'భూమి హీరో' పురస్కార అవార్డు
సిద్ధేశ్ సాకోర్ (28)... ఒక మారుమూల గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివారు. అయినప్పటికీ, తన తండ్రి వంటి చిన్న, సన్నకారు మెట్ట రైతుల ఆదాయాలు పెంచటం కోసం స్వగ్రామంలోనే ఉంటూ తన వంతుగా ఏదైనా చెయ్యాలన్నదే తపనంతా! ఈ తపనకు తోడైన ఆచరణే సిద్ధేశ్‌కి గత నెలలో ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది! దాని పేరే.. భూమి హీరో!
ఐక్యరాజ్య సమితికి చెందిన కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ గత నెల 17న బ్రెజిల్‌లో భూమి పరిరక్షణ కృషిలో క్రియాశీలపాత్ర నిర్వహిస్తున్న పది మంది యువతకు భూమి హీరో పురస్కారాలు అందించింది. ఈ పురస్కార విజేతల్లో సిద్ధేశ్ ఒకరు. మన దేశం నుంచి ఈయనొక్కరికే ఈ గుర్తింపు దక్కింది. ఆయన ప్రయాణం ఆసక్తిదాయకం.. స్ఫూర్తిదాయకం..
అతనిది మహారాష్ట్ర పుణే జిల్లా షిరూర్ తాలూకా ధామరి గ్రామం. పేద వ్యవసాయ కుటుంబంలో పెరిగిన సిద్ధేశ్ కరువు పీడిత మెట్ట ్రపాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశాడు. తాను వ్యవసాయం చేసి మార్పు తేవాలనుకున్నాడు. కొడుకు వ్యవసాయం చేయటం తండ్రికి ఇష్టం లేదు. కుటుంబ పొలాన్ని ఇవ్వనన్నాడు తండ్రి. మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చదవమన్నాడు. ఆ ప్రకారంగానే డిగ్రీ చదివిన సిద్ధేశ్ ఆ తర్వాత తమ జిల్లాలోనే గల విజ్ఞానాశ్రమంలో చేరి అనేక చిన్న యంత్రాలను ఆవిష్కరించాడు.
వంటింటి వ్యర్థాలతో తక్కువ సమయంలో కంపోస్టు ఎరువు తయారు చేసే యంత్రాలను రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు. ఈలోగా కరోనాతో తండ్రి చనిపోయారు. అప్పటికి తండ్రి బ్యాంకు ఖాతాలో రూ. 3వేలు నిల్వ ఉందని చెబుతూ.. ఇదీ చిన్న రైతుల దుస్థితి అంటారాయన. భూములను సారవంతం చేసుకుంటూ రైతుల ఆదాయం పెంచే పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయంతో రైతుల తలరాత మార్చవచ్చని సిద్ధేశ్ బలంగా నమ్మాడు.
ఐదెకరాల్లోపు వర్షాధార వ్యవసాయం చేసే రైతులు తగినంత ఆదాయం లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల పాలవుతున్నారు. ఆదాయం ఎందుకు రావటం లేదు? వారి భూములు అతిగా రసాయనాలు వాడటం వల్ల నిస్సారమైపోతున్నాయి. సేంద్రియ కర్బనం 0.5% కన్నా తక్కువగానే ఉంది. ఆ నేలల్లో అరకొర దిగుబడులు రావటం, గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల బడుగు రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ వెతలన్నిటికీ మూలం సాగు భూమి అతిగా నిస్సారమైపోవటం అని గ్రహించిన సిద్ధేశ్ స్వగ్రామంలోనే ఉండి, వారసత్వ చిన్నకమతంలో పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం చేస్తూ.. తోటి రైతులను కూడా ఆ దిశగా నడిపించే పనిని ్రపారంభించారు. ‘ఆగ్రో రేంజర్స్’ అనే లాభాపేక్ష లేని సంస్థను ఐదేళ్ల క్రితం స్థాపించాడు.
సీజనల్ పంటలపైనే ఆధారపడకుండా చిన్న కమతాల రైతులు కూడా కొంత మేరకు పండ్ల తోటలు పండించుకుంటూ.. రసాయన వ్యవసాయం నుంచి స్థిరమైన సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఆగ్రో రేంజర్స్ రైతులకు మద్దతు ఇస్తోంది. బహుళ పంటలు పండించే పండ్ల చెట్ల ఆధారిత ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను ఆగ్రో రేంజర్స్ అభివృద్ధి చేసింది. ఇది రైతులకు స్థిరంగా ఆదాయం వచ్చేలా చేస్తుంది. అదే సమయంలో నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది.
గత 5 సంవత్సరాలుగా సిద్ధేశ్ బృందం 1,200 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. 23 గ్రామాల్లో వందకు పైగా ఎకరాల్లో రీజనరేటివ్ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను క్షేత్రస్థాయిలో అమల్లోకి తేగలిగారు. రెండు, మూడు సంస్థల్లో నైపుణ్య శిక్షణ పొందటం ద్వారా, అనేక సంస్థల ఆర్థిక తోడ్పాటుతో ఆగ్రోరేంజర్స్ బృందం లోపాలను సరిదిద్దుకొని పురోగమిస్తోంది.
రైతులు శిక్షణ తీసుకున్నప్పటికీ సాగు పద్ధతి మార్చుకోవటానికి ముందుకు రాకపోవటాన్ని గమనించి.. పండ్ల మొక్కలను, డ్రిప్ లేటరల్స్‌తో పాటు నాణ్యమైన శిక్షణ ఇవ్వటంతో మార్పు క్రమంగా వస్తోందని సిద్ధేశ్ తెలిపారు. వారికి ఎప్పుడు ఏమి అవసరమైతే అది చెబుతూ ముందుకు తీసుకువెళ్తే ఒక్కసారి ఈ పద్ధతి వల్ల ఆదాయం పెరిగితే ఇక వారికి నమ్మకం కుదురుతుంది. నేల క్షీణతను, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనే దిశగా పునరుజ్జీవ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనా సాగు పద్ధతిని చిన్న, సన్నకారు రైతులకు అందించే కృషిలో గ్రామీణ యువతను విరివిగా భాగస్వామ్యం చేయాలని సిద్ధేశ్ ఆశిస్తున్నారు.
పుణేలోని లఖేవాడికి చెందిన రైతు జలంధర్ చేమాజీ మావ్లే మాటల్లో చె΄్పాలంటే.. ‘భూతాపం పెరిగిపోవటం అనే సమస్యను ఎదుర్కోవడానికి, సాధ్యమైనంత ఎక్కువ చెట్లను పెంచటం ఉత్తమం. అందువల్ల, పండ్ల మొక్కలు, బిందు సేద్యం, విలువైన పాఠాలతో నాకు సహాయం చేసిన ఆగ్రో రేంజర్స్ బృందంతో నేను కనెక్ట్ అయ్యాను. ఇది వాతావరణ మార్పుపై పోరాటంలో మాత్రమే కాదు. నాకు స్థిరమైన ఆదాయం కూడా వస్తోంది. రెండు ఎకరాల భూమి గతంలో పండ్ల మొక్కలు నాటాను. ఈ సంవత్సరం మరో మూడు ఎకరాల భూమి కోసం ప్లాన్ చేస్తున్నాను’.
ఇవి చదవండి: కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల!
Comments
Please login to add a commentAdd a comment