ఆదోని రూరల్: ప్రతి గ్రామంలో పది వర్మీ కంపోస్టు యార్డులు ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ పథకం సిబ్బందిని డ్వామా పీడీ పీడీ పుల్లారెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక ఉపాధి హామీ కార్యాలయ సమావేశ భవనంలో ఆదోని, కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చేపట్టే మరుగుదొడ్ల నిర్మాణం, ఫారంపాండ్స్, వర్మీ కంపోస్టు యార్డుల లక్ష్యంపై మాట్లాడారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చాలా గ్రామాల్లో పనులు పూర్తి కాలేదనే ఆరోపణలు ఉన్నాయన్నారు. లక్ష్యాలను పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా మానిటరింగ్ అధికారిణి సులోచన తదితరులు పాల్గొన్నారు.