వ్యవసాయమా... అందునా ఇంటిపైనా.. అయ్య బాబోయ్ అంత శ్రమపడలేను, సమయం వెచ్చించలేనని ఎంతమాత్రం వెనుకాడవద్దు అంటున్నారు చెన్నైకి చెందిన 31 ఏళ్ల యువకుడు రాహుల్ ధోకా. నాలుగు గోడలు ఉంటే చాలు, రోజుకు కేవలం పది నిమిషాల సమయం గడిపితే చాలు ప్రకృతి వరప్రసాదం వంటి స్వచ్ఛమైన అనేక వ్యవసాయ ఉత్పత్తులు మీకు సొంతం అవుతాయని భరోసా ఇస్తున్నారాయన. విలాసవంతమైన జీవితంతోపాటూ ఎం.ఎస్. పట్టా చేతిలో ఉండి కూడా ఇంటిపంటల సాగునే వృత్తిగా చేసుకున్న విలక్షణ వ్యక్తిత్వం రాహుల్‌ది. తన ఉత్పత్తులతో కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ఆకట్టుకుంటున్నారు. వంటింటి అవసరాలకు మార్కెట్లకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ ఇంటిలోనే వ్యవసాయ ఉత్పత్తులను హైడ్రోపోనిక్ పద్ధతిలో చేతికి మట్టి అంటకుండా సులభతరంగా సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆయన మాటల్లోనే..
అన్నా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ అయ్యాక యూకే వెళ్లి వార్‌విక్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశాను. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే సేంద్రియ వ్యవసాయం వైపు ఆకర్షితుడినయ్యాను. తల్లిదండ్రుల వద్దకు చెన్నై తిరిగి వచ్చిన తరువాత 2013లో సేంద్రియ ఉత్పత్తుల విక్రయ స్టోర్ పెట్టాను. వంద రకాల ఉత్పత్తులను అమ్మేవాడిని. స్వయంగా సాగు చేయాలని 2016 డిసెంబరులో హైడ్రోపోనిక్ విధానంలో ‘ఆక్వాఫామ్స్’ పేరిట (నుంగంబాక్కం తిరుమూర్తి నగర్‌లోని) మా ఇంటి పైనే సాగు ప్రారంభించాను. చెన్నైలో తరచూ ఎదురయ్యే నీటి కొరత ప్రభావానికి గురికాని వ్యవసాయం చేయాలని తలపెట్టాను. మూడు నెలలు పరిశోధన చేసిన తరువాత వీటన్నింటికీ సమాధానంగా హైడ్రోపోనిక్ విధానంలో పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని నమ్మి అనుసరిస్తున్నాను. పాలకూర, తోటకూర, గోంగూర తదితర ఆకుకూరలు, వాము పాక్‌చోయ్, బ్రహ్మి, తులసి, బంతి పెంచుతున్నాను.
కొబ్బరి పొట్టు, క్లే బాల్స్ వేసి విత్తనాలు నాటి నర్సరీ పెంచుతున్నాను. మొక్కలు కొంచెం పెరిగిన తరువాత వాటిని పీవీసీ పైపులను నిలువుగా అనేక వరుసల్లో ఏర్పాటు చేసుకొని, వాటికి రంధ్రాలు పెట్టి, కేవలం రెండు అంగుళాలున్న ఆ కప్పులను ఆ రంధ్రాల్లో కూర్చోబెడుతున్నాను (ఈ కప్పుల్లో మట్టికి బదులుగా వరిపొట్టు, వర్మిక్యులేట్, స్పాంజ్‌లను కూడా వాడవచ్చు). మొక్కల కుదుళ్లకు కొబ్బరి పొట్టును ఏర్పాటు చేసి సాధారణ
నీటిలో న్యూట్రిషన్ నీళ్లను కలిపి ప్లాస్టిక్ గొట్టాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా ప్రవహింపజేస్తాను. ఎన్‌పీకే న్యూట్రిషన్‌తోపాటు మెగ్నీషియం సల్ఫేటు, కాల్షియం నైట్రేట్‌ను ద్రావణం రూపంలో కేవలం మొక్కల వేళ్ల ద్వారా ప్రవహింపజేయడం వల్ల ఎలాంటి దోషమూ ఉండదు. నేలపై అమర్చిన చిన్నపాటి వాటర్ ట్యాంక్ నుంచి మోటార్ ద్వారా పైప్‌కు పై భాగంలో ఈ నీటిని విడుదల చేస్తాను. అవి అలా ప్రవహిస్తూ అన్ని మొక్కలకు చేరుతాయి. మొక్కలకు అందగా మిగిలిన నీరు మళ్లీ కింద ట్యాంక్‌లో పడిపోతుంది. అదేనీటిని నిర్ణీత కాలవ్యవధిలో మళ్లీ వాడుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల ఒక్కనీటి చుక్క కూడా వృథా పోదు.
ఆరు వారాల్లో 200 గ్రాముల దిగుబడి
పాలకూర, తోటకూర, లెట్యుసీ, పాక్‌చోయ్, బ్రహ్మి, తులసి, మారిగోల్డ్ ఫ్లవర్, అజ్వైన్ తదితర ఆకుకూరలు పెంచుతున్నాను. పుదీనా, ఇటాలియన్ బాసిల్ (తులసి), పది తులసి రకాలు వేశాను. మట్టిలో సాధారణ సాగుతో పోల్చితే హైడ్రోపోనిక్ విధానంలో 90 శాతం నీరు ఆదా అవుతుంది. మట్టిని వాడకపోవడం వల్ల మొక్కలకు వ్యాధులు సోకవు. కలుపు మొక్కలు పెరగవు. ఇలా సాగుచేస్తున్న పంట ఆరు వారాల్లో చేతికి వస్తుంది. ఆకుకూర, ఔషధ మొక్కలనుంచి ఆరు నుంచి ఎనిమిది వారాల్లో 200 గ్రాముల దిగుబడి సాధించవచ్చు.
30 అడుగుల్లో 500 మొక్కలు
డాబాపై 80 చదరపు అడుగుల్లో 6,000 కూరగాయ, ఔషధ మొక్కలు పెంచుతున్నాను. అయితే, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం కేవలం 30 చదరపు అడుగుల్లో 500 మొక్కలు పెంచుతున్నాను. నీటి పారుదల మట్టం కొంచం తగ్గించడం వల్ల ఆక్సిజన్ చేరుతుంది. ఇది మొక్కల పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. హైడ్రోపోనిక్ విధానంలో సేంద్రియ విత్తనాలే వాడాల్సిన అవసరం లేదు. సాధారణ విత్తనాలు మొక్కలైనపుడు వాటిల్లోని దోషాలు వంద శాతం తొలగిపోతాయి. ఏదైనా చిన్నపాటి సమస్యలు తలెత్తినట్లయితే వేప నూనెను పిచికారీ చేయడం ద్వారా వాటిని రూపుమాపవచ్చు.
వర్టికల్ పైప్‌లైన్ సాగు విధానంతో ఎంత చిన్న స్థలంలోనైనా మొక్కలను పెంచవచ్చు. గోడకు కూడా పైప్‌లైన్ వ్యవస్థను అమర్చుకుని మొక్కలు పెంచవచ్చు. ఏడాదికి నాలుగు దఫాలు దిగుబడి సాధించవచ్చు.
రోజుకు పది నిమిషాలు చాలు!
ముఖ్యంగా ఈ మొక్కల పెంపకం కోసం గంటల తరబడి శ్రమించాల్సిన అవసరం లేదు. 500 మొక్కల పెంపకానికి సరదాగా రోజుకు పది నిమిషాలు కేటాయిస్తే చాలు. ఎల్తైన పైప్‌లైన్ వ్యవస్థ వల్ల కిందకు వంగి శ్రమపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది వృద్ధులకు ఎంతో సౌకర్యం.
కేజీకి రూ. 20 ఖర్చు
ఒక కేజీ ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంపకానికి కేవలం రూ.20లు మాత్రమే ఖర్చవుతుంది. అదే బజారులో కొంటే ఎంతో ఖరీదు. డాబాపై పంటలు వేసినపుడు అవసరమైన సూర్యరశ్మి అందుతుంది. అలా డాబా పైన ఖాళీ స్థలం లేని వారు నిరుత్సాహపడక్కర లేదు. ఇంటిలోపల కూడా సూర్యరశ్మికి బదులుగా ఎల్‌ఈడీ దీపాలను అమర్చి ఈ మొక్కలు పెంచవచ్చు. 12 గంటల ఎల్‌ఈడీ దీపాల వెలుగు ఆరుగంటల సూర్యరశ్మితో సమానం. ఒక పంట దిగుబడి తరువాత కొబ్బరి పొట్టు మారిస్తే తర్వాత పంటలోనూ మంచి ఫలితాలు పొందవచ్చు.
సేంద్రియం కంటే హైడ్రోపోనిక్ మేలు
సేంద్రియ సాగు కంటే హైడ్రోపానిక్ సాగు ఎంతో శ్రేష్టం. సేంద్రియ పంటల్లో సాల్మోనెల్లా, ఇకొలి అనే బ్యాక్టీరియాను న్యూయార్క్‌లో కనుగొని 75 శాతం ఉత్పత్తులను వెనక్కు పంపివేశారు. సేంద్రియ వ్యవసాయంలో కొందరు ఉత్పత్తుల సైజు పెంచడం కోసం ఆక్సిటోసిన్ హార్మోన్‌ను వినియోగిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. ఆక్సిటోసిన్‌తో తయారైన ఉత్పత్తులను భుజించడం వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది.
ఇంటింటా హైడ్రపోనిక్ పంటే లక్ష్యం
హైడ్రోపోనిక్ వ్యవసాయం అందరికీ అందుబాటులోకి రావాలి. తమకు అవసరమైన మొక్కలను ఎవరికి వారు పెంచుకునే స్థాయికి చేరుకోవాలనేదే నా లక్ష్యం. మార్కెట్‌కు వెళితే అధిక ధరలతోపాటూ వాహనాలకు ఆయిల్ ఖర్చు భరించాల్సి ఉంటుంది. అంతేగాక ఎంతో సమయం వృథా అవుతుంది. ఈ వాస్తవాలపై అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2019 జనవరిలో చెన్నైలో ‘ఆక్వా ఫాం’ హైడ్రోపోనిక్స్ కన్సల్టెన్సీ ఆఫీసును ఏర్పాటు చేశాను. ముందుగా బంధువులకు నేర్పాను. మా ఆఫీసు ద్వారా ఎంతోమందికి సలహాలు, సూచనలు ఇస్తున్నాను. నెలకు రెండు శిక్షణా తరగతులను మూడు నెలలుగా నిర్వహిస్తున్నాను. ఇతర రాష్ట్రాల నుంచి ఎందరో తరగతులకు హాజరవుతున్నారు. ఇలా ఎంతోమందికి అవగాహన కల్పించాను.
– కొట్ర నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై
నేను పండించిన ఆకుకూరలు, ఔషధ మొక్కలను మా ఇంటిలో, బంధుమిత్రుల ఇళ్లలో వాడుకోగా మిగిలినవి ఇతరులకు అమ్ముతున్నాను. వినియోగదారుల నుంచి ముందుగానే ఆర్డర్లు తీసుకొని సరఫరా చేస్తున్నాం. ఇలా ఎందరో ఖాతాదారులు ఏర్పడ్డారు. రిటైల్ దుకాణాలకు కూడా సరఫరా చేస్తున్నాను.
(రాహుల్ «ధోకాను 89395 49895 నంబరులో సంప్రదించవచ్చు)
https://www.acquafarms.org
Comments
Please login to add a commentAdd a comment