సాధారణ బోదెలపైన అల్లం విత్తుకోవటం కన్నా వెడల్పాటి ఎత్తు మడులపై రెండు సాళ్లుగా నాటుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎత్తు మడులపై అల్లం సాగు వల్ల వేరుకుళ్లు వంటి తగుళ్ల సమస్య తీరిపోతుందని, కనీసం 30–40% అల్లం దిగుబడి పెరుగుతుందని ఉత్తరాంధ్ర జిల్లాల్లో గిరిజన రైతులతో పనిచేస్తున్న వికాస స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎస్. కిరణ్ తెలిపారు.
సాధారణంగా రైతులు బోదెలు తోలి అల్లం విత్తుకుంటూ ఉంటారు. వర్షాలకు కొద్ది రోజులకే బోదె, కాలువ కలిసిపోయి నీరు నిలబడటం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా వేరుకుళ్లు వంటి తెగుళ్లు వస్తుంటాయి. నీటి ముంపు పరిస్థితుల్లో పంట దిగుబడి భారీగా దెబ్బతిని ఖర్చులు కూడా రాని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి.
ఈ సమస్యల నుంచి బయటపడి పంట విషలం కాకుండా మంచి దిగుబడి పొందాలంటే ఎత్తుమడులపై విత్తుకోవటమే మేలని వికాస సంస్థ పాడేరు, అరకు ప్రాంత రైతులకు అవగాహన కల్పిస్తోంది. ప్రేమ్‌జీ ఫౌండేషన్ తోడ్పాటుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం గత ఖరీఫ్ నాటికి రెండేళ్లలోనే 543 మంది రైతులకు విస్తరించిందని డా. కిరణ్ వివరించారు. అడుగు ఎత్తున, రెండు నుంచి రెండున్న అడుగుల వెడల్పుతో ఎత్తు మడులను పొలంలో వాలుకు అడ్డంగా నిర్మించుకోవాలి.
రెండు వరుసలుగా అల్లం లేదా పసుపు విత్తుకోవచ్చు. అల్లం సాగులో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. ఎత్తుమడులపై విత్తుకోవటం, మురుగునీరు పోవడానికి కాలువలు ఏర్పాటు చేయటంతో పాటు ఎకరానికి 200 కిలోల ఘన జీవామృతం, 25 కిలోల వేపపిండి వేస్తారు. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతం (ఏటా 600 లీటర్లు) మొక్కల మొదళ్లలో పోస్తున్నారు. ఎకరానికి కనీసం 14–15 టన్నుల దిగుబడులు సాధిస్తున్నారని డా. కిరణ్ వివరించారు.
బోదెలు తోలి సాగు చేసే సాధారణ పద్ధతిలో సగటున ఎకరానికి 9–11 టన్నుల దిగుబడి వస్తుంటుందని, ఎత్తుమడుల పద్ధతిలో సగటున ఎకరానికి 5–6 టన్నులు అదనపు దిగుబడి వస్తోందన్నారు. ఎత్తుమడుల వల్ల కలుపు తీయటం సులభం అవుతుంది. పంట విఫలమై రైతు నష్టపోయే ప్రమాదం తప్పుతుంది. మైదానప్రాంతాల రైతులు కూడా ఎత్తు మడుల పద్ధతిని నిశ్చింతగా అనుసరించవచ్చని డా. కిరణ్ (98661 18877) భరోసా ఇస్తున్నారు.
– డాక్టర్ కిరణ్
13 నుంచి తిరుపతిలో సేంద్రియ ఎఫ్‌పిఓల మేళా..
కనెక్ట్ టు ఫార్మర్ సంస్థ నాబార్డ్ సహకారంతో ఈ నెల 13,14,15 తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రం (టౌన్‌క్లబ్)లో గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు, ఎఫ్‌పిఓల మేళాను నిర్వహించనుంది. కనెక్ట్ టు ఫార్మర్ సంస్థ నెలకో సేంద్రియ సంత నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
13 ఉ. 11 గంటలకు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, నాబార్డ్ సీజీఎం గో΄ాల్ మేళాను ప్రారంభిస్తారు. ΄ాత విత్తనాల ప్రదర్శన ఉంటుంది. 14న ఉదయం అమేయ కృషి వికాస కేంద్రం (భువనగిరి) వ్యవస్థాపకులు, ప్రముఖ రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి ఉద్యాన పంటల్లో గ్రాఫ్టింగ్‌పై శిక్షణ ఇస్తారు.
15న ప్రకృతి చికిత్సా పద్ధతులపై నేలకొండపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డా. కె. రామచంద్ర, ప్రకృతి సేద్యంపై గ్రామభారతి అధ్యక్షులు సూర్యకళ గుప్త, ప్రసిద్ధ అమృతాహార ప్రచారకులు ప్రకృతివనం ప్రసాద్, ఆరుతడి వరి సాగుపై ఆదర్శ రైతు శ్రీనివాస్ (గద్వాల్) వివరిస్తారు. ఇతర వివరాలకు 63036 06326. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
ఇవి చదవండి: బయోచార్ కంపోస్టు.. నిజంగా బంగారమే!
Comments
Please login to add a commentAdd a comment