కుటుంబ సభ్యుల కేన్సర్ మరణాలకు కారణం రసాయనాలతో కూడిన ఆహారమేనని గ్రహింపు
వైద్యుడి సలహా మేరకు ఉద్యోగం వదలి... 9 ఏళ్ల క్రితం ప్రకృతి సేద్య బాట పట్టిన బాపారావు
ఆయన స్ఫూర్తితో 60 మంది రైతులు 85 ఎకరాల్లో దేశీ వరి ప్రకృతి సేద్యానికి శ్రీకారం
కుటుంబ సభ్యులు కేన్సర్ బారిన పడిన ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్న నేపథ్యంలో ఆహారంలో రసాయనాల అవశేషాలే ఇందుకు మూల కారణంగా గుర్తించిన ఓ యువకుడు ఉద్యోగం వదలి ప్రకృతి సేద్య సేనానిగా మారారు. అతనే యర్రు బాపారావు (బాపయ్య). కేవలం ఎకరంన్నర సొంత భూమి మాత్రమే ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయం చేపట్టడంతో పాటు దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. తమిళనాడు వెల్లూరులో ఈషా ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ‘భారతీయ సంప్రదాయ వరి, ఆహారోత్పత్తుల ఉత్సవం’లో బాపారావు మరో ముగ్గురు తెలుగు రైతులతో పాటు ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు.
సేఫ్ ఫుడ్ యువ ఉద్యమకారునిగా బాపారావు (39), లక్ష్మీ సౌజన్య దంపతుల ప్రకృతి వ్యవసాయ జీవన ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. వారి స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట. ఉన్నత విద్యావంతుడైన బాపారావు హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్, 2డి ఏనిమేటర్ గా ఉద్యోగం చేసేవారు. తమ కుటుంబంలోనే ముగ్గురు కేన్సర్ వ్యాధితో కొద్ది కాలంలోనే మృత్యువాతపడటంతో రసాయనాల మయమైన ఆహారమే ఆరోగ్యాన్ని నాశనం చేస్తోందని గ్రహించారు.
ఓ వైద్యుని సలహా మేరకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. 9 ఏళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం – సంప్రదాయ ఆహారోద్యమం ్రపారంభించారు. భార్య తోడ్పాటుతో బాపారావు తిరిగి స్వగ్రామం చేరుకొని ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. సొంత భూమి ఎకరంన్నరకు తోడు 7 ఎకరాల కౌలు భూమిలో ఔషధ, పోషక విలువలతో కూడిన దేశీ వరి వంగడాలను గత తొమ్మిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో అత్తోట గ్రామానికి చెందిన 60 మంది రైతులు సమష్టిగా ప్రకృతి వ్యవసాయం చేపట్టి సుమారు 85 ఎకరాల భూమిలో దేశీ వరి రకాలను సాగు చేస్తుండటం విశేషం.
ఎకరంలో 365 రకాల దేశీ వరి రకాలను విత్తనాల పరిరక్షణ కోసం బాపారావు సాగు చేస్తున్నారు. 7 ఎకరాల్లో సార్వాలో మైసూర్‌మల్లిగ, బహురూపి తదితర దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. గట్లపై బంతి, వంగ, చిక్కుడు, ΄÷ద్దు తిరుగుడు, బెండ, అరటి, మునగ, టమాటా, మిర్చి, తోటకూర, గోంగూర, ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. వేసవిలో 20 రకాల ధాన్యాలు, పప్పుదినుసులు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలు చల్లి.. 40 రోజులు పెరిగిన తర్వాత కోసి ఆవులకు మేతగా ఉపయోగించుకుంటున్నారు. కూరగాయలు, ఆకుకూరలు ఇంట్లోకి వాడుకుంటున్నారు. మిగతా పచ్చిరొట్టను భూమిలో కలియదున్ని తర్వాత వరి సాగు చేస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, కూరగాయలను స్నేహితులు, బంధువులకు అమ్ముకొని ప్రతి రోజూ ఆదాయం సంపాదిస్తున్నారు. లక్ష్మి దేవినేని సహకారంతో ‘తానా’ సహకారంతో గ్రామంలోనే ‘భూమి భారతి’ అనే సంస్థను నెలకొల్పారు. భూమి భారతి ద్వారా దేశీ వరి విత్తన నిధిని నిర్వహించటంతోపాటు.. రైతులు పండించిన దేశీ వరి బియ్యాన్ని, విలువ జోడించిన ఇతర ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులను సంతల్లో, సోషల్ మీడియా ద్వారా సుమారు వెయ్యి కుటుంబాలకు విక్రయిస్తున్నారు. రైతు మిత్రుల ద్వారా దేశీ వరి విత్తనోత్పత్తి చేసి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 4 వేల మంది ప్రకృతి వ్యవసాయదారులకు అందించటం బాపారావు విశేష కృషికి నిదర్శనం.
భావితరం కోసం...
ఆయన ఇలా చెబుతున్నారు.. ‘రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం వలన భూమి సారం కోల్పోతున్నది, రైతులు అప్పుల పాలవుతూ, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి సాగు పద్ధతిలో పండిస్తే ఖర్చులు తగ్గించుకోవచ్చు. నీటి తడులు పెట్టడం తగ్గుతుంది. అంతర పంటలతో అధికాదాయాన్ని ΄÷ందుతాం. దేశీ విత్తనం వాడటం వలన ఆ పంటలు తినే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఇతర రైతులు పండించే పంటదిగుబడులను బై బ్యాక్ సిస్టం కింద కొని భూమి భారతి ద్వారా నేరుగా ప్రజలకు అమ్ముతున్నాను. ప్రతి రైతూ ఏటీఎం మోడల్ వేసుకుంటే అదనపు ఆదాయం కూడా వస్తుంది. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తోపాటు మంచి భూమి భావితరానికి కావాలి అంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయటమే మార్గం..’ అంటారు బాపారావు.
ప్రవాస భారతీయులు మౌనికా రెడ్డి దంపతుల సాయంతో విజయవాడలోని కనకదుర్గ అమ్మ వారికి , మరో ఎన్‌ఆర్‌ఐ తాళ్లూరి జయశేఖర్ దంపతుల సాయంతో భద్రాచలంలోని సీతారాముల వారికి ఏడాది ΄÷డవునా నైవేద్యం కోసం దేశీ వరి బియ్యాన్ని పంపుతుండటం మరో విశేషం. వరి కోత సమయంలో వర్షాల కారణంగా ధాన్యం ఎండబెట్టడం, కలుపు తీసే సమయంలో కూలీల కొరత వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని ఆయన చెబుతున్నారు. బాలారిష్టాలను అధిగమించి నిలదొక్కుకున్న ఆయన నెలకు రూ. 4 లక్షల టర్నోవర్‌కు చేరుకోవటం విశేషం. ‘ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యదాయక ఆహారమే ఆరోగ్య సోపానమ’ని తన చేతల ద్వారా చాటిచెబుతున్న బాపారావు (91003 07308) దంపతులు యువతకు ఆదర్శ్రపాయులు. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment