compost
-
వంటింటి వ్యర్థాలతో ఇంట్లోనే కంపోస్ట్ ఎరువు తయారీ ఎలా?
వంట గదిలో కూరగాయలు, పండ్ల తొక్కలు, వ్యర్థాల నుండి ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కంపోస్ట్ ఎరువు ఇంటిపంట మొక్కలకు సులభంగా, త్వరగా పోషకాలను అందిస్తుంది. అంతేకాదు, ఇది అద్భుతమైన ఎరువు కూడా.మూత ఉండే డస్ట్ బిన్‌కు చుట్టూ బెజ్జాలు పెట్టి గాలి పారాడేలా (ఎరేటెడ్ బిన్) చేస్తే చాలు. అందులో వంటగది వ్యర్థాలను ప్రతి రోజూ వేస్తూ ఉండాలి. వారానికోసారి ఆ చెత్తపైన కాస్త మట్టిని చల్లి, కదిలియ తిప్పండి. తడి వ్యర్థాలతోపాటు కొన్ని ఎండిన ఆకులు లేదా చిత్రిక పట్టిన చెక్క వ్యర్థాలు వంటివి కూడా కలపాలి. తడి, పొడి చెత్త కలిపి వేయాలి. కొంచెం శ్రద్ధ, తగుమాత్రం తేమ ఉండేలా చూసుకుంటూ ఉంటే వాసన, పురుగులు రాకుండా చూసుకోవచ్చు. గాలి తగులుతూ ఉండే బిన్లో చేసిన కం΄ోస్టు కాబట్టి దీన్ని ఏరోబిక్ హోమ్ కంపోస్టు అంటున్నాం. వంటింటి వ్యర్థాలను, ఎండు ఆకులను మున్సిపాలిటీ వాళ్లకు ఇవ్వకుండా.. వాటితో ఇంటి దగ్గరే మనం తయారు చేసే కం΄ోస్టు వల్ల భూగోళాన్ని వేడెక్కించే కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ప్రతి కిలో కం΄ోస్టుకు 3.8 కిలోల ఉద్గారాల విడుదలను నిరోధించిన వాళ్లం అవుతాం. ఈ పని మన భూమికి మంచిది!ఇదీ చదవండి: హెల్దీ సంచోక్స్ : లాభాలు అన్నీ ఇన్నీ కావు! -
ఈ యువరైతుకి.. అరుదైన ఘనత!
సిద్ధేశ్ సాకోర్ (28)... ఒక మారుమూల గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివారు. అయినప్పటికీ, తన తండ్రి వంటి చిన్న, సన్నకారు మెట్ట రైతుల ఆదాయాలు పెంచటం కోసం స్వగ్రామంలోనే ఉంటూ తన వంతుగా ఏదైనా చెయ్యాలన్నదే తపనంతా! ఈ తపనకు తోడైన ఆచరణే సిద్ధేశ్కి గత నెలలో ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది! దాని పేరే.. భూమి హీరో!ఐక్యరాజ్య సమితికి చెందిన కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ గత నెల 17న బ్రెజిల్లో భూమి పరిరక్షణ కృషిలో క్రియాశీలపాత్ర నిర్వహిస్తున్న పది మంది యువతకు భూమి హీరో పురస్కారాలు అందించింది. ఈ పురస్కార విజేతల్లో సిద్ధేశ్ ఒకరు. మన దేశం నుంచి ఈయనొక్కరికే ఈ గుర్తింపు దక్కింది. ఆయన ప్రయాణం ఆసక్తిదాయకం.. స్ఫూర్తిదాయకం..అతనిది మహారాష్ట్ర పుణే జిల్లా షిరూర్ తాలూకా ధామరి గ్రామం. పేద వ్యవసాయ కుటుంబంలో పెరిగిన సిద్ధేశ్ కరువు పీడిత మెట్ట ్రపాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశాడు. తాను వ్యవసాయం చేసి మార్పు తేవాలనుకున్నాడు. కొడుకు వ్యవసాయం చేయటం తండ్రికి ఇష్టం లేదు. కుటుంబ పొలాన్ని ఇవ్వనన్నాడు తండ్రి. మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చదవమన్నాడు. ఆ ప్రకారంగానే డిగ్రీ చదివిన సిద్ధేశ్ ఆ తర్వాత తమ జిల్లాలోనే గల విజ్ఞానాశ్రమంలో చేరి అనేక చిన్న యంత్రాలను ఆవిష్కరించాడు.వంటింటి వ్యర్థాలతో తక్కువ సమయంలో కంపోస్టు ఎరువు తయారు చేసే యంత్రాలను రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు. ఈలోగా కరోనాతో తండ్రి చనిపోయారు. అప్పటికి తండ్రి బ్యాంకు ఖాతాలో రూ. 3వేలు నిల్వ ఉందని చెబుతూ.. ఇదీ చిన్న రైతుల దుస్థితి అంటారాయన. భూములను సారవంతం చేసుకుంటూ రైతుల ఆదాయం పెంచే పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయంతో రైతుల తలరాత మార్చవచ్చని సిద్ధేశ్ బలంగా నమ్మాడు.ఐదెకరాల్లోపు వర్షాధార వ్యవసాయం చేసే రైతులు తగినంత ఆదాయం లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల పాలవుతున్నారు. ఆదాయం ఎందుకు రావటం లేదు? వారి భూములు అతిగా రసాయనాలు వాడటం వల్ల నిస్సారమైపోతున్నాయి. సేంద్రియ కర్బనం 0.5% కన్నా తక్కువగానే ఉంది. ఆ నేలల్లో అరకొర దిగుబడులు రావటం, గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల బడుగు రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ వెతలన్నిటికీ మూలం సాగు భూమి అతిగా నిస్సారమైపోవటం అని గ్రహించిన సిద్ధేశ్ స్వగ్రామంలోనే ఉండి, వారసత్వ చిన్నకమతంలో పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం చేస్తూ.. తోటి రైతులను కూడా ఆ దిశగా నడిపించే పనిని ్రపారంభించారు. ‘ఆగ్రో రేంజర్స్’ అనే లాభాపేక్ష లేని సంస్థను ఐదేళ్ల క్రితం స్థాపించాడు.సీజనల్ పంటలపైనే ఆధారపడకుండా చిన్న కమతాల రైతులు కూడా కొంత మేరకు పండ్ల తోటలు పండించుకుంటూ.. రసాయన వ్యవసాయం నుంచి స్థిరమైన సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఆగ్రో రేంజర్స్ రైతులకు మద్దతు ఇస్తోంది. బహుళ పంటలు పండించే పండ్ల చెట్ల ఆధారిత ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను ఆగ్రో రేంజర్స్ అభివృద్ధి చేసింది. ఇది రైతులకు స్థిరంగా ఆదాయం వచ్చేలా చేస్తుంది. అదే సమయంలో నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది.గత 5 సంవత్సరాలుగా సిద్ధేశ్ బృందం 1,200 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. 23 గ్రామాల్లో వందకు పైగా ఎకరాల్లో రీజనరేటివ్ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను క్షేత్రస్థాయిలో అమల్లోకి తేగలిగారు. రెండు, మూడు సంస్థల్లో నైపుణ్య శిక్షణ పొందటం ద్వారా, అనేక సంస్థల ఆర్థిక తోడ్పాటుతో ఆగ్రోరేంజర్స్ బృందం లోపాలను సరిదిద్దుకొని పురోగమిస్తోంది.రైతులు శిక్షణ తీసుకున్నప్పటికీ సాగు పద్ధతి మార్చుకోవటానికి ముందుకు రాకపోవటాన్ని గమనించి.. పండ్ల మొక్కలను, డ్రిప్ లేటరల్స్తో పాటు నాణ్యమైన శిక్షణ ఇవ్వటంతో మార్పు క్రమంగా వస్తోందని సిద్ధేశ్ తెలిపారు. వారికి ఎప్పుడు ఏమి అవసరమైతే అది చెబుతూ ముందుకు తీసుకువెళ్తే ఒక్కసారి ఈ పద్ధతి వల్ల ఆదాయం పెరిగితే ఇక వారికి నమ్మకం కుదురుతుంది. నేల క్షీణతను, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనే దిశగా పునరుజ్జీవ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనా సాగు పద్ధతిని చిన్న, సన్నకారు రైతులకు అందించే కృషిలో గ్రామీణ యువతను విరివిగా భాగస్వామ్యం చేయాలని సిద్ధేశ్ ఆశిస్తున్నారు.పుణేలోని లఖేవాడికి చెందిన రైతు జలంధర్ చేమాజీ మావ్లే మాటల్లో చె΄్పాలంటే.. ‘భూతాపం పెరిగిపోవటం అనే సమస్యను ఎదుర్కోవడానికి, సాధ్యమైనంత ఎక్కువ చెట్లను పెంచటం ఉత్తమం. అందువల్ల, పండ్ల మొక్కలు, బిందు సేద్యం, విలువైన పాఠాలతో నాకు సహాయం చేసిన ఆగ్రో రేంజర్స్ బృందంతో నేను కనెక్ట్ అయ్యాను. ఇది వాతావరణ మార్పుపై పోరాటంలో మాత్రమే కాదు. నాకు స్థిరమైన ఆదాయం కూడా వస్తోంది. రెండు ఎకరాల భూమి గతంలో పండ్ల మొక్కలు నాటాను. ఈ సంవత్సరం మరో మూడు ఎకరాల భూమి కోసం ప్లాన్ చేస్తున్నాను’.ఇవి చదవండి: కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల! -
చెత్త నుండి సంపద సృష్టిస్తున్న కోవెలకుంట్ల గ్రామపంచాయతీ
-
వంటింటి చెత్తను ఎరువుగా మార్చే డస్ట్ బిన్! ధర ఎంతంటే!
చూడటానికి ఇదేదో కొత్తరకం పీపాలా ఉంది కదూ! అటూ ఇటుగా పీపా ఆకారంలోనే ఉన్న చెత్తబుట్ట ఇది. అలాగని సాదాసీదా చెత్తబుట్ట కాదు, హైటెక్ చెత్తబుట్ట. వంటింటి వ్యర్థాలను ఇది గంటల వ్యవధిలోనే ఎరువుగా మార్చేస్తుంది. ఇందులో రెండులీటర్ల పరిమాణం వరకు వంటింటి ఆహార వ్యర్థాలను వేసుకోవచ్చు. దీని వేగాన్ని ఎంపిక చేసుకునేందుకు నాలుగు బటన్లు, లోపల ఎంతమేరకు ఖాళీ ఉందో తెలుసుకోవడానికి వీలుగా ఎల్సీడీ డిస్ప్లే, ట్రాన్స్పరెంట్ మూత ఉంటాయి. స్టాండర్డ్ మోడ్ ఎంచుకుంటే, నాలుగు గంటల్లోనే ఇందులో వేసిన చెత్తంతా ఎరువుగా తయారవుతుంది. హైస్పీడ్ మోడ్ ఎంచుకుంటే, రెండు గంటల్లోనే పని పూర్తవుతుంది. ఫెర్మెంట్ మోడ్ ఎంచుకుంటే, ఎరువు తయారీకి దాదాపు ఆరుగంటల సమయం పడుతుంది. అయితే, ఈ మోడ్ ఎంపిక చేసుకుంటే, విద్యుత్తు తక్కువ ఖర్చవుతుంది. ఇందులో తయారైన ఎరువును పెరటి మొక్కల కోసం వాడుకోవచ్చు. తక్కువ ధరకు బయట ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఈ హైటెక్ చెత్తబుట్ట ఖరీదు 269 డాలర్లు (రూ.21,336). -
చెత్తను పడేయకండి.. పచ్చగా వాడుకోండి
పొద్దున విజిల్ సౌండ్ వినిపించగానే ‘అదిగో బండొచ్చింది’ అని ఇంట్లోని వంటగది వ్యర్థాలను (కిచెన్వేస్ట్) తీసుకొని పరుగులు తీస్తాం. మున్సిపాలిటి బండిలో మన చెత్త పడగానే ‘హమ్మయ్య... ఇవ్వాటికో పని అయిపోయింది’ అనుకుంటాం. ‘కాస్త ఆగండి. ఎప్పుడైనా ఒకసారి మీ ఇంట్లోని చెత్తను పరిశీలనగా చూడండి. ఆ చెత్త ఏదో చెప్పబోతున్నట్లుగానే కనిపిస్తుంది కదా! నన్ను బండిలో పారేసి చేతులు దులుపుకోకండి. దయచేసి నన్ను వాడుకోండి. పచ్చగా జీవించండి..అని మనకు చెబుతుంది చెత్త’ అంటున్నారు సవిత హిర్మట్. బెంగళూరుకు చెందిన ఈ జర్నలిస్ట్ ‘కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మెనేజ్మెంట్’ను ఉద్యమస్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సవిత తల్లి క్యాన్సర్‌తో చనిపోయారు. తల్లి జ్ఞాపకాలు రోజూ ఆమెను పలకరిస్తూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాల్లో బాగా గుర్తుండిపోయే జ్ఞాపకం....వంటగది వ్యర్థాలను ఆమె బయట పారేసేవారు కాదు. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గురించి పెద్దగా అవగాహనలేని ఆ రోజుల్లోనే ఆమె కంపోస్ట్ తయారు చేసేవారు. దీనితో మొక్కల పెంపకం, కూరగాయలు పండించడం చేసేవారు. తల్లి బాటలో నడవాలనుకున్నారు సవిత. ఇది తనకు ఇచ్చే నిజమైన నివాళిగా భావించారు.‘కిచెన్ వేస్ట్ కంపోస్ట్’ గురించి రెండు సంవత్సరాలు అధ్యయనం చేశారు. అయితే అంతర్జాల సమాచారం మనదేశ పరిస్థితులకు కుదరదు అనే విషయం అర్థమై ఎన్నో ప్రాంతాలకు వెళ్లి ఎంతోమంది నిపుణులతో మాట్లాడారు.తాను తెలుసుకున్న విషయాలను సమాజంతో పంచుకోవాలన్న నిర్ణయంలో భాగంగా ఇరుగుపొరుగు వారితో కలిసి జీరో–వేస్ట్ కమ్యూనిటీలను ఏర్పాటు చేశారు. దేశ, విదేశ నిపుణులతో మాట్లాడి సదస్సులు నిర్వహిస్తున్నారు. బ్లాగింగ్ చేస్తున్నారు. తన పరిశోధన సారాంశాన్ని ‘ఎండ్లెస్ గ్రీన్’ పేరుతో పుస్తకంగా రాశారు. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది వ్యక్తిగత అభిరుచికి సంబంధించిన వ్యవహారంలా కాకుండా నైతిక ఉద్యమం స్థాయిలో చూస్తున్నారు సవిత.‘మన దేశంలో లక్షలాది అపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో 70 నుంచి 80 శాతం మంది వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టి సారించినా కాలుష్యాన్ని ఎంతో కొంత కట్టడి చేయవచ్చు. మన ఇంటి నుంచే మొదలవ్వాలి... అని ఎవరికి వారు అనుకుంటే అది ఉద్యమస్థాయికి చేరుతుంది’ అంటున్నారు సవిత. ‘కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారీ ఖరీదైన వ్యవహారమేమీ కాదు. పెద్దగా సమయం కూడా తీసుకోదు. మన ఇంట్లోనే ఏదో మూల వృథాగా పడి ఉన్న బకెట్ చాలు. కంపోస్ట్‌కు వాడే పదార్థాలు కూడా అందుబాటు ధరల్లోనే ఉంటాయి. పైగా ఇదొక రిలాక్సేషన్ ప్రక్రియ...’ ‘కొబ్బరి చిప్పలు కంపోస్ట్ కావడానికి చాలా సమయం తీసుకుంటుంది’‘పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజూ 60 నుంచి 65 శాతం కిచెన్వేస్ట్ పోగవుతుంది’‘పదివేల సంవత్సరాల క్రితమే ఇరాన్లో, ఆరువేల సంవత్సరాల క్రితం చైనా,జపాన్లలో సేంద్రియ పద్ధతుల మూలాలు ఉన్నాయి’‘ఇప్పటికీ మన దేశంలో ఎన్నో గ్రామీణ ప్రాంతాలలో ఆహారవ్యర్థాలను కంపోస్ట్ చేసే ప్రాచీన పద్దతులను అనుసరిస్తున్నారు. ఉదా: గొయ్యి తవ్వి వ్యర్థాలు పాతి పెట్టడం’... ఒక్కటా రెండా... సవిత గొంతు విప్పితే గలగమని ఎన్నో ఉపయోగకరమైన విషయాలు వరుస కడతాయి. ఒక మూల బిక్కముఖం వేసుకొని కనిపించే అన్వాంటెడ్ వేస్ట్, హైలీ న్యూట్రీషియన్ కంపోస్ట్‌గా మారే అద్భుతాన్ని ఆమె మాటల్లో దర్శించవచ్చు. -
సూక్ష్మ మొక్కలతో వ్యాధుల నివారణ!
సూక్ష్మ మొక్కల (మైక్రోగ్రీన్స్)ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా నివారించుకోవచ్చని హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూక్ష్మ మొక్కలను ట్రేలలో ఇంట్లోనే పెంచుకునే పద్ధతులను గురించి వ్యాసం మొదటి భాగంలో గత వారం తెలుసుకున్నాం, ఇది చివరి భాగం. హృదయ సంబంధ వ్యాధులు: ఈ చిన్నమొక్కలు అత్యధికంగా పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండటం వలన గుండెని కాపాడతాయి. అల్జీమర్స్/మతిమరుపు:వీటిలో ఉండే పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాల ఆరోగ్యాన్ని పనితీరును కాపాడి వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును నియంత్రిస్తాయి. మధుమేహం: యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉండటం వలన శరీర కణాలు చక్కెరను సరిగ్గా వినియోగించుకునే ప్రక్రియను నియంత్రిస్తాయి. ప్రత్యేకంగా మెంతులు ఇలా ఉపయోగించినప్పుడు మధుమేహాన్ని నియంత్రించినట్లు పరిశోధనల ద్వారా నిరూపితమైనది. కాన్సర్: వీటిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల కేన్సర్లను నియంత్రిస్తాయి. ఏ పంటలో ఏయే పోషకాలు? 1. ముల్లంగి: ముల్లంగి విత్తనాలను కూడా సూక్ష్మవిత్తనాలుగా వాడుకోవచ్చు. ఇవి ఉష్ణ, శీతల వాతావరణ పరిస్థితుల్లో కూడా మొలకెత్తుతాయి. అంతేగాక ఇవి అతి తొందరగా ఎదగడం వల్ల 5 నుంచి 10 రోజులలో కత్తిరించి వాడుకోవచ్చు. 2.బ్రోకలీ: బ్రోకలీని శక్తిమంతమైన ఆహారంగా పరిగణిస్తారు. దీనిలో ఖనిజాలు ముఖ్యంగా ఇనుము, ఎ–సి విటమిన్లు అత్యధికంగా ఉంటాయి. ఎదిగిన బ్రోకలీ మొక్కల కంటే వీటిలో అత్యధికంగా పోషకాలు ఉంటాయి. 3.బీట్రూట్: మిగతా విత్తనాలతో పోలిస్తే బీట్రూట్ విత్తనాలను మొలకెత్తడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. సాధారణంగా 6 నుంచి 8 రోజులలో మొలకెత్తుతాయి. 10–12 రోజుల్లో కత్తిరించుకోవచ్చు. బీట్రూట్ విత్తనాలను వేసుకునే ముందు చల్లని నీటిలో 12 గంటల పాటు నానబెట్టాలి. ఈ సూక్ష్మ విత్తనాలు ఆహారానికి పోషకాలతోపాటు రంగును కూడా చేరుస్తాయి. 4. తోటకూర: తోటకూర విత్తనాలు తొందరగా మొలకలు వచ్చి అతి త్వరగా ఎదుగుతాయి. దాదాపుగా 2 లేదా 3 రోజుల వ్యవధిలో మొలకెత్తుతాయి. 8 లేదా 12 రోజులలో కోతకు వస్తుంది. వీటిని ఫ్రిజ్‌లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు. 5.ఆవాలు : ఆవాలు 3 నుంచి 4 రోజుల్లో మొలకెత్తుతాయి. 6 నుంచి 10 రోజుల్లో కత్తిరించి వాడుకోవచ్చు. ఇవి చాలా తొందరగా ఎదుగుతాయి. వీటి ఘాటు రుచి వలన వంటకాలలో లేదా సలాడ్‌లో చేర్చినప్పుడు మంచి రుచిని ఇస్తాయి. 6. చుక్కకూర: చుక్కకూర విత్తనాలు 4 నుంచి 5 రోజులలో మొలకెత్తుతాయి. ఇవి నెమ్మదిగా ఎదుగుతాయి. కాబట్టి 12 నుంచి 20 రోజుల సమయం తీసుకుంటాయి. వీటిని వంటకాలలో చేర్చినప్పుడు పులుపు రుచిని కలిగి ఉండటం వలన ఎక్కువగా ఇష్టపడతారు. కంపోస్టులో పెరిగిన సూక్ష్మ మొక్కల్లో అధిక పోషకాలు! ► కంపోస్టు, హైడ్రోపోనిక్ (పోషకాల ద్రావణం కలిపిన నీరు లేదా నీరు మాత్రమే) మాధ్యమాలను సరి పోల్చినప్పుడు.. కంపోస్టులో పెంచిన మొక్కలలో అధిక పోషకాలు ఉన్నట్లు నిర్థారితమైంది. ► అమెరికా శాస్త్రవేత్తలు బ్రోకలీ మైక్రోగ్రీన్స్‌ని, ఎదిగిన బ్రోకలీ మొక్కలలోని మినరల్స్‌తో పోల్చి చూసినప్పుడు 1.15 నుంచి 2.32 శాతం వరకు (ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీసు, సోడియం, జింక్ వంటి) ఖనిజాలు మైక్రోగ్రీన్స్‌లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ► ఈ మైక్రోగ్రీన్స్ పెంచడానికి కేవలం ఎకరానికి 15,679 లీటర్ల నీరు మాత్రమే అవసరం. అదే మొక్కలను పూర్తిగా పెంచినట్లయితే 24,80,000 నుంచి 37,00,000 లీటర్ల నీరు అవసరం. అదేవిధంగా బ్రోకలీ మొక్కలు పూర్తిగా ఎదగడానికి 100 నుంచి 150 రోజుల సమయం పడుతుంది. కానీ మైక్రోగ్రీన్స్‌ని 7 నుంచి 9 రోజులలో కత్తిరించుకోవచ్చు. ఈ విధంగా చూసినట్లయితే తరిగిపోతున్న వనరులు, గ్లోబల్ వార్మింగ్, పోషకాహార లోపం వంటి సమస్యలను కూడా ఈ మైక్రోగ్రీన్స్ ద్వారా నివారించవచ్చు. ► 25 రకాల మైక్రోగ్రీన్స్‌పై జరిపిన పరిశోధనలో 100 గ్రాములలో 20.4 నుంచి 147.0 మిల్లీ గ్రాముల విటమిన్ సి, 6 నుంచి 12.1 మి.గ్రా.ల బీటా కెరోటిన్, 4.9 నుంచి 87.4 విటమిన్ ఇ ఉన్నట్లు కనుగొన్నారు. ఇవి బాగా పెరిగిన ఆకులతో పోల్చితే చాలా ఎక్కువ శాతం పోషకాలను కలిగి ఉన్నాయి. ఈ 25 రకాలలో రెడ్ క్యాబేజి, కొత్తిమీర, తోటకూర, ముల్లంగిలో అత్యధికంగా ఆస్కార్బిక్ ఆమ్లం, కెరోటినాయిడ్స్, ఫిల్లిక్వినోన్లు, టోకోఫెరాన్లు ఉన్నట్లు అధ్యయనంలో తేల్చారు. ► చక్కెర శాతం కూడా ప్రతి వంద గ్రాములలో 10.3 గ్రా. ఉండగా అదే పరిపక్వత చెందిన వాటిలో 44–17 గ్రా. ఉన్నట్లు గుర్తించారు. ► రెడ్ క్యాబేజీపై జరిపిన పరిశోధనలో మైక్రోగ్రీన్లో ప్రతి గ్రాముకు 71.01 మైక్రోమోల్స్ ఫాలీఫినాల్స్ ఉండగా, పరిపక్వత చెందిన రెడ్ క్యాబేజీలో 50.58 మైక్రోమోల్స్ మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. గుండె జబ్బులు, మధుమేహంతో బాధపడే వారికి ఫాలీఫీనాల్స్ ఉపయోగకరం. ► హైడ్రోపోనిక్‌లో పొటాషియం తక్కువగా ఉన్న పోషకాల ద్రావణం కలపడం ద్వారా ఈ మాధ్యమంలో పెంచిన మైక్రోగ్రీన్స్‌లో తక్కువ పొటాషియం కలిగి మిగతా పోషకాలలో మార్పు లేక పోవటం వలన కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఈ మైక్రోగ్రీన్స్ సహాయ పడతాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. సూక్ష్మ మొక్కలతో ఎన్నెన్నో వంటకాలు సూక్ష్మమొక్కలను సాధారణంగా సలాడ్, సాండ్విచ్, పండ్ల రసాలు, మిల్క్ షేక్‌లలో వాడతారు. అంతేకాకుండా సూపులు, రోల్స్‌లో కూడా చేర్చడం ద్వారా రుచితోపాటు పోషకాలు కూడా అధికంగా అందుతాయి. సూక్ష్మమొక్కల ఉపయోగాన్ని మరింత సులభం చేయడానికి హైదరాబాద్‌లోని ‘మేనేజ్’, జాతీయ పోషకాహార సంస్థ కలిసి వివిధ ఆహార పదార్థాలలో ఈ మొక్కలను చేర్చి పోషక స్థాయిని అధ్యయనం చేస్తున్నారు. ఇంత ఆవశ్యకత కలిగిన ఈ సూక్ష్మ మొక్కలను హోటళ్లు, రెస్టారెంట్లలో అధిక ధర పెట్టి కొనుక్కోవటం కాకుండా సులభంగా ఇంట్లోనే పెంచుకోవడం ద్వారా రోజూ తినే ఆహారంలో రుచిని, పోషకాలను పెంచుకొని ఆరోగ్యాన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. – డా. వినీత కుమారి (83672 87287), డెప్యూటీ డైరెక్టర్ (జెండర్ స్టడీస్), డా. జునూతుల శిరీష, సీనియర్ రీసెర్చ్ ఫెలో, డా. మేకల శ్రీకాంత్, కన్సల్టెంట్, జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్), హైదరాబాద్ వాడకానికి సిద్ధమైన ఆవాల సూక్ష్మ మొక్కలు నీటిలో పెరిగిన తెల్ల ముల్లంగి సూక్ష్మ మొక్కలు -
ఎండాకులు భలే ఎరువు!
నవంబర్ నుంచి దాదాపు ఏప్రిల్ వరకు మన చుట్టూతా ఉండే చెట్లు ఆకులను రాల్చుతూ ఉంటాయి. పొద్దున్న లేచేటప్పటికల్లా వాకిలి నిండా, ఇంటి ఆవరణలో, చెట్ల పక్కనున్న ఇంటి పైకప్పుల మీద, కాలనీల్లో రోడ్ల మీద, పార్కుల్లో.. ఎక్కడ చూసినా ఆకులే.. ఆకులు.. రాలిన ఆకులు! ఈ ఆకులను చక్కని కంపోస్టు ఎరువుగా మార్చుకోవచ్చని తెలిసినా.. నిర్లక్ష్యం కొద్దీ ఆకులను కుప్పజేసి నిప్పు పెట్టడమో లేదా చెత్తను మోసుకెళ్లే మున్సిపాలిటీ వాళ్ల నెత్తిన వెయ్యడమో చేస్తున్నాం.. అయితే, స్వల్ప ప్రయత్నంతోనే ఈ ఎండాకులను అమూల్యమైన సహజ ఎరువుగా మార్చుకోవచ్చని ఓ మహిళ ఎలుగెత్తి చాటుతున్నారు. మహారాష్ట్రలోని పుణే నగరవాసి అదితి దేవ్‌ధర్ ‘బ్రౌన్‌లీఫ్’ పేరిట ఏకంగా ఓ సామాజిక ఉద్యమాన్నే ప్రారంభించి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ఈ స్ఫూర్తి కథనంతో ‘కంపోస్టు కథలు’ సిరీస్‌ను ఈ వారం ప్రారంభిస్తున్నాం.. పచ్చని చెట్లంటే మనందరికీ ఇష్టమే. అందుకే పొలాల గట్లమీద, పడావుభూముల్లో, ఇంటి దగ్గర, ఊళ్లు / కాలనీల్లో రోడ్ల పక్కన, పార్కుల్లో.. ఇష్టపడి పచ్చని చెట్లను పెంచుకుంటూ ఉంటాం. అయితే, ఆ చెట్లు రాల్చే ఆకుల్ని ఏం చేయాలి? ఊడ్చి మున్సిపాలిటీ వ్యాన్‌లో వేస్తున్నారు లేదా కుప్ప చేసి నిప్పు పెడుతున్నారు. ఈ రెండూ మంచి పనులు కాదు. పనిగట్టుకొని మొక్కలు నాటి పచ్చని చెట్లని పెంచుతున్న వారు సైతం నాకెందుకులే అనో.. ఓ రకమైన నిరాసక్తతతోనో, నిర్లక్ష్యంతోనో చూస్తూ ఊరుకుంటున్నారు. కానీ, అదితి దేవ్‌ధర్ ఊరుకోలేదు. తమ ఇంటి ఆవరణలో పెద్ద చెట్లు రాల్చే ఆకులు పోగుపడుతూ ఉంటే.. ఆ ఆకులను నిప్పు పెట్టి వాయుకాలుష్యాన్ని పెంచి ప్రజారోగ్యానికి ముప్పు తేవడానికి గానీ, మున్సిపాలిటీ వాళ్లకు ఇచ్చి డంపింగ్ యార్డులో చెత్తదిబ్బలను కొండలుగా పెంచడానికి గానీ ఆమె ఒప్పుకోలేదు. తానే చొరవతో ఎండాకుల సమస్యకు పరిష్కారం వెదికారు. బ్రౌన్‌లీఫ్ ఛాలెంజ్ తీసుకున్నారు. నలుగురినీ కూడగట్టారు. ఒక్క ఎండాకునూ తగులబెట్టనియ్యకూడదని ప్రతిన బూనారు. నాలుగేళ్లుగా ఎండాకులను తగులబెట్టకుండా చూస్తున్నారు. ఎండాకులతో కంపోస్టు తయారు చేసుకునే పద్ధతులను ప్రచారం చేస్తున్నారు. ఆ కంపోస్టుతో చక్కని సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడానికి దోహదం చేస్తూ మరెందరికో ప్రేరణగా నిలుస్తున్నారు. కంగ్రాట్స్ టు అదితి! ఆకులను తగులబెడితే ఏమవుతుంది? ఎండాకులను తగులబెట్టినప్పుడు ధూళి కణాలు గాలిలో కలుస్తాయి. భూతాపాన్ని పెంచే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సయిన్, మిథేన్ వంటి వాయువులు విడుదలవుతాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులనూ కలిగిస్తాయి. చెట్లు రాల్చే ఆకులు.. భూమికి చెట్లు కృతజ్ఞతగా తిరిగి ఇస్తున్న పోషకాలు. ప్రకృతిలో, అడవిలో రాలిన ఆకులు దొంతర్లుగా పేరుకొని భూమికి ఆచ్ఛాదన కల్పిస్తున్నాయి. వర్షానికి తడిచిన ఆకులు కుళ్లి భూమిని సారవంతం చేస్తాయి. కంపోస్టు చేయడం ద్వారా ఈ ప్రక్రియకు దోహదపడటం మన కర్తవ్యం. (వచ్చే వారం: లీఫ్ కంపోస్టర్‌ను తయారు చేసుకోవడంతోపాటు కంపోస్టు మెళకువలు నేర్చుకుందాం) 1 ఆచ్ఛాదన (మల్చింగ్) చెయ్యండి: ఎండాకులను మొక్కలు, చెట్ల దగ్గర నేలపై ఎండ పడకుండా మల్చింగ్ చేయాలి. ఎండ నేరుగా నేలకు తగలకుండా ఆకులతో ఆచ్ఛాదన కల్పిస్తే మట్టిలో ఉండే సూక్ష్మజీవులు, వానపాములకు మేలు జరుగుతుంది. కాలక్రమంలో ఆకులు కుళ్లి భూమిని సారవంతం చేస్తాయి. ∙ 2కంపోస్ట్ చెయ్యండి: ఎండాకులను కుళ్లబెట్టి కంపోస్టు తయారు చేయండి. కంపోస్టు చేయడానికి మూడు పద్ధతులు ఉన్నాయి. ఎ) ఇంటి ఆవరణలో ఒక మూలన గుంత తవ్వి ఆకులను అందులో వేయటం. బి) ఇనుప మెష్‌తో ట్రీగార్డు మాదిరిగా గంపను తయారు చేసి అందులో ఎండాకులు వేసి ఎక్కడికక్కడే కంపోస్టు తయారు చేయడం. సి) ఎండాకులను కుప్పగా పోసి కూడా కంపోస్టు చెయ్యొచ్చు. ఈ మూడు పద్ధతుల్లోనూ ఆకులను తేమగా ఉండేలా నీరు పోస్తుండాలి. పేడనీరు లేదా జీవామృతం లేదా వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం లేదా లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియా ద్రావణం లేదా పుల్లమజ్జిగ వంటి సేంద్రియ పదార్థాన్ని కుళ్లింపజేసే సూక్ష్మజీవరాశి ఉండే కల్చర్‌ను కలపాలి 3 ఇతరులకివ్వండి: పట్టణాలు, నగరాలలో నివసించే వారు ఇంటి దగ్గర లేదా కాలనీ రోడ్లపై లేదా పార్కుల్లో చెట్లు రాల్చే ఆకులను కంపోస్టు చేసే ఉద్దేశం లేకపోతే వాటిని కంపోస్టు చేసుకోదలచిన వారికి అందించడం ఉత్తమం. పుణే వాసులు ఎండాకులను ఇచ్చి పుచ్చుకోవడానికి వీలుగా అదితి బ్రౌన్‌లీఫ్ పేరుతో వాట్సప్‌గ్రూప్, ఫేస్బుక్ ఖాతాతోపాటు వివరంగా చర్చించేందుకు వెబ్‌సైట్‌ను సైతం ప్రారంభించారు. తొలి ఏడాదే 500 బస్తాల ఎండాకులను ప్రజలు ఇతరులకు అందించారట. సోషల్ మీడియా ద్వారా సామాజికోద్యమం ప్రారంభించి ఉండకపోతే ఈ ఆకులన్నిటినీ తగులబెట్టి ఉండేవారని, ఇప్పుడు ఇలా సద్వినియోగం అయ్యాయని ఆమె సంతోషంగా చెబుతారు. అయితే, రెండో ఏడాదికి ఆకులను ఇతరులకిస్తాం అనే వారు లేకుండా పోయారట. అంటే అందరూ కంపోస్టు తయారు చేసుకోవడం, దానితో కుండీలలో సేంద్రియ ఇంటిపంటలు పండించడం ప్రారంభించారన్న మాట! ఆకులను తగులబెట్టడం అనర్థదాయకం ఎండాకులను కంపోస్టు చేసే పద్ధతి -
23 ఏళ్లుగా ఇంటిపంటల సాగు
బాల్యంలో పెరటి తోటల పనుల్లో భాగం పంచుకున్న అనుభవాలు ఆమెను చక్కని టెర్రస్ ఆర్గానిక్ కిచెన్ గార్డెనర్‌గా నిలబెట్టాయి. చెన్నైలోని తిరువోత్రియూర్ ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్న పాలిన్ శ్యామ, గోపి నటరాజన్ దంపతులు ప్రకృతికి అనుగుణమైన జీవన శైలిని గత 23 ఏళ్లుగా అనుసరిస్తున్నారు. సుమారు 50 రకాల పండ్లు, కూరగాయలను తమ ఇంటి మేడపైనే పాలిన్ సునాయాసంగా పెంచుతున్నారు. ‘నేను కేరళలో పుట్టాను. మా ఇంటి పెరట్లో కూరగాయలు, పండ్లు, పూల మొక్కల పెంపకంలో మా తాత గారికి సాయం చేస్తుండేదాన్ని. అప్పట్లో కొబ్బరి పొట్టును ఎరువుగా వేసేవాళ్లం. రుచికరమైన సొంత కూరగాయలు, పండ్లు తిన్న బాల్యానుభవమే పెళ్లయి మద్రాసు వచ్చాక టెర్రస్ ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ పెట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది’ అంటున్నారు పాలిన్. మొక్కలకు పోషకాలు అందించేందుకు 23 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ, తప్పులు చేస్తూ నేర్చుకున్నానని ఆమె అంటున్నారు. వంటింటి తడి వ్యర్థాలు ఏవైనా సరే మున్సిపాలిటీ వాళ్లకు ఇవ్వకుండా కంపోస్టు తయారు చేసుకుంటూ, ఆ కంపోస్టుతోనే టెర్రస్ మీద కుండీలు, గ్రోబాగ్స్‌లో కూరగాయలు, పండ్లు పండించుకుంటున్నారామె. 3 మట్టి పాత్రలలో (ప్లాస్టిక్ బకెట్లలో కూడా కంపోస్టు చేసుకోవచ్చు) వ్యర్థాలు, మట్టిని పొరలు పొరలుగా వేస్తూ.. రెండు రోజులకోసారి కలియదిప్పుతూ.. పైపైన పుల్లటి మజ్జిగ చిలకరిస్తూ ఉంటే.. 60 రోజుల్లో కంపోస్టు సిద్ధమవుతుందని పాలిన్ తెలిపారు. కుండీలు, గ్రోబాగ్స్‌లో మొక్కలకు నెలకోసారి గుప్పెడు కంపోస్టు వేస్తూ ఉంటానన్నారు. చేపల మార్కెట్‌కు వెళ్లి చేపలు ముక్కలు చేసిన తర్వాత మిగిలిపోయే వ్యర్థాలను తీసుకువచ్చి.. కిలో చేపల వ్యర్థాలకు కిలో బెల్లం కలిపి(నీరు కలపకూడదు).. గాజు పాత్రలో వేసి గట్టిగా మూత పెట్టాలి. 40 రోజులకు మంచి పోషక ద్రవం తయారవుతుంది. అదే ఫిష్ అమినోయాసిడ్. దీన్ని 5ఎం.ఎల్.ను 10 లీటర్ల నీటిలో కలిపి మొక్కలపైన పిచికారీ చేస్తాను, మొక్కల మొదళ్లలో పోస్తాను అన్నారామె. కోడిగుడ్ల పెంకులను పిండి చేసి కాల్షియం కోసం మొక్కలకు వేస్తూ ఉంటారు. తన కిచెన్ గార్డెన్లో ఉన్న 75 కుండీల్లో పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పెంచుకునే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు, బోన్సాయ్ మొక్కల ఉత్పాదకత చాలా బాగుందని సంతోషంగా చెబుతున్నారు. చెన్నై అనగానే నీటికొరతే గుర్తుకొస్తుంది. అయితే, టెర్రస్ మీద నుంచి వర్షపు నీటిని వృథా పోనియ్యడం లేదు. వాన నీటిని తమ ఇంటి ఆవరణలోని బోరుకు రీచార్జ్ చేసేందుకు వాడుతున్నారు. తద్వారా మండు వేసవిలోనూ నీటి కొరత ఉండటం లేదన్నారు. పర్యావరణ అనుకూల జీవనవిధానాన్ని అనుసరిస్తూ చక్కని ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు పండించుకొని తినడంతోపాటు నీటి సంరక్షణ చేస్తూ పాలిన్, గోపి నటరాజన్ దంపతులు నగరవాసులకే ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ స్పృహతో నాగరికతకు సరికొత్త అర్థం చెబుతున్నారు. గోపి, పాలిన్ శ్యామ దంపతులు -
గడ్డికి అగ్గి.. భూసారం బుగ్గి!
పంట కోతలు, నూర్పిళ్లు పూర్తయ్యాక గడ్డిని, మోళ్లకు నిప్పంటించడం అనే దురలవాటు వల్ల గాలి కలుషితమవుతుండటమే కాకుండా భూసారం నాశనమవుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల గాలిలో ధూళికణాల సాంద్రత ప్రమాదకర స్థాయికి పెరిగిపోవటంతో ఇటీవల కొన్ని రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించాల్సి రావడం మనకు తెలుసు. ఈ దుస్థితికి ఒకానొక ముఖ్య కారణం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో వరి పంటను యంత్రంతో కోసిన తర్వాత మిగిలే మోళ్లను తగులబెట్టడమేనని తెలిసిందే. ఇలా పంట పొలాల్లో గడ్డీ గాదాన్ని వదిలించుకోవడానికి నిప్పు పెట్టటం వల్ల గాలి పీల్చడానికి పనికిరానంత పాడైపోతోంది సరే. అయితే, భూమికి ఏమేరకు నష్టం జరుగుతోంది? దేశంలో ఏటా 50 కోట్ల టన్నుల పంట వ్యర్థాలను తగులబెడుతున్నారు. రైతులు తగులబెడుతున్న పంటవ్యర్థాల్లో వరి, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్య పంటల మోళ్లను, చెరకు ఆకులే 70% వరకు ఉంటాయని, ఇందులో 34% వరి గడ్డి, 22 శాతం గోధుమ గడ్డి ఉన్నాయని ప్రభుత్వ నివేదిక చెబుతోంది. పంజాబ్‌లో ఏటా 2 లక్షల టన్నుల వరి గడ్డి ఉత్పత్తవుతుండగా, ఇందులో 80 శాతం గడ్డిని తగులబెడుతున్నారు. పొలంలో గడ్డికి నిప్పంటిస్తే ఆ భూమిలో ఒక సెంటీమీటరు లోతు వరకు భూమి పైపొరలో మట్టి 33.8–42.2 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతకు గురవుతుంది. ఫలితంగా భూసారానికి అత్యంత కీలకమైన సూక్ష్మజీవరాశి, శిలీంధ్రాల సంతతి నశించిపోతుంది. అంతేకాదు, భూమి సేంద్రియ లక్షణం కూడా నాశనమవుతుంది. భూమి పైపొరలోని మేలు చేసే మిత్రపురుగులు నశించిపోవడం వల్ల పంటలపై శత్రుపురుగుల దాడి పెరిగిపోతుంది. తగులబడిన భూమి పైపొర మట్టికి నీట కరిగే సామర్థ్యం తగ్గిపోతుంది. ఒక టన్ను పంట వ్యర్థాలను తగులబెట్టినప్పుడు మట్టిలోని సేంద్రియ కర్బనంతోపాటు (5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల ఫాస్ఫరస్, 25 కిలోల పొటాషియం, కిలోకు పైగా గంధకం వంటి) 33.8 కిలోల పోషకాలు నాశనం అవుతున్నాయని ఒక అంచనా. ఖరీఫ్‌లో వరి కోసిన తర్వాత కొద్ది రోజుల్లోనే గోధుమ నాటుకోవాల్సిన అవసరం కొద్దీ రసాయనిక వ్యవసాయం చేసే రైతులు కంబైన్ హార్వెస్టర్ ద్వారా వరి ధాన్యం నూర్పిడి చేసిన తర్వాత మోకాళ్ల ఎత్తున ఉండే మోళ్లను, గడ్డిని తగులబెడుతున్నారు. ప్రభుత్వం నిషేధించినా, జరిమానాలు విధించినా రైతులు ఈ అలవాటు మానలేకపోతున్నారు. అయితే, ఒక అధ్యయనం ప్రకారం పంజాబ్, హర్యానా ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు గడ్డిని అసలు తగులబెట్టడం లేదని తేలింది. ఒకటికి నాలుగు పంటలను కలిపి పండించడం, పంట వ్యర్థాలను భూమికి ఆచ్ఛాదనగా లేదా కంపోస్టు తయారీకి వాడుకోవడం(వ్యర్థాల పునర్వినియోగం).. ఇవి సేంద్రియ సేద్యంలో ముఖ్యమైన నియమాలు. అందువల్ల సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించే రైతులకు గడ్డిని తగులబెట్టే అవసరం రావడం లేదన్న మాట. రసాయనిక వ్యవసాయం, ఏక పంటల సాగు పద్ధతిలోనే ఈ సమస్య మూలాలున్నాయని గ్రహించాలి. కంపోస్టు తయారీ పద్ధతి వరి గడ్డి వంటి పంట వ్యర్థాలను పశువుల పేడ, మూత్రాన్ని కలిపి సూక్ష్మజీవుల తోడ్పాటుతో కుళ్లబెట్టి కంపోస్టు ఎరువును తయారు చేసుకోవచ్చు. రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతు, తగినంత పొడవుతో గొయ్యి తీయించాలి. అందులో చెత్తను ఆరు అంగుళాల మందం వరకు నింపి, దానిపై పేడ నీటిని, పశుమూత్రాన్ని చల్లాలి. తిరిగి ఇంకొక 6 అంగుళాల మందం వరకు మళ్లీ గడ్డి, పొట్టు వంటి సేంద్రియ వ్యర్థాలు వేయాలి. తిరిగి పేడ నీటిని, పశుమూత్రాన్ని చల్లాలి. ఈ విధంగా గడ్డి గాదాన్ని పొరలు పొరలుగా వేస్తూ.. భూమిపై ఎత్తుగా దిబ్బ వేసుకోవాలి. దిబ్బ లోపలికి గాలి పోకుండా పేడతో పూత పూయాలి. సూక్ష్మజీవుల చర్య ద్వారా గొయ్యిలో వేసిన గడ్డీ గాదం కుళ్లి సుమారు 90–100 రోజుల్లో మంచి సారవంతమైన కంపోస్టు తయారవుతుంది. -
రెడ్ జామ టేస్ట్ సూపర్!
ఇంటిపంటల్లో విలక్షణ పండ్ల రకాలను పెంచటంపై హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ఇంటిపంటల సాగుదారు వి.ఎం. నళినికి ఆసక్తి మెండు. 300 పైచిలుకు కుండీలతో కళకళలాడుతూ ఉండే ఆమె టెర్రస్ కిచెన్ గార్డెన్లో అరుదైన పండ్ల మొక్కల్లో రెడ్ మలేసియన్ జామ ఒకటి. ఈ మొక్కను ఆరేళ్ల క్రితం కొని, అడుగున్నర చుట్టుకొలత, అడుగున్నర ఎత్తు గల సిల్పాలిన్ గ్రోబాగ్‌లో నాటారు. కొబ్బరి పొట్టు, పశువుల ఎరువు, ఎర్రమట్టిని సమపాళ్లలో కలిపిన మట్టిమిశ్రమంలో మొక్క నాటారు. ఎండు గడ్డిను మట్టిపై ఎండపడకుండా ఆచ్ఛాదన చేశారు. 15–20 రోజులకోసారి జీవామృతం లేదా కంపోస్టు లేదా పశువుల ఎరువు రెండు గుప్పిళ్లు తప్పకుండా వేస్తూ పోషకాల లోపం రాకుండా చూసుకుంటారు. చీడపీడల జాడ లేదు. చక్కగా కాస్తున్నది. కాయలో గుజ్జు ఎక్కువ. గింజల సంఖ్య తక్కువే. అవి కూడా మెత్తగా ఉంటాయి. రుచి సూపర్‌గా ఉందని నళిని తెలిపారు. తమ కుటుంబానికి అవసరమైన పండ్లు, కూరగాయలను చాలా వరకూ ఆమె స్వయంగా సాగు చేసుకుంటున్నారు. -
ఇంటిపంటల కోసమే సిటీకి దూరంగా సొంతిల్లు!
వరంగల్‌లో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రేగూరి సింధూజ ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాద్ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. రసాయనిక అవశేషాలు లేని ప్రకృతిసిద్ధమైన ఆహారం విలువ గుర్తెరిగిన ఆమె.. సిటీలో ఫ్లాట్‌కు బదులు (బీహెచ్ఈఎల్ దగ్గర) నగర శివారు ప్రాంతం అమీన్పూర్ నరేంద్ర నగర్ కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకున్నారు. 200 గజాల టెర్రస్‌లో సగభాగంలో వందకు పైగా గ్రోబాగ్స్, కుండీలలో గత ఏడాదిగా ఇంటిపంటలు పండించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యాన శాఖ నుంచి 4 పెద్ద వృత్తాకారపు గ్రీన్ గ్రోబాగ్స్తో కూడిన సబ్సిడీ కిట్‌ను తీసుకున్నారు. శిక్షణా శిబిరాలకు హాజరై అవగాహన పెంచుకున్నారు. వీటితోపాటు తెల్లని గ్రోబాగ్స్‌ను, కొబ్బరిపొట్టు తదితర పరికరాలను సేకరించుకున్నారు. 30%మట్టి, 30%పశువుల ఎరువు, 30% శుద్ధి చేసిన కొబ్బరిపొట్టు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన ఇంటి కంపోస్టు+వేపపిండితో కలిపిన మట్టి మిశ్రమాన్ని గ్రోబాగ్స్, కుండీలలో నింపారు. వేసవి ఎండ తీవ్రత నుంచి ఇంటిపంటలను కాపాడుకోవడానికి ఇనుప ఫ్రేమ్‌తో షేడ్‌నెట్ వేసుకున్నారు. సింధూజ కుటుంబంలో నలుగురు పెద్దవారు ఉంటారు. పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర, కొత్తిమీర, బచ్చలి కూర పెంచుకొని తింటున్నారు. గత ఏడాదిగా ఆకుకూరలను బయట కొనటం లేదు. తీగజాతి కూరగాయలను పాకించడానికి కొబ్బరి తాళ్లతో పందిరి అల్లారు. బెండ, బీర, గోరుచిక్కుడు, కాప్సికం, సొర తదితర కూరగాయలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం వారంలో 2,3 రోజులు ఈ కూరగాయలు తింటున్నామని, కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో ఇంటి కూరగాయలే తమకు సరిపోతాయని సింధూజ(98857 61707) సంతోషంగా చెప్పారు. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా నిపుణుల సలహాలను తెలుసుకుంటున్నానన్నారు. -
ప్లాస్టిక్ కాలుష్యానికి బయో ప్లాస్టిక్ సమాధానమా ?
ప్రస్తుతం రోజువారి జీవితంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు చర్చనీయాంశమయ్యాయి. వివిధ రూపాల్లో ప్లాస్టిక్ సంచుల ఉపయోగాన్ని తిరస్కరించాలనే పాత డిమాండ్ ఓ వైపు కొనసాగుతున్న కేవలం ఓ సారి వినియోగానికే ఉద్ధేశించిన ప్లాస్టిక్ నియంత్రణకు ఇప్పుడు ప్రాధాన్యం ఏర్పడింది. బయో డీగ్రేడబుల్ లేదా బయో ప్లాస్టిక్స్ వినియోగానికి మధ్యతరగతి మొగ్గుచూపుతోంది. వీటిని మొక్కలు, తదితర పదార్థాలు ఉపయోగించి తయారు చేయడం వల్ల శుద్ధి చేసేందుకు లేదా తిరిగి ఉపయోగించేందుకు ఇవి కలిసొస్తాయి. అంతేకాకుండా తక్కువ కాలుష్యానికి కూడా ఇవి కారణమవుతాయి. భారత్‌లో వీటి వినియోగం ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్టుగా చెబుతున్నారు. కొన్ని సింగిల్ యూస్’ (ఒకేసారి వినియోగం) ప్లాస్టిక్స్‌కు కూడా ప్రత్యామ్నాయాలున్నాయి. తినుబంఢారాలు లేదా పానీయాల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ సాఛెట్లకు బదులు సీసంతో కూడిన వస్తువులు ఉపయోగించవచ్చు . స్టయిరోఫోమ్ ప్లేట్లకు బదులు ఆకులు, బయోమాస్‌తో తయారు చేసిన పళ్లాలు వాడవచ్చు. చెత్తబుట్టల్లో వ్యర్థాలు వేసేందుకు ఉపయోగించే ‘ప్లాస్టిక్ బిన్ లైనర్లు’ బయో ప్లాస్టిక్స్‌లో అత్యధిక ఆదరణ పొందిన రకాలుగా నిలిచాయి. వీటి కోసం డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. బయోప్లాస్టిక్స్ ఎన్ని రకాలు... వివిధ రూపాల్లో నశించేందుకు (డీగ్రేడ్) వీలుగా బయోప్లాస్టిక్స్ రూపొందినట్టు చెబుతుంటారు. అయితే వాటిలో ఎరువుగా (కంపోస్ట్) మారేవిగా మార్కెట్ చేస్తున్నవీ ఉన్నాయి. ఫోటో డీగ్రేడబుల్ ప్లాస్టిక్ అనేది మరో బయోప్లాస్టిక్గా గుర్తింపు పొందింది. సూర్యక్రాంతి తగిలితే క్రమంగా క్రమంగా క్షీణించే విధంగా వీటిని తయారుచేశారు. నీరు తగిలితే అతి చిన్న చిన్న ముక్కలుగా (2 మిల్లీమీటర్ల కంటే చిన్నగా) విడిపోయేలా బయోడీగ్రేడబుల్‌గా రూపొందించినవి ఉన్నాయి. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు చూడడం కంటే ఆధునిక జీవనశైలిలో భాగంగా అనుసరిస్తున్న విధానాలు, కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశలో చర్యలు తీసుకుంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే బయో ప్లాస్టిక్స్‌లో కొంతలో కొంతైన పరిస్థితిలో మార్పు వస్తుందని సూచిస్తున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వంటింటి తడి చెత్తతో కుండీల్లోనే కంపోస్టు!
అపార్ట్మెంట్లలో నివసించే కుటుంబం వంటింటి తడి చెత్తను బయట పారేయకుండా చేయగలగడం ఎలా? ఈ సమస్యకు సరైన పరిష్కారం వెదకగలిగితే నగరాలు, పట్టణాల్లో మున్సిపాలిటీ వాళ్లకు చెత్తకు సంబంధించి సగం యాతన/ఖర్చు తగ్గుతుంది. ఈ దిశగా ఓ యువకుడి అన్వేషణ చక్కని పరిష్కారాన్ని ఆవిష్కరించింది. బాల్కనీలో ఐదు కుండీలు పెట్టుకొని ఆకుకూరలు పెంచుతూ, ఆ కుండీల్లోని మట్టిలోనే ఒక మూలన చెత్త డబ్బాను ఏర్పాటు చేసుకొని వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసే(వార్మ్బిన్) పద్ధతిని అనుసరిస్తున్నారు. టేకూరు రవిశంకర్ స్వస్థలం నెల్లూరు రూరల్ మండలంలోని వెంకన్నపాలెం. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలో అపార్ట్మెంట్లో నివాసం. బాల్కనీలో 5 కుండీలను ఏర్పాటు చేసుకొని పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీరను సాగు చేసుకుంటూ సేంద్రియ ఆహారాన్ని తింటున్నారు. వంటింటి నుంచి వెలువడే తడి చెత్తను బాల్కనీలో వాసన ఇతరత్రా ఇబ్బందులూ లేకుండా కంపోస్టుగా మార్చడానికి రవిశంకర్ చేయని ప్రయత్నాల్లేవు.. చివరకు మొక్కలు పెరుగుతున్న కుండీల్లోనే.. వంటింటి వ్యర్థాలను కంపోస్టుగా మార్చే ఉపాయాన్ని ఆలోచించి, విజయవంతంగా ఆచరణలో పెట్టారు. నిశ్చింతగా కంపోస్టు తయారు చేసుకోవడం, ఆకుకూరలు పండించుకోవడం సజావుగానే సాగుతోంది. బాల్కనీలో 3 అడుగుల పిట్టగోడపైన గ్రిల్స్ బిగించి అక్కడ కుండీలను ఏర్పాటు చేశారు. 3 అడుగుల ఎత్తయిన కుండీలను తీసుకొని.. అందులో అర అడుగు ఎత్తు ఉండే ఖాళీ ప్లాస్టిక్ సీసా/డబ్బాను పెట్టారు. డబ్బా అడుగును పూర్తిగా కత్తిరించి తీసేశారు. దానికి చుట్టూతా చిన్నపాటి బెజ్జాలు చేశారు. దాన్ని కుండీలోని మట్టిలో ఒక అంగుళం పైకి కనపడే విధంగా పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆకుకూరలు పెరిగే కుండీలోనే వానపాములు కంపోస్టు తయారు చేసే డబ్బానొకదాన్ని(దీనికి ‘వార్మ్ బిన్’ అని పేరు పెట్టారు) ఏర్పాటు చేశారన్నమాట. రెండు రోజులకోసారి... ప్లాస్టిక్ డబ్బాలో అడుగున (బొమ్మలో చూపిన విధంగా) అడుగున ఒకటి, కొంచెం కంపోస్టు వేసి.. ఆపైన పండ్లు, కూరగాయల తొక్కలు వేసి, గుడ్డను కప్పుతారు. డబ్బాకు పైన మూతపెడతారు. కొద్ది రోజుల్లోనే వానపాముల సంఖ్య పెరిగి ఈ తడి చెత్తను తింటూ కంపోస్టుగా మారుస్తూ ఉంటాయి. రెండు రోజులకోసారి వంటింట్లో కూరగాయలు, పండ్లు వేసి, మూత పెడుతూ ఉంటే చాలు.. వానపాములు ఈ డబ్బా అడుగు నుంచి, పక్కన బెజ్జాలలో నుంచి కిందికీ పైకి తిరుగుతూ తడి చెత్తను తింటూ కంపోస్టుగా మారుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వెలువడే పోషక ద్రవం మొక్కల వేళ్లకు ఎప్పటికప్పుడు అందుతూ చక్కని పోషకాలను అందిస్తూ ఉంటుందంటున్నారు రవిశంకర్(97030 16820). -
వర్మి కంపోస్ట్ కొనుగోలు
– ముందుకు వచ్చే రైతులతో ఎంఓయూ - అధికారుల సమీక్షలో కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : రైతులు తయారు చేసిన వర్మికంపోస్ట్ వారి అవసరాలు పోను మిగిలినది ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. దీనికి సంబంధించి ఎవరైనా ముందుకు వస్తే వారితో ఎంఓయూ చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. గ్రామ పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వర్మీ కంపోస్ట్ యూనిట్లను మంజూరు చేశామని, రైతులకు కూడా 15 యూనిట్లు మంజూరు చేశామన్నారు. ఇరిగేషన్‌కు సంబంధించి కాలువల్లో గుర్రపు డెక్కను ఉపాధి హామీ పథకంలో తొలగించడానికి చర్యలు చేపట్టాలని డ్వామా పీడీకి సూచించారు. ఏజెన్సీలో ఇచ్చిన 50 శాతం సీసీ రోడ్డు పనులను పంచాయతీరాజ్‌శాఖ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏజెన్సీ, సబ్‌ప్లాన్‌లోని 15 మండలాల్లోని గర్భిణులకు ఏడో నెల నుంచి ప్రసవం అయిన మూడు నెలల వరకు పౌష్టికాహారాన్ని అందించాలని, ఇందుకు డీఎంహెచ్ఓ, డీఆర్డీఏ పీడీ, ఐసీడీఎస్ పీడీ సమన్వయంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ మీ–కోసంలో వచ్చిన దరఖాస్తులన్నీ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక వివరాల నివేదికను వెంటనే సమర్పించాలని, 15వ తేదీన ఈ అంశంపై చీఫ్ సెక్రటరీతో కలెక్టర్ల సమీక్ష ఉంటుందని జేసీ తెలిపారు. నగదు రహిత లావాదేవీలకు సంబంధించి భీమ్ యాప్‌ను ఉద్యోగులందరూ ఉపయోగించాలన్నారు. జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, జెడ్పీ సీఈఓ కె.పద్మ, సీపీఓ మోహన్‌రావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గ్రామానికి పది కంపోస్టు యార్డులు
ఆదోని రూరల్: ప్రతి గ్రామంలో పది వర్మీ కంపోస్టు యార్డులు ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ పథకం సిబ్బందిని డ్వామా పీడీ పీడీ పుల్లారెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక ఉపాధి హామీ కార్యాలయ సమావేశ భవనంలో ఆదోని, కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చేపట్టే మరుగుదొడ్ల నిర్మాణం, ఫారంపాండ్స్, వర్మీ కంపోస్టు యార్డుల లక్ష్యంపై మాట్లాడారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చాలా గ్రామాల్లో పనులు పూర్తి కాలేదనే ఆరోపణలు ఉన్నాయన్నారు. లక్ష్యాలను పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా మానిటరింగ్ అధికారిణి సులోచన తదితరులు పాల్గొన్నారు. -
వర్మీ కంపోస్టు, నాడెప్ యూనిట్లకు పోత్సాహం
కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : జిల్లాలో వర్మీ కంపోస్టు యూనిట్లతో బాటు నాడెప్ యూనిట్లను కూడా ప్రోత్సహించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం వివిధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ఈ సంవత్సరం 15 వేల వర్మీ కంపోస్టు యూనిట్ల ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటివరకూ 300 ఏర్పాటు చేశారన్నారు. వానపాముల వినియోగం లేకుండా నూతనంగా రూపొందించిన నాడెప్ యూనిట్లలో చెత్త, పేడ, గడ్డి, ఆకులు, కొమ్మలు వంటి వ్యర్థ పదార్థాలను ఎరువుగా మార్చవచ్చన్నారు. రూ.10 వేలు ఖర్చయ్యే ఈ యూనిట్లను ఉపాధి హామీ పథకం ద్వారా ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఐదు నెలల్లో ఉపాధి హామీ, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మొత్తం 60 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టవలసి ఉంటుందన్నారు. ఏజెన్సీలో దోమతెరల పంపిణీకి ఆదేశం ఏజెన్సీలో పంపిణీకి 1.03 లక్షల దోమ తెరలు సోమవారం జిల్లాకు వచ్చాయన్నారు. వీటిని మంగళవారం నుంచి ఏజెన్సీలో పంపిణీ చేయాలని ఆదేశించారు. కుటుంబంలోని సభ్యుల ఆధారంగా వివిధ సైజులలో దోమతెరలను పంపిణీ చేస్తారన్నారు. జెడ్పీ నిర్ణయాలపై స్పందించాలి ఇటీవల జెడ్పీ సర్వసభ్య సమావేశాలలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.వివిధ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల యూనిట్ల మంజూరు, గ్రౌండింగ్లపై శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా వెబ్సైట్లో డేష్ బోర్డు జిల్లా వెబ్సైట్లో జిల్లా డేష్బోర్డులో వివిధ శాఖల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చన్నారు. మీకోసం పోర్టల్‌లో పెండిం గ్లో ఉన్న ఫిర్యాదులపై తగు చర్యలను నిర్ణీత కాలంలో చేపట్టాలనిÜూచించారు. ఈ సమావేశంలో జేసీ ఎస్.సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం రవాణాపై నిఘా కాకినాడ సిటీ : ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్ల నుంచి రవాణా చేసి జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు కొంతమంది మిల్లర్లు చూపుతున్న విధానంపై నిరంతర నిఘా అవసరమని కలెక్టర్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్షించా రు. వాణిజ్య పన్నుల శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ కమిటీల స హకారంతో ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రవాణా అక్రమాల ను అరికట్టాలన్నారు. చెక్‌పోస్ట్‌లను అప్రమత్తం చేసి, కోతలు మొ దలయ్యే ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ వరకూ నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై ప్రాథమిక పరపతి సంఘాలు, డ్వాక్రా మహిళల ద్వారా ప్ర చారం చేయించాలని డీసీఓ, డీఆర్డిఏ అధికారులను ఆదేశించారు. -
వ్యర్థాలనుంచి కంపోస్ట్ ప్రచారంలో అమితాబ్
న్యూఢిల్లీః బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ స్వచ్ఛభారత్ మిషన్ ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అభ్యర్థన మేరకు 'వేస్ట్ టు కంపోస్ట్' ( వ్యర్థాలనుంచి ఎరువులు) ప్రచారంలో ప్రధాన పాత్రను పోషించనున్నారు. చెత్తను సేకరించి ఎరువుల కంపెనీలకు అమ్మకాలు చేపట్టడం, వ్యర్థాలనుంచి ఎరువుల తయారీ వంటి విషయాలపపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బిగ్ బీ ముందుకొచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ ప్రచార కార్యక్రమంలో అమితాబచ్చన్ ప్రధాన పాత్ర వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా నగరాల్లో పేరుకునే వ్యర్థాలను ఎరువులుగా మార్చి పొలాలకు ఉపయోగించే ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచనున్నారు. ఈ సందర్భంలో నగరాల్లోని చెత్తను కంపోస్ట్ గా మార్చే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు మీరు అంగీకరించడం ఎంతో ఆనందంగా ఉందని, అందుకు మీకు కృతజ్ఞతలు అంటూ జూన్ 20న పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ బిగ్ బీ కి ప్రత్యేక లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. చెత్తను కంపోస్ట్ గా మార్చి, ఇళ్ళలోని గార్డెన్లలో వినియోగించేందుకు ప్రజలకు, నర్సరీల యజమానులకు, ఉద్యానవన సంస్థలు, ఏజెన్సీలకు రేడియో, టీవీ ప్రకటనలు పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించడంలో వ్యక్తిగతంగానూ, వాయిస్ ద్వారానూ భాగం పంచుకొంటూ.. స్వచ్ఛభారత్ ప్రచారంలో అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ మంత్రిత్వ శాఖ సదరు లేఖలో తెలిపింది. అత్యధిక చెత్త ఏర్పడే అవకాశం ఉన్న హోటల్స్, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ప్రత్యేక పరికరాలను ఏర్పాటుచేసి సేంద్రీయ వ్యర్థాలను విడివిడిగా వేయాలన్న విజ్ఞప్తుల ద్వారా పౌరులను ప్రోత్సహించడంలోనూ, బహుళ వేదికల ద్వారా సమాచార ప్రచారాన్ని చేరవేయడంలోనూ అమితాబ్ క్రియాశీలక పాత్ర పోషించేందుకు మంత్రిత్వ శాఖ ప్రణాళికలు చేస్తోంది. ఐదేళ్ళ గడువులోగా దేశం మొత్తం పరిశుభ్రంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో 2014 అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ అభియాన్, క్లీన్ ఇండియా మిషన్ కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.