దుక్కి చేయని సేద్యం.. దుఃఖం లేని భాగ్యం! | Use Of Chemical Fertilizers And Irrigation Water In Paddy Cultivation Sugabadi Special News | Sakshi
Sakshi News home page

దుక్కి చేయని సేద్యం.. దుఃఖం లేని భాగ్యం!

Published Tue, Jul 9 2024 8:25 AM | Last Updated on Tue, Jul 9 2024 8:25 AM

Use Of Chemical Fertilizers And Irrigation Water In Paddy Cultivation Sugabadi Special News

‘సాక్షి సాగుబడి’తో ముచ్చటిస్తున్న చంద్రశేఖర్‌ 

వరి సాగులో రసాయనిక ఎరువులు, సాగు నీటి వాడకాన్ని దిగుబడి తగ్గకుండా తొలి ఏడాదే సగానికి తగ్గించుకోగలమా? వరి పొలాల నుంచి వెలువడే మిథేన్‌ వాయువు (బొగ్గుపులుసు వాయువు కంటే ఇది భూతా΄ాన్ని 20 రెట్లు ఎక్కువగా పెంచుతోంది) ని అరికట్టే మార్గం ఏమిటి? ఏటా దుక్కి చేసే పంట భూముల్లో నుంచి ఏటా హెక్టారుకు 20 టన్నుల మట్టి వానకు గాలికి కొట్టుకుపోతోంది.

దీన్ని ఆపటం ద్వారా భూసారాన్ని పరిరక్షించుకోగలమా? భారీ ఖర్చుతో నిర్మించిన రిజర్వాయర్లు కొద్ది ఏళ్లలోనే పూడికతో నిండిపోకుండా చెయ్యగలమా..? భూగర్భజలాలు వర్షాకాలంలో (రెండు నెలలుగా మంచి వర్షాలు పడుతున్నప్పటికీ) కూడా అడుగంటే వుంటున్నాయెందుకు? ఈ పెద్ద ప్రశ్నలన్నింటికీ సమాధానం ‘ఒక్కటే’ అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు.. అవును.. సాగు పద్ధతిని మార్చుకోవటం అనే ఒక్క పని చేస్తే చాలు..

వరి, పత్తి వంటి తదితర పంటల సాగును ’సగుణ రీజెనరేటివ్‌ టెక్నిక్‌’ (ఎస్‌.ఆర్‌. టి.) అనే నోటిల్లేజ్‌ ఆరుతడి పద్ధతిలోకి మార్చుకుంటే పై సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని అనుభవపూర్వకంగా చెబుతున్నారు రైతు శాస్త్రవేత్త చంద్రశేఖర్‌.

  • పొలాన్ని దున్ని ఒక్కసారి ఎత్తుమడులను ఏర్పాటు చేస్తే చాలు.. 20 ఏళ్లు మళ్లీ దున్నే పని లేకుండానే ఏటా మూడు పంటలు పండించుకోవచ్చు.

  • వరి దగ్గర నుంచి పత్తి, పప్పుధాన్యాలు, కూరగాయ పంటలను సాగు చేస్తూ చంద్రశేఖర్‌ రికార్డులు బ్రేక్‌ చేస్తున్నారు.

  • రసాయనాలను తగుమాత్రంగా వాడుతూ ఖర్చును, శ్రమను తగ్గించుకొని దిగుబడులతో΄ాటు సేంద్రియ కర్బనాన్ని సైతం 0.3% నుంచి 1.5%కి పెంపొందించానన్నారు.

  • జమ్మికుంటలోని జి.ఎన్‌.ఎన్‌.ఎస్‌. ప్రశాశం కేవీకే ఆవరణలో ఎస్‌.ఆర్‌.టి. పద్ధతిలో శాశ్వత ఎత్తుమడులపై ఆరుతడి వరి సాగుకు ఇటీవల శ్రీకారం చుట్టారు. చంద్రశేఖర్‌ స్వయంగా హాజరై రైతులకు, శాస్త్రవేత్తలకు మెళకువలు నేర్పించారు. ఇతర వివరాలకు.. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటేశ్వరరావు (98485 73710)ను సంప్రదింవచ్చు.

1. 136 సెం.మీ. దూరంలో మార్కింగ్‌ చేసుకొని.. 100 సెం.మీ. వెడల్పుతో శాశ్వత బెడ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. రెండు వైపులా కాలువలు ఉండాలి.
2. ఎస్‌.ఆర్‌.టి. ఫ్రేమ్‌తో బెజ్జాలు వేసుకొని బెడ్‌పై వరి విత్తనాలను 5 వరుసలుగా విత్తుకోవాలి. మొక్కలు, వరుసల మధ్య దూరం 25 సెం.మీ.లు.
3. కాలువల్లో నీరు పెట్టుకొని.. వరి విత్తనాలను ఇలా విత్తుకోవచ్చు..
4. మహరాష్ట్రలోని చంద్రశేఖర్‌ పొలంలో ఎత్తుమడులపై వరి పంట ఇది. పొలం అంతా ఒకే మాదిరిగా పెరిగి కోతకు సిద్ధమైన దృశ్యం.
5. వరి పంటలో నీటిని నిరంతరం నిల్వ ఉంచకూడదు. అవసరాన్ని బట్టి ఆరుతడులు ఇవ్వాలి. ఒక్కసారి మాత్రమే యూరియా వేయాలి.
6. విత్తనాలు వేసిన తర్వాత  కలుపు మొలవకుండా ఎంపిక చేసిన గడ్డి మందును పిచికారీ చేయాలి.

భూమిని పంట వేసిన ప్రతి సారీ దున్నకుండా వ్యవసాయం (నోటిల్లేజ్‌ / జీరోటిల్లేజ్‌ వ్యవసాయం) చెయ్యగలిగితే భూమి కోతను అరికట్టి భూసారాన్ని పెంపొందించుకోవటానికి అంతకుమించి మరో ఉత్తమ మార్గం ఉండదు. ఈ పద్ధతిని దీర్ఘకాలం సాగులో ఉండే పండ్ల తోటల్లో త్రికరణశుద్ధితో అనుసరించే ప్రకృతి/సేంద్రియ వ్యవసాయదారులు చాలా మంది కనిపిస్తుంటారు. అయితే, మూడు, నాలుగు నెలల్లో పూర్తయ్యే సీజనల్‌ పంటలను నోటిల్లేజ్‌ పద్ధతిలో శ్రద్ధగా సాగు చేసే రైతులు మాత్రం అత్యంత అరుదు. ఈ కోవకు చెందిన వారే చంద్రశేఖర్‌ హరి భడ్సావ్లే(74).

మహారాష్ట్ర రాయ్‌గడ్‌ జిల్లా కర్జత్‌ తాలూకాలోని దహివాలి సమీపంలో చంద్రశేఖర్‌ హరి భడ్సావ్లే వ్యవసాయ క్షేత్రం ‘సగుణబాగ్‌’ ఉంది. మహారాష్ట్రలో అగ్రిబిఎస్సీ చదివిన తర్వాత అమెరికాలో ఎం.ఎస్‌.(ఫుడ్‌ టెక్‌) చదువుకొని ఇంటికి తిరిగి వచ్చి.. 48 ఏళ్ల క్రితం వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టిన చంద్రశేఖర్‌ అప్పటి నుంచి మొక్కవోని దీక్షతో 55 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. సుదీర్ఘ సేద్య అనుభవాన్ని రంగరించి వెలువరించిన అనేక ఆవిష్కరణలతో ఎత్తుమడులపై నోటిల్లేజ్‌ సాగును ఈయన కొత్తపుంతలు తొక్కిస్తున్నారు.

ఆరుతడి వరి దగ్గర నుంచి పత్తి, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి పదికి పైగా పంటలను సాగు చేస్తూ రికార్డులు బ్రేక్‌ చేస్తున్నారు. ఒకటి తర్వాత మరొకటి పంటల మార్పిడి చేస్తూ ఖర్చుల్ని తగ్గించుకుంటూ దిగుబడులతో΄ాటు పనిలోపనిగా భూసారాన్ని సైతం పెంపొందిస్తున్నారు. తగుమాత్రంగా రసాయనిక ఎరువులతో ΄ాటు కలుపు మందును వాడుతున్నారు. గత 12 ఏళ్లుగా నోటిల్లేజ్‌ సాగులో చక్కని ఫలితాలు సాధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ సాగు పద్ధతిని ఇప్పుడు కనీసం మరో పది వేల మంది అనుసరిస్తున్నారు.

రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించే సాగు పద్ధతిగా ‘రీజెనరేటివ్‌ అగ్రికల్చర్‌’ (పునరుజ్జీవన వ్యవసాయం) అనే మాట వాడుకలో ఉంది. అయితే, ఈ మాటకు తనదైన శైలిలో సరికొత్త అర్థం చెబుతున్నారు చంద్రశేఖర్‌.

ఎత్తుమడులపై ఆరుతడి పంట (వరి కావచ్చు, మరొకటి కావచ్చు) కోసిన తర్వాత మోళ్లు మిగులుతాయి. వాటి కింద నేలలో వేర్లుంటాయి. మరో పంట వేసుకోవటానికి వీలుగా ఈ మోళ్లను వదిలించుకొని శుభ్రం చేయటం ఎలాగన్నది పెద్ద సమస్య.

అయితే, ఈ సమస్యనే చంద్రశేఖర్‌ అద్భుతమైన పరిష్కారంగా మార్చుకున్నారు. మోళ్లను వేర్లతో సహా పీకెయ్యటమో, కాల్చెయ్యటమో కాకుండా.. వాటిని ఒక చిన్న పనితో పొలంలో కురిసే వాన నీటిని అక్కడికక్కడే ఒడిసిపట్ఠి భూమిలోకి ఇంకింపజేసేందుకు చక్కని సాధనంగా మార్చుకుంటున్నారు. మోళ్లపై కలుపుమందు చల్లటంతో నిర్జీవమవుతాయి. తిరిగి మొలకెత్తవు. కుళ్లిపోతాయి. అప్పుడు తదుపరి పంట విత్తనాలను మనుషులతోనో లేదా సీడ్‌ డిబ్లర్‌తోనో కోవచ్చు.

మోళ్లు, వేర్లు కుళ్లిపోయి పోషకాలు పంటకు అందుబాటులోకి వస్తాయి. ఆఖాళీల ద్వారా వాన నీరు వేగంగా ఇంకుతుంటుంది. వేరు వ్యవస్థలో మట్టికి పుష్కలంగా గాలి, పోషకాలు అందుతాయి. సూక్ష్మజీవరాశి, వాన΄ాములతో ΄ాటు సేంద్రియ కర్బనం పెరుగుతుంది. పంట కోసిన తర్వాత మోళ్లపై కలుపు మందు చల్లుతున్న కారణంగానే ఈ ప్రక్రియ సౌలభ్యకరంగా, వేగవంతంగా జరుగుతోందని చంద్రశేఖర్‌ చెబుతారు. నోటిల్లేజ్‌ సాగు పద్ధతిలో ఇది అత్యంత కీలకమైన అంశమని ఆయన అంటున్నారు.

‘సగుణ’తో సకల ప్రయోజనాలు!
నేను అగ్రికల్చర్‌ బీఎస్సీ, అమెరికాలో ఎమ్మెస్‌ చదివి కూడా 48 ఏళ్లుగా 55 ఎకరాల్లో శ్రద్ధగా వ్యవసాయం చేస్తున్నా. గత పన్నెండేళ్లుగా ఎస్‌.ఆర్‌.టి. పద్ధతిలో దుక్కి దున్నకుండా వరుసగా అనేక పంటలు పండిస్తున్న అనుభవంతో చెబుతున్నా. నోటిల్లేజ్‌ సాగు రైతులకు సౌలభ్యకరంగా, అనేక రకాలుగా ప్రయోజనకరంగా ఉంది.

ప్రతి పంటకూ ముందు, వెనుక దుక్కి దున్నటం వల్ల వానకు, గాలికి భూమి కోతకు గురై ఏటా హెక్టారుకు 20 టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. దుక్కి చేయకుండా విత్తనాలు వేస్తున్నందు వల్ల సాయిల్‌ అగ్రిగేషన్‌ జరిగి పొలంలో మట్టి వానకు, గాలికి కొట్టుకుపోవటం ఆగిపోతుంది.  రసాయనిక కలుపు మందులు వాడటం వల్ల కలుపు సమస్య తీరిపోతుంది. ΄ాత పంటల మోళ్లు, వేర్లు కుళ్లటం వల్ల పోషకాల పునర్వినియోగం జరుగుతుంది.

ఆ రంధ్రాల ద్వారా పొలంలోనే వాన నీటి సంరక్షణ అత్యంత సమర్థవంతంగా జరుగుతుంది. బెట్టను తట్టుకునే శక్తి పంటలకు కలుగుతుంది. నీటిని నిల్వగట్టే పద్ధతిలో సాగయ్యే వరి పొలం మాదిరిగా మిథేన్‌ వాయువు వెలువడదు. కాబట్టి, భూతాపం గణనీయంగా తగ్గుతుంది. కలుపు మందు వల్ల కలిగే నష్టంతో పోల్చితే రైతుకు, భూమికి, పర్యావరణానికి ఒనగూడే ప్రయోజనాలు చాలా ఎక్కువ.

నానా బాధలు పడి సాగు చేసే రైతు ఎప్పుడూ దుఃఖంతోనే ఉంటున్నాడు. ఎస్‌.ఆర్‌.టి. సాగు పద్ధతి వల్ల రైతులకు సంతోషం కలుగుతోంది. అగ్రిటూరిజం కూడా ఇందుకు తోడ్పడుతోంది. అందరూ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. భూతా΄ాన్ని తట్టుకునే శక్తి, ఖర్చులు తగ్గించి, దిగుబడులు పెంచే శక్తి ‘సగుణ’ సాగు పద్ధతికి ఉందని నా అనుభవంలో రుజువైంది.

శాశ్వత ఎత్తుమడులపై ఖరీఫ్‌లో వరిని ఆరుతడి పద్ధతుల్లో సాగు చేయటం, ఆ తర్వాత అవే మడులపై 2,3 పంటలుగా పప్పుధాన్యాలు/ నూనెగింజలు/ కూరగాయలను పంట మార్పిడి ΄ాటిస్తూ సాగు చేస్తున్నాం. వరిలో ఖర్చు 29% తగ్గి దిగుబడి 61% పెరిగింది. పత్తి సాగు ఖర్చు 17% తగ్గి దిగుబడి 96% పెరిగింది. నాతో ΄ాటు మహారాష్ట్రలోని పది వేల మంది రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎవరైనా వచ్చి చూడొచ్చు. – చంద్రశేఖర్‌ హరి భడ్సావ్లే (98222 82623), సగుణ రీజెనరేటివ్‌ టెక్నిక్‌ ఆవిష్కర్త, రైతు శాస్త్రవేత్త, మహారాష్ట్ర, https://sugunafoundation.ngo/

– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement