విదేశాల నుంచి మొక్కలు, విత్తనాలు, చెక్క వస్తువులు, అలంకరణ చేపలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారా? విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ కంటికి నచ్చిన పూల మొక్కలనో, పంట మొక్కలనో, వాటి విత్తనాలనో అధికారుల కన్నుగప్పి వెంట తెస్తున్నారా?
మిరపతో పాటు కొన్ని కూరగాయ పంటలు, మామిడి తోటలను ఇటీవల అల్లాడిస్తున్న నల్ల తామర ఇలాగే విదేశాల నుంచి వచ్చిపడిందేనని మీకు తెలుసా? కొబ్బరి, ఆయిల్‌పామ్ వంటి తోటలను పీడిస్తున్న రుగోస్ రింగ్‌స్పాట్ తెల్లదోమ కూడా విదేశాల నుంచి మన నెత్తిన పడినదే. వీటి వల్ల జీవవైవిధ్యానికి, రైతులకు అపారమైన నష్టం కలుగుతోంది.
ఒక దేశంలో ఉన్నప్పుడు పెద్దగా నష్టం కలిగించని పురుగులు, తెగుళ్లు వేరే దేశపు పర్యావరణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి జీవవైవిధ్యానికి పెను సమస్య్ఠగా మారే ప్రమాదం ఉంటుంది.
ఒక్కసారి ఆ పర్యావరణంలో అది సమస్యగా మారిన తర్వాత దాన్ని నిర్మూలించటం చాలా సందర్భాల్లో అసాధ్యం. ఉదాహరణ.. మన రైతులను వేధిస్తున్న నల్లతామర, రుగోస్ రింగ్‌స్పాట్ తెల్లదోమ. అందుచేత.. విదేశాల నుంచి సకారణంగా ఏవైనా మొక్కల్ని, విత్తనాలను, అలంకరణ చేపలను తెప్పించుకోవాలనుకుంటే.. అంతకు ముందే ఫైటోశానిటరీ సర్టిఫికెట్‌తో పాటు ఇతర అనుమతుల్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త..!
తెలిసో తెలియకో పోస్టు, కొరియర్ల ద్వారా మన వంటి వారు కొనుగోలు చేస్తున్న విదేశీ మొక్కలు, విత్తనాలతో పాటు మనకు తెలియకుండా దిగుమతయ్యే సరికొత్త విదేశీ జాతుల పురుగులు, తెగుళ్లు మన దేశంలో పంటలకు, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఆహార భద్రతకు ఎసరు పెట్టే పరిస్థితులూ తలెత్తవచ్చు. అందుకే అంతర్జాతీయంగా జన్యువనరుల వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఎయిర్‌పోర్టుల్లో, సీపోర్టుల్లో, సరిహద్దుల్లో ప్రత్యేక అధికార వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
మొక్కలు, విత్తనాలే కాదు.. మట్టి ద్వారా కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి చీడపీడలు తెలియకుండా రవాణా కావొచ్చు. ఆ మధ్య ఒక క్రికెటర్ తనతో పాటు తీసుకెళ్తున్న బూట్లకు అడుగున అంటుకొని ఉన్న మట్టిని సైతం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గుర్తించి, నివారించడానికి ఇదే కారణం.
అధికారికంగా వ్యవసాయ పరిశోధనల కోసం దిగుమతయ్యే పార్శిళ్లను ఈ క్వారంటైన్ అధికారులు వాటిని నిబంధనల మేరకు పరీక్షించి, ప్రమాదం లేదనుకుంటేనే దిగుమతిదారులకు అందిస్తారు. జాతీయ మొక్కల జన్యువనరుల పరిశోధనా సంస్థ (ఎన్‌బిపిజిఆర్) ద్వారా ఇది జరుగుతుంది.
ఒక వ్యాపార సంస్థ నుంచి నేరుగా వినియోగదారుల మధ్య (బి2సి) జరిగే ఆన్‌లైన్ వ్యాపారం వల్లనే సమస్య. విదేశాల్లోని వినియోగదారులకు ఓ వ్యాపార సంస్థ నేరుగా అమ్మకాలు జరుపుతున్నందున దిగుమతులకు సంబంధించిన ఫైటోశానిటరీ నిబంధనల అమలు కష్టతరంగా మారింది.
అంతర్జాతీయంగా ఈ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ప్రపంచ దేశాల మధ్య ఇంటర్నేషనల్ ΄్లాంట్ ్ర΄÷టెక్షన్ ఒడంబడిక (ఐపిపిసి) గతంలోనే కుదిరింది. ఇటీవల కాలంలో పెద్ద తలనొప్పిగా మారిన ఈ–కామర్స్ పార్శిళ్లను కట్టడి చేయడం కోసం జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థలకు ఐపిపిసి సరికొత్త మార్గదర్శకాలను సూచించింది.
- గోల్డెన్ ఆపిల్ స్నెయిల్, - వరి మొక్కపై నత్త గుడ్లు
ఎవరేమి చెయ్యాలి?
దేశ సరిహద్దులు దాటి సరికొత్త చీడపీడలు మన దేశంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే, ప్రమాదవశాత్తూ వచ్చినా వాటిని తొలి దశలోనే గుర్తించి మట్టుబెట్టేందుకు సమాజంలోని అనేక వర్గాల వారు చైతన్యంతో వ్యవహరించాల్సి ఉంది.
రైతులు: చీడపీడలను చురుగ్గా గమనిస్తూ ఏదైనా కొత్త తెగులు లేదా పురుగు కనిపిస్తే వెంటనే అధికారులకు చె΄్పాలి. పర్యావరణ హితమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు: చీడపీడల నివారణ, నియంత్రణకు మేలైన పద్ధతులను రైతులకు సూచించాలి. వీటి అమలుకు మద్దతు ఇస్తూ.. మొక్కల ఆరోగ్య పరిరక్షణకు సంబంధీకులందరినీ సమన్వయం చేయాలి.
ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు, పాలకులు: మొక్కల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించాలి. పర్యావరణహితమైన సస్యరక్షణ చర్యలను ్రపోత్సహించాలి. ప్రమాదరహితమైన వ్యాపార పద్ధతులను ప్రవేశ పెట్టాలి. జాతీయ, రాష్ట్రాల స్థాయిలో మొక్కల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ సంస్థలను అన్ని విధాలా బలోపేతం చేయాలి.
దాతలు–సిఎస్‌ఆర్: మొక్కల ఆరోగ్య రక్షణ వ్యవస్థలను, సాంకేతికతలను బలోపేతం చేయాలి. ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) నిధులు సమకూర్చాలి. రవాణా, వ్యాపార రంగాలు: ప్రస్తుతం అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ఫైటోశానిటరీ చట్టాలను, ఐపిపిసి ప్రమాణాలను తు.చ. తప్పక పాటించాలి.
ప్రజలు: విదేశాల నుంచి మన దేశంలోకి మొక్కల్ని, మొక్కల ఉత్పత్తుల్ని తీసుకురావటం ఎంతటి ప్రమాదమో గుర్తించాలి. అధికార వ్యవస్థల కన్నుగప్పే విధంగా ఈ–కామర్స్ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా విదేశాల నుంచి మొక్కలను, విత్తనాలను ఆర్డర్ చేయకుండా చైతన్యంతో మెలగాలి.
విదేశీ నత్తలతో ముప్పు!
ఓ కోస్తా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మంచినీటి నత్త జాతికి చెందిన గోల్డెన్ ఆపిల్ స్నెయిల్‌ను విదేశాల నుంచి తెప్పించి సిమెంటు తొట్లలో పెంచుతూ పట్టుబడ్డాడు. దక్షిణ అమెరికా దీని స్వస్థలం. అయితే, తైవాన్, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు పాకిన ఈ నత్త ఆయా దేశాల్లో తామరతంపరగా పెరిగిపోతూ స్థానిక జలచరాలను పెరగనీయకుండా జీవవైవిధ్యాన్ని, వరి పంటను దెబ్బతీయటంప్రారంభించింది.
లేత వరి మొక్కలను కొరికెయ్యటం ద్వారా పంటకు 50% వరకు నష్టం చేకూర్చగలదు. ఫిలిప్పీన్స్‌లో ఏకంగా 200 కోట్ల డాలర్ల మేరకు పంట నష్టం కలిగించింది. వేగంగా పెరిగే లక్షణం గల ఈ నత్త మంచినీటి చెరువులు, కాలువలు, వరి ΄÷లాల్లో జీవవైవిధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ వ్యక్తి ఈ నత్తలను పెంచుతూ మాంసాన్ని విక్రయించటంప్రారంభించిన విషయం తెలుసుకున్న అధికారులు అతని వద్ద ఉన్న విదేశీ నత్తలను, వాటి గుడ్లను పూర్తిగా నాశనం చేశారు.
దీని వల్ల జీవవైవిధ్యానికి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో ఈ నత్తల్ని పెంచటంప్రారంభించినట్లు చెబుతున్నారు. కొరియర్ ద్వారా గాని, కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి నత్తలను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అయితే, సకాలంలో అధికారులు స్పందించటం వల్ల మన వరి ΄÷లాలకు ఈ నత్తల ముప్పు తప్పింది.
ఇండియన్ స్టిక్ ఇన్‌సెక్ట్..
ఎండిన, ముక్కలు చేసిన లేదా పాలిష్ చేసిన ధాన్యాలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు కూడా చీడపీడలను మోసుకొచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఉడికించటం, స్టెరిలైజ్ చేయటం, వేపటం వంటిప్రాసెసింగ్ చేసిన ఆహారోత్పత్తుల ద్వారా మాత్రం చీడపీడలు రవాణా అయ్యే అవకాశం ఉండదు కాబట్టి వీటికి ఫైటోశానిటరీ నిబంధనలు వర్తించవు.
తేనెటీగలు, సీతాకోకచిలుకలు, మాంటిడ్స్, పెంకు పురుగులు, పుల్లలతో చేసిన బొమ్మ మాదిరిగా కనిపించే పురుగులు (స్టిక్ ఇన్‌సెక్ట్స్), నత్తలు వంటి వాటిని కొందరు సరదాగా పెంచుకోవటానికి కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి పంపటం లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయటం వంటి పనులు చేస్తుంటారు. వీటి ద్వారా కూడా పురుగులు, తెగుళ్లు, వైరస్‌లు ఇతర దేశాలకు వ్యాపించే అకాశం ఉంటుంది.
న్యూజిలాండ్‌లో మూడేళ్ల క్రితం ఒక స్కూలు విద్యార్థిని ఇంట్లో పెద్దలకు తెలియకుండా అనేక రకాల స్టిక్ ఇన్‌సెక్ట్ గుడ్లను పోర్చుగల్ దేశం నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి తెప్పించుకుంది. పార్శిల్ వచ్చిన తర్వాత గమనించిన ఆమె తల్లి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వారు ఆ పార్శిల్‌ను జాగ్రత్తగా తీసుకెళ్లి పరీక్షించి చూశారు.
ఆ దేశంలో అప్పటికే ఉన్న అనేక రకాల స్టిక్ ఇన్‌సెక్ట్స్ గుడ్లతో పాటు కొత్త రకం ఇండియన్ స్టిక్ ఇన్‌సెక్ట్ గుడ్లు కూడా ఆ పార్శిల్‌లో ఉన్నాయని గుర్తించి నాశనం చేశారు. ఈ విద్యార్థిని తల్లి చైతన్యం మెచ్చదగినది.
సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు!
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా వస్తువుల వ్యాపారం (ఈ–కామర్స్) గతమెన్నడూ లేనంత జోరుగా సాగుతున్న రోజులివి. సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు జరుగుతున్నాయి. 2022లో ఏకంగా 16,100 కోట్ల పార్శిళ్ల కొనుగోళ్లు ఆన్‌లైన్‌లో జరిగాయి. కరోనా కాలంలో 20% పెరిగాయి. ఇప్పుడు వార్షిక పెరుగుదల 8.5%. 2027 నాటికి ఏటా 25,600 కోట్ల పార్శిళ్లు ఈ కామర్స్ ద్వారా బట్వాడా అయ్యే అవకాశం ఉందని అంచనా.
- అమెరికాలోని ఓ తనిఖీ కేంద్రంలో ఈ–కామర్స్ పార్శిళ్లు
ముఖ్యంగా అసక్తిగా ఇంటిపంటలు, పూల మొక్కలు పెంచుకునే గృహస్తులు చిన్న చిన్న కవర్లలో విత్తనాలను విదేశాల్లోని పరిచయస్తులకు పోస్ట్/ కొరియర్ ద్వారా పంపుతుంటారు. విదేశీ కంపెనీల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటూ ఉంటారు. విదేశాల నుంచి విత్తనాలు, ఉద్యాన తోటల మొక్కలు, అలంకరణ మొక్కలు, వాటితో పాటు వచ్చే మట్టి, అలంకరణ చేపలు, చెక్కతో చేసిన వస్తువులు, యంత్రాల ప్యాకింగ్‌లో వాడే వుడ్ ఫ్రేమ్‌ల ద్వారా పురుగులు, తెగుళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి రవాణా అవుతూ అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి.
కరోనా కాలం నుంచి ప్రపంచ దేశాల మధ్య పార్శిళ్ల వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటంతో నియంత్రణ వ్యవస్థలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. మన దేశంలో నియంత్రణ వ్యవస్థలను నేటి అవసరాలకు అనుగుణంగా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.
– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment