కొని సాగులోకి దిగాను. తదనంతరం కుటుంబ అవసరాల కోసం 7.5 ఎకరాలు అమ్మివేశాను. 2.5 ఎకరాల పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. ప్రస్తుతం అరటి పంట పెట్టా. సేంద్రియ సాగు ఎప్పటి నుంచి..? తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా బృందంలో సభ్యురాలిగా ఉన్నాను. ఆ సమావేశాలకు హాజరైనపుడు సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేసే రసాయన ఎరువులు, పురుగుమందులతో ఇన్నాళ్లూ సేద్యం చేశానా? అని బాధపడ్డాను. సేంద్రియ వ్యవసాయంలోకి మారి 50 ఏళ్లు గడిచింది. దేశవాళీ విత్తనాలు సేకరించేదాన్ని. జొన్న వంటి చిరుధాన్యాలు, కూరగాయలు, కందులు పండించే దాన్ని. ఇపుడు అరటి సాగు చేస్తున్నా. సేంద్రియ వ్యవసాయంలో మీ ప్రత్యేకత ఏమిటి? ఆవు పేడ, మూత్రం, గడ్డి, బెల్లం మిశ్రమాలను వాడతాను. ఆవు పేడ, లవంగాలు, ఉప్పును ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పొలంలోని భూమిలో పాతి పెడతాను. 15 రోజులకు ఒకసారి మూత తీసి ఆ మిశ్రమాన్ని కలియబెడతాను. 2 నెలల తరువాత బయటకు తీసి మొక్కల పాదుల్లో చల్లుతాను. వేపాకును ఎండ బెట్టి పొడి చేసి, వెల్లుల్లి పొడి, నీటితో కలిపి ద్రావణం తయారు చేసుకొని పంటలపై చల్లితే పురుగు పట్టదు. సేంద్రియ రైతుగా మీ అనుభూతి ఎలా ఉంది? ఆరోగ్యకరమైన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ఎంతో ఆనందం ఉంది. సేంద్రియ వ్యవసాయం అనేది ఒక రకంగా సమాజ సేవ. రసాయనాలతో ఆహార పంటల సాగును పూర్తిగా మాన్పించాలి. సేంద్రియ సాగులోని బాగు గురించి భావితరాలకు అవగాహన కల్పించాలి. పద్మశ్రీ అవార్డుకు ఎంపికవ్వటం ఎలా అనిపిస్తోంది? పొట్ట గడవటం కోసం నా మానాన నేను చేసుకుంటున్న సేంద్రియ వ్యవసాయం పద్మశ్రీ అవార్డుకు తెచ్చి పెడుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. అసలు పద్మశ్రీ అవార్డు అనేది ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం నాకు పద్మశ్రీ ప్రకటించగానే మారుమూల గ్రామంలో ఉంటున్న నా వద్దకు ప్రజలు, బంధువులు, ముఖ్యంగా విలేకరులు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. ఈ హడావిడితోనే పద్మశ్రీ అవార్డు గొప్పతనం గురించి తెలిసింది. ఈ గుర్తింపు, గౌరవం నాకు కాదు సేంద్రియ వ్యవసాయానికే అని భావిస్తున్నాను. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి? తెల్లవారుజామునే లేచి ఇప్పటికీ వేప పుల్లతోనే పళ్లు తోముతాను. కాలకృత్యాలు ముగించుకుని (టీ, కాఫీ తాగను) ఒక చెంబు నిండా గోరువెచ్చని నీళ్లు, రాగి గంజి తాగుతాను. ఎప్పుడైనా చికెన్ సూప్ సేవిస్తాను. అరటి ఆకులోనే భోజనం చేస్తాను. ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలతోనే నా భోజనం. మటన్ బిర్యానీ అంటే ఇష్టం. ఎప్పుడైనా కొద్దిగా తింటాను. ఉదయం 5.30–6 గంటల కల్లా చేలో ఉంటాను. కూలీలను పెట్టుకుంటే వారికి 10 గంటలకు కాఫీ లేదా కొబ్బరి బొండాం, సాయంత్రం మళ్లీ ఏదో ఒకటి తినడానికి ఇవ్వాలి. ఆ ఖర్చు భరించే స్థోమత నాకు లేదు. అందుకే నాటి నుంచి నేటి వరకు నేనే పొలం పని చేస్తాను. సోదరి, మనుమలు, మనుమరాళ్లు అప్పుడప్పుడూ పనిలో సాయం చేస్తారు. సాయంత్రం చీకటì పడే వరకు పొలం దగ్గరే ఉంటాను. దాదాపు 80 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా.. ఎప్పుడూ అలసి పోలేదు. నాకు 104 ఏళ్లు వచ్చాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిరంతరం పొలం పనులు చేయటం, ఆహారపు అలవాట్లే నా ఆరోగ్య రహస్యం అనుకుంటాను. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
‘ఆడపిల్లని, చెట్టుని కాపాడుకుంటే చాలు'
చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది. అన్నమూ పెడుతుంది. అయితే అది ‘పద్మశ్రీ’ కూడా ఇస్తుంది. ఈ సంవత్సరం చెట్టునే నమ్ముకున్న ఇద్దరు వ్యక్తులు పద్మశ్రీ పొందారు. ఒకరు రాజస్థాన్‌కు చెందిన శ్యామ్ సుందర్ పాలివాల్. మరొకరు తమిళనాడుకు చెందిన పాప్పమ్మాళ్. కూతురి తుదిశ్వాస నుంచి ఒక వనాన్నే సృష్టించాడు శ్యామ్ సుందర్. నానమ్మ పోతూ పోతూ ఇచ్చిన చిన్న కిరాణా అంగడి నుంచి భూమి కొని సేంద్రియ వ్యవసాయం చేసేంతగా ఎదిగింది పాప్పమ్మాళ్. కొంత నేల దొరికితే అందులో విత్తు నాటితే ఎలాగూ ఆనందం వస్తుంది. కాని ఆ కొమ్మకు పద్మశ్రీ పూస్తే ఇంకా ఆనందం కదా. ఆ ఇరువురి స్ఫూర్తిదాయకమైన పరిచయం ఇది. ‘నేనేం చదువుకోలేదు. నాకు ఇంగ్లిష్ రాదు’ అంటాడు 55 ఏళ్ల శ్యామ్‌సుందర్ పాలివాల్. కాని అతడు మాట్లాడేది ఇవాళ ప్రపంచమంతా అర్థం చేసుకుంటోంది. కారణం అతడు మాట్లాడేది ప్రకృతి భాష. చెట్టు భాష. పచ్చదనపు భాష. 2021 సంవత్సరానికి గాను శ్యామ్సుందర్కు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం. నిజానికి ఈ పురస్కారం అతనికొక్కడికి మాత్రమే కాదు. అతని ఊరు ‘పిప్లాంత్రి’కి. ఆ ఊరి గ్రామస్తులకి. ఈ ఊళ్లో ప్రస్తుతం తలలూపుతున్న దాదాపు మూడు లక్షల చెట్లకి. ‘ఆడపిల్లని, చెట్టుని కాపాడుకుంటే చాలు ఈ ధరిత్రి సుఖంగా ఉంటుంది’ అంటాడు శ్యామ్‌సుందర్. అతడు కూడా రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని తన ఊరు పిప్లాంత్రిలో 2007 వరకూ ఒక సామాన్య రైతే. తను తన ఇల్లు అనుకుంటూ వచ్చాడు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అతనికి. అయితే 2007లో అతని జీవితంలో పెనుమార్పు వచ్చింది. ఆ సంవత్సరం ఆగస్టులో అతని రెండో కూతురు 16ఏళ్ల కిరణ్ స్కూల్ నుంచి సగంలో తిరిగి వచ్చింది కడుపు నొప్పితో. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లేలోపు డీహైడ్రేషన్‌తో మరణించింది. ఎంతో ఇష్టమైన కుమార్తె మరణించడంతో కదిలిపోయాడు శ్యామ్‌సుందర్. ‘ప్రమాదవశాత్తు మరణిస్తేనే నాకు ఇంత దుఃఖంగా ఉంది. చేతులారా చంపేస్తే ఆ తల్లిదండ్రులకు ఇంకెత దుఃఖం ఉండాలి అనిపించింది’ అంటాడు అతడు. ఎకో–ఫెమినిజమ్ మొదలు ఆడపిల్ల చెట్టును కాపాడుతుంది... చెట్టు ఆడపిల్లను కాపాడుతుంది అని ఉద్యమం మొదలెట్టాడు శ్యామ్‌సుందర్. ఆ సమయంలో అతను తన ఊరి సర్పంచ్ కూడా. అప్పటికి రాజస్తాన్‌లో అమ్మాయి కట్నకానుకలకు భయపడి వడ్లగింజలు నోట్లో పోసి శిశుహత్యలు చేస్తుండేవారు. ‘మా ప్రాంతంలో ఇక అలా జరక్కూడదు అనుకున్నాను’ అంటాడు శ్యామ్‌సుందర్. మొదట తన కూతురి పేరున ఒక కదంబ మొక్క నాటాడు. ‘మా ఊరిలో ప్రతి సంవత్సరం యాభై అరవై కాన్పులు జరుగుతాయి. ఆడపిల్ల పుడితే ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి పేరున 111 మొక్కలు నాటాలి. వాటి బాగోగులు చూడాలి. వాటి మీద రాబడి భవిష్యత్తులో ఆ పిల్లకే చెందుతుంది. అలాగే ఆడపిల్లను చదివిస్తామని, వయసుకు ముందు పెళ్లి చేయమని వాళ్లు నోటు రాయాలి. ఆడపిల్ల పుడితే ఊరు మొత్తం 21 వేలు చందా ఇవ్వాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంకో పది వేలు ఇవ్వాలి. దానిని డిపాజిట్ చేస్తాం. 18 ఏళ్ల తర్వాత దానిపై వచ్చే డబ్బు ఆ అమ్మాయి పెళ్లికి ఉపయోగపడేలా భరోసా కల్పించాం. దాంతో మా ప్రాంతంలో ఆడపిల్ల మరణాలు బాగా తగ్గాయి’ అంటాడు శ్యామ్‌సుందర్. దీనిని నిపుణులు ఎకో ఫెమినిజం అంటున్నారు. ఇది మాత్రమే కాదు... శ్యామ్‌సుందర్ తన గ్రామంలో దాదాపు రెండున్నర లక్షల అలొవెరా మొక్కలు నాటి వాటి నుంచి జెల్, జ్యూస్ వంటి ప్రాడక్ట్స్ తయారు చేయించి మార్కెటింగ్ చేస్తున్నాడు. ‘ఒక్కో మహిళ నెలకు కనీసం ఆరు వేల రూపాయలు ఆదాయం గడిస్తోంది’ అన్నాడతను సంతోషంగా. గత దశాబ్ద కాలంలో గత దశాబ్ద కాలంలో పిప్లాంత్రిలో నాటిన వేప, మామిడి, ఉసిరి చెట్ల వల్ల పిప్లాంతి పచ్చదనం నింపుకోవడమే కాదు కరువు బారిన పడటం లేదు. భూసారం పెరిగి వలస ఆగింది. భూగర్భ జలాల మట్టం పెరిగింది. శ్యామ్‌సుందర్‌ను అనేక పురస్కారాలు వరించాయి. రాజస్థాన్ ప్రభుత్వం ఈ ఊరిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ‘నేను చేయగలగితే దేశంలో ఎవరైనా చేయొచ్చు’ అంటాడు శ్యామ్‌సుందర్. అతడు చెప్పే ఆ ‘ఎవరైనా’ అనే వ్యక్తి ప్రతి గ్రామంలో ఉండాలని కోరుకుందాం. చెట్ల మధ్య ఒక తెల్లజుట్టు చెట్టు 105 ఏళ్ల పాప్పమ్మాళ్ ఉదయం ఐదు గంటలకు టంచన్‌గా నిద్రలేచి ఆరోగంటకంతా తన పొలంలో ఉంటుంది. కోయంబత్తూరు సమీపంలోని తక్కెంపట్టి అనే గ్రామంలో భవాని నది ఒడ్డున ఆ పొలం ఉంటుంది. రెండున్నర ఎకరా ఉన్న ఆ పొలం ఆమె పైసా పైసా కూడగట్టి కొనుక్కున్నది. అందులోని ప్రతి మొక్కా ప్రతి పాదూ ఆమె చేతుల మీదుగా రూపుదిద్దుకున్నవే. పాప్పమ్మాళ్ గత యాభైఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ తమిళనాడులో పేరు తెచ్చుకుంది. ‘నా నానమ్మ పోతూ పోతూ నాకు చిన్న కిరాణా షాపు ఇచ్చి వెళ్లింది’ అంది పాప్పమ్మాళ్. ఆమెకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. వచ్చి నానమ్మ దగ్గర చెల్లెలితో పాటు ఉండిపోయింది. కిరాణా షాపును, చిన్న హోటల్‌ను నడుపుతూ దానిమీద రాబడితో పది ఎకరాల పొలం కొంది. అరటి, బెండ పండించడంలో ఆమె ఎక్స్పర్ట్. అయితే చెల్లెలి పెళ్లి, ఆమె పిల్లల పెంపకం కోసం ఏడున్నర ఎకరాల పొలం ధారాదత్తం చేసేసింది. మిగిలిన రెండున్నర ఎకరాల పొలంలో ఇప్పటికీ అరటి పండిస్తోంది. పాప్పమ్మాళ్‌ను తమిళనాడు గవర్నమెంట్ చాలా త్వరగా గుర్తించింది. తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీ ఆమెను తరచూ ఆహ్వానిస్తుంటుంది. 105 ఏళ్ల వయసులో గట్టిగా పనులు చేసుకుంటూ ఉండటానికి కారణం వారంలో రెండుసార్లు మటన్ సూప్ తాగడమే కావచ్చునని ఆమె చెబుతుంది. ఆమె మటన్ బిరియాని కూడా ఇష్టంగా తింటుంది. ఆకులో తినడం ఆమె అలవాటు. వేడి నీరు తాగుతుంది. ఈ వయసులో ఆమె తాను ఉత్సాహంగా ఉంటూ తనవారిని ఉత్సాహంగా ఉంచుతోంది. ఈసురోమనేవారెవరైనా ఈమెను చూసి కదా నేర్చుకోవాలి. – సాక్షి ఫ్యామిలీ -
సాఫ్ట్వేర్ ఇంజనీర్.. వీకెండ్ ఫార్మర్!
ఒకవైపు ఉన్నతోద్యోగాలు చేస్తూనే తీరిక సమయంలో మరోవైపు వ్యవసాయంపై మక్కువ చూపుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సేంద్రియ, ప్రకృతి పద్ధతుల్లో సాగు చేసిన పంటలకు మంచి దిగుబడి లభిస్తుండటం, ఆదాయం కూడా అంతేస్థాయిలో ఉంటుండటంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. ఒత్తిడితో కూడిన ఉరుకుల పరుగుల సిటీ జీవనం నుంచి ఉపశమనం కోసం కూడా కొంతమంది వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారు. సొంత భూములు ఉన్నవారు ఉద్యోగం చేసుకుంటూనే వీకెండ్స్ (శని, ఆదివారాల)లో సేద్యం చేస్తూ పచ్చటి ప్రకృతితో మమేకమవుతున్నారు. ఇదే వరుసలో చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సండ్ర రవీంద్ర కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరికి చెందిన ఈయన వారాంతంలో సొంతూరుకు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ఒరాకిల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రవీంద్రకు గోవర్ధనగిరిలో 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2002 వరకు ఆయన తండ్రి ఈ పొలాన్ని సాగు చేశారు. తండ్రి మరణించాక పొలాన్ని రవీంద్ర వేరే రైతులకు కౌలుకిచ్చారు. అయితే స్నేహితుల సలహా మేరకు 2006 నుంచి తానే సాగు చేపట్టి సుమారు 8 ఏళ్లపాటు సొంతంగా చెరకు పండించినా దక్కిన లాభం పెద్దగా లేదు. ఈ క్రమంలో.. పొరుగు గ్రామమైన రామాపురానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ గంగాధరం.. రవీంద్రకు పరిచయమయ్యారు. ఆయన సూచనలు, సలహాలతో రవీంద్రకు ప్రకృతి వ్యవసాయంపై మక్కువ ఏర్పడింది. 1.5 గుంటలతో ప్రారంభం.. అప్పటి వరకు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల సారం కోల్పోయిన తన భూమిలో రవీంద్ర మొదట 1.5 గుంటల నేలను ప్రకృతి వ్యవసాయానికి ఎంచుకున్నారు. ఆ భూమిలో కానగ ఆకు, వేపాకు, జిల్లేడు ఆకు వేసి మగ్గబెట్టి 5 కిలోల వరి విత్తనాలు చల్లారు. ఇలా పెరిగిన నారును 1.5 గుంటల భూమిలో అలనాటి దేశీ వరి వంగడం క్రిష్ణ (క్రిష్ణ వ్రీహీ) పంట సాగును ప్రారంభించారు. దేశీ ఆవుపేడ, మూత్రం, ఆకులు, పాలు, మజ్జిగ, బెల్లం, పుట్టమట్టి, వివిధ రకాల ధాన్యాల పిండితో పంటకు ఉపయోగపడే ఘన జీవామృతం, బీజామృతం, జీవామృతం తయారు చేశారు. వేప ద్రావణం, పులియబెట్టిన మజ్జిగ, అగ్నాస్త్రము, సప్త ధాన్యంకుర కషాయాలను సిద్ధం చేసుకొని.. అవసరమైనప్పుడు పైరుకు వాడారు. ఎటువంటి తెగుళ్లు లేవు. పంట నాటి 125 రోజులైంది. నాటిన 5 నెలలకు పంట కోతకొస్తుంది. మరో 8 ఎకరాల్లో సాగుకు శ్రీకారం.. 1.5 గుంటల భూమిలో క్రిష్ణ వంగడం పంట చాలా బాగుండటంతో.. ఈ పంట పూర్తి కాకముందే రవీంద్ర మరో 8 ఎకరాలలో కూడా ఈ వంగడాన్ని సాగు చేయనారంభించటం విశేషం. ఈ పంట నాటి 75 రోజులైంది. అనుకున్న దానికన్నా ఏపుగా, చక్కగా పెరిగింది.రసాయనిక ఎరువులు, పురుగు మందులతో సాధారణ పద్ధతిలో కంటే ప్రకతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయటం వల్ల 50 నుంచి 60 శాతం తక్కువ ఖర్చు అయిందని రవీంద్ర ఆనందం వ్యక్తం చేశారు. క్రిష్ణ బియ్యంకు భలే గిరాకీ.. ప్రకృతి పద్ధతిలో సాగు చేసే క్రిష్ణ బియ్యానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ బియ్యం కిలో రూ.300 పలుకుతోంది. దేశంలో క్రిష్ణ బియ్యం పండిస్తున్న రైతులు సంపన్నులుగా మారుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కితాబివ్వడం తెలిసిందే. ప్రాచీన భారత వంగడమైన క్రిష్ణ వ్రీహీని పూర్వం యజ్ఞాలు, పండుగల్లో ఉపయోగించేవారు. 100 గ్రాముల క్రిష్ణ బియ్యంలో 8.8 నుంచి 12.5 గ్రాముల ప్రొటీన్లు, 3.33 గ్రాముల లిపిడ్స్, 2.4 మిల్లీగ్రాముల ఐరన్, 24.06 మిల్లీగ్రాముల కాల్షియం, 58.46 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 69 నుంచి 74 మిల్లీగ్రాముల యాంథోసయనిన్స్ తదితరాలు ఉంటాయి. దీనిలో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరోటిన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయని చెబుతున్నారు. క్రిష్ణ బియ్యంతో ఉపయోగాలివే.. ∙ఇందులో ఎన్నో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ∙క్యాన్సర్, గుండె జబ్బులను నిరోధిస్తుంది. ∙వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ∙ మధుమేహాన్ని నియంత్రిస్తుంది. – జి. జగన్నాథం, సాక్షి, పిచ్చాటూరు, చిత్తూరు జిల్లా రెట్టింపు ఉత్సాహం.. నా తండ్రి మరణించే వరకు నాకు వ్యవసాయం గురించి కనీస అవగాహన కూడా లేదు. ప్రకృతి వ్యవసాయ నిపుణులు గంగాధరం సూచనలతో దానిపై ఆసక్తి కలిగింది. ఉద్యోగం చేస్తూ సెలవుల్లో వ్యవసాయం చేస్తున్నా. ప్రకృతి సాగు ఫలితాలు నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. – సండ్ర రవీంద్ర (93809 42229), వారాంతపు రైతు, సాఫ్ట్వేర్ ఉద్యోగి, గోవర్ధనగిరి, పిచ్చాటూరు మం., చిత్తూరు జిల్లా యజ్ఞంలా చేస్తున్నారు.. రవీంద్ర క్రిష్ణ ధాన్యాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో యజ్ఞంలా చేస్తున్నారు. సాఫ్ట్వేర్ జాబ్‌లో పని ఒత్తిడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అటువంటి ఉద్యోగం చేస్తూనే వారాంతంలో వ్యవసాయంపై దృష్టి సారించడం విశేషం. రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి మరల్చాలి. సహాయ సహకారాలు అందించడానికి నా వంటి వాళ్లం సిద్ధంగా ఉన్నాం. – డా. కె.గంగాధరం (98490 59573), ప్రకృతి వ్యవసాయ నిపుణులు, రామాపురం, చిత్తూరు జిల్లా -
ఇంటిపంట ఓ స్టేటస్ సింబల్!
ఇవాళ మనం ఒక ప్రత్యేక సందర్భంలో నిలిచి ఉన్నాం. ఇటువంటి సందర్భాన్ని ప్రపంచం మునుపెన్నడూ చూడలేదు. ఇలా ప్రపంచం యావత్తూ మృత్యుభయంతో గజగజ వణికిపోయి సమస్త పారిశ్రామిక కార్యకలాపాలను సమస్త రవాణా సాధనాలను ఎక్కడికక్కడ ఆపేసుకుని సమస్త దేశాలూ స్వీయ లాక్డౌన్ పాటించడం మునుపు ఎన్నడూ లేని విషయం. లాక్డౌన్ అనేది దశల వారీగా ఇంకా సాగుతూనే ఉంది. ఇదంతా కోవిడ్ వైరస్ వ్యాప్తి – తదనంతర సంక్షోభ పరిస్థితుల గురించి అని మీలో అందరికీ తెలుసు. కోవిడ్ వైరస్ అనేది ప్రపంచానికి అనేక పాఠాలను నేర్పుతోంది. నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత.అందులో ఒక పాఠం ’రోగనిరోధక శక్తి– బలవర్ధకమైన ఆహారం’ అనేది అతి ముఖ్యమైన పాఠం. బలమైనరోగ నిరోధకశక్తి కలిగిన వారిని కోవిడ్ వైరస్ ఏమీ చెయ్యలేకపోతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కోవిడ్ వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. వారంతా బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్న వారు. రోగనిరోధక శక్తిని కలిగి ఉండటానికి, ప్రకృతి సిద్ధ పద్ధతిలో పండించిన ఆహారం అవసరం. రసాయన పురుగు మందుల వ్యవసాయం మూలంగా ఉత్పత్తి చెయ్యబడిన ఆహారంలో రోగనిరోధక శక్తి దాదాపుగా ఉండదని ప్రామాణిక నివేదికలు తెలియజేస్తున్నాయి. ప్రపంచం సంగతి తెలియదు కానీ, మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మటుకు, మనం ఇక ముందు ఏది మాట్లాడుకోవాలన్నా’ కోవిడ్ కు ముందు– తరువాత’ అని మాట్లడుకోవలసి ఉంటుంది. అంతగా గత తొమ్మిది నెలల లాక్డౌన్ ప్రజలకు పాఠాలు చెప్పింది. ఒక అంచనా ప్రకారం.. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు రెండున్నర లక్షల మంది మిద్దె తోటలు లేదా ఇంటి పంటల సేద్యం చేస్తున్నారు. గత తొమ్మిది నెలల లాక్‌డౌన్‌కు పూర్వం వీరి సంఖ్య కేవలం వేలల్లో ఉండేది. కేవలం తొమ్మిది నెలల కోవిడ్ కాలంలో అనూహ్యంగా పెద్ద సంఖ్యలో ఇంటి పంటల సాగు వైపు మొగ్గు చూపారు ప్రజలు. ఇందుకు గల ముఖ్య కారణాల్లో గత దశాబ్ద కాలంగా ’సాక్షి’ దినపత్రిక ’ఇంటిపంట’ పేరుతో ప్రచారం చెయ్యడం కూడా. ప్రారంభంలో ‘అది సాధ్యమేనా?‘ అని అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా, ప్రస్తుతం మిద్దె తోటల కల్చర్ వైవు, పెరటి తోటల కల్చర్ వైవు మరలుతున్నారు. మరోవైపు అటు వ్యవసాయ రంగంలో కూడా, గత దశాబ్ద కాలంగా సాక్షి దినపత్రిక ‘సాగుబడి’ ద్వారా రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ రెండు రకాల ప్రోత్సాహాలకు తోడుగా అనేక ఇతర సంస్థలు కూడా బాధ్యతగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రచారం చేస్తూ వచ్చాయి. ఇంకా మరికొన్ని సంస్ధలు వ్యక్తులు కూడా ఇటువంటి ప్రచారంలో పాలు పంచుకోవడం మనం ఎరుగుదుం. అటువంటి గత దశాబ్దపు కృషికి కోవిడ్ వైరస్ నేర్పిన పాఠాలు కూడా తోడై, అతి తక్కువ కాలంలోనే లక్షలాది మంది మిద్దె తోటలు/ పెరటి తోటలు/ ఇంటిపంటల సాగు వైపు మరలారు. ఇదంతా రసాయన ఎరువులు పురుగుమందులు హైబ్రిడ్ విత్తనాలు లేకుండా, పూర్తి దేశీ పద్ధతిలో, తిరిగి మన పురాతన వ్యవసాయ పద్ధతుల వైపు ఆలోచించడానికి– ఆచరణలోకి తేవడానికి కారణం అయింది. ఏదీ ఏమైనా ఇవాళ తెలుగునాట కోట్లాది మంది ప్రకృతి వ్యవసాయం గురించి, ఈ పంటల ప్రాధాన్యత గురించి, అవి మన ఆరోగ్యానికే కాకుండా సమస్త పర్యావరణానికి ఎలా మేలు కలిగిస్తాయో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనేకమంది ఇంటి పంటల వైపు మరలారు. ఇంటిపంట అంటే ప్రధానంగా మిద్దెతోట సేద్యమే. పట్టణాలలో పెరటి తోటల సేద్యానికి అవకాశాలు తక్కువ– దాదాపుగా లేవు. స్థలాల ఖరీదు విపరీతంగా పెరిగింది. అందువల్ల పెరటి తోటల సేద్యం చెయ్యడానికి అవకాశాలు మూసుకుపొయ్యాయి. కేవలం మిద్దె తోటల సేద్యానికి మాత్రమే అవకాశాలున్నాయి. నగరాల విస్తీర్ణం ఎంత ఉంటుందో, మిద్దె తోటల సేద్యానికి అంత అవకాశం ఉంటుంది. నగరాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం, నగర మిద్దె తోటల్లో ఉంది. ఇప్పుడు మిద్దె తోట అనేది ఒక ఆరోగ్యమంత్రం. ఒక స్టేటస్ సింబల్‌గా మారింది. ఇది శుభపరిణామం. ఇందుకు ప్రత్యక్ష, పరోక్ష కారకులకు అందరికీ అభినందనలు తెలుపుతూ.. మిద్దె తోటల లేదా ఇంటిపంటల అవసరం గురించి, వాటి నిర్మాణ, నిర్వహణల గురించి కొన్ని విషయాలను చర్చిద్దాం. మిద్దె తోటల సాగు వల్ల నూరు లాభాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన లాభం పురుగుమందుల అవశేషాలు లేని కూరగాయలు, పండ్లు, ఇతర వంటింటి సుగంధ ద్రవ్యాల సాగు ఉత్పత్తి. ప్రధాన ఆహారమైన వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పు దినుసులు వగైరా మిద్దె తోటల్లో పెరటి తోటల్లో సాగు చెయ్యలేం. కారణం? తగినంత విస్తీర్ణంలో మిద్దె కానీ పెరడు భూమి కానీ అందుబాటులో ఉండకపోవడం. కనుక మనం ఇంటిపంట అని పిలుస్తున్నది అటు గ్రామాలలో ప్రకృతి వ్యవసాయాన్నీ ఇటు పట్టణాలలో మిద్దె తోటల సేద్యాన్ని ఉద్దేశించి మాత్రమే. ► స్వాతంత్య్రానంతరం వ్యవసాయ రంగంలో హైబ్రిడ్ విత్తనాలు రసాయన ఎరువులు పురుగుమందుల వాడకం క్రమంగా పెరిగింది. ఓ దశాబ్దం క్రితం వరకు కేవలం పైర్ల మీద మాత్రమే పురుగుమందులను స్ప్రే చేసే వారు! క్రమంగా కలుపు నివారణ కోసం విషపూరిత రసాయన మందులను భూమి మీద స్ప్రే చెయ్యడం ప్రారంభం అయింది. ఒకప్పుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన వారు బెండ, వంగ వంటి కూరగాయలను కొనేముందు పురుగు పుచ్చు ఉందో లేదో అని ప్రతీ కాయను పరీక్షగా చూసి తీసుకునే వారు. అయినా ఒకటో రెండో పుచ్చు కాయలు వచ్చేవి. ఇటీవల అటువంటి పురుగు, పుచ్చు కాయలు కనబడటమే లేదు. ఎందుకని? అంతగా పురుగుమందుల వాడకం పెరిగింది. వారం వారం ఏదో ఒక పురుగుమందును కూరగాయల మొక్కల మీద స్ప్రే చేస్తుంటారు. అదీ సంగతి! ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా కేంద్రంలో సుమారు అయిదు వందల పురుగుమందుల దుకాణాలు ఉన్నాయి. సాలీనా వాటి టర్నోవర్ అయిదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో జరుగుతున్న పురుగుమందుల వ్యాపారం ఏ లెవల్లో సాగుతోందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ లెక్క. ఇది స్వయంగా ఓ జిల్లా కేంద్రంలోని పురుగుమందుల వ్యాపారి చెప్పిన లెక్క. అంటే నిత్యం ముప్పూటలా మనం పురుగుమందులనే పళ్లాలలో పెట్టి మన పిల్లలకు, తల్లిదండ్రులకు తినమని పెడుతున్నాం– మనమూ అదే విషాహారం తింటున్నాం. ఎంత సంపాదిస్తున్నాం అన్న దానికన్నా, ఎంత నాణ్యమైన ఆహారాన్ని తింటున్నాం అనేది ముఖ్యమైన విషయం. ఇవాళ మధ్య తరగతి ఎగువ దిగువ మధ్య తరగతి వాళ్లలో క్యాన్సర్ పేషెంట్ లేని ఇల్లు అరుదు. అదంతా ఈ పురుగుమందుల తిండి వల్లనే అని మనకు అనేక నివేదికలు చెప్తున్నాయి. మనం తినే ఆహారంలో సగభాగమైన కూరగాయలను పండ్లను ఇతర వంటింటి సుగంధ ద్రవ్యాలను మనమే మన ఇంటిపంటలుగా ఇంటి మీదనే పండించుకోవచ్చు. అందుకు మిద్దె తోటలే సరైన సాధనాలు. ప్రకృతి జీవన విధాన సాధనకు, మిద్దె తోట సరైన సాధనం. పురుగుమందుల తిండికి భయపడితే చాలు, సమయమూ ఓపిక వాటంతట అవే చక చకా వస్తాయి. మిద్దె తోటల సాగు వల్ల అనేక లాభాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా? అందులో ప్రధాన లాభాలను ఒకసారి మీ దృష్టికి తెస్తాను. మిద్దె మీద తోట ఉండటం వల్ల, ఇంటిలో కనీసం మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. ఆ కారణంగా ఏసీ, కూలర్ వగైరా వాడవలసిన అవసరం తగ్గుతుంది. వాటి జీవిత కాలం పెరుగుతుంది. ఆ మేరకు విద్యుత్ బిల్లులతోపాటు విద్యుత్ ఉత్పత్తి వల్ల వచ్చే కాలుష్యం కూడా తగ్గుతాయి. ఒక ఇంటి మీద తోట ఉండటం వల్ల అంత ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, ఒక నగరం మీద మొత్తం మిద్దె తోటల సాగు చేస్తే నగరపు ఉష్ణోగ్రతలు ఎంత తగ్గాలి? ఓ సజృనాత్మక ప్రక్రియ! కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్ళవలసిన అవసరం తప్పుతుంది– అందుకు వాడే వాహనం దానికి ఇంధనం తద్వారా వెలువడే వాయు కాలుష్యం, సమయం వగైరా తప్పుతాయి. రోడ్ల మీద ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. రోజూ ఓ అరగంట మిద్దెతోటలో లేదా పెరటి తోటలో పని చేసుకోవడం మూలంగా శరీరానికి కావలసిన వ్యాయామం లభిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మిద్దెతోట లేదా పెరటితోట లేదా వ్యవసాయం అనేది ఓ సజృనాత్మక ప్రక్రియ! పిల్లల్లో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. ఇలా ఒక కాలంలో ఒక పద్ధతిలో ఒక విత్తనాన్ని నాటితే ఇలా సంరక్షణ చర్యలు తీసుకుంటే ఇలా ఉత్పత్తి వస్తుంది అని ఒక ఉత్పత్తి క్రమం పిల్లలకు అర్థం అవుతుంది. అదే క్రమం పిల్లలకు బ్రతుకు క్రమాన్ని కూడా తెలియచేస్తుంది. ఇంటి మీద ఒక తోట ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య ఉమ్మడి సబ్జెక్టుగా మారి అందరి మధ్యా ఒక బంధం ఏర్పడుతుంది. పిల్లలు పెద్దవారై ఉద్యోగాలకు ఎటు వారు అటు పోయి ఒంటరితనానికి లోనయ్యే గృహిణులకు మిద్దెతోట ఒక ఆలంబనగా మారుతుంది. ఉపశమనం కలిగిస్తుంది. రిటైర్డ్ ఉద్యోగులకు మిద్దె తోట ఒక పునర్జన్మను ఇస్తుంది. మీ మిద్దెతోట మూలంగా తిరిగి వారికి ఒక సోషౖల్ లైఫ్ ప్రారంభం అవుతుంది. సమస్యలు తగ్గుతాయి! మిద్దె తోటల సాగు విస్తీర్ణం ఎంత పెరిగితే, ఉష్ణోగ్రతలు వాయు, ధ్వని కాలుష్యాలు అంత తగ్గుతాయి, ఆ మేరకు ప్రజలకే కాదు పరోక్షంగా ప్రభుత్వాలకు కూడా సమస్యలు తగ్గుతాయి. మిద్దె తోటల సాగు మూలంగా ప్రజల ఆరోగ్యాలు బాగు పడతాయి– ఆ మేరకు ఖర్చులు తగ్గుతాయి, ఆ డబ్బును ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించ వచ్చు. ఇంటిపంట/మిద్దెతోట అనేది ఓ నాలుగు అక్షరాల చిన్నపదం మాత్రమే కాదు, అది బహుళార్థ సాధక సాధనం. బరువు సమస్యే కాదు! ’ఇంటి మీద మిద్దెతోట నిర్మాణం జరిపితే బరువు మూలంగా ఇంటికి ప్రమాదం కాదా?’ అని కొందరికి అనుమానం కలుగుతుంది. ’ఇంటి మీద మొక్కల పెంపకం చేపడితే, నీటి ఉరుపు సమస్య ఏమైనా ఏర్పడుతుందా?’ అని మరికొందరు అనుమానపడతారు. మిద్దె తోట బరువు ఒక ఇంటిమీద పెద్ద బరువు కాదు. కాలమ్స్ పద్ధతిలో కట్టిన ఆర్సీసీ బిల్డింగ్ అయితే, అది స్టాండర్డ్ బిల్డింగ్ అయితే, మనం భయపడాల్సిన పని లేదు. ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదు. మిద్దె మీద వర్షపు నీరు నిలవకుండా ఒక వైపు వాలు ఉంటుంది. పై కప్పు వేసేటప్పుడు ఆ వాలును సరిగా మెయింటైన్ చెయ్యమని మేసన్ పని వారికి, బిల్డర్‌కు చెప్పాలి. ఖర్చు ఎక్కువ అక్కర్లేదు ’మిద్దె తోటల సాగు చాలా ఖర్చుతో కూడుకున్నది’ అని కొందరు అనుకుంటున్నారు– అదీ నిజం కాదు. మీరు ఎంత బడ్జెట్లో అయినా ఓ మిద్దెతోటను ప్రారంభం చెయ్యవచ్చు. ఓ వంద రూపాయల సిమెంట్ లేదా మట్టి కుండీలో ఓ కరివేపాకు మొక్కను పెంచవచ్చు. అలాగే చిన్న చిన్న ట్రేలలో ఆకుకూరల పెంపకం చేపట్టవచ్చు. ఓ నెలలోనే ఆకుకూరలను పొందవచ్చు. ఓ ఖాళీ సిమెంట్ సంచిని నీళ్లలో ఝాడించి ఉతికి, సగానికి మడిచి మట్టి ఎరువుల్ని కలిపి నింపుకుని ఓ రెండు వంగ మొక్కలను నాటుకుని వారంలో ఒకసారి వంకాయలను ఉత్పత్తి చెయ్యవచ్చు. అది అన్నిటి కంటే చవకైన పద్ధతి. ఓ పదివేల రూపాయల నుండి ఓ లక్ష రూపాయల వరకు వ్యయం చేసుకుని చక్కని మిద్దెతోట నిర్మాణం చేసుకోవచ్చు. పురుగుమందుల దృష్టి కోణం నుంచి చూస్తే, ఇవాళ ఇల్లు ఎంత ముఖ్యమో ఇంటి మీద తోట కూడా అంతే ముఖ్యం. మిద్దె తోటల నిర్మాణం విషయంలో పీనాసితనం పనికి రాదు. సరైన సాధనం ఎంపిక ముఖ్యం మునుపు మిద్దె తోటల నిర్మాణానికి సరైన సాధనం లేదు. ఎవరికి తోచిన పాత్రలను వారు పెట్టుకుని, అరకొర ప్రయత్నాలు చేసే వారు. పగిలిన ప్లాస్టిక్ బకెట్ లేదా సంచులు మట్టి సిమెంట్ కుండీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అందమైన పటిష్ఠమైన ఇటుకల మడుల నమూనాలు అందుబాటులో ఉన్నాయి. మడుల కింద చీపురుతో ఊడ్చుకోవచ్చు. అంత సౌకర్యవంతమైన మడుల నమూనాలు అభివృద్ధి చెయ్యబడ్డాయి. మిద్దెతోట నిర్మాణం విషయంలో సరైన సాధనాన్ని ఎన్నుకోవడం ముఖ్యమైన విషయం. ఏవో చిప్పా దొప్పా మొక్కలను నాటడానికి వాడితే , సరైన ఉత్పత్తులు రావు. పైగా నిరాశ ఉత్పత్తి అవుతుంది. మొదటికే మోసం వస్తుంది. ఇటుకల మడులు శ్రేయస్కరం మిద్దెతోట నిర్మాణానికి ఇటుకల మడులు శ్రేయస్కరం. నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు, ఒక ఫీటు లోతు కలిగిన మడులు అవసరం ఉంటుంది. ప్రతీ మడి లేదా బెడ్ కింద ప్రత్యేకంగా రెండు అంగుళాల మందం కలిగిన ’సిమెంట్– ఐరన్ రాడ్ – బిళ్లను పోత పోసి వేస్తారు. క్యూరింగ్ తరువాత ఆ బిళ్లను ఒక ఫీటు ఎత్తుపైకి లేపి దిగువన నాలుగుౖ వెపులా నాలుగు ఇటుకలనే కాళ్లుగా పెట్టి, బిళ్ల మీద చుట్టూ నాలుగుౖ వెపులా ఫీటు ఎత్తు ఇటుకల గోడ కట్టాలి. మడి అడుగున నీరు నిలవ కుండా ఒక వైపు కాస్తా వాలుగా సిమెంట్ ప్లాస్టరింగ్ చెయ్యాలి. మడి గోడలకు లోపల బయట కూడా సిమెంట్ ప్లాస్టరింగ్ చేయించాలి. టెర్రకోట రంగు చేయించుకున్న తరువాత చక్కగా నచ్చిన ముగ్గులను మడుల గోడల మీద వేసుకోవాలి. అందమైన పటిష్ఠమైన ఇటుకల మడులు సిద్దం అవుతాయి. భూమి మీద చేసే వ్యవసాయానికి మిద్దె మీద చేసే వ్యవసాయానికి ప్రధానమైన తేడా ఇటుకల మడులు అమర్చుకునే విషయంలో మాత్రమే. తక్కిన వ్యవసాయం అంతా ఒక లాగే ఉంటుంది. ఇటువంటి ఇటుకల మడులను మిద్దె మీద మొత్తం ఎన్ని పడతాయో ఒకేసారి లెక్కవేసుకుని కట్టించాలి. దారులు వదులుకుని చక్కగా సిస్టమెటిగ్గా కట్టుకోవాలి. మడుల వరుసలు అన్నీ బీమ్ల మీద కట్టుకోవాలి. ఇటుకల మడుల నిర్మాణానికి దాదాపు ఓ వారం పని దినాలు అవుతాయి. ఇనుపరాడ్ –సిమెంట్ –ఇటుకలు ఇసుక – కంకర వంటి మెటీరియల్‌ను తాపీ మేస్త్రీతో కలిసి కొనుగోలు చెయ్యాలి. లేదా వారికే గుత్తకు ఇవ్వవచ్చు. స్టాండర్డ్ పని చెయ్యమని చెప్పాలి. నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఫీటు లోతు కలిగిన ఒక మడి నిర్మాణానికి సుమారు మూడు వేల రూపాయలు వ్యయం కావచ్చు. మట్టి ఎరువులకు అదనంగా ఖర్చు అవుతుంది. ప్రతీ రెండు మడుల తరువాత మూడవ మడిని మాత్రం మరో ఫీటు లోతు ఎక్కువగా పెట్టి కట్టించాలి. వాటిని పండ్ల మొక్కల పెంపకానికి వాడాలి. మిద్దెతోటల్లో అన్ని రకాల పండ్ల మొక్కలను కూడా పెంచవచ్చు. అన్ని రకాల కూరగాయల మొక్కల సాగుకు నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఒక ఫీటు లోతు మడులు సరిపోతాయి. గ్రోబ్యాగులు మూడవ ప్రత్యామ్నాయం గ్రోబ్యాగులు– ఇవి ప్లాస్టిక్ సంచులు తక్కువ ఖర్చు– బరువు తక్కువ– ఎక్కువ కాలం మన్నికగా ఉండవు. నాలుగైదు సంవత్సరాల తరువాత పనికిరావు! ఎండలకు పాడౌతాయి. పైగా ప్లాస్టిక్ సంచులు వాడకూడదు అని విజ్ఞులు చెప్తున్నారు. మట్టి కుండీలు తరువాత సిమెంట్ లేదా మట్టి కుండీలు ఉన్నాయి. అవి కేవలం పూల మొక్కల పెంపకానికి మాత్రమే పనికి వస్తాయి. లేదా ఒక సిమెంట్ కుండీలో ఒక వంగ మొక్కను పెంచవచ్చు. కూరగాయలను పండ్లను కుటుంబ అవసరాలకు సరిపడా ఉత్పత్తి చెయ్యాలంటే ఇటుకల మడులు తప్పకుండా ఉండాలి. సొంత ఇల్లు ఉన్న ప్రతీ వారు ఇటువంటి మడులకే ప్రాధాన్యం ఇవ్వాలి. అపార్ట్మెంట్లలో ఉన్నవారు కూడా ఇటువంటి ఇటుకల మడులకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఫైబర్ మడులు ఇటుకల మడులు కట్టడానికి ఓ వారం రోజుల పని దినాలు అవుతాయి. కొంత రిస్క్ ఉంటుంది. మరో చోటకు మార్చడానికి కుదరదు. బరువు ఎక్కువ అనే భావన ఉంటుంది. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఫైబర్ మడులను కూడా డిజైన్ చెయ్యడం జరిగింది. నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు కలిగి ఒక ఫీటు లోతు ఉన్న మడులతో పాటు వివిధ రకాల డిజైన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఫైబర్ టబ్బులతో ఒక్క రోజులోనే మిద్దె తోట నిర్మాణం పూర్తి చెయ్యవచ్చు. స్థూలంగా మిద్దె తోట నిర్మాణం విషయంలో మడుల నమూనాల గురించి సమాచారం ఇది. నిలువు పందిళ్లు మిద్దెతోట నిర్మాణం విషయంలో మడులను అమర్చుకోవడంతో ప్రధానమైన దశను దాటుతాం. తరువాత రెండోదశలో టెర్రస్ మీద చుట్టూ నాలుగు వైపులా నిలువు పందిరి నిర్మించుకోవాలి. టెర్రస్ మీద చుట్టూ నాలుగు వైపులా రక్షణ గోడ ఉంటుంది. మూడు ఫీట్ల ఎత్తుతో ఉంటుంది. ఆ గోడనుబేస్ చేసుకుని ఎనిమిది ఫీట్ల ఎత్తుతో పందిరి వేసుకోవాలి. పందిరి అంటే మనకు అడ్డంగా వేసే పందిరి తెలుసు. మిద్దె మీద అడ్డంగా పందిరి వేస్తే దిగువన నీడపడి మొక్కలు ఎదగవు– స్థలం వృథా అవుతుంది. అందుకని నిలువు పందిరి కట్టాలి. ప్రతీ పది ఫీట్లకు రక్షణ గోడను సపోర్ట్ చేసుకుని ఒక ఐర న్ పోల్ బిగించి అడ్డం పొడవు తీగలు కట్టుకుని చక్కని పందిరి కట్టు కోవాలి. కూరగాయల జాతుల్లో సగం తీగజాతి కూరగాయల మొక్కలే ఉన్నాయి– నిలువు పందిరి చుట్టూ ఒక ఇటుకల మడి వరుస కట్టిస్తే తీగ జాతులన్నిటినీ అటువైపు పెంచి పందిరికి పాకించవచ్చు. ఈ విధంగా మిద్దెతోట నిర్మాణంలో మడులను కట్టుకోవడం – నిలువు పందిరి వేసుకోవడంతో రెండు దశలు పూర్తి అవుతాయి. సిమెంటు కుండీలు మూడవ దశ – సిమెంట్ లేదా మట్టికుండీలను అమర్చుకోవాలి. ఇటుకలతో ప్రధాన మడులు కట్టించుకున్న తరువాత , మిగిలిన చిన్న చిన్న ప్లేసులు బయటపడతాయి. వాటిలో సిమెంట్ లేదా మట్టికుండీలను తెచ్చుకుని పెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా పూల మొక్కలు పెంచడానికి వాడాలి. మిద్దె తోటల్లో పెరటి తోటల్లో పొలాలలో పూల మొక్కలు తప్పకుండా ఉండాలి. రోజు పూలు పుయ్యాలి. పూలు తేనెటీగలను ఆకర్షించి మొక్కల్లో పరపరాగ సంపర్కం సజావుగా జరగడానికి దోహదం చేస్తాయి. పుష్పాల ఫలదీకరణ చెందిన తరువాత సంపూర్ణ ఉత్పత్తి జరుగుతుంది. ఎర్రమట్టి మేలు ఈ మూడు దశల తరువాత మట్టి గురించి ఎరువుల గురించి ఆలోచించాలి. మట్టిలో ఎర్రమట్టి నల్లమట్టి అని రెండు రకాల మట్టి లభిస్తుంది. నగరాలలో భవన నిర్మాణ పనులు సాగుతున్న ఏరియాలలో రోడ్లపక్కన అక్కడక్కడా కొందరు మట్టిని కుప్పులుగా పోసి అమ్ముతుంటారు. అది సాధారణంగా ఎర్రమట్టి అయుంటుంది. మొక్కలకు అని చెప్పాలి. ఇసుక శాతం తక్కువ ఉండాలి. సారవంతమైన మట్టి కావాలి. మొరం లేదా చవుడు మట్టి పనికి రాదు. ప్రస్తుత అవసరం కంటే ఎక్కువ మట్టిని తెచ్చుకోవాలి. మాటిమాటికి మట్టిని తేలేం. ఎక్కువ తెచ్చుకోవాలి. టెర్రస్ మీద ఓ మూలన నిల్వ చేసుకుని ఓ షీట్ కప్పాలి. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మట్టిని వాడుకోవచ్చు. ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువు మంచిది. గొర్రెల మేకల కోళ్ల ఎరువులు కూడా వాడుకోవచ్చు. అవి కూడా విష రసాయనాలు కలువని ఎరువులు అయి ఉండాలి. మాగిన లేదా చివికిన ఎరువులు మట్టిలో కలపాలి. తాజా పచ్చి ఎరువులు కలపకూడదు. మట్టి రెండు భాగాలుగా ఎరువు ఒక భాగంగా తీసుకుని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. మడులను కాస్తా వెలితి ఉండేలా నింపుకోవాలి. మట్టి ఎరువుల మిశ్రమాన్ని మడుల్లో నింపడంతో మిద్దెతోట నిర్మాణం దాదాపు పూర్తి అవుతుంది. మిగిలింది విత్తనాల విషయం. దేశీ విత్తనాలు మేలు విత్తనాలలో దేశీ విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయి. దేశవాళీ విత్తనాలు మన వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి. అయితే ఎక్కడపడితే అక్కడ అవి దొరికే అవకాశం లేదు. ఓపికగా సేకరించాలి. అందరికీ అందుబాటులో హైబ్రిడ్ విత్తనాలు మాత్రమే ఉన్నాయి. పరవాలేదు. వాటిని కూడా వాడుకోవచ్చు. వాటి నుండి తిరిగి విత్తనాలను కట్టుకుని తిరిగి వాటిని వాడవచ్చు. క్రమంగా అవీ దేశవాళీ విత్తనాల వలె మారతాయి. సంవత్సరంలో మూడు కాలాలు ఉన్నాయి. ఆ మూడు కాలాల ప్రారంభ రోజుల్లో విత్తనాలను నాటుకోవాలి. నారు మొక్కలను నాటు కోవాలి. కొన్ని మొక్కలను కొన్ని కాలాలలో పెంచలేం.పెంచినా కాపు కాయవు. ఆ గ్రహింపు ఉండాలి. శీతాకాలపు పంటలైన మిర్చి, టొమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కొత్తిమీర, వెల్లుల్లి వంటి వాటిని ఎండాకాలంలో పండించలేం. శ్రద్ధ తీసుకుంటే వర్షాకాలంలో మాత్రం కొంత పండించవచ్చు. ఈ జాగ్రత్త వహించాలి. గుమ్మడి – బూడిద గుమ్మడి – దుంపలు వంటి వాటిని వర్షాకాలం ప్రారంభంలో నాటు కోవాలి. మిగతా అన్ని మూడు కాలాల్లో కూడా ఉత్పత్తి చెయ్యవచ్చు. నీటి యాజమాన్య విషయంలో మిద్దె తోటల్లో పెరటి తోటల్లోఎక్కువ నీరు పెట్టడం వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. ఎక్కువ నీరు వల్ల మొక్కలు ఎర్రబడి చనిపోతాయి. వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. మట్టి పొడిగా ఉంటేనే నీరు మొక్కలకు నీరు అవసరం ఉండదు. కేవలం తేమ మాత్రమే అవసరం ఉంటుంది. తేమ ద్వారా మాత్రమే మట్టిలో ఉన్న సూక్ష్మ, స్థూల పోషకాలను గ్రహిస్తాయి. ప్రతిరోజూ మిద్దెతోటలో ఉదయం ఓ రౌండ్ తిరగాలి. మొక్కల మొదళ్ల దగ్గర మట్టిని ముట్టుకుంటే తేమ ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. తేమ ఉంటే నీరు పెట్టడం అవసరం లేదు. తేమ లేకుంటే– మట్టి పొడిగా ఉంటే నీరు పెట్టడం అవసరం ఉంటుంది. మనం పెట్టిన నీరు మడుల్లోంచి బయటకు రాకుండా– తగు మాత్రమే పెట్టాలి. నాలుగైదు గంటల పాటు ఎండ మొక్కల మీద కనీసం ప్రతీ రోజూ నాలుగైదు గంటల పాటు ఎండ తప్పకుండా పడాలి. మొక్కల మొలిచిన తరువాత పది రోజులకు ఒకసారి అంతర కృషి చెయ్యాలి. మొక్కల మధ్య మట్టిని లూజ్ చెయ్యాలి. చేసేటప్పుడు మొక్కల వేర్లు దెబ్బతినకుండా సున్నితంగా మట్టిని లూజ్ చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మొక్కల వేరు వ్యవస్థకు ప్రాణవాయువు అంది బలపడుతుంది. మొక్కల ఎదుగుదల బాగుంటుంది. ప్రతీ అంతర కృషి తరువాత స్వల్పంగా వర్మీకంపోస్టు చల్లి తగినంత నీరు పెట్టాలి. చీడపీడల సమస్యలు తక్కువే చీడపీడల సమస్యలు కూడా మిద్దెతోటల్లో ఉంటాయి. సమృద్ధిగా పశువుల ఎరువులు పోసి మొక్కలను పెంచుతాం కనుక మొక్కలు బలంగా ఎదిగి సహజంగా రోగనిరోధకశక్తి కలిగి ఉంటాయి. చీడపీడల సమస్యలు తక్కువ ఉంటాయి. వాటిలో పేను సమస్య ముఖ్యమైనది. పేను అనేది నల్లగా పచ్చగా ఉంటుంది. కంటికి కనిపిస్తుంది. ఆకుల అడుగు భాగంలో చేరి రసాలను పీల్చి ఆకులు ముడుచుకు పొయ్యేలా చేసి మొక్కను ఎదగకుండా చేసి గిడస బారుస్తాయి. పేనును గమనించాలి. మొక్కల మీద చీమలు పారడాన్ని గమనిస్తే, పేను ఉందని అర్థం చేసుకోవాలి. ఆకుల అడుగు భాగం చెక్ చెయ్యాలి.పేనును చేతి వేళ్లతో నలిపి కూడా నివారణ చెయ్యవచ్చు.పేను సోకిన ఆకులను తెంపి తోట నుండి దూరంలో పారెయ్యాలి. మిగిలిన లేత ఆకుల కింద ఉన్న పేను నివారణకు లీటరు నీటిలో అయిదు మిల్లీ లీటర్ల వేప నూనె బాగా కలిపి నురగ వచ్చే దాకా షేక్ చేసి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చెయ్యాలి. మొక్క సాంతం తడిసేలా స్ప్రే చెయ్యాలి. నాలుగు రోజుల వ్యవధిలో మరోసారి స్ప్రే చెయ్యాలి. బీర, సోర, కాకర, బెండ, వంగ, పొట్ల, గుమ్మడి వంటి మొక్కల మీద ఎక్కువగా సోకుతుంది. తెల్లనల్లి పేను తరువాత తెల్లనల్లి మరో సమస్య. బెండ, వంగ, మందార, టొమాటో, మొక్కల మీద ఎక్కువ సోకుతుంది. దీన్ని కూడా చేతి వేళ్లతో నలిపి నివారణ చెయ్యాలి. దీనికి ఏ వేపనూనె కూడా అవసరంలేదు. పచ్చ పురుగులు చుక్కకూర, పాలకూర వంటి ఆకుకూరల మీద వన్ ఇంచ్ పొడవు, పెన్సిల్ సైజ్ పచ్చని పురుగులు వస్తాయి. రాత్రి బయటకు వచ్చి ఆకులను తిని తెల్లవారుతుంటే కిందకు జారుకుంటాయి. ఉదయాన్నే చెక్ చేస్తే పురుగులు దొరుకుతాయి. ఏరి అవతల పడెయ్యాలి. అలా వరుసగా రెండు మూడు రోజుల పాటు చెయ్యాలి. బీర, సొర మొక్కలు పూత దశలోకి రాగానే పిందెలు పండుబారి ఎండిపోయే సమస్య ఎదురవుతుంది. దానికి కొన్ని కారణాలుఉన్నాయి. వాతావరణం సరిగా లేకపోవడం– మొక్కలు ఆరోగ్యంగా లేకపోవడం– పాలినేషన్ సరిగ్గా జరగకపోవడం వగైరా కారణాలు. పువ్వులు పూసే సాయంత్రం వేళల్లో వెళ్లి మగ పువ్వును తెంపి సమీపంలో ఉన్న ఆడపువ్వు కేసరాల మీద మగపువ్వు కేసరాలను సున్నితంగా రుద్దాలి. ఫలదీకరణ శాతంపెరుగుతుంది. బూడిద తెగులు ఆకుల మీద బూడిద తెగలు సోకుతుంది. తెగలు సోకిన ఆకులను తెంపి పారెయ్యాలి. పుల్లని మజ్జిగను మిగిలిన ఆకుల మీద స్ప్రే చెయ్యాలి. కొంత కంట్రోల్ అవుతుంది. చీడపీడల నివారణలో చేతిని మించిన సాధనం లేదని గ్రహించాలి. ఈ విధంగా కొంచెం ఖర్చు కొంచెం శ్రద్ధా శ్రమతో చక్కగా మిద్దెతోటల సాగు చెయ్యవచ్చు. ఇంటిల్లి పాదికీ సరిపడా కూరగాయలను పండ్లను ఉత్పత్తి చేసుకోవచ్చు. మిద్దెతోటల నిర్మాణం విషయంలో సౌందర్య దృష్టి కూడా ఉండాలి. అందంగా తీర్చిదిద్దుకోవాలి. మిద్దె మీద ఓ అందమైన తోటగా మార్చుకోవాలి. ఆయురారోగ్య రహస్యాలు, మిద్దె తోటల్లో దాగి ఉన్నాయి! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు ప్రకృతికి సంక్షిప్త రూపం మిద్దె తోట! ప్రకృతికి మనిషికి ఎటువంటి సంబంధం కలిగి ఉంటుందో, మిద్దెతోట కూడా అటువంటి సంబంధాన్ని తిరిగి కలిగిస్తుంది. ప్రకృతికి దూరమై పలువ్యాధులకు దగ్గరైన ఆధునిక సమాజానికి మిద్దె తోట సరైన ఆయురారోగ్య పరిరక్షణా సాధనం. ఇలా చెప్పుకుంటూ పోతే మిద్దెతోటల సాగు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుస్తుంది. నిర్వహణ సులభం మిద్దెతోట నిర్వహణ చాలా కష్టం అని కొందరు భావిస్తున్నారు. కానీ, అది నిజం కాదు. మిద్దెతోట లేదా పెరటి తోట చాలా సులభంగా చెయ్యగల పని. సుమారు రోజూ ఒక అర గంటసేపు పనిచేసినా సరి పోతుంది. ఇంటికి సరిపడా కూరగాయలను పండ్లను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంటిపంటల రుచి అమోఘమైన రుచి. ఏ రోజు ఉత్పత్తిని ఆ రోజే వాడుకోవడం వల్ల వాటిలోని సంపూర్ణ పోషకాలు మనకు అందుతాయి. ఎంతో విలువైన జీవశక్తి పూరితమైన ఉత్పత్తి అది. జీవశక్తి పూరితమైన ఆహారమే మనల్ని బలోపేతం చేస్తుంది. మనం ఎంత బలంగా ఉంటే, మనకు అంతగా రోగనిరోధకశక్తి ఉంటుంది. వ్యాధులకు దూరంగా ఉంటాం. హైదరాబాద్ మహానగరం - మిద్దెతోటల చరిత్ర క్రీస్తు శకం1667 నాటికే గొల్లకొండ కోట భవనాల మీద తాని తోటలను చూసాను అని ’టావెర్నియర్’ అనే యాత్రా చరిత్రకారుడు రాసాడు. ‘హీనా మహల్ ఆర్చీల మీద అంత పెద్దపెద్ద వృక్షాలను ఎలా పెంచారో ఆశ్చర్యం కలిగించింది’ అని రాసాడు. నగరాల నిర్మాణం ప్రారంభం అయిన నాటి నుంచే, స్ధలాల కొరత ఏర్పడి మిద్దెల మీద తోటల నిర్మాణం ప్రారంభం అయింది. సిమెంటు రింగులూ బాగుంటాయి. ఇటుకల మడుల తరువాత మరో ప్రత్యామ్నాయం సిమెంట్ రింగులు లేదా గూనలు అని కూడా అంటారు. పూర్వం చేద బావులు పూడి పోకుండా ఉండటానికి వాడేవారు. వాటిని కూడా మన మిద్దెతోటల మడులకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. వాటి వల్ల కాస్తా మిద్దె తోట నిర్మాణ పనిదినాలు– రిస్కు కూడా కొంత తగ్గుతాయి. ఈ రింగులకు కూడా అడుగున గుండ్రని బిళ్లలు వేసి వాటి కింద ఫీటు ఎత్తు ఇటుక కాళ్లను నాలుగు పెట్టి రింగులను కూర్చుండబెట్టి సిమెంటుతో అతుకుతారు– ఇదంతా వారినే చెయ్యమని అడగాలి. వేరే వారు అవి తేలేరు. -
ప్రకృతి సేద్యానికి ఏపీ తీసుకుంటున్న చర్యలు భేష్
సాక్షి, అమరావతి: ఏపీలో ప్రకృతి సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమైనవని ఐక్యరాజ్యసమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ సత్య ఎస్ త్రిపాఠి పేర్కొన్నారు. ప్రకృతి సేద్యంలో ఏపీ చేపడుతున్న చర్యల నుంచి పలు దేశాలు నేర్చుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని మరింతగా విస్తరించేందుకు ఐక్యరాజ్య సమితి తన వంతు తోడ్పాటును అందజేస్తుందని హామీ ఇచ్చారు. త్రిపాఠి ఈ నెల 16, 17 తేదీల్లో రాష్ట్ర రైతు సాధికార సమితి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్‌తో కలసి విజయనగరం జిల్లాలోని వివిధ గిరిజన గ్రామాల్లో పర్యటించి.. ప్రకృతి సేద్యం(ఆర్గానిక్ ఫార్మింగ్) కోసం అక్కడి గిరిజన రైతులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రకృతి సేద్యం చేస్తున్న 93 గిరిజన గ్రామాల రైతుల పనితీరును ఆయన గమనించి వారిని ప్రత్యేకంగా అభినందించారు. పర్యటనలో భాగంగా మంగళవారం సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌తో కొద్దిసేపు భేటీ అయ్యారు. త్రిపాఠి మాట్లాడుతూ ప్రకృతి సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, సీఎం వైఎస్ జగన్ ముందుచూపును ప్రశంసించారు. హానికారక రసాయనాలు, సింథటిక్ ఎరువుల స్థానే ప్రకృతి సేద్యం పట్ల సీఎం చూపిస్తున్న ఆసక్తి ఎన్నతగినదన్నారు. ఈ లక్ష్య సాధనలో రాష్ట్రానికి తమవంతు తోడ్పాటును అందిస్తామని చెప్పారు. ప్రతి గ్రామం ప్రకృతి సేద్య గ్రామంగా అభివృద్ధి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో హానికారక రసాయనాలు, సింథటిక్ ఎరువుల స్థానే ఆర్గానిక్ ఫార్మింగ్‌ను మరింత విస్తరింప చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. త్వరలో ప్రకృతి సేద్యంపై రాష్ట్ర స్థాయిలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ భేటీలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ పాల్గొన్నారు. -
చూపు తిప్పుకోనివ్వని పూల మిద్దె
పేదలు, మధ్య తరగతి వారంతా ‘ఏం తినేటట్లు లేదు.. ఏం కొనేటట్లు లేదు’ అని పాట పాడుకుంటారు’ ఇల్లు ఎలా గడవాలో తెలియక సతమతం అవుతుంటారు. పెరటిలో ఏవైనా మొక్కలు వేసకుందామనుకుంటే.. ఆ రోజులు పోయాయి. అతి తక్కువ స్థలంలోనే ఇళ్లు కట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీనికి పరిష్కార మార్గమే మిద్దె పంట. ఇంటిపై ఎంచక్కా కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలు పెంచుకుంటే వాటిని కొనే బాధ తప్పుతుంది. పర్యావరణంతో పాటు ఆరోగ్యమూ సిద్ధిస్తుంది. సాక్షి, మార్కాపురం: ప్రస్తుతం ఎక్కడ చూసినా హాట్ టాపిక్ ఒక్కటే అదే ఆరోగ్యం. తెలుగు రాష్ట్రాల్లోని వారు అది ఎలా దొరుకుతుందో రీసెర్చిలు మొదలు పెట్టారంటే అతిశయోక్తి కాదు. ఈ కోవకు చెందిన వారే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగ దంపతులు. తమ ఇంటి మేడనే నందన వనంగా మార్చుకున్నారు. ప్రకృతిని కేవలం ఇష్టపడటమే కాదు.. ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తూ ఆ పంటనే తినాలని ప్రచారం చేస్తున్న ఈ దంపతులు అందరి అభినందనలు అందుకుంటున్నారు. ఒక్క ఆలోచన మార్కాపురం పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉండే కేఐ సుదర్శన్‌రాజు యర్రగొండపాలెం వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులుగా, ఆయన భార్య నాగలక్ష్మి తిప్పాయపాలెం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం అంటే ఇద్దరికీ ప్రాణం. ఈయన తన వృత్తిలో భాగంగా సహజంగానే ప్రతి రోజూ పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈనేపథ్యంలో రెండేళ్ల క్రితం మంచి ఆలోచన వచ్చింది. అదే మిద్దె పంట సాగు. ఇలా ఇద్దరూ కలిసి తాము ఉంటున్న ఇంటి పైనే వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయల మొక్కలను సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా బెండ, దొండ, చిక్కుడు, కాకర, టమోటా, సొరకాయతో పాటు ఆకుకూరలైన పాలకూర, చుక్కకూరతో పాటు చిన్న చిన్న పండ్ల మొక్కలను పెంచుతున్నారు. తాము పండించిన మిద్దె పంటతో సుదర్శన్‌రాజు దంపతులు పూలమొక్కలైన మందార, గులాబి, నందివర్దనం, లిల్లీ, తదితర మొక్కలు కూడా సాగు చేస్తున్నారు. దాదాపు ఏదాదిన్నర నుంచి ఆ గృహమంతా కళకళలాడుతుండటంతో రకరకాల పక్షులు కూడా అక్కడకు వచ్చి చేరుతున్నాయి. దీంతో వాటి కోసం గూళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు చుట్టు పక్కల వారు కూడా మిద్దె పంట సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ‘ప్రస్తుతం కూరగాయల దిగుబడులు వస్తున్నాయి. సాయంత్రం సమయాల్లో గార్డెనింగ్‌లో కూర్చుంటే చల్లటి స్వచ్ఛమైన గాలి వస్తోంది. అందరూ ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఆరోగ్యం వచ్చి తీరుతుంది’ అని చెప్పారు సుదర్శన్‌రాజు, నాగలక్ష్మి. -
గమ్యం మార్చిన పుస్తకం
సాఫ్ట్వేర్ ఇంజినీరైన ఖుషీ చంద్ వడ్డె ఓ రోజు కంపెనీ పనిమీద ముంబై వెళ్లాల్సి ఉంది. ఇంటి నుంచి బయలుదేరి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఓ స్వీట్‌హౌస్ వద్ద ఆగాడు. రైతు, సైంటిస్టు సుభాష్ పాలేకర్ రాసిన ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే పుస్తకాన్ని కొనుగోలు చేశాడు. హైదరాబాద్ నుంచి విమానంలో ముంబై బయలుదేరాడు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే వరకు 60 పేజీల ఆ పుస్తకాన్ని తిరగేశాడు. రసాయన ఎరువుల వాడకం, భూమి కాలుష్యం, కల్తీ ఆహార పదార్థాలతో రోగాల బారిన పడుతున్న బాధితుల తీరును తెలుసుకొని చలించిపోయాడు. అప్పటి నుంచి అతడిలో ఎన్నో ప్రశ్నలు.. కల్తీ ఆహార పదార్థాలతో క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నామని గ్రహించాడు. తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆర్నెళ్ల పాటు నగర శివార్లలో ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులను కలిశాడు. దిగుబడి, నాణ్యత, మార్కెటింగ్ గురించి తెలుసుకొని రోగాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయంలో తానూ భాగస్వామి కావాలనుకున్నాడు. – గచ్చిబౌలి ‘కృషి’ చంద్గా.. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కూచిపూడి గ్రామానికి చెందిన ఖుషీ చంద్ చెన్నైలోని ఎస్‌ఎంకెఎఫ్‌ఐటీలో (బీఈ) కంప్యూటర్ సైన్స్ 2006లో పూర్తి చేశారు. క్యాంపస్ సెలక్షన్లో హెచ్‌పీ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజినీర్‌గా ఎన్నికయ్యాడు. 2008లో ఐబీఎంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసి.. 2009 నుంచి 2013 వరకు డెలాయిట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా నెలకు రూ.80 వేల జీతం తీసుకున్నాడు. అమెరికా వెళ్లి బాగా స్థిరపడాలనే కోరిక ఉండేది. పాలేకర్ రాసిన ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ పుస్తకం చదివిన తర్వాత పొలం బాట పట్టాడు. చదవండి: ‘ఆన్లైన్ రమ్మీ’ కేసుల్లో పోలీసుల మీమాంస క్యాన్సర్ నుంచి తల్లిని రక్షించుకుని ఖుషీచంద్ తండ్రి వడ్డె జయ ప్రసాద్ 2011 గుండెపోటుతో మరణించారు. ఆ బాధలో నుంచి కోలుకున్న కొద్ది సంవత్సరాలకు 2016లో తల్లి శివలీలకు క్యాన్సర్ అని తేలింది. 2017లో ఆమె డయాలసిస్ స్టేజ్‌కు వెళ్లింది. అయినా కుంగిపోలేదు. చదవండి: ఫుడ్ హీరోలు!: పంటల పుట్ట రామకృష్ణ పొలం! ఆర్గానిక్ ఉత్పత్తులను రోజూ ఇచ్చి తల్లిని కాపాడుకుంటాననే నమ్మకం అతడిలో కలిగింది. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, రైస్ ఇచ్చే వారు. మూడేళ్లలో ఎలాంటి మెడిసన్ వాడకుండా ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులతోనే అమ్మను కాపాడుకోగలిగానని చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయమంటే చిన్నచూపు మన దేశంలోనే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువ. ప్రపంచంలో 36 శాతం జనాభాకు ఆహార ధాన్యాలు అందించే అన్నపూర్ణ అయినా రసాయన ఎరువులతో పండించిన పంటలు ప్రజల ఆరోగ్యాన్ని పీడిస్తున్నాయి. వ్యవసాయం అంటేనే సమాజం అదోలా చూస్తోంది. ప్రకృతి వ్యవసాయం అంటే మరీ చిన్నచూపు. ఆ ఆలోచన మార్చుకోవాలి. – ఖుషీ చంద్ వడ్డె ‘కోశాగారం’.. ఆర్గానిక్ స్టోర్ 2013లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి షాద్‌నగర్‌లో 12 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, పిండి మిశ్రమంతో చేసిన జీవామృతంతో ఆకు కూరలు, కూరగాయలు పండించడం మొదలుపెట్టాడు. మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా రెండేళ్ల పాటు వ్యవసాయం చేసి ప్రకృతి సేద్యంపై అనేక మంది రైతులకు అవగాహన కల్పించాడు. అనంతరం ఓయూ కాలనీలో ‘కోశాగారం’ పేరిట ఆర్గానిక్ స్టోర్ నెలకొల్పాడు. అప్పటి నుంచి వ్యవసాయం మానేసి ప్రకృతి సేద్యం చేసిన రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను ఆర్గానిక్ స్టోర్‌లో విక్రయిస్తున్నాడు. ఇటీవల గచ్చిబౌలిలోనూ మరో స్టోర్ ప్రారంభించాడు. -
ఫుడ్ హీరోలు!: పంటల పుట్ట రామకృష్ణ పొలం!
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని ఆశతో రైతులు తమ పని తాను చేస్తూనే ఉంటారు. విత్తనాలకు చెమటను చేర్చి ఆహారోత్పత్తుల్ని పండిస్తారు. తన చుట్టూ ఉన్న జనులకు అందించి తమకు దక్కిన దానితో సంతృప్తి చెందుతారు. వరదొచ్చినా, కరువొచ్చినా, చివరకు కరోనా వచ్చిపడినా.. తమ పని తాము చేసుకుపోతున్నారు.. రసాయనాల్లేకుండా అమృతాహారాన్ని పండిస్తున్నారు.. అందుకే వీరు నిజమైన అన్నదాతలు.. రియల్ హీరోలు.. అచ్చమైన ఫుడ్ హీరోలు! ఈనెల 16న ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా వీరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవటం మన బాధ్యత! ‘‘హలో.. నేను దుగ్గిరాల నుంచి శ్రీనివాసరావునండీ.. రేపు మా ఇంట్లో శుభకార్యముంది.. 50 కిలోలు బీపీటీ ఒంటి పట్టు బియ్యం, ఇంట్లో వాడకానికి 25 కిలోల షుగర్ ఫ్రీ బియ్యం, అరకిలో పసుప్పొడి, కర్పూర అరటి రెండు గెలలు, కూర అరటి గెల, పది కిలోలు చొప్పున బెండ, కాకరకాయ, వంకాయ, బీరకాయలు, పాలకూర, తోటకూర, గోంగూర అయిదేసి పెద్ద కట్టలు.. రెండు కిలోల చేపలు కూడా పంపండి’’ ఓ గృహస్తు ఫోనులో చెప్పిన ఈ ఆర్డరు ఏ సూపర్ మార్కెట్‌కో, దుకాణదారునికో అనుకుంటే పొరపాటు! ఒక రైతుకు!! అవును.. మీరు విన్నది నిజమే. ఆ విలక్షణ రైతు పేరు మీసాల రామకృష్ణ. ప్రతి కుటుంబానికీ రోజువారీ అవసరమయ్యే అన్ని రకాల ఆహారోత్పత్తులను నిత్యం అందించే సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అది. ఇంటికి అవసరమైన అన్ని రకాల ఆహార పంటలనూ తన వ్యవసాయ క్షేత్రంలో పండించడంతోపాటు ఏడాది పొడవునా ప్రజలకు అందుబాటులో ఉంచటం ఆయన ప్రత్యేకత. తన పంట పొలం గట్టునే ఆహారోత్పత్తుల మార్కెట్‌గా మార్చి అనుదినం ఆదాయం పొందుతున్న రామకృష్ణ నిజమైన హీరో! ‘ఫుడ్ హీరో’!! గుంటూరు జిల్లా నందివెలుగులో పంటకాలువ వెంట 13 ఎకరాల మెట్ట / మాగాణి భూమే రామకృష్ణ కార్యక్షేత్రం. చెంచాడు రసాయనం వాడకుండా ఆయన నిబద్ధతతో, ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్న పంటల జాబితా చెప్పాలంటే చాలానే ఉంది. అరెకరంలో చేపల చెరువు, 35 పైగా రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల పంటలు. ఆరు ఎకరాల మాగాణిలో సిద్ధసన్నం, చిట్టిముత్యాలు, రెడ్ రైస్ (నవారా), రత్నచోడి, బీపీటీ–5204, అరెకరంలో పసుపు (ప్రగతి, సేలం, బ్లాక్ పసుపు) పండిస్తున్నారు. అంతర పంటలుగా బొప్పాయి, మామిడి అల్లం వేశారు. ఎకరంన్నరలో అరటి (కర్పూర, చక్కెరకేళి, కూర అరటి), అయిదెకరాల్లో బీర, బెండ, దొండ, పొట్లకాయ, కాకరకాయ, కీర దోస, దోస, రెండు రకాల మిర్చి, సొరకాయ, బీట్రూట్, గోరుచిక్కుడు, అర ఎకరంలో తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర సాగు చేస్తున్నారు. చేనంతా కొబ్బరి, మామిడి, జామ, నిమ్మ, నారింజ, మునగ, కరివేపాకు, తిప్పతీగ, సీతాఫలం, పనస ఉన్నాయి. చేపల చెరువు నీరు మాగాణికి వెళ్తుంది. బియ్యం మర ఆడించగా వచ్చిన తవుడు, నూకలు చేపలకు మేతగా వేస్తారు. దగ్గర్లోని మరో అయిదెకరాల్లో ఆర్ఎన్ఆర్–15048 (గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే సన్న బియ్యం) పండిస్తున్నారు. ఐదు ఆవులు పెంచుతున్నారు. పాలేకర్ పద్ధతిలో కషాయాలు, చౌహాన్ క్యూ విధానంలో పిష్ ఎమినో యాసిడ్ వాడుతున్నామని రామకృష్ణ చెప్పారు. ‘డ్రిప్ ఇరిగేషనులో పంటలకు జీవామృతం, పంచగవ్య, పీఎస్బీ, సూడోమోనాస్, హ్యూమిక్ యాసిడ్, ఫిష్ అమినో యాసిడ్ పిచికారీ చేస్తున్నాను.. కూరగాయ పంటలకు పది రోజులకోసారి జీవామృతం, బాక్టీరియా, పెరుగుదలకు ఫిష్ అమినో యాసిడ్ ఇస్తున్నా.. ‘కలుపు మందు వాడను... కూలీలలో పీకించటమో చెక్కించడమో చేస్తున్నా.. నేల తల్లిపై ఏమాత్రం రసాయనాలు పడరాదనే’ అంటారు రామకృష్ణ వినమ్రంగా! బియ్యం మర ఆడించి, పసుపు పొడి చేయించి, పండ్లు, కూర గాయలు, ఆకు కూరలతో సహా చాలా వరకు పొలం గట్టు మీదనే విక్రయిస్తున్నారు. మిగిలినవి నగరాల్లోని ఆర్గానిక్ దుకాణాలకు పంపుతున్నానని చెప్పారు. కూరగాయలు, ఆకుకూరలు, అరటి పంటలను నిర్ణీత వ్యవధిలో విత్తుకోవటం ద్వారా అవి ఏడాది పొడవునా అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. రోజూ ఆదాయం పొందటం ఈ ఆదర్శ రైతు మరో ప్రత్యేకత! నెలకు రూ.40–50 వేల ఆదాయం సమకూరుతోందని రామకృష్ణ వివరించారు. రైతంటే ఒకటో రెండో పంటలు పండించటం కాదు.. అదే క్షేత్రంలో అవకాశం ఉన్నన్ని ఎక్కువ ఆహార పంటలను రసాయనాల్లేకుండా పండించి ప్రజలకు అందించాలన్న చైతన్యం రామకృష్ణ (9989646499) మాటల్లో, చేతల్లో కనిపిస్తుంటుంది. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
‘ప్రకృతి’కి పట్టుగొమ్మ జీవామృతం
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలను రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సాగు చేయటం ద్వారా మనుషుల ఆరోగ్యంతోపాటు భూమి, పర్యావరణం, పశుపక్ష్యాదుల ఆరోగ్యం కూడా కుదుట పడుతుందని ఇప్పటికే రుజువైన విషయం. స్థానికంగా గ్రామాల్లో అందుబాటులో ఉండే ప్రకృతి వనరులతోనే స్థానిక ప్రజలకు అవసరమైన చక్కని ఆరోగ్యదాయకమైన పంట ఉత్పత్తులను పండించుకోవటం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతో ఆవశ్యకమైన అంశంగా అందరి గ్రహింపునకు వస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం జీవామృతాన్ని అందుబాటులో ఉన్న వనరులతోనే తయారు చేసుకోవటంతోపాటు, పంటలకు జీవామృతాన్ని వాడుకునే పద్ధతులను రైతులకు సూచిస్తోంది. జీవామృతం తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్ధాలు: 1. దేశీ ఆవుపేడ – 10 కేజీలు 2. దేశీ ఆవు మూత్రం – 5 నుండి 10 లీటర్లు 3. బెల్లం – 2 కేజీలు (నల్ల బెల్లం అయితే మరీ మంచిది) లేదా చెరుకు రసం 2 లీటర్లు 4. పప్పుల (ద్విదళాల) పిండి – 2 కేజీలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా వాడవచ్చు. వేరుశనగ, సోయా పిండి మాత్రం వాడకూడదు) 5). బావి/బోరు/నది నీరు – 200 లీటర్లు 6). పుట్ట మన్ను లేదా పొలంగట్టు మన్ను దోసెడు పెద్ద సిమెంటు తొట్లలో జీవామృతం తయారీ జీవామృతాన్ని తయారు చేసే విధానం: తొట్టిలో గానీ, డ్రమ్ములో గానీ 200 లీటర్ల నీటిలో ఈ పదార్థాలన్నింటినీ కలిపి నీడలో 48 గంటల పాటు ఉంచాలి. ప్రతి రోజూ రెండు, మూడు సార్లు కర్రతో కుడి వైపునకు తిప్పాలి. 200 లీటర్ల జీవామృతం ఎకరానికి సరిపోతుంది. ఇలా కలిపిన జీవామృతం 48 గంటల తర్వాత వాడకానికి సిద్ధమవుతుంది, అప్పట్నుంచి 9 నుంచి 12 రోజుల మధ్య సూక్ష్మజీవుల వృద్ధి అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు అధికంగా వృద్ధి చెందుతాయి. నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు చైతన్యవంతం అవుతాయి. తద్వారా భూసారం పెరగడానికి దోహదపడుతుంది. రైతులు వరి, మొక్కజొన్న, వేరుసెనగ, కూరగాయలు, పండ్ల తోటల దగ్గరే జీవామృతం తయారు చేసుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. ప్లాస్టిక్ డ్రమ్ములు, శాశ్వత సిమెంట్ వరలతో లేదా ఇటుకలతో నిర్మించే సిమెంటు తొట్లు, అవేవీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లను మూడు ఊత కర్రల సాయంతో నిలబెట్టి అందులో కూడా ద్రవ జీవామృతాన్ని తయారు చేసుకోవచ్చు. పంటలకు నీటి ద్వారా పారించవచ్చు. లేదా పిచికారీ చేయవచ్చు. పొలం గట్లపైనే జీవామృతం సిద్ధం చేసుకునే పద్ధతులు 1. 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ము ఎక్కువ మంది రైతులు జీవామృతం తయారీ కోసం 200 లీటర్లు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగిస్తుంటారు. ఈ డ్రమ్ము ఖరీదు సుమారుగా రూ. 800 వరకు ఉంటుంది. కొందరు రైతులు 100 లీటర్ల సామర్ధ్యం గల చిన్న ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగిస్తుంటారు. ఈ ప్లాస్టిక్ డ్రమ్ములను రైతులు పొలం గట్ల పైన లేదా పాకలు / షెడ్లలో పెట్టుకొని జీవామృతాన్ని తయారు చేసుకుంటూ వాడుతూ ఉంటారు. ప్లాస్టిక్ డ్రమ్ములతో సులువుగా పంటలకు కావలసిన జీవామృతాన్ని అందించగలుగుతున్నారు. 2. ప్లాస్టిక్ కవర్ పిట్ డ్రమ్ములు కొనలేని చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు 100 లీటర్ల ప్లాస్టిక్ కవర్లను జీవామృతం తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ కవరు ఖరీదు రూ. 20 వరకు ఉంటుంది. మూడు ఊత కర్రలను భూమి లోపలికి దిగేసి నిలబెట్టి, వాటి మధ్య ఈ ప్లాస్టిక్ కవర్‌ను ఉంచి పొలం గట్ల పైన లేదా పాకలలో జీవామృతం తయారు చేసుకొని వాడుతున్నారు. 3. సిమెంట్ వరలతో జీవామృతం పిట్ సిమెంటు వరల (నందల)తో పిట్లను నిర్మించుకొని కొందరు రైతులు జీవామృతాన్ని ఉపయోగిస్తున్నారు. ఇవి శాశ్వతంగా ఉండిపోతాయి. సిమెంట్ వరల పిట్ ఏర్పాటుకు సుమారు రూ. 500ల నుంచి రూ.750 వరకు ఖర్చవుతుంది. పండ్ల తోటల రైతులు వీటిని ఎక్కువగా నిర్మించుకొని ఏడాది పొడవునా జీవామృతం తయారీకి ఉపయోగిస్తున్నారు. 4. పెద్ద సైజు సిమెంటు తొట్లు సొంత భూముల్లో వ్యవసాయం చేసే రైతులు, పండ్ల తోటల రైతులు పొలంలోనే సిమెంటుతో పెద్ద తొట్లు నిర్మించుకొని, వాటిలో జీవామృతం తయారు చేసుకోవటమే కాకుండా ఫిల్టర్ చేసుకునే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. జీవామృతం పంటలకు వాడే పద్ధతులు : నీటి తడులతో పారించటం వరి, మొక్కజొన్న, చెరకు తదితర పంటలకు నీటి తడులను అందించేటప్పుడు నీటితో పాటుగా జీవామృతాన్ని ఎకరాకు ఒక దఫా 200 లీటర్లు చొప్పున అందిస్తున్నారు. పంటల వివిధ దశల్లో 3 నుండి 4 సార్లు నీటితోపాటు పారిస్తున్నారు జీవామృతం పిచికారీ పద్ధతి వరి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు జీవామృతాన్ని బాగా వడగట్టి, నీటితో పాటుగా ఎకరాకు ఒక దఫాకు 200 లీటర్లు పంటల వివిధ దశల్లో 3 నుంచి 4 సార్లు రైతులు పొలాల్లో పిచికారీ చేస్తున్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా జీవామృతం పారించటం పండ్ల తోటలు, కూరగాయ తోటలకు కొన్ని చోట్ల ఆరుతడి వరికి సైతం జీవామృతాన్ని జాగ్రత్తగా వడకట్టి డ్రిప్ ద్వారా లేదా స్ప్రింక్లర్ల ద్వారా రైతులు అందిస్తున్నారు. పైపాటుగా పంటలపై పోయటం చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు లేదా పెరట్లో కూరగాయలు పండించుకునే వారు పంటలపై జీవామృతాన్ని చెంబులు, మగ్గులతో విరజిమ్ముతున్నారు. (మరిన్ని వివరాలకు.. ప్రకృతి వ్యవసాయ విభాగం విజయనగరం జిల్లా మేనేజర్ ప్రకాశ్ (91211 47885)ను సంప్రదింవచ్చు) ఏ యే పంటలకు ఎంత జీవామృతం? వరి, మొక్కజొన్న, వేరుసెనగ, కూరగాయ పంటలకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి 200 లీటర్ల జీవామృతాన్ని నీటితోపాటు భూమికి అందించాలి. అలాగే పండ్ల తోటల్లో ఒక సంవత్సరం వయసున్న మొక్కకు అర లీటరు చొప్పున, రెండు సంవత్సరం మొక్కలకు ఒక లీటరు చొప్పున.. ప్రతి 15 రోజులకు ఒకసారి నేలకు అందించాలి. తద్వారా భూమిలో సుక్ష్మజీవరాశి పెంపొంది, నేల ఆరోగ్యవంతమవుతుంది. ఆరోగ్యవంతమైన భూమి మొక్కలకు సకల పోషకాలను అందిస్తుంది. -
ధోని ‘సేంద్రీయ వ్యవసాయం’
రాంచీ: క్రికెట్ ఆగిపోయిన వేళ ‘మహర్షి’లా తన పొలం పనులు చేసుకుంటున్నాడు ఎమ్మెస్ ధోని. సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టిన భారత జట్టు మాజీ కెప్టెన్ తన సొంత బ్రాండ్‌తో త్వరలోనే ఎరువులను మార్కెట్లోకి తీసుకురానున్నాడు. ధోని 39వ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాలు అతని ఆప్త మిత్రుడు మిహిర్ దివాకర్ వెల్లడించాడు. ‘ధోనికి సుమారు 50 ఎకరాల పొలం ఉంది. అతనికి సైనికుడిగా పని చేయడమన్నా, రైతుగా పని చేయాలన్నా బాగా ఇష్టం. ఇప్పుడతను తన పొలంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. మా వద్ద పలువురు వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వారు కొత్త రకం సేంద్రీయ ఎరువును అభివృద్ధి చేశారు. రెండు, మూడు నెలల్లో నియో గ్లోబల్ పేరుతో మార్కెట్లోకి తెస్తాం. ఇక కరోనా తగ్గి పరిస్థితులు చక్కబడే వరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనల్లో పాల్గొనరాదని ధోని నిర్ణయించుకున్నాడు’ అని మిహిర్ చెప్పాడు. మరో ఏడాది వయసు పెరిగింది. కాస్త జుట్టు కూడా నెరిసింది. కానీ ఇంకాస్త పరిణతి రావడంతో పాటు మరింతగా ముద్దొస్తున్నావు. ఇలాంటి అభినందనలు, బహుమతులను నువ్వు పట్టించుకోవని తెలుసు. కేక్, క్యాండిల్స్‌తో నీ జీవితపు మరో ఏడాదిని వేడుకగా జరుపుకుందాం. హ్యపీ బర్త్‌డే హజ్బెండ్. –ధోనికి భార్య సాక్షి పుట్టిన రోజు శుభాకాంక్షలు -
ఎంచక్కా ఎర్రల ఎవుసం!
మట్టిని నమ్ముకొని మనుగడ సాగించే వాడు రైతు. కేవలం తన ఆదాయం గురించే కాకుండా.. పొలంలో మట్టి బాగోగుల గురించి కూడా పట్టించుకునే రైతే నిజమైన కృషీవలుడు. నేలతల్లి అనారోగ్యాన్ని పసిగట్టి, రసాయనిక ఎరువులు, పురుగుమందులకు స్వస్థి చెప్పి సేంద్రియ వ్యవసాయం చేపట్టిన ఆదర్శ రైతులు ఇప్పుడు తెలుగు నాట చాలా మందే కనిపిస్తున్నారు. అయితే, ఎవరికీ పెద్దగా తెలియని రోజుల నుంచే సేంద్రియ సేద్య బాటన ఆయన తొలి అడుగులు వేశారు. పదిహేడేళ్ల క్రితం నుంచే వర్మీ కంపోస్టు తయారు చేసుకుంటూ ఆర్థికంగానూ పురోగమిస్తున్న ఓ తెలుగు రైతు విజయగాథ ఇది.. ‘ఎర్రల ఎరువు’ (వర్మీ కంపోస్టు)తో ఆర్జునే దయానంద్ పాటిల్‌కు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయనది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ధనోర–బి గ్రామం. గత 17 ఏళ్లుగా వర్మీ కంపోస్టుతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులకు స్వస్తి చెప్పి సేంద్రియ వ్యవసాయంలో అధిక దిగుబడులు తీస్తున్నారు. పంట వ్యర్థాలతోపాటు పశువుల పేడ ముడిపదార్థాలుగా వేసి భూమిని సారవంతం చేయగల వర్మీ కంపోస్టును తయారు చేస్తున్నారు. తన పొలంలో వాడటంతో పాటు ఆసక్తి కలిగిన ఇతర రైతులకూ వర్మీ కంపోస్టును అందుబాటులోకి తెస్తున్నారు. 2003లో శ్రీకారం వ్యవసాయ కుటుంబంలో పుట్టిన దయానంద్ పాటిల్‌కు 8 ఎకరాల 19 గుంటల పొలం ఉంది. నల్ల నేల. స్వగ్రామం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో ఆ రాష్ట్రం వెళ్లి వస్తూ ఉంటారు. ఆయనకు ఊహ తెలిసిన నాటి నుంచి రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం జరుగుతూ ఉంది. అయితే, తమ భూమిలో సారం ప్రతి ఏటా తగ్గుతున్నట్లు గుర్తించారు పాటిల్. మహారాష్ట్ర వెళ్లినప్పుడు ఒక చోట వర్మీ కంపోస్టు గురించి 2002లో తెలిసింది. భూమిని సారవంతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. 2003లో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతో చిన్నపాటి వర్మీ కంపోస్టు యూనిట్ ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుంచి వర్మీ కంపోస్టును పాటిల్ వదిలిపెట్టలేదు. వర్మీ కంపోస్టు అతని భూమిని సారవంతం చేయడంతో పాటు అదనపు ఆదాయాన్ని, అంతకుమించిన గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టింది. అధిక దిగుబడులు సాధించడంతో జిల్లా కలెక్టర్ దగ్గరి నుంచి రాష్ట్ర కమిషనర్ వరకు ఆయన సేంద్రియ పంటలను స్వయంగా వచ్చి చూసి ప్రశంశలు కురిపించారు. పత్తి, మిర్చి, జొన్న, కూరగాయ పంటల్లో అధిక దిగుబడులు సాధిస్తుండడంతో 2006లో ఆయనకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్ పిలిపించి, రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతు అవార్డుతో పాటిల్‌ను సత్కరించారు. భుజం తట్టి ప్రశంసించారు. ఆ తర్వాత మరింత శ్రద్ధతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని పాటిల్ ‘సాక్షి’తో చెప్పారు. ఉల్లి పంటను చూపుతున్న సేంద్రియ రైతు పాటిల్ వర్మీ కంపోస్టు ఉత్పత్తి ఇలా.. పాటిల్ పొలం దగ్గర షెడ్ల కింద ఇప్పుడు 8 బెడ్స్‌లో వర్మీ కంపోస్టు ఉత్పత్తి అవుతున్నది. బెడ్ 3 అడుగుల లోతు ఉండేలా నిర్మించాలి. పొడవు ఎంతైనా పెట్టుకోవచ్చు. ప్రధాన ముడి సరుకు పశువుల పేడ, పంట వ్యర్థాలు. త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉన్న సోయా కట్టె, శనగ కట్టె, కంది కట్టెను ముక్కలు చేసి బెడ్స్‌లో వేస్తారు. పంటల్లో తీసిన కలుపు మొక్కల్ని కూడా వేస్తారు. 20 వరకు నాటు ఆవులు ఉన్నాయి. వాటి పేడను వేసి.. ఆస్ట్రేలియా జాతికి చెందిన ఇసానియా ఫోటిడా రకం వానపాములను బెడ్స్‌లో వదులుతారు. ప్రతి రోజూ పొద్దున పేడ నీటిని బెడ్స్‌పైన చల్లాలి. సాయంత్రం మామూలు నీరు చల్లాలి. పిట్టలు, కోళ్లు బెడ్స్ వైపు రాకుండా చూడాలి. 3 వేల బస్తాలు ఏటా 3 వేల బస్తాల వర్మీ కంపోస్టు (బస్తా = 40 కిలోలు) ఉత్పత్తి చేస్తానని, తమ పొలంలో ఎకరానికి ఏటా పది క్వింటాళ్ల వరకు వేస్తామని పాటిల్ వివరించారు. రైతులకు బ్యాగ్ రూ. 300 చొప్పున అమ్ముతున్నానన్నారు. బెడ్లో నెల రోజుల్లో 200 బస్తాల (బస్తా 40 కిలోలు) వర్మీ కంపోస్టు సిద్ధం అవుతుందని పాటిల్ వివరించారు. బెడ్లో సిద్ధమైన వర్మీ కంపోస్టు మొత్తాన్నీ ఒకేసారి తీసెయ్యరు. సగం మేరకే తీస్తారు. సగం వైపు నీరు చల్లటం రెండు రోజులు ఆపితే.. వానపాములన్నీ తేమ ఉండే వైపు వెళ్తాయి. అప్పుడు ఈ వైపున వర్మీ కంపోస్టును తీస్తారు. ఆ మేరకు మళ్లీ గడ్డీ గాదం, పేడ వేస్తారు. సిద్ధమైన వర్మీ కంపోస్టును జల్లించి కుప్ప పోస్తారు. రోజూ కుప్పపై తగుమాత్రంగా నీరు చల్లుతూ ఉంటారు. ఎవరైనా కావాలన్నప్పుడు బస్తాల్లో నింపి అమ్ముతారు. బస్తాల్లో నింపిన తర్వాత రెండు నెలల్లోగా పొలాల్లో వేసుకోవాలి. వేసవిలో తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడైనా పొలాల్లో వేసుకోవచ్చు. వర్మీ కంపోస్టులో వానపాముల గుడ్లు ఉంటాయి. ఎండాకాలం పొలాల్లో వేస్తే గుడ్లు చనిపోతాయి. పంట ఏదైనా చీడపీడల బెడదే లేదు! ఖరీఫ్‌లో పాటిల్ వ్యవసాయం అంతా వర్షాధారంగానే సాగుతుంది. పంటల మార్పిడి పాటిస్తారు. ఈ ఏడాది పత్తి వేసిన పొలంలో వచ్చే ఏడాది టమాటో/సోయా/మిర్చి తదితర పంటలు వేస్తారు. జొన్న వేసిన పొలంలో వచ్చే ఏడాది సోయా తదితర పంటలు వేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 5 ఎకరాల్లో బీటీ పత్తిని సేంద్రియంగానే సాగు చేశారు. ఎకరానికి పది క్వింటాళ్ల వర్మీ కంపోస్టు వేస్తారు. రెండేసి సార్లు వేపనూనె(1000 పిపిఎం), గోమూత్రం (200 లీ. నీటిలో 5 లీ. గోమూత్రం) పిచికారీ చేస్తారు. గోమూత్రం వేప నూనెకు ముందు లేదా వెనుక లేదా దానితో కలిపి కూడా అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తారు. ఇక అంతే. పత్తికి ఎటువంటి చీడపీడల బెడదా ఉండదు. మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. గులాబీ పురుగు, రసంపీల్చే పురుగుల బెడదే ఉండదు అని పాటిల్ అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఎకరానికి 14 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది (రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు 10 క్వింటాళ్లే వచ్చింది). ఖర్చులు పోను రూ. లక్షన్నర నికరాదాయం వచ్చిందని పాటిల్ వివరించారు. ఎకరంన్నరలో హైబ్రిడ్ టమాటో సాగు చేశారు. ఎకరానికి పది టన్నుల దిగుబడితో రూ. లక్షన్నర నికరాదాయం పొందానన్నారు. ఏటా రూ. 7 లక్షల నికరాదాయం పాటిల్ తన భూమిలో 13 బోర్లు వేసినా ఒక్క బోరులో కూడా నీరు రాలేదు. రబీలో సోదరుడి పొలంలో బోరు, బావి నుంచి నీరు తీసుకొని పరిమితంగా పంటలు సాగు చేస్తారు. ముప్పావెకరం ఉల్లి, ముప్పావెకరం గోధుమ, ఎకరం పెద్ద జొన్న, సొర సాగు చేస్తున్నారు. నాటు రకం సొర కాయలు 12.5 కిలోలు తూగాయని చెప్పారు. ఈ ఏడాది వానలు బాగా పడటంతో పంటలు బాగా పండాయని పాటిల్ సంతోషంగా చెప్పాడు. ఇతర ఖర్చులు, ముగ్గురు జీతగాళ్ల జీతాలు పోను పంటల మీద, వర్మీ కంపోస్టు మీద ఈ ఏడాది రూ. 7 లక్షల నికరాదాయం వచ్చిందన్నారు. పాటిల్‌కు ఆదాయంపై చింత లేదు. చీడపీడలు లేని సేంద్రియ పంటల దిగుబడి పొందటంలో పెద్ద సమస్యలు ఉండవు. దీంతోపాటు వర్మీ కంపోస్టుపై ఆదాయం కూడా వస్తుంది. సొంత వనరులతో సేంద్రియ వ్యవసాయం చేసే రైతు దీర్ఘకాలంలో ఎంత నిశ్చింతగా, నిబ్బరంగా ఉండవచ్చో చెప్పాలంటే దయానంద్ పాటిల్ పేరు చెప్పవచ్చు! ఏడాది చాలు! నేను 17 ఏళ్లుగా వర్మీ కంపోస్టు తయారు చేసుకుంటూ సేంద్రియ పంటలు నిశ్చింతగా పండిస్తున్నా. పత్తి, మిర్చి తదితర పంటల్లో కూడా వేపనూనె, గోమూత్రం పిచికారీతో చీడపీడల బెడద లేకుండా సాగు చేస్తున్నా. ఏకవల్య ఫౌండేషన్, ధాన్ ఫౌండేషన్, కేవీకే తదితర సంస్థల మీటింగ్‌లలో రైతులకు శిక్షణ ఇస్తుంటాను. రైతులు వచ్చి వర్మీ కంపోస్టు కొనుక్కెళ్తుంటారు. అయితే, సొంతంగా ఎవరూ వర్మీ కంపోస్టు తయారు చేసుకోవటం లేదు. ఉదయం పేడ నీరు, సాయంత్రం మామూలు నీరు పిచికారీ చేయాలి. పక్షులు, కోళ్లు వానపాములను తినెయ్యకుండా కాపలా కాయాలి. ఈ మాత్రం జాగ్రత్త తీసుకుంటే చాలు. ఉపయోగం ఉందని తెలిసినా కష్టపడటానికి రైతులు ఎవరూ ఇష్టపడటం లేదు. రసాయనిక వ్యవసాయం చేస్తున్న రైతులు సేంద్రియ వ్యవసాయంలోకి మారడానికి ఒక ఏడాది చాలు. తొలి ఏడాది మాత్రం.. ఎకరానికి పది క్వింటాళ్ల వర్మీ కంపోస్టు వేసి, రసాయనిక ఎరువులు కూడా 25 శాతం వరకు వేయాలి. రెండో ఏడాది నుంచి వర్మీ కంపోస్టు వేస్తే చాలు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలి. సబ్సిడీ ఇస్తే వేప నూనె తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకుందామని అనుకుంటున్నా. – ఆర్జునే దయానంద్ పాటిల్ (94415 28383),దనోర–బి, ఇంద్రవెల్లి మం., ఆదిలాబాద్ జిల్లా – ఆత్రం జగదీశ్,సాక్షి, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ జిల్లా -
సేంద్రియ సేద్యంపై ఆన్లైన్ శిక్షణ
కేంద్ర వ్యవసాయ, సహకార, రైతుల సంక్షేమ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం (ఎన్.సి.ఓ.ఎం.) కనీసం గ్రామీణ రైతులు, మహిళా రైతులకు సేంద్రియ సేద్యపద్ధతులపై ఆన్లైన్లో 7 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. జూలై మొదటి వారంలో శిక్షణ ఇస్తారు. ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్/ డిగ్రీ/ పీజీ పాసైన గ్రామీణ యువ రైతులు, యువ మహిళా రైతులు అర్హులు. వయస్సుకు సంబంధించి నిబంధన లేదు. గ్రామీణ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఎన్.సి.ఓ.ఎం. కేంద్ర కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉండగా, మరో 8 చోట్ల ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ప్రతి ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వంద మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పరిధిలోని రైతులకు నాగపూర్‌లోని ప్రాంతీయ కార్యాలయం శిక్షణ ఇస్తుంది. రైతులు దరఖాస్తు పంపాల్సిన మెయిల్ ఐడి: rdrcof.ngp-agri@gov.in phone: 07118 297 054 దరఖాస్తు ఫారంను ఈ క్రింది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.. https://ncof.dacnet.nic.in/DowloadableForms/ApplicationFormForTraining.pdf -
సీఎంకు కానుకగా తెలంగాణ యాపిల్ తొలి కాత..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో తొలిసారి యాపిల్ పండ్లు పండించిన కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజీ తొలి కాతను మంగళవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంకు యాపిల్ మొక్కను, పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో 2 ఎకరాల్లో హెచ్ఆర్–99 రకం యాపిల్ పంటను సాగు చేసినట్లు బాలాజీ తెలిపారు. ఉద్యానవన శాఖ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో యాపిల్ పంట సాగుపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బాలాజీని సీఎం కేసీఆర్ అభినందించారు. తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవని చెప్పడానికి ఇక్కడి నేలల్లో యాపిల్ పండ్లు పండటమే ఉదాహరణ అన్నారు. -
కేసీఆర్‌కు ఆపిల్ పండ్లు అందించిన రైతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి పండించిన ఆపిల్ పండ్లను ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజీ మంగళవారం ప్రగతి భవన్లో అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌కి రైతు బాలాజీ మొక్కను, పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాలాజీని అభినందించారు. కొమురం భీం (ఆసిఫాబాద్)జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రెండు ఎకరాల్లో హెచ్ఆర్ 99 ఆపిల్ పంటను సాగు చేసినట్లు బాలాజీ తెలిపారు. ఉద్యానవన శాఖ ఆపిల్ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో ఆపిల్ పంట సాగుపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవి చెప్పడానికి ఇక్కడి నేలల్లో ఆపిల్ పండ్లు పండడమే ఉదాహరణ అని చెప్పారు. (ఇదిగో తెలంగాణ ఆపిల్!) -
ఇదిగో తెలంగాణ ఆపిల్!
సేంద్రియ రైతుతో కలిసి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా తెలంగాణ లోని ధనోరా గ్రామపరిధిలో ఆపిల్ పండ్ల సాగు కల సాకారమైంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో దనోరా గ్రామం ఉంది. ఉష్ణోగ్రత ఏడాదిలో కొద్దిరోజులైనా అతి తక్కువగా నమోదయ్యే ఎత్తయిన ప్రాంతమే ఆపిల్ సాగుకు అనుకూలం. ధనోరా ప్రాంతంలో అక్టోబర్ – ఫిబ్రవరి మధ్యలో.. 3 నుంచి 400 గంటల పాటు.. సగటున 4 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. అందువల్లే ధనోరా తెలంగాణ కాశ్మీర్‌గా పేరుగాంచింది. ఈ విషయం గ్రహించిన హైదరాబాద్‌లోని కేంద్రప్రభుత్వ సంస్థ సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్తలు డా. ఏ వీరభద్రరావు, డా. రమేశ్ అగర్వాల్ ఐదేళ్లక్రితం సర్వే చేసి.. సేంద్రియ రైతు కేంద్రే బాలాజి పొలం ప్రయోగాత్మకంగా ఆపిల్ సాగుకు అనువైనదిగా గుర్తించారు. చాలా ఏళ్లుగా సేంద్రియ ఉద్యానతోటలు సాగు చేస్తున్న బాలాజి అప్పటికే పది ఆపిల్ మొక్కలు నాటితే, కొన్ని మాత్రమే బతికాయి. ఈ నేపథ్యంలో సీసీఎంబీ శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో నాణ్యమైన ఆపిల్ మొక్కల సాగుకు బాలాజి శ్రీకారం చుట్టారు. వారు అందించిన హరిమన్, బిలాస్పూర్, నివోలిజన్, అన్న, రాయల్ డెలిషియస్ రకాలకు చెందిన నాణ్యమైన 500 ఆపిల్ మొక్కలను బాలాజి మూడేళ్ల క్రితం తన పొలంలో నాటారు. 400 మొక్కలు ఏపుగా ఎదిగాయి. ఈ ఏడాది చక్కని కాపు వచ్చింది. చెట్టుకు 25 నుంచి 40 కాయలు ఉన్నాయి. అయితే, లేత చెట్లు కావటంతో కాయ సైజు చిన్నగా ఉంది. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లో అమ్మకానికి పెట్టే అంత సైజు కాయలు వస్తాయని రైతు బాలాజి ‘సాక్షి’తో చెప్పారు. 5 ఎకరాల్లో ఆపిల్‌తో పాటు మామిడి, దానిమ్మ, అరటి, బత్తాయి, సంత్ర, ఆపిల్ బెర్ పంటలను ఆయన సాగు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ఆపిల్ పండ్లను ప్రజలు రుచిచూడటానికి కృషి చేసిన సీనియర్ సేంద్రియ రైతు, సీసీఎంబి శాస్త్రవేత్తలు, ఉద్యాన, వ్యవసాయ అధికారులకు జేజేలు! ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి! మా ఊళ్లో ఆపిల్ సాగుకు వాతావరణం అనుకూలమేనని రుజువైంది. ఇక్కడ చాలా మంది రైతులు ఆపిల్ సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరికొంతమంది రైతులకు మెలకువలు నేర్పుతాను. ఎక్కువ మంది రైతులు ఆపిల్ పంటను పండిస్తే అమ్మకం సులువు అవుతుంది. ఆపిల్ పంట పండించందుకు సీసీఎంబీ శాస్త్రవేత్తలతో పాటు ఉద్యానవన శాఖాధికారుల, వ్యవసాయాధికారుల కృషి కూడా ఉంది. ఇప్పుడు చేతికొచ్చిన ఆపిల్ పండు చిన్నదిగా ఉంది. ఈ ఏడాది గడిస్తే మరింత పెద్ద సైజు పండ్లు కాసే అవకాశం ఉంది. అందుకే వచ్చే ఏడాది నుంచి మార్కెట్లో అమ్మకానికి పెడదామనుకుంటున్నాను. – కేంద్రే బాలాజి (99490 92117), ఆపిల్ రైతు, కెరమెరి(ధనోర), భీం ఆసిఫాబాద్ జిల్లా బాలాజి తోటలో ఆపిల్ పండు – ఆనంద్, సాక్షి, కెరమెరి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా -
మిరప భళా!
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పూర్తి స్థాయిలో అనుసరిస్తే మిరప సాగులో చీడపీడలను సమర్థవంతంగా అధిగమించడంతోపాటు అధిక దిగుబడి పొందవచ్చని నిరూపిస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన రైతు పి. శరత్చంద్ర. పాణ్యం మండలం తొగరచేడులో తన మిత్రుడు వై.రామిరెడ్డితో కలిసి ఏడెకరాల్లో రెండేళ్లుగా మిరప పంటను శరత్ సాగు చేస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కారువంకలో గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడులు సాధిస్తున్న లావణ్య రమణారెడ్డి వద్ద నుంచి కావేరి రకం దేశీ మిర్చి విత్తనాలు తెచ్చుకొని గత ఏడాది నుంచి సాగు చేస్తున్నారు. ఎకరానికి రెండు కిలోల విత్తనాన్ని గొర్రుతో సాళ్లుగా వెద పెట్టి మిరప పంటను సాగు చేయటం విశేషం. సాళ్ల మధ్య రెండు అడుగులు పెడుతున్నారు. మొక్కల మధ్య 9 అంగుళాల నుంచి ఒక అడుగు దూరం ఉంచుతున్నారు. మొలిచిన తర్వాత 2–3 వారాల్లో పోనాటు వేస్తున్నారు. వెద పద్ధతిలో మిరప సాగు చేయటం వల్ల జెమినీ వైరస్‌ను తట్టుకునే శక్తి పెరిగినట్లు తాము గమనించామని శరత్ తెలిపారు. నారు పీకి మొక్క నాటినప్పుడు.. మొక్క తిరిగి వేరూనుకొని తిప్పుకునే లోగా జెమినీ వైరస్ సోకుతున్నదని, విత్తనం వెద పెట్టినప్పుడు ఆ సమస్య రాదన్నారు. గత ఏడాది ఎకరానికి 15–16 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి సాధించామని, అతివృష్టి వల్ల నష్టం జరిగినప్పటికీ ఈ ఏడాది కూడా అదే స్థాయిలో దిగుబడి వస్తుందని ఆశిస్తున్నామని అంటున్న శరత్ మాటల్లోనే వారి సాగు తీరుతెన్నులు.. ఘనజీవామృతం, వేపపిండి.. దుక్కిలో ఎకరానికి ఘనజీవామృతం 2 టన్నులు, వేపపిండి ఒక టన్ను వేశాం. మిరప విత్తనం వేసిన వెంటనే ద్రవ జీవామృతం పిచికారీ చేశాం. మిరప విత్తనాలు మొలిచిన 15 రోజుల తర్వాత 20 లీ. నీటికి 40 ఎం.ఎల్. చొప్పున 10,000 పిపిఎం వేపనూనె పిచికారీ చేశాం. మొక్కలపై పచ్చదోమ, తామరపురగు గుడ్లుంటే దీని వల్ల పగిలిపోతాయి. ఆ తర్వాత వారానికి జీవామృతం పిచికారీ చేశాం. విత్తిన నెల తర్వాత ఎకరానికి టన్ను ఘనజీవామృతం, అర టన్ను వేపపిండి వేసి.. నీటి తడి ఇవ్వటంతో పాటు జీవామృతం పారించాము. 45వ రోజు పంచగవ్య (లీటరుకు 9 లీ. నీరు) పిచికారీ చేశాం. అప్పటినుంచి ప్రతి 15 రోజులకోసారి భూమిలో నీటి తడితోపాటు జీవామృతం పారించడం, పంచగవ్య పిచికారీ చేస్తున్నాం. మిరపతోపాటు ఆముదం, బంతి, జొన్న మిరప విత్తనాన్ని గొర్రుతో సాళ్లుగా వెదపెట్టిన తర్వాత.. ప్రతి 20 అడుగులకు ఒక ఆముదం మొక్క, ప్రతి 6 అడుగులకు ఒక బంతి మొక్క వేశాం. ఆముదం కొన్ని రకాల పురుగులను దరిచేరనీయదు. బంతిమొక్క వల్ల మిరప మొక్కలకు నులిపురుగుల (నెమటోడ్స్) సమస్య, వేరు కుళ్లు రాకుండా ఉంటాయి. బంతి పూలకు తేనెటీగలు, సీతాకోకచిలుకలు వస్తాయి కాబట్టి పరపరాగ సంపర్కం బాగా జరుగుతుంది. పొలం చుట్టూతా 3 వరుసలు పచ్చ జొన్న విత్తాం. తద్వారా బయటి నుంచి పొలం లోపలికి రసం పీల్చే పురుగులు రాకుండా జొన్న పంట కంచె మాదిరిగా ఉపయోగపడుతుంది. జొన్నలు తినటానికి పక్షులు వస్తాయి. మిరప మొక్కలపై కనిపించే పురుగూ పుట్రను కూడా పక్షులు తింటాయి. దోమ నివారణకు ఎకరానికి 30 నూనె పూసిన పసుపు రంగు అట్టలను, తామరపురుగులను అరికట్టేందుకు ఎకరానికి 30 నూనె పూసిన నీలం అట్టలను పెట్టాం. మగపురుగులను మట్టుబెట్టేందుకు ఎకరానికి పది ఫెరమోన్ ట్రాప్స్ ఏర్పాటు చేశాం. ఈ విధంగా చీడపీడలను జీవనియంత్రణ పద్ధతుల్లో పంటను రక్షించుకుంటున్నాం. ఆకు ముడతకు ఉల్లిగడ్డ కషాయం ఆకు ముడత కనిపిస్తే ఉల్లిగడ్డ కషాయం పిచికారీ చేస్తున్నాం. ఎకరానికి 5 లీ. కషాయం చాలు. 20 లీ. నీటికి ఒక లీ. కషాయం కలిíపి చల్లుతున్నాం. ఆకుముడతను అరికడితే జెమినీ వైరస్ రాదు. ఈ కషాయం ద్వారా పోషకాలు కూడా మొక్కలకు అందుతాయి. ఉల్లిగడ్డ కషాయం తయారీ విధానం : ఈ కషాయం ఒకసారి తయారు చేస్తే 6 నెలలు నిల్వ ఉంటుంది. కిలో ఉల్లి గడ్డలు, కిలో లవంగాలు, అర కిలో ఇంగువ, 100 గ్రా. పచ్చ కర్పూరం కలిపి పొడి చేసి 20 లీ. నీటిలో కలపాలి. అందులో 10 లీ. దేశీ/నాటు ఆవు మూత్రం, అర కిలో పేడ కలిపి.. పొయ్యి మీద పెట్టి 5 పొంగులు వచ్చే వరకూ మరిగించాలి. సుమారు 30 లీ. కషాయం సిద్ధమవుతుంది. వడకట్టి నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. 15–20 రోజులకోసారి ఈ కషాయాన్ని పిచికారీ చేస్తే ఆకుముడత నుంచి మిరప తోటను కాపాడుకోవచ్చని మా అనుభవంలో రుజువైంది. బవేరియా.. వర్టిసెల్లం.. పూత దశలో 3% (వంద లీ. నీటికి 3 లీ. పుల్లమజ్జిగ) పుల్ల మజ్జిగ పిచికారీ చేశాం. చిన్న పిందె దశలో సప్త ధాన్యాంకు కషాయం పిచికారీ చేశాం. పూత ఆగిపోయిన తర్వాత కూడా మరోసారి చల్లాం. విత్తిన 60–75 రోజుల మధ్యకాలంలో.. బవేరియా బాసియానా శిలీంధ్రాన్ని (లీ. నీటికి 8 ఎం.ఎల్. చొప్పున) పిచికారీ చేశాం. ఇది చల్లిన 10–15 రోజుల మధ్యలో వర్టిసెల్లం లఖాని శిలీంధ్రాన్ని పిచికారీ చేశాం. తామరపురుగులు, దోమను అరికట్టడానికి ఈ శిలీంధ్రాలు బాగా తోడ్పడ్డాయి. మిరప పంటను ఆశించే చీడపీడలను సమర్థవంతంగా నివారించాలంటే ఇలా బహుముఖ వ్యూహాన్ని అమలు పరచక తప్పదు. జూలై 28న మిరప విత్తనం వేశాం. మార్చి 2 నుంచి మిరప పండ్లు కోస్తున్నాం. 60–70% కాయలు ఎర్రబడిన తర్వాత నీటితడితోపాటు జీవామృతం పారించిన రెండు వారాల తర్వాత మొదటిసారి మిర్చి పండ్లు కోస్తున్నాం. మొదటి కోతలో 80%, ఆ తర్వాత రెండు మూడు కోతల్లో మిగతావి కోసి ఎండబెట్టి, తేమ 10–15%కు తగ్గిన తర్వాత బస్తాలకు ఎత్తి అమ్ముతాం. లేదా కోల్డ్ స్టోరేజ్‌కి తరలిస్తాం. ఈ ఏడాది అతివృష్టి వల్ల మిరప తోటలు దెబ్బతిన్నాయి. అయినా మా తోటలో ఎకరానికి 15 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. ప్రకృతి సాగు ప్రారంభించిన గత ఏడాది ఎకరానికి 16 క్వింటాళ్ల వరకు ఎండు మిర్చి దిగుబడి వచ్చింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడే మిరప రైతులకు మా ప్రాంతంలో సగటున 18 క్వింటాళ్ల (అత్యధికంగా 24 క్వింటాళ్ల) దిగుబడి వస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రకృతి/సేంద్రియ పద్ధతిలో సాగు చేయడానికి మాకు ఎకరానికి రూ. 40 వేలు– రూ. 50 వేలు ఖర్చు అయ్యింది. రసాయనాలు వేసే వారికి రూ. లక్ష వరకు ఖర్చవుతుంది. ఎండుమిర్చిని మనదేశం నుంచి చైనా వాళ్ళు కొనకపోవడం వల్ల ధర కొంత తగ్గింది. అయినా మాకు ఎకరానికి కనీసం రూ. 1,20,000 నికరాదాయం వస్తుందని ఆశిస్తున్నాం. మేం వేసింది దేశీ రకం కావేరి మిరప. పంట నుంచి తీసిన విత్తనాలనే అడిగిన రైతులకూ ఇస్తున్నాం.. మేమూ వాడుతున్నాం. (పి. శరత్చంద్ర –99898 53366, వై.రామిరెడ్డి – 98667 60457) -
వెన్నపండు వచ్చెనండి
‘అవకాడో’ గురించి మీరెప్పుడైనా విన్నారా? దీన్ని తెలుగులో ‘వెన్నపండు’ అనుకుందాం. విని ఉంటారు గానీ.. తిని ఉండరు. అయితే ఎక్కడో బ్రెజిల్, సెంట్రల్ అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పండు ఇప్పుడు భారత్‌లోనూ పండుతోంది. సూపర్ మార్కెట్లలో కిలోకు రూ.300 వరకూ పలికే ఈ వెన్నపండు ఆంధ్రప్రదేశ్‌లోనూ మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో విరివిగా పండుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉద్యానపంటల్లో భాగంగా అవకాడోను పండించుకోవడం ద్వారా రైతులు లాభాలు గడించవచ్చునని అంటున్నారు.. జి.ఎన్.శ్రీవత్స. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యాన విభాగంలో సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీవత్స దేశంలో అవకాడో పంటకు సంబంధించిన సమాచారం ‘సాక్షి సాగుబడి’కి అందించారు. ఆ వివరాలు.. అర శతాబ్దంగా భారత్‌లో.. ముందుగా చెప్పుకున్నట్లు అవకాడో బ్రెజిల్, సెంట్రల్ అమెరికాకు చెందిన పండు. శాస్త్రీయ నామం పెర్సియా అమెరికానా. పచ్చటి రంగు, గుండ్రటి, కోలగా ఉండే రెండు రకాల్లో లభిస్తాయి. కొన్ని వందల ఏళ్ల క్రితమే బ్రెజిల్ నుంచి దేశాలు తిరిగి జమైకాకు.. ఆ తరువాత సుమారు 50–60 ఏళ్ల క్రితం భారత్‌కూ వచ్చింది. తమిళనాడులోని కోయంబత్తూరు, నీలగిరి ప్రాంతాల్లో ప్రస్తుతం ఎక్కువగా సాగవుతోంది. అవకాడో పండ్లలో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు గణనీయంగా ఉంటాయి. ఈ రకమైన కొవ్వులు గుండెకు మేలు చేస్తాయని మనకు తెలుసు. ఈ పండుతో వచ్చే కేలరీల్లో 77 శాతం వరకూ కొవ్వుల ద్వారానే లభిస్తాయి. కాకపోతే అన్నీ శరీరానికి మేలు చేసే కొవ్వులు కావడం గమనార్హం. ఓలిక్ ఆసిడ్ రూపంలో లభించే కొవ్వులు శరీరంలో మంట/వాపులను తగ్గిస్తాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రకంగా చూస్తే ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు లభించే శాకాహారాల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. తమిళనాడు తీర ప్రాంతాల్లో బాగా పండుతున్న అవకాడోకు తూర్పు కనుమల్లోనూ అనుకూలమైన వాతావరణం ఉందని శ్రీవత్స తెలిపారు. అంతర పంటలకూ అవకాశం.. అనేక ఉద్యాన పంటల మాదిరిగానే అవకాడో సాగులోనూ అంతర పంటలకు అవకాశాలు ఉన్నాయి. పది అడుగుల ఎడంతో మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. విత్తనం ద్వారా నేరుగా మొలకెత్తించే అవకాశం లేదు. విత్తనాన్ని పాక్షికం గా నీటిలో ఉంచేలా చేయడం ద్వారా రెండు నుంచి ఆరు వారాల్లో మొలకెత్తుతుంది. కొంతకాలం తరువాత నేలలో నాటుకోవచ్చు. ఆరేడు సంవత్సరాలకు కాపునిచ్చే అవకాడో జీవితకాలం సుమారు 50 సంవత్సరాలు. ఒక్కో చెట్టు ఏటా 200 నుంచి 500 వరకూ పండ్లు కాస్తాయని, వెరైటీని బట్టి ఒక్కో పండు 250 గ్రాముల నుంచి కిలో వరకూ బరువు తూగుతాయని శ్రీవత్స తెలిపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చులతో పోలిస్తే దేశీయంగా సాగు చేసుకోవడం ద్వారా అటు రైతులు, ఇటు ప్రజలకూ ప్రయోజనమని ఆయన వివరించారు. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అవకాడో సాగుకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉందని, అవసరమైన వారు జnటటజీఠ్చ్టిట్చఃజఝ్చజీ .ఛిౌఝ ఈ మెయిల్ ద్వారా తనను సంప్రదించవచ్చునని శ్రీవత్స తెలిపారు. -
ఇంటి సాగే ఇతని వృత్తి!
వ్యవసాయమా... అందునా ఇంటిపైనా.. అయ్య బాబోయ్ అంత శ్రమపడలేను, సమయం వెచ్చించలేనని ఎంతమాత్రం వెనుకాడవద్దు అంటున్నారు చెన్నైకి చెందిన 31 ఏళ్ల యువకుడు రాహుల్ ధోకా. నాలుగు గోడలు ఉంటే చాలు, రోజుకు కేవలం పది నిమిషాల సమయం గడిపితే చాలు ప్రకృతి వరప్రసాదం వంటి స్వచ్ఛమైన అనేక వ్యవసాయ ఉత్పత్తులు మీకు సొంతం అవుతాయని భరోసా ఇస్తున్నారాయన. విలాసవంతమైన జీవితంతోపాటూ ఎం.ఎస్. పట్టా చేతిలో ఉండి కూడా ఇంటిపంటల సాగునే వృత్తిగా చేసుకున్న విలక్షణ వ్యక్తిత్వం రాహుల్‌ది. తన ఉత్పత్తులతో కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ఆకట్టుకుంటున్నారు. వంటింటి అవసరాలకు మార్కెట్లకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ ఇంటిలోనే వ్యవసాయ ఉత్పత్తులను హైడ్రోపోనిక్ పద్ధతిలో చేతికి మట్టి అంటకుండా సులభతరంగా సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆయన మాటల్లోనే.. అన్నా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ అయ్యాక యూకే వెళ్లి వార్విక్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశాను. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే సేంద్రియ వ్యవసాయం వైపు ఆకర్షితుడినయ్యాను. తల్లిదండ్రుల వద్దకు చెన్నై తిరిగి వచ్చిన తరువాత 2013లో సేంద్రియ ఉత్పత్తుల విక్రయ స్టోర్ పెట్టాను. వంద రకాల ఉత్పత్తులను అమ్మేవాడిని. స్వయంగా సాగు చేయాలని 2016 డిసెంబరులో హైడ్రోపోనిక్ విధానంలో ‘ఆక్వాఫామ్స్’ పేరిట (నుంగంబాక్కం తిరుమూర్తి నగర్‌లోని) మా ఇంటి పైనే సాగు ప్రారంభించాను. చెన్నైలో తరచూ ఎదురయ్యే నీటి కొరత ప్రభావానికి గురికాని వ్యవసాయం చేయాలని తలపెట్టాను. మూడు నెలలు పరిశోధన చేసిన తరువాత వీటన్నింటికీ సమాధానంగా హైడ్రోపోనిక్ విధానంలో పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని నమ్మి అనుసరిస్తున్నాను. పాలకూర, తోటకూర, గోంగూర తదితర ఆకుకూరలు, వాము పాక్చోయ్, బ్రహ్మి, తులసి, బంతి పెంచుతున్నాను. కొబ్బరి పొట్టు, క్లే బాల్స్ వేసి విత్తనాలు నాటి నర్సరీ పెంచుతున్నాను. మొక్కలు కొంచెం పెరిగిన తరువాత వాటిని పీవీసీ పైపులను నిలువుగా అనేక వరుసల్లో ఏర్పాటు చేసుకొని, వాటికి రంధ్రాలు పెట్టి, కేవలం రెండు అంగుళాలున్న ఆ కప్పులను ఆ రంధ్రాల్లో కూర్చోబెడుతున్నాను (ఈ కప్పుల్లో మట్టికి బదులుగా వరిపొట్టు, వర్మిక్యులేట్, స్పాంజ్‌లను కూడా వాడవచ్చు). మొక్కల కుదుళ్లకు కొబ్బరి పొట్టును ఏర్పాటు చేసి సాధారణ నీటిలో న్యూట్రిషన్ నీళ్లను కలిపి ప్లాస్టిక్ గొట్టాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా ప్రవహింపజేస్తాను. ఎన్పీకే న్యూట్రిషన్తోపాటు మెగ్నీషియం సల్ఫేటు, కాల్షియం నైట్రేట్‌ను ద్రావణం రూపంలో కేవలం మొక్కల వేళ్ల ద్వారా ప్రవహింపజేయడం వల్ల ఎలాంటి దోషమూ ఉండదు. నేలపై అమర్చిన చిన్నపాటి వాటర్ ట్యాంక్ నుంచి మోటార్ ద్వారా పైప్‌కు పై భాగంలో ఈ నీటిని విడుదల చేస్తాను. అవి అలా ప్రవహిస్తూ అన్ని మొక్కలకు చేరుతాయి. మొక్కలకు అందగా మిగిలిన నీరు మళ్లీ కింద ట్యాంక్‌లో పడిపోతుంది. అదేనీటిని నిర్ణీత కాలవ్యవధిలో మళ్లీ వాడుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల ఒక్కనీటి చుక్క కూడా వృథా పోదు. ఆరు వారాల్లో 200 గ్రాముల దిగుబడి పాలకూర, తోటకూర, లెట్యుసీ, పాక్చోయ్, బ్రహ్మి, తులసి, మారిగోల్డ్ ఫ్లవర్, అజ్వైన్ తదితర ఆకుకూరలు పెంచుతున్నాను. పుదీనా, ఇటాలియన్ బాసిల్ (తులసి), పది తులసి రకాలు వేశాను. మట్టిలో సాధారణ సాగుతో పోల్చితే హైడ్రోపోనిక్ విధానంలో 90 శాతం నీరు ఆదా అవుతుంది. మట్టిని వాడకపోవడం వల్ల మొక్కలకు వ్యాధులు సోకవు. కలుపు మొక్కలు పెరగవు. ఇలా సాగుచేస్తున్న పంట ఆరు వారాల్లో చేతికి వస్తుంది. ఆకుకూర, ఔషధ మొక్కలనుంచి ఆరు నుంచి ఎనిమిది వారాల్లో 200 గ్రాముల దిగుబడి సాధించవచ్చు. 30 అడుగుల్లో 500 మొక్కలు డాబాపై 80 చదరపు అడుగుల్లో 6,000 కూరగాయ, ఔషధ మొక్కలు పెంచుతున్నాను. అయితే, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం కేవలం 30 చదరపు అడుగుల్లో 500 మొక్కలు పెంచుతున్నాను. నీటి పారుదల మట్టం కొంచం తగ్గించడం వల్ల ఆక్సిజన్ చేరుతుంది. ఇది మొక్కల పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. హైడ్రోపోనిక్ విధానంలో సేంద్రియ విత్తనాలే వాడాల్సిన అవసరం లేదు. సాధారణ విత్తనాలు మొక్కలైనపుడు వాటిల్లోని దోషాలు వంద శాతం తొలగిపోతాయి. ఏదైనా చిన్నపాటి సమస్యలు తలెత్తినట్లయితే వేప నూనెను పిచికారీ చేయడం ద్వారా వాటిని రూపుమాపవచ్చు. వర్టికల్ పైప్‌లైన్ సాగు విధానంతో ఎంత చిన్న స్థలంలోనైనా మొక్కలను పెంచవచ్చు. గోడకు కూడా పైప్‌లైన్ వ్యవస్థను అమర్చుకుని మొక్కలు పెంచవచ్చు. ఏడాదికి నాలుగు దఫాలు దిగుబడి సాధించవచ్చు. రోజుకు పది నిమిషాలు చాలు! ముఖ్యంగా ఈ మొక్కల పెంపకం కోసం గంటల తరబడి శ్రమించాల్సిన అవసరం లేదు. 500 మొక్కల పెంపకానికి సరదాగా రోజుకు పది నిమిషాలు కేటాయిస్తే చాలు. ఎల్తైన పైప్‌లైన్ వ్యవస్థ వల్ల కిందకు వంగి శ్రమపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది వృద్ధులకు ఎంతో సౌకర్యం. కేజీకి రూ. 20 ఖర్చు ఒక కేజీ ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంపకానికి కేవలం రూ.20లు మాత్రమే ఖర్చవుతుంది. అదే బజారులో కొంటే ఎంతో ఖరీదు. డాబాపై పంటలు వేసినపుడు అవసరమైన సూర్యరశ్మి అందుతుంది. అలా డాబా పైన ఖాళీ స్థలం లేని వారు నిరుత్సాహపడక్కర లేదు. ఇంటిలోపల కూడా సూర్యరశ్మికి బదులుగా ఎల్ఈడీ దీపాలను అమర్చి ఈ మొక్కలు పెంచవచ్చు. 12 గంటల ఎల్ఈడీ దీపాల వెలుగు ఆరుగంటల సూర్యరశ్మితో సమానం. ఒక పంట దిగుబడి తరువాత కొబ్బరి పొట్టు మారిస్తే తర్వాత పంటలోనూ మంచి ఫలితాలు పొందవచ్చు. సేంద్రియం కంటే హైడ్రోపోనిక్ మేలు సేంద్రియ సాగు కంటే హైడ్రోపానిక్ సాగు ఎంతో శ్రేష్టం. సేంద్రియ పంటల్లో సాల్మోనెల్లా, ఇకొలి అనే బ్యాక్టీరియాను న్యూయార్క్‌లో కనుగొని 75 శాతం ఉత్పత్తులను వెనక్కు పంపివేశారు. సేంద్రియ వ్యవసాయంలో కొందరు ఉత్పత్తుల సైజు పెంచడం కోసం ఆక్సిటోసిన్ హార్మోన్‌ను వినియోగిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. ఆక్సిటోసిన్‌తో తయారైన ఉత్పత్తులను భుజించడం వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. ఇంటింటా హైడ్రపోనిక్ పంటే లక్ష్యం హైడ్రోపోనిక్ వ్యవసాయం అందరికీ అందుబాటులోకి రావాలి. తమకు అవసరమైన మొక్కలను ఎవరికి వారు పెంచుకునే స్థాయికి చేరుకోవాలనేదే నా లక్ష్యం. మార్కెట్‌కు వెళితే అధిక ధరలతోపాటూ వాహనాలకు ఆయిల్ ఖర్చు భరించాల్సి ఉంటుంది. అంతేగాక ఎంతో సమయం వృథా అవుతుంది. ఈ వాస్తవాలపై అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2019 జనవరిలో చెన్నైలో ‘ఆక్వా ఫాం’ హైడ్రోపోనిక్స్ కన్సల్టెన్సీ ఆఫీసును ఏర్పాటు చేశాను. ముందుగా బంధువులకు నేర్పాను. మా ఆఫీసు ద్వారా ఎంతోమందికి సలహాలు, సూచనలు ఇస్తున్నాను. నెలకు రెండు శిక్షణా తరగతులను మూడు నెలలుగా నిర్వహిస్తున్నాను. ఇతర రాష్ట్రాల నుంచి ఎందరో తరగతులకు హాజరవుతున్నారు. ఇలా ఎంతోమందికి అవగాహన కల్పించాను. – కొట్ర నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై నేను పండించిన ఆకుకూరలు, ఔషధ మొక్కలను మా ఇంటిలో, బంధుమిత్రుల ఇళ్లలో వాడుకోగా మిగిలినవి ఇతరులకు అమ్ముతున్నాను. వినియోగదారుల నుంచి ముందుగానే ఆర్డర్లు తీసుకొని సరఫరా చేస్తున్నాం. ఇలా ఎందరో ఖాతాదారులు ఏర్పడ్డారు. రిటైల్ దుకాణాలకు కూడా సరఫరా చేస్తున్నాను. (రాహుల్ «ధోకాను 89395 49895 నంబరులో సంప్రదించవచ్చు) https://www.acquafarms.org -
రైతుల ఆదాయం రెట్టింపు సాధ్యమా!?
సాక్షి, న్యూఢిల్లీ : 2022 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం 2020వ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రధానాంశం. అందుకోసం సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫామింగ్) చేసే రైతులను ప్రోత్సహించడంతోపాటు పైసా ఖర్చు లేకుండా ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని (జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్) ప్రోత్సహిస్తామని చెప్పారు. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని కనిష్ట స్థాయికి (ఐదు శాతానికి) చేరుకున్న నేటి పరిస్థితుల్లో అందులో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాల వృద్ధి రేటు కేవలం 2.8 శాతానికి పరిమితం అయినప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యమేనా? దేశంలో దాదాపు 60 కోట్ల మంది వ్యవసాయం ఆధారపడి బతుకుతున్నప్పటికీ జీడీపీలో వ్యవసాయం వాటా 18 శాతానికి మించనప్పుడు మరెలా సాధ్యం? దేశంలోని సాధారణ రైతులకు ఎరువులపై, విత్తనాలపై గత ప్రభుత్వాలు సబ్సిడీలు మంజూరు చేయగా, ఆ సబ్సిడీలు ఆశించిన రీతిలో రైతులకు చేరడం లేదని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం డీబీటీ పథకం కింద రైతులకు హెక్టార్‌కు ఐదువేల రూపాయల చొప్పున నేరుగా నగదు బదిలీ చేస్తూ వస్తోంది. అలాగే ఐదెకరాలు భూమి మించని రైతులకు ఏటా ఆరు వేల రూపాయల నగదు బహుమతిని గత ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత భూమి పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ఓ పత్రికా ప్రకటన చేసింది. ఈ నగదు బహుమతి వల్ల వ్యవసాయ భూమి కలిగిన రైతులు లాభపడ్డారుగానీ, కౌలుదారులెవరికీ నయా పైసా లాభం చేకూరలేదు. పదెకరాలలోపు వ్యవసాయం చేసే భూముల్లో ఎక్కువ మంది కౌలుదారులే ఉన్నారు. దేశంలో ఎంత మంది కౌలుదారులున్నారో లెక్కించేందుకు దేశంలో ఇంత వరకు ఏ కసరత్తు జరగతేదు కనుక వారి సంఖ్యను చెప్పలేం. సేంద్రీయ వ్యవసాయదారులను కూడా ప్రోత్సాహిస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారంటే సాధారణ రైతులకు హెక్టారుకు ఐదువేల రూపాయల నగదును బదిలీ చేసినట్లే వారికి కూడా ఆ నగదును బదిలీ చేస్తారని ఆశించవచ్చు. ఎందుకంటే ఇంతవరకు వారికి అలాంటి సాయం చేయడం లేదు. నయా పైసా ఖర్చు లేకుండా ప్రకృతిపరంగా చేసే వ్యవసాయాన్ని కూడా ప్రోత్సాహిస్తామని చెప్పారు. అదెలాగో పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తేగానీ తెలియదు. ఇదే బీజేపీ ప్రభుత్వం హయాంలో 2018లో పండించిన పంటలకు కనీస మద్ధతు ధరలు లభించక దేశంలోని రైతులు పలుసార్లు ఆందోళనలు, ఆ ఏడాది నవంబర్ నెల ఆఖరి వారం రోజుల్లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాలకు రైతులు భారీ ప్రదర్శనలు జరిపారు. వారు నిరసనగా కూరగాయలను, పాలను రోడ్ల మీద పారబోసారు. ఆ నేపథ్యంలో 2019 వార్షిక బడ్జెట్లో పైసా ఖర్చులేకుండా ప్రకతిబద్ధంగా వ్యవసాయం చేసే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఆ దిశగా పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. వ్యవసాయం అనేది రాజ్యాంగపరంగా ఇప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన అంశం. రైతులకు సంబంధించి ఏ హామీనైనా చిత్తశుద్ధితో అమలు చేయాలన్నా కేంద్ర, రాష్ట్రాల మధ్య సరైన సమన్వయం, సహకారం ఉండాలి. అందుకు పథకం ప్రవేశపెట్టే దశలోనే రాష్ట్రాలకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేయాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమంటే ముందుగా వారికి గిట్టుబాటు ధర అందేలా చూడాలి. రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండడం వల్ల రైతులకు సరైన న్యాయం చేయలేక పోతున్నామని భావించిన మోదీ ప్రభుత్వం ‘ఎన్ఏఎం (నామ్)’ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ను తీసుకొచ్చింది. రాష్ట్రాల పరిధిలో ఉన్న ‘వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్’ కమిటీలను నామ్లో విలీనం చేయాల్సిందిగా మోదీ ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా 2,500 కమిటీలు ఉండగా 2019, నవంబర్ 12వ తేదీ నాటికి వాటిలో 16 రాష్ట్రాల్లోని 585 కమిటీలు మాత్రమే కేంద్ర కమిటీలో విలీనమయ్యాయి. కేంద్ర కమిటీ ఏర్పడినప్పటికీ దాని ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు, వాటికి అనుగుణంగా శీతల గిడ్డంగి కేంద్రాలు విస్తరించాలి. వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు శీతల వాహనాలను ప్రవేశపెట్టాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలతో నాణ్యమైన ఎరువుల అందేలా చూడాలి. ఇలా ఎన్నో చర్యలు అవసరం. నగదు బదిలీ వల్ల తమకు లాభం చేకూరడం లేదని, ఇంటి అవసరాలకు వాటిని వాడుకోవడం వల్ల విత్తనాలు, ఎరువులకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందని, ఆ స్కీమ్‌ను రద్దు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నీతి ఆయోగ్’ 2019, అక్టోబర్‌లో నిర్వహించిన ఓ సర్వేలో రైతులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యమేనా? ఇప్పుడు రైతులకు వస్తోన్న ఆదాయం ‘జీరో’ కనుక వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమంటే మరో జీరో చేర్చడం కాదుకదా! ఆ దిశగా నిజంగా చర్యలు తీసుకోవాలంటే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు మొదట వ్యవసాయ సంస్కరణలు తీసుకురావాలి. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) -
సీవీఆర్, చోహన్ క్యు సాగు పద్ధతులపై శిక్షణ
దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్ క్యు ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై నిపుణురాలు, స్వచ్ఛంద సంస్థ ‘సర్ర’ డైరెక్టర్ రోహిణీ రెడ్డి (బెంగళూరు)తోపాటు.. మట్టిని ఎరువుగా, పురుగులమందుగా వాడే మట్టి సేద్య పద్ధతి ఆవిష్కర్త చింతల వెంకట రెడ్డి(హైదరాబాద్) ఈ నెల 29(బుధవారం)న రైతులకు శిక్షణ ఇస్తారని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ షిండే తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రిక్వెల్ ఫోర్డ్ ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు శిక్షణ ఇస్తారు. డా. చోహన్‌క్యు పద్ధతిపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనా ఫలితాలను అధ్యాపకులు ఈ శిక్షణలో రైతులకు తెలియజేస్తారు. డా. చోహన్‌క్యు రూపొందించిన ఫెయిత్ (ఫుడ్ ఆల్వేస్ ఇన్ ద హోమ్) బెడ్ తయారీ పద్ధతిలో కూరగాయల సాగుపై ప్రత్యేక్ష శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. వివరాలకు.. సంపత్‌కుమార్ – 98854 55650, నీలిమ – 99636 23529. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై 5 రోజుల శిక్షణ సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్.ఎ.), గ్రామీణ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయ రంగంలో వివిధ స్థాయిలో వ్యాపారావకాశాలు, ప్రభుత్వ నియమ నిబంధనలు, సమస్యలపై ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు 5 రోజుల రెసిడెన్షియల్ శిక్షణా శిబిరం నిర్వహించనున్నట్లు సి.ఎస్.ఎ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు తెలిపారు. పిజిఎస్ ఇండియా సేంద్రియ సర్టిఫికేషన్ నియమాలపై కూడా అవగాహన కల్పిస్తారు. హైదరాబాద్ తార్నాకలోని సెయింట్ ఆన్స్ జెనరలేట్‌లో జరుగుతుంది. ఫీజు రూ. 15 వేలు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు సంప్రదించాల్సిన నంబరు.. 85006 83300. trainings@csa-india.org/https://csa-india.org/events/200217-organic-food-marketing/ 2న కొర్నెపాడులో గొర్రెలు, మేకల పెంపకంపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఫిబ్రవరి 2 (ఆదివారం)న గొర్రెలు, మేకల పెంపకంపై కడప జిల్లాకు చెందిన పశువైద్య నిపుణులు డా. జి. రాంబాబు శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు 97053 83666, 0863–2286255 2న బసంపల్లిలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ పంటల సాగుపై అనంతపురం జిల్లా సి కె పల్లి మండలం బసంపల్లిలోని దేవాలయ ఆశ్రమ ప్రాంగణంలో ఫిబ్రవరి 2వ తేదీ(ప్రతి నెలా మొదటి ఆదివారం)న సీనియర్ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ఫీజు రూ. 100. వివరాలకు.. 91826 71819, 94403 33349. రేపు సేంద్రియ వ్యవసాయం– మార్కెటింగ్‌పై సదస్సు సేంద్రియ వ్యవసాయం చేసే పద్ధతులు, మార్కెటింగ్ సమస్యలపై ఈ నెల 29(బుధవారం) మధ్యాహ్నం 2 గం. నుంచి సా. 5 గం. వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని మారుతి నర్సరీ(అమ్మపల్లి, నర్కోడా–ఒయాసిస్ స్కూల్ ఎదురు)లో రైతులు, వ్యాపారుల అవగాహన సదస్సు జరగనుంది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, హార్ట్ ట్రస్టు, భారతీయ కిసాన్ సంఘ్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు – 76598 55588, మహిపాల్‌రెడ్డి – 76609 66644 -
ఉత్తమ కర్షకులకు రైతురత్న అవార్డులు
సాక్షి, హైదరాబాద్: సమీకృత వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం మొదలగు రంగాలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న నలుగురు రైతులతో పాటు ఒక మహిళా రైతును రాష్ట్ర స్థాయిలో గుర్తించి వారికి గౌరవ సన్మాన పురస్కారాలతో పాటు ‘రైతురత్న’అవార్డు ప్రదానం చేయాలని తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నిర్ణయించింది. ఆధునిక పద్ధతుల ద్వారా సాగులో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రైతులు అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులను ఈ నెల 23లోగా అందజేయాలని తెలిపింది. వివరాలకు విశ్రాంత వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు టి.రంగారెడ్డి (8886861188), వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ బి.కృపాకర్‌రెడ్డి(9391409959)లను సంప్రదించాలని సూచించింది. -
22న సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై శిక్షణ
సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో రైతులకు ఈ నెల 22(ఆదివారం)న శిక్షణ ఇవ్వనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన నిపుణులు డా. జి. రాంబాబుతోపాటు గొర్రెలు, మేకల పెంపకంలో అనుభవజ్ఞులైన రైతులు శిక్షణ ఇస్తారన్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు సంప్రదించాల్సిన నంబర్లు: 970 538 3666, 0863–2286255 22న కాకినాడలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ శిక్షణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై లోతైన అవగాహన కలిగించే లక్ష్యంతో సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్(సేవ్) స్వచ్ఛంద సంస్థ ఈ నెల 22 (ఆదివారం)న కాకినాడ విద్యుత్‌నగర్‌లోని చల్లా ఫంక్షన్ హాల్ (వినాయకుడి గుడి ఎదుట)లో ఉ. 8.30 గం. నుంచి సా. 5.30 గం. వరకు రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? పెట్టుబడి, ఖర్చులు తగ్గించుకునే మార్గాలు, రైతులు పంట దిగుబడులను మొత్తం నేరుగా అమ్ముకోకుండా కొంత మోత్తాన్ని విలువ ఆధారిత ఉత్పత్తులగా మార్చి అమ్ముకోవడం, అధికాదాయం కోసం ప్రయత్నాలు, దేశీ విత్తనాల ఆవశ్యకత, దేశీ ఆవు విశిష్టత తదితర అంశాలపై సేవ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ శిక్షణ ఇస్తారు. ప్రవేశ రుసుము: ఒక్కొక్కరికి రూ. వంద. ఆసక్తి గల రైతులు ముందుగా తమ పేర్లను ఫోన్ చేసి నమోదు చేసుకోవాలి.. వివరాలకు.. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ సమాచార కేంద్రం: 04027654337, 86889 98047 94495 96039 మార్చిలో జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ భూతాపోన్నతిని శాశ్వత వ్యవసాయ (పర్మాకల్చర్) పద్ధతుల్లో సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలపై రైతాంగంలో చైతన్యం తెచ్చే లక్ష్యంతో వచ్చే ఏడాది మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ జరగనుంది. తెలంగాణలోని జహీరాబాద్ దగ్గర్లోని బిడకన్నె గ్రామంలో అరణ్య పర్మాకల్చర్ అకాడమీలో ఈ మూడు రోజుల మహాసభ జరగనుందని అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ తెలిపింది. 20న ప్రకృతి సేద్య పద్ధతుల్లో కూరగాయల సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయల సాగుపై కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలోని రామరాజు గారి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 20 (శుక్రవారం)న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆం. ప్ర. శాఖ తరఫున రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. కూరగాయల సాగులో కొత్త పద్ధతులను అనుసరిస్తున్న సీనియర్ రైతులు అనుభవాలను పంచుకుంటారు. వివరాలకు.. 78934 56163 -
సేంద్రియ వ్యవసాయంపై ప్రచారం చేయాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మన ప్రాచీన వ్యవసాయ విధానంలో పండించిన ఆహార పదార్థాలను తినడం వల్ల పోషకాలు పుçష్కలంగా లభించి మంచి ఆరోగ్యాన్ని పొందుతామని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. సేవా భారతి ఆధ్వర్యంలో పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో సేవా సంగమం–2019 పేరుతో రెండు రోజుల పాటు జరిగే సేవా సంస్థల సదస్సును శనివారం గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పంటకు ఎరువులు, రసాయనాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటుగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానాలపై స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సేవా భారతి రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ఎన్ చారి మాట్లాడుతూ సేవా సంస్థల నిర్వాహకులంతా కలుసుకోవడం వల్ల విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్న ఉద్దేశంతో సేవా సంగమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానందస్వామి, ఆర్ఎస్ఎస్ అఖిల భారత సేవా ప్రముఖ్ పరాగ్ జీ అభ్యంకర్, ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ (ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక) ఆలె శ్యామ్‌కుమార్ తదితరులతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పలు సేవా సంస్థల సేవా కార్యక్రమాల ఫొటో ఎగ్జిబిషన్‌ను మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రారంభించారు. -
మనది సేద్యం పుట్టిన నేల
అయిదువేల సంవత్స రాలకు పూర్వమే భారతదేశ నేలమీద వ్యవసా యం ఉందని శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చారు. వ్యవసాయపు జీవధాతు మూలాల్ని వెలికితీశారు. అంటే సుమారు రెండువేల అయిదు వందల తరాలుగా వ్యవసాయాన్ని భారతీయులు చేస్తున్నారని అర్థం. మన వేద భూమి అనాదిగా సేద్యమెరిగిన నేల. అందుకు మనం గర్వపడాలా, విచారించాలా అనేదిప్పుడు అనుమానంలో పడ్డది. అనాదిగా మానవుడు అడవులమీద ఆధారపడి దొరికిన వాటితో పొట్ట నింపుకునే దశ నించి స్వయంగా ఆహార దినుసుల్ని ఉత్పత్తి చేసుకునే వైపు అడుగులు వేశాడు. తన శక్తికి పదింతలు సాధు జంతువుల్ని మాలిమి చేసుకోవడం ద్వారా సాధించాడు. బరువు పనుల్ని ఉపాయాలతో సులువు చేసుకున్నాడు. అడవుల్ని స్వాధీనం చేసుకుని నేలని పంటభూమి చేశాడు. క్రమేపీ నాగళ్లతో నేలని పదును చేశాడు. అత్యంత ప్రాచీన దశలో మానవుడు పెంచి పోషించిన పంట నువ్వులు. అందుకే నువ్వులు పెద్దలకు తర్పణలు వదలడానికి ఉత్తమమైనదిగా ఇప్పటికీ అమల్లో ఉంది. కాయగూరల్లో గింజ చిక్కుడు అనాదిగా ఉంది. కనుకనే సూర్యుడికి రథాలు కట్టేటప్పుడు మనం చిక్కుడు గింజలతో కడతాం. సూర్య భగవానుడికి చిక్కుడాకుల్లో నైవేద్యాలు సమర్పిస్తాం. మొదట్నించీ ఏ క్రతువు వచ్చినా, కార్యం వచ్చినా నవధాన్యాలను తప్పనిసరిగా వినియోగించడం ఆచారంగా మారింది. శక్తికి మూలమైన గోమాతని పూజించడం మన సదాచారం అయింది. నిజానికి భూమితోపాటే సమస్త వృక్ష జాతులు, సస్య సంపదలు నేలమీద ఉన్నాయి. ఎటొచ్చీ వాటిని గుర్తించి, తన సొంత నార్లు పోసు కున్నాడు. నీళ్లని అదుపులో పెట్టుకోవడంలో ఆరితేరాడు. కార్తెల్ని, రుతువుల్ని గుర్తించి వ్యవసాయ పనులకి కొలమానాన్ని తయారు చేసుకున్నాడు. వర్షాలు ఎందుకొస్తాయో, వాగులు, వంకలు ఎగువనించి ఎట్లా వస్తున్నాయో మనిషి అంతు పట్టించుకున్నాడు. తరాలు గడిచినకొద్దీ వృక్ష శాస్త్రాన్నీ, పశు విజ్ఞానాన్నీ స్వానుభవంతో నేర్చాడు. రామాయణ కాలం నాటికే నాగలి వ్యవ సాయం ఉంది. ఏరువాక పౌర్ణిమనాడు భూమి పూజ చేసి నాగళ్లు పూని బీడు గడ్డల్ని పదును చేయడం ఉంది. అలాంటి సందర్భంలోనే నాగేటి చాలులో సీతమ్మ ఉద్భవించిందని ఐతిహ్యం. ద్వాపర యుగంలో బలరాముడికి నాగలి ఆయుధంగా నిలిచింది. అంటే వ్యవసాయపు ప్రాధాన్యత తెలుస్తూనే ఉంది. పశు సంపద ప్రాముఖ్యత పెరిగింది. పశుపోషణ వ్యవసాయంతో సమానంగా వృద్ధి చెందింది. ఈ రెండూ ఆదాయ వనరులుగా విస్తరించాయి. అంతకుముందే చెరుకు వింటి వేలుపుగా మన్మథుణ్ణి ప్రస్తావించారు. అంటే చెరుకు గడలు మన నాగరికతలో చేరినట్టే! వ్యవసాయం, దాని తాలూకు ఉపవృత్తుల చుట్టూనే నాటి నాగరికత పెంపొందింది. ఆనాడు ‘చక్రం’ వాడుకలోకి రావడం నాగరికతలో గొప్ప ముందడుగు. మానవుడు స్వయం ఉత్పత్తి సాధించగానే, ఆ సంపదని కాపాడుకోవడం ముఖ్య తాపత్రయమయింది. దాని కోసం అనేక ఉపాయాలు ఆలోచించాల్సి వచ్చింది. తరాలు తిరుగుతున్నకొద్దీ మనిషిలో స్వార్థ ప్రవృత్తి పెచ్చు పెరిగింది. ఆశకి అంతులేకుండా పోయింది. నేల తల్లి మంచీ చెడులను గుర్తించే వారు లేరు. దిగుబడులు అత్యధికంగా రావాలి. దానికోసం ఏవంటే అవి నేలలో గుప్పించడం మొదలు పెట్టారు. ఎన్నోరకాల రసాయనాలు వినియోగిస్తున్నారు. నేల తన సహజ నైజాన్ని కోల్పోతోంది. భూగోళపు సహజ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. అడవులు బోసిపోయి రుతుధర్మాలు చెదిరిపోయాయి. వాటి బాపతు పర్యవసానాల్ని ఈ తరంవారు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పరిస్థితిని చక్కబెట్టుకోవాలి. లేదంటే ఇంకొన్ని తరాల తర్వాత ‘వర్షం’ కనిపించకపోవచ్చు. భావితరాలకు మనమిచ్చే గొప్ప సంపద మంచి పర్యావరణం. ప్రాచీన విలువల్ని కాపాడదాం. మన వేద భూమిని వ్యవసాయ భూమిగా నిలిపి ఆకుపచ్చని శాలువాతో గౌరవిద్దాం! వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
ప్రకృతి పాలెగాడు ఈ ఆర్గానిక్ బ్రహ్మయ్య
సాక్షి, ఒంగోలు : కృషితో నాస్తి దుర్భిక్షం.. ఆలోచించాలే గాని ఆచరణకు వంద మార్గాలుంటాయి. సేంద్రియ వ్యవసాయం చేయాలన్న ఆశ ఆ రైతులో బలంగా నాటుకుంది. శరీరానికే వికలత్వం మనస్సుకు కాదని నిరూపించాడు సేంద్రియ రైతు బ్రహ్మయ్య. వికలత్వం, వృద్ధాప్యం కూడా అతని సంకల్పం ముందు పటాపంచలయ్యాయి. మంగమూరు గ్రామంలో జన్మించిన బ్రహ్మయ్య పెళ్లైన తర్వాత నుంచి ఒంగోలులోని ఆర్టీసీ–2 కాలనీలోనే నివసిస్తున్నాడు. బ్రహ్మయ్యకు ఒక కాలు సరిగా లేదు. సొంతూర్లో పొలం ఉన్నా సేద్యం చేయడానికి తన వికలత్వం అడ్డొచ్చింది. కానీ సేద్యం చేయాలన్న బలమైన సంకల్పం అతనిలోనే ఉండిపోయింది. ఆ సంకల్పానికి తన స్నేహితులు చేయూతనందించారు. ప్రకృతి వ్యవసాయంపై విజయవాడలో జరిగే అవగాహన సదస్సు నుంచి బ్రహ్మయ్యకు కొన్ని పుస్తకాలు తెచ్చిచ్చేవారు. వాటితో పాటు టీవీల్లో ప్రసారమయ్యే వ్యవసాయ కార్యక్రమాలు చూసి పెరటి వ్యవసాయం ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాడు. ఏడు పదుల వయస్సులో నాకెందుకు అనుకోకుండా నేను కూడా ఏదో ఒకటి చేయాలన్న సంకల్పమే అతని విజయానికి కారణం. డ్రమ్ముల్లోనే సేద్యం పుస్తకాలు, టీవీ ప్రసారాలు చూసి ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్న బ్రహ్మయ్యకు స్థలం పెద్ద సమస్యగా మారింది. ఇంటి పెరడు వేద్దామంటే అంత జాగా కూడా లేదని బాధపడ్డాడు. ఆ బాధలో నుంచే అతనికో ఆలోచన పుట్టింది. అదే డ్రమ్ముల్లో సేద్యం. మనం నీళ్లు పట్టుకునేందుకు ఉపయోగించే డ్రమ్ముల నిండా మట్టి నింపి సాగు చేస్తున్నాడు. ఒక్కో డ్రమ్ముకు 23 రంధ్రాలు చేసి.. చిన్న చిన్న పైపులు ఏర్పాటు చేసి వాటిల్లో కూరగాయ విత్తనాలు సాగు చేసేవాడు. ఇలా 15 డ్రమ్ముల్లో పెరటి సేద్యం చేస్తున్నాడు. వీటిల్లో పెరిగిన కూరగాయలను చుట్టుపక్కల వారికి విక్రయిస్తున్నాడు. రాలిన ఆకులే ఎరువు.. పెరటి సేద్యానికి ఎరువులు కూడా బ్రహ్మయ్యే తయారు చేసుకునే వాడు. మొక్కలను చీడపీడల నుంచి కాపాడేందుకు ఆవుమూత్రం, వేప కషాయంతో ఓ రసాయనాన్ని తయారు చేసుకుని మొక్కలపై స్ప్రే చేసేవాడు. మొక్కల నుంచి రాలిన ఆకులన్నీ పోగు చేసి ఆవు పేడ కలిపి ఓ ఎరువుగా తయారు చేసుకునేవాడు. ప్రస్తుతానికి 15 డ్రమ్ముల్లో పెరటి పంట సాగు చేస్తున్న బ్రహ్మయ్య వాటిని 50 డ్రమ్ముల వరుకు సాగు చేసేందుకు కృషి చేస్తున్నాడు. వికలత్వం, వృద్ధాప్యాన్ని అధిగమించి ఆరోగ్యం కోసం పెరటి సాగు చేస్తున్న బ్రహ్మయ్యను ఆదర్శంగా తీసుకోవాలి. -
అపారం రైతుల జ్ఞానం!
ఏమిటి? :జహీరాబాద్ ప్రాంతంలో మహిళా రైతులు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర వర్షాధార పంటలను సాగు చేసుకుంటూ సంక్షోభం లేని వ్యవసాయ పద్ధతిని గత 30 ఏళ్లుగా అనుసరిస్తున్నారు. ఈ సంగతి తెలియనిదేమీ కాదు. ఇప్పుడు కొత్త సంగతి ఏమిటంటే.. వీరు అనుసరిస్తున్న జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయ పద్ధతిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పనిగట్టుకొని ఏడాది పాటు అధ్యయనం చేసి సమగ్ర నివేదికను వెలువరించారు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ పరిశోధనా సంచాలకులు డా. ఆర్. ఉమారెడ్డి, హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ సోషల్ స్టడీస్(సెస్) అసోసియేట్ ప్రొఫెసర్ బి. సురేష్‌రెడ్డి, డీడీఎస్ డైరెక్టర్ పి.వి.సతీష్, చిన్న నరసమ్మ, దంతులూరి తేజస్వి కలిసి న్యూఫీల్డ్ ఫౌండేషన్(అమెరికా) తోడ్పాటుతో ఈ అధ్యయనం చేశారు. ‘ఇంటర్ఫేసింగ్ ఫార్మర్స్ సైన్స్ విత్ ఫార్మల్ సైన్స్’ పేరిట ఈ విలక్షణ అధ్యయన నివేదికను వెలువరించారు. ఎక్కడ? హైదరాబాద్ బేగంపేటలోని సెస్ ఆడిటోరియంలో జాతీయ గ్రామీణాభివృద్ధి–పంచాయతీరాజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ డా. డబ్ల్యూ. ఆర్. రెడ్డి, జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) డైరెక్టర్ జనరల్ డా.ఉషారాణి, సెస్ డైరెక్టర్ ప్రొ. రేవతి ఈ నివేదికను ఇటీవల ఆవిష్కరించారు. జహీరాబాద్ ప్రాంతంలో మహిళా రైతులు సాంప్రదాయ సేంద్రియ పద్ధతుల్లో వర్షాధారంగా ఒకటికి 20 పంటలను కలిపి పండిస్తున్నారు. అప్పుల్లేని, ఆత్మహత్యల్లేని జీవవైవిధ్య వ్యవసాయం వారిది. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వీరిని సంఘటితపరచి ముందుకు నడిపిస్తోంది. వారి వ్యవసాయ సంస్కృతిని, దాని చుట్టూ అల్లుకున్న సంప్రదాయ పర్యావరణ, జీవవైవిధ్య జ్ఞానాన్ని శ్రద్ధగా గమనిస్తే– వ్యవసాయ సంక్షోభం నుంచి మన దేశాన్ని బయటపడేసే మార్గం మనకు కనిపిస్తుంది. ప్రకృతికి అనుగుణమైన సేద్య జీవనాన్ని అనుసరిస్తున్న వారికి ఉన్న అవగాహనా శక్తి గొప్పది. చిన్న రైతులు ఇప్పుడు పెద్ద రైతులుగా ఎదిగారు. సంతోషదాయకమైన, ఆరోగ్యదాయకమైన జీవనాన్ని గడుపుతున్న మహిళా రైతులను మనసారా అభినందించారు. ఎవరేమన్నారు? ‘రైతుల సంప్రదాయ జ్ఞానం గత కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చెప్పని ఎన్నో గొప్ప విషయాలు ఈ అధ్యయన కాలంలో రైతుల పొలాల్లో చూసి నేర్చుకున్నాను. వాళ్లు ఆరోగ్యంగా ఉన్నారు. పశువులు బాగున్నాయి. భూమి ఆరోగ్యంగా ఉంది. ఎకరానికి ఏటా రూ. 10 వేల వరకు నికరాదాయం పొందుతున్నారు. వర్షానికి, నేలకు తగిన విత్తనాల ఎంపిక, నిల్వ, వినియోగం తదితర అనేక విషయాల్లో వీరి జ్ఞానం అమోఘం. ఈ జ్ఞానాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించాలి. రైతుల జ్ఞానం ఆధారంగా వ్యవసాయ విధానాల రూపకల్పన జరగాలి. మన దేశం ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభానికి ఇదే పరిష్కారం..’ అన్నారు ‘సెస్’ అసోసియేట్ ప్రొఫెసర్ సురేష్‌రెడ్డి. ‘పొలంలో ఒకే పంట పెడితే పండొచ్చు, పండకపోవచ్చు. మేం గవర్నమెంటు ఎరువు, కరెంటు, బోర్లపైన ఆధారపడటం లేదు. ఒకే పొలంలో 25 పంటలు పెడుతున్నం. కొన్ని పంటలు రాకపోయినా కొన్ని వస్తయి. తిండి కొనుక్కోవాల్సిన పని లేదు. పత్తి పెట్టిన రైతులు అప్పులై చచ్చిపోతున్నరు. మాకు అప్పులు అవసరం లేదు. మేం చచ్చిపోవాల్సిన అవసరమే రాదు..’ అని రైతు మొగలమ్మ చెప్పింది. ‘ఈ నివేదిక చాలా బాగుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ ఇందులో సమాధానాలున్నాయి. డీడీఎస్ మహిళా రైతులకున్న ఆత్మస్థయిర్యం, సంతోషం చాలా గొప్పది. రైతులకేమీ తెలీదు మనకే తెలుసు అని శాస్త్రవేత్తలు అనుకోకూడదు..’ అన్నారు ‘మేనేజ్’ డీజీ డా. ఉషారాణి. ‘వాతావరణ మార్పులు, రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆలోచించదగిన నివేదిక ఇది. 30 ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ పద్ధతిలో గొప్ప గుణాలను ప్రాచుర్యంలోకి తేవటం హర్షణీయం. నేనూ కొర్రలూ, జొన్నలూ తింటూ ఆరోగ్యంగా ఉన్నాను. ఈ రైతుల జ్ఞానాన్ని రైతుల్లోకి తీసుకెళ్లాలి..’ అన్నారు ఎన్.ఐ.ఆర్.డి. డీజీ డా. డబ్ల్యూ.ఆర్.రెడ్డి. వారాంతాల్లో డీడీఎస్ మహిళా రైతుల పొలాల్లోనే శిక్షణ జహీరాబాద్ ప్రాంతంలో డీడీఎస్ సెంటర్ ఫర్ అగ్రోఎకాలజీ (పచ్చశాల) ఆధ్వర్యంలో మహిళా రైతులు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ప్రకృతి సిద్ధమైన ఆకుకూరలు, ఔషధ మొక్కల మిశ్రమ సేంద్రియ సాగు, పెరటి తోటల సాగు పద్ధతులపై రైతులు, నగరవాసులకు వారాంతాల్లో (శని, ఆదివారాల్లో) తమ పొలాల్లోనే శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు 17 నుంచి ప్రారంభమయ్యే ఈ కోర్సు 24 వారాల పాటు కొనసాగుతుంది. వసతి, మిల్లెట్ భోజనాలతో కలిపి బోధనా రుసుము 24 వారాలకు రూ. 12 వేలు, 12 వారాలకు రూ. 10 వేలు, 6 వారాలకు రూ. 6 వేలు. ఆసక్తి గల వారు ఆగస్టు 10 లోగా రిజిస్టర్ చేసుకోవాలి. https://forms.gle/Ca2eHv6SGLJ5y2JX7F మొబైల్:77992 21500 -
యువ రైతు... నవ సేద్యం!
సాక్షి, మిర్యాలగూడ : చదివింది సాంకేతిక విద్య.. పుడమిని నమ్ముకున్న తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ గత కొంత కాలంగా సేంద్రియ వ్యవసాయం పై ప్రత్యేక దృష్టిని సారించాడు. మధ్యప్రదేశ్‌లో చేస్తున్న తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి సేంద్రియ వ్యవసాయం చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయనే మద్దెల అరుణ్. మిర్యాలగూడ పట్టణంలోని మద్దెల గౌతమ్–విమలకు ముగ్గురు సంతానం, వీరు ఇరువురు ఉద్యోగులే. మద్దెల గౌతమ్ హాస్టల్ వార్డెన్‌గా పని చేస్తుండగా.. విమల ఉపాధ్యాయురాలుగా పనిచేసి పదవి వీరమణ పొందారు. మద్దెల అరుణ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్‌ను పూర్తి చేశాడు. కాగా నల్లగొండలో శ్రీరామానంద తీర్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఏడాది పాటు అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆ తరువాత నల్లగొండ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో మరో ఏడాది పాటు పని చేశాడు. ఆ సమయంలోనే అరుణ్‌కు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని లక్ష్మీనారాయణ కళాశాల అండ్ టెక్నాలజీ (ఎల్ఎన్సీటీ)లో రూ. 50వేల వేతనంపై అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. ఈ క్రమంలో వ్యవసాయంలో తండ్రి గౌతమ్‌కు ఆసరగా ఉండేందుకు వ్యవసాయం చేయాలనే తపనతో 2013లో తన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సాధారణ పద్ధతులతో వ్యవసాయం సాగు చేస్తే సాగుబడి ఖర్చు పెరుగుతుంది కాని ఎలాంటి ఫలితం లేదని గుర్తించి వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు సేంద్రియ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాడు. పట్టణ శివారులో ఉన్న అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డులో గల ఖలీల్ దాబా వెనుకాలో 10 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నాడు. అందుకు గాను మండల వ్యవసాయ అధికారులు, కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవేత్తలు, తక్కువ పెట్టబడితో ఎక్కువ అధిక దిగుబడిని సాధిస్తున్న రైతుల సలహాలు తీసుకొని సేంద్రియ వరిసాగును చేపట్టాడు. మొదటి పంటలో 20 బస్తాలను పండించగా, గత రబీ సీజన్లో 34బస్తాల వరి ధాన్యాన్ని పండించాడు. ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలోనే వరిని సాగు చేస్తున్నాడు. క్షేత్రంలోనే ఎరువుల తయారీ.. అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డు వెంట ఉన్న ఖలీల్ దాబా వెనుకాల ఒక షెడ్‌ను ఏర్పాటు చేసుకొని భూసారాన్ని పెంచేందుకు తెగుళ్ల నివారణ, పంటలకు అవసరమైన పోషణలకు తన వ్యవసాయ క్షేత్రం పక్కనే సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నాడు. నాణ్యమైన దిగుబడితో పాటు, పెట్టుబడి తక్కువ అని పేర్కొంటున్నాడు. ఎరువుల తయారీ ఆయన మాటల్లోనే.. జీవన, దృవ, ఘన జీవంలో ఆవుపేడ, ఆవు మూత్రం, ఏదైనా పిండితో కలిపి బెల్లం రెండు కేజీలు, పుట్టమన్ను రెండు కేజీలు, 200 లీటర్ల నీటితో నాలుగు రోజుల పాటు మరుగుపెట్టాల్సి ఉంటుంది. ఆ తరువాత పొలాల్లో చల్లితే యూరియా, అడుగుపిండి అవసరం లేదు. దీనిని వరి పంటలో 15 రోజులకు ఒక్కసారి వేయాల్సి ఉంటుంది. అదే విధంగా వీటిన్నింటి ఆవుపేడతో కలిపి ముద్దలుగా పిడకలను చేసి నిల్వ ఉంచాలి. ఆ తరువాత దీని పంటలకు పెంట దిబ్బలను తోలే సమయంలో ఈ ముద్దలను కలిపితే మరింత బలంగా ఉంటుంది. ఇలా పచ్చిరొట్టె, పైర్లు, వేపపిండి, ఘన జీవామృతం, జీవ ఎరువుల అజోల స్పెరిలం, పొటాష్ పప్పోసాల్‌బాయిల్ బ్యాక్టీరియా, వర్మీకంపోస్ట్, విత్తన శుద్ధికి బీజామృతం తయారీ, పురుగుల మందు నివారణకు జీవామృతం తయారీ చేయాలి. అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయంలో ఫలితం పొందుతున్న యువ రైతు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసే సదస్సుల్లో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం వర్మీకంపోస్టు తయారు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్నాడు. అదే విధంగా సుమారు 20 గేదెలు, ఆవులతో మంచి పాల వ్యాపారంతో పాటు సొంత డెయిరీని కూడా నడుపుకుంటున్నాడు. తక్కువ ఖర్చు.. ఎక్కువ దిగుబడి.. మద్దెల అరుణ్ సేంద్రియ ఎరువులపైనే ప్రత్యేక దృష్టిని సారించి తనదైన శైలిలో వ్యవసాయాన్ని చేస్తున్నాడు. సాధారణ పద్ధతిలో ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాడు. అయితే ఎకరానికి రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు ఖర్చు అవుతుండగా సేంద్రియ పద్ధతిలో రూ. 10వేల నుంచి రూ. 12వేల వరకు పెట్టుబడి అవుతుంది. సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకు బహిరంగ మార్కెట్లలో మంచి స్పందన లభిస్తుందని ఆయన పేర్కొంటున్నాడు. వేములపల్లి మండలంలో 10 ఎకరాలు, మిర్యాలగూడ బైపాస్‌లో 10 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలను కౌలుకు తీసుకొని వరిసాగును చేపడుతున్నాడు. -
సేంద్రియ ‘స్వాహా’యం!
సాక్షి, ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఉలవపాడు ప్రాంతం మామిడికి పేరెన్నిక గన్నది. దీనిని అవకాశంగా చేసుకున్న కొందరు ఉలవపాడు సేంద్రియ వ్యవసాయ సంఘం పేరిట ఒక సంస్థను రిజిస్టర్ చేయించుకున్నారు. దానికి కేరళకు చెందిన జిజో జోసెఫ్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా మరో 7 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ద రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ నుంచి సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ జిజో జోసెఫ్కుగ్రిక ఇంటర్నేషనల్ కాంపెటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అల్చర్ (ఇకోవా) అనే సంస్థ ఉంది. దీని పేరుతో టీడీపీ హయాంలో ఉలవపాడు మామిడిలో సేంద్రియ వ్యవసాయం చేయించేందుకు రైతులకు అవగాహన కల్పించటం, వారిని ప్రోత్సహించటంలాంటివి చేపట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. 2016 సంవత్సరం మే నెలలో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయూ)ను ప్రభుత్వంతో ఇకోవా సంస్థ కుదుర్చుకుంది. అప్పటి నుంచి మామిడి రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పుకుంటూ వచ్చారు. అంతా కాగితాలపైన, రికార్డుల్లోనే చూపించి రైతులను నిలువునా మోసం చేయటంతో పాటు లక్షలాది రూపాయలు దిగమింగారు. రూ. 50 లక్షలకు పైగా నిలువు దోపిడీ ఉలవపాడు సేంద్రియ వ్యవసాయ సంఘం పేరుతో ఇకోవా సంస్థ చేపట్టిన సేంద్రియ సాగు పేరిట దాదాపు రూ. 50 లక్షలకు పైగా దోపిడీ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మామిడి రైతులను సేంద్రియ సాగు వైపు మరలించటానికిగాను ఇకోవా ఉలవపాడు మండలంలోని 7 గ్రామాలను ఎంపిక చేసుకుంది. ఉలవపాడుతో పాటు బద్దిపూడి, చాకిచర్ల, వీరేపల్లి, భీమవరం, ఆత్మకూరు, కరేడు గ్రామాల్లో కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ. కోటికి పైగా నిధులు రాబట్టుకుంది. అందుకుగాను ఈ ఏడు గ్రామాల్లోని 442 మంది రైతులకు సంబంధించి 500 హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టేందుకు పూనుకున్నారు. మూడేళ్ల పాటు రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉంది. ఒక్కో హెక్టారుకు శిక్షణ తరగతులకు, అవగాహన సదస్సులకు రూ. 10 వేలు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ మూడేళ్లలో రెండు మూడు అవగాహన సదస్సులు మినహా పెట్టింది లేదు. అంటే 500 హెక్టార్లకు ఒక్కో హెక్టారుకు రూ. 10 వేలు చొప్పున రూ. 50 లక్షలు అవుతుంది. ఇంకెంత మోతాదులో దోచుకున్నారో ఇంకా లోతుకు వెళ్లి విచారిస్తే తప్ప పూర్తి దోపిడీ బయట పడదన్న విషయాలు అర్థమవుతున్నాయి. నోరు మెదపని ఉద్యానవన శాఖాధికారులు సేంద్రియ వ్యవసాయం పేరుతో భారీ దోపిడీ చోటుచేసుకున్నా జిల్లాలోని ఉద్యానవన శాఖ అధికారులు నోరు మెదపటంలేదు. ఎందుకంటే అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ పాత్ర దీని వెనుక ఉండటంతో జిల్లా స్థాయి అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఇంకా జిల్లాలో ఇలాంటి సంస్థలు సేంద్రియ వ్యవసాయం పేరుతో ఎన్ని రూ. కోట్లు దోపిడీ చేశాయో అన్నది లోతుల్లోకి వెళ్లి చూస్తేకాని వెలుగుచూడవు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కార్యాలయమే లేని సంస్థ సేంద్రియ వ్యవసాయం పేరుతో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన ఇకోవా సంస్థకు ఉలవపాడులో అసలు కార్యాలయమే లేదు. అవసరమైన ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లు, సిబ్బంది ఉండాల్సి ఉంటే ఇద్దరు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. నామమాత్రంగా కొందరు రైతులకు కషాయాలు కలుపుకోవటానికి డ్రమ్ములు మాత్రం ఇచ్చారు. ఇకపోతే సేంద్రియ ఎరువులు, మందులు పేరుతో తూ.. తూ మంత్రమే చేశారు. వర్మీ కంపోస్ట్ పేరుతో తెనాలి నుంచి మట్టి సంచులు కొందరు రైతులకు పంపిణీ చేశారు. -
ఒకటికి పది పంటలు!
ప్రతాప్ వృత్తిరీత్యా న్యాయవాది. రసాయన ఎరువులతో పండించిన పంట తినడం వల్ల మానవాళి మనుగడకు ఏర్పడుతున్న ముప్పును గుర్తించారు. అందుకే సేంద్రియ సాగును తన ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ప్రతాప్ ప్రకృతి వ్యవసాయం చేస్తూ విషతుల్యమైన ఆహార పదార్థాల బారి నుంచి తన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. తనకున్న పదెకరాల వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. మంచిర్యాల జిల్లా కేంద్ర శివారులోని హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో ఆయన క్షేత్రం ఉంది. వరి, మొక్కజొన్న, సజ్జలతోపాటు దాదాపు 50 రకాల పండ్ల మొక్కలు, పప్పుదినుసులు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. సుభాష్ పాలేకర్ ప్రకృతివ్యవసాయ సూత్రాలు, ‘సాక్షి సాగుబడి’ కథనాల స్ఫూర్తితో గత ఏడేళ్లుగా పంటల సాగు చేస్తూ.. అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరన్నర విస్తీర్ణంలో మామిడి బత్తాయి (మొసంబి), సంత్ర, సపోట, ఆపిల్ బెర్, దానిమ్మ, అంజీర, సీతాఫలం, జామ, అరటి, బొప్పాయి తదితర పండ్ల తోటలు... ఎకరన్నరలో చిరుధాన్యాలు... ఎకరన్నరలో వరి... ఎకరన్నరలో పప్పుదినుసులు... రెండు ఎకరాల్లో కూరగాయల పందిళ్లు... రెండు ఎకరాల్లో వాణిజ్య పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో.. పది ఎకరాల నల్లరేగడి భూమిలో పూర్తి సొంత వనరులతో తయారు చేసుకునే సహజ ఎరువులు వాడుతూ ప్రతాప్ వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఆవులు, నాలుగు ఎద్దులు, ఒక గేదెను పెంచుతున్నారు. పేడ, మూత్రంతో జీవామృతం, ఘనాజీవామృతం, వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువులను వాడుతూ మంచి దిగుడులు సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మెళకువలను ఇతర రైతులకు తెలియజెప్పేందుకు ప్రతి జూన్ నెలలో రైతులకు తన సేంద్రియ క్షేత్రంలో ప్రదర్శన ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. రసాయన ఎరువులతో ఇటు మనుషులకు తినే తిండిలో, అటు పండించే పంట భూమికి నష్టాలు వాటిల్లుతాయని విడమరుస్తున్నారు. కూరగాయల సాగులో దిగుబడి రెట్టింపు భూమిని పైపైన దున్ని మాగిన ఆవు పేడను వేస్తారు. ఎకరా పొలాన్ని మడులుగా విభిజించి, ఒక్కో మడిలో ఒక్కో రకం కూరగాయ పంటను సాగు చేస్తున్నారు. దేశవాళీ వంగడాలతో పాటు సంకర రకాలను సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారు. రెండు వారాలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. చీడపీడల నివారణకు కషాయాలు వాడుతున్నారు. పురుగును గుడ్డుదశలోనే నివారించేందుకు నీమాస్త్రం, వేప పిండి వాడుతున్నారు. అయినా పురుగు ఆశిస్తే అగ్ని అస్త్రం ద్రావణం పిచికారీ చేస్తారు. లద్దె పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం వాడుతున్నారు. 20 లీటర్ల కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తున్నారు. వారానికి రెండు కోతలు తెగుతున్నాయి. కిలో రూ.20 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 6 వేల నుంచి 8 వేల వరకు ఖర్చు అవుతుండగా, రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు నికరాదాయం లభిస్తోంది. కూరగాయలు పండించిన చోట తర్వాత ఏడాది వరి పండిస్తున్నారు. వరి పండించిన చోట తర్వాత ఏడాది కూరగాయలు పండిస్తున్నారు. దీనివల్ల పంట దిగుబడులు బాగున్నాయని ప్రతాప్ చెబుతున్నారు. ప్రకృతి సేద్యం చేసిన తొలి నాళ్లతో పొల్చితే దిగుబడి రెండింతలైంది. అప్పట్లో కూరగాయలు వారానికో కోత తెగితే ఇప్పుడు రెండు కోతలు తెగుతున్నాయి. పూర్తి సొంతంగా తయారు చేసుకున్న ఎరువులతో సాగుచేయడంతో బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. సేంద్రియ పంటను మంచిర్యాలలో విక్రయిస్తున్నారు. కొంత మంది ఫోన్ ద్వారా సంప్రదించి సీజన్ల వారీగా కొనుగోలు చేస్తున్నారు. ఆదాయం అధికం.. ప్రతాప్ సాగు చేస్తున్న ఎకరం మామిడి తోటలో 60 చెట్లున్నాయి. 15ఏళ్లపాటు రసాయనిక సేద్యంలో ఉన్న తోటను ప్రకృతి సేద్యంలోకి మార్చారు. చెట్ల మధ్య ఎటు చూసినా 45 అడుగుల స్థలం ఉంటుంది. గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తుంది. తొలకరిలో చెట్టుకు ఐదులీటర్ల జీవామృతం పోస్తారు. 10 కిలోల ఆవుపేడ వేసి చెట్ల చుట్టూ దున్నుతున్నారు. పూతదశలో బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం పిచికారీ చేస్తారు. ఫిబ్రవరిలో పిందెదశలో, పురుగుదశలో మరోసారి పిచికారీ చేస్తారు. రసాయనిక సేద్యంలో వచ్చే దిగుబడిలో కంటే ఎక్కువగానే దీని ద్వారా దిగుబడి వస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగుల మందులకు ఎకరాకు రూ. 20 వేల వరకు ఖర్చువుతుంది. ప్రకృతి సేద్యంలో రూ. 5 వేల నుంచి 8 వేలకు మించి ఉండదు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చెట్లు బాగుంటే రసాయన సేద్యంలో కన్నా ప్రకృతి సేద్యంలో రెండురెట్లు అధికంగా దిగుబడి తీయవచ్చని ప్రతాప్ తెలిపారు. పాడికి దిగుల్లేదు.. ఎరువులూ కొనక్కర్లేదు! మా వ్యవసాయానికి రెండు ఆవులు, నాలుగు ఎద్దులు, ఒక గేదె పట్టుగొమ్మగా నిలుస్తున్నాయి. వీటికి పొలం నుంచే గడ్డి అందుతుంది. పాడికి దిగుల్లేదు. వీటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనాజీవామృతం, వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నాం. ఎరువులు, పురుగుమందులు కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. రసాయన ఎరువుల పంటలతో భూ సారం దెబ్బతినడమే కాకుండా, ఆ పంటలు ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. అందుకే ప్రకృతి సేద్యం చేస్తున్నా. నా క్షేత్రంలో జూన్‌లో రైతులకు శిక్షణ ఇస్తున్నా. జీవన ఎరువులు, పురుగుమందుల తయారీ లాబ్ పెట్టి రైతులకు స్వల్ప ధరకే ఇవ్వాలనుకుంటున్నా. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం రాయితీలు ఇచ్చి, మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే, రసాయనాల్లేని పంటలతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు. – కే వీ ప్రతాప్ (98499 89117), గుడిపేట, హాజీపూర్ మం., మంచిర్యాల జిల్లా నువ్వు చేను, పందిరి బీర తోట, వ్యవసాయ క్షేత్రంలో..ఆవుతో ప్రతాప్ –ఆది వెంకట రమణారావు, సాక్షి, మంచిర్యాల ఫొటో జర్నలిస్టు: Vð ల్లు నర్సయ్య -
పల్లె పిలిచింది..!
‘‘దృఢమైన సంకల్పంతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తుంటే అది విజయవంతం కావడానికి ప్రకృతి కూడా ‘కుట్ర’ పన్నుతుంది’’ అంటాడు సుప్రసిద్ధ రచయిత పాలో కోయిలో. కార్పొరేట్ ఉద్యోగాలు వదలి సేంద్రియ సేద్యం చేపట్టి.. అద్భుత ఫలితాలు సాధిస్తున్న సత్యజిత్, అజింక హంగె సోదరుల జీవితం ఈ సూక్తిని జ్ఞప్తికి తెస్తోంది. పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వీరిద్దరూ కష్టపడి ఎంబీయే చదువుకొని కార్పొరేట్ సంస్థల్లో పనిచేసి ఉన్నత స్థాయికి ఎదిగారు. పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. హోదాకు, డబ్బుకు కొదవ లేకున్నా మనసు లోతుల్లో తెలియని వెలితి, అసంతృప్తి. తమకు ఆనందాన్నిచ్చే జీవితం ఇది కాదని అర్థమైంది. వీకెండ్స్‌లో పల్లెకు, పొలానికి వెళ్లినప్పుడు కలిగే ఆనందం తర్వాత చప్పున ఇగిరిపోతోంది. అంతరంగంలో ప్రతిధ్వనిస్తున్న పల్లె పిలుపును మనసొగ్గి ఆలకించారు. పెద్ద జీతాలతో కూడిన ఉద్యోగాలను సైతం త్యజించి పల్లెబాట పట్టారు. కోటి ఆశలతో స్వగ్రామానికి చేరారు. గిర్ ఆవులు కొన్నారు. తొలుత కొద్దిపాటి భూమిలోనే సేంద్రియ సేద్యానికి శ్రీకారం చుట్టారు. రసాయనిక అవశేషాల్లేని అమృతాహారం పండించడమే కాదు.. ఏటా రూ. 3 కోట్ల టర్నోవర్‌తో భళా అనిపించుకుంటున్నారు. సత్యజిత్, అజింక హంగె సోదరులు పుట్టింది భోదని అనే పల్లెటూరులో. రైతు కుటుంబం. పుణె నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో భోదని ఉంటుంది. వాళ్ల తల్లిదండ్రులు మట్టిమనుషులు. కాయకష్టం చేసి వారిని పుణె నగరంలోని ఆంగ్లో–ఇండియన్ బోర్డింగ్ స్కూల్లో చదివించారు. వారి జీవితం గొప్పగా ఉండాలని ఎంబీయే చదివించారు. సత్యజిత్, అజింక బాగా చదువుకొని సిటీబ్యాంక్, డీబీఎస్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్ఎస్బీసీ వంటి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. పదేళ్లు గడిచాయి. ఉద్యోగాల్లో మంచి జీతభత్యాలు అందుకుంటున్నారు. అంతాబాగానే ఉన్నా తెలియని అసంతృప్తి, వెలితి మనసు పొరల్లో రొద పెడుతూనే ఉన్నాయి. వారాంతంలో పల్లెకు వెళ్తే ఉండే హాయి నగరంలో ఉన్పప్పుడు దొరకడం లేదని గ్రహించారు. తెగువ చూపారు. ఉద్యోగాలు వదిలేశారు. నేను పడిన కష్టం పిల్లలకు ఉండకూడదనుకున్న తండ్రి తల్లడిల్లిపోయాడు. సరైన ఆదాయం దొరకని వ్యవసాయంలోకి రావడం మంచి నిర్ణయం కాదన్నాడు. అయినా, సత్యజిత్, అజింక సోదరులు జంకలేదు. మట్టి మీద కోటి ఆశలు పెట్టుకొని మనోబలంతో ముందడుగేశారు. తొలుత కొద్దిపాటి భూమిలోనే సేంద్రియ సేద్యం ప్రారంభించారు.తొలి దశలో ఏటా రూ. 2 లక్షల అమ్మకాలు జరిగేవి. అష్టకష్టాలూ పడ్డారు. అయినా మడమ తిప్పలేదు. క్రమంగా పరిస్థితులు అనుకూలించాయి. సోదరులు ప్రస్తుతం 20 ఎకరాల్లో సేంద్రియ పంటలు పండిస్తున్నారు. ఏటా రూ. 3 కోట్లకు పైగా టర్నోవర్ సాధించే దశకు ఎదిగారు. చెరకు బదులు పండ్ల తోటలు... పశ్చిమ మహారాష్ట్రలో చాలా మంది రైతులు కరువు కాలంలో కూడా చెరకు అలవాటుగా చెరకు పంటను రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సాగు చేస్తుంటారు. సత్యజిత్, అజింక సోదరులు పంటల సరళిని సాగు పద్ధతిని కూడా మార్చారు. అదే వారి విజయరహస్యం. సేంద్రియ పద్ధతుల్లో పండ్ల తోటలను సాగు చేయనారంభించారు. చెరకుతో పోల్చితే ఈ తోటలకు నీటి అవసరం చాలా తక్కువ. తోటల సాగుకు భూమిని కూడా పెద్దగా దున్నాల్సిన అవసరం లేదు. సేంద్రియ పండ్లు ఎక్కువ రోజులు చెడిపోకుండా నిల్వ ఉంటాయి. ‘రసాయనిక ఎరువులు, పురుగుమందులు భూముల ఉత్పాదక శక్తిని నశింపజేస్తున్నాయని, ఆహారోత్పత్తుల నాణ్యతను దెబ్బతీస్తున్న విషయం గుర్తించాం. గ్రామంలో అనుభవజ్ఞులైన వ్యవసాయ కూలీలు, రిటైరైన రైతులతో మాట్లాడి.. ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న పద్ధతులను కలగలిపి.. ఆవు పేడ, మూత్రంతో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకున్నాం..’ అని సత్యజిత్ అన్నారు. రెండు ఎకరాల భూమిలో దేశీ రకం దానిమ్మ, దేశీ రకం కందులను తొలుత సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతోపాటు 20 దేశవాళీ గిర్ ఆవులను కొనుగోలు చేశారు. తొలి నాలుగేళ్లు నష్టాలే ఎదురొచ్చాయి. ‘అది చాలా కష్టకాలం. ఉద్యోగాలు వదిలేసి వచ్చి వ్యవసాయంలో దిగాం. టన్ను దేశీ బొప్పాయిలు పండించాం. అదే మా తొలి చెప్పుకోదగ్గ సేంద్రియ దిగుబడి. నోట్లో వేసుకుంటే అమృతంలాగా ఉంది రుచి. లోకల్ మార్కెట్‌కు తీసుకెళ్తే కిలో రూ. 4కు కొన్నారు. అంతా దళారుల రాజ్యం. ఇక ఇలా లాభం లేదని.. ఒక టెంపో వాహనంలో కొన్ని బొప్పాయిలు వేసుకొని వంతెనల వద్ద ఉండే తోపుడు బండ్ల వ్యాపారుల దగ్గరకు తీసుకెళ్లాం. మా దగ్గర నుంచి కిలో రూ. 20కి కొనడానికి వాళ్లు ముందుకు రాలేదు. అందుకని, వాళ్లకు ఉచితంగానే ఇచ్చాం. వాటిని రుచి చూసిన వినియోగదారులు తిరిగి వచ్చి.. అవే కావాలని అడగడం మొదలు పెట్టారు. పంటను లాభదాయకంగా అమ్మటం అలా మొదలు పెట్టాం..’ అన్నారు సత్యజిత్. ఇలా 8 నెలలు తోపుడు బండ్ల వారి ద్వారా పండ్ల అమ్మకం సాగించిన తర్వాత.. ఓ మాల్ యజమాని అనుకోకుండా ఈ పండ్లను రుచి చూసి సత్యజిత్, అంజిక్యలకు కబురు పెట్టాడు. మాల్లో ఒక ర్యాక్‌ను ఉచితంగా ఇచ్చాడు. రసాయనాలతో పండించిన ఇతర ర్యాక్‌లలో పండ్లు అలాగే ఉండేవి. వీళ్ల ర్యాక్ వెంటనే ఖాళీ అయిపోయేది. తదనంతరం సత్యజిత్, అంజిక్య దాదార్లో రైతు మార్కెట్‌ను ప్రారంభించారు. ఇవ్వాళ వీరి సేంద్రియ పండ్లు కొంటున్న వారిలో వ్యాపారవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు! మామిడి పండుపై ఈ పోగులు ఎందుకొస్తాయి? మామిడి పండ్లలో అప్పుడప్పుడూ ఈ ఫొటోలో మాదిరిగా తొక్క తీయగానే వేర్ల మాదిరిగా పోగులు అల్లుకొని కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్య ఉన్న మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు. కానీ, చూపులకు బాగుండదు కాబట్టి తినడానికి వినియోగదారులు పెద్దగా ఇష్టపడరు. ఆ కాయలు పెద్దగా ధర పలకవు. రైతులు, వ్యాపారులు ఏటా భారీగానే నష్టపోతుంటారు. ఈ పోగులు అల్లుకున్న చోట మామిడి గుజ్జు కొంచెం ఎర్రగా మారుతూ ఉండటం కూడా గమనిస్తుంటాం. ఈ సమస్యను రెసిన్ కెనాల్ డిస్కలరేషన్(ఆర్.సి.డి.) అంటారు. ఇంతకీ ఇవి ఏర్పడడానికి కారణం ఏమిటి? అన్నది ఇన్నాళ్లూ మిస్టరీగానే మిగిలిపోయింది. వాతావరణ మార్పుల వల్ల లేదా ఎరువుల ద్వారా ఈ పోగులు ఏర్పడుతున్నాయని గతంలో అనుకునేవారు. అయితే, ఇది బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల మామిడి పండ్లకు సోకుతోందని తాజా పరిశోధనల్లో తేలింది. కాయలు కోత, రవాణా, మగ్గబెట్టే దశల్లో ఒక రకమైన బాక్టీరియా సోకడం వల్ల మామిడి పండులో పోగులు ఏర్పడుతున్నట్లు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తిస్థాయి పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ బాక్టీరియా ఇన్షెక్షన్ సోకకుండా చూసుకోవచ్చని రైతులకు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా మామిడి రైతులకు ఇది పెద్ద శుభవార్త అంటూ ఆస్ట్రేలియా మాంగో ఇండస్ట్రీ అసోసియేషన చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ గ్రే ఎగిరి గంతేశారు. మామిడి పండుపై బాక్టీరియా పోగులు లేపనం చేయని పండ్లు, లేపనం చేసిన పండ్లు అరటి నెమ్మదిగా మగ్గాలంటే.. గంజి లేపనం! అరటి గెలలు చెట్టు నుంచి కోసిన తర్వాత త్వరగా మగ్గిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోగలిగితే రైతుల ఆదాయం పెరుగుతుంది. మరీ త్వరగా మగ్గిపోకుండా చూడటానికి శీతల గిడ్డంగిలో పెట్టడం ఒక పరిష్కారం. అయితే, ఇది భారీ ఖర్చుతో కూడిన పని. ప్రత్యామ్నాయం కోసం పరిశోధిస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన న్యూ క్యాజిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చిన్న రైతులకు కూడా ఉపయోగపడే ఒకానొక చవకైన, రసాయన రహితమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నారు. అరటి కాయలను గంజితో లేపనం చేయడం. వరి బియ్యం గంజికి సముద్రపు నాచు నుంచి సంగ్రహించిన కర్రగీన్ అనే పదార్థం కలిపి అరటి కాయలకు లేపనం చేసి సత్ఫలితాలు సాధించారు. త్వరగా మగ్గిపోయే స్వభావం ఉన్న కావెండిష్ రకం అరటి కాయలను 60 లాట్లుగా తీసుకొని ప్రయోగం చేశారు. ప్రతి లాట్లో 8 పండ్లు ఉంచారు. ఒక లాట్లో పండ్లను ఏమీ చేయకుండా పక్కన ఉంచారు. సగం లాట్లలో అరటిపండ్లకు గంజి పట్టించారు. మిగతా సగం లాట్లలో పండ్లను నీటిలో ముంచి తీశారు. వీటన్నిటినీ రెండు నిమిషాలు ఎయిర్ డ్రై చేసి.. ఎథిలిన్ ఛాంబర్లో 24 గంటలు ఉంచారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ లాట్లన్నిటినీ పరిశీలించారు. పండ్ల బరువు, శ్వాసక్రియ, ఎథిలిన్ ఉత్పత్తి, గంజి పరిమాణం, క్లోరోఫిల్ స్థాయిలను నమోదు చేశారు. గంజి లేపనం చేసిన పండ్ల శ్వాసక్రియ, తేమ నష్టం ఇతర పండ్లలో కన్నా తక్కువగా ఉన్నదని, అందువల్ల మగ్గే ప్రక్రియ కూడా నెమ్మదించినట్లు గుర్తించారు. సత్యజిత్, అంజిక హంగె సోదరులు పంటల వైవిధ్యం పంటల మధ్య బంధు మిత్రులతో..