సెమీ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ ఉందని మీకు తెలుసా? | Health, High Income With IndiGap | Sakshi
Sakshi News home page

సెమీ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ ఉందని మీకు తెలుసా?

Published Tue, Jan 9 2024 9:27 AM | Last Updated on Tue, Jan 9 2024 1:15 PM

Health, High Income With IndiGap - Sakshi

మంత్రి కాకాణి నుంచి ఇండిగ్యాప్‌ ధృవీకరణ పత్రాన్ని అందుకుంటున్న ఉయ్యూరు సాంబిరెడ్డి (ఎడమ)

'రసాయనిక ఎరువులు, పురుగుమందులు.. జన్యుమార్పిడి విత్తనాలను అస్సలు వాడకుండా పంటలు పండించే సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు దేశ విదేశాల్లో ‘ఆర్గానిక్‌’ సర్టిఫికేషన్‌ గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ‘మంచి వ్యవసాయ పద్ధతుల(జి.ఎ.పి.)’తో పండించే ఆహారోత్పత్తులకు ‘గ్యాప్‌’ సర్టిఫికేషన్‌కు కూడా అదే మాదిరి గుర్తింపు ఉంది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో ‘గ్లోబల్‌గ్యాప్‌’ ప్రమాణాలు అమల్లో ఉన్నాయి. ఈ ఆహారోత్పత్తులకు ఆయా దేశాల్లోని వినియోగదారులు, రిటైలర్ల ఆదరణతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ మంచి గిరాకీ ఉంది.

‘గ్లోబల్‌గ్యాప్‌’కు అనుగుణంగా దేశీయంగా రైతులు, ప్రాసెసింగ్‌ పరిశ్రమదారులు పాటించవలసిన ‘ఇండిగ్యాప్‌’ ప్రమాణాలను భారత ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సెల్‌ ఆఫ్‌ ఇండియా (క్యు.సి.ఐ.) 2021లో అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రమాణాలను రైతులకు మొట్టమొదటగా అందుబాటులోకి తెచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కటం విశేషం. తొలుత ఈ ప్రమాణాలను పాటించటం అలవాటు చేసుకునే రైతులకు.. భవిష్యత్తులో సేంద్రియ సర్టిఫికేషన్‌ పొందటం సులువు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘గ్లోబల్‌గ్యాప్‌’, ‘ఇండిగ్యాప్‌’ ప్రమాణాలు, వాటి ప్రయోజనాల పూర్వాపరాలపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..'

ఆహారం ప్రజలకు స్థానికంగా, సరసమైన ధరలో, అందరికీ అందుబాటులో ఉంటే ప్రజలకు ఆహార భద్రత (ఫుడ్‌ సెక్యూరిటీ) ఉన్నట్లు. ఆ ఆహారం మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించని ప్రమాణాలతో పండించి, నిల్వ చేసినదై ఉంటే అది క్షేమదాకమైన ఆహారం (సేఫ్‌ ఫుడ్‌). తగుమాత్రంగా రసాయనాలు వాడుతూ, ఇతర జాగ్రత్తలు పాటిస్తూ సేఫ్‌ ఫుడ్‌ను పండించడానికి రైతులకు ఉపకరించేవే ‘మంచి వ్యవసాయ పద్ధతులు’. వీటిని ‘గుడ్‌ అగ్రికల్చరల్‌ ప్రాక్టీసెస్‌ (జి.ఎ.పి.– గ్యాప్‌) అంటారు. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ‘గ్లోబల్‌గ్యాప్‌’ ప్రమాణాలకు అనుగుణంగా రూపొం​దినవే ‘ఇండిగ్యాప్‌’ ప్రమాణాలు. ఈ ప్రమాణాల ద్వారా రైతుల ఉత్పత్తులకు గిరాకీ పెరిగి, వారి నికరాదాయం పెరుగుతుందని అనుభవాలు చెబుతున్నాయి.

పసుపు తోటలో శ్రేష్ట ఎఫ్‌పిసి రైతు నెర్ల విజయేంద్రరెడ్డి

‘గ్లోబల్‌గ్యాప్‌’ పుట్టుపూర్వోత్తరాలు..
తెలిసో తెలియకో పరిమితికి మించి రసాయనిక ఎరువులు, పురుగుమందులను విచ్చలవిడిగా వాడుతూ పంటలు పండిస్తున్నందు వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోంది. కొందరు రైతులు నిషిద్ధ పురుగుమందులను సైతం వాడుతున్నారు. పురుగుమందులు చల్లటానికి, పంట కోతకు మధ్య పాటించాల్సిన వ్యవధిని సైతం పాటించకపోవటం వల్ల విష రసాయనాల అవశేషాలు పరిమితికి ఎన్నో రెట్లు ఎక్కువ కనిపిస్తున్న సందర్భాలు లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కోసిన తర్వాత కలుషిత నీటిలో కడగటం వంటి, రవాణా, నిల్వ పద్ధతుల్లో కూడా టోకు, చిల్లర వ్యాపారులు నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోవటం పరిపాటిగా మారింది.

ఇటువంటి సురక్షితం కాని ఆహారోత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. మన రాష్ట్రం, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఇదే. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఆహార వ్యవస్థలో గుణాత్మక మార్పులు తేవడానికి యూరప్‌లో చిల్లర వర్తకులు 1997లో ‘యూరోప్‌గ్యాప్‌’ పేరుతో మంచి వ్యవసాయ పద్ధతుల అమలుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వారి కృషి ఫలితంగా మెరుగుపరిచిన ప్రమాణాలు 2007లో ‘గ్లోబల్‌గ్యాప్‌’ పేరుతో ప్రపంచ దేశాలకు అందుబాటులోకి వచ్చాయి.

  • ధాన్యపు పంటలు, కూరగాయలు, పండ్లు, పూల సాగుతో పాటు ఆక్వా సాగుకు కూడా ‘గ్లోబల్‌గ్యాప్‌’ ప్రమాణాలు వర్తింపజేస్తున్నారు. 
  • పంట పొలాలు, తోటలు, ఆక్వా చెరువుల్లో సాగు పద్ధతుల్లో ప్రతి దశలోనూ.. అదేవిధంగా ఆహారోత్పత్తుల సేకరణ, రవాణా, నిల్వ, ప్రాసెసింగ్‌ వ్యవస్థల్లో పాటించాల్సిన ప్రమాణాలను ‘గ్లోబల్‌గ్యాప్‌’ ప్రమాణాల సంస్థ నిర్దేశిస్తోంది.
  • భారత్‌ సహా 130 దేశాల్లో ఇప్పటికి 1,95,000 మంది రైతులు గ్లోబల్‌గ్యాప్‌ సర్టిఫికేషన్‌ పొందారు. 
  • 43 లక్షల హెక్టార్లలో రైతులు అందుకు అనుగుణంగా సాగు చేస్తూ.. సాధారణ ఉత్పత్తులతో పోల్చితే అధిక ధరకు అమ్ముకుంటున్నారు.
  • 25 లక్షలకు పైగా మెట్రిక్‌ టన్నుల చేపలు, రొయ్యలతో పాటు.. 2.1 కోట్ల టన్నుల సర్టిఫైడ్‌ కాంపౌండ్‌ ఫీడ్‌ను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. 
  • టర్కీలో గ్యాప్‌ ప్రమాణాలు పాటించిన రైతుల పొలాల్లో రసాయనిక ఎరువుల వాడకం 19–31% మేరకు తగ్గింది. రసాయనిక పురుగుమందుల వాడకం 50%, శిలీంధ్రనాశనులు 25%, కలుపు మందులు 70% తగ్గిందని ఒక అధ్యయనంలో తేలింది.
  • మన దేశంలో చిన్న, సన్నకారు రైతులు, పెద్ద రైతులు అనుసరించదగిన మంచి వ్యవసాయ పద్ధతులను క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా (క్యు.సి.ఐ.) ‘ఇండిగ్యాప్‌’ ప్రమాణాలను 2021లో ప్రకటించింది. 2023 ఆగస్టులో గ్లోబల్‌ గ్యాప్‌ ప్రమాణాలతో ఇండిగ్యాప్‌ను అనుసంధానం చేశారు. 
  • 180కి పైగా గ్లోబల్‌గ్యాప్‌ సర్టిఫికేషన్‌ సంస్థలు అంతర్జాతీయగా రైతులకు సేవలందిస్తున్నాయి. 
  • మన దేశంలో ‘ఇండిగ్యాప్‌’ సర్టిఫికేషన్‌ విస్తరణ సేవలను వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావటం విశేషం. క్వాలిటీ కౌన్సెల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో గున్వత్తా సంకల్ప్‌ పథకం కింద ఇండిగ్యాప్‌ సర్టిఫికేషన్‌ కార్యక్రమం అమలవుతోంది. 
  • తొలి ఏడాది 33 ఎఫ్‌పిసిలకు శిక్షణ ఇచ్చారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఇండ్‌గ్యాప్‌ అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కృషిగ్యాప్‌ డిజిటల్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఇందుకు తోడ్పడుతోంది.
  • స్పైసెస్‌బోర్డు ద్వారా మిరప, పసుపు తదితర సుగంధ ద్రవ్య పంటల్లో సైతం ఏపీ, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇండిగ్యాప్‌ సర్టిఫికేషన్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ప్రభుత్వ ఖర్చుతోనే పరీక్షలు..
‘ఇండిగ్యాప్‌’ సర్టిఫికేషన్‌ పొందే ప్రయత్నాలను దేశంలో మొదటిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే 2023 ఖరీఫ్‌ నుంచి ప్రారంభించింది. తొలుత 20 వ్యవసాయ, 13 ఉద్యాన ఎఫ్‌పిసిలకు శిక్షణ ఇచ్చాం. ఇప్పటికే కొందరు రైతులు తక్కువ ఖర్చుతో, రసాయనిక అవశేషాల్లేని ఆహారం పండించి రైతులు అధిక ఆదాయం పొందారు. పరిమితికి మించి రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులను పండించిన తర్వాత శాంపుల్స్‌ను బెంగళూరు పంపి ప్రభుత్వ ఖర్చులతోనే 200 వరకు రసాయనాలకు సంబంధించి పరీక్ష చేయిస్తున్నాం. ఒక్కో శాంపిల్‌కు రూ. 10–12 వేలు ఖర్చు అవుతోంది. ఏపీలోనే రూ.2.6 కోట్లతో అధునాతన లాబ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండ్‌గ్యాప్‌ సర్టిఫికేషన్‌ పొందే రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు 130 దేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ను రైతులకు అందించడానికి సంబంధించి అపెడా ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన రైతుల బ్రాండెడ్‌ ఉత్పత్తులను దేశ విదేశాల్లో మంచి ధరకు విక్రయించి అధికాదాయం రాబట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

– డా. ఎ. త్రివిక్రమరెడ్డి (97393 16931), డైరెక్టర్, ఏపీ విత్తన, సేంద్రియ ధృవీకరణ అథారిటీ, గుంటూరు
 

రైతుల్లో మార్పు వస్తోంది!
మా శ్రేష్ట ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీలో 300 మంది రైతులు ఉన్నారు. ఇండిగ్యాప్‌ సర్టిఫికేషన్‌ కోసం రూ. 18 వేలు ఫీజు చెల్లించి నమోదు చేసుకున్నాం. మొదటి ఏడాది 24 మంది రైతులు 50 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి 100 మంది రైతులు 500 ఎకరాల్లో పసుపు సాగు చేయించాలన్నది లక్ష్యం. మా రైతులు 10% రసాయనిక ఎరువులు 90% సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. నిషేధిత పురుగుమందులు వాడకుండా ఇండిగ్యాప్‌ నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తున్న విధంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నాం. పసుపు పండిన తర్వాత ప్రభుత్వమే పరీక్ష చేయించి, ఇండిగ్యాప్‌ సర్టిఫికేట్‌ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్‌ ఉంటే దేశ విదేశాల్లో మా ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. ఈ సర్టిఫికేషన్‌ కోసం పనిచేస్తున్న మా సభ్య రైతుల్లో మార్పు కనిపిస్తోంది. ఇండిగ్యాప్‌ మామిడి, మిరప, అరటి రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అన్ని వివరాలూ మాన్యువల్‌గా నమోదు చేస్తున్నాం. వచ్చే ఏడాది ఆన్‌లైన్‌ సదుపాయం అందుబాటులోకి వస్తే వెసులుబాటుగా ఉంటుంది.
– ఉయ్యూరు సాంబిరెడ్డి (93969 62345), శ్రేష్ట ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ, కొల్లిపర, గుంటూరు జిల్లా

చిన్న, సన్నకారు రైతుల కోసం..!
విదేశాల్లో రిటైల్‌ స్టోర్లలో పక్కపక్కనే సాధారణ రసాయనిక వ్యవసాయంలో పండించిన ఆహారోత్పత్తులు, సేంద్రియ సర్టిఫైడ్‌ ఆహారోత్పత్తులతో పాటు.. మంచి వ్యవసాయ పద్ధతుల (గ్యాప్‌) ద్వారా  పరిమితంగా రసాయనాలు వాడి పండించిన సర్టిఫైడ్‌ ఉత్పత్తులు కూడా పక్కపక్కనే పెట్టి అమ్ముతూ ఉంటారు. వినియోగదారులు తమ స్థోమతను బట్టి వాటిని కొనుగోలు చేస్తుంటారు. యూరప్‌లో 1997లో రిటైల్‌ వర్తకుల చొరవ వల్ల ‘గ్లోబల్‌గ్యాప్‌’ సర్టిఫికేషన్‌ ప్రారంభమైంది. ఆ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో క్వాలిటీ కౌన్సెల్‌ ఆఫ్‌ ఇండియా ‘ఇండిగ్యాప్‌’ ప్రమాణాలను నిర్దేశించింది. ఈ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించటం, సర్టిఫికేషన్‌ పొందే ప్రక్రియకు సంబంధించిన అంశాలపై మా సంస్థ అనేక రాష్ట్రాల్లో అధికారులు, ఎఫ్‌పిసిలు, రైతులకు శిక్షణ ఇస్తున్నాం.

గతంలో మహారాష్ట్రం, ఏపీలకు చెందిన ద్రాక్ష రైతులకు కూడా శిక్షణ ఇచ్చాం. ఔషధ మొక్కల పెంపకంపై స్పైసెస్‌ బోర్డు తోడ్పాటుతో రైతులకు శిక్షణ ఇస్తున్నాం. శంషాబాద్‌లో క్షేత్రస్థాయిలో ఇండిగ్యాప్, సేంద్రియ సర్టిఫికేషన్లకు అనుగుణంగా శాస్త్రవేత్తలు, అధికారులు, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఆచరణాత్మక శిక్షణ ఇచ్చేందుకు త్వరలో నమూనా క్షేత్రాన్ని నిర్మిస్తున్నాం.  ‘ఇండిగ్యాప్‌’ ప్రమాణాల ప్రకారం రైతులు పంటలు పండించి ఎఫ్‌పిఓలు, కోఆపరేటివ్‌ల ద్వారా గ్రూప్‌ సర్టిఫికెట్‌ పొందొచ్చు. పరిమితికి మించి రసాయనిక పురుగుమందుల అవశేషాల్లేని మంచి ఆహారానికి ఇటు దేశీయ మార్కెట్లలోగాని, అటు అంతర్జాతీయ మార్కెట్లలో గాని మంచి గిరాకీ ఉంది. రైతులు అధికాదాయం పొందవచ్చు.

– కోటెల శ్రీహరి (98480 34740), వ్యవస్థాపకులు, కృషిగ్యాప్‌ డిజిటల్‌ సొల్యూషన్స్, హైదరాబాద్‌, www.krishigap.com

– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement