– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే క్రమంలో ఇటీవల అందుబాటులోకి వస్తున్న ఒక పద్ధతి ‘బయోచార్’ వినియోగం. దీన్నే మామూలు మాటల్లో ‘కట్టె బొగ్గు’ అనొచ్చు. పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీన్ని తయారు చేసుకొని పొలాల్లో వేసుకోవచ్చు.
– బయోచార్ ఎరువు కాదు.. పంటలకు వేసే రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ కనీసం 30–40% ఎక్కువ ఉపయోగపడేందుకు బయోచార్ ఉపయోగపడుతుంది అంటున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్‌రెడ్డి.
– మట్టిలో పేరుకుపోయిన రసాయనిక అవశేషాలను తొలగించడానికి, వరిసాగులో మిథేన్ వాయువు కాలుష్యాన్ని తగ్గించడానికి బయోచార్ తోడ్పడుతుంది.
– ఒక్కసారి వేస్తే వందల ఏళ్లు నేలలో ఉండి మేలు చేస్తుంది.. సీజనల్ పంటలకైనా, పండ్ల తోటలకైనా బయోచార్ నిజంగా బంగారమే అంటున్న డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖి.
బయోచార్.. ఈ పేరు చెప్పగానే ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్‌రెడ్డి(55) పేరు చప్పున గుర్తొస్తుంది. 20 ఏళ్ల క్రితం నుంచి ‘బయోచార్’ అనే పేరును ఖరారు చేసి.. వ్యవసాయకంగా, పర్యావరణపరంగా దీని ప్రయోజనాల గురించి దేశ విదేశాల్లో విస్తృతంగా పరిశోధనలు, క్షేత్ర ప్రయోగాలు చేస్తూ ఇప్పటికి 5 పుస్తకాలను వెలువరించారు. వెబ్‌సైట్ ద్వారా ఈ ఓపెన్ సోర్స్ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసంగాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆయనతో ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..
బయోచార్ (కట్టె బొగ్గు) అంటే..?
వ్యవసాయ వర్గాల్లో ఈ మధ్య తరచూ వినవస్తున్న మాట బయోచార్. బయో అంటే జీవం.. చార్ (చార్‌కోల్) అంటే బొగ్గు. బయోచార్ అంటే ‘జీవం ఉన్న బొగ్గు’ అని చెపొ్పచ్చు. భూసారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్బనం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు. అంటే ఇది అస్థిర కర్బనం (ఒలేటైల్ కార్బన్). దీన్ని పెంపొందించుకోవటానికి ఫిక్స్‌డ్ కార్బన్ ఉపయోగపడుతుంది. అదే బయోచార్.
బయోచార్ కోసం కట్టెలు కాలబెట్టడం వల్ల అడవులకు, పర్యావరణానికి ముప్పు లేదా?
బొగ్గు నల్ల బంగారంతో సమానం. బంగారం అని ఎందుకు అన్నానంటే.. ప్రపంచంలో తయారు చేయలేనిది, డబ్బుతో కొనలేనిది మట్టి ఒక్కటే. హరిత విప్లవం పేరుతో మట్టిని మనం నాశనం/ విషతుల్యం/ నిర్జీవం చేసుకున్నాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బయోచార్. అడవులను నరికి బయోచార్ తయారు చేయమని మనం చెప్పటం లేదు. పత్తి కట్టె, కంది కట్టె, వరి పొట్టు వంటి పంట వ్యర్థాలను వట్టిగానే తగులబెట్టే బదులు వాటితో బయోచార్ తయారు చేసుకోవచ్చు. వూరికే పెరిగే సర్కారు తుమ్మ వంటి కంప చెట్ల కలపతో లేదా జీడి గింజల పైపెంకులతో కూడా బయోచార్ తయారు చేసుకోవచ్చు. వరి పొట్టును బాయిలర్లలో, హోటళ్ల పొయ్యిల్లో కాల్చిన తర్వాత మిగిలే వ్యర్థాలను కూడా బయోచార్‌గా వాడుకోవచ్చు.
పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో, పెద్దగా పొగ రాకుండా, 450 నుంచి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్చితే (ఈ ప్రక్రియనే ‘పైరోలిసిస్’ అంటారు) తయారయ్యే నల్లని కట్టె బొగ్గే బయోచార్. ఆరుబయట కట్టెను తగుటబెడితే బూడిద మిగులుతుంది. ఈ పద్ధతిలో అయితే బూడిద తక్కువగా బయోచార్ ఎక్కువగా వస్తుంది. రైతు స్థాయిలో ఇనుప డ్రమ్ములో లేదా కందకం తవ్వి కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. బయోచార్ వందల ఏళ్ల ΄ాటు మట్టిలో ఉండి మేలుచేసే సూక్ష్మజీవరాశికి, పోషకాలకు, మొత్తంగా పర్యావరణానికి ఎంతగానో తోడ్పడుతుంది. సాగు నీటిలో విషాలను పరిహరిస్తుంది. దీనితో వ్యవసాయంలో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలతో పోల్చితే.. దీన్ని తయారు చేసేటప్పుడు వెలువడే కొద్ది΄ాటి పొగ వల్ల కలిగే నష్టం చాలా తక్కువ.
‘బయోచార్ కంపోస్టు’ అంటే ఏమిటి?
బయోచార్ అంటే.. పొడిగా ఉండే కట్టె బొగ్గు. దీన్ని నేరుగా పొలాల్లో వేయకూడదు. బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని వేయాలి. చిటికెడు బొగ్గులో లెక్కలేనన్ని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. నేరుగా వేస్తే మట్టిలోని పోషకాలను బొగ్గు పెద్దమొత్తంలో పీల్చుకుంటుంది. అందువల్ల వట్టి బయోచార్‌ను మాత్రమే వేస్తే పంటకు పోషకాలు పూర్తిగా అందవు. అందుకనే. వట్టి బయోచార్‌ను కాకుండా బయోచార్ కంపోస్టును తయారు చేసుకొని వేస్తే ఈ సమస్య ఉండదు.
మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు లేదా బయోగ్యాస్ స్లర్రీ లేదా జీవామృతం లేదా పంచగవ్య వంటి.. ఏదైనా సేంద్రియ ఘన/ ద్రవరూప ఎరువులలో ఏదో ఒకదాన్ని బయోచార్‌ను సమ΄ాళ్లలో కలిపి కుప్ప వేసి, బెల్లం నీటిని చిలకరిస్తూ రోజూ కలియదిప్పుతూ ఉంటే 15 రోజుల్లో బయోచార్ కంపోస్టు సిద్ధం అవుతుంది. అప్పుడు దీన్ని పొలాల్లో వేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. మన పొలంలో మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవటం ముఖ్యం. బయోచార్ ఒకటి రెండు సీజన్లలో ఖర్చయిపోయే ఎరువు వంటిది కాదని రైతులు గుర్తుంచుకోవాలి. వంద నుంచి వెయ్యేళ్ల వరకు నేలలో స్థిరంగా ఉండి మేలు చేస్తుంది.
రసాయనిక ఎరువులు వాడే రైతులకు కూడా బయోచార్ ఉపయోగపడుతుందా?
బయోచార్ సేంద్రియ ఎరువులు లేదా రసాయనిక ఎరువులు వాడే రైతులు కూడా వాడుకోవచ్చు. కట్టెబొగ్గుతో యూరియా, ఫాస్పేటు వంటి వాటిని కలిపి వేసుకోవచ్చు. వట్టిగా యూరియా వేస్తే 20–30 శాతం కన్నా పంటకు ఉపయోగపడదు. అదేగనక బయాచార్‌తో యూరియా కలిపి వేస్తే 30–40% ఎక్కువగా పంటకు ఉపయోగపడుతుంది. బొగ్గులోని ఖాళీ గదులు ఉంటాయి కాబట్టి యూరియాను కూడా పట్టి ఉంచి, ఎక్కువ రోజుల ΄ాటు పంట మొక్కల వేర్లకు నెమ్మదిగా అందిస్తుంది.
వరి సాగుకూ ఉపయోగమేనా?
వరి పొలాల్లో నీటిని నిల్వగట్టే పద్ధతి వల్ల మిథేన్ వంటి హరిత గృహ వాయువులు గాలిలో కలుస్తూ వాతావరణాన్ని అమితంగా వేడెక్కిస్తున్నాయి. రసాయనిక ఎరువులు వాడే పొలాల వాయుకాలుష్యం మరింత ఎక్కువ. ఈ పొలాల్లో బయోచార్ వేస్తే.. నీటి అడుగున మట్టిలో ఆక్సిజన్‌ను లభ్యత పెరుగుతుంది. మిథేన్ తదితర హరిత గృహ వాయువులను బొగ్గు పీల్చుకుంటుంది. కాబట్టి, వాతావరణానికి జరిగే హాని తగ్గుతుంది. అందుకనే బయోచార్ వాడితే కార్బన్ క్రెడిట్స్ పేరిట డబ్బు ఇచ్చే పద్ధతులు కూడా సమీప భవిష్యత్తులోనే అమల్లోకి రానున్నాయి.
బయోచార్‌పై మరింత సమాచారం కోసం చూడండి..
www.youtube.com/@biocharchannel
https://biochared.com
ఏ పొలానికి ఎంత వెయ్యాలో తెలిసేదెలా?
మీ భూమికి ఖచ్చితంగా ఎంత మొత్తంలో బయోచార్ కంపోస్టు వేస్తే సరిపోయేదీ ఒక టెస్ట్ ద్వారా మీరే స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ విషయం ఎవరినో అడిగితే తెలియదు. మీ పొలంలో ఎత్తయిన ప్రదేశంలో 5 చిన్న మడులు చేసుకొని, వాటిల్లో బయోచార్ కంపోస్టును వేర్వేరు మోతాదుల్లో వేసి.. ఆ 5 మడుల్లోనూ ఒకే రకం పంటను సాగు చేయండి. 3 నెలల్లో మీకు ఫలితం తెలిసిపోతుంది. 1 చదరపు మీటరు విస్తీర్ణం (ఈ విసీర్ణాన్ని మీరే నిర్ణయించుకోండి)లో పక్క పక్కనే 5 మడులు తయారు చేసుకోండి. అంటే.. మొత్తం 5 చ.మీ. స్థలం కేటాయించండి. ఒక్కో దాని మధ్య గట్టు మాత్రం ఎత్తుగా, బలంగా వేసుకోండి.
1వ మడిలో బయోచార్ కంపోస్టు అసలు వెయ్యొద్దు. 2వ మడిలో బయోచార్ కంపోస్టు 0.5 కిలో, 3వ మడిలో 1 కిలో, 4వ మడిలో 2 కిలోలు, 5వ మడిలో 4 కిలోలు వెయ్యండి. ఈ 5 మడుల్లో 3 నెలల్లో చేతికొచ్చే ఒకే రకం పంట విత్తుకోండి లేదా కూరగాయ మొక్కలు నాటుకోండి.
– బయోచార్ కంపోస్టుపై శిక్షణ ఇస్తున్న డా. సాయి భాస్కర్ రెడ్డి
బయోచార్ కంపోస్టు విషయంలో వత్యాసాలు ΄ాటించి చూడటం కోసమే ఈ ప్రయోగాత్మక సాగు. ఇక మిగతా పనులన్నీ ఈ మడుల్లో ఒకేలా చేయండి. అంటే నీరు పెట్టటం, కలుపు తీయటం, పురుగుమందులు లేదా కషాయాలు పిచికారీ చేయటం అన్నీ ఒకేలా చెయ్యండి.
ఆ పంటల్లో పెరిగే దశలో వచ్చే మార్పులన్నిటినీ గమనించి, రాసుకోండి. ప్రతి వారానికోసారి ఫొటోలు/వీడియో తీసి పెట్టుకోండి. కాండం ఎత్తు, లావు, పిలకలు/కొమ్మల సంఖ్య, పూత, దిగుబడి, గింజ/కాయల సైజు, ఆ మొక్కల వేర్ల పొడవు వంటి అన్ని విషయాలను నమోదు చేయండి. 3 నెలల తర్వాత ఆ పంట పూర్తయ్యే నాటికి బయోచార్ కంపోస్టు అసలు వేయని మడితో వేర్వేరు మోతాదుల్లో వేసిన మడుల్లో వచ్చిన దిగుబడులతో పోల్చిచూడండి. బయోచార్ కంపోస్టు ఏ మోతాదులో వేసిన మడిలో అధిక దిగుబడి వచ్చిందో గమనించండి. ఇదే మోతాదులో మీ పొలం అంతటికీ వేసుకోండి. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment