ఇంటిపంటల కోసమే సిటీకి దూరంగా సొంతిల్లు! | For the home crops alone, the city is over! | Sakshi
Sakshi News home page

ఇంటిపంటల కోసమే సిటీకి దూరంగా సొంతిల్లు!

Published Tue, Jul 3 2018 3:59 AM | Last Updated on Tue, Jul 3 2018 4:23 AM

For the home crops alone, the city is over! - Sakshi

వరంగల్‌లో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రేగూరి సింధూజ ఇంజనీరింగ్‌ చదువుకొని హైదరాబాద్‌ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. రసాయనిక అవశేషాలు లేని ప్రకృతిసిద్ధమైన ఆహారం విలువ గుర్తెరిగిన ఆమె.. సిటీలో ఫ్లాట్‌కు బదులు (బీహెచ్‌ఈఎల్‌ దగ్గర) నగర శివారు ప్రాంతం అమీన్‌పూర్‌ నరేంద్ర నగర్‌ కాలనీలో ఇండిపెండెంట్‌ హౌస్‌ నిర్మించుకున్నారు. 200 గజాల టెర్రస్‌లో సగభాగంలో వందకు పైగా గ్రోబాగ్స్, కుండీలలో గత ఏడాదిగా ఇంటిపంటలు పండించుకుంటున్నారు.

తెలంగాణ ఉద్యాన శాఖ నుంచి 4 పెద్ద వృత్తాకారపు గ్రీన్‌ గ్రోబాగ్స్‌తో కూడిన సబ్సిడీ కిట్‌ను తీసుకున్నారు. శిక్షణా శిబిరాలకు హాజరై అవగాహన పెంచుకున్నారు. వీటితోపాటు  తెల్లని గ్రోబాగ్స్‌ను, కొబ్బరిపొట్టు తదితర పరికరాలను సేకరించుకున్నారు. 30%మట్టి, 30%పశువుల ఎరువు, 30% శుద్ధి చేసిన కొబ్బరిపొట్టు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన ఇంటి కంపోస్టు+వేపపిండితో కలిపిన మట్టి మిశ్రమాన్ని గ్రోబాగ్స్, కుండీలలో నింపారు. వేసవి ఎండ తీవ్రత నుంచి ఇంటిపంటలను కాపాడుకోవడానికి ఇనుప ఫ్రేమ్‌తో షేడ్‌నెట్‌ వేసుకున్నారు.

సింధూజ కుటుంబంలో నలుగురు పెద్దవారు ఉంటారు. పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర, కొత్తిమీర, బచ్చలి కూర పెంచుకొని తింటున్నారు. గత ఏడాదిగా ఆకుకూరలను బయట కొనటం లేదు. తీగజాతి కూరగాయలను పాకించడానికి కొబ్బరి తాళ్లతో పందిరి అల్లారు. బెండ, బీర, గోరుచిక్కుడు, కాప్సికం, సొర తదితర కూరగాయలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం వారంలో 2,3 రోజులు ఈ కూరగాయలు తింటున్నామని, కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో ఇంటి కూరగాయలే తమకు సరిపోతాయని సింధూజ(98857 61707) సంతోషంగా చెప్పారు. ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్‌ గ్రూపుల ద్వారా నిపుణుల సలహాలను తెలుసుకుంటున్నానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement