Sagubadi RAMBABU PANTHAM Farmers Platform Independence
-
కుంకుడు తోట.. ఎకరానికి రూ.13 లక్షలు!
ఎక్కువ పొలం ఉండి, నీటి వసతి అంతగా లేని బీడు భూముల్లో కుంకుడు తోట ద్వారా అనూహ్యమైన రీతిలో ఎకరానికి రూ. 13 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు నల్గొండ జిల్లా రైతు లోకసాని పద్మారెడ్డి. ఎకరానికి కేవలం రూ. 5 వేల నిర్వహణ ఖర్చుతో ఈ ఆదాయం పొందటం విశేషం. 33 ఏళ్ల క్రితం 12 ఎకరాల్లో 1200 కుంకుడు మొక్కలు నాటి అసాధారణ ఫలితాలు సాధిస్తున్నారు. సరికొత్త కుంకుడు వంగడాన్ని రూపొందించటంతో ΄ాటు కుంకుడు పొడితో సబ్బులు, టూత్‌పేస్టులు తయారు చేస్తున్నారు. కుంకుడు కాయల పొడిని సేంద్రియ పురుగుమందుగా, గ్రోత్ ప్రమోటర్‌గా, శిలీంధ్రనాశనిగా కూడా వాడొచ్చని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తల తోడ్పాటుతో పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేయనున్నారు. రైతు శాస్త్రవేత్త పద్మారెడ్డి సుసంపన్న అనుభవాలు రైతులకు చక్కని వ్యవసాయ, వ్యా΄ార ΄ాఠాలుగా నిలుస్తున్నాయనటంలో అతిశయోక్తి లేదు.నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి వాస్తవ్యులు లోకసాని పద్మారెడ్డి అనే మెట్టప్రాంత రైతు చేసిన ప్రయోగం అబ్బుర పరిచే ఫలితాలనందిస్తోంది. డిగ్రీ చదువుకున్న పద్మారెడ్డి(59) వ్యవసాయమే వృత్తిగా స్వీకరించారు. గతంలో హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో పట్టు సాధించారు. ఆయన భార్య శోభారాణి స్వగ్రామంలోనే బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా సేవలందిస్తున్నారు. ఇద్దరు కుమారులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. 1991లో పద్మారెడ్డి నీటి వసతి లేని తమ 12 ఎకరాల పొలంలో 1200 కుంకుడు మొక్కలు నాటించారు. తన ఊరి వారు, మిత్రులు కుంకుడు మొక్కల తోట చూసి నీకేమైనా పిచ్చా? కుంకుడు చెట్లు చేలో ఒకటో రెండో వేసుకుంటే చాలు. ఎవరైనా ఏకంగా 12 ఎకరాల్లో ఇలా తోట ఎవరైనా పెడతారా పటేలా? అని ఎగతాళి చేశారు. కానీ తన ఆలోచన వేరు. తాను వేరే ఏ తోట పెట్టినా ఆ తోటను బతికించుకోవటానికి తగినంత నీరు లేదు. కుంకుడు చెట్లయితే నీరు పెట్టాల్సిన పని లేదు. మొండి చెట్టు కాబట్టి బతికి పోద్దిలే అన్నది పద్మారెడ్డి ఆలోచన. ఆ చెట్లు పెరిగి మంచి కుంకుడు కాయల దిగుబడి ఇస్తుండటంతో ఆయన ఆలోచన ఎంత ముందుచూపుతో కూడినదో అందరికీ అర్థం అవుతున్నది.8 లక్షల ఎకరాలకు విత్తనాలు..33 ఏళ్ల చెట్టు ఏటా 100 కిలోల కాయలు కాస్తోంది. ఎకరానికి పది వేల కిలోల దిగుబడి. గత సీజన్లో కిలో రూ. 130 చొప్పున అమ్మితే ఎకరానికి రూ. 13 లక్షల ఆదాయం వచ్చిందని పద్మారెడ్డి తెలి΄ారు. ఆనోటా ఈనోటా తెలుసుకున్న అనేక రాష్ట్రాల రైతులు సుమారు 4 లక్షల మంది ఇప్పటికి సందర్శించారు. 8 లక్షల ఎకరాలకు సరిపడే విత్తనాలు అమ్మానని, వారిలో చాలా మంది కుంకుడుతోటలు సాగు చేస్తున్నారన్నారు. కాబట్టి, భవిష్యత్తులోనూ ఇంత ఎక్కువ ఆదాయం వస్తుందని అనుకోలేమని ఆయన స్పష్టం చేశారు. విస్తీర్ణం పెరిగి భవిష్యత్తులో కుంకుళ్ల ఉత్పత్తి పెరిగినప్పుడు ధర తగ్గుతుందన్నారు. ఎంత తగ్గినా, ఎట్టిపరిస్థితుల్లోనూ.. ఎకరానికి రూ. 2.5 లక్షల కన్నా తక్కువగా అయితే ఆదాయం రాదని పద్మారెడ్డి చెబుతున్నారు.కొత్త వంగడం నమోదుకు యత్నాలు..దేశంలోనే అరుదైన ఒక అద్భుత కుంకుడు వనంగా పద్మారెడ్డి తోట గుర్తింపు పొందింది. అనేక రాష్ట్రాల నుంచి రైతులు, అధికారులు ఇప్పటికి లక్షలాది మంది తన తోటను సందర్శించారని ఆయన సంతోషంగా చె΄్పారు. 12 ఎకరాల్లో 1200 కుంకుడు చెట్లను 31 ఏళ్లుగా సాగు చేస్తున్న పద్మారెడ్డి తోటలో 3–4 రకాల కుంకుడు రకాలు ఉన్నాయి. వీటిలో 63 చెట్లు అద్భుత ఫలితాలను ఇస్తున్నట్లు ఆయన గుర్తించారు. మెరుగైన చెట్లను ఎంపిక చేసి సరికొత్త కుంకుడు వంగడాన్ని ఆయన రూపొందించారు. శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిపుణులు పద్మారెడ్డి కుంకుడు క్షేత్రాన్ని సందర్శించి ప్రశంసించారు. దీనితో ΄ాటు జాతీయ స్థాయిలో దీన్ని సరికొత్త రైతు వంగడంగా అధికారికంగా గుర్తింపు తెప్పించేందుకు దరఖాస్తు చేయటంలో పద్మారెడ్డికి ఉద్యాన వర్సిటీ తోడ్పాటునందిస్తోంది. పిజెటిఎస్ఎయు క్వాలిటీ కంట్రోల్ ప్రయోగశాలలో పద్మారెడ్డి కుంకుడు కాయలపై పరీక్షలు జరిపించారు. ఇందులో అద్భుత ఫలితాలు రావటంతో శాస్త్రవేత్తలే ఆశ్చర్యానికి లోనయ్యారు.ఒక్కసారి నాటి, మూడు/ నాలుగు సంవత్సరాలు వాటిని కా΄ాడుకుంటే చాలు.. రైతుకు ఊహించనంత ఆదాయం వస్తుందని పద్మారెడ్డి అనుభవాలు చాటి చెబుతున్నాయి. పెద్ద కమతాలు ఉండి, సీజనల్ పంటలు సాగు చేసుకోలేక బీడు పెడుతున్న రైతులు కుంకుడు తోటలను సులువుగా పెంచి, అధికాదాయం పొందవచ్చని పద్మారెడ్డి సూచిస్తున్నారు.20×20 దూరంలో నాటాలి..కుంకుడు సాగులో పద్మారెడ్డి 33 ఏళ్ల అనుభవం గడించారు. 20“20 అడుగుల దూరంలో కుంకుడు మొక్కలు నాటుకోవాలి. డ్రిప్‌తో నీటిని అందించాలి. రెండు కుంకుడు చెట్ల మధ్య తొలి మూడేళ్లు బొ΄్పాయి, మునగ, జామ వంటి పంటలు వేసుకుంటే రైతుకు ఆదాయం వస్తుంది. కుంకుడు మొక్క నాటి డ్రిప్ ఏర్పాటు చేసి, యాజమాన్య పద్ధతులు ΄ాటిస్తే నాలుగో ఏడాది నుంచి 20–30 కిలోల కాపుప్రారంభమవుతుంది. ఐదేళ్ల తర్వాత పూత దశలో నీరు ఇస్తే చాలు. మంచి దిగుబడి వస్తుంది. నవంబర్–డిసెంబర్లో పూత వస్తుంది. ఏప్రిల్‌లో కాయలు కోతకు వస్తాయి. కుంకుడు చెట్టు కాపు సీజన్ పూర్తయ్యాక ఆకు రాల్చి నిద్రావస్థలోకి వెళ్తుంది. ఎండిన మానులా ఉండే చెట్టు మేలో చిగురిస్తుంది. ఒక్కో చెట్టుకు 20–25 కిలోల రాలుతాయి. ఆకులన్నీ చెట్టు మొదట్లోనే కుళ్లి సేంద్రియ ఎరువుగా పోషకాలను అందిస్తాయి.విలువ ఆధారిత ఉత్పత్తులపైనే దృష్టి!33 ఏళ్లుగా 12 ఎకరాల్లో కుంకుడు తోట సాగుచేస్తున్నా. ఏటా 1200–1300 క్వింటాళ్ల ఎండు కాయలు ఉత్పత్తి అవుతున్నాయి. 200 సంవత్సరాల వరకు ఈ చెట్లకు ఢోకా ఉండదు. ఎండుకాయలు కిలో రూ. 130కి ఇస్తున్నా. విత్తనాలు కిలో రూ. వెయ్యి, ఇప్పటికి 8 లక్షల ఎకరాలకు అమ్మా. ఇకపై కుంకుళ్లు అమ్మకుండా.. విలువ జోడించి అమ్మాలనుకుంటున్నా. కుంకుడు పొడికి రెండు రకాల ఔషధ మొక్కల పొడిని జోడించి.. కిలో 170కి అమ్ముతున్నా. ఇది పంటలకు పురుగుమందుగా, గ్రోత్‌ప్రమోటర్‌గా, శిలీంధ్రనాశనిగా చక్కగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఈ పొడిని మరింత మెరుగ్గా తయారు చేసి.. బ్రాండ్ చేసి ప్యాక్‌చేసి మార్కెట్లోకి తేబోతున్నా. పండ్ల పొడిగా, టూత్‌పేస్ట్‌గా, కాళ్ల పగుళ్లకు మందుగా.. ఇలా అనేక రకాలుగా కూడా కుంకుడు ఉపయోగపడుతోంది. పలు ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నా. కుంకుడు చెట్లకు తేనెటీగలు విపరీతంగా ఆకర్షితమవుతాయి. ప్రకృతికి కూడా ఈ తోట ఎంతో మేలు చేకూర్చుతోంది. – లోకసాని పద్మారెడ్డి (99481 11931), రైతు శాస్త్రవేత్త, పోలేపల్లి, చందంపేట మండలం, నల్గొండ జిల్లా– నిర్వహణ: పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్ -
Yarru Baparao: సేఫ్ ఫుడ్ సేనాని!
కుటుంబ సభ్యులు కేన్సర్ బారిన పడిన ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్న నేపథ్యంలో ఆహారంలో రసాయనాల అవశేషాలే ఇందుకు మూల కారణంగా గుర్తించిన ఓ యువకుడు ఉద్యోగం వదలి ప్రకృతి సేద్య సేనానిగా మారారు. అతనే యర్రు బాపారావు (బాపయ్య). కేవలం ఎకరంన్నర సొంత భూమి మాత్రమే ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయం చేపట్టడంతో పాటు దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. తమిళనాడు వెల్లూరులో ఈషా ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ‘భారతీయ సంప్రదాయ వరి, ఆహారోత్పత్తుల ఉత్సవం’లో బాపారావు మరో ముగ్గురు తెలుగు రైతులతో పాటు ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు.సేఫ్ ఫుడ్ యువ ఉద్యమకారునిగా బాపారావు (39), లక్ష్మీ సౌజన్య దంపతుల ప్రకృతి వ్యవసాయ జీవన ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. వారి స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట. ఉన్నత విద్యావంతుడైన బాపారావు హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్, 2డి ఏనిమేటర్ గా ఉద్యోగం చేసేవారు. తమ కుటుంబంలోనే ముగ్గురు కేన్సర్ వ్యాధితో కొద్ది కాలంలోనే మృత్యువాతపడటంతో రసాయనాల మయమైన ఆహారమే ఆరోగ్యాన్ని నాశనం చేస్తోందని గ్రహించారు. ఓ వైద్యుని సలహా మేరకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. 9 ఏళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం – సంప్రదాయ ఆహారోద్యమం ్రపారంభించారు. భార్య తోడ్పాటుతో బాపారావు తిరిగి స్వగ్రామం చేరుకొని ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. సొంత భూమి ఎకరంన్నరకు తోడు 7 ఎకరాల కౌలు భూమిలో ఔషధ, పోషక విలువలతో కూడిన దేశీ వరి వంగడాలను గత తొమ్మిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో అత్తోట గ్రామానికి చెందిన 60 మంది రైతులు సమష్టిగా ప్రకృతి వ్యవసాయం చేపట్టి సుమారు 85 ఎకరాల భూమిలో దేశీ వరి రకాలను సాగు చేస్తుండటం విశేషం.ఎకరంలో 365 రకాల దేశీ వరి రకాలను విత్తనాల పరిరక్షణ కోసం బాపారావు సాగు చేస్తున్నారు. 7 ఎకరాల్లో సార్వాలో మైసూర్మల్లిగ, బహురూపి తదితర దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. గట్లపై బంతి, వంగ, చిక్కుడు, ΄÷ద్దు తిరుగుడు, బెండ, అరటి, మునగ, టమాటా, మిర్చి, తోటకూర, గోంగూర, ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. వేసవిలో 20 రకాల ధాన్యాలు, పప్పుదినుసులు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలు చల్లి.. 40 రోజులు పెరిగిన తర్వాత కోసి ఆవులకు మేతగా ఉపయోగించుకుంటున్నారు. కూరగాయలు, ఆకుకూరలు ఇంట్లోకి వాడుకుంటున్నారు. మిగతా పచ్చిరొట్టను భూమిలో కలియదున్ని తర్వాత వరి సాగు చేస్తున్నారు.ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, కూరగాయలను స్నేహితులు, బంధువులకు అమ్ముకొని ప్రతి రోజూ ఆదాయం సంపాదిస్తున్నారు. లక్ష్మి దేవినేని సహకారంతో ‘తానా’ సహకారంతో గ్రామంలోనే ‘భూమి భారతి’ అనే సంస్థను నెలకొల్పారు. భూమి భారతి ద్వారా దేశీ వరి విత్తన నిధిని నిర్వహించటంతోపాటు.. రైతులు పండించిన దేశీ వరి బియ్యాన్ని, విలువ జోడించిన ఇతర ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులను సంతల్లో, సోషల్ మీడియా ద్వారా సుమారు వెయ్యి కుటుంబాలకు విక్రయిస్తున్నారు. రైతు మిత్రుల ద్వారా దేశీ వరి విత్తనోత్పత్తి చేసి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 4 వేల మంది ప్రకృతి వ్యవసాయదారులకు అందించటం బాపారావు విశేష కృషికి నిదర్శనం.భావితరం కోసం...ఆయన ఇలా చెబుతున్నారు.. ‘రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం వలన భూమి సారం కోల్పోతున్నది, రైతులు అప్పుల పాలవుతూ, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి సాగు పద్ధతిలో పండిస్తే ఖర్చులు తగ్గించుకోవచ్చు. నీటి తడులు పెట్టడం తగ్గుతుంది. అంతర పంటలతో అధికాదాయాన్ని ΄÷ందుతాం. దేశీ విత్తనం వాడటం వలన ఆ పంటలు తినే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఇతర రైతులు పండించే పంటదిగుబడులను బై బ్యాక్ సిస్టం కింద కొని భూమి భారతి ద్వారా నేరుగా ప్రజలకు అమ్ముతున్నాను. ప్రతి రైతూ ఏటీఎం మోడల్ వేసుకుంటే అదనపు ఆదాయం కూడా వస్తుంది. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తోపాటు మంచి భూమి భావితరానికి కావాలి అంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయటమే మార్గం..’ అంటారు బాపారావు.ప్రవాస భారతీయులు మౌనికా రెడ్డి దంపతుల సాయంతో విజయవాడలోని కనకదుర్గ అమ్మ వారికి , మరో ఎన్ఆర్ఐ తాళ్లూరి జయశేఖర్ దంపతుల సాయంతో భద్రాచలంలోని సీతారాముల వారికి ఏడాది ΄÷డవునా నైవేద్యం కోసం దేశీ వరి బియ్యాన్ని పంపుతుండటం మరో విశేషం. వరి కోత సమయంలో వర్షాల కారణంగా ధాన్యం ఎండబెట్టడం, కలుపు తీసే సమయంలో కూలీల కొరత వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని ఆయన చెబుతున్నారు. బాలారిష్టాలను అధిగమించి నిలదొక్కుకున్న ఆయన నెలకు రూ. 4 లక్షల టర్నోవర్‌కు చేరుకోవటం విశేషం. ‘ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యదాయక ఆహారమే ఆరోగ్య సోపానమ’ని తన చేతల ద్వారా చాటిచెబుతున్న బాపారావు (91003 07308) దంపతులు యువతకు ఆదర్శ్రపాయులు. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
దుక్కి చేయని సేద్యం.. దుఃఖం లేని భాగ్యం!
వరి సాగులో రసాయనిక ఎరువులు, సాగు నీటి వాడకాన్ని దిగుబడి తగ్గకుండా తొలి ఏడాదే సగానికి తగ్గించుకోగలమా? వరి పొలాల నుంచి వెలువడే మిథేన్ వాయువు (బొగ్గుపులుసు వాయువు కంటే ఇది భూతా΄ాన్ని 20 రెట్లు ఎక్కువగా పెంచుతోంది) ని అరికట్టే మార్గం ఏమిటి? ఏటా దుక్కి చేసే పంట భూముల్లో నుంచి ఏటా హెక్టారుకు 20 టన్నుల మట్టి వానకు గాలికి కొట్టుకుపోతోంది.దీన్ని ఆపటం ద్వారా భూసారాన్ని పరిరక్షించుకోగలమా? భారీ ఖర్చుతో నిర్మించిన రిజర్వాయర్లు కొద్ది ఏళ్లలోనే పూడికతో నిండిపోకుండా చెయ్యగలమా..? భూగర్భజలాలు వర్షాకాలంలో (రెండు నెలలుగా మంచి వర్షాలు పడుతున్నప్పటికీ) కూడా అడుగంటే వుంటున్నాయెందుకు? ఈ పెద్ద ప్రశ్నలన్నింటికీ సమాధానం ‘ఒక్కటే’ అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు.. అవును.. సాగు పద్ధతిని మార్చుకోవటం అనే ఒక్క పని చేస్తే చాలు..వరి, పత్తి వంటి తదితర పంటల సాగును ’సగుణ రీజెనరేటివ్ టెక్నిక్’ (ఎస్.ఆర్. టి.) అనే నోటిల్లేజ్ ఆరుతడి పద్ధతిలోకి మార్చుకుంటే పై సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని అనుభవపూర్వకంగా చెబుతున్నారు రైతు శాస్త్రవేత్త చంద్రశేఖర్.పొలాన్ని దున్ని ఒక్కసారి ఎత్తుమడులను ఏర్పాటు చేస్తే చాలు.. 20 ఏళ్లు మళ్లీ దున్నే పని లేకుండానే ఏటా మూడు పంటలు పండించుకోవచ్చు.వరి దగ్గర నుంచి పత్తి, పప్పుధాన్యాలు, కూరగాయ పంటలను సాగు చేస్తూ చంద్రశేఖర్ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు.రసాయనాలను తగుమాత్రంగా వాడుతూ ఖర్చును, శ్రమను తగ్గించుకొని దిగుబడులతో΄ాటు సేంద్రియ కర్బనాన్ని సైతం 0.3% నుంచి 1.5%కి పెంపొందించానన్నారు.జమ్మికుంటలోని జి.ఎన్.ఎన్.ఎస్. ప్రశాశం కేవీకే ఆవరణలో ఎస్.ఆర్.టి. పద్ధతిలో శాశ్వత ఎత్తుమడులపై ఆరుతడి వరి సాగుకు ఇటీవల శ్రీకారం చుట్టారు. చంద్రశేఖర్ స్వయంగా హాజరై రైతులకు, శాస్త్రవేత్తలకు మెళకువలు నేర్పించారు. ఇతర వివరాలకు.. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వరరావు (98485 73710)ను సంప్రదింవచ్చు.1. 136 సెం.మీ. దూరంలో మార్కింగ్ చేసుకొని.. 100 సెం.మీ. వెడల్పుతో శాశ్వత బెడ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. రెండు వైపులా కాలువలు ఉండాలి.2. ఎస్.ఆర్.టి. ఫ్రేమ్‌తో బెజ్జాలు వేసుకొని బెడ్‌పై వరి విత్తనాలను 5 వరుసలుగా విత్తుకోవాలి. మొక్కలు, వరుసల మధ్య దూరం 25 సెం.మీ.లు.3. కాలువల్లో నీరు పెట్టుకొని.. వరి విత్తనాలను ఇలా విత్తుకోవచ్చు..4. మహరాష్ట్రలోని చంద్రశేఖర్ పొలంలో ఎత్తుమడులపై వరి పంట ఇది. పొలం అంతా ఒకే మాదిరిగా పెరిగి కోతకు సిద్ధమైన దృశ్యం.5. వరి పంటలో నీటిని నిరంతరం నిల్వ ఉంచకూడదు. అవసరాన్ని బట్టి ఆరుతడులు ఇవ్వాలి. ఒక్కసారి మాత్రమే యూరియా వేయాలి.6. విత్తనాలు వేసిన తర్వాత కలుపు మొలవకుండా ఎంపిక చేసిన గడ్డి మందును పిచికారీ చేయాలి.భూమిని పంట వేసిన ప్రతి సారీ దున్నకుండా వ్యవసాయం (నోటిల్లేజ్ / జీరోటిల్లేజ్ వ్యవసాయం) చెయ్యగలిగితే భూమి కోతను అరికట్టి భూసారాన్ని పెంపొందించుకోవటానికి అంతకుమించి మరో ఉత్తమ మార్గం ఉండదు. ఈ పద్ధతిని దీర్ఘకాలం సాగులో ఉండే పండ్ల తోటల్లో త్రికరణశుద్ధితో అనుసరించే ప్రకృతి/సేంద్రియ వ్యవసాయదారులు చాలా మంది కనిపిస్తుంటారు. అయితే, మూడు, నాలుగు నెలల్లో పూర్తయ్యే సీజనల్ పంటలను నోటిల్లేజ్ పద్ధతిలో శ్రద్ధగా సాగు చేసే రైతులు మాత్రం అత్యంత అరుదు. ఈ కోవకు చెందిన వారే చంద్రశేఖర్ హరి భడ్సావ్లే(74).మహారాష్ట్ర రాయ్‌గడ్ జిల్లా కర్జత్ తాలూకాలోని దహివాలి సమీపంలో చంద్రశేఖర్ హరి భడ్సావ్లే వ్యవసాయ క్షేత్రం ‘సగుణబాగ్’ ఉంది. మహారాష్ట్రలో అగ్రిబిఎస్సీ చదివిన తర్వాత అమెరికాలో ఎం.ఎస్.(ఫుడ్ టెక్) చదువుకొని ఇంటికి తిరిగి వచ్చి.. 48 ఏళ్ల క్రితం వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టిన చంద్రశేఖర్ అప్పటి నుంచి మొక్కవోని దీక్షతో 55 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. సుదీర్ఘ సేద్య అనుభవాన్ని రంగరించి వెలువరించిన అనేక ఆవిష్కరణలతో ఎత్తుమడులపై నోటిల్లేజ్ సాగును ఈయన కొత్తపుంతలు తొక్కిస్తున్నారు.ఆరుతడి వరి దగ్గర నుంచి పత్తి, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి పదికి పైగా పంటలను సాగు చేస్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఒకటి తర్వాత మరొకటి పంటల మార్పిడి చేస్తూ ఖర్చుల్ని తగ్గించుకుంటూ దిగుబడులతో΄ాటు పనిలోపనిగా భూసారాన్ని సైతం పెంపొందిస్తున్నారు. తగుమాత్రంగా రసాయనిక ఎరువులతో ΄ాటు కలుపు మందును వాడుతున్నారు. గత 12 ఏళ్లుగా నోటిల్లేజ్ సాగులో చక్కని ఫలితాలు సాధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ సాగు పద్ధతిని ఇప్పుడు కనీసం మరో పది వేల మంది అనుసరిస్తున్నారు.రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించే సాగు పద్ధతిగా ‘రీజెనరేటివ్ అగ్రికల్చర్’ (పునరుజ్జీవన వ్యవసాయం) అనే మాట వాడుకలో ఉంది. అయితే, ఈ మాటకు తనదైన శైలిలో సరికొత్త అర్థం చెబుతున్నారు చంద్రశేఖర్.ఎత్తుమడులపై ఆరుతడి పంట (వరి కావచ్చు, మరొకటి కావచ్చు) కోసిన తర్వాత మోళ్లు మిగులుతాయి. వాటి కింద నేలలో వేర్లుంటాయి. మరో పంట వేసుకోవటానికి వీలుగా ఈ మోళ్లను వదిలించుకొని శుభ్రం చేయటం ఎలాగన్నది పెద్ద సమస్య.అయితే, ఈ సమస్యనే చంద్రశేఖర్ అద్భుతమైన పరిష్కారంగా మార్చుకున్నారు. మోళ్లను వేర్లతో సహా పీకెయ్యటమో, కాల్చెయ్యటమో కాకుండా.. వాటిని ఒక చిన్న పనితో పొలంలో కురిసే వాన నీటిని అక్కడికక్కడే ఒడిసిపట్ఠి భూమిలోకి ఇంకింపజేసేందుకు చక్కని సాధనంగా మార్చుకుంటున్నారు. మోళ్లపై కలుపుమందు చల్లటంతో నిర్జీవమవుతాయి. తిరిగి మొలకెత్తవు. కుళ్లిపోతాయి. అప్పుడు తదుపరి పంట విత్తనాలను మనుషులతోనో లేదా సీడ్ డిబ్లర్తోనో కోవచ్చు.మోళ్లు, వేర్లు కుళ్లిపోయి పోషకాలు పంటకు అందుబాటులోకి వస్తాయి. ఆఖాళీల ద్వారా వాన నీరు వేగంగా ఇంకుతుంటుంది. వేరు వ్యవస్థలో మట్టికి పుష్కలంగా గాలి, పోషకాలు అందుతాయి. సూక్ష్మజీవరాశి, వాన΄ాములతో ΄ాటు సేంద్రియ కర్బనం పెరుగుతుంది. పంట కోసిన తర్వాత మోళ్లపై కలుపు మందు చల్లుతున్న కారణంగానే ఈ ప్రక్రియ సౌలభ్యకరంగా, వేగవంతంగా జరుగుతోందని చంద్రశేఖర్ చెబుతారు. నోటిల్లేజ్ సాగు పద్ధతిలో ఇది అత్యంత కీలకమైన అంశమని ఆయన అంటున్నారు.‘సగుణ’తో సకల ప్రయోజనాలు!నేను అగ్రికల్చర్ బీఎస్సీ, అమెరికాలో ఎమ్మెస్ చదివి కూడా 48 ఏళ్లుగా 55 ఎకరాల్లో శ్రద్ధగా వ్యవసాయం చేస్తున్నా. గత పన్నెండేళ్లుగా ఎస్.ఆర్.టి. పద్ధతిలో దుక్కి దున్నకుండా వరుసగా అనేక పంటలు పండిస్తున్న అనుభవంతో చెబుతున్నా. నోటిల్లేజ్ సాగు రైతులకు సౌలభ్యకరంగా, అనేక రకాలుగా ప్రయోజనకరంగా ఉంది.ప్రతి పంటకూ ముందు, వెనుక దుక్కి దున్నటం వల్ల వానకు, గాలికి భూమి కోతకు గురై ఏటా హెక్టారుకు 20 టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. దుక్కి చేయకుండా విత్తనాలు వేస్తున్నందు వల్ల సాయిల్ అగ్రిగేషన్ జరిగి పొలంలో మట్టి వానకు, గాలికి కొట్టుకుపోవటం ఆగిపోతుంది. రసాయనిక కలుపు మందులు వాడటం వల్ల కలుపు సమస్య తీరిపోతుంది. ΄ాత పంటల మోళ్లు, వేర్లు కుళ్లటం వల్ల పోషకాల పునర్వినియోగం జరుగుతుంది.ఆ రంధ్రాల ద్వారా పొలంలోనే వాన నీటి సంరక్షణ అత్యంత సమర్థవంతంగా జరుగుతుంది. బెట్టను తట్టుకునే శక్తి పంటలకు కలుగుతుంది. నీటిని నిల్వగట్టే పద్ధతిలో సాగయ్యే వరి పొలం మాదిరిగా మిథేన్ వాయువు వెలువడదు. కాబట్టి, భూతాపం గణనీయంగా తగ్గుతుంది. కలుపు మందు వల్ల కలిగే నష్టంతో పోల్చితే రైతుకు, భూమికి, పర్యావరణానికి ఒనగూడే ప్రయోజనాలు చాలా ఎక్కువ.నానా బాధలు పడి సాగు చేసే రైతు ఎప్పుడూ దుఃఖంతోనే ఉంటున్నాడు. ఎస్.ఆర్.టి. సాగు పద్ధతి వల్ల రైతులకు సంతోషం కలుగుతోంది. అగ్రిటూరిజం కూడా ఇందుకు తోడ్పడుతోంది. అందరూ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. భూతా΄ాన్ని తట్టుకునే శక్తి, ఖర్చులు తగ్గించి, దిగుబడులు పెంచే శక్తి ‘సగుణ’ సాగు పద్ధతికి ఉందని నా అనుభవంలో రుజువైంది.శాశ్వత ఎత్తుమడులపై ఖరీఫ్‌లో వరిని ఆరుతడి పద్ధతుల్లో సాగు చేయటం, ఆ తర్వాత అవే మడులపై 2,3 పంటలుగా పప్పుధాన్యాలు/ నూనెగింజలు/ కూరగాయలను పంట మార్పిడి ΄ాటిస్తూ సాగు చేస్తున్నాం. వరిలో ఖర్చు 29% తగ్గి దిగుబడి 61% పెరిగింది. పత్తి సాగు ఖర్చు 17% తగ్గి దిగుబడి 96% పెరిగింది. నాతో ΄ాటు మహారాష్ట్రలోని పది వేల మంది రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎవరైనా వచ్చి చూడొచ్చు. – చంద్రశేఖర్ హరి భడ్సావ్లే (98222 82623), సగుణ రీజెనరేటివ్ టెక్నిక్ ఆవిష్కర్త, రైతు శాస్త్రవేత్త, మహారాష్ట్ర, https://sugunafoundation.ngo/– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
మిల్లెట్స్‌ను ప్రోత్సహిస్తే.. లాభాలు మెండు!
తెలంగాణ దక్కను పీఠభూమిప్రాంతంలో వర్షాధారంగా వ్యవసాయం చేసే సన్న, చిన్నకారు రైతులు సంఘంగా ఏర్పడటం.. సేంద్రియ సేద్య పద్ధతిని అనుసరించటం.. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు తదితర పంటలను కలిపి సాగు చేయటం.. సంఘటితంగా మార్కెటింగ్ చేసుకోవటం నిస్సందేహంగా బహువిధాలా లాభదాయకమే! సంఘటితమైన చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు తాము పండిస్తున్న పౌష్టికాహారాన్ని తింటూ.. మిగతా దిగుబడులు విక్రయిస్తూ మంచి నికరాదాయం కూడా పొందగలుగుతున్నారని, పనిలో పనిగా భూసారాన్ని కూడా పెంపొందించుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెస్’ జరిపిన తాజా అధ్యయనం చెబుతోంది.డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)ప్రోత్సాహంతో మహిళా రైతుల స్వయం సహాయక సంఘాలు అనుసరిస్తున్న సేంద్రియ సేద్య నమూనా సాధిస్తున్న విజయాలపై ‘సెస్’ ఇటీవలే అధ్యయనం చేసింది. సహకార స్ఫూర్తిని చాటిచెబుతున్న ఈ అధ్యయన వివరాలు..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత గ్రామాల్లో డీడీఎస్ చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగును చాలాకాలంగాప్రోత్సహిస్తోంది. సాగులో అడుగడుగునా ఈ మహిళా రైతులకు తోడుగా ఉండటంతో పాటు మార్కెట్లో మద్దతు ధరకు తానే సేకరించి, ్రపాసెస్ చేసి ఏడాది పొడవునా హైదరాబాద్, జహీరాబాద్ప్రాంతాల్లో ప్రజలకు విక్రయిస్తోంది డీడీఎస్. సంఘటిత శక్తి వల్ల ఈ రైతులు ఎకరానికి రూ. 6 వేలకుపైగా నికరాదాయం పొందుతున్నారు.అయితే, కొందరు రైతులు డీడీఎస్‌తో సంబంధం లేకుండా చిరుధాన్యాలను పండించి వ్యక్తిగతంగా మార్కెట్లో అమ్ముకుంటూ నష్టాల పాలవుతున్నారని హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్ (సెస్) ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది.సెస్ సంచాలకురాలు ఇ. రేవతి, అసోసియేట్ ప్రొఫెసర్ బి.సురేశ్ రెడ్డి, అసిస్టెంట్‌ప్రొఫెసర్ పెద్ది దయాకర్‌ల బృందం 2024 జనవరిలో జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్, న్యాల్కల్, మొగడంపల్లె మండలాల్లోని 34 గ్రామాల్లో 1,100 మంది రైతుల వ్యవసాయ అనుభవాలపై ఇంటింటి సర్వే చేసింది. ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలతో ‘సెస్’ పరిశోధనా నివేదికను వెలువరించింది.సర్వే జరిగిన గ్రామాల్లో ప్రధానంగా వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు చిరుధాన్యాలు తదితర పంటలను రసాయనిక పద్ధతిలో కాకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, ఊదలు వంటి చిరుధాన్యాలతో పాటు కందులు, పెసలు, మినుములు, ఉలవలు, సోయా, మిరప, మొక్కజొన్న, అల్లం, పత్తి, పసుపు వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో 80% మంది రైతులు తమ చిన్న చిన్న కమతాల్లో ఏదో ఒక పంటను కాకుండా కనీసం 8 రకాల పంటలు కలిపి పండిస్తున్నారు.డీడీఎస్‌తో సంబంధం లేకుండా చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు ఎకరానికి అయిన ఖర్చు రూ. 11,893. అయితే, డీడీఎస్ సహకార సంఘాల సభ్యులైన మహిళా రైతులకు చిరుధాన్యాలు తదితర కలిపి పంటల సాగుకు ఎకరానికి అయిన ఖర్చు రూ. 10,218 మాత్రమే. చిరుధాన్యాలు తదితర పంటలు కలిపి పండించిన రైతులకు మొత్తం ఖర్చులో 70% కూలీల ఖర్చే. చిరుధాన్యేతర పంటల రైతులకు అయిన కూలీల ఖర్చు 39% మాత్రమే.చిరుధాన్యేతర పంటల సాగు ఖర్చులో 43% విత్తనానికి అవుతుంది. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు అదనం. డీడీఎస్‌తో సంబంధం లేకుండా చిరుధాన్య పంటలు సాగు చేసే రైతులు విత్తనాలకు 12% ఖర్చు పెడుతున్నారు.డీడీఎస్ సంఘాల్లో రైతులు విత్తనాలకు 10% ఖర్చు చేస్తున్నారు. వీరు సేంద్రియ ఎరువుల కోసం మొత్తం ఖర్చులో 15% వెచ్చిస్తున్నారు. బోరాన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలను భూమికి అందిస్తున్నారు. రసాయనిక వ్యవసాయంలో చిరుధాన్యాలు సాగు చేస్తున్న సంఘటితం కాని రైతులకు మార్కెట్లో సరైన ధర రాక ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువ అవుతుండటం గమనార్హం.అయితే, డీడీఎస్ సహకార సంఘాల్లో ఉన్న సేంద్రియ రైతులకు మాత్రం డీడీఎస్ సంస్థాగత తోడ్పాటు.. మార్కెటింగ్ మద్దతు, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి వల్లే రైతులకు అధికాదాయం వస్తోందని సెస్ నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా, ‘చిరుధాన్యేతర’ (పత్తి తదితర) పంటలను సాగు చేసే రైతులకు అన్నీ అనుకూలిస్తే రూ. 12 వేలకు పైగా నికారదాయం వస్తోంది. అను కూలించకపోతే ఏకపంటలు సాగు చేసే ఈ రైతులకు పెట్టుబడి నష్టం ఎక్కువగా ఉంటుంది.చిరుధాన్యాల రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి..వర్షాధారంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలను పండించే చిన్న, పెద్ద రైతులు సమజానికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. వాతావరణ మార్పుల్ని తట్టుకుంటూ భూసారాన్ని పెంపొందిస్తున్నారు. పర్యావరణానికీ మేలు చేస్తున్నారు.ఈ మెట్ట రైతుల విశేష కృషికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చే విధంగా బలమైన విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రైతులకు ఎకరానికి కనీసం రూ. 2–3 వేలు ప్రత్యేకప్రోత్సాహకంగా ఇవ్వాలి. అన్ని రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలకు కనీస మద్దతు ధరలు ప్రకటించాలి. మిల్లెట్ రైతుల ఎఫ్పిఓలు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలకు ప్రత్యేక సుదుపాయాలు ఇవ్వటం ద్వారా ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి.నీటిపారుదల రైతులతో పోల్చితే వీరికి అధిక ్రపాధాన్యం ఇచ్చేలా గట్టి చట్టాలు తేవాలి. ఈ చర్యలతో చిరుధాన్యాల, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగి, ప్రజలకు మరింత సరసమైన ధరలకు లభిస్తాయి. – డా. బి.సురేశ్ రెడ్డి (95505 58158), అసోసియేట్ ప్రొఫెసర్, సెస్, హైదరాబాద్ -
Sagubadi: విదేశీ విత్తనాలను, మొక్కల్ని ఆన్లైన్లో కొంటున్నారా? జాగ్రత్త..!
విదేశాల నుంచి మొక్కలు, విత్తనాలు, చెక్క వస్తువులు, అలంకరణ చేపలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారా? విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ కంటికి నచ్చిన పూల మొక్కలనో, పంట మొక్కలనో, వాటి విత్తనాలనో అధికారుల కన్నుగప్పి వెంట తెస్తున్నారా?మిరపతో పాటు కొన్ని కూరగాయ పంటలు, మామిడి తోటలను ఇటీవల అల్లాడిస్తున్న నల్ల తామర ఇలాగే విదేశాల నుంచి వచ్చిపడిందేనని మీకు తెలుసా? కొబ్బరి, ఆయిల్‌పామ్ వంటి తోటలను పీడిస్తున్న రుగోస్ రింగ్‌స్పాట్ తెల్లదోమ కూడా విదేశాల నుంచి మన నెత్తిన పడినదే. వీటి వల్ల జీవవైవిధ్యానికి, రైతులకు అపారమైన నష్టం కలుగుతోంది.ఒక దేశంలో ఉన్నప్పుడు పెద్దగా నష్టం కలిగించని పురుగులు, తెగుళ్లు వేరే దేశపు పర్యావరణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి జీవవైవిధ్యానికి పెను సమస్య్ఠగా మారే ప్రమాదం ఉంటుంది.ఒక్కసారి ఆ పర్యావరణంలో అది సమస్యగా మారిన తర్వాత దాన్ని నిర్మూలించటం చాలా సందర్భాల్లో అసాధ్యం. ఉదాహరణ.. మన రైతులను వేధిస్తున్న నల్లతామర, రుగోస్ రింగ్‌స్పాట్ తెల్లదోమ. అందుచేత.. విదేశాల నుంచి సకారణంగా ఏవైనా మొక్కల్ని, విత్తనాలను, అలంకరణ చేపలను తెప్పించుకోవాలనుకుంటే.. అంతకు ముందే ఫైటోశానిటరీ సర్టిఫికెట్తో పాటు ఇతర అనుమతుల్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త..!తెలిసో తెలియకో పోస్టు, కొరియర్ల ద్వారా మన వంటి వారు కొనుగోలు చేస్తున్న విదేశీ మొక్కలు, విత్తనాలతో పాటు మనకు తెలియకుండా దిగుమతయ్యే సరికొత్త విదేశీ జాతుల పురుగులు, తెగుళ్లు మన దేశంలో పంటలకు, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఆహార భద్రతకు ఎసరు పెట్టే పరిస్థితులూ తలెత్తవచ్చు. అందుకే అంతర్జాతీయంగా జన్యువనరుల వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఎయిర్‌పోర్టుల్లో, సీపోర్టుల్లో, సరిహద్దుల్లో ప్రత్యేక అధికార వ్యవస్థలను ఏర్పాటు చేశారు.మొక్కలు, విత్తనాలే కాదు.. మట్టి ద్వారా కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి చీడపీడలు తెలియకుండా రవాణా కావొచ్చు. ఆ మధ్య ఒక క్రికెటర్ తనతో పాటు తీసుకెళ్తున్న బూట్లకు అడుగున అంటుకొని ఉన్న మట్టిని సైతం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గుర్తించి, నివారించడానికి ఇదే కారణం.అధికారికంగా వ్యవసాయ పరిశోధనల కోసం దిగుమతయ్యే పార్శిళ్లను ఈ క్వారంటైన్ అధికారులు వాటిని నిబంధనల మేరకు పరీక్షించి, ప్రమాదం లేదనుకుంటేనే దిగుమతిదారులకు అందిస్తారు. జాతీయ మొక్కల జన్యువనరుల పరిశోధనా సంస్థ (ఎన్‌బిపిజిఆర్) ద్వారా ఇది జరుగుతుంది.ఒక వ్యాపార సంస్థ నుంచి నేరుగా వినియోగదారుల మధ్య (బి2సి) జరిగే ఆన్లైన్ వ్యాపారం వల్లనే సమస్య. విదేశాల్లోని వినియోగదారులకు ఓ వ్యాపార సంస్థ నేరుగా అమ్మకాలు జరుపుతున్నందున దిగుమతులకు సంబంధించిన ఫైటోశానిటరీ నిబంధనల అమలు కష్టతరంగా మారింది.అంతర్జాతీయంగా ఈ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ప్రపంచ దేశాల మధ్య ఇంటర్నేషనల్ ΄్లాంట్ ్ర΄÷టెక్షన్ ఒడంబడిక (ఐపిపిసి) గతంలోనే కుదిరింది. ఇటీవల కాలంలో పెద్ద తలనొప్పిగా మారిన ఈ–కామర్స్ పార్శిళ్లను కట్టడి చేయడం కోసం జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థలకు ఐపిపిసి సరికొత్త మార్గదర్శకాలను సూచించింది.- గోల్డెన్ ఆపిల్ స్నెయిల్, - వరి మొక్కపై నత్త గుడ్లుఎవరేమి చెయ్యాలి?దేశ సరిహద్దులు దాటి సరికొత్త చీడపీడలు మన దేశంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే, ప్రమాదవశాత్తూ వచ్చినా వాటిని తొలి దశలోనే గుర్తించి మట్టుబెట్టేందుకు సమాజంలోని అనేక వర్గాల వారు చైతన్యంతో వ్యవహరించాల్సి ఉంది.రైతులు: చీడపీడలను చురుగ్గా గమనిస్తూ ఏదైనా కొత్త తెగులు లేదా పురుగు కనిపిస్తే వెంటనే అధికారులకు చె΄్పాలి. పర్యావరణ హితమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు: చీడపీడల నివారణ, నియంత్రణకు మేలైన పద్ధతులను రైతులకు సూచించాలి. వీటి అమలుకు మద్దతు ఇస్తూ.. మొక్కల ఆరోగ్య పరిరక్షణకు సంబంధీకులందరినీ సమన్వయం చేయాలి.ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు, పాలకులు: మొక్కల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించాలి. పర్యావరణహితమైన సస్యరక్షణ చర్యలను ్రపోత్సహించాలి. ప్రమాదరహితమైన వ్యాపార పద్ధతులను ప్రవేశ పెట్టాలి. జాతీయ, రాష్ట్రాల స్థాయిలో మొక్కల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ సంస్థలను అన్ని విధాలా బలోపేతం చేయాలి.దాతలు–సిఎస్ఆర్: మొక్కల ఆరోగ్య రక్షణ వ్యవస్థలను, సాంకేతికతలను బలోపేతం చేయాలి. ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధులు సమకూర్చాలి. రవాణా, వ్యాపార రంగాలు: ప్రస్తుతం అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ఫైటోశానిటరీ చట్టాలను, ఐపిపిసి ప్రమాణాలను తు.చ. తప్పక పాటించాలి.ప్రజలు: విదేశాల నుంచి మన దేశంలోకి మొక్కల్ని, మొక్కల ఉత్పత్తుల్ని తీసుకురావటం ఎంతటి ప్రమాదమో గుర్తించాలి. అధికార వ్యవస్థల కన్నుగప్పే విధంగా ఈ–కామర్స్ వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా విదేశాల నుంచి మొక్కలను, విత్తనాలను ఆర్డర్ చేయకుండా చైతన్యంతో మెలగాలి.విదేశీ నత్తలతో ముప్పు!ఓ కోస్తా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మంచినీటి నత్త జాతికి చెందిన గోల్డెన్ ఆపిల్ స్నెయిల్ను విదేశాల నుంచి తెప్పించి సిమెంటు తొట్లలో పెంచుతూ పట్టుబడ్డాడు. దక్షిణ అమెరికా దీని స్వస్థలం. అయితే, తైవాన్, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు పాకిన ఈ నత్త ఆయా దేశాల్లో తామరతంపరగా పెరిగిపోతూ స్థానిక జలచరాలను పెరగనీయకుండా జీవవైవిధ్యాన్ని, వరి పంటను దెబ్బతీయటంప్రారంభించింది.లేత వరి మొక్కలను కొరికెయ్యటం ద్వారా పంటకు 50% వరకు నష్టం చేకూర్చగలదు. ఫిలిప్పీన్స్‌లో ఏకంగా 200 కోట్ల డాలర్ల మేరకు పంట నష్టం కలిగించింది. వేగంగా పెరిగే లక్షణం గల ఈ నత్త మంచినీటి చెరువులు, కాలువలు, వరి ΄÷లాల్లో జీవవైవిధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ వ్యక్తి ఈ నత్తలను పెంచుతూ మాంసాన్ని విక్రయించటంప్రారంభించిన విషయం తెలుసుకున్న అధికారులు అతని వద్ద ఉన్న విదేశీ నత్తలను, వాటి గుడ్లను పూర్తిగా నాశనం చేశారు.దీని వల్ల జీవవైవిధ్యానికి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో ఈ నత్తల్ని పెంచటంప్రారంభించినట్లు చెబుతున్నారు. కొరియర్ ద్వారా గాని, కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి నత్తలను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అయితే, సకాలంలో అధికారులు స్పందించటం వల్ల మన వరి ΄÷లాలకు ఈ నత్తల ముప్పు తప్పింది.ఇండియన్ స్టిక్ ఇన్సెక్ట్..ఎండిన, ముక్కలు చేసిన లేదా పాలిష్ చేసిన ధాన్యాలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు కూడా చీడపీడలను మోసుకొచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఉడికించటం, స్టెరిలైజ్ చేయటం, వేపటం వంటిప్రాసెసింగ్ చేసిన ఆహారోత్పత్తుల ద్వారా మాత్రం చీడపీడలు రవాణా అయ్యే అవకాశం ఉండదు కాబట్టి వీటికి ఫైటోశానిటరీ నిబంధనలు వర్తించవు.తేనెటీగలు, సీతాకోకచిలుకలు, మాంటిడ్స్, పెంకు పురుగులు, పుల్లలతో చేసిన బొమ్మ మాదిరిగా కనిపించే పురుగులు (స్టిక్ ఇన్సెక్ట్స్), నత్తలు వంటి వాటిని కొందరు సరదాగా పెంచుకోవటానికి కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి పంపటం లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయటం వంటి పనులు చేస్తుంటారు. వీటి ద్వారా కూడా పురుగులు, తెగుళ్లు, వైరస్లు ఇతర దేశాలకు వ్యాపించే అకాశం ఉంటుంది. న్యూజిలాండ్‌లో మూడేళ్ల క్రితం ఒక స్కూలు విద్యార్థిని ఇంట్లో పెద్దలకు తెలియకుండా అనేక రకాల స్టిక్ ఇన్సెక్ట్ గుడ్లను పోర్చుగల్ దేశం నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేసి తెప్పించుకుంది. పార్శిల్ వచ్చిన తర్వాత గమనించిన ఆమె తల్లి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వారు ఆ పార్శిల్‌ను జాగ్రత్తగా తీసుకెళ్లి పరీక్షించి చూశారు.ఆ దేశంలో అప్పటికే ఉన్న అనేక రకాల స్టిక్ ఇన్సెక్ట్స్ గుడ్లతో పాటు కొత్త రకం ఇండియన్ స్టిక్ ఇన్సెక్ట్ గుడ్లు కూడా ఆ పార్శిల్లో ఉన్నాయని గుర్తించి నాశనం చేశారు. ఈ విద్యార్థిని తల్లి చైతన్యం మెచ్చదగినది.సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు!ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా వస్తువుల వ్యాపారం (ఈ–కామర్స్) గతమెన్నడూ లేనంత జోరుగా సాగుతున్న రోజులివి. సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు జరుగుతున్నాయి. 2022లో ఏకంగా 16,100 కోట్ల పార్శిళ్ల కొనుగోళ్లు ఆన్లైన్లో జరిగాయి. కరోనా కాలంలో 20% పెరిగాయి. ఇప్పుడు వార్షిక పెరుగుదల 8.5%. 2027 నాటికి ఏటా 25,600 కోట్ల పార్శిళ్లు ఈ కామర్స్ ద్వారా బట్వాడా అయ్యే అవకాశం ఉందని అంచనా.- అమెరికాలోని ఓ తనిఖీ కేంద్రంలో ఈ–కామర్స్ పార్శిళ్లుముఖ్యంగా అసక్తిగా ఇంటిపంటలు, పూల మొక్కలు పెంచుకునే గృహస్తులు చిన్న చిన్న కవర్లలో విత్తనాలను విదేశాల్లోని పరిచయస్తులకు పోస్ట్/ కొరియర్ ద్వారా పంపుతుంటారు. విదేశీ కంపెనీల నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటూ ఉంటారు. విదేశాల నుంచి విత్తనాలు, ఉద్యాన తోటల మొక్కలు, అలంకరణ మొక్కలు, వాటితో పాటు వచ్చే మట్టి, అలంకరణ చేపలు, చెక్కతో చేసిన వస్తువులు, యంత్రాల ప్యాకింగ్‌లో వాడే వుడ్ ఫ్రేమ్‌ల ద్వారా పురుగులు, తెగుళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి రవాణా అవుతూ అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి.కరోనా కాలం నుంచి ప్రపంచ దేశాల మధ్య పార్శిళ్ల వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటంతో నియంత్రణ వ్యవస్థలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. మన దేశంలో నియంత్రణ వ్యవస్థలను నేటి అవసరాలకు అనుగుణంగా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
వరి విత్తనాలు వేసే డ్రోన్ వచ్చేసింది!
డ్రోన్లతో వరి సహా అనేక పంటలపై పురుగుమందులు, ఎరువులు చల్లటం ద్వారా కూలీల ఖర్చును, సమయాన్ని రైతులు ఆదా చేసుకుంటూ ఉండటం మనకు తెలుసు. వరి విత్తనాలను వెద పెట్టడానికి ఉపయోగపడే డ్రోన్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ మారుత్ డ్రోన్స్ ఇతర రంగాల్లో డ్రోన్ల వినియోగంతో పాటు వ్యవసాయంలో డ్రోన్ సేవలపైనా విశేషమైన ప్రగతి సాధించింది.తాజాగా వరి విత్తనాలు వేసే డ్రోన్‌ను రూపొందించింది. పేటెంట్ హక్కులు కూడా పొందింది. పిజెటిఎస్ఎయు, నాబార్డ్ తోడ్పాటుతో క్షేత్రస్థాయి ప్రయోగాలను పూర్తి చేసుకొని వెద పద్ధతిలో వరి విత్తనాలను వరుసల్లో విత్తే డ్రోన్లను ఇఫ్కో తోడ్పాటుతో రైతులకు అందుబాటులోకి తెస్తోంది. డిజిసిఎ ధృవీకరణ పొందిన ఈ డ్రోన్ల కొనుగోలుకు బ్యాంకు రుణాలతో పాటు సబ్సిడీ ఉండటం విశేషం.గాలిలో ఎగిరే చిన్న యంత్రం డ్రోన్. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. అంటే, మనిషి పొలంలోకి దిగకుండా గట్టుమీదే ఉండి వ్యవసాయ పనులను సమర్థవంతంగా చేసుకోవడానికి ఉపయోగపడే అధునాతన యంత్రం. ఇప్పుడు వ్యవసాయంలోని అనేక పంటల సాగులో, ముఖ్యంగా వరి సాగులో, కీలకమైన అనేక పనులకు డ్రోన్ ఉపయోగపడుతోంది. రైతులకు ఖర్చులు తగ్గించటం, కూలీల అవసరాన్ని తగ్గించటం వంటి పనుల ద్వారా ఉత్పాదకతను, నికరాదాయాన్ని పెంపొందించేందుకు డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి.దోమల నిర్మూలన, ఔషధాల రవాణా వంటి అనేక ఇతర రంగాలతో పాటు వ్యవసాయంలో ఉపయోగపడే ప్రత్యేక డ్రోన్లను అభివృద్ధి చేయటంలో మారుత్ డ్రోన్స్ విశేష కృషి చేస్తోంది. ప్రేమ్ కుమార్ విస్లావత్, సాయి కుమార్ చింతల, ఐఐటి గౌహతి పూర్వవిద్యార్థి సూరజ్ పెద్ది అనే ముగ్గురు తెలుగు యువకులు 2019లో మారుత్ డ్రోన్స్ స్టార్టప్‌ను ్రపారంభించారు. డేటా ఎనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలతో వ్యవసాయ డ్రోన్లను రూపొందించటంపై ఈ కంపెనీ దృష్టి సారించింది.ప్రొ. జయశకంర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు), అగ్రిహబ్, నాబార్డ్ తోడ్పాటుతో రైతుల కోసం ప్రత్యేక డ్రోన్లను రూపుకల్పన చేస్తోంది. నల్గొండ జిల్లా కంపసాగర్‌లోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో 50 ఎకరాల్లో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో గత రెండున్నరేళ్లుగా మారుత్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. స్థానిక రైతులు పండించే పంటలకు అనువైన రీతిలో ఉండేలా ఈ డ్రోన్లను అభివృద్ధి చేశారు. వరి పంటపై డ్రోన్ల ద్వారా పురుగుమందులు చల్లటానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్స్(ఎస్.ఓ.పి.ల)ను గతంలోనే ఖరారు చేశారు.వరి పంటపై పురుగుల మందు పిచికారీ..ప్రస్తుతం వెద వరి పద్ధతిలో ఆరుతడి పంటగా వరి విత్తనాలను నేరుగా బురద పదును నేలలో విత్తుకోవడానికి ఉపయోగపడేలా డ్రోన్‌ను రూపొందించారు. ఇప్పటికే నాలుగైదు డ్రోన్ ప్రొటోటైప్‌ల ద్వారా వరి విత్తనాలను వరుసల్లో వెద పెట్టడానికి సంబంధించిన ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఒకటి, రెండు నెలల్లో దీనికి సంబంధించిన ఎస్.ఓ.పి.లు పూర్తవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.డ్రోన్ల సేద్యానిదే భవిష్యత్తు!తక్కువ నీరు ఖర్చయ్యే వెద పద్ధతిలోనే భవిష్యత్తులో వరి సాగు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వెద వరిలో విత్తనాలు వేయటం, ఎరువులు చల్లటం, చీడపీడలను ముందుగానే గుర్తించటం, పురుగుమందులు చల్లటం వంటి అనేక పనులకు డ్రోన్లు ఉపయోగపడతాయి. డ్రోన్ ధర రూ. పది లక్షలు. ఒక్క డ్రోన్‌తోనే పంట వివిధ దశల్లో ఈ పనులన్నీ చేసుకోవచ్చు.డిజిసిఎ ధృవీకరణ ఉండటం వల్ల డ్రోన్ కొనుగోలుకు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద 6% వడ్డీకే అనేక పథకాల కింద బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. రైతుకు 50% సబ్సిడీ వస్తుంది. ఎఫ్పిఓ లేదా కస్టమ్ హైరింగ్ సెంటర్లకైతే 75% వరకు సబ్సిడీ వస్తుంది. పది డ్రోన్లు కొని అద్దె సేవలందించే వ్యాపారవేత్తలకైతే రూ. 2 కోట్ల వరకు రుణం కూడా దొరుకుతోంది. గ్రామీణ యువతకు డ్రోన్ సేవలు ఏడాది పొడవునా మంచి ఉపాధి మార్గం చూపనున్నాయి.– ప్రేమ్ కుమార్ విస్లావత్, వ్యవస్థాపకుడు, సీఈఓ, మారుత్ డ్రోన్స్డ్రోన్ విత్తనాలు వెద పెట్టేది ఇలా..వరి నారు పోసి, నాట్లు వేసే సంప్రదాయ పద్ధతితో పోల్చితే విత్తనాలు వెదజల్లే పద్ధతి అనేక విధాలుగా మెరుగైన ఫలితాలను ఇస్తున్న విషయం తెలిసిందే. వెద వరిలో అనేక పద్ధతులు ఉన్నాయి. పొలాన్ని దుక్కి చేసిన తర్వాత పొడి దుక్కిలోనే ట్రాక్టర్ సహాయంతో సీడ్ డ్రిల్‌తో విత్తనాలు వేసుకోవటం ఒక పద్ధతి.బురద పదును నేలలో ఎక్కువ నీరు లేకుండా డ్రమ్ సీడర్‌ను లాగుతూ మండ కట్టిన వరి విత్తనాలను చేనంతా వేసుకోవటం రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతుల కన్నా.. బురద పదును నేలలో డ్రోన్ ద్వారా వరి విత్తనాలను జారవిడవటం మరింత మేలైన పద్ధతి. తక్కువ శ్రమ, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకులు చెబుతున్నారు.ఎకరంలో వరి విత్తటానికి 20 నిమిషాలు..ఈ విధానంలో వరి నారుకు బదులు దమ్ము చేసిన పొలంలో డ్రోన్ సాయంతో వరి విత్తనాలను క్రమ పద్ధతిలో జారవిడుస్తారు. ఇందుకోసం ఆ డ్రోన్‌కు ప్రత్యేకంగా రూపొందించిన పైప్లాంటి సీడ్ డిస్పెన్సింగ్ డివైస్‌ను అమర్చుతారు. ఆ డివైస్‌కు డ్రోన్‌కు నడుమ వరి విత్తనాలు నిల్వ వుండేలా బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా 5 వరుసల్లో వరి విత్తనాలు బురద పదునుగా దమ్ము చేసిన పొలంలో విత్తుతారు. వరి మొక్కల మధ్య 10 సెం.మీ.లు, వరుసల మధ్య 15 సెం.మీ.ల దూరంలో విత్తుతారు.సాధారణంగా నాట్లు వేసే పద్ధతిలో ఎకరానికి 20–25 కిలో విత్తనం అవసరమైతే ఈ పద్ధతిలో 8–12 కిలోల విత్తనం సరిపోతుంది. సన్న రకాలైతే 10–11 కిలోల విత్తనం చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 20 నిమిషాలకు ఒక ఎకరం చొప్పున రోజుకు ఒక డ్రోన్ ద్వారా 20 ఎకరాల్లో విత్తనాలు వెదపెట్టవచ్చు. సాళ్లు వంకర్లు లేకుండా ఉండటం వల్ల కలుపు నివారణ సులువు అవుతుందని, గాలి బాగా సోకటం వల్ల చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. వెదపద్ధతి వల్ల తక్కువ నీటితోనే వరి సాగు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.హెక్టారుకు రూ.5 వేలు ఆదా..వెద వరి (డైరెక్ట్ సీడిండ్ రైస్– డిఎస్ఆర్) సాగు పద్ధతిలో డ్రోన్లను వాడటం ద్వారా కూలీల బాధ లేకుండా చప్పున పని పూర్తవ్వటమే కాకుండా సాగు ఖర్చు సీజన్‌కు హెక్టారుకు రూ. 5 వేలు తగ్గుతుందని మారుత్ డ్రోన్స్ సీఈవో ప్రేమ్ కుమార్ విస్లావత్ అంచనా. డ్రోన్ సాయంతో సకాలంలో పురుగుమందులు సకాలంలో చల్లటం వల్ల చీడపీడల నియంత్రణ జరిగి హెక్టారుకు 880 కిలోల ధాన్యం అధిక దిగుబడి వస్తుందన్నారు. రైతుకు హెక్టారుకు రూ.21,720 ఆదనపు ఆదాయం వస్తుందని ఆయన చెబుతున్నారు.700 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ..మారుత్ డ్రోన్స్ పిజెటిఎస్ఎయుతో కలసి ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇస్తోంది. రైతులు, స్వయం సహాయక బృందాల మహిళలకు, ఎఫ్పిఓ సభ్యులకు, వ్యవసాయ పట్టభద్రులకు, పదో తరగతి పాసైన యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఈ అకాడమీ ద్వారా ఇప్పటికే 700 మంది శిక్షణ పొందారు. అందులో 150 మంది స్వయం సహాయక బృందాల మహిళలు కూడా ఉన్నారు.డిజిసిఎ ఆమోదం వున్న ఈ వారం రోజుల శిక్షణ పొందిన వారికి పదేళ్ల పైలట్ లైసెన్స్ వస్తుంది. వ్యవసాయ సీజన్లో డ్రోన్ పైలట్‌కు కనీసం రూ. 60–70 వేల ఆదాయం వస్తుందని ప్రేమ్ వివరించారు. ఈ డ్రోన్ పైలట్ శిక్షణ పొందిన వారు వ్యవసాయంతో పాటు మరో 9 రంగాల్లో డ్రోన్లను వినియోగించవచ్చు. ఏడాది పొడవునా ఉపాధి పొందడానికి అవకాశం ఉంది.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఎత్తు మడులపై అల్లం నాటారో.. ఇక లాభాలే!
సాధారణ బోదెలపైన అల్లం విత్తుకోవటం కన్నా వెడల్పాటి ఎత్తు మడులపై రెండు సాళ్లుగా నాటుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎత్తు మడులపై అల్లం సాగు వల్ల వేరుకుళ్లు వంటి తగుళ్ల సమస్య తీరిపోతుందని, కనీసం 30–40% అల్లం దిగుబడి పెరుగుతుందని ఉత్తరాంధ్ర జిల్లాల్లో గిరిజన రైతులతో పనిచేస్తున్న వికాస స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎస్. కిరణ్ తెలిపారు.సాధారణంగా రైతులు బోదెలు తోలి అల్లం విత్తుకుంటూ ఉంటారు. వర్షాలకు కొద్ది రోజులకే బోదె, కాలువ కలిసిపోయి నీరు నిలబడటం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా వేరుకుళ్లు వంటి తెగుళ్లు వస్తుంటాయి. నీటి ముంపు పరిస్థితుల్లో పంట దిగుబడి భారీగా దెబ్బతిని ఖర్చులు కూడా రాని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి.ఈ సమస్యల నుంచి బయటపడి పంట విషలం కాకుండా మంచి దిగుబడి పొందాలంటే ఎత్తుమడులపై విత్తుకోవటమే మేలని వికాస సంస్థ పాడేరు, అరకు ప్రాంత రైతులకు అవగాహన కల్పిస్తోంది. ప్రేమ్‌జీ ఫౌండేషన్ తోడ్పాటుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం గత ఖరీఫ్ నాటికి రెండేళ్లలోనే 543 మంది రైతులకు విస్తరించిందని డా. కిరణ్ వివరించారు. అడుగు ఎత్తున, రెండు నుంచి రెండున్న అడుగుల వెడల్పుతో ఎత్తు మడులను పొలంలో వాలుకు అడ్డంగా నిర్మించుకోవాలి.రెండు వరుసలుగా అల్లం లేదా పసుపు విత్తుకోవచ్చు. అల్లం సాగులో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. ఎత్తుమడులపై విత్తుకోవటం, మురుగునీరు పోవడానికి కాలువలు ఏర్పాటు చేయటంతో పాటు ఎకరానికి 200 కిలోల ఘన జీవామృతం, 25 కిలోల వేపపిండి వేస్తారు. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతం (ఏటా 600 లీటర్లు) మొక్కల మొదళ్లలో పోస్తున్నారు. ఎకరానికి కనీసం 14–15 టన్నుల దిగుబడులు సాధిస్తున్నారని డా. కిరణ్ వివరించారు.బోదెలు తోలి సాగు చేసే సాధారణ పద్ధతిలో సగటున ఎకరానికి 9–11 టన్నుల దిగుబడి వస్తుంటుందని, ఎత్తుమడుల పద్ధతిలో సగటున ఎకరానికి 5–6 టన్నులు అదనపు దిగుబడి వస్తోందన్నారు. ఎత్తుమడుల వల్ల కలుపు తీయటం సులభం అవుతుంది. పంట విఫలమై రైతు నష్టపోయే ప్రమాదం తప్పుతుంది. మైదానప్రాంతాల రైతులు కూడా ఎత్తు మడుల పద్ధతిని నిశ్చింతగా అనుసరించవచ్చని డా. కిరణ్ (98661 18877) భరోసా ఇస్తున్నారు.– డాక్టర్ కిరణ్13 నుంచి తిరుపతిలో సేంద్రియ ఎఫ్పిఓల మేళా..కనెక్ట్ టు ఫార్మర్ సంస్థ నాబార్డ్ సహకారంతో ఈ నెల 13,14,15 తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రం (టౌన్‌క్లబ్)లో గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు, ఎఫ్పిఓల మేళాను నిర్వహించనుంది. కనెక్ట్ టు ఫార్మర్ సంస్థ నెలకో సేంద్రియ సంత నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.13 ఉ. 11 గంటలకు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, నాబార్డ్ సీజీఎం గో΄ాల్ మేళాను ప్రారంభిస్తారు. ΄ాత విత్తనాల ప్రదర్శన ఉంటుంది. 14న ఉదయం అమేయ కృషి వికాస కేంద్రం (భువనగిరి) వ్యవస్థాపకులు, ప్రముఖ రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి ఉద్యాన పంటల్లో గ్రాఫ్టింగ్‌పై శిక్షణ ఇస్తారు.15న ప్రకృతి చికిత్సా పద్ధతులపై నేలకొండపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డా. కె. రామచంద్ర, ప్రకృతి సేద్యంపై గ్రామభారతి అధ్యక్షులు సూర్యకళ గుప్త, ప్రసిద్ధ అమృతాహార ప్రచారకులు ప్రకృతివనం ప్రసాద్, ఆరుతడి వరి సాగుపై ఆదర్శ రైతు శ్రీనివాస్ (గద్వాల్) వివరిస్తారు. ఇతర వివరాలకు 63036 06326. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ఇవి చదవండి: బయోచార్ కంపోస్టు.. నిజంగా బంగారమే! -
బయోచార్ కంపోస్టు.. నిజంగా బంగారమే!
– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే క్రమంలో ఇటీవల అందుబాటులోకి వస్తున్న ఒక పద్ధతి ‘బయోచార్’ వినియోగం. దీన్నే మామూలు మాటల్లో ‘కట్టె బొగ్గు’ అనొచ్చు. పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీన్ని తయారు చేసుకొని పొలాల్లో వేసుకోవచ్చు.– బయోచార్ ఎరువు కాదు.. పంటలకు వేసే రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ కనీసం 30–40% ఎక్కువ ఉపయోగపడేందుకు బయోచార్ ఉపయోగపడుతుంది అంటున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి.– మట్టిలో పేరుకుపోయిన రసాయనిక అవశేషాలను తొలగించడానికి, వరిసాగులో మిథేన్ వాయువు కాలుష్యాన్ని తగ్గించడానికి బయోచార్ తోడ్పడుతుంది.– ఒక్కసారి వేస్తే వందల ఏళ్లు నేలలో ఉండి మేలు చేస్తుంది.. సీజనల్ పంటలకైనా, పండ్ల తోటలకైనా బయోచార్ నిజంగా బంగారమే అంటున్న డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖి.బయోచార్.. ఈ పేరు చెప్పగానే ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి(55) పేరు చప్పున గుర్తొస్తుంది. 20 ఏళ్ల క్రితం నుంచి ‘బయోచార్’ అనే పేరును ఖరారు చేసి.. వ్యవసాయకంగా, పర్యావరణపరంగా దీని ప్రయోజనాల గురించి దేశ విదేశాల్లో విస్తృతంగా పరిశోధనలు, క్షేత్ర ప్రయోగాలు చేస్తూ ఇప్పటికి 5 పుస్తకాలను వెలువరించారు. వెబ్సైట్ ద్వారా ఈ ఓపెన్ సోర్స్ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసంగాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆయనతో ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..బయోచార్ (కట్టె బొగ్గు) అంటే..?వ్యవసాయ వర్గాల్లో ఈ మధ్య తరచూ వినవస్తున్న మాట బయోచార్. బయో అంటే జీవం.. చార్ (చార్కోల్) అంటే బొగ్గు. బయోచార్ అంటే ‘జీవం ఉన్న బొగ్గు’ అని చెపొ్పచ్చు. భూసారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్బనం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు. అంటే ఇది అస్థిర కర్బనం (ఒలేటైల్ కార్బన్). దీన్ని పెంపొందించుకోవటానికి ఫిక్స్డ్ కార్బన్ ఉపయోగపడుతుంది. అదే బయోచార్.బయోచార్ కోసం కట్టెలు కాలబెట్టడం వల్ల అడవులకు, పర్యావరణానికి ముప్పు లేదా?బొగ్గు నల్ల బంగారంతో సమానం. బంగారం అని ఎందుకు అన్నానంటే.. ప్రపంచంలో తయారు చేయలేనిది, డబ్బుతో కొనలేనిది మట్టి ఒక్కటే. హరిత విప్లవం పేరుతో మట్టిని మనం నాశనం/ విషతుల్యం/ నిర్జీవం చేసుకున్నాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బయోచార్. అడవులను నరికి బయోచార్ తయారు చేయమని మనం చెప్పటం లేదు. పత్తి కట్టె, కంది కట్టె, వరి పొట్టు వంటి పంట వ్యర్థాలను వట్టిగానే తగులబెట్టే బదులు వాటితో బయోచార్ తయారు చేసుకోవచ్చు. వూరికే పెరిగే సర్కారు తుమ్మ వంటి కంప చెట్ల కలపతో లేదా జీడి గింజల పైపెంకులతో కూడా బయోచార్ తయారు చేసుకోవచ్చు. వరి పొట్టును బాయిలర్లలో, హోటళ్ల పొయ్యిల్లో కాల్చిన తర్వాత మిగిలే వ్యర్థాలను కూడా బయోచార్గా వాడుకోవచ్చు.పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో, పెద్దగా పొగ రాకుండా, 450 నుంచి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్చితే (ఈ ప్రక్రియనే ‘పైరోలిసిస్’ అంటారు) తయారయ్యే నల్లని కట్టె బొగ్గే బయోచార్. ఆరుబయట కట్టెను తగుటబెడితే బూడిద మిగులుతుంది. ఈ పద్ధతిలో అయితే బూడిద తక్కువగా బయోచార్ ఎక్కువగా వస్తుంది. రైతు స్థాయిలో ఇనుప డ్రమ్ములో లేదా కందకం తవ్వి కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. బయోచార్ వందల ఏళ్ల ΄ాటు మట్టిలో ఉండి మేలుచేసే సూక్ష్మజీవరాశికి, పోషకాలకు, మొత్తంగా పర్యావరణానికి ఎంతగానో తోడ్పడుతుంది. సాగు నీటిలో విషాలను పరిహరిస్తుంది. దీనితో వ్యవసాయంలో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలతో పోల్చితే.. దీన్ని తయారు చేసేటప్పుడు వెలువడే కొద్ది΄ాటి పొగ వల్ల కలిగే నష్టం చాలా తక్కువ.‘బయోచార్ కంపోస్టు’ అంటే ఏమిటి?బయోచార్ అంటే.. పొడిగా ఉండే కట్టె బొగ్గు. దీన్ని నేరుగా పొలాల్లో వేయకూడదు. బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని వేయాలి. చిటికెడు బొగ్గులో లెక్కలేనన్ని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. నేరుగా వేస్తే మట్టిలోని పోషకాలను బొగ్గు పెద్దమొత్తంలో పీల్చుకుంటుంది. అందువల్ల వట్టి బయోచార్ను మాత్రమే వేస్తే పంటకు పోషకాలు పూర్తిగా అందవు. అందుకనే. వట్టి బయోచార్ను కాకుండా బయోచార్ కంపోస్టును తయారు చేసుకొని వేస్తే ఈ సమస్య ఉండదు.మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు లేదా బయోగ్యాస్ స్లర్రీ లేదా జీవామృతం లేదా పంచగవ్య వంటి.. ఏదైనా సేంద్రియ ఘన/ ద్రవరూప ఎరువులలో ఏదో ఒకదాన్ని బయోచార్ను సమ΄ాళ్లలో కలిపి కుప్ప వేసి, బెల్లం నీటిని చిలకరిస్తూ రోజూ కలియదిప్పుతూ ఉంటే 15 రోజుల్లో బయోచార్ కంపోస్టు సిద్ధం అవుతుంది. అప్పుడు దీన్ని పొలాల్లో వేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. మన పొలంలో మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవటం ముఖ్యం. బయోచార్ ఒకటి రెండు సీజన్లలో ఖర్చయిపోయే ఎరువు వంటిది కాదని రైతులు గుర్తుంచుకోవాలి. వంద నుంచి వెయ్యేళ్ల వరకు నేలలో స్థిరంగా ఉండి మేలు చేస్తుంది.రసాయనిక ఎరువులు వాడే రైతులకు కూడా బయోచార్ ఉపయోగపడుతుందా? బయోచార్ సేంద్రియ ఎరువులు లేదా రసాయనిక ఎరువులు వాడే రైతులు కూడా వాడుకోవచ్చు. కట్టెబొగ్గుతో యూరియా, ఫాస్పేటు వంటి వాటిని కలిపి వేసుకోవచ్చు. వట్టిగా యూరియా వేస్తే 20–30 శాతం కన్నా పంటకు ఉపయోగపడదు. అదేగనక బయాచార్తో యూరియా కలిపి వేస్తే 30–40% ఎక్కువగా పంటకు ఉపయోగపడుతుంది. బొగ్గులోని ఖాళీ గదులు ఉంటాయి కాబట్టి యూరియాను కూడా పట్టి ఉంచి, ఎక్కువ రోజుల ΄ాటు పంట మొక్కల వేర్లకు నెమ్మదిగా అందిస్తుంది.వరి సాగుకూ ఉపయోగమేనా?వరి పొలాల్లో నీటిని నిల్వగట్టే పద్ధతి వల్ల మిథేన్ వంటి హరిత గృహ వాయువులు గాలిలో కలుస్తూ వాతావరణాన్ని అమితంగా వేడెక్కిస్తున్నాయి. రసాయనిక ఎరువులు వాడే పొలాల వాయుకాలుష్యం మరింత ఎక్కువ. ఈ పొలాల్లో బయోచార్ వేస్తే.. నీటి అడుగున మట్టిలో ఆక్సిజన్‌ను లభ్యత పెరుగుతుంది. మిథేన్ తదితర హరిత గృహ వాయువులను బొగ్గు పీల్చుకుంటుంది. కాబట్టి, వాతావరణానికి జరిగే హాని తగ్గుతుంది. అందుకనే బయోచార్ వాడితే కార్బన్ క్రెడిట్స్ పేరిట డబ్బు ఇచ్చే పద్ధతులు కూడా సమీప భవిష్యత్తులోనే అమల్లోకి రానున్నాయి.బయోచార్‌పై మరింత సమాచారం కోసం చూడండి.. www.youtube.com/@biocharchannelhttps://biochared.comఏ పొలానికి ఎంత వెయ్యాలో తెలిసేదెలా?మీ భూమికి ఖచ్చితంగా ఎంత మొత్తంలో బయోచార్ కంపోస్టు వేస్తే సరిపోయేదీ ఒక టెస్ట్ ద్వారా మీరే స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ విషయం ఎవరినో అడిగితే తెలియదు. మీ పొలంలో ఎత్తయిన ప్రదేశంలో 5 చిన్న మడులు చేసుకొని, వాటిల్లో బయోచార్ కంపోస్టును వేర్వేరు మోతాదుల్లో వేసి.. ఆ 5 మడుల్లోనూ ఒకే రకం పంటను సాగు చేయండి. 3 నెలల్లో మీకు ఫలితం తెలిసిపోతుంది. 1 చదరపు మీటరు విస్తీర్ణం (ఈ విసీర్ణాన్ని మీరే నిర్ణయించుకోండి)లో పక్క పక్కనే 5 మడులు తయారు చేసుకోండి. అంటే.. మొత్తం 5 చ.మీ. స్థలం కేటాయించండి. ఒక్కో దాని మధ్య గట్టు మాత్రం ఎత్తుగా, బలంగా వేసుకోండి.1వ మడిలో బయోచార్ కంపోస్టు అసలు వెయ్యొద్దు. 2వ మడిలో బయోచార్ కంపోస్టు 0.5 కిలో, 3వ మడిలో 1 కిలో, 4వ మడిలో 2 కిలోలు, 5వ మడిలో 4 కిలోలు వెయ్యండి. ఈ 5 మడుల్లో 3 నెలల్లో చేతికొచ్చే ఒకే రకం పంట విత్తుకోండి లేదా కూరగాయ మొక్కలు నాటుకోండి.– బయోచార్ కంపోస్టుపై శిక్షణ ఇస్తున్న డా. సాయి భాస్కర్ రెడ్డిబయోచార్ కంపోస్టు విషయంలో వత్యాసాలు ΄ాటించి చూడటం కోసమే ఈ ప్రయోగాత్మక సాగు. ఇక మిగతా పనులన్నీ ఈ మడుల్లో ఒకేలా చేయండి. అంటే నీరు పెట్టటం, కలుపు తీయటం, పురుగుమందులు లేదా కషాయాలు పిచికారీ చేయటం అన్నీ ఒకేలా చెయ్యండి.ఆ పంటల్లో పెరిగే దశలో వచ్చే మార్పులన్నిటినీ గమనించి, రాసుకోండి. ప్రతి వారానికోసారి ఫొటోలు/వీడియో తీసి పెట్టుకోండి. కాండం ఎత్తు, లావు, పిలకలు/కొమ్మల సంఖ్య, పూత, దిగుబడి, గింజ/కాయల సైజు, ఆ మొక్కల వేర్ల పొడవు వంటి అన్ని విషయాలను నమోదు చేయండి. 3 నెలల తర్వాత ఆ పంట పూర్తయ్యే నాటికి బయోచార్ కంపోస్టు అసలు వేయని మడితో వేర్వేరు మోతాదుల్లో వేసిన మడుల్లో వచ్చిన దిగుబడులతో పోల్చిచూడండి. బయోచార్ కంపోస్టు ఏ మోతాదులో వేసిన మడిలో అధిక దిగుబడి వచ్చిందో గమనించండి. ఇదే మోతాదులో మీ పొలం అంతటికీ వేసుకోండి. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
స్పీడ్ బ్రీడింగ్ పద్ధతుల్లో.. అర్బన్ అన్నదాత!
విస్తారమైన పొలాల్లో ఆరుబటయ సాగేది సంప్రదాయ వ్యవసాయం అయితే.. నియంత్రిత వాతావరణంలో అత్యాధునిక సాంకేతికతలతో చేసేదే అర్బన్ వ్యవసాయం. మట్టిలో కాకుండాపోషకాలతో కూడిన నీటిలో వర్టికల్ స్ట్రక్చర్లలో లేదా కొబ్బరి పొట్టుతో కూడిన గ్రోబాగ్స్‌లో అర్బన్ సాగు జరుగుతూ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాగు వ్యవస్థలతోపాటు ప్రత్యేకంగా బ్రీడింగ్ చేసిన వంగడాలు కూడా అవసరమే అంటోంది ‘అర్బన్ కిసాన్’. మానవాళి రేపటి ఆహారపు, పర్యావరణ అవసరాలు తీర్చటం కోసం స్పీడ్ బ్రీడింగ్ తదితర పద్ధతుల్లో పరిశోధనలు చేపట్టి చక్కని పురోగతి సాధిస్తోంది. ఈ హైదరాబాద్ సంస్థ విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సహా పలు సంస్థల భాగస్వామ్యంతో అర్బన్ సాగు ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. పట్టణీకరణ తామరతంపరగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాధునిక సాంకేతికతలతో కూడిన అర్బన్ ఫార్మింగ్ పద్ధతులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కోవలోనివే హైడ్రోపోనిక్స్, సాయిల్ లెస్ ఫార్మింగ్, వర్టికల్ ఫార్మింగ్, ఇండోర్ ఫార్మింగ్ వంటివి. ఈ సాగు వ్యవస్థలను ముఖ్యంగా అర్బన్ రైతులకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో హైదరాబాద్ సమీపంలో ఏడేళ్ల క్రితం ప్రారంభమైంది ‘అర్బన్ కిసాన్’. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తూ అర్బన్ కిసాన్ అభివృద్ధి సాధిస్తోంది. ఇక్కడ పండించిన లెట్యూస్, ఇటాలియన్ బసిల్ తదితర ఆకుకూరలు, రంగురంగుల కాప్సికం తదితర కూరగాయలతో తయారైన సలాడ్స్‌ను ఫార్మ్బౌల్ పేరుతో హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తోంది.అర్బన్ సాగు కోసం ప్రత్యేక వంగడాలు..హైదరాబాద్ నగర శివారు మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లిపారిశ్రామికవాడలో అర్బన్ కిసాన్ పరిశోధన కేంద్రం ఏర్పాటైంది. విహారి కానుకొల్లు, డాక్టర్ సాయిరాం రెడ్డిపాలిచర్ల కొందరు మిత్రులతోపాటు అర్బన్ కిసాన్ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. విహారి సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, డా. సాయిరాం రెడ్డి, డా. నర్సిరెడ్డి ఆధ్వర్యంలో పరిశోధనలు సాగుతున్నాయి. హైడ్రోపోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్ వ్యవస్థలను శీతల గదిలో,పాలీహౌస్లో, మేడపైన.. ఇలా అనేక వాతావరణ పరిస్థితుల్లో మట్టి లేకుండా వివిధ పంటలు పండించటంపై వారు లోతైన పరిశోధనలు చేస్తున్నారు.హైదరాబాద్ నగర శివారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి పారిశ్రామికవాడలోని అర్బన్ కిసాన్ పరిశోధన కేంద్రంలో హైడ్రోపోనిక్స్ సాగు దృశ్యాలుపొలాల్లో వాడే సాధారణ వంగడాలను నియంత్రిత వాతావరణంలో, పరిమిత స్థలంలో సాగు చేయటం అనేక ఇబ్బందులతో కూడిన పని. అందుకే అర్బన్ సాగుకు అవసరమైన ప్రత్యేక వంగడాల రూపుకల్పన కృషికి అర్బన్ కిసాన్ శ్రీకారం చుట్టింది. మన దేశపు 150 రకాల కూరగాయలు, ఆకుకూరలపై ప్రయోగాలు చేశారు. తక్కువ ఉష్ణోగ్రతల్లో పండటంతోపాటు.. వేర్ల పొడవు, మొక్క సైజు, ఆకారం తదితర అంశాల్లో అర్బన్ ఫార్మింగ్‌కు అనువుగా చిన్న సైజులో ఉండేలా అనేక సరికొత్త వంగడాలను రూపొందించామని డా. సాయిరాం రెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఇవి తిరిగివాడుకోదగిన సూటి రకాలేనని, వీటిని నియంత్రిత వాతావరణంలో ఏ దేశంలోనైనా పండించవచ్చన్నారు.చెప్పినంత దిగుబడి..!హైడ్రోపోనిక్స్ సాగు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. అయితే, ఎవరి దగ్గరా కంప్లీట్ టెక్నాలజీ లేదు. మా దగ్గర తప్ప. మేం వాడుతున్నది స్వయంగా మేం దేశీయంగా పరిశోధనల ద్వారా రూపొందించుకున్న పరిపూర్ణమైన, సమగ్ర సాంకేతికత ఇది. అందుబాటులో ఉన్న టెక్నాలజీలతోపోల్చితే 60% ఖర్చుతోనే మా టెక్నాలజీని అర్బన్ ఫార్మర్స్ పొందవచ్చు. దీని ద్వారా చెప్పినంత దిగుబడి కచ్చితంగా ఇస్తుంది. ప్రపంచంలో ఎవరైనా టెక్నాలజీ అమ్ముతారు లేదా ్రపొడక్టు అమ్ముతారు. మేం అలాకాదు. ఇతర సంస్థలతో కలిసి భాగస్వామ్యంలో యూనిట్లు నెలకొల్పి ఉత్పత్తి చేసి విక్రయించి లాభాలు పంచుకుంటాం. ఈ పద్ధతిలోనే అనేక దేశాల్లో యూనిట్లు ఏర్పాటు చేశాం. పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే హైడ్రోపోనిక్ కూరగాయలు, ఆకుకూరలను ప్రీమియం ప్రైస్‌తో అమ్మగలగాలి. మానవాళి భవిష్యత్తు ఆహారపు అవసరాలు తీర్చగలిగిన శక్తిసామర్థ్యాలున్న టెక్నాలజీ ఇది.– డాక్టర్ సాయిరాం రెడ్డి, పాలిచర్ల, అర్బన్ కిసాన్ పరిశోధనా కేంద్రం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా sai@urbankisaan.com2.5 ఏళ్లలోనే కొత్త వంగడాలు..బెండ, టొమాటో, పచ్చిమిర్చి వంగ తదితర కూరగాయల్లో ఒక్కో రకానికి సంబంధించి 2–3 రకాల వంగడాలను రూపొందించారు. ఫంగస్ సోకని బేసిల్ (ఇటాలియన్ తులసి)ను రూపొందించారు. ఎరుపు, ఆకుపచ్చ, కాండం తెల్లగా ఆకు గ్రీన్‌గా ఉండే రకరకాల తోటకూర రకాలను రూపొందించారు.పాలకూర, కొత్తిమీర, గోంగూరలో కూడా కొత్త వంగడాలను రూపొందించారు. కీరదోస, సొర, కాకర వంటి తీగజాతులు పొలినేషన్ అవసరం లేకుండా దిగుబడినిచ్చే విధంగా రూపొందిస్తున్నాం అన్నారు డా. సాయిరాం. సాధారణంగా ఒక కొత్త వంగడాన్ని బ్రీడింగ్ చేయాలంటే 6–7 ఏళ్లు పడుతుంది. స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో తాము 2.5 ఏళ్లలోనే కొత్త వంగడాలను రూపొందించగలిగామన్నారు.95 శాతం నీటి ఆదా..!వేగవంతమైన నగరీకరణ నేపథ్యంలో నగరాల్లో ఏడాది పొడవునా అర్బన్ప్రాంతీయులకు తాజా ఆకుకూరలు, కూరగాయలు అందించడానికి ద్రవరూప ఎరువులతో చేసే వర్టికల్ ఫార్మింగ్ ఉపయోగపడుతోంది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటలు పండించటం వల్ల కలిగే ప్రయోజనాలను భారత్‌తోపాటు ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి. సాధారణ వ్యవసాయంలో వాడే నీటితోపోల్చితే ఈ పద్ధతిలో 95% ఆదా అవుతుంది. పొలంలో పంటతోపోల్చితే నిర్దిష్టమైన స్థలంలో 30 రెట్లు అధిక దిగుబడి సాధించడానికి హైడ్రోపోనిక్స్ ఉపయోగపడుతుందని, అందులోనూ ఈ సాంకేతికతను దేశీయంగానే అభివృద్ధి చేశామని అర్బన్ కిసాన్ చెబుతోంది. సాగులో ఉన్న పంటల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగాపోషకాల మోతాదు, పిహెచ్ స్థాయిలు, వాతావరణంలో తేమ, కార్బన్డయాక్సయిడ్ స్థాయి, కాంతి తీవ్రత వంటి అనేక ఇతర అంశాలన్నిటినీ ఒక యాప్ ద్వారా నియంత్రిస్తుండటం విశేషం. వర్టికల్ ఫార్మింగ్ వ్యవస్థల్లో కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను ఉపయోగిస్తూ ఫార్మింగ్ ఆటోమేషన్‌లో అర్బన్ కిసాన్ తనదైన ప్రత్యేకతను చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోపోనిక్స్ సాగు జరుగుతున్నా ఇందులో అన్ని దశలకు సంబంధించిన సంపూర్ణ సాంకేతికత ఒకే చోట అందుబాటులో లేదు. అర్బన్ కిసాన్ పూర్తిగా సొంత సాంకేతికతను అభివృద్ధి చేసుకోవటం విశేషం.మధ్యప్రాచ్య దేశాల్లో ఆదరణ..అర్బన్ కిసాన్ ఇండోర్ హైడ్రోపోనిక్స్ యూనిట్లలో పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేథ, సెన్సార్ల ఆధారంగానే ఫామ్ యాజమాన్యం ఉంటుంది. దుబాయ్, ఒమన్, ఖతార్ దేశాల్లో మూడేళ్ల క్రితం 50% భాగస్వామ్యంతో హైడ్రోపోనిక్స్ యూనిట్‌ను నెలకొల్పాం. అదే మాదిరిగా బహామాస్ దేశంలోనూ 50% భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన యూనిట్‌ను కూడా తాము ఇక్కడి నుంచే పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్నామని డా. సాయిరాం రెడ్డి వివరించారు. అక్కడ ఆకుకూరల ధర కిలో 12 డాలర్లు. మా యూనిట్లలో కిలో 5 డాలర్లకే ఆకుకూరలను ఉత్పత్తి చేస్తున్నాం. అమెరికా, కెనడా, నార్వే దేశాల్లో కూడా జాయింగ్ వెంచర్లు ఏర్పాటు చేయబోతున్నాం.మన దేశంలో హైడ్రోపోనిక్స్ యూనిట్లకు పారిశ్రామిక విద్యుత్తు చార్జీలు వర్తిస్తుండటం ఈ హైటెక్ సాగు విస్తరణకు ప్రతిబంధకంగా మారింది. ఇప్పటికైతే ఇది కాస్త ఖరీదైన ప్రత్యామ్నాయ ఆహారోత్పత్తి పద్ధతే. కానీ,పోషక విలువలున్న, పురుగుమందుల్లేని ఆహారాన్ని అందించే ఈ పద్ధతి ఏదో ఒక రోజున మెయిన్ స్ట్రీమ్‌లోకి వస్తుందని అర్బన్ కిసాన్ ఆశాభావంతో ముందడుగు వేస్తోంది. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ఇవి చదవండి: కలబంద రసంతో.. ఉపయోగాలెన్నో..! -
Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
నేలలో నుంచి 606 పురుగుమందులు, రసాయనాలను తొలి ఏడాదే నిర్మూలించవచ్చు. తొలి ఏడాదిలోనే పంట దిగుబడులు తగ్గకపోగా పెరుగుతాయి.. ఏ కల్మషమూ లేని పోషకాల సాంద్రతతో కూడిన సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుబడి సుసాధ్యమే! జీవ ఇంధనం ఉత్పత్తి, కార్బన్ క్రెడిట్స్ పొందటానికీ అవకాశం ఉంది. మహేశ్ మహేశ్వరి ‘మిరకిల్’ కృషిపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..మట్టిలో సత్తువను లేదా ఉత్పాదక శక్తిని కొలిచేందుకు ఒక సాధనం సేంద్రియ కర్బనం (సాయిల్ ఆర్గానిక్ కార్బన్– ఎస్.ఓ.సి.). సేంద్రియ కర్బనం మన భూముల్లో 0.2 నుంచి 0.5 మధ్యలో ఉందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఈ భూముల్లో పండించిన ఆహారంలో పోషకాల సాంద్రత లోపించి, ఆ ఆహారం తిన్నవారికి పౌష్టికాహార లోపం వస్తోందని కూడా మనకు తెలుసు.సేందియ కర్బనం 1% కన్నా ఎక్కువ ఉంటే పంటలు బాగా పండటంతో పాటు చీడపీడల బెడద కూడా తగ్గుతుందని చెబుతారు. దీన్ని 2%కి పెంచుకోగలిగితే ఆ భూములు నిజంగా బంగారు భూములే అంటారు. పదేళ్లుగా శ్రద్ధాసక్తులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అతికొద్ది మంది రైతులు తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని 2% వరకు పెంచుకోగలగటం మనకు తెలిసిందే.అయితే, ఒక్క ఏడాదిలోనే సేంద్రియ కర్బనాన్ని ఏకంగా 6 శాతానికి పెంచుకునే ‘అద్భుత సజీవ సేద్య పద్ధతుల’ను కనిపెట్టామని అహ్మదాబాద్ (గుజరాత్) కు చెందిన మహేశ్ మహేశ్వరి అనే ఆవిష్కర్త ఘంటాపథంగా చెబుతున్నారు. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారే రైతులు తొలి ఏడాదిలోనే దిగుబడి పెంచుకునేందుకు ఈ పద్ధతులు తోడ్పడుతున్నాయని ఇప్పటికే 130 మంది రైతుల ద్వారా ఆచరణలో రుజువైందన్నారు.సజీవ సేద్యం వివరాలు చెబుతున్న సెజెల్ మహేశ్వరిఅనేక ఏళ్ల క్రితం నుంచి తాము జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మిరకిల్స్ అగ్రి గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మహేశ్ మహేశ్వరి, ఆయన సోదరి సెజెల్ మహేశ్వరి తెలిపారు.అహ్మదాబాద్‌లోని స్వామి నారాయణ్ విద్యా సంస్థాన్ ఆవరణలోని వీరి పరిశోధనా వ్యవసాయ క్షేత్రాన్ని ఇటీవల సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధితో వారు తమ ‘సజీవ సేద్యం’ గురించి ఎన్నెన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, ఆచరణాత్మకమైన, పరీక్షల్లో నిర్థారిత అనుభవాలను పంచుకున్నారు.వెన్ను కేన్సర్‌ను జయించి..58 ఏళ్ల మహేశ్ మహేశ్వరి మెకానికల్ ఇంజనీర్, చార్టర్డ్ ఎకౌంటెంట్. ఐఐఎం ఆహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. 2011లో వెన్నుపూస కేన్సర్ బారిన పడిన ఆయన ఐదారేళ్లు మంచానికే పరిమితమయ్యారు. ఆ క్రమంలో జరిపిన అధ్యయనంలో వ్యవసాయ రసాయనాలతో కూడిన ఆహారం వల్ల కడుపులోని సూక్ష్మజీవరాశి (గట్ మైక్రోబ్స్) నశించటమే కేన్సర్ రావటానికి ఒక మూల కారణమని 2013–14లో గుర్తించారు.ఆ క్రమంలో కొన్నేళ్లపాటు జరిపిన పరిశోధనల ఫలితంగా కేన్సర్‌ను జయించి పునరుజ్జీవం పొందారు! అంతేకాకుండా.. మట్టిలో పేరుకుపోయిన వ్యవసాయక రసాయనాల అవశేషాలను వేగవంతంగా ఒకే సంవత్సరంలో నిర్మూలించటంతో పాటు, పోషకాల సాంద్రతతో కూడిన స్వచ్ఛమైన సేంద్రియ ఆహారోత్పత్తులను పండించుకునేందుకు వీలుకల్పించే అద్భుత ద్రవ, ఘన ఎరువులను.. బయో పెస్టిసైడ్స్‌ను ఆవిష్కరించారు.తాగు/సాగు నీటిలో.. తినే ఆహారంలో పోషకాల సాంద్రత, సమగ్రతతో పాటు రసాయనిక అవశేషాలను పూర్తిగా నిర్మూలించటం ద్వారా ప్రజలకు పౌష్టికాహార, ఆరోగ్య భద్రత చేకూరుతుంది. రైతులకు ఆదాయ భద్రత లభిస్తుందని, గోశాలలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని అంటారు మహేశ్.పురుగుమందుల అవశేషాలు ఏడాదిలోనే విచ్ఛిన్నం!రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయం వైపు మారే రైతులకు గో ఆధారిత సజీవ సేద్య పద్ధతి చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిలో దేశీ ఆవును డీటాక్స్ చేసిన తర్వాత సూక్ష్మజీవరాశి పెరిగిన శుద్ధమైన పేడ, మూత్రం వాడుతాం. వీటితో తయారు చేసే సేంద్రియ ఎరువులో పంటల వేర్లు ఉపయోగించుకోవడానికి అనువైన రూపంలో ఉండే కర్బనం 30–40% అధికంగా ఉంది.ట్యూబ్ నుంచి బయటికి వస్తున్న జీవామృతంమట్టిలో సేంద్రియ కర్బనాన్ని వెనువెంటనే 2%కి పెంచే సామర్థ్యం దీనికి ఉంది. హెచ్డిపిఇ ట్యూబ్ ద్వారా యాక్టివేటెడ్ కార్బన్ అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతం క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే సేంద్రియ కర్బనం ఏడాదిలో 6% వరకు పెరుగుతుంది. ట్యూబ్‌లో ఆవు పేడ, మూత్రంతో పాటు కూరగాయలు, పండ్ల వ్యర్థాలను కూడా వేస్తాం.అవి 30 రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయి. నలకలు కూడా లేని శుద్ధమైన ద్రవజీవామృతం లభిస్తుంది. ఇందులో మొక్కలకు లభ్య రూపంలోని కర్బనం 15% వరకు ఉంటుంది. సాధారణ జీవామృతంలో 2–3% మాత్రమే ఉంటుంది.ఎకరానికి రూ. 10 లక్షలు..లైవ్ వాటర్ బయో చిప్ ద్వారా టీడీఎస్ తగ్గించి, పిహెచ్ న్యూట్రల్ చేసి జీవవంతంగా మార్చిన నీటిని పంటలకు, పశువులకు అందిస్తున్నాం. జొన్న+సజ్జ కలిపి తయారు చేసిన నేపియర్ గడ్డి దిగుబడి సాధారణంగా ఎకరానికి ఏడాదికి 100–150 క్వింటాళ్లు వస్తున్నది. రైతుకు రూ. 2–4 లక్షల ఆదాయం వస్తోంది.మా పద్ధతి పాటిస్తే ఎకరానికి ఏడాదిలో 500–1,000 టన్నుల సేంద్రియ గడ్డి ఉత్పత్తి అవుతుంది. 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇందులో 16% ్రపొటీన్, 7% కొవ్వు, 10% సుగర్ ఉంటుంది. ఆదాయం కనీసం ఎకరానికి ఏటా రూ.10 లక్షలు వస్తుంది. ఈ గడ్డిని కనీసం పదెకరాలు ఒకచోట సాగు చేస్తే.. పెలెట్లు తయారు చేయొచ్చు. పశువులకు, కోళ్లకు, చేపలకు దాణాగా వేయొచ్చు. ఈ పెల్లెట్లను బాయిలర్లలో బొగ్గుకు బదులు బయో ఇంధనంగా వాడొచ్చు.నీటిని శుద్ధి చేసే చిప్ఈ సేంద్రియ గడ్డి వల్ల, 12 రకాల హైడ్రోపోనిక్ మొలక గడ్డి మేపు వల్ల ఆవుల ఆరోగ్యం, పాల నాణ్యత, కొవ్వు శాతం గణనీయంగా పెరుగుతాయి. ఆవు నిర్వహణ ఖర్చు 70–80% తగ్గిపోతుంది. పాలివ్వని ఆవుల ద్వారా కూడా రైతులకు, గోశాలలకు ఆదాయం పెరుగుతుంది. సజీవ సేద్యం వల్ల రైతులకు ఎరువులు, పురుగుమందుల ఖర్చు మూడేళ్లలో దశలవారీగా 50% తగ్గుతుంది. మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు.దిగుబడి 3 ఏళ్లలో 50–75% పెరుగుతుంది. మట్టిలోని 606 రకాల రసాయనిక పురుగుమందుల అవశేషాలు మొదటి ఏడాదే విచ్ఛిన్నమైపోతాయి. నేల, పంట దిగుబడులు కూడా మొదటి ఏడాదిలోనే పూర్తి ఆర్గానిక్‌గా మారిపోతాయి. పౌష్టిక విలువలు మాత్రం మూడేళ్లలో దశలవారీగా ఏడాదికి 25% పెరుగుతుంది.– మహేశ్ మహేశ్వరి -సజీవ సేద్యం ఆవిష్కర్త, ఆహ్మదాబాద్, గుజరాత్,(సెజెల్ మహేశ్వరి –97256 38432 హిందీ/ ఇంగ్లిష్)miraclemoringa14@gmail.comప్రక్షాళన దేశీ ఆవుతోనేప్రారంభం!వ్యవసాయానికి, మన ఆహారానికి, మన నేలల ఆరోగ్యానికి దేశీ ఆవే కేంద్ర బిందువని మహేశ్ భావించారు. ఆవు పేడ, మూత్రం, పాలను జీవశక్తిమంతంగా, పోషకవంతంగా, రసాయన రహితంగా మార్చుకోవాలంటే.. ప్రక్షాళన ప్రక్రియను ఆవుతోనేప్రారంభించాలి. ఆవు దేహంలో పేరుకుపోయిన పురుగుమందుల ఆవశేషాలను నిర్మూలించాలి. అందుకోసం ఆవు దేహాన్ని శుద్ధి చేయటం, ముఖ్య వనరైన నీటిని శుద్ధి చేసుకోవటంతో ‘సజీవ సేద్యం’ప్రారంభమవుతుంది.ఆవు డీటాక్స్ ప్రక్రియకు 90 రోజులు పడుతుంది. ఆ తర్వాత పేడ, మూత్రం నుంచి దుర్వాసన రాదు. శుద్ధమైన దేశీ ఆవు పేడ, మూత్రంతో ప్రత్యేక పద్ధతిలో తయారు చేసుకునే అధిక కర్బనంతో కూడిన ద్రవ– ఘన ఎరువుల్లో జీవశక్తి, పోషకాలు, లభ్యస్థితిలోని కర్బనం అధిక పాళ్లలో ఉంటుంది.40 రకాల ఔషధ మొక్కల రసాలతో తయారు చేసే బయో పెస్టిసైడ్స్ వాడకంతో అతి తక్కువ కాలంలోనే మట్టిని పూర్తిగా శుద్ధి చేసి జీవశక్తి నింపి పునరుజ్జీవింప చేసుకోవటంతో వ్యవసాయ–ఆహార వ్యవస్ధను ఆసాంతం ప్రక్షాళన చేసే ఈ ప్రక్రియ పూర్తవుతుందని మహేశ్ విశదీకరించారు. ఇటువంటి స్వచ్ఛమైన ఆహారమే మనుషులకు, పశువులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలదని ఆయన అంటున్నారు.ఎకోసెర్ట్ సర్టిఫికేషన్..మహేశ్ మహేశ్వరి తన ఆవిష్కరణలపై పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. వీరు ఆవిష్కరించిన ద్రవ రూప, ఘనరూప ఎరువులకు, జీవన పురుగుమందులు ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్‌సిఓ) ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయని భారత ప్రభుత్వం సర్టిఫై చేసింది. ఈ ఉత్పత్తులతో కూడిన సజీవ సేద్య పద్ధతికి అంతర్జాతీయ ‘ఎకోసెర్ట్’ సర్టిఫికేషన్ సైతం లభించటం విశేషం. ఈ సర్టిఫికేషన్‌కు 130 దేశాల్లో గుర్తింపు ఉంది. - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Sagubadi: నేలపైన కాదు.. నేరుగా వేర్లకే 'తడి తగిలేలా'..
దీర్ఘకాలం మనుగడ సాగించే పండ్ల, పూల తోటల నుంచి కొద్ది నెలల్లో పంటకాలం ముగిసే సీజనల్ కూరగాయల సాగు వరకు నీటిని పొదుపుగా వాడుకోవటం అంటే వెంటనే అందరికీ గుర్తొచ్చేది చెట్ల దగ్గర మట్టిపై నీటిని చుక్కలు చుక్కలుగా వదిలే డ్రిప్ లైన్లు! అయితే, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పుల కాలంలో బోర్లు ఎండిపోతూ ఉంటే.. పండ్ల, పూల తోటలను, కూరగాయ తోటలను రక్షించుకోవడానికి దీనికన్నా మెరుగైన మరో మార్గం ఉంది. అదే.. భూగర్భ డ్రిప్! నేల మీద నీరివ్వటం కాదు, భూమిలో వేర్లకే నేరుగా నీటి తేమ అందించటం! భూతాపం ఏటేటా పెరిగిపోతున్న దశలో నీటి సవాళ్లు మరింత తీవ్రమవుతున్నాయి. దీనికి తగినట్లు నీటిని మరింత సమర్థవంతంగా వాడుకోవాల్సిన అవసరం వస్తోంది. ఇంతకుముందెన్నడూ ఎరుగని రీతిలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు పెచ్చుమీరుతుంటే.. ఉద్యాన తోటల సాగుకు నీటి లభ్యత తగ్గిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన కె.ఎస్. గోపాల్ ‘స్వర్’ (సిస్టం ఆఫ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ రిజునవేషన్) పేరుతో వినూత్న డ్రిప్‌ను ఆవిష్కరించారు. సాధారణ డ్రిప్ భూమి పైనే నీటిని వదులుతూ ఉంటే.. ఈయన రూపొందించిన డ్రిప్ నేలపైన కాకుండా చెట్లు/మొక్కల వేర్ల దగ్గర భూగర్భంలో నీటి తేమను అతి పొదుపుగా వదులుతుంది. సాధారణ డ్రిప్‌తో పోల్చితే కూడా సగానికి సగం నీరు ఆదా కావటంతో పాటు.. అతి తక్కువ నీరు అందుబాటులో ఉండే కరువు కాలపు మండు వేసవిలోనూ పండ్ల తోటలను కంటికి రెప్పలా కాపాడుకోవటానికి, తద్వారా వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేసుకోవడానికి ఈ భూగర్భ డ్రిప్ ‘స్వర్’ రైతులకు చక్కగా ఉపయోగపడుతోందని గోపాల్ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు. 2019 మొదలుకొని ఇప్పటికి 8 రాష్ట్రాల్లో స్వర్ భూగర్భ డ్రిప్‌ను అనేక పండ్ల, కూరగాయ తోటల్లో అనేక సంస్థలతో కలిసి ప్రయోగాత్మకంగా ఉపయోగించి చూస్తూ సత్ఫలితాలు పొందుతున్నామన్నారాయన. ‘స్వర్’ ఎలా పనిచేస్తుంది? భూగర్భంలో చెట్లు/ మొక్కల వేర్లకే నీటి తేమను అందించటమే ‘స్వర్’ భూగర్భ డ్రిప్ ప్రత్యేకత. సాధారణ ఆన్లైన్ డ్రిప్ లేటరల్ పైపునకు ఉండే డ్రిప్పర్‌ను తొలగించి, ‘స్వర్’ భూగర్భ డ్రిప్ బాక్సులను అమర్చితే సరిపోతుంది. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే.. అరచేతి సైజులో ఉండే ఒక ΄్లాస్టిక్ బాక్స్ ఉంటుంది. దానికి నిండా సన్నని బెజ్జాలుంటాయి. 5 ఎం.ఎం. మైక్రో ట్యూబ్‌తో ఒక చివర్న ఈ బాక్స్‌ను జోడించి.. మరో చివర భూమిపైన ఉండే డ్రిప్ లేటరల్ పైపులకు అమర్చాలి. ఆ తర్వాత బాక్స్‌ను చెట్టు/మొక్క దగ్గర మట్టిని తవ్వి భూమి లోపల వేర్ల దగ్గర్లో పెట్టి, మట్టి కప్పెయ్యాలి. ఆ విధంగా ఈ భూగర్భ డ్రిప్ భూమి లోపల వేరు వ్యవస్థకు నీటి తేమను అందుబాటులోకి తెస్తుంది. మట్టి లోపల వేరు వ్యవస్థ దగ్గర ఉండే ఈ బాక్స్‌లో క్వార్ట్›్జ స్టోన్ గ్రాన్యూల్స్ ఉంటాయి. అవి నిరంతరం నీటì తేమను మట్టి ద్వారా వేరు వ్యవస్థకు క్రమబద్ధంగా అందిస్తుంటాయి. బయటి నుంచి వేర్లు ఈ బాక్స్ లోపలికి అల్లుకొని దాని పనితీరును దెబ్బతీయకుండా ఉండేలా దీన్ని రూపొందించటం విశేషం. మామిడి, బత్తాయికి 4 డ్రిప్ బాక్సులు.. ఉద్యాన తోటల్లో చెట్ల వయసును, ఎత్తును బట్టి, మట్టి తీరును బట్టి ఒక్కో చెట్టుకు ఎన్ని డ్రిప్ బాక్సులను ఏర్పాటు చేసుకోవాలో, వేరు వ్యవస్థ వద్ద నేలలో ఎంత లోతులో ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. చెట్టు మొదలు దగ్గర కాకుండా.. దాని కొమ్మలు విస్తరించిన చివరిలో పీచువేళ్లు అందుబాటులో ఉండే చోట్ల ఈ డ్రిప్ బాక్సులను ఏర్పాటు చేసుకోవటం ముఖ్యం. ఎమ్మెస్ స్వామినాధన్ ఫౌండేషన్, వైజాగ్ కృషి విజ్ఞాన కేంద్రం, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అయోవా, జిఐజడ్ వంటి సంస్థలతో కలిసి స్వర్ భూగర్భ డ్రిప్, లివింగ్ కంపోస్టుపై ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించామని గోపాల్ తెలిపారు. పెద్ద మామిడి చెట్టుకు 4 (12–16 అంగుళాల లోతులో) స్వర్ డ్రిప్ బాక్సులు, జామ చెట్టుకు 2 (12 అంగుళాల లోతులో), బత్తాయి చెట్టుకు 4 (12 అంగుళాల లోతులో), నిమ్మ చెట్టుకు 2 (6 అంగుళాల లోతులో), దానిమ్మ చెట్టుకు 2 (భగువ చెట్టుకు 4–5, గణేశ్ చెట్టుకు 6–7 అంగుళాల లోతులో), కొబ్బరి చెట్టుకు 4 (4–5 అంగుళాల లోతులో), మల్లె మొక్కకు 1 డ్రిప్ బాక్సు ఏర్పాటు చేసుకుంటే చాలని ప్రయోగాత్మక సాగులో తేలింది. రెండు చెరకు మొక్కలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నామని గోపాల్ తెలిపారు. 50% నీరు, 30% విద్యుత్తు ఆదా.. భూగర్భ డ్రిప్ బాక్సుల ద్వారా వేరు వ్యవస్థకు నీటిని అందించటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వర్షాకాలంలో తప్ప కలుపు సమస్య ఉండదు. కాబట్టి రైతుకు శ్రమ, ఖర్చు తగ్గుతాయి. సాధారణ డ్రిప్‌తో పోల్చితే 50% నీరు, 30–40% విత్యుత్తు ఆదా అవుతుంది. డ్రిప్ ద్వారా ఇచ్చే ద్రవరూప ఎరువులు కూడా 30% ఆదా అవుతాయి. సౌర విద్యుత్తు ద్వారా నడిచే 5 హెచ్‌పి మోటారుకు బదులు 1.5 హెచ్.పి. మోటారు సరిపోతుంది. 10% అదనంగా పంట దిగుబడి వస్తుంది. అంతేకాదు, త్వరగా పూత వస్తుందని గోపాల్ చెబుతున్నారు. అవార్డుల పంట.. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ (సిఇసి) తరఫున ‘స్వర్’ భూగర్భ డ్రిప్ వ్యవస్థను ఆవిష్కరించిన కె.ఎస్.గోపాల్‌కు 2023 అవార్డుల పంట పండించింది. న్యూఢిల్లీలోని ఐఎఆర్‌ఐలో పూసా కృషి పురస్కారం (రూ. 5 లక్షలు), ఫిక్కి ఉత్తమ నీటి సాంకేతికత పురస్కారం, రూ. 50 లక్షల యాక్ట్ గ్రాంటు లభించాయి. కేంద్ర జలశాఖ, యుఎన్‌డిపి, తెరి ఉమ్మడిగా 2024 ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో ‘స్వర్’ ప్రథమ బహుమతిని గెల్చుకుంది. తోటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చు! సాధారణ డ్రిప్ వాడినప్పుడు చెట్టు/మొక్క దగ్గర ఉపరితలం నుంచి వేర్ల దగ్గరకు మట్టిని తడుపుకుంటూ నీరు వెళ్లాల్సి ఉంటుంది. ‘స్వర్’ భూగర్భ డ్రిప్ బాక్సులు ఏర్పాటు చేసుకుంటే ఆ అవసరం ఉండదు. నేరుగా వేర్లకే నీటి తేమను అందించవచ్చు. దీనివల్ల, నీటి వాడకం సగానికి సగం తగ్గిపోతుంది. మండు వేసవిలోనూ 3 నుంచి 5 రోజులకు ఒకసారి నీరిస్తే సరిపోతుంది. అడుగు లోతులో నీటి తేమ ఎంత ఉందో సెన్సార్ ఆధారంగా తెలుసుకుంటూ.. నీటి అవసరం ఉన్నప్పుడు మాత్రమే, తగినంత నీటి తేమను, నెమ్మదిగా అందించటం వీలవుతుంది. తద్వారా తక్కువ నీటితోనే పండ్ల, పూల తోటలను, కూరగాయ తోటలను అధిక వేడి, హీట్‌వేవ్ కష్టకాలంలోనూ రక్షించుకోవటానికి అవకాశం ఉంది. భూగర్భ డ్రిప్ బాక్సు ధర గతంలో రూ. 50 ఉండేది. ఇజ్రేల్ కంపెనీ సహాయంతో దీన్ని రూ. 25కి తగ్గించగలిగాం. – కె.ఎస్.గోపాల్ (98481 27794), ‘స్వర్’ భూగర్భ డ్రిప్ ఆవిష్కర్త, డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్, హైదరాబాద్. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: కుండలు చేసే ఊరు -
ఈ వేసవిలో పంటలు, పశు పోషక రక్షణ ఎలా?
ఈ వేసవిలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5–8 డిగ్రీల సెల్షియస్ మేరకు ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం కొద్ది రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో 3–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మున్ముందు ప్రచండ వడగాడ్పులు వీచే సూచనలు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో పంటలు, తోటలను సాగు చేసే రైతులు, పశు పోషకులు గత వేసవిలో కన్నా అధికంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.. తీవ్రమైన ఉష్ణోగ్రతల వలన పంట పెరుగుదల, దిగుబడి గణనీయంగా తగ్గుతాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలో పెరుగుదల మందగించడం, పురుగులు, తెగుళ్ళు పెరగడం, ఆకులు మాడిపోవడం, పువ్వులు, పండ్లు రాలిపోవడంతో పాటు పండ్ల పరిమాణంలో తగ్గుదల కనిపిస్తుంది. వేడి వాతావరణం వలన పాలు ఇచ్చే పశువుల్లో శరీర ఉష్ణోగ్రత 0.5 నుండి 3.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరగడం వలన పశువులు ఎక్కువగా నీటిని తీసుకొని తక్కువ మేత తినడం వలన పాల దిగుబడి 11 శాతం వరకు తగ్గుతుంది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటలను, పండ్ల తోటలను కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా కొంత వరకు నష్టాన్ని నివారించుకోవచ్చు. పంటల నిర్వహణ.. అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోగల వంగడాలను, రకాలను ఎంచుకోవాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని పంట దశ, నేల స్వభావాన్ని బట్టి తగినంత నీటి తడులు ఇచ్చుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్రాంతాల్లో తేమ సున్నిత దశల్లో పంటకు నీటి తడులు ఇవ్వాలి. వరి పంటలో పొట్ట, పూత దశల్లో (10 శాతం వెన్ను నుండి పూత బయటకు వచ్చినప్పుడు) 0.5% కె.ఎన్.03 పిచికారి చేస్తే వరి పంటలో అధిక ఉష్ణోగ్రతలతో కలిగే దిగుబడి నష్టాన్ని తగ్గించవచ్చు. వరి పంట దుబ్బు చేసే దశ నుంచి అంకురం దశ వరకు పొలంలో 2 సెం.మీ. ఎత్తున నీరు నిలువ ఉంచాలి. అంకురం దశ నుంచి పూత దశ వరకు నీటి లభ్యతను బట్టి పొలంలో 2 సెం.మీ. లేదా 5 సెం. మీ. నీరు నిలువ ఉంచాలి. నీటి లభ్యత బాగా తక్కువ ఉన్నప్రాంతాల్లో ఆరుతడి పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. మొక్కజొన్న పంట పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుంచి కంకి ఏర్పడిన 25 రోజుల తర్వాత వరకు పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు. కాబట్టి, రైతులు పైరుకు జీవసంరక్షక నీటి తడి ఇవ్వాలి. పండ్ల తోటల్లో ప్రత్యేక జాగ్రత్తలు.. నీటి వసతి అధికంగా ఉన్నప్రాంతాల్లో వడగాడ్పుల ప్రభావాన్ని తగ్గించడానికి తరచుగా నీరు ఇవ్వాలి. పండ్ల తోట 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుదైతే, ఒక రోజుకు ఒక చెట్టుకు 150–240 లీటర్ల నీరు అవసరం. అవకాశం ఉన్నచోట సేంద్రియ పదార్థాలైన గడ్డి తదితర పదార్థాలతో మొక్కల మొదళ్లలో ఆచ్ఛాదన (మల్చింగ్) చేయటంతో పాటు బిందు సేద్యానికి ్రపాధాన్యత ఇవ్వాలి. ఆచ్ఛాదన చేయడం వలన నేలలో తేమ ఎక్కువ కాలం నిలువ ఉండి, మొక్కకు అందుబాటులో ఉంటుంది. వరి గడ్డి లేదా స్థానికంగా లభించే సేంద్రియ పదార్థాలు లేదా పాలిథిన్ షీట్లను మొక్కల మొదళ్ళ చుట్టూ కప్పాలి. మామిడి తోటలో ఏప్రిల్ – మే మాసంలో 1% పొటాషియం నైట్రేట్ (13–0–45) మందును 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. బెట్ట పరిస్థితుల్లో నల్లి (మైట్) ఉధృతి పెరుగుతుంది. నివారణకు 30 మి.లీ. డైకోఫోల్ లేదా 20 మి.లీ. ్రపొపారై్గట్ లేదా 20 మి.లీ. ఇథియాన్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఒకటి లేదా రెండేళ్ల వయస్సు గల పండ్ల తోటలు లేదా కొత్తగా నాటిన తోటల చుట్టూ వేసవిలో వడగాల్పుల ప్రభావం తగ్గించడానికి సరుగుడు లేదా వెదురు మొక్కలను నాటుకోవాలి. కూరగాయ తోటల్లో ఏం చేయాలి? అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల కూరగాయ రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి. తరచుగా నీటి తడులు ఇవ్వడం ద్వారా నేలలో తేమను సంరక్షిచుకోవచ్చు. బిందు సేద్యం చేసే పంటల్లో ప్రతి రోజూ అరగంట (ఉదయం, సాయంత్రం) 2సార్లు నీరివ్వాలి. ప్రధాన పంటపై వడగాడ్పుల ప్రభావాన్ని తగ్గించడానికి, మొక్కజొన్నను 3–4 వరుసల సరిహద్దు పంటగా వేసుకోవాలి. ప్రతి 20–25 మీటర్ల దూరంలో అంతర పంటగా వేసుకోవాలి. 50% షేడ్ నెట్‌ను వాడి పంటలపై అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. కోళ్ళు పొడి, వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి షెడ్లల్లో ఫ్యాన్లను, ఫాగర్లను అమర్చాలి. షెడ్లను వరి గడ్డితో కప్పి స్ప్రింక్లర్లు అమర్చాలి. కోళ్ళు ఎక్కువ మోతాదులో దాణా తినటం కోసం మెత్తటి దాణాతో పాటు చల్లని తాగు నీటిని అందుబాటులో ఉంచాలి. – డా. లీలారాణి, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమి)– అధిపతి వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం, వ్యవసాయ పరిశోధన సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్. పశువులను కాపాడేదెలా? వేసవి కాలంలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు వీచడం వల్ల ఉష్ణతాపానికి గురై పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు తీవ్ర అసౌకర్యానికి, అనారోగ్యానికి లోనుకావడమే కాకుండా వడదెబ్బకు గురవుతూ ఉంటాయి. కాబట్టి, పశుపోషకులు, గొర్రెలు– మేకల పెంపకదారులు వేసవికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని పశువులు, గొర్రెలు మేకలు అనారోగ్యానికి గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా సంరక్షించుకోవచ్చు. వాతావరణ మార్పులకు అనుగుణంగా శాస్త్రీయ యాజమాన్య పద్ధతిని పాటించడం ద్వారా ఉత్పాదక శక్తి తగ్గకుండా రైతు ఆశించిన ఫలితాలను పొందవచ్చు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల సంరక్షణ ఇలా.. అధిక ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, షెడ్లలో అధిక సంఖ్యలో కిక్కిరిసి ఉండటం, ఉక్కపోత, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బకు గురవుతాయి. వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి, బలహీనంగా మారతాయి. పశువులు సరిగా నడవలేక, తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. జీవక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, మేత తక్కువగా తీసుకోవడం వల్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన ఇతర వ్యాధులు, పరాన్నజీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటల్లో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు రావచ్చు. చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవించే అవకాశాలున్నాయి. వడదెబ్బకు గురైన పశువుల్లో దాహం పెరుగుతుంది. తూలుతూ నడుస్తూ పడిపోవడం, రొప్పుతూ, శ్వాస కష్టమవడంతో ఒక్కొక్కసారి అపస్మారక స్థితికి వెళ్ళి మరణించే ప్రమాదం ఉంటుంది. పశువుల మేపు.. వేసవి తాపంతో జీర్ణక్రియ సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలైన గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడం మంచిది. ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలి. ఒకవేళ మాగుడు గడ్డి సమృద్ధిగా ఉంటే అందించవచ్చు. పచ్చిగడ్డిని ఉదయం సమయాల్లో, ఎండుగడ్డిని రాత్రి సమయాలలో వేర్వేరుగా ఇవ్వాలి. అధిక పాలిచ్చే పశువులకు దాణాను నీటితో కలిపి ఇవ్వాలి. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది. మేపు కొరకు పశువుల్ని ఎండవేళల్లో కాకుండా ఉ. పూట 6 నుంచి 10 గంటల వరకు, సా. 5 నుండి 7 గంటల వరకు బయటకు పంపడం మంచిది. వేసవి తాపానికి గురైన పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధి నిరోధక టీకాలు ఇది వరకు వేయించని పశువులు, గొర్రెలు, మేకలకు గాలికుంటు వ్యాధి, గొంతువాపు, జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. దాహంతో ఉన్న పశువులు మురుగునీరు తాగటం వల్ల పారుడు వంటి జీర్ణకోశ రోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఎల్లవేళలా మంచి చల్లని తాగునీరు ఇవ్వాలి. అంతర పరాన్న జీవుల నిర్మూలనకు నట్టల నివారణ మందులు క్రమం తప్పకుండా తాగించాలి. వడదెబ్బకు గురైన పశువులకు ప్రథమ చికిత్స.. వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్ళి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగాలి. తల నుదుటి మీద మంచుముక్కలు ఉంచాలి లేదా చల్లని గోనె సంచిని దానిపై క΄్పాలి. వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. పశువైద్యుని పర్యవేక్షణలో గ్లూకోజ్ సెలైన్, సోడియం క్లోరైడ్ అందించాలి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి తగిన చికిత్స చేయించాలి. – డా. జి. మంజువాణి, సంచాలకులు, పశువైద్య, పశు సంవర్థక శాఖ, హైదరాబాద్ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ బోరు బావుల రీచార్జ్‌తో నీటి భద్రత! 22న వాటర్ అండ్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ వెబినార్ గత వానాకాలంలో రుతుపవనాల వైఫల్యం వల్ల భూగర్భంలోకి వాన నీరు సరిగ్గా ఇంకకపోవటంతో తెలుగు రాష్ట్రాల్లోని అనేకప్రాంతాల్లో బోరు బావులు ఎండిపోతున్నాయి. కాలువ కమాండ్ ఏరియాల్లో సైతం పొలాల్లో, నివాసప్రాంతాల్లో కూడా పలువురు ఇప్పటికే కొత్త బోరు బావులు తవ్వుతున్నా, చాలా వాటిల్లో ఆశించినంతగా నీరు లభించని పరిస్థితి. ఎండిపోయిన బోరు బావులు, కొద్దొగొప్పో నీరు పోస్తున్న బోరు బావుల చుట్టూ వాన నీటి ఇంకుడు గుంత (రిచార్జ్ పిట్)ను నిర్మించుకోవటం ద్వారా కృత్రిమంగా భూగర్భ జలాలను పెంపొందించుకోవటమే ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం. వీటిని నిర్మాణం ద్వారా ఈ ఎండాకాలంలోనూ కురిసే అకాల వర్షాలకు వృథాగా పోయే నీటిని సమర్థవంతంగా బోర్ల దగ్గరే భూమిలోకి ఇంకింపజేసుకోవచ్చు. అయితే, వాననీటిని ఇంకింపజేసే ఇంకుడు గుంత నిర్మాణానికి ఎండిపోయిన బోర్లన్నీ పనికిరావు. ‘ట్యాంకర్ టెస్ట్’ చేసి నిర్థారించుకోవాల్సి ఉంటుంది. ఈ అత్యాధునిక బోర్వెల్ రీచార్జ్ టెక్నిక్‌ను సికింద్రాబాద్‌లోని ‘వాటర్ అండ్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ (డబ్ల్యూ.ఎల్.ఎఫ్.)’ గత 14 ఏళ్లుగా ప్రజలకు అందిస్తోంది. ఈ అంశంపై రైతులకు, స్వచ్ఛంద సంస్థలు, ఇంజనీర్లు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు డబ్ల్యూ.ఎల్.ఎఫ్. ఈ నెల 22న ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా.. తెలుగులో ఉచితంగా వెబినార్‌ను నిర్వహిస్తోంది. ఈ క్యూ.ఆర్.కోడ్ ద్వారా స్కాన్ చేసి గూగుల్ ఫామ్ ద్వారా పేర్లను ఈ నెల 18 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి వాట్సప్ ద్వారా వెబినార్ లింక్ పంపుతారు. ప్రవేశం ఉచితం. రూ.200 చెల్లించిన వారికి బోర్ల వద్ద వాన నీటి సంరక్షణపై ఆంగ్ల పుస్తకాన్ని పంపుతారు. వివరాలకు.. సీనియర్ జియాలజిస్ట్ రామ్మోహన్ – 94401 94866, 040 27014467. 16, 17న సేంద్రియ రైతులతో ముఖాముఖి! హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 16, 17 తేదీల్లో గ్రామభారతి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో నాబార్డ్ తోడ్పాటుతో సేంద్రియ వ్యవసాయ, గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన ‘కిసాన్ ఎక్స్పో’ 2వ ఎడిషన్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సామ ఎల్లారెడ్డి తెలిపారు. ఆరోగ్యదాయక సేద్యం చేస్తున్న గ్రామీణ సేంద్రియ/ ప్రకృతి వ్యవసాదారులను, వారి ఉత్పత్తులను ప్రత్యక్షంగా నగరవాసులకు పరిచయం చేయటం కోసం వినియోగదారుల కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించటం ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రకృతి సేద్య రంగ ప్రముఖులు డా. జీవీ రామాంజనేయులు, విజయరామ్, కొప్పుల నరసన్న తదితరులు అతిధులుగా పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 97040 66622. ఇవి చదవండి: Dr Supraja Dharini: తాబేలు గెలవాలి -
Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్ ఆన్, ఆఫ్!
'రైతులు ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బంది. ఓ స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ పరికరం ద్వారా ఫోన్‌తో బోర్ మోటర్‌ను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో తయారైన ఎంబెడ్డెడ్ స్టార్టర్ ఇది. దొంగల భయం లేని ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్న రైతులు..' వరి, మొక్కజొన్న, మిర్చి.. ఇలా పంట ఏదైనా సమయానికి సాగు నీటిని అందించటం ముఖ్య విషయం. స్వయంగా పొలానికెళ్లి మోటారు స్విచ్ ఆన్, ఆఫ్ చేయటం సాధారణంగా రైతు చేసే పని. అయితే, ఏదైనా పని మీద రైతు ఊరికి వెళ్లాల్సి వస్తే.. పక్క పొలంలో రైతును బతిమాలుకొని పంటలకు నీళ్లు పెట్టేందుకు మోటర్ ఆన్, ఆఫ్ చేయించేవారు. ఇప్పుడు అలా ఎవర్నీ ఇబ్బంది పెట్టక్కర్లేదు, రైతు ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే, రైతు ఎంత దూర ప్రాంంతం వెళ్లినా సరే ఫోన్ నెట్వర్క్ ఉంటే చాలు.. మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పుడు అంటే అప్పుడు బోర్ మోటర్‌ను ఆన్ చేసుకోవచ్చు, పని పూర్తయ్యాక ఆఫ్ చేసుకోవచ్చు. న్యాస్త అనే స్టార్టప్ కంపెనీ వారు అత్యాధునిక సాంకేతికతతో విలక్షణ స్టార్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు. సిద్ధిపేట జిల్లాలో చిన్నకోడూరు మండలంలో పలువురు రైతులు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ పరికరాన్ని మోటారు వద్ద అమర్చుకోవడం వలన ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా మోటర్‌ను ఆన్ చేసుకునే వెసులుబాటు ఏర్పడటంతో తమకు చాలా ఇబ్బందులు తప్పాయంటున్నారు రైతులు. నలుగురు యువ విద్యావంతులు స్థాపించిన ‘న్యాస్త’ స్టార్టప్ కంపెనీ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా యాజమాన్య సంస్థ (నార్మ్) ఎ–ఐడియాలో ఇంక్యుబేషన్ సేవలు పొంది రూపొందించిన ఈ పరికరంలో మొబైల్లో మాదిరిగానే ఒక సిమ్ కార్డు ఉంటుంది. దాని ద్వారా మెసేజ్ రూపంలో పొలంలో నీటి మోటర్‌కు సంబంధించిన సమాచారం.. అంటే మోటర్‌కు నీరు సరిగ్గా అందుతోందా? విద్యుత్తు ఓల్టేజి ఎంత ఉంది? మోటర్ నీటిని సరిగ్గా ఎత్తిపోస్తోందా లేదా? వంటి సమాచారం ఎప్పటికప్పుడు రైతు మొబైల్‌కు మెసేజ్‌లు వస్తాయి. సంవత్సరానికి ఒక్కసారి ఈ సిమ్‌కు రీచార్జి చేయిస్తే సరిపోతుంది. ఫోన్ సిగ్నల్స్ ఉండే ఎక్కడి నుంచైనా మోటర్‌ను ఆఫ్, ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నీరు లేకపోయినా, విద్యుత్తు హెచ్చుతగ్గులు వచ్చినా మోటర్ స్విచ్ ఆఫ్ అయిపోయి.. రైతుకు మొబైల్లో సందేశం వస్తుంది. ఉపయోగాలెన్నో.. ఎప్పుడు కావాలంటే అప్పుడు (అడ్హాక్ మోడ్) న్యాస్త మొబైల్ యాప్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏయే వేళ్లల్లో మోటర్ నడవాలి (ఇంట్రవెల్స్ మోడ్)?: భూగర్భంలో నీరు తక్కువగా ఉన్న చోట నిరంతరంగా బోర్లు నడిపితే కాలిపోతాయి. విద్యుత్తు ప్రసారం ఉండే సమయాలకు అనుగుణంగా మోటర్‌ను ఏ సమయానికి ఆన్ చెయ్యాలి? ఏ సమయానికి ఆఫ్ చేయాలి? అని టైమ్ సెట్ చేస్తే చాలు. ఆ ప్రకారంగా అదే ఆన్ అవుతుంది, అదే ఆఫ్ అవుతుంది. షెడ్యులర్ మోడ్: ప్రతి రోజు ఒకే సమయంలో ఆన్ అయ్యేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా టైం ఫిక్స్ చేసుకోవడం వలన ప్రతి రోజు పంటలకు సాగు నీళ్లు తగిన మోతాదులో అందించే అవకాశం ఉంటుంది. దొంగల భయం లేదు.. వరి, కూరగాయలు, పామాయిల్, మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్న 117 మంది రైతులు ఈ స్టార్టర్ ద్వారా లబ్ధిపొందుతున్నారని న్యాస్త స్టార్టప్ సహ వ్యవస్థాపకులు భార్గవి (83673 69514) తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో ఈ ఎంబెడ్డెడ్ స్టార్టర్ పనిచేస్తుంది. అందువల్ల పొలంలో నుంచి ఎవరైనా ఇతరులు దీన్ని దొంగతనంగా తీసుకెళ్లినా వారు వినియోగించలేరని, దాన్ని ఆన్ చేయగానే మొబైల్ నెట్వర్క్ ద్వారా దాని లొకేషన్ ఇట్టే తెలిసిపోతుందని ఆమె ‘సాక్షి’కి తెలిపారు. ఓవర్ ద ఎయిర్ (ఒ.టి.ఎ.) సర్వర్ ద్వారా ఈ స్టార్టర్లను తాము నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటామని, సాంకేతికంగా అప్డేట్ చేయటం చాలా సులభమన్నారు. రైతు ఒక్క సిమ్ ద్వారా అనేక మోటర్లను వాడుకోవటం ఇందులో ప్రత్యేకత అని ఆమె వివరించారు. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్ధిపేట ఈ పరికరం లేకపోతే వ్యవసాయమే చేయకపోదును! 8 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నా. పొలానికి సుమారుగా 600 మీటర్ల దూరం నుంచి సాగు నీరు సరఫరా చేస్తున్నా. దూరంలో బోర్ ఉండటంతో పైప్‌లు చాలా సార్లు ఊడిపోతుండేవి. అప్పుడు మోటర్‌ను బంద్ చేసేందుకు అంత దూరం నడచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారానే మోటర్‌ను ఆన్, ఆఫ్ చేస్తున్నా. సెల్‌ఫోన్‌తో బోర్ మోటర్ ఆఫ్, ఆన్ చేయడం అందుబాటులోకి రావడంతో చాలా ఇబ్బందులు తప్పాయి. ఈ పరికరం లేకపోతే నేను వ్యసాయం కూడా చేయకపోదును. – నాగర్తి తిరుపతి రెడ్డి (94415 44819), మాచాపూర్, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా ఊరికి వెళ్లినా ఇబ్బంది లేదు.. ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బందులు ఉండేవి. పక్కన రైతును బతిమిలాడుకునే వాళ్లం. అదే ఇప్పుడు న్యాస్త స్టార్టర్‌తో ఎక్కడికైనా ఫంక్షన్‌కు, ఊరికి సంతోషంగా వెళ్లి వస్తున్నా. అక్కడి నుంచే మోటర్‌ను సెల్ఫోన్లో నుంచే ఆన్, ఆఫ్ చేస్తున్నా. ఇది ఎంతో ఉపయోకరంగా ఉంది. – పంపరి సత్తయ్య (9989385961), చిన్నకోడూరు, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Dr Anandi Singh Rawat: అర్థం చేసుకోవడం ముఖ్యం -
సెమీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉందని మీకు తెలుసా?
'రసాయనిక ఎరువులు, పురుగుమందులు.. జన్యుమార్పిడి విత్తనాలను అస్సలు వాడకుండా పంటలు పండించే సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు దేశ విదేశాల్లో ‘ఆర్గానిక్’ సర్టిఫికేషన్ గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ‘మంచి వ్యవసాయ పద్ధతుల(జి.ఎ.పి.)’తో పండించే ఆహారోత్పత్తులకు ‘గ్యాప్’ సర్టిఫికేషన్‌కు కూడా అదే మాదిరి గుర్తింపు ఉంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో ‘గ్లోబల్‌గ్యాప్’ ప్రమాణాలు అమల్లో ఉన్నాయి. ఈ ఆహారోత్పత్తులకు ఆయా దేశాల్లోని వినియోగదారులు, రిటైలర్ల ఆదరణతో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి గిరాకీ ఉంది. ‘గ్లోబల్‌గ్యాప్’కు అనుగుణంగా దేశీయంగా రైతులు, ప్రాసెసింగ్ పరిశ్రమదారులు పాటించవలసిన ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలను భారత ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా (క్యు.సి.ఐ.) 2021లో అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రమాణాలను రైతులకు మొట్టమొదటగా అందుబాటులోకి తెచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కటం విశేషం. తొలుత ఈ ప్రమాణాలను పాటించటం అలవాటు చేసుకునే రైతులకు.. భవిష్యత్తులో సేంద్రియ సర్టిఫికేషన్ పొందటం సులువు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘గ్లోబల్‌గ్యాప్’, ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలు, వాటి ప్రయోజనాల పూర్వాపరాలపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..' ఆహారం ప్రజలకు స్థానికంగా, సరసమైన ధరలో, అందరికీ అందుబాటులో ఉంటే ప్రజలకు ఆహార భద్రత (ఫుడ్ సెక్యూరిటీ) ఉన్నట్లు. ఆ ఆహారం మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించని ప్రమాణాలతో పండించి, నిల్వ చేసినదై ఉంటే అది క్షేమదాకమైన ఆహారం (సేఫ్ ఫుడ్). తగుమాత్రంగా రసాయనాలు వాడుతూ, ఇతర జాగ్రత్తలు పాటిస్తూ సేఫ్ ఫుడ్‌ను పండించడానికి రైతులకు ఉపకరించేవే ‘మంచి వ్యవసాయ పద్ధతులు’. వీటిని ‘గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ (జి.ఎ.పి.– గ్యాప్) అంటారు. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ‘గ్లోబల్‌గ్యాప్’ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందినవే ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలు. ఈ ప్రమాణాల ద్వారా రైతుల ఉత్పత్తులకు గిరాకీ పెరిగి, వారి నికరాదాయం పెరుగుతుందని అనుభవాలు చెబుతున్నాయి. పసుపు తోటలో శ్రేష్ట ఎఫ్‌పిసి రైతు నెర్ల విజయేంద్రరెడ్డి ‘గ్లోబల్‌గ్యాప్’ పుట్టుపూర్వోత్తరాలు.. తెలిసో తెలియకో పరిమితికి మించి రసాయనిక ఎరువులు, పురుగుమందులను విచ్చలవిడిగా వాడుతూ పంటలు పండిస్తున్నందు వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోంది. కొందరు రైతులు నిషిద్ధ పురుగుమందులను సైతం వాడుతున్నారు. పురుగుమందులు చల్లటానికి, పంట కోతకు మధ్య పాటించాల్సిన వ్యవధిని సైతం పాటించకపోవటం వల్ల విష రసాయనాల అవశేషాలు పరిమితికి ఎన్నో రెట్లు ఎక్కువ కనిపిస్తున్న సందర్భాలు లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కోసిన తర్వాత కలుషిత నీటిలో కడగటం వంటి, రవాణా, నిల్వ పద్ధతుల్లో కూడా టోకు, చిల్లర వ్యాపారులు నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోవటం పరిపాటిగా మారింది. ఇటువంటి సురక్షితం కాని ఆహారోత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. మన రాష్ట్రం, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఇదే. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఆహార వ్యవస్థలో గుణాత్మక మార్పులు తేవడానికి యూరప్‌లో చిల్లర వర్తకులు 1997లో ‘యూరోప్గ్యాప్’ పేరుతో మంచి వ్యవసాయ పద్ధతుల అమలుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వారి కృషి ఫలితంగా మెరుగుపరిచిన ప్రమాణాలు 2007లో ‘గ్లోబల్‌గ్యాప్’ పేరుతో ప్రపంచ దేశాలకు అందుబాటులోకి వచ్చాయి. ధాన్యపు పంటలు, కూరగాయలు, పండ్లు, పూల సాగుతో పాటు ఆక్వా సాగుకు కూడా ‘గ్లోబల్‌గ్యాప్’ ప్రమాణాలు వర్తింపజేస్తున్నారు. పంట పొలాలు, తోటలు, ఆక్వా చెరువుల్లో సాగు పద్ధతుల్లో ప్రతి దశలోనూ.. అదేవిధంగా ఆహారోత్పత్తుల సేకరణ, రవాణా, నిల్వ, ప్రాసెసింగ్ వ్యవస్థల్లో పాటించాల్సిన ప్రమాణాలను ‘గ్లోబల్‌గ్యాప్’ ప్రమాణాల సంస్థ నిర్దేశిస్తోంది. భారత్ సహా 130 దేశాల్లో ఇప్పటికి 1,95,000 మంది రైతులు గ్లోబల్‌గ్యాప్ సర్టిఫికేషన్ పొందారు. 43 లక్షల హెక్టార్లలో రైతులు అందుకు అనుగుణంగా సాగు చేస్తూ.. సాధారణ ఉత్పత్తులతో పోల్చితే అధిక ధరకు అమ్ముకుంటున్నారు. 25 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల చేపలు, రొయ్యలతో పాటు.. 2.1 కోట్ల టన్నుల సర్టిఫైడ్ కాంపౌండ్ ఫీడ్‌ను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. టర్కీలో గ్యాప్ ప్రమాణాలు పాటించిన రైతుల పొలాల్లో రసాయనిక ఎరువుల వాడకం 19–31% మేరకు తగ్గింది. రసాయనిక పురుగుమందుల వాడకం 50%, శిలీంధ్రనాశనులు 25%, కలుపు మందులు 70% తగ్గిందని ఒక అధ్యయనంలో తేలింది. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులు, పెద్ద రైతులు అనుసరించదగిన మంచి వ్యవసాయ పద్ధతులను క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా (క్యు.సి.ఐ.) ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలను 2021లో ప్రకటించింది. 2023 ఆగస్టులో గ్లోబల్ గ్యాప్ ప్రమాణాలతో ఇండిగ్యాప్ను అనుసంధానం చేశారు. 180కి పైగా గ్లోబల్‌గ్యాప్ సర్టిఫికేషన్ సంస్థలు అంతర్జాతీయగా రైతులకు సేవలందిస్తున్నాయి. మన దేశంలో ‘ఇండిగ్యాప్’ సర్టిఫికేషన్ విస్తరణ సేవలను వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావటం విశేషం. క్వాలిటీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గున్వత్తా సంకల్ప్ పథకం కింద ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ కార్యక్రమం అమలవుతోంది. తొలి ఏడాది 33 ఎఫ్‌పిసిలకు శిక్షణ ఇచ్చారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఇండ్‌గ్యాప్ అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కృషిగ్యాప్ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ ఇందుకు తోడ్పడుతోంది. స్పైసెస్‌బోర్డు ద్వారా మిరప, పసుపు తదితర సుగంధ ద్రవ్య పంటల్లో సైతం ఏపీ, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇండిగ్యాప్ సర్టిఫికేషన్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఖర్చుతోనే పరీక్షలు.. ‘ఇండిగ్యాప్’ సర్టిఫికేషన్ పొందే ప్రయత్నాలను దేశంలో మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 2023 ఖరీఫ్ నుంచి ప్రారంభించింది. తొలుత 20 వ్యవసాయ, 13 ఉద్యాన ఎఫ్‌పిసిలకు శిక్షణ ఇచ్చాం. ఇప్పటికే కొందరు రైతులు తక్కువ ఖర్చుతో, రసాయనిక అవశేషాల్లేని ఆహారం పండించి రైతులు అధిక ఆదాయం పొందారు. పరిమితికి మించి రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులను పండించిన తర్వాత శాంపుల్స్‌ను బెంగళూరు పంపి ప్రభుత్వ ఖర్చులతోనే 200 వరకు రసాయనాలకు సంబంధించి పరీక్ష చేయిస్తున్నాం. ఒక్కో శాంపిల్‌కు రూ. 10–12 వేలు ఖర్చు అవుతోంది. ఏపీలోనే రూ.2.6 కోట్లతో అధునాతన లాబ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండ్‌గ్యాప్ సర్టిఫికేషన్ పొందే రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు 130 దేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఆర్గానిక్ సర్టిఫికేషన్‌ను రైతులకు అందించడానికి సంబంధించి అపెడా ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన రైతుల బ్రాండెడ్ ఉత్పత్తులను దేశ విదేశాల్లో మంచి ధరకు విక్రయించి అధికాదాయం రాబట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. – డా. ఎ. త్రివిక్రమరెడ్డి (97393 16931), డైరెక్టర్, ఏపీ విత్తన, సేంద్రియ ధృవీకరణ అథారిటీ, గుంటూరు రైతుల్లో మార్పు వస్తోంది! మా శ్రేష్ట ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలో 300 మంది రైతులు ఉన్నారు. ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ కోసం రూ. 18 వేలు ఫీజు చెల్లించి నమోదు చేసుకున్నాం. మొదటి ఏడాది 24 మంది రైతులు 50 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి 100 మంది రైతులు 500 ఎకరాల్లో పసుపు సాగు చేయించాలన్నది లక్ష్యం. మా రైతులు 10% రసాయనిక ఎరువులు 90% సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. నిషేధిత పురుగుమందులు వాడకుండా ఇండిగ్యాప్ నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తున్న విధంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నాం. పసుపు పండిన తర్వాత ప్రభుత్వమే పరీక్ష చేయించి, ఇండిగ్యాప్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్ ఉంటే దేశ విదేశాల్లో మా ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ కోసం పనిచేస్తున్న మా సభ్య రైతుల్లో మార్పు కనిపిస్తోంది. ఇండిగ్యాప్ మామిడి, మిరప, అరటి రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అన్ని వివరాలూ మాన్యువల్‌గా నమోదు చేస్తున్నాం. వచ్చే ఏడాది ఆన్లైన్ సదుపాయం అందుబాటులోకి వస్తే వెసులుబాటుగా ఉంటుంది. – ఉయ్యూరు సాంబిరెడ్డి (93969 62345), శ్రేష్ట ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, కొల్లిపర, గుంటూరు జిల్లా చిన్న, సన్నకారు రైతుల కోసం..! విదేశాల్లో రిటైల్ స్టోర్లలో పక్కపక్కనే సాధారణ రసాయనిక వ్యవసాయంలో పండించిన ఆహారోత్పత్తులు, సేంద్రియ సర్టిఫైడ్ ఆహారోత్పత్తులతో పాటు.. మంచి వ్యవసాయ పద్ధతుల (గ్యాప్) ద్వారా పరిమితంగా రసాయనాలు వాడి పండించిన సర్టిఫైడ్ ఉత్పత్తులు కూడా పక్కపక్కనే పెట్టి అమ్ముతూ ఉంటారు. వినియోగదారులు తమ స్థోమతను బట్టి వాటిని కొనుగోలు చేస్తుంటారు. యూరప్‌లో 1997లో రిటైల్ వర్తకుల చొరవ వల్ల ‘గ్లోబల్‌గ్యాప్’ సర్టిఫికేషన్ ప్రారంభమైంది. ఆ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో క్వాలిటీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలను నిర్దేశించింది. ఈ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించటం, సర్టిఫికేషన్ పొందే ప్రక్రియకు సంబంధించిన అంశాలపై మా సంస్థ అనేక రాష్ట్రాల్లో అధికారులు, ఎఫ్‌పిసిలు, రైతులకు శిక్షణ ఇస్తున్నాం. గతంలో మహారాష్ట్రం, ఏపీలకు చెందిన ద్రాక్ష రైతులకు కూడా శిక్షణ ఇచ్చాం. ఔషధ మొక్కల పెంపకంపై స్పైసెస్ బోర్డు తోడ్పాటుతో రైతులకు శిక్షణ ఇస్తున్నాం. శంషాబాద్‌లో క్షేత్రస్థాయిలో ఇండిగ్యాప్, సేంద్రియ సర్టిఫికేషన్లకు అనుగుణంగా శాస్త్రవేత్తలు, అధికారులు, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఆచరణాత్మక శిక్షణ ఇచ్చేందుకు త్వరలో నమూనా క్షేత్రాన్ని నిర్మిస్తున్నాం. ‘ఇండిగ్యాప్’ ప్రమాణాల ప్రకారం రైతులు పంటలు పండించి ఎఫ్పిఓలు, కోఆపరేటివ్‌ల ద్వారా గ్రూప్ సర్టిఫికెట్ పొందొచ్చు. పరిమితికి మించి రసాయనిక పురుగుమందుల అవశేషాల్లేని మంచి ఆహారానికి ఇటు దేశీయ మార్కెట్లలోగాని, అటు అంతర్జాతీయ మార్కెట్లలో గాని మంచి గిరాకీ ఉంది. రైతులు అధికాదాయం పొందవచ్చు. – కోటెల శ్రీహరి (98480 34740), వ్యవస్థాపకులు, కృషిగ్యాప్ డిజిటల్ సొల్యూషన్స్, హైదరాబాద్, www.krishigap.com – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
‘వ్యవసాయ’ ఉద్గారాలు 31% కాదు.. 60%!
'వాతావరణంలోకి విడుదలయ్యే మొత్తం ఉద్గారాల్లో వ్యవసాయం, ఆహార సంబంధిత ఉద్గారాల వాటా 31% అని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రకటించగా.. ఇవి 60% మేరకు ఉంటాయని పద్మశ్రీ పురస్కార గ్రహీత డా‘‘ సుభాష్ పాలేకర్ అంచనా వేస్తున్నారు. పశువుల ఎరువు/ వర్మీ కంపోస్టు/ కంపోస్టు వంటివి ఏటా ఎకరానికి 10 టన్నుల మేరకు వేస్తుండటం కూడా భూతాపం విపరీతంగా పెరగడానికి ఓ ముఖ్య కారణంగా అందరూ గుర్తించాలని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ, ఆహార రంగాల ఉద్గారాలు తగ్గాలంటే.. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వాడకం కూడా మాని, రైతులందరూ సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిని అనుసరించాలన్నారాయన. భవిష్యత్తులో పెను తుపాన్లు, కరువులను తట్టుకోవాలన్నా.. పోషక విలువలున్న ఆహారం అందరికీ అందాలన్నా ఇదొక్కటే మార్గమన్నారు. దేశవ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు తాను చెప్పిన పద్ధతిలో సాగు చేస్తున్నారని, సుసంపన్న దిగుబడులిస్తున్న వారి క్షేత్రాలే ఇందుకు నిదర్శనాలన్నారు. రోగ కారకం కాని ఆహారం విలువను వినియోగదారులు గుర్తించి ఉద్యమ స్ఫూర్తితో రైతులను ప్రోత్సహిస్తేనే పర్యావరణహితమైన వ్యవసాయం విస్తరిస్తుందని పాలేకర్ స్పష్టం చేస్తున్నారు. భారతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (ఐసిఎఆర్–మేనేజ్)లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొన్న డా‘‘ పాలేకర్‌తో ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..' • పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులపై మీరు చాలా ఏళ్లుగా స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా రైతులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? డా. పాలేకర్: శిక్షణా శిబిరాల ద్వారా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా లక్షలాది మంది సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిని సోషల్ మీడియా (వెబ్సైట్, యూట్యూబ్, వాట్సప్) ద్వారా నేర్చుకుంటున్నారు. నీతి ఆయోగ్ తోపాటు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో విస్తారంగా రసాయనిక ఎరువులతో పాటు ఎకరానికి ఏటేటా పది టన్నుల చొప్పున పశువుల ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు వంటి సేంద్రియ ఎరువులు కూడా వాడకుండా.. నేను చెప్పినట్లు అనేక నమూనాల ప్రకారం పంటలు పండిస్తున్నారు. నేను చెప్పింది చెప్పినట్లు చేసిన వారు తొలి ఏడాదిలోనే రసాయనిక వ్యవసాయానికి తగ్గకుండా దిగుబడులు పొందుతున్నారు. రసాయనాలు వాడకుండా.. నేలలో పోషకాలను రూపుమార్చి మొక్కల వేర్లకు అందించేందుకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వంటి బెస్ట్ మైక్రోబియల్ కల్చర్‌ను వినియోగిస్తే చాలు. • దేశంలో ఎంత మంది రైతులు మీ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు? డా. పాలేకర్: సుమారు 70 లక్షల మంది రైతులు అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకుంటూ, వాట్సప్ ద్వారా సందేహాలు తీర్చుకుంటున్నారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో చాలా మంది ఫాలో అవుతున్నారు. నీతి ఆయోగ్ నా టెక్నాలజీతో కన్విన్స్ అయ్యింది. హైదరాబాద్‌లోని ‘మేనేజ్’ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో ఆశ్చర్యకరమైన దిగుబడులు సాధిస్తున్న రైతుల క్షేత్రాలను నేనే స్వయంగా రైతులకు చూపిస్తున్నాను. మొన్న వికారాబాద్ జిల్లాలో విజయరామ్ సాగు చేస్తున్న ఫైవ్ లేయర్ మోడల్ క్షేత్రాన్ని వందలాది మందికి చూపించాను. ఈ నెల 24,25 తేదీల్లో అహ్మదాబాద్ దగ్గర క్షేత్ర సందర్శన ఉంది. నేను రూపాయి పారితోషికం ఆశించకుండా ఉచితంగానే కర్బన ఉద్గారాలు లేని వ్యవసాయం గురించి ప్రచారం చేస్తున్నాను. • పర్యావరణ సంక్షోభంపై దుబాయ్‌లో ఇటీవల ముగిసిన శిఖరాగ్రసభ ‘కాప్28’లో వ్యవసాయ ఆహార వ్యవస్థల ఉద్గారాల గురించి ప్రధానంగా చర్చ జరిగింది కదా..! డా. పాలేకర్: అవును. చైనా, అమెరికా తర్వాత మన దేశమే ఎక్కువ ఉద్గారాలను వెలువరిస్తున్నది. కానీ, భారత ప్రభుత్వం సంతకం చేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది. • మన దేశపు తలసరి ఉద్గారాలు తక్కువ. గతం నుంచీ ఎక్కువగా కాలుష్యానికి కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు విపత్తులకు నష్టపోతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారం ఇవ్వాలని, ఆధునిక టెక్నాలజీ ఇవ్వాలని మన దేశం అడుగుతోంది కదా..! డా. పాలేకర్: సంపన్న దేశాలు ఏమీ విదల్చటం లేదు కదా. పైగా, కుట్రపూరితంగా కాలుష్య కారక ఫ్యాక్టరీలు మనలాంటి దేశాల్లో పెట్టిస్తూ, వస్తువుల్ని ఆ దేశాలు కొనుక్కుంటున్నాయి. దీర్ఘకాలిక పంటైన బాస్మతి బియ్యం కిలో పండించడానికి 5,600 లీటర్ల నీరు ఖర్చవుతోంది. స్వల్పకాలిక వరి రకాలతో కిలో బియ్యం పండించడానికి 2,500 లీటర్ల నీరు ఖర్చవుతోంది. పైగా వరి పొలాల్లో నీటిని నిల్వగట్టటం వల్ల, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు, శిలీంద్రనాశన రసాయనాల వల్ల పెద్ద ఎత్తున మిథేన్ వంటి అత్యంత ప్రమాదకర ఉద్గారాలు వెలువడుతున్నాయి. సంపన్న దేశాలు డబ్బులు ఇచ్చే వరకు మనం ఈ ఉద్గారాలు వెలువరించటం మానుకోకూడదా? రసాయనిక వ్యవసాయం ఒక్కటే కాదు.. సేంద్రియ ఎరువుల వల్ల కూడా పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు వెలువడుతూ భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. గాలిలో ఉద్గారాలు 280 నుంచి 480 పీపీఎంకి పెరిగాయి. ఫలితం ఇప్పటికే చూశారుగా ప్రకృతి విపత్తులు ఎలా పెరిగిపోయాయో. గత ఏడాది గోధుమల దిగుబడి 30% తగ్గిపోయింది. గడచిన ఏడాది అంతా యూరప్‌లో, మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మనం వ్యవసాయ ఉద్గారాలు తగ్గించకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఉంటే.. మున్ముందు చాలా ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తాయి. వాటి కోసం ఎదురుచూద్దామా? ఎఫ్.ఎ.ఓ. చెప్తున్నట్లు అన్ని రకాల ఉద్గారాలలో వ్యవసాయ ఆహార వ్యవస్థ వెలువరిస్తున్న ఉద్గారాలు 31% కాదు, 60%కి పైగా ఉంటాయి. నేనంటాను.. విపత్తుల నుంచి రక్షించుకోవాలంటే వెంటనే మనం ఉద్గారాలు తగ్గించేందుకు పనిని ప్రారంభించాలి. దేశంలో రసాయనిక వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని కూడా వెంటనే నిషేధించాలి. ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు, రైతులు, ముఖ్యంగా రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తిని డయాబెటిస్, కేన్సర్, కరోనా వంటి జబ్బుల పాలవుతున్న వినియోగదారులైన ప్రజలు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. • రసాయనిక ఎరువుల తయారీలో శిలాజ ఇంధనాలు వాడుతారు కాబట్టి ప్రమాదమే. సేంద్రియ ఎరువులతో ప్రమాదం ఎలా? డా. పాలేకర్: ఎకరానికి ప్రతి ఏటా 20 బండ్ల లేదా 10 టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు లేదా కంపోస్టు వేస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక వ్యవసాయం కన్నా కూడా ఇది అనేక రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడినది. అందుకే రైతులు పట్టించుకోవటం లేదు. అంతేకాదు, రసాయనిక వ్యవసాయంలో మాదిరిగానే పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్టు, కంపోస్టు, నూనెగింజల తెలగ పిండిని పొలాల్లో వెదజల్లబడుతుంది. అందులో నుంచి కర్బనం విడుదలై ఆక్సీకరణం చెంది కార్బన్ డయాక్సయిడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్ వంటి హరిత గృహ విష వాయువులు వెలువడి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. మన నేలల్లో సేంద్రియ కర్బనం 0.03% మాత్రమే మిగిలి ఉండటం వల్ల ఈ సేంద్రియ ఎరువులు వాడినా నేలల్లో హ్యూమస్ (జీవన ద్రవ్యం) ఏర్పడటం లేదు. ఈ విధంగా రసాయనిక ఎరువుల వల్లనే కాకుండా టన్నుల కొద్దీ వేసే పశువుల ఎరువు వల్ల కూడా పెద్ద మొత్తంలో ఉద్గారాలు వెలువడుతున్నాయి. అందువల్లనే, వ్యవసాయ ఆహార ఉద్గారాలు ఇతరత్రా మొత్తం ఉద్గారాల్లో 60%కి పైగా ఉంటాయని నా అంచనా. • మీరు కూడా ఆవు పేడతో తయారు చేసిన ఘనజీవామృతం, జీవామృతం వాడమంటున్నారు కదా..? డా. పాలేకర్: ఈ రెండూ సేంద్రియ ఎరువులు కాదు. నేలలో రసాయనాల వల్ల అంతరించిపోయిన సూక్ష్మజీవరాశిని పెంపొందించే మైక్రోబియల్ కల్చర్లు మాత్రమే. ఎకరానికి ఏటా మహా అయితే 400 కిలోల ఘన జీవామృతం చాలు. ‘సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి’ ద్వారా ఒక్క గ్రాము కర్బన ఉద్గారాలు వెలువడవు. నేను చెప్పినట్లు చేస్తే మారిన మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు. పది శాతం నీటితోనే ఆరుతడి పద్ధతిలో మిథేన్ వెలువడకుండా వెద వరి సాగు చేయొచ్చు. • పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే మాటకు బదులు ‘సుభాష్ పాలేకర్ కృషి’ అని అంటున్నారెందుకని? డా. పాలేకర్: పెట్టుబడి లేకుండా పనులు జరగవు. మనం పొలంలో పనిగట్టుకొని చేసే వ్యవసాయ పనులేవీ ప్రకృతిలో ఉండవు. అలాంటప్పుడు ప్రకృతి వ్యవసాయం అనటం సరికాదు అనిపించి పేరు మార్చాను. ‘సుభాష్ పాలేకర్ కృషి’ పద్ధతి అని పిలవమని చెబుతున్నాను. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్, మేనేజ్ తదితర సంస్థలన్నిటికీ చెప్పాను. • పర్యావరణ అనుకూల సాగు పద్ధతుల వ్యాప్తి నెమ్మదిగా ఉండటానికి కారణం? డా. పాలేకర్: ప్రభుత్వాలతో పాటు ప్రజలు చైతన్యవంతులై పోషకాల సాంద్రతతో, ఔషధ గుణాలతో కూడిన ఆరోగ్యదాయకమైన పంట దిగుబడులు పండించడానికి రైతులను ప్రోత్సహించాలి. డయాబెటిస్, కేన్సర్ వంటి జబ్బుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇది అవసరమని వాళ్లు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. యూరప్, అమెరికాలో ప్రజలు ఈ విషయం గుర్తించి జాగ్రత్తపడుతున్నారు. మన ప్రజలూ గుర్తెరగాలి. • రైతులకు శిక్షణా శిబిరాలేమైనా పెడుతున్నారా? డా. పాలేకర్: రంగారెడ్డి జిల్లాలోని రామచంద్రమిషన్ ఆవరణలో 6 వేల మంది రైతులకు 2024 ఏప్రిల్‌లో పది రోజుల శిక్షణా శిబిరం నిర్వహించబోతున్నాం. దీనికి సహకరించమని టీటీడీని కోరుతున్నాం. (డా. సుభాష్ పాలేకర్: వాట్సప్– 98503 52745, palekarsubhash@yahoo.com / spk.org.in) - ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు -
'కోళ్ల ఫారాల కాలుష్యానికి' ఇకపై చెక్! ఎలాగో తెలుసా?
కోళ్ల ఫారంలో కోళ్ల విసర్జితాల వల్ల కోళ్ల రైతులు, కార్మికులకే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు ఈగలు, దుర్వాసన పెద్ద సమస్యగా ఉంటుంది. కోళ్ల విసర్జితాలను ఆశించే ఈగలు మనుషులకు, కోళ్లకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కోళ్ల విసర్జితాల నుంచి విడుదలయ్యే అమ్మోనియా వాయువు వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు, రైతులకు కళ్లు మండటం, తలనొప్పి వంటి సమస్యలు రావటంతో పాటు కోళ్లకు సైతం తలనొప్పి, కంటి చూపు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. లేయర్, బ్రీడర్ కోళ్ల ఫారాల కింద పోగుపడే కోళ్ల విసర్జితాల దుర్వాసన, ఈగల నివారణకు రసాయనాలు చల్లినప్పటికీ ఇది తీరని సమస్యగానే మిగిలిపోతోంది. జనావాసాలకు దగ్గరగా ఉండే కోళ్ల ఫారాల దుర్గంధాన్ని, ఈగలను భరించలేని ప్రజలు వాటిని మూయించే పరిస్థితులు కూడా నెలకొంటూ ఉంటాయి. అయితే, ఈ సమస్యలను పర్యావరణహితంగా పరిష్కరించే ఓ మార్గాన్ని సూచిస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు యడ్లపాటి రమేష్. బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) అనే హానికరం కాని ఈగకు చెందిన పిల్ల పురుగులను కోళ్ల ఫారంలోని విసర్జితాలపై వదిలితే కోళ్ల ఫారాల నుంచి దుర్వాసన సమస్య, విసర్జితాల యాజమాన్య సమస్యలు తీరిపోతాయని రమేష్ తెలిపారు. కోళ్ల వ్యర్థాలను – వర్మి కంపోస్ట్ ప్రక్రియ లాగా మారుస్తూ బిఎస్ఎఫ్ లార్వా (పిల్ల పురుగులు) పెరుగుతాయి. నెలకొకసారి వీటిని కోళ్ల ఫారంలో విసర్జితాలపై వేసుకుంటే చాలు. కోళ్ల ఫారాల నుంచి వ్యర్థాల దుర్వాసన నుంచి 95% పైగా విముక్తి కలిగించడానికి సహజ ప్రక్రియ అయిన బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా ఒక మంచి పరిష్కారమని ఆయన చెబుతున్నారు. గత ఐదారేళ్లుగా బిఎస్ఎఫ్ లార్వా ఉత్పత్తిపై పనిచేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కోళ్ల రైతులకు ఈ లార్వాను అందిస్తూ కాలుష్య నియంత్రణకు, ఆరోగ్య రక్షణకు కషి చేస్తున్నామని ఆయన అన్నారు. లార్వాను కోళ్ల విసర్జితాల (లిట్టర్)పై నెలకోసారి చల్లటం వల్ల ఉపయోగాలు: ► సాధారణ ఈగలు పూర్తిగా తగ్గిపోతాయి. కోళ్ల విసర్జితాలపై ఈగలు అరికట్టేందుకు ఉపయోగించే మందులు, అలాగే ఈగల లార్వాను నిర్మూలించడానికి, ఫీడ్‌లో ఇచ్చే మందులు అసలు అవసరం లేదు. ► దుర్వాసన తగ్గుతుంది, కోళ్ల విసర్జితాల నుంచి వెలువడే అమ్మోనియా తగ్గిపోతుంది. ► కోళ్ల ఫారంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. కళ్ళు మంటలు, సిఆర్డి సమస్య తగ్గుతుంది. ► విసర్జితాలను బిఎస్ఎఫ్ పిల్ల పురుగులు ఎరువుగా మార్చే క్రమంలో, విసర్జితాల్లో తేమ తగ్గిపోయి, దుర్వాసన కూడా తగ్గుతుంది. ► సున్నం, బ్లీచింగ్ అవసరం ఉండదు. వీటి ఖర్చు తగ్గుతుంది. ► విసర్జితాల నిర్వహణకు కూలీలు, స్పేయ్రర్లు, మందుల ఖర్చు ఆదా అవుతుంది. కోళ్ల విసర్జితాలపై ఉండే సాల్మొనెల్లా, ఈ–కొలి వంటి హానికారక సూక్ష్మక్రిములను అరికడతాయి ► ఆర్గానిక్ కంపోస్ట్‌గా మారిన కోళ్ల విసర్జితాలను రైతులు మంచి ధరకు విక్రయించుకోవచ్చు. బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను విసర్జితాలపై చల్లటం అనే సహజ సిద్ధమైన ప్రక్రియ వల్ల.. కోళ్లకు, పనివారికి, చుట్టపక్కల నివసించే ప్రజలకు ఇబ్బందులు తప్పటమే కాకుండా, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ► చనిపోయిన కోళ్లను, పగిలిపోయిన గుడ్లను త్వరగా కుళ్ళబెట్టడానికి, దుర్వాసన, బాక్టీరియా తగ్గడానికి కూడా బిఎస్ఎఫ్ లార్వా ఉపయోగపడుతుంది. ► కోళ్ల ఫారం పరిసర ప్రాంతాలు ఆరోగ్యకరంగా, కాలుష్యరహితంగా తయారై కోళ్ల ఆరోగ్యం బాగుంటుంది. ► ఉత్పాదకత 1–2 శాతం పెరుగుతుంది. బిఎస్ఎఫ్ గుడ్డు నుంచి ఈగ వరకు జీవితకాలం మొత్తం 45 రోజులు. గుడ్డు నుంచి పిల్లలను ఉత్పత్తి చేయటం అనేది తక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమ గల వాతావరణంలో జరగాల్సి ఉంటుంది. మరోన్నో ఉపయోగాలు.. ► 20 రోజుల వయసులో గోధుమ రంగులో ఉండే బిఎస్ఎఫ్ పురుగులు బతికి ఉండగానే లేయర్ కోళ్లకు, బ్రాయిలర్ కోళ్లకు, నాటు కోళ్లకు 10–20% మేరకు సాధారణ మేత తగ్గించి మేపవచ్చు. ► వంటింటి వ్యర్థాలు, ఆహార వ్యర్థాలపై ఈ బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను వేసి పెంచవచ్చు. ► 15 రోజుల తర్వాత ఆ లార్వాను పెంపుడు కుక్కలకు /పిల్లులకు /పక్షులకు మేతగా వేయొచ్చు. బతికి ఉన్న పురుగులు మేపవచ్చు. లేదా ఎండబెట్టి లేదా పొడిగా మార్చి కూడా వాడుకోవచ్చు. 'ఆక్వా చెరువుల్లో రోజుకు మూడు సార్లు మేత వేస్తూ ఉంటారు. ఒక మేతను బిఎస్ఎఫ్ లార్వాను మేపవచ్చని రమేష్ చెబుతున్నారు.' వివరాలకు: 9154160959 - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!? -
అన్నదాతలకు మాట సాయం!
రైతు స్వరాజ్య వేదిక అనే స్వచ్ఛంద సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు అవసరమయ్యే అనేక అంశాలపైన మాట సాయం చేయడానికి హైదరాబాద్‌లో ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఖరీఫ్ కాలంలో వివిధ పంటలకు సంబంధించిన సూచనలు, పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా వేసుకోదగిన పంటలు, కరువు సమస్యలు, బ్యాంకు రుణాలు / గుర్తింపు కార్డులకు సంబంధించిన సలహాలు, సందేహాలను ఈ సహాయ కేంద్రం అందిస్తుంది. రైతులు 08500 98 3300 నంబరుకు ఫోన్ చేసి తెలుగులో సూచనలు, సలహాలు పొందవచ్చు. ఇది ఉచిత ఫోన్ కాదు. మార్కెట్ నిమ్మతో శ్రీగంధం సాగు బెస్ట్?! శ్రీగంధం, ఎర్రచందనం వంటి ఖరీదైన దీర్ఘకాలిక కలప పంటలు సాగు చేసే క్షేత్రంలో నిరంతర ఆదాయాన్నిచ్చే అరుదైన పండ్ల జాతులను కూడా కొంత విస్తీర్ణంలో సాగు చేసుకోవడం ఉత్తమం అంటున్నారు ఉద్యాన తోటల రైతు సుఖవాసి హరిబాబు. తన శ్రీగంధం, ఎర్రచందనం తోటలో ఎకరం విస్తీర్ణంలో 90కి పైగా విశిష్టమైన పండ్ల జాతుల మొక్కల్ని కూడా ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామ పరిధిలో పది ఎకరాల్లో హరిబాబు రెండేళ్ల క్రితం నుంచి శ్రీగంధం, ఎర్రచందనం తోటను సాగు చేస్తున్నారు. అందులో ఒక ఎకరంలో అత్యంత అరుదైన సుమారు 90 జాతుల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. మన వాతావరణానికి అనువుగా ఉండే దక్షిణాసియా దేశాల్లో పెరిగే ప్రత్యేకమైన పండ్ల జాతులను శ్రద్ధతో వెదికి తెచ్చి సాగు చేస్తుండడం విశేషం. వాటర్ యాపిల్, రాంభూన్, లాంగాన్, అవకాడో, పుల్సాన్, గార్సినియా గుంగట, కోస్టస్ ఉడ్సోని, డ్రాగన్ ఫ్రూట్ వంటి అనేక జాతులు ఆయన తోటలో కనిపిస్తాయి. నాటిన ఏడాది నుంచే కొన్ని జాతులు ఫలాలనిస్తున్నాయి. పర్యాటక అభిరుచి కలిగిన హరిబాబు ఎక్కడ ప్రత్యేకమైన పండ్ల మొక్క కనిపించినా తెచ్చి తన తోటలో నాటుతున్నారు. పడావుగా ఉన్న నల్లరేగడి భూమిని కొని, అడుగు మందాన ఎర్రమట్టి పోసి మొక్కలు నాటడం విశేషం. వరుసల మధ్య, మొక్కల మధ్య 10 అడుగుల దూరం పాటించారు. ఏడాదిన్నర క్రితం 3 వరుసలు శ్రీగంధం, ఒక వరుస ఎర్రచందనం నాటారు. పొలం చుట్టూ ఇనుప కంచె వేసి.. వాక్కాయ చెట్లు పెంచారు. శ్రీగంధం మొక్కకు అడుగు దూరంలో ఒక వరుసలో మార్కెట్ నిమ్మ (ఏడాదికే కాపుకొస్తుంది. ఐదారు అడుగులకు మించి పెరగదు), ఒక వరుసలో కంది వేశారు. అయితే, కంది పక్కన ఉన్న శ్రీగంధం మొక్కలకన్నా మార్కెట్ నిమ్మ పక్కన ఉన్న శ్రీగంధం మొక్క ఏపుగా పెరుగుతున్న విషయాన్ని తన అనుభవంలో గ్రహించానని హరిబాబు చెబుతున్నారు. శ్రీగంధంతోపాటు థాయ్ జామరెడ్, మాంగోస్టిన్, రాంభూటాన్, శాంటాల్, వెల్వెట్ ఆపిల్, రామాఫలం, వాటర్ యాపిల్ వంటి మొక్కలను కూడా కొద్దినెలలుగా ప్రయోగాత్మంగా కలిపి పెంచుతున్నారు. 12 రకాల నూనెలతో పోషణ తోటకు డ్రిప్ ద్వారా నీటితోపాటు 12 రకాల నూనెల మిశ్రమాన్ని హరిబాబు అందిస్తున్నారు. వేప, వేరుశనగ, కానుగ, ఇప్ప, పత్తి, వరి తవుడు, పొద్దుతిరుగుడ, ఆముదం, నువ్వులు, కొబ్బరి నూనెలతోపాటు చేప నూనెను సమపాళ్లలో కలిపి ఎకరానికి కిలో చొప్పున డ్రిప్ ద్వారా నీటితోపాటు ఇస్తున్నారు. సంవత్సరానికి ఎకరానికి 25-30 లీటర్ల నూనెల మిశ్రమాన్ని వాడుతున్నారు. నూనె బరువులో 10 శాతం వరకు ఎమల్సిఫయర్ను కలిపి వాడుతున్నారు. దీనితోపాటు 20 రోజులకోసారి జీవామృతాన్ని ఎకరానికి 230 లీటర్ల చొప్పున మొక్కల పాదుల్లో పోస్తున్నారు. నూనెల మిశ్రమాన్ని, జీవామృతాన్ని క్రమం తప్పకుండా అందిస్తున్నందున తోటలో మొక్కలు పోషక లోపం, తెగుళ్ల బెడద లేకుండా ఏపుగా పెరుగుతున్నాయని హరిబాబు (94412 80042) సంతోషంగా చెప్పారు. అంజూర ఆకులతో గ్రీన్ టీ! ఆరోగ్యదాయకమైన గ్రీన్‌టీని తయారు చేసుకోవడానికి కుండీల్లో పెంచుకునే వివిధ మొక్కల ఆకుల పొడి శ్రేష్టమని నిపుణులు చెబుతున్నారు. తులసి, మునగ, స్టీవియా ఆకుల పొడితో టీ తయారు చేసుకోవడం తెలిసిందే. అదే జాబితాలో అంజూర కూడా చేరింది. అంజూర ఆకుల టీ తాగితే మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. పెద్ద ఆకులను కోసి నీటితో కడిగి నీడలో ఆరబెట్టాలి. ఎండిన ఆకులను నలిపి పొడి చేసి పెట్టుకోవాలి. లీటరు నీటిలో రెండు చెంచాల పొడిని వేసి 15 నిమిషాలు.. నీరు సగం ఆవిరయ్యే వరకు మరగబెట్టి.. వడకడితే టీ సిద్ధమైనట్లే. ఇలా తయారు చేసుకున్న టీని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకొని కూడా వాడుకోవచ్చు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటో: కందల రమేష్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్