మిల్లెట్స్‌ను ప్రోత్సహిస్తే.. లాభాలు మెండు! Cultivation Of Small Grains Sakshi Sagubadi News | Sakshi
Sakshi News home page

మిల్లెట్స్‌ను ప్రోత్సహిస్తే.. లాభాలు మెండు!

Published Tue, Jul 2 2024 7:59 AM | Last Updated on Tue, Jul 2 2024 8:54 AM

Cultivation Of Small Grains Sakshi Sagubadi News

చిరుధాన్యాల సాగుపై 34 గ్రామాల్లో 1,100 మంది రైతుల వర్షాధార సేద్య అనుభవాలపై ‘సెస్‌’ ఇంటింటి సర్వే

డీడీఎస్‌ సంఘాల సంస్థాగత.. మార్కెటింగ్‌ మద్దతు వల్లే రైతులకు అధికాదాయం వస్తోందని వెల్లడి

చిరుధాన్యాల సేంద్రియ సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక మద్దతు అవశ్యమని సిఫారసు

జూలై 6న అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా...

తెలంగాణ దక్కను పీఠభూమిప్రాంతంలో వర్షాధారంగా వ్యవసాయం చేసే సన్న, చిన్నకారు రైతులు సంఘంగా ఏర్పడటం.. సేంద్రియ సేద్య పద్ధతిని అనుసరించటం.. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు తదితర పంటలను కలిపి సాగు చేయటం.. సంఘటితంగా మార్కెటింగ్‌ చేసుకోవటం నిస్సందేహంగా బహువిధాలా లాభదాయకమే! సంఘటితమైన చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు తాము పండిస్తున్న పౌష్టికాహారాన్ని తింటూ.. మిగతా దిగుబడులు విక్రయిస్తూ మంచి నికరాదాయం కూడా పొందగలుగుతున్నారని, పనిలో పనిగా భూసారాన్ని కూడా పెంపొందించుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెస్‌’ జరిపిన తాజా అధ్యయనం చెబుతోంది.

డక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (డీడీఎస్‌)ప్రోత్సాహంతో మహిళా రైతుల స్వయం సహాయక సంఘాలు అనుసరిస్తున్న సేంద్రియ సేద్య నమూనా సాధిస్తున్న విజయాలపై ‘సెస్‌’ ఇటీవలే అధ్యయనం చేసింది. సహకార స్ఫూర్తిని చాటిచెబుతున్న ఈ అధ్యయన వివరాలు..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంత గ్రామాల్లో డీడీఎస్‌ చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగును చాలాకాలంగాప్రోత్సహిస్తోంది. సాగులో అడుగడుగునా ఈ మహిళా రైతులకు తోడుగా ఉండటంతో పాటు మార్కెట్‌లో మద్దతు ధరకు తానే సేకరించి, ్రపాసెస్‌ చేసి ఏడాది పొడవునా హైదరాబాద్, జహీరాబాద్‌ప్రాంతాల్లో ప్రజలకు విక్రయిస్తోంది డీడీఎస్‌. సంఘటిత శక్తి వల్ల ఈ రైతులు ఎకరానికి రూ. 6 వేలకుపైగా నికరాదాయం పొందుతున్నారు.

అయితే, కొందరు రైతులు డీడీఎస్‌తో సంబంధం లేకుండా చిరుధాన్యాలను పండించి వ్యక్తిగతంగా మార్కెట్‌లో అమ్ముకుంటూ నష్టాల పాలవుతున్నారని హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ (సెస్‌) ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది.

సెస్‌ సంచాలకురాలు ఇ. రేవతి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బి.సురేశ్‌ రెడ్డి, అసిస్టెంట్‌ప్రొఫెసర్‌ పెద్ది దయాకర్‌ల బృందం 2024 జనవరిలో జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్, న్యాల్కల్, మొగడంపల్లె మండలాల్లోని 34 గ్రామాల్లో 1,100 మంది రైతుల వ్యవసాయ అనుభవాలపై ఇంటింటి సర్వే చేసింది. ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలతో ‘సెస్‌’ పరిశోధనా నివేదికను వెలువరించింది.

సర్వే జరిగిన గ్రామాల్లో ప్రధానంగా వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు చిరుధాన్యాలు తదితర పంటలను రసాయనిక పద్ధతిలో కాకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, ఊదలు వంటి చిరుధాన్యాలతో పాటు కందులు, పెసలు, మినుములు, ఉలవలు, సోయా, మిరప, మొక్కజొన్న, అల్లం, పత్తి, పసుపు వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో 80% మంది రైతులు తమ చిన్న చిన్న కమతాల్లో ఏదో ఒక పంటను కాకుండా కనీసం 8 రకాల పంటలు కలిపి పండిస్తున్నారు.

డీడీఎస్‌తో సంబంధం లేకుండా చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు ఎకరానికి అయిన ఖర్చు రూ. 11,893. అయితే, డీడీఎస్‌ సహకార సంఘాల సభ్యులైన మహిళా రైతులకు చిరుధాన్యాలు తదితర కలిపి పంటల సాగుకు ఎకరానికి అయిన ఖర్చు రూ. 10,218 మాత్రమే. చిరుధాన్యాలు తదితర పంటలు కలిపి పండించిన రైతులకు మొత్తం ఖర్చులో 70% కూలీల ఖర్చే. చిరుధాన్యేతర పంటల రైతులకు అయిన కూలీల ఖర్చు 39% మాత్రమే.

చిరుధాన్యేతర పంటల సాగు ఖర్చులో 43% విత్తనానికి అవుతుంది. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు అదనం. డీడీఎస్‌తో సంబంధం లేకుండా చిరుధాన్య పంటలు సాగు చేసే రైతులు విత్తనాలకు 12% ఖర్చు పెడుతున్నారు.

డీడీఎస్‌ సంఘాల్లో రైతులు విత్తనాలకు 10% ఖర్చు చేస్తున్నారు. వీరు సేంద్రియ ఎరువుల కోసం మొత్తం ఖర్చులో 15% వెచ్చిస్తున్నారు. బోరాన్, జింక్‌ వంటి సూక్ష్మ పోషకాలను భూమికి అందిస్తున్నారు. రసాయనిక వ్యవసాయంలో చిరుధాన్యాలు సాగు చేస్తున్న సంఘటితం కాని రైతులకు మార్కెట్‌లో సరైన ధర రాక ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువ అవుతుండటం గమనార్హం.

అయితే, డీడీఎస్‌ సహకార సంఘాల్లో ఉన్న సేంద్రియ రైతులకు మాత్రం డీడీఎస్‌ సంస్థాగత తోడ్పాటు.. మార్కెటింగ్‌ మద్దతు, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి వల్లే రైతులకు అధికాదాయం వస్తోందని సెస్‌ నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా, ‘చిరుధాన్యేతర’ (పత్తి తదితర) పంటలను సాగు చేసే రైతులకు అన్నీ అనుకూలిస్తే రూ. 12 వేలకు పైగా నికారదాయం వస్తోంది. అను కూలించకపోతే ఏకపంటలు సాగు చేసే ఈ రైతులకు పెట్టుబడి నష్టం ఎక్కువగా 
ఉంటుంది.

చిరుధాన్యాల రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి..
వర్షాధారంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలను పండించే చిన్న, పెద్ద రైతులు సమజానికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. వాతావరణ మార్పుల్ని తట్టుకుంటూ భూసారాన్ని పెంపొందిస్తున్నారు. పర్యావరణానికీ మేలు చేస్తున్నారు.

ఈ మెట్ట రైతుల విశేష కృషికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చే విధంగా బలమైన విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రైతులకు ఎకరానికి కనీసం రూ. 2–3 వేలు ప్రత్యేకప్రోత్సాహకంగా ఇవ్వాలి. అన్ని రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలకు కనీస మద్దతు ధరలు ప్రకటించాలి. మిల్లెట్‌ రైతుల ఎఫ్‌పిఓలు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలకు ప్రత్యేక సుదుపాయాలు ఇవ్వటం ద్వారా ప్రత్యేక మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించాలి.

నీటిపారుదల రైతులతో పోల్చితే వీరికి అధిక ్రపాధాన్యం ఇచ్చేలా గట్టి చట్టాలు తేవాలి. ఈ చర్యలతో చిరుధాన్యాల, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగి, ప్రజలకు మరింత సరసమైన ధరలకు లభిస్తాయి. – డా. బి.సురేశ్‌ రెడ్డి (95505 58158), అసోసియేట్‌ ప్రొఫెసర్, సెస్, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement