sagu badi
-
మునగాకు తోట... రెండు నెలలకో కోత!
మునగ సకల పోషకాల గని అని మనకు తెలుసు. సాంబారులో మునక్కాడలు వేసుకోవటం కూడా అందరికీ తెలుసు. అయితే, కాయల్లో కన్నా ఆకుల్లో ఎక్కువ పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తమిళనాడులో, సరిహద్దు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మునగ ఆకును ఆకుకూరగా వాడుకోవటం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు కొందరు రైతులు మునగాకు పొడిని అమ్ముతున్నారు. ఈ పొడితో బిస్కట్లు తదితర ఆహారోత్పత్తులను సైతం తయారు చేసి స్థానికంగానే కాదు, విదేశాలకూ అమ్ముతున్నారు. పొలాల్లోనే కాదు, పెరట్లో కూడా మునగ ఆకుని పండించుకునే ఓ పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...తక్కువ స్థలంలో ఎక్కువ మునగ ఆకులు పండించే సాంద్ర వ్యవసాయ పద్ధతి (ఇంటెన్సివ్ ఫార్మింగ్ సిస్టం) ఇది. పోషకాహార లోపాలకు మునగాకు సరైన మందు. పోషకాహార లోపం నివారణకు వివిధ పద్ధతుల్లో మునగ ఆకు ఉత్పత్తుల వాడకం పెరిగింది. మరి ఇంటి పెరట్లోనే ఇంటెన్సివ్‌గా మునగాకు తోటలను సాగు చేయటం ఎలా? ఇంటి పెరటిలో కొద్దిపాటి స్థలంలో మునగ తోట పెంపకాన్ని చేపడితే ఏడాదంతా తాజా మునగాకును పొందవచ్చు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే మంచి పంట వస్తుంది. ఇంటి పెరట్లోనే కాదు.. పార్కుల్లోని ఖాళీ స్థలాలు, తోటలు, పాఠశాల ఆవరణల్లోనూ ఈ విధానంలో మనుగతోటలను సాగు చేసుకుంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం మన సొంతమవుతుంది. దీనికి అనుసరించాల్సిన పద్ధతులు వరుస క్రమంలో...1. ముందుగా 13 చదరపు అడుగుల స్థలాన్ని ఇంటిపెరటిలో ఎంపిక చేసుకోవాలి. ఇందులో రెండడుగులు లోతు తవ్వాలి. 2. తవ్విన మట్టికి సమాన నిష్పత్తిలో కోళ్ల ఎరువు లేదా వానపాముల ఎరువును కలుపుకోవాలి. 3. తవ్విన గుంతను తిరిగి సేంద్రియ ఎరువుల మిశ్రమంతో నింపాలి. మడిని నీటితో తడుపుతుండాలి. ఆరు వారాల్లో మంచి ఎరువు తయారవుతుంది. 4. మడిని నాలుగు సమాన భాగాలుగా విభజించి గుర్తు పెట్టుకోవాలి.5. మునగ విత్తనాలను నాటుకోవాలి. 6. విత్తనాలపై గడ్డిని పరిచి ఆచ్ఛాదన కల్పించాలి. నీటి తడులివ్వాలి. 7. పెంపుడు జంతువులు, పశువుల నుంచి రక్షణ కల్పించాలి.8. నెల రోజుల వయసున్న మునగ మొక్కలు9. 5 వారాల వయసున్న మునగ మొక్కలు10. 6 వారాల వయసున్న మునగ మొక్కలు11. మూడోసారి కోతకు సిద్ధం 12. భూమి మట్టం నుంచి అడుగున్నర ఎత్తులో కత్తిరించాలి. 13. ఒక పక్క నుంచి కత్తిరించుకుంటూ వెళ్లాలి.14. పూర్తిగా కోసిన మునగ మడి15. కొమ్మలను పరదాపై నీడకింద ఆరబెట్టాలి.16. మూడో కోతలో దాదాపు 90 కిలోల తాజా ఆకుల దిగుబడి వస్తుంది.17. కొమ్మలను పరదాపై నీడ కింద ఆరబెట్టాలి. 20 కిలోల ఆకును నీడలో ఆరబెడితే కిలో మునగాకు పొడిని తయారు చేసుకోవచ్చు. 18. ప్రతి 50–60 రోజులకు ఒకసారి మునగ ఆకు కోతకు సిద్ధమవుతుంది. తాజా ఆకును వాడుకోవచ్చు లేదా నీడలో ఆరబెట్టిన ఆకుతో పొడిని తయారు చేసుకోవచ్చు. కత్తిరించిన తరువాత మునగ మొక్కల మోళ్లు మళ్లీ చివురిస్తాయి. మరో 50 రోజుల్లో కోతకొస్తాయి. తోట ద్రవ జీవామృతం, ఘనజీవామృతం వంటివి తగుమాత్రంగా వాడుతూ పోషకాల లోపం రాకుండా చూసుకుంటే.. ఈ సాంద్ర మునగ ఇలా ఏళ్ల తరబడి పోషకాల గని వంటి మునగాకును ఇస్తూనే ఉంటుంది.ఆరు నెలలు పోషకాలు సేఫ్!భారత ఔషధ, సుగంధ మొక్కల బోర్డు సమాచారం ప్రకారం.. మునగాకు పొడి – ఒక అద్భుతమైన ఆహార పదార్థం. దీనిలో విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు విశేషంగా ఉన్నాయి. పోషకాహార లోపం గల పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే స్త్రీలకు ఉపయోగపడే పోషకాలను ఇస్తుంది. ఏ ఆహారంతోనైనా దీన్ని కలిపి తీసుకోవచ్చు.విత్తనం, మొక్క నాటుకోవాలనేమీ లేదు. కొమ్మను విరిచి నాటితే వేరు పోసుకొని చెట్టుగా ఎదుగుతుంది.చెట్లు నాటుకున్న తరువాత ఎప్పుడైనా మునగాకులు కోసుకోవచ్చు.⇒ మునగ తోటల్లో సంవత్సరానికి 6–9 సార్లు కొమ్మలను భూమి నుండి 15–50 సెం.మీ. ఎత్తు వరకు కత్తిరించుకోవచ్చు⇒ కొమ్మల నుంచి కోసుకున్న తాజా మునగాకును నీటిలో బాగా కడిగి శుభ్రపరచాలి ∙ఆకులను సూర్యరశ్మి తగలని ప్రదేశంలో సహజంగా ఎండబెడితే, ఆకుల్లో ఉన్న విటమిన్లు అలాగే నిక్షిప్తమై ఉంటాయి. పొడి చేయటానికి సులువుగా ఉంటుంది ⇒ ఇలా ఎండిన ఆకులను దంచటం ద్వారా లేదా పిండిమర ద్వారా పొడి చేసుకోవచ్చు ⇒ పొడిని గాలిచొరపడని, తేమలేని సీసాలో పోసుకొని సూర్యరశ్మి తగలకుండా భద్రపరచుకోవాలి ⇒ మునగాకు పొడిని 24 డిగ్రీల సెల్షియస్ కన్నా తక్కువ శీతోష్ణస్థితిలో ఉంచితే, 6 నెలల వరకు తాజాగా పోషక విలువలేవీ కోల్పోకుండా ఉంటుంది ⇒ మునగాకు పొడిని ఆహార పదార్ధాల్లో గాని, పానీయాల్లో గాని కలుపుకోవచ్చు. మునగాకు పొడిని ఆహార పదార్థాలు పూర్తిగా వండిన తర్వాత కలుపుకుంటే పోషక విలువలు మనకు పూర్తిగా లభ్యమవుతాయి. -
ఈ ఆపిల్ ఎక్కడైనా కాస్తుంది!
హిమవత్పర్వత సానువులకే పరిమితమైన ఆపిల్ సాగును మైదానప్రాంతాలకు తీసుకొచ్చారు ఓ సామాన్య రైతు. ఉష్ణమండలప్రాంతాల్లోనూ సాగయ్యే హెచ్‌ఆర్‌ఎంఎన్–49 ఆపిల్ వంగడాన్ని రైతు శాస్త్రవేత్త హరిమాన్ శర్మ(Hariman Sharma) అభివృద్ధి చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని పనియాలా ఆయన స్వగ్రామం. మామిడితో పాటే ఆపిల్ సాగు(Apple Cultivation)... హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కశ్మీర్ రాష్ట్రాల్లోని కొండలపై మాత్రమే ఆపిల్ వాణిజ్య పంటగా సాగులో ఉంది. చల్లని వాతావరణం ఉన్న ఆ కొండప్రాంతాలు మాత్రమే ఆపిల్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ కొండప్రాంతాల్లో మాత్రమే వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే, ఆ రాష్ట్ర రాజధాని సిమ్లా ఆపిల్ సాగులో దేశంలోనే పేరెన్నికగన్నది. కానీ ఆ రాష్ట్రంలోనూ కొండ లోయల్లో, మైదానప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికమే.బిలాస్పూర్ జిల్లా సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక లోయ ప్రాంతం. అక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో రైతులు మామిడి తోటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. అలాంటి వేడి వాతావరణం ఉన్నప్రాంతంలో తన ఇంటి పెరట్లో ఒక ఆపిల్ మొక్క మొలకెత్తటాన్ని హరిమాన్ శర్మ గమనించారు. పనియాలా లాంటి వేడి వాతావరణంలో ఆపిల్ చెట్టు పెరగటం శర్మను ఆలోచనలో పడేసింది. ఆ మొక్కను అతి జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక ఏడాది గడిచాక ఆ ఆపిల్ చెట్టు నుంచి వచ్చిన కొమ్మలను తీసుకొని రేగు మొక్కతో అంటుకట్టారు. ఆప్రాంతంలో అంటు కట్టటానికి కూడా ఆపిల్ చెట్లు అందుబాటులో లేకపోవటమే దీనిక్కారణం. అతని ప్రయోగం విజయవంతమైంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పంట చేతికొచ్చింది! అంతేకాదు.. ఆపిల్ కాయలు సైజులోను, నాణ్యతలోనూ బావున్నాయి. సిమ్లా నుంచి ఆపిల్ విత్తనాలు తెచ్చి పెంచిన మొక్కలతో అంటుకట్టాడు. రెండేళ్ల తరువాత మంచి పంట చేతికొచ్చింది. తను సాగు చేస్తున్న మామిడి చెట్లతో పాటే ఆ ఆపిల్ చెట్లను పెంచాడు. ఆ విధంగా ఒక చిన్న ఆపిల్ తోటనే అతను సృష్టించాడు! సాధారణంగా ఆపిల్‌లో పూత రావలన్నా పిందెలు రావాలన్నా అతి చల్లని వాతావరణం అవసరం. కానీ హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 రకం ఆపిల్‌ను సాధారణ వాతావరణంలోనూ ఉష్ణమండలప్రాంతాల్లోనూ సాగు చేయవచ్చని హరిమాన్ శర్మ చెబుతున్నారు. ఈ మొక్క మూడేళ్లు తిరిగేసరికి కాపుకొస్తుంది. జూన్‌లో కాయటం దీని మరో ప్రత్యేకత. ఆ కాలంలో ఇప్పుడున్న దేశీవాళీ ఆపిల్ కాయలు మార్కెట్లోకి రావు. దీంతో ఈ రకం ఆపిళ్లను సాగు చేసే రైతులు లాభపడుతున్నారు. హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 వంగడంపై నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) దృష్టి కేంద్రీకరించింది. దేశంలోని విభిన్న వ్యవసాయక వాతావరణ పరిస్థితులున్నప్రాంతాల్లో 2015–17 మధ్యకాలంలో ప్రయోగాత్మకంగా సాగు చేయించింది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలితప్రాంతాలకు చెందిన 1,190 మంది రైతులకు 10 వేల ఆపిల్ మొక్కలు ఇచ్చి సాగు చేయించారు. చాలా రాష్ట్రాల్లో సత్ఫలితాలు వచ్చాయని ఎన్.ఐ.ఎఫ్. ప్రకటించింది. పరిశోధనాలయాల్లో సాగులో ఉన్న రకాలతో పోల్చితే హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 పండ్లు నాణ్యమైనవని తేలింది. కొన్ని రాష్ట్రాల్లో ఏడాది వయసున్న మొక్కలకే పూత వచ్చింది.దక్షిణాదిన కర్నాటకలోని చిక్మగుళూరు, హర్యానా రైతులు హెచ్‌ఆర్‌ఎంఎన్–99 ఆపిల్ వంగడాన్ని సాగు చేసి ఏడాదికి రెండు పంటలు తీస్తున్నారు. అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ సాగవుతోంది. మంచి దిగుబడులు వస్తున్నాయి. కాయలు రుచిగా ఉండటంతో కొనేందుకు వినియోగదారులు మక్కువ చూపుతున్నారు. బిలాస్పూర్ జిల్లాలోని కొండ దిగువ జిల్లాల్లోనిప్రాంతాల్లోని వేలాది మంది సాధారణ రైతులకు హరిమాన్ శర్మ స్ఫూర్తి ప్రదాతగా మారారు.అంతకు ముందు ఆప్రాంతంలోని రైతులు తాము ఆపిల్‌ను సాగు చేయటమనేది వారు కలనైనా ఊహించ లేదు. ఆయనను ఇప్పుడు బిస్లాపూర్ జిల్లాలో ‘ఆపిల్ మేన్’ అని ఆత్మీయంగా పిలుస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డులను సంపాయించి పెట్టింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్.ఐ.ఎఫ్. జాతీయ పురస్కారాన్ని,‘ప్రేరణా శ్రోత్’ పురస్కారాన్ని పొందారు. హరిమాన్ శర్మ, పనియాల గ్రామం, బిలాస్పూర్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్ – 174021. ఫోన్: 09418 867209, 09817 284251 , sharmaharimanfarm @gmail.com‘తెలుగు రాష్ట్రాల్లో రైతులకు 15 వేల మొక్కలు అందించాం’మైదానప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల్లోనూ సాగు చేయదగిన ఆపిల్ వంగడాన్ని హారిమన్ శర్మ రూపొందించారు. ఆయన దగ్గరి నుంచి ఈ మొక్కల్ని పల్లెసృజన తరఫున తెప్పించి, తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులకు గత ఐదేళ్లుగా నవంబర్–డిసెంబర్ నెలల్లో ఇస్తున్నాం. ఇప్పటికి సుమారు 15 వేల ఆపిల్ మొక్కల్ని రైతులకు అందించాం. ప్రత్యేకంగా ప్యాక్ చేసి స్పీడ్ కొరియర్లో రైతుల ఊళ్లకే పంపుతున్నాం. ఖర్చులన్నీ కలిపి మొక్క ఖరీదు రూ. 220 అవుతోంది. చాలా చోట్ల ఈ ఆపిల్ చెట్లకు ఇప్పటికే పండ్లు కాస్తున్నాయి. sharmaharimanfarm @gmail.com -
రైతును రాజుగా చేస్తున్న తైవాన్ పింక్ జామ సాగు లక్షల్లో లాభాలు
-
సాగుబడి @5:30Pm 01 డిసెంబర్ 2022
-
సాగుబడి @28 September 2022
-
పెండలం ఆకులతో పురుగుమందులు
కర్ర పెండలం దుంపల్లో చాలా పోషకాలుంటాయని మనకు తెలుసు. అయితే, కర్రపెండలం మొక్కల ఆకులతో చక్కని సేంద్రియ పురుగు మందులను తయారు చేయవచ్చని డా. సి. ఎ. జయప్రకాశ్ నిరూపించడంతోపాటు పేటెంటు సైతం పొందారు. కేరళలోని శ్రేకరియంలో గల కేంద్రీయ దుంప పంటల పరిశోధనా సంస్థ (సిటిసిఆర్‌ఐ) లో ఆయన ప్రధాన శాస్త్రవేత్తగా విశేష పరిశోధనలు చేస్తున్నారు. కర్రపెండలం ఆకులను తిన్న పశువులు చనిపోతాయి. వీటిలో వుండే శ్యానోజన్ అనే రసాయన సమ్మేళనం విషతుల్యమైనది కావటమే ఇందుకు కారణం. ఇది గ్రహించిన డా. జయప్రకాశ్ 13 ఏళ్ల క్రితం పరిశోధనలు ప్రారంభించారు. విశేష కృషి చేసి విజయం సాధించారు. శ్యానోజన్ సమ్మేళనాన్ని ఆకుల్లో నుంచి వెలికితీయడం కోసం తొలుత ఒక యంత్రాన్ని కనుగొన్నారు. ఇందుకోసం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సాయం తీసుకున్నారు. అనేక ఏళ్లు పరిశోధన చేసి ఎట్టకేలకు నన్మ, మెన్మ, శ్రేయ అనే మూడు రకాల సేంద్రియ పురుగుమందులను తయారు చేశారు. ఒక కిలో కర్రపెండలం ఆకులతో ప్రత్యేక యంత్రం ద్వారా 8 లీటర్ల సేంద్రియ పురుగుమందు తయారు చేయవచ్చని డా. జయప్రకాశ్ తెలిపారు. నన్మ, మెన్మ, శ్రేయ సేంద్రియ పురుగుమందులు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు తీవ్రనష్టం కలిగిస్తున్న పురుగులను అరికడతాయి. అరటిలో సూడోస్టెమ్ వీవిల్, కొబ్బరిలో రెడ్‌పామ్ వీవిల్తో పాటు అనేక పండ్ల / కలప పంటల్లో కనిపించే కాండం తొలిచే పురుగులను ఈ సేంద్రియ పురుగుమందులు సమర్థవంతంగా అరికడతాయని డా. జయప్రకాశ్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. డీఆర్డీవో తోడ్పాటుతో ఈ పురుగుమందును వాయువు రూపంలోకి మార్చుతున్నారు. ఆహార గోదాముల్లో కనిపించే పురుగులను సమర్థవంతంగా ఈ వాయు రూపంలోని సేంద్రియ పురుగుమందు అరికడుతుందట. లైసెన్స్ ఫీజు చెల్లించే ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలకు ఈ పురుగుమందుల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిటిసిఆర్‌ఐ సంచాలకులు డాక్టర్ షీల ప్రకటించారు. కర్రపెండలం ఆకుల రసం తో లీటరు పురుగుమందు తయారు చేయడానికి కేవలం రూ. 20 మాత్రమే ఖర్చవుతుందట. ఈ పురుగుమందులు ఆకులతో తయారు చేసినవి కావటం వల్ల రసాయన పురుగుమందులకు మల్లే పురుగులు వీటికి ఎప్పటికీ అలవాటుపడిపోవు. ప్రభుత్వ సంస్థలు ఇటువంటి చక్కని సేంద్రియ పురుగుమందులను స్వయంగా తయారు చేయించి రైతులకు సరసమైన ధరకు అందిస్తే ఎంతో మేలు జరుగుతుంది. వివరాలకు.. సిటిసిఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త డా. జయప్రకాశ్‌ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు: prakashcaj@gmail.com డా. సి.ఎ.జయప్రకాశ్ -
సాగుబడి12 Feb 2021
-
లాక్డౌన్ పంట; మేడ మీద చూడమంట
ఓ పదేళ్ల తర్వాత మనలో ఎవరికైనా కరోనా లాక్డౌన్ ఎంత కాలం సాగింది అనే సందేహం వస్తే అందుకు సమాధానం వీళ్ల వరి సాగు కాలమే. శామ్ జోసెఫ్ కేరళ రాష్ట్రం కొట్టాయంలో ఆర్టీసీ స్టేషన్ మాస్టర్. సెలినె ముత్తొమ్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో సీనియర్ ట్యూటర్. ఈ దంపతులు కోవిడ్ విరామంలో ఓ ప్రయోగం చేశారు. తమ ఇంటి పై భాగంలో సరదాగా వరిపంట సాగు చేశారు. ‘‘ఎంత పండించామన్నది ముఖ్యం కాదండీ., ఎలా పండించామన్నదే మీరు చూడాల్సింది’’ అంటున్నారు ఈ దంపతులు. టెర్రస్ మీద సాగు అనగానే మడి కట్టి మట్టి పరిచి, నీరు చల్లి నారు పోసి ఉంటారనే అనుకుంటాం. కానీ వీళ్లు నీళ్ల సీసాల్లో పెంచారు. వాడి పారేసిన వాటర్ బాటిల్స్ పై భాగాన్ని కత్తిరించి, బాటిల్స్‌లో కొద్దిపాటి మట్టి, ఆవు ఎరువు వేసి నీరు పోశారు. అందులో వరి నారును నాటారు. నెలలు గడిచాయి. వరి వెన్ను తీసింది, గింజ పట్టింది, తాలు తరక కాకుండా గట్టి గింజలతో వరి కంకులు బరువుగా తలలు వంచాయి. ధాన్యం గింజలు గట్టిపడి, వరికంకులు పచ్చిదనం, పచ్చదనం తగ్గి బంగారు రంగులోకి మారాయి. జోసెఫ్ దంపతులు పంటను కోసి, కంకులను నూర్చి, ధాన్యాన్ని మర పట్టించి బియ్యాన్ని డబ్బాలో నింపారు. తూకం వేస్తే నాలుగు కిలోలు మాత్రమే. చేపల తొట్టె గట్టు మీద 175 సీసాల్లో ఇంతకంటే ఎక్కువ ధాన్యాన్ని పండించడం కుదిరే పని కూడా కాదు. జోసెఫ్ దంపతులు ఇంటి మీద పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. చేపలను పెంచుతున్నారు. ఇంటి మీదున్న చేపల తొట్టెలో రెండు వందల చేపలు పెరుగుతున్నాయి. ఇంటి ఆవరణలో మరో చేపల తొట్టెలో ఐదు వందల చేపలు పెరుగుతున్నాయి. ఈ ప్రయోగాన్ని కొనసాగిస్తామని, ఈ సారి ఎక్కువగా సాగు చేస్తామని చెప్తున్నారు జోసెఫ్, సెలినె. ఓ పదేళ్ల తర్వాత మనలో ఎవరికైనా కరోనా లాక్డౌన్ ఎంత కాలం సాగింది అనే సందేహం వస్తే అందుకు సమాధానం వీళ్ల వరి సాగు కాలమే. కరోనా లాక్డౌన్ కారణంగా ఇద్దరికీ ఉద్యోగాల్లో విరామం వచ్చింది. ఆ విరామం ఒక వరి పంట కాలం. అన్ లాక్ అయ్యి ఆర్టీసీ బస్సులు నడిచే నాటికి పంట చేతికొచ్చింది. -
చెత్త చక్కని ఎరువై.. పచ్చని ఇంటిపంటలై..!
గుంటూరు నగరంలో తడి చెత్త, సేంద్రియ వ్యర్థాలపై గృహిణులు సమరం ప్రకటించారు. తడి చెత్త, వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి ఇవ్వకుండా సేంద్రియ ఎరువు తయారు చేస్తూ.. సేంద్రియ ఎరువుతో ఎంచక్కా ఆరోగ్యదాయకమైన ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ఇంటి ఆవరణలో కుండీలు, కవర్లు, కంటెయినర్లలో ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను పెంచుతున్నారు. నగరపాలక సంస్థకు భారంగా మారిన చెత్త తరలింపు సమస్య పరిష్కారం కావడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే సేంద్రియ కూరగాయలు లభిస్తున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండి దోమలు, అంటు వ్యాధుల బెడద తగ్గుతోంది. గుంటూరు నగరంలోని 23,24,25,28 వార్డుల్లో గృహిణులు తమ ఇళ్ళల్లో వచ్చే తడి వ్యర్ధాలతో ఇంటి దగ్గరే కంపోస్టు తయారు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ గుంటూరు సాధన కృషిలో భాగస్వాములవుతున్నారు. నగరపాలక సంస్థ, ఐటీసీ ‘బంగారు భవిష్యత్తు’ విభాగాల ఆధ్వర్యంలో నాలుగు వార్డుల్లో ఘన వ్యర్థాల నిర్వహణ పైలట్ ప్రాజెక్టు అమలును చేపట్టారు. ఇళ్లు, అపార్టుమెంట్లలో ఐటీసీ సిబ్బంది, వార్డు ఎన్విరాన్మెంటల్ సెక్రెటరీలు, వార్డు వలంటీర్లు ఎవరికి వారు ఇంట్లోనే వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారీపై అవగాహన కల్పించారు. 1,572 ఇళ్ళలో హోం కంపోస్టింగ్, ఇంటిపంటల సాగు ప్రారంభమైంది. కంపోస్టు తయారీ విధానం ఇలా.. నలుగురు కుటుంబ సభ్యులు ఉండే ఇంటికి కంపోస్టు తయారీకి 20 లీటర్ల ఖాళీ బక్కెట్ సరిపోతుంది. బక్కెట్ చుట్టూ రంధ్రాలు చేయాలి. బక్కెట్లో ఒక అంగుళం మేర కొబ్బరి పొట్టు వేయాలి. ప్రతి రోజూ వంట గదిలో పోగుపడే కూరగాయలు, ఆకుకూరల వ్యర్ధాలు, ముక్కలు, పండ్ల తొక్కలు, పూలు, టీ పొడిని ఈ కంపోస్టు బక్కెట్లో వేయాలి. తడి చెత్తను ఇందులో వేసిన ప్రతిసారీ పైన అంగుళం మందాన కొబ్బరి పొట్టును వేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తూ వారంలో రెండు సార్లు బక్కెట్లో కింది నుంచి పైకి కలియ తిప్పాలి. పది రోజుల తరువాత వేసిన వ్యర్ధాలు కుళ్లడం ప్రారంభమవుతుంది. 45 రోజులకు నాణ్యమైన రసాయనాలు లేని సారవంతమైన సేంద్రియ ఎరువు తయారవుతోంది. బక్కెట్లో ఒక్కోసారి పురుగులు కనిపించే అవకాశం ఉంటుంది. బక్కెట్లోని వ్యర్థాల్లో 40 శాతం తేమ ఉండేలా చేసుకోవడంతోపాటు, మార్కెట్లో లభ్యమయ్యే ద్రావణం వేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది. వంటింటి నుంచి వెలువడే తడి చెత్త, వ్యర్థాలను కుళ్లబెట్టి కంపోస్టు తయారు చేయడానికి అవసరమైన కొబ్బరి పొట్టును నగరపాలక సంస్థ ఉచితంగా ఇస్తుండడంతో గృహిణులు కంపోస్టు తయారీపై ఆసక్తి చూపుతున్నారు. వ్యర్థాల పునర్వినియోగంతో పాటు నగరవాసుల సేంద్రియ ఇంటిపంటల సాగుకు నగర పాలకుల ఊతం దొరకడం హర్షించదగిన పరిణామం. చెత్తకు కొత్త అర్థం ఇస్తున్నాం ఇంట్లో చెత్తను రోడ్లపై, కాలువల్లో పడేయకుండా హోంకంపోస్టు ద్వారా ఎరువుగా మార్చి చెత్తకు కొత్త అర్ధం ఇస్తున్నాం. జీఎంసీ, ఐటీసీ సహకారంతో మా ఇంట్లోనే నాణ్యమైన ఎరువు తయారు చేసుకుంటున్నాం. మా వీధుల్లో ఎవరూ చెత్త వేయడం లేదు. దోమలు, ఈగలు తగ్గాయి. – ఏలూరి విజయలక్ష్మి, వేమూరివారి వీధి, గుంటూరు వలంటీర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం తడి వ్యర్ధాల నిర్వహణ ఇంట్లోనే జరుగుతోంది. ఇళ్ళల్లో చక్కని కిచెన్ గార్డెన్ పెంచడంతోపాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండి, దోమలు, అంటువ్యాధుల నివారణ జరుగుతోంది. ఐటీసీ సహకారంతో వార్డు వలంటీర్లు, వార్డు ఎన్విరాన్మెంట్ సెక్రటరీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పెద్ద మొత్తంలో వ్యర్ధాలు ఉత్పత్తి చేసే కళ్యాణమండపాలు, హోటల్స్‌లో క్లస్టర్ కంపోస్టుల ఏర్పాటు జరుగుతోంది. ఇళ్లలోనే చెత్తతో కంపోస్టు చేయడం, కిచెన్ గార్డెన్ల సాగుపై నగర ప్రజలందరూ దృష్టి పెట్టాలి. స్వచ్ఛ సర్వేక్షన్ 2020లో నగరానికి ఉత్తమ ర్యాంకు సాధించాలి. – చల్లా అనురాధ, కమిషనర్, గుంటూరు నగరపాలక సంస్థ సొంత కంపోస్టుతో ఇంటిపంటలు సాగు చేస్తున్నాం మా ఇంటిలో చెత్తను బక్కెట్లో వేసి సేంద్రియ ఎరువుగా మార్చుతున్నాను. ఆ కంపోస్టును మొక్కలు, ఆకుకూరలకు ఎరువుగా వేస్తుంటే ఎంతో ఏపుగా, చక్కగా పెరుగుతున్నాయి. రసాయనిక ఎరువులు లేకుండా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునేందుకు సేంద్రియ ఎరువును మేమే తయారు చేసుకొంటున్నాం. చెత్తను మున్సిపాలిటీ సిబ్బందికి ఇవ్వడం లేదు. – వేమూరి విశాలక్షి, ఏటీఅగ్రహారం, గుంటూరు కొబ్బరి పొట్టును మేమే ఇస్తున్నాం గుంటూరు నగరంలో తడి చెత్త, వ్యర్థాల నిర్వహణపై ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నాం. సేంద్రియ ఎరువు తయారీపై గృహిణులకు అవగాహన కల్పించాం. అందుకు అవసరమైన కొబ్బరి పొట్టును మేమే ఇస్తున్నాం. ఈ సేంద్రియ ఎరువుతో రసాయన మందులు వినియోగం లేకుండా, చక్కగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు కిచెన్ గార్డెన్లో పెంచుకోవచ్చు. నగర ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలి. – ఐ.శామ్యూల్ ఆనందకుమార్, నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్, గుంటూరు – ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు – గజ్జెల రాంగోపాల్‌రెడ్డి, స్టాప్ ఫొటోగ్రాఫర్, గుంటూరు -
తాటి నీరా తరుణమిదే!
తాటి చెట్ల నుంచి నీరాను సేకరించడం డిసెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుంది. తాటి నీరా అత్యంత ఆరోగ్యదాయకమైన ప్రకృతిసిద్ధమైన పానీయం. తాటిచెట్టు గెలల నుంచి స్రవించే పోషక ద్రవాన్ని పులియకుండా సేకరిస్తే నీరా, పులియబెట్టి సేకరిస్తే కల్లు అవుతాయి. తాజా నీరా చక్కటి రుచితో అంతకుమించిన పోషకాలతో కూడి ఉంటుంది. దీన్ని హెల్త్ డ్రింక్‌గా తాగవచ్చు. తాటినీరాతో బెల్లం, పాకం(సిరప్), పంచదార, పటిక బెల్లం తయారు చేయవచ్చు. ఇళ్లలో, బేకరీల్లో చక్కెరకు బదులుగా వీటిని వాడుకోవచ్చు. తాటి ఉత్పత్తుల గ్లైసెమిక్ ఇండెక్స్(జి.ఐ.) తక్కువ కాబట్టి సాధారణ వ్యక్తులతోపాటు షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడుకోవచ్చని తూ.గో. జిల్లా పందిరిమామిడిలోని ఉద్యాన పరిశోధనా కేంద్రానికి చెందిన ఫుడ్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య చెబుతున్నారు. ఈ పరిశోధనా కేంద్రంలో తాటి నీరాతో వివిధ ఉత్పత్తుల తయారీ కోసం అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పారు. గీత కార్మికులు, రైతులు, గ్రామీణులకు శిక్షణ ఇస్తున్నారు. తాటి నీరా ప్రకృతి సిద్ధంగా తాటి చెట్టు నుంచి లభించే పానీయాన్ని పులియకుండా సేకరిస్తే.. దాన్ని నీరా అంటారు. ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. నీరా తియ్యగా ఉండటమే కాకుండా సుక్రోజు వంటి పిండి పదార్థాలు ఎక్కువగా కలిగి ఉంటుంది. నీరాలో ఇంకా అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. నీరా చక్కెర శాతం ఎక్కువగా కలిగిన పానీయం. దీనిలో చక్కెరతోపాటు ఐరన్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్, ఆస్కార్బిక్ ఆమ్లాలు వంటి విటమిన్లు ఉన్నాయి. నీరా జీర్ణశక్తిని పెంచుతుంది. కామెర్లు వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉన్న నీరాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడవచ్చు. దీనిలో మినరల్స్, అవశ్యకమైన అమైనో ఆమ్లాలు, బి–కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. గర్భవతులకు, బలహీనంగా ఉన్న పిల్లల ఆరోగ్య రక్షణకు ఉపయోగించే ఆయుర్వే ఔషధాల్లో నీరాను వాడుతున్నారు. గర్భవతులు నీరాను వారానికి మూడు లేదా నాలుగు రోజులు తీసుకోవడం వల్ల పుట్టబోయే శిశువు మంచి రంగులో, ఆరోగ్యంగా జన్మిస్తుంది. బలహీనంగా ఉన్న పిల్లలకు రోజూ తక్కువ మోతాదులో ఇస్తే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు. మధుమేహం, ఊబకాయం, దంత క్షయం ఉన్న వారికి నీరా ఉపయోగపడుతుంది. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన కేలరీలు తక్కువగా ఉండే పదార్థాలు ఇష్టపడేవారు నీరాతో తయారు చేసిన పదార్థాలను వాడవచ్చు. తాటి నీరా సిరప్ (పాకం), బెల్లం, పంచదారను ఇళ్లలో, బేకరీలో వివిధ రకాల పదార్థాల తయారీలో చక్కెరకు బదులుగా వాడవచ్చు. నీరాను పాకం, బెల్లం, పంచదార వంటి పదార్థాలుగా మార్చడం వలన వీటిని సాంప్రదాయ వంటలు, ఇతర పదార్థాల తయారీలో చెరకు నుంచి తయారు చేసిన బెల్లం, పంచదారకు బదులుగా వాడవచ్చు. తాటి పటిక బెల్లం తాజాగా సేకరించిన నీరా (తాజా నీరా ఉదజని సూచిక 7–8 ఉంటుంది)ను 103–105 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద బాగా మరిగించాలి. నీరా బాగా మరిగి దాదాపు మూడో వంతు వరకు ఇగిరిన తర్వాత మంటను ఆర్పివేసి.. సన్నని దారాలు లేదా తీగలతో తయారు చేసిన క్రిష్టలైజర్లో పోయాలి. దీన్ని కదలకుండా, గాలి తగలకుండా ఉన్న చోటనే 35–40 రోజుల పాటు ఉంచాలి. తరువాత దారాలు లేదా తీగలకు అంటుకొని ఏర్పడిన స్ఫటికాల(అదే పటిక బెల్లం)ను బయటకు తీసి కడిగి, ఆరబెట్టి నిల్వచేసుకోవచ్చు. తాటి బెల్లం తాటి నీరాతో బాండీలో పోసి మరిగించి సులభంగానే బెల్లం తయారు చేసుకోవచ్చు. తొలుత 103–105 డిగ్రీల ఉష్ణోగ్రతతో బాగా మరగబెట్టి, తరువాత తక్కువ మంట మీద కలుపుతూ ఉండాలి. చిక్కబడిన తర్వాత అచ్చులలో పోస్తే బెల్లం తయారవుతుంది. ఎటువంటి ఎంజైములు, రసాయనాలు కలపనవసరం లేదు. తాటి పంచదార తాటి చెట్ల పెంపకంలో రసాయనాలు వాడే అవసరం లేదు. కాబట్టి తాటి నీరాతో తయారు చేసే పంచదారను కూడా ప్రకృతి సిద్ధంగా, ఏ విధమైన రసాయనాలు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. రసాయనాలు వాడకుండానే తాటి పంచదారను తయారు చేసుకోవచ్చు. ఇంతులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. నీరా పంచదారను వాడటం వలన బరువు తగ్గడం, మధుమేహం అదుపులో ఉండటంతోపాటు సీరమ్ కొలస్ట్రాల్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కూడా నీరా పంచదార ఉపయోగపడుతుంది. తాజా నీరా(ఉదజని సూచిక 7–8)ను 103–105 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగించి, బాగా చిక్కబడిన తరువాత క్రిస్టలైజర్, సెంట్రిఫ్యూజులను ఉపయోగించి పంచదారను తయారు చేస్తారు. తాటి సిరప్ (పాకం) తాజా నీరాను బాణలిలో పోసి 103–105 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బాగా మరిగించాలి. నీరా బాగా మరిగి దాదాపు సగం పరిమాణానికి తగ్గినప్పుడు మంటను ఆర్పివేసి, చల్లబర్చి గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. దీన్ని చక్కెరకు బుదులుగా వాడుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. టీ, కాఫీలలోను, కషాయాల లోను, బేకరీ ఉత్పత్తులలోను, ఐస్‌క్రీమ్‌ల తయారీలోను నీరా సిరప్‌ను ఎక్కువగా వాడతారు. 4 కోట్ల తాటి చెట్లున్నా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 4 కోట్ల తాటిచెట్లు ఉన్నాయి. ముదురు చెట్ల నుంచి డిసెంబర్ నుంచి 4 నెలల పాటు నీరాను సేకరించవచ్చు. చెరకు రసంతో తయారు చేసే పంచదార, బెల్లం కన్నా తాటి బెల్లం, తాటి పంచదార ఎంతో మేలైనవి. ఈ సహజ తీపి ఉత్పత్తులను గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహ రోగులు కూడా తినొచ్చు. ఇంత ప్రయోజనకరమైన తాటి చెట్లలో 1 శాతాన్ని కూడా మనం ఉపయోగించుకోకపోవడం దురదృష్టకరం. ప్రతి తాటి చెట్టు నుంచి ఏటా గరిష్టంగా రూ. 10 వేల ఆదాయం పొందవచ్చు. గ్రామీణులకు ఉపాధి అవకాశాలను ఇవ్వగల శక్తి తాటి, ఈత చెట్లకు ఉందని ప్రభుత్వాలు, గీత కార్మికులు, రైతులు గుర్తించాలి. – పి. సి. వెంగయ్య (94931 28932), సీనియర్ శాస్త్రవేత్త (ఫుడ్‌సైన్స్, టెక్నాలజీ), అఖిల భారత తాటిపరిశోధనా పథకం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పందిరి మామిడి, తూ. గో. జిల్లా తాటి నీరాతో తయారవుతున్న తాటి బెల్లం, తాజా తాటి నీరా -
జూన్ 2,3 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో డా. ఖాదర్ వలి సభలు
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై జూన్ 2, 3 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డా.ఖాదర్ వలి సభలు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జూన్ 2(ఆదివారం)వ తేదీ ఉ. 9.40 గం. నుంచి మ. 12.30 గం. వరకు పద్మశాలి కళ్యాణ మండపంలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 99595 77280, 96767 97777. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం(ప్రకాశం రోడ్)లో జూన్ 2వ (ఆదివారం) సా. 4 గం. నుంచి 7 గం. వరకు డా. ఖాదర్ వలి సభ జరుగుతుంది. వివరాలకు.. 99499 52020. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని వరదరాజుల స్వామి దేవాలయం ఆవరణలో జూన్ 3వ (సోమవారం) ఉ. 9.30 గం. నుంచి మ. 12.30 గం. వరకు డా. ఖాదర్ వలి సభ జరుగుతుంది. వివరాలకు: 88869 02902, 96767 97777 -
19, 20 తేదీల్లో డా. ఖాదర్ వలి ప్రసంగాలు
హైదరాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లలో సిరిధాన్యాలతో భూతాపాన్ని, సకల వ్యాధులనూ జయించవచ్చని కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేస్తున్న స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లలో హైదరాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లలో జరిగే ఆహార, ఆరోగ్య, అటవీ వ్యవసాయ సభల్లో ప్రసంగిస్తారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ల తోడ్పాటుతో వివిధ సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు అందరూ ఆహ్వానితులే. ఖైరతాబాద్‌లో: 19వ(ఆదివారం) తేదీ (ఉ. 9–12 గం.)న హైదరాబాద్ ఖైరతాబాద్ జంక్షన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ సంస్థ తమ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఆహార, ఆరోగ్య సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 040–23314969. సూర్యాపేటలో: 19వ (ఆదివారం) తేదీ (సా. 5 గం. – 8 గం.)న సూర్యాపేటలో నేచర్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో జరిగే ఆహార, ఆరోగ్య సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. కె. క్రాంతికుమార్ – 96032 14455, శివప్రసాద్–86868 71048. గచ్చిబౌలిలో: 20వ (సోమవారం) తేదీ (ఉ. 10 గం. – 2 గం.)న హైదరాబాద్ గచ్చిబౌలిలో ‘ఇస్కీ’ ఆవరణలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆర్ అండ్ డి సెంటర్ (కేర్ ఆస్పత్రి పక్కన)లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌కు చెందిన వాటర్ మేనేజ్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో రైతుల కోసం జరిగే ప్రత్యేక సభలో డాక్టర్ ఖాదర్ వలి అటవీ వ్యవసాయ పద్ధతి, వాననీటి సంరక్షణ, తక్కువనీటితో సిరిధాన్యాల సాగుపై ప్రసంగిస్తారు. వివరాలకు.. శంకర్‌ప్రసాద్ – 90003 00993, ముత్యంరెడ్డి – 94419 27808 మహబూబ్‌నగర్‌లో: 20వ (సోమవారం) తేదీ(సా. 5–7 గం.)న మహబూబ్‌నగర్(న్యూ టౌన్)లోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాంకిషన్ ఆధ్వర్యంలో ఆహారం, ఆరోగ్యం, అటవీ వ్యవసాయంపై డాక్టర్ ఖాదర్ వలి తదితరులు ప్రసంగిస్తారు. వివరాలకు.. 94407 12021. -
30 నుంచి బెంగళూరులో కిసాన్ మేళా, దేశీ విత్తనోత్సవం
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు (ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి.) ఆధ్వర్యంలో మార్చి 30–31 తేదీల్లో రైతు మేళా, దేశీ విత్తనోత్సవం జరగనున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మార్పుల నేపథ్యంలో కరువు, చీడపీడలను తట్టుకోవడానికి తమ సంప్రదాయ విత్తనాన్ని అభివృద్ధి చేసుకొని విత్తుకోవడమే ఉత్తమం. దేశీ విత్తన స్వాతంత్య్రం, దేశీ గోమాతే రైతులకు రక్షగా నిలుస్తాయని ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. భావిస్తోందని ప్రతినిధి ఉమామహేశ్వరి తెలిపారు. ఈ అంశాలపై రైతులను చైతన్యవంతం చేయడమే లక్ష్యమన్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే దేశీ విత్తన సంరక్షకులు ఈ మేళాలో పాల్గొంటారన్నారు. రెండున్నర కిలోల దేశీ వరివిత్తనంతో ఎకరం సాగు చేసే శ్రీ పద్ధతి, పావు కిలో విత్తనంతో సాగు చేసే పెరుమాళ్లు పద్ధతి, పంటల ప్రణాళిక రూపకల్పన, దేశీ విత్తన సంరక్షణలో మెలకువలు తదితర అంశాలపై ప్రకృతి వ్యవసాయదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. వివరాలకు.. ఉమామహేశ్వరి – 90004 08907 కుంకుడు గుత్తులు! సాధారణంగా కుంకుడు చెట్టుకు కాయలు విడివిడిగా కాస్తాయి. ఆశ్చర్యకరంగా ఈ చెట్టుకు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం జనగామకు సమీపంలో ఓ మెట్టభూమి గట్టు మీద ఈ చెట్టు ఉండగా సుస్థిర వ్యవసాయ కేంద్రం డా. జి. రాజశేఖర్ దృష్టిలో పడింది. ఈ విత్తనాలు కావాలనుకున్న వారు డా. రాజశేఖర్‌ను 83329 45368 నంబరులో సంప్రదించవచ్చు. 24న సేంద్రియ గొర్రెల పెంపకంపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈ నెల 24 (ఆదివారం)న సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సాంకేతిక అధికారి డా. టి. వెంకటేశ్వర్లు, పశువైద్యులు డా. జి. రాంబాబు(కడప), గొర్రెల పెంపకందారుడు రషీద్ రైతులకు అవగాహన కల్పిస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. వివరాలకు.. 97053 83666, 0863–2286255. కట్టె గానుగల నిర్వహణపై 3 రోజుల శిక్షణ .సహజ సాగు పద్ధతిలో పండించిన నూనెగింజలతో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా పరిశుభ్రమైన రీతిలో కట్టె గానుగలో వంటనూనెలను వెలికితీయడంపై యువతీ యువకులకు మార్చి 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్లో శిక్షణ ఇవ్వనున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షిండె శివశంకర్ తెలిపారు. కనీసం పదోతరగతి చదివిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఆసక్తి గల వారు తమ వివరాలను ఈ నెల 24లోగా 81210 08002, 70133 09949లలో ఏదో ఒక నంబర్‌కు ఎస్.ఎం.ఎస్. లేదా వాట్సప్ ద్వారా సమాచారం పంపాలని ఆయన కోరారు. -
నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో 9, 10, 11 తేదీల్లో డా. ఖాదర్ వలి సభలు
అటవీ కృషి పద్ధతిలో ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాలు పండించడం.. సిరిధాన్యాలు, కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వివిధ సభల్లో ప్రసంగించనున్నారు. డిసెంబర్ 9 (ఆదివారం) ఉ. 10 గం. నుంచి నెల్లూరు జిల్లా గూడూరులోని దువ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాలు (ఐ.సి.ఎస్. రోడ్డు)లో, అదే రోజు సా. 4.30 గం. నంచి నెల్లూరులోని జి.పి.ఆర్. గ్రాండ్ (మినీ బైపాస్ రోడ్డు)లో, డిసెంబర్ 10 (సోమవారం) ఉ. 10 గం. నుంచి కడప జిల్లా రాజంపేటలోని తోట కన్వెన్షన్ సెంటర్(మన్నూరు)లో, అదే రోజు సా. 4.30 గం. నుంచి తిరుపతిలోని లక్ష్మీ వేంకటేశ్వర కళ్యాణ మండపం (పద్మావతిపురం, తిరుచానూరు రోడ్డు, తిరుపతి)లో, 11వ తేదీ చిత్తూరులోని డా. బి.ఆర్.అంబేద్కర్ భవన్(కలెక్టర్ బంగ్లా వెనుక) డాక్టర్ ఖాదర్ వలి సభలను నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు∙తెలిపారు. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. ఇతర వివరాలకు.. 96767 97777, 70939 73999. జనవరిలో జాతీయ ఉద్యాన ప్రదర్శన–2019 బెంగళూరు హెసరఘట్టలోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐ.ఐ.హెచ్.ఆర్.)ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం జనవరి 23–25 తేదీల్లో జాతీయస్థాయి ఉద్యాన ప్రదర్శన జరగనుంది. ఉద్యాన పంటల సాగులో కొత్త ఆవిష్కరణలను శాస్త్రవేత్తలు, రైతులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఐ.ఐ.హెచ్.ఆర్. ఈ ప్రదర్శన నిర్వహిస్తోంది. ఉద్యాన తోటల సాగులో కొత్త సవాళ్లు – పరిష్కారాలపై రైతులు – శాస్త్రవేత్తల మధ్య చర్చలు జరుగుతాయి. ఐ.ఐ.హెచ్.ఆర్., ప్రైవేటు కంపెనీల విత్తనాలు, మొక్కలను అమ్ముతారు. వినూత్న పోకడలతో అభివృద్ధి సాధిస్తున్న ఆదర్శ రైతులను సత్కరిస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు... డాక్టర్ ఎ. టి. సదాశివ– 98450 97472 sadashiva.AT@icar.gov.in, డా. టి. ఎస్. అఘోర – 99861 00079 aghora.TS@icar.gov.in 080-23086100 Extn - 280 13,14 తేదీల్లో అటవీ కృషిపై మైసూరులో డా. ఖాదర్ శిక్షణ అటవీ కృషి పద్ధతిపై రైతులకు డిసెంబర్ 13–14 తేదీల్లో హెచ్.డి. కోట, హ్యాండ్ పోస్టు బేస్ క్యాంప్, మైరాడలో అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలి, బాలన్ తెలుగులో రైతులకు శిక్షణ ఇస్తారు. అటవీ చైతన్య ద్రావణంతో భూసారం పెంపుదల, వాన నీటి సంరక్షణ, సిరిధాన్యాలు + నూనెగింజలు + పప్పుధాన్యాల మిశ్రమ సాగు పద్ధతులు, సిరిధాన్యాల ధాన్యాన్ని మిక్సీతో బియ్యాన్ని తయారు చేసుకోవడం.. వంటి విషయాలపై రైతులకు శిక్షణ ఇస్తారు. ఫీజు తదితర వివరాలకు.. 93466 94156, 97405 31358, 99017 30600. డిసెంబర్ 8 నుంచి పాలేకర్ 10 రోజుల సేనాపతి శిక్షణ 500 మంది తెలంగాణ రైతులకూ అవకాశం గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ప్రకృతి వ్యవసాయంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి 17 వరకు సుమారు 8 వేల మంది రైతులకు సేనాపతి శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఆం. ప్ర. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ శిబిరంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 500 మంది రైతులు కూడా పాల్గొనేందుకు అవకాశం ఉంది. వీరిని ఎంపిక చేసే బాధ్యతను తమకు అప్పగించినట్లు గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి సూర్యకళ తెలిపారు. పాలేకర్ స్వయంగా శిక్షణ ఇచ్చే ఈ శిబిరంలో తెలంగాణ రైతులకూ శిక్షణ, భోజనం, వసతి ఉచితం. రైతులు కప్పుకోవడానికి కంబళ్లు వెంట తెచ్చుకోవాలి. శిబిరానికి హాజరయ్యే ఉద్దేశం ఉన్న తెలంగాణ రైతులు గ్రామభారతి ప్రతినిధి ఎం. బాలస్వామిని 93981 94912, 97057 34202 నంబర్లలో సంప్రదించి ముందుగా పేర్లు, వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు. -
ఇంటిపంటల కోసమే సిటీకి దూరంగా సొంతిల్లు!
వరంగల్‌లో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రేగూరి సింధూజ ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాద్ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. రసాయనిక అవశేషాలు లేని ప్రకృతిసిద్ధమైన ఆహారం విలువ గుర్తెరిగిన ఆమె.. సిటీలో ఫ్లాట్‌కు బదులు (బీహెచ్ఈఎల్ దగ్గర) నగర శివారు ప్రాంతం అమీన్పూర్ నరేంద్ర నగర్ కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకున్నారు. 200 గజాల టెర్రస్‌లో సగభాగంలో వందకు పైగా గ్రోబాగ్స్, కుండీలలో గత ఏడాదిగా ఇంటిపంటలు పండించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యాన శాఖ నుంచి 4 పెద్ద వృత్తాకారపు గ్రీన్ గ్రోబాగ్స్తో కూడిన సబ్సిడీ కిట్‌ను తీసుకున్నారు. శిక్షణా శిబిరాలకు హాజరై అవగాహన పెంచుకున్నారు. వీటితోపాటు తెల్లని గ్రోబాగ్స్‌ను, కొబ్బరిపొట్టు తదితర పరికరాలను సేకరించుకున్నారు. 30%మట్టి, 30%పశువుల ఎరువు, 30% శుద్ధి చేసిన కొబ్బరిపొట్టు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన ఇంటి కంపోస్టు+వేపపిండితో కలిపిన మట్టి మిశ్రమాన్ని గ్రోబాగ్స్, కుండీలలో నింపారు. వేసవి ఎండ తీవ్రత నుంచి ఇంటిపంటలను కాపాడుకోవడానికి ఇనుప ఫ్రేమ్‌తో షేడ్‌నెట్ వేసుకున్నారు. సింధూజ కుటుంబంలో నలుగురు పెద్దవారు ఉంటారు. పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర, కొత్తిమీర, బచ్చలి కూర పెంచుకొని తింటున్నారు. గత ఏడాదిగా ఆకుకూరలను బయట కొనటం లేదు. తీగజాతి కూరగాయలను పాకించడానికి కొబ్బరి తాళ్లతో పందిరి అల్లారు. బెండ, బీర, గోరుచిక్కుడు, కాప్సికం, సొర తదితర కూరగాయలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం వారంలో 2,3 రోజులు ఈ కూరగాయలు తింటున్నామని, కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో ఇంటి కూరగాయలే తమకు సరిపోతాయని సింధూజ(98857 61707) సంతోషంగా చెప్పారు. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా నిపుణుల సలహాలను తెలుసుకుంటున్నానన్నారు. -
ఆకు పచ్చని బంగారం!
వెదురు.. పేదవాడి కలప! ఆర్థికపరంగానే కాకుండా పర్యావరణపరంగా కూడా అభివృద్ధికి దోహదపడే పంటగా వెదురు గుర్తింపు పొందింది. గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ఇది మంచి సాధనం. అందుకే దీన్ని ‘గ్రీన్ గోల్డ్’ (ఆకుపచ్చని బంగారం) అని పిలుస్తుంటారు. పంటల సాగుకు తగినంత సారం లేని భూములు, అటవీయేతర ప్రభుత్వ భూములు వెదురు తోటల సాగుకు అనుకూలం. ఇందుకోసం ప్రత్యేకంగా ‘బాంబూ మిషన్’ ద్వారా ఈ ఏడాది ఖరీఫ్ నుంచే ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రెండేళ్లలో 1,05,000 హెక్టార్లలో వెదురు తోటల సాగే లక్ష్యం. వెదురు రైతులకు మూడేళ్ల పాటు ప్రభుత్వ సహాయం అందుతుంది. నాలుగో ఏడాది నుంచి వెదురు కోతకు వస్తుంది. ఒక్కసారి నాటితే చాలు.. 60 ఏళ్లపాటు ఏటా రైతుకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో డ్రిప్ ద్వారా వెదురు సాగును ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ‘సాగుబడి’ ప్రత్యేక కథనం. వెదురు అనాదిగా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నది. సుమారు 1500 రకాలుగా వెదురు ఉపయోగపడుతున్నట్లు అంచనా. అయితే, మన దేశంలో వెదురు ఇన్నాళ్లూ సంరక్షించదగిన అటవీ చెట్ల జాబితాలో ఉంది. అందువల్లనే మన పొలంలో పెరిగిన వెదురు బొంగులను నరకాలన్నా అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈ ఆంక్షల వల్ల ప్రజల అవసరానికి తగినంత వెదురు దొరక్కుండా పోయింది. అందుకని, కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం వెదురును అటవీ చెట్ల జాబితాలో నుంచి తొలగించింది. దీంతో పొలాల్లో వెదురు తోటలు సాగు చేయడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. మధ్యప్రదేశ్ రైతు వెదురుతోట ఏరియల్ వ్యూ ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెదురు సాగుకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ‘బాంబూ మిషన్’ను ప్రారంభించింది. ఖర్చులో 60% కేంద్రం, 40% రాష్ట్రం భరించే విధంగా మార్గదర్శకాలు ఇటీవల విడుదలయ్యాయి. తెలంగాణ అదనపు అటవీ సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ ‘సాగుబడి’ ప్రతినిధితో ముఖాముఖిలో వివరించారు. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి హరిత విస్తీర్ణాన్ని పెంపొందించే లక్ష్యంతో సాగుకు అంతగా యోగ్యం కాని ప్రైవేటు, అటవీయేతర భూముల్లో వెదురు సాగును ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వివరించారు. భూసారం పెద్దగా లేక పడావు పడిన ప్రభుత్వేతర, అటవీయేతర భూముల్లో వెదురు సాగును ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. సాగుతోపాటు.. నర్సరీల ఏర్పాటుకు, వెదురుతో అగరొత్తులు, ఫర్నిచర్ వంటి అనేక ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు కూడా బాంబూ మిషన్ నిధులను సమకూర్చుతున్నది. ఈ కార్యక్రమాల అమలుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో వెదురు అభివృద్ధి సంస్థ(బి.డి.ఎ.) రూపుదిద్దుకుంటున్నది. వ్యవసాయ, ఉద్యాన, అటవీ, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖల అధికారులు, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రెండు వెదురు జాతులు అనుకూలం! వెదురును వాణిజ్యపరంగా సాగు చేయదలచినప్పుడు ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 1. ముళ్లు తక్కువగా ఉండి, లావుగా, నిటారుగా పెరిగే రకమై ఉండాలి. 2. రెండు కణుపుల మధ్య దూరం ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రయోజనకరమైనదిగా భావిస్తారు. ఇటువంటివి ఎక్కువ ధర పలుకుతాయి.ప్రకృతిలో వెదురు జాతులు చాలా ఉన్నప్పటికీ బాంబూసా బాల్కోవా, బాంబూసా టుల్డ అనే రెండు రకాలు రైతులు సాగు చేసి అధికాదాయం పొందడానికి అనువైనవిగా గుర్తించినట్లు డోబ్రియల్ తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వెదురును ఇప్పటికే రైతులు కొందరు సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారుల బృందం ఇటీవల ఈ రాష్ట్రాల్లో పర్యటించి ఏయే వెదురు రకాలు మేలైనవో గుర్తించింది.నీరు నిలవని ఎర్ర నేలలు వెదురు సాగుకు అనుకూలం. మధ్యప్రదేశ్‌లో కొందరు రైతులు నల్లరేగడి భూముల్లో (4“4 మీ. దూరంలో) సాగు చేస్తున్నారు. భూసారం తక్కువగా ఉన్న భూముల్లో కూడా వెదురు పెరుగుతుంది. అయితే, దిగుబడి కొంచెం తక్కువగా వస్తుంది. వెదురు తోటలు నాటిన నాలుగో ఏడాది నుంచి బొంగులను నరకవచ్చు. అప్పటి నుంచి సుమారు 60 ఏళ్ల వరకు ఏటా ఆదాయం వస్తుందని చెబుతున్నారు. వెదురు తోటల్లో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు.తప్పనిసరిగా డ్రిప్‌ను ఏర్పాటు చేసుకొని.. తగినంత ఎరువులను అందిస్తే.. భూసారం అంతగా లేని భూముల్లోనూ వెదురు సాగు ద్వారా మంచి దిగుబడి పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిన భూముల్లో అయితే ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో మీటరు వెడల్పు, మీటరు లోతులో పొలం అంతటా వాలుకు అడ్డంగా కందకాలు తవ్వుకోవడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కుండపోత వర్షాలకు కందకాల నుంచి పొంగిపొర్లే నీటిని కూడా పొదివి పట్టుకోవడానికి నీటి కుంటలు తవ్వుకోవచ్చు. బాంబూసా టుల్డ రకం ఇది థాయ్‌లాండ్‌కు చెందిన రకం. చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, ఉత్తర భారత రాష్ట్రాలలో సాగులో ఉంది. దీన్ని భవన నిర్మాణ రంగంలోను, పేపర్ మిల్లుల్లోను ఎక్కువగా వాడుతున్నారు. బొంగులు ఆకుపచ్చగా 5–10 సెం.మీ. లావుతో 7–23 మీటర్ల ఎత్తున పెరుగుతాయి. కణుపుల మధ్య 40–70 సెం.మీ. దూరం ఉంటుంది. కింది వైపు కణుపులకు పీచు వేళ్లు ఉంటాయి. బాల్కోవా రకానికి పెద్దపీట బాంబూసా బాల్కోవా రకం వెదురు నున్నగా అందంగా, ఆకు పచ్చగా, లావుగా, నిటారుగా ఎదుగుతుంది. బొంగులు 12–20 మీటర్ల ఎత్తున, 8–15 సెం.మీ. లావున ఎదుగుతాయి. కణుపుల మధ్య 20–40 సెం.మీ. లావున ఎదుగుతాయి. మన దేశంతోపాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, నేపాల్‌లలో బాల్కోవా రకం కనిపిస్తుంది. దక్షిణాసియా దేశాల్లో ఈ రకం వెదురు ఎక్కువగా సాగులో ఉంది. దీని మొలకలు ఆహారంగా తీసుకోవచ్చు. భవన నిర్మాణంలో, బుట్టలు, తడికెలు వంటివి అల్లడానికి ఈ వెదురు బాగుంటుంది. 5 లక్షల టిష్యూకల్చర్ మొక్కలు ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 5 లక్షల బాంబూసా బాల్కోవా రకానికి చెందిన నాణ్యమైన టిష్యూకల్చర్ మొక్కలను కనీసం వెయ్యి మంది రైతులకు అందిస్తామని ఆయన తెలిపారు. డ్రిప్‌ను సబ్సిడీపై అందిస్తామన్నారు. నర్సరీలను ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలకు 100%, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు 50% సబ్సిడీ ఇస్తారు. వెదురు ఉత్పత్తుల తయారీ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తారు. స్థానికులకు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని భావిస్తున్నారు. వీటన్నిటికీ మించి.. బీళ్లుగా ఉన్న భూముల్లో పచ్చని చెట్లు ఏడాది పొడవునా పెరుగుతూ ఉంటే.. భూతాపం తగ్గడానికి వీలవుతుంది. ఈ లక్ష్యంతోనే వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక ఉపాయంగా వెదురు సాగును ఇండోనేషియా వంటి దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ఎకరానికి రూ. లక్ష ఆదాయం అంచనా కనీసం 6 నెలల నుంచి 2 ఏళ్ల వయసు మొక్కలను నాటుకోవాలి. వరుసల మధ్య 4 మీటర్లు, మొక్కల మధ్య 3 మీటర్ల(4“3)దూరంలో నాటుకోవచ్చు. ఎకరానికి 330 మొక్కలు నాటి డ్రిప్‌తో ఎరువులు, నీరు తగినంతగా అందిస్తే.. నాలుగేళ్లలో రూ. 4 లక్షల ఖర్చవుతుంది. నాలుగేళ్ల తర్వాత కుదురుకు 8 చొప్పున సుమారు 2,640 బొంగులు వస్తాయి. బొంగు రూ. 50 చొప్పున ఎకరానికి రూ. 1,32,000 ఆదాయం వస్తుంది. బొంగు బరువు 15 కిలోల చొప్పున 60 వేల కిలోల వెదురు ఉత్పత్తవుతుందని భావిస్తున్నట్లు తెలంగాణ అదనపు అటవీ సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ తెలిపారు. ఆ తర్వాత ఎకరానికి ప్రతి ఏటా రూ. 25 వేలు ఖర్చవుతుంది. ఎకరానికి ఏటా ఆదాయం రూ. లక్ష వస్తుందని అంచనా వేస్తున్నారు. వెదురు బొంగుల నుంచే మొక్కలు! వెదురు మొక్కలను రైతులే స్వయంగా తయారు చేసుకునే సులువైన మార్గం ఇది. వెదురు గింజలు మొలవడానికి చాలా రోజులు పడుతుంది. అన్ని గింజలూ మొలవకపోవచ్చు. కాబట్టి, పచ్చి బొంగులను భూమిలో పాతి పెట్టి 60 రోజుల్లో మొక్కలు తయారు చేసుకోవడం ఉత్తమం. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని కేంద్రీయ అటవీ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐ.సి.ఎ.ఆర్. అనుబంధ సంస్థ) శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని రైతులకు సూచిస్తున్నారు. రెండేళ్ల వయసున్న ఒక పచ్చి వెదురు బొంగుతో 165 మొక్కలను తయారు చేసుకోవడం మేలని ఐ.సి.ఎ.ఆర్. శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఒక ఏడాది, మూడేళ్ల బొంగుల కన్నా రెండేళ్ల బొంగులతోనే నాణ్యమైన ఎక్కువ మొక్కలు పొందవచ్చని అధ్యయనంలో తేల్చారు. బాంబూసా వల్గారిస్ అనే వెదురు రకం సాగుకు అనువైనదని వారు చెబుతున్నారు. మట్టి తవ్వి పచ్చి బొంగులను ఉంచి.. వాటిపైన.. మట్టి (ఎర్రమట్టి, ఇసుక, పశువుల ఎరువును సమపాళ్లలో కలిపిన) మిశ్రమాన్ని 3 సెం.మీ. మందాన వేయాలి. తేమ ఆరిపోకుండా తగుమాత్రంగా తడుపుతూ ఉండాలి. కణుపుల దగ్గర నుంచి 14వ రోజు నుంచి మొలకలు రావడం మొదలై 35 రోజుల్లో పూర్తవుతుంది. ఒక కణుపు తర్వాత మరో కణుపునకు మాత్రమే మొలకలు, వేర్లు మొలుస్తాయి. బొంగును మట్టిలో పాతిపెట్టిన 60 రోజులకు మొలకలను బొంగు నుంచి వేరు చేయవచ్చు. బొంగుకు ఇరువైపులా మట్టిని జాగ్రత్తగా తీసివేసి మొక్కలను సికేచర్తో కత్తిరించి సేకరించాలి. మట్టి మిశ్రమాన్ని నింపిన పాలిథిన్ బ్యాగులలో మొక్కలను పెట్టి, పెంచుకోవాలి. కనీసం ఆరు నెలల మొక్కలనే పొలంలో నాటుకోవాలి. పొలం చుట్టూ గట్లపైన పచ్చి బొంగులను భూమిలో పాతి పెడితే.. మొలకలు వస్తాయి. వాటిని అలాగే పెరగనిస్తే చాలు. అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకోవడానికి వెదురు జీవ కంచెను ఇలా పెంచుకోవచ్చు. 1. బాంబూసా వల్గారిస్ వరి రకం బొంగులు భూమిలో పాతిన 28 రోజులకు పెరిగిన మొలకలు. 2. బొంగులో ఒక కణుపు తర్వాత మరో కణుపునకు మొలకలు, వేర్లు వచ్చిన దృశ్యం 3. బొంగు మొదలు దగ్గరలో ఉన్న కణుపుల్లో వేర్లు వస్తాయి కానీ మొలకలు రావు. 4. పాలిథిన్ బ్యాగ్‌లలో నాటిన బాంబూసా వల్గారిస్ మొక్కల – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
అమృతాహారం.. ఆర్థికానందం!
అడపా వెంకట రమణ చైతన్యవంతుడైన రైతు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని భోగాపురం ఆయన స్వగ్రామం. సొంత పొలంలో నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. సంతోషంగా ఉన్నారు. ‘సాక్షి’లో ప్రతి మంగళవారం ప్రచురితమవుతున్న ‘సాగుబడి’ కథనాల ద్వారా పొందిన స్ఫూర్తితోనే ప్రకృతి వ్యవసాయం చేపట్టానని, అప్పటి నుంచీ ‘సాగుబడి’ పేజీలన్నిటినీ సేకరించి దాచుకుంటూ మళ్లీ మళ్లీ చదువుకుంటున్నానని వెంకట రమణ సంతోషంగా చెప్పారు.రసాయనాలు వాడకుండా పండించిన బియ్యం తినడం వల్ల తనకున్న ఆస్తమా, డస్ట్ ఎలర్జీ పూర్తిగా పోయాయని, భూమి తల్లితోపాటు తన ఆరోగ్యం కూడా బాగైందని ఈ విలేకరితో ముఖతా చెబుతున్నప్పుడు ఆయన కళ్లలో కృతజ్ఞతాపూర్వకమైన సంతృప్తి, ఆనందం కనిపించింది. వెంకట రమణ తొలినాళ్లలో ఒడిదుడుకులను, ఇరుగు పొరుగు వారి ఎగతాళి మాటలను లక్ష్యపెట్టకుండా ముందడుగు వేసి.. అమృతాహారాన్ని అపురూపంగా పండిస్తున్న ఒక రైతుగా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఆర్థికానందాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా పొందుతున్నారు.తన ప్రకృతి వ్యవసాయ ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే.. ‘‘సాక్షి సాగుబడిలో ప్రచురితమైన ‘జీవితేచ్ఛకు నార్వోసి నీర్వెట్టి..’ అనే కథనం నాలుగేళ్ల క్రితం నన్ను కదిలించింది. అదే సంవత్సరం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టాను. ప్రతి వారం సాగుబడి కథనాలు చదివి, అవగాహన చేసుకుంటున్నాను. పాటించాల్సిన మెలకువలు, పద్ధతులను సవివరంగా వస్తున్న కథనాలతో సొంతంగా అన్ని సేంద్రియ ఎరువులు తయారు చేసుకోగలుగుతున్నాను.. ఎక్కడెక్కడో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల క«థనాలతో అదే బాటలో తాము పయనించడానికి సాక్షి సాగుబడి మార్గదర్శిగా మారింది. తొలి ఏడాదే మా సొంత పొలం ఆరెకరాల్లో వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వేశాను. పిండీ(రసాయనిక ఎరువులు), పురుగుమందులు కొట్టిన తోటి రైతులకు ఎకరానికి 30 బస్తాల ధాన్యం పండితే నాకు 15 బస్తాలు పండాయి(నాలుగో ఏడాదికి ఎకరా దిగుబడి 25 బస్తాలకు పెరిగింది). పిండెయ్యకపోతే ఎలా పండుతుంది? అంటూ ప్రత్తిపాడు– రాపర్తి గ్రామాల రైతులు తెగ ఎగతాళి చేశారు. ఇది పనికొచ్చే వ్యవసాయం కాదన్నారు. అయితే, మార్కెట్లో సాధారణ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చింది. రసాయనిక అవశేషాల్లేని బియ్యం అని చెప్పి అమ్ముకోవడం తెలియలేదు. ఆవేశంతో ఒకేసారి ఆరెకరాలు వేయడం తప్పని అర్థమైంది. తర్వాత నుంచి రెండెకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే ఏలేరు కాల్వ నీటితో సార్వా, దాళ్వా ఊడుస్తున్నాను. ఇప్పుడు ఎకరానికి ఖాయంగా 25 బస్తాలు పండిస్తున్నా. చీడపీడలొస్తాయేమోనన్న బెంగ లేదు. రెండేళ్లుగా అయితే పురుగు కషాయాల అవసరం కూడా నాకు రాలేదు. కలుపు మందులు చల్లటం లేదు. నిశ్చింతగా పంట పండుతుంది. మూడో పంటగా మినుములు వేస్తున్నా. వర్షాలు దెబ్బతీయకపోతే చేతికి మినుములు వస్తాయి. లేదంటే భూసారం పెంచడానికి భూమిలో కలిపి దున్నేస్తున్నాను.. నేను చిన్నప్పుడు వర్షాధారంగా పిండి వేయకుండానే మా అమ్మానాన్నా పంటలు పండించే వారు. పెద్దయ్యేటప్పటికి రసాయనిక వ్యవసాయం పుంజుకుంది. రెండు పంటలకూ కలిపి ఎకరానికి 14 బస్తాల రసాయనిక ఎరువులు వేస్తున్నారు. రెండు సార్లు గుళికలు, ఐదారుసార్లు పురుగుమందులు చల్లుతున్నారు. రెండు పంటలకు ఎకరానికి రూ. 50 వేలు ఖర్చవుతున్నది. సార్వాలో 30–35 బస్తాలు, దాళ్వాలో 27 బస్తాలు పండిస్తున్నారు. వాళ్లు బస్తా ధాన్యం మహా అయితే, రూ. 1,400కు అమ్ముతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాకు ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ. 20 వేలు ఖర్చవుతుంది. సార్వా, దాళ్వా కలిపి 50 బస్తాలు పండించి, క్వింటా ధాన్యం రూ. 2,000కు అమ్ముతున్నా. వాళ్లకన్నా నాకే నికరాదాయం ఎక్కువగా వస్తున్నది. వాళ్లు మార్కెట్‌కు తీసుకెళ్లి ధర ఎంతుంటే అంతకు అమ్ముకోవాలి. నేను మార్కెట్ కోసం వెతుక్కోనక్కరలేదు. ఖాతాలున్నాయి. వాళ్లే ఇంటికి వచ్చి నేను చెప్పిన ధరకు తీసుకెళ్తున్నారు..పిండేసిన బియ్యం తినేటప్పుడు నాకు ఆస్తమా, డస్ట్ ఎలర్జీ ఉండేవి. ప్రకృతి ఆహారం తిన్నాక అవి పోయాయి. మా చేనును చూస్తుంటే పసిపాప నవ్వును చూసినట్టుంటుంది. ఎటెళ్లి వచ్చినా చేలోకి వెళ్లి 10 నిమిషాలు గట్టుమీద కూర్చుంటే కానీ ఊసుపోదు..’’ – వెలుగుల సూర్య వెంకట సత్యవరప్రసాద్, సాక్షి, పిఠాపురం, తూ.గో. జిల్లా నేను ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన రెండో ఏడాది మా ఇరుగు పొరుగు వరి పొలాలకు ఎండాకు తెగులు వచ్చింది. ఎకరానికి 10 బస్తాలు కూడా రాలేదు. అయితే, మా పొలానికి ఎండాకు తెగులు రాలేదు. నా దిగుబడి తగ్గలేదు. ఇది చూసిన తర్వాత రైతుల్లో ఆలోచన మొదలైంది. ఏమో అనుకున్నాం గానీ ప్రకృతి వ్యవసాయంలో ఇంత శక్తి ఉందా? అంటూ నోరెళ్లబెట్టారు. అయితే, కౌలు రైతులు నష్టాల భయంతో ముందుకు రాలేకపోతున్నారు. ఎకరానికి కౌలు పది బస్తాలు. అందువల్ల వాళ్లు వెనకాడుతున్నారు. ఎరువుల మీద సబ్సిడీని రైతులకు నేరుగా నగదు రూపంలో వరుసగా మూడేళ్లు ఇస్తేగానీ కౌలు రైతులు మారలేరు. భూమికి, రైతుకు తల్లీబిడ్డకున్న అనుబంధం ఉంది. ప్రకృతి వ్యవసాయంతో భూమిని బతికించి, రైతును బతికించుకోవాలి.. (రైతు వెంకట రమణను 99899 84347 నంబరులో సంప్రదించవచ్చు). జీవామృతం కలుపుతున్న వెంకట రమణ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
విస్తరిస్తున్న అంజీర సాగు
పోషక విలువలు కలిగిన పండు అంజీర. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విరివిగా సాగవుతున్న ఈ పంట సాగు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తున్నది. హైదరాబాద్ నగరంలో మంచి గిరాకీ ఉండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పలువురు రైతులు సాగు ప్రారంభించారు. వారిలో ఒకరు విశ్రాంత ఉపాధ్యాయుడు పంతంగి యాదయ్య. నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామ పరిధిలో రెండేళ్ల క్రితం 4 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన ఆయన.. 3 ఎకరాల్లో పుణే లోకల్ వెరైటీ అంజీర తోటను పది నెలల క్రితం నాటారు. మహారాష్ట్రతోపాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో అంజీర తోటలను స్వయంగా పరిశీలించి అవగాహన పెంచుకున్న తర్వాత ఆయన సాగు చేపట్టారు. బళ్లారి నుంచి రూ.40ల ఖర్చుతో తీసుకొచ్చిన 1,500 మొక్కలను మూడెకరాల్లో నాటారు. గత ఏడాది జూన్‌లో ఒక ఎకరంలో, సెప్టెంబర్‌లో రెండెకరాల్లో నాటారు. మొదట నాటిన ఎకరం తోటలో ప్రస్తుతం తొలి విడత పండ్ల కోత ప్రారంభమైంది. సాళ్ల మధ్య 10 అడుగులు, మొక్కల మధ్య 8 అడుగుల దూరంలో గుంతకు కిలో వర్మీకంపోస్టు వేసి నాటారు. చిగుళ్లను తుంచి వేయడం వలన సైడు కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువ పిలకలు వచ్చేలా చూసుకుంటే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ద్వారా రెండు రోజులకొకసారి నీటి తడిని అందిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి చెట్టుకు 5 కిలోల చొప్పున పశువుల ఎరువు వేశారు. ప్రస్తుతం ప్రతి డ్రిప్పర్ దగ్గర ఐదు కిలోల చొప్పున చెట్టుకు పది కిలోల పశువుల ఎరువు వేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారుల సూచన మేరకు ఇటీవలే వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని 15 రోజులకోసారి పిచికారీ చేయడం ప్రారంభించారు. భవిష్యత్తులో సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుందని యాదగిరి ఆశిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యంపైన అవగాహన పెరుగుతుండటంతో పురుగు మందుల అవశేషాలు లేని పండ్లను తినేందుకు ఎంత ఖర్చయినా పెట్టి కొనుగోలు చేస్తున్నారన్నారు. తన వ్యవసాయ క్షేత్రం వద్ద మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే అంజీర పండ్లను యాదగిరి (96528 60030) విక్రయిస్తున్నారు. – కుంభం వెంకటేశ్వర్లు, సాక్షి, నల్లగొండ రూరల్ -
స్టార్ రైతు 7th January 2017
-
ఇలా చేస్తే.. కలుపుపై మనదే గెలుపు
వరిలో కలుపు నివారణకు ప్రస్తుతం ఎన్నో రసాయనిక మందులు అందుబాటులో ఉన్నాయి. ఆయా పద్ధతుల్లో వరి సాగుకు సంబంధించి కలుపు నివారణకు ఏఏ మందులు వాడాలో బాపట్ల మండల వ్యవసాయాధికారి పి. రఘు (8886614161) రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కాస్తంత దృష్టి పెడితే వరిలో కలుపు నివారణ చాలా తేలికైన పని అని చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. బాపట్లటౌన్: వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వరిలో కలుపు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. కూలీల కొరత కారణంగా కలుపు తీయడం ఖర్చుతో కూడుకున్న పనిగా మారుతోంది. ఈ నేపథ్యంలో కలుపు నివారణకు రైతులు రసాయనాలు వినియోగించాల్సిన అవసరం ఉంది. పలు పద్ధతుల్లో సాగు చేస్తున్న వరిలో కలుపు నివారణకు సంబంధించి రైతులు వేర్వేరు మందులు వాడాల్సి ఉంది. ప్రత్యేక పద్ధతులు అవలంబించాల్సి ఉంది. మెట్టవరిలో కలుపు యాజమాన్యం మెట్టపొలాల్లో వరిని రెండు పద్ధతుల్లో సాగుచేస్తున్నారు. వెదజల్లడం, గొర్రుతో విత్తడం.. ఇవే ఆ పద్ధతులు. ఇలా సాగుచేసిన పైరులో కలుపు నివారణకు వరి విత్తిన రెండు లేక మూడు రోజుల్లోగా లీటరు నీటికి ఐదు నుంచి ఆరు మిల్లీ లీటర్ల ఫెండీమిథాలిన్గానీ, రెండు మిల్లీలీటర్ల ప్రిటిలాక్లోర్ 50 శాతం ద్రావకాన్నిగానీ, 1.5 మిల్లీలీటర్ల అనిలోఫాస్గానీ పిచికారీ చేయాలి. ఊదలాంటి గడ్డిజాతి మొక్కలు ఉంటే.. - విధ పద్దతుల్లో సాగుచేసిన వరిలో విత్తిన 15 నుంచి 20 రోజుల మధ్య ఊదలాంటి గడ్డిజాతి మొక్కలు ఎక్కువుగా ఉంటే ఎకరాకు 400 మిల్లీలీటర్లసైహాలోపాప్ బ్యూటైల్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - గడ్డిజాతి మొక్కలు, వెడల్పాటి మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకు 80 నుంచి 100 మి.లీ బీస్పైరి బాక్ సోడియంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - విత్తినా, నాటిన 25 నుంచి 30 రోజుల్లో ఎకరాకు 400 గ్రాముల 2.4-డి సోడియం సాల్టుగానీ, 50 గ్రాములు ఇథాక్సి సల్ఫ్యూరాన్నుగానీ 15 శాతం పొడి మందుతో, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఎలాంటి కలుపునైనా సమర్థంగా నివారించుకోవచ్చు. డ్రమ్‌సీడర్ సాగులో వరి విత్తిన మూడు నుంచి ఐదు రోజుల్లోగా పొలంలో నీరు పలుచగా ఉన్నప్పుడు ఎకరాకు 35 నుంచి 50 గ్రాముల ఆక్సాడయార్టిల్ పొడి మందు చల్లుకోవాలి. లేదంటే 80 గ్రాముల ఫైరజో సెల్ఫూరాన్ ఇథైల్‌ను అరలీటరు నీటిలో కరిగించి దానికి 20 కిలోల పొడి ఇసుక కలిపి పొలంలో చల్లుకోవాలి. వరి విత్తిన 3 నుంచి 4 రోజుల్లోగా ఎకరాకు 80 గ్రాముల పైరజోసల్ఫూరాన్ ఇథైల్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. -
జీవామృతంతో చేపల పెరుగుదల బాగుంది!
25, 15 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువుల్లో తెల్ల(మంచినీటి) చేపలను సాగు చేస్తున్నాం. గత 8 నెలలుగా ప్రతి 10,15 రోజులకోసారి జీవామృతం చల్లుతున్నాం. 25 ఎకరాల చెరువులో ప్రతిసారీ 600 లీటర్లు జీవామృతాన్ని పడవలో తీసుకెళ్లి చల్లుతున్నాం. దీనివల్ల ప్లాంక్టన్ బాగా పెరుగుతున్నది. మొప్పల వ్యాధి, తోక కొట్టడం వంటి జబ్బులు రావడం లేదు. మేత మామూలుగానే కడుతున్నాం. నెలకు 125 - 150 గ్రాముల చొప్పున చేపలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పట్టుబడి చేస్తాం. - మంతెన కరుణరాజు (94407 03033), యాజలి, కర్లపాలెం మండలం, గుంటూరు జిల్లా -
పశువుల పునరుత్పత్తిలో పోషణ ప్రాముఖ్యత
మన దేశంలో పశుసంపద ఎక్కువగా ఉన్నా ఉత్పాదక శక్తి తక్కువ. జన్యుపరమైన, హార్మోను, వ్యాధి, పోషణ సంబంధమైన అంశాలే ఇందుకు కారణం. దూడలకు చిన్న వయసు నుంచే విటమిన్ ఏ, ఖనిజాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే మేత మేపాలి. అప్పుడు త్వరగా ఎదిగి, ఎదకు వస్తాయి. గర్భసంచి, ఓవరీస్ బాగా ఎదగ డానికి భాస్వరం తగినంత అందించాలి.చూడి పశువుకు పోషణ సరిగ్గా అందకపోతే.. తల్లి తన శరీర పోషక నిల్వల నుంచి, గర్భంలోని దూడ నుంచి కూడా పోషకాలను గ్రహిస్తుంది. రాగి లోపం ఉంటే పిండం మరణాలు సంభవిస్తాయి.విటమిన్ ఏ, ఈ అయోడిన్, మాంగనీసు లోపం వల్ల చూడి పశువులు ఈసుకుపోతాయి. పోషణ లోపం లేకుండా జనేంద్రియాలు బాగా అభివృద్ధి చెందితే ఈత సమస్యలు రావు. పోషణ మరీ ఎక్కువైతే పశువు వెనుక కొవ్వు పెరిగి ఈత ఇబ్బందులెదురవుతాయి. ఈనిన తర్వాత 4-6 వారాల్లో అధిక పాల ఉత్పత్తికి చేరుకుంటుంది. ఈ దశలో పోషకాలు సరిగ్గా ఇవ్వకపోతే పాల ఉత్పత్తి కోసం శరీర నిల్వలను వాడుకుంటుంది. దీని వల్ల ఎదకు రావడం కష్టమవడం, తిరగపొల్లడం వంటి సమస్యలొస్తాయి. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా -
అద్భుత వరి వంగడాల రూపశిల్పి
జ్ఞానభాండాగారాలను తల దిండుగా పెట్టుకొని పెరిగిన వారు విసిరేసిన వెలివాడలో పుట్టిన మట్టి మనిషి దాదాజీ రాంజీ ఖోబ్రగడే. బతుకు మట్టికొట్టుకుపోయినా మట్టిని నమ్ముకొనే బతికిన వెలివాడ దళిత రైతు. మట్టి మీద ఆయనకున్న మమకారం అద్భుత ఆవిష్కరణలకు కారణమైంది. ఆ కృషి ఫలితమే ఇప్పుడు యావత్తు ఉత్తరాది కంచాల్లో వెదజల్లిన విరజాజి మొగ్గల్లా పరుచుకున్న అన్నం మెతుకులు. అవి ఖోబ్రగడే సృష్టించిన హెచ్ఎంటీ రకం బియ్యపు మెతుకులే. విదర్భలోని నాందేడ్ జిల్లా చండీపూర్ తాలుకాలోని నాగ్బీడ్ ఓ మారుమూల కుగ్రామం. దాదాజీ ఆవిష్కరించిన హెచ్ఎంటి ధాన్యంతో ఇది వెలుగులోకి వచ్చింది. మూడో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పిన దాదాజీ ఖోబ్రగడేకు శాస్త్ర పరిజ్ఞానం లేనప్పటికీ.. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నాడు. ప్రతి విషయాన్ని పరిశీలించి చూడడం అలవాటు. నారుపోశామా, నాటేశామా, కోసి నూర్చి, మండీకి తోలామా.. అనే విధానం కాదు ఆయనది. మనస్ఫూర్తిగా నిమగ్నమై పని చేయడం ఆయనకు అలవాటు. దాదాపు 30 ఏళ్ల కిందటి మాట. ఉన్న ఎకరంన్నర పొలంలో ఆ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న పటేల్-3 రకం వరి సాగు చేశాడు. జబల్పూర్లోని జేఎన్కేవి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ జేపి పటేల్ ఈ రకాన్ని అభివృద్ధి చేశాడు. పొలంలో వేసిన పంటను కంటికి రెప్పలా కాపాడుకునే దాదాజీ పంటపొలంలో ప్రతి అడుగును పరిశీలిస్తాడు. ఈ క్రమంలో ఓ మడి మూలన మూడు వరి వెన్నులు మిగతా చేనుకు భిన్నంగా కనిపించాయి. వెంటనే వెన్నులకు గుర్తులు పెట్టి ప్రత్యేకంగా కోసి నూర్చాడు. ఆ గింజలను భద్రంగా దాచి మరుసటి సంవత్సరం పంట సమయంలో ప్రత్యేకంగా నాటేసి అడవి జంతువుల పాలు కాకుండా చుట్టూ కంచెవేశాడు. ఈసారి వచ్చిన దిగుబడిని మరోమారు జాగ్రత్తగా తిరిగి సాగు చేశాడు. కొత్తవిత్తనం సంరక్షణ ప్రస్థానం సాగుతూ 1988 నాటికి నాలుగున్నర క్వింటాళ్ల విత్తనం చేతికి వచ్చింది. బియ్యం మరపట్టించి చూడగా 80 శాతం బియ్యం దిగుబడి వచ్చింది. పటేల్ రకంతో పోలిస్తే అన్నం నాణ్యంగా, రుచికరంగా ఉంది. తన పంట గొప్పతనం గుర్తించిన దాదాజీ ఖోబ్రగడే ఈసారి 150 కిలోల ధాన్యాన్ని విత్తాడు. దాదాజీ ఆశలు ఫలించి 50 బస్తాల ధాన్యం చేతికొచ్చింది. 1990లో దాదాజీ వద్ద విత్తనం తీసుకున్న బీమ్‌రావ్ షిండే అనే భూస్వామి నాలుగెకరాల్లో సాగు చేశాడు. ఆచేత, ఈచేత చుట్టుపక్కల రైతులకు చేరిన ఈ విత్తనం ఆ ప్రాంతంలో చాలా విస్తీర్ణంలో సాగైంది. మార్కెట్లో కొత్త రకం మేలిమి ధాన్యం రాశులుగా పోగుపడగా వ్యాపారులు ఆనందం వ్యకం చేశారు. తలోడి మార్కెట్ వ్యాపారి ఒకడు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి దానికి ఆనాటికి బాగా ప్రాచుర్యంలో ఉన్న హెచ్ఎంటి గడియారం స్ఫూర్తితో హెచ్ఎంటీ అని పేరు పెట్టాడు. ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ఇది సాగవుతోంది. అసలు కథ అప్పుడు మొదలయింది. కోబ్రాగడే ఘనతను చూసి కొందరు పెద్దమనుషులకు కన్నుకుట్టింది. ఓ దళిత రైతు విత్తనాన్ని రూపొందించడం వారికి నచ్చలేదు. అతనికి అందుతున్న ఖ్యాతిని కాజేయాలని ‘ఈనగాచిన చేను నక్కలు నమిలేసినట్లు’ నిరుపేద దళిత రైతు కష్టఫలితాన్ని కొల్లగొట్టడానికి కుట్రచేశారు. హెచ్ఎంటీ ధాన్యానికి ముందు ఒక తోక తగిలించి పీకేవి హెచ్ఎంటీగా పేరు పెట్టి చెలామణి చేయడం ప్రారంభించారు. ఓ జాతీయ ఆంగ్ల దిన పత్రిక ప్రతినిధి ఈ కుట్రను బట్టబయలు చేయడంతో పలు స్వచ్ఛంద సంస్థలు ఖోబ్రగడేకు మద్దతుగా ముందుకొచ్చాయి. న్యాయపోరాటంతో పాటు, శాస్త్రీయ పరీక్షలు జరిపించి నిజాన్ని నిగ్గుతేల్చగా హెచ్ఎంటీ, పెద్ద మనుషులు చెలామణిలోకి తెచ్చిన హెచ్‌ఎంటీకి ఎలాంటి తేడాలేదని తేలిపోయింది. హైద్రాబాద్ నగరంలోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు రెండు వంగడాల జన్యుపటాలను చిత్రించగా ఎలాంటి తేడాలు లేవని వెల్లడయింది. ఈ విషయం నాగ్‌పూర్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌కు తెలియపర్చింది. ఎన్ఐఎఫ్ దాదాజీ రాంజీ ఖోబ్రగడే కృషిని గుర్తించి 2005లో జాతీయ పురస్కారం ఇచ్చి గౌరవించింది. దాదాజీ విత్తనాభివృద్ధి ప్రస్థానం హెచ్‌ఎంటీతో ఆగిపోలేదు. 1987లో మరో రకం ధాన్యానికి ఊపిరి పోసి.. దానికి తన మనవడు నాందేడ్ చిన్నూర్ పేరు పెట్టారు. 1994లో నాందేడ్ హీరా, 1996లో విజయ్ నాందేడ్, 1997లో దీపక్ రత్న రకాలను సృష్టించి మనుమల పేర్లు పెట్టాడు. 1998లో తన పేరుతోనే డీఆర్‌కె (దాదాజీ రాంజీ ఖోబ్రగడే) రకాన్ని సృష్టించాడు. 2002లో కాటే హెచ్ఎంటీ, 2003లో డీఆర్‌కె సుగంధి రకానికి ఊపిరి పోశాడు. దాదాజీ మొత్తం 9 రకాల వరి వంగడాలను సృష్టించాడు. ఇందులో హెచ్ఎంటీ రకం ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో 2.5 లక్షల హెక్టార్లలో సాగవుతున్నదంటే.. దాని గొప్పదనం అర్థమౌతుంది. మన్నులోంచి అన్నం తీసే రైతన్నల ఆశలకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని అందించిన ఖోబ్రగడేని కుల వివక్ష అణగదొక్కిందని మహారాష్ట్రలో అనేక మంది మేథావులు విమర్శించారు. స్వచ్ఛంద సంస్థలు ఈ కుట్రను తూర్పారబట్టాయి. రైతు క్షేత్ర స్థాయి పరిజ్ఞానానికి శాస్త్ర,సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తే కొత్త ఆలోచనలకు ఊపిరిపోసి వెనవేల సృజనలు చేయగలరని దాదాజీ రాంజీ ఖోబ్రగడే నిరూపించాడు. విత్తనాలకు: ఖోబ్రగడే వరి వంగడాలను సికింద్రాబాద్‌లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం అనేక విత్తనోత్పత్తి సహకార సంఘాల ద్వారా రబీ నాటికి రైతులకు అందుబాటులోకి తెస్తోంది. రైతులు డా. రాజశేఖర్(7386145368)కు ఫోన్ చేసి రిజర్వు చేసుకోవచ్చు. ఖోబ్రగడేను 09767290201 నంబరులో సంప్రదించవచ్చు. - జిట్టా బాల్‌రెడ్డి, సాగుబడి డెస్క్ -
ఈ వారం వ్యవసాయ సూచనలు
వేసవిలో, పొలంలో పంటలు లేనప్పుడు భూసార పరీక్షలు చేయించుకోవాలి. వీటి ద్వారా భూమిలోని సారాన్ని తెలుసుకొని తదనుగుణంగా ఎరువులు వేయాలి. భూసార పరీక్ష కోసం మట్టి నమూనా సేకరించే ముందు నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు తదితరాలను తీసివేయాలి. పార లేదా తాపీని ఉపయోగించి మట్టి నమూనాను సేకరించవచ్చు. "V' ఆకారంలో 6-8 అంగుళాల లోతు వరకు గొయ్యి తీసి.. గొయ్యిలో ఒక పక్కగా అంగుళం మందాన అడుగు వరకు మట్టి తీయాలి. ఇదేవిధంగా 8-10 చోట్ల నమూనాలు సేకరించి ఒక శుభ్రమైన గోనెపట్టా మీద వేసి బాగా కలపాలి. మట్టి తడిగా ఉంటే నీడలో కాగితం పైన గానీ, గుడ్డపైన గానీ ఆరబెట్టిన తర్వాత గడ్డలు చిదిపి.. మట్టిని బాగా కలపాలి. తర్వాత మట్టిని వృత్తాకారంగా చదును చేసి నాలుగు సమాన భాగాలుగా విభజించి ఎదురెదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకొని మిగిలిన మట్టిని పారేయాలి. ఈ విధంగా అరకిలో మట్టిని సేకరించి శుభ్రమైన గుడ్డ సంచిలో వేసి రైతు వివరాలు రాసి భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. షేడ్‌నెట్స్: వేసవి కాలంలో షేడ్నెట్ల కింద కూరగాయల సాగును లాభదాయకంగా చేపట్టవచ్చు. అన్ని రకాల కూరగాయల సాగుకు 35% షేడ్నెట్లను ఉపయోగించాలి. 50% షేడ్నెట్లను ఉపయోగించి వేసవిలో సాగుకు అనుకూలం కాని పుదీనా, కొత్తిమీర లాంటి వివిధ రకాల ఆకుకూరలు లాభదాయకంగా సాగు చేసుకోవచ్చు. ఎండ తీవ్రత తగ్గిన తర్వాత కూరగాయ పంటలపై వేసిన షేడ్నెట్లను తొలగించాలి. లేకపోతే పూత, కాపు తగ్గిపోతుంది. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు 1100, 1800 425 1110 కిసాన్ కాల్ సెంటర్ :1551 మొండికేసిన తెల్లమచ్చల వ్యాధి వెనామీ రొయ్యల చెరువుల్లో విలయం సృష్టిస్తున్న తెల్లమచ్చల వ్యాధి ఉధృతి ఐదారు వారాలైనా తగ్గడం లేదు. సాధారణంగా ఈ వ్యాధి 2 వారాల్లో సమసిపోయేది. సాగు విస్తీర్ణం, సీడ్ సాంద్రత పెరగడం కూడా ఇందుకు ఓ కారణం. హేచరీల నుంచి వ్యాధి రహిత రొయ్య పిల్లల(ఎస్పీఎఫ్)ను తెచ్చిన రైతుల కల్చర్ క్షేత్రస్థాయిలో సజావుగా సాగడం లేదు. ఈ అనుభవం దృష్ట్యా మరో మార్గం తెల్లమచ్చల వ్యాధి నిరోధక శక్తి కలిగిన తల్లి రొయ్యల(ఎస్పీఆర్)ను రైతులకు అందుబాటులోకి తెవడమే. వెనామీ చెరువులను తెల్లమచ్చల వ్యాధి అతలాకుతలం చేస్తున్నప్పటికీ అదృష్టవశాత్తూ ఈఎంఎస్ లక్షణాలు ఎక్కడా కనపడకపోవడం గమనార్హం. తెల్లమచ్చల వ్యాధిని తగ్గించడానికి, వ్యాప్తిని అరికట్టడానికి ఎటువంటి వ్యాక్సిన్లు, మందులు, ప్రోబయోటిక్స్ లేవు. 2005-09 మధ్య టైగర్ కల్చర్ కనుమరుగై వ్యాధుల ఉధృతి తగ్గింది. గత 3,4 ఏళ్లలో వెనామీ సాగు సజావుగా సాగడానికి ఇదే కారణం. - ప్రొ. పి. హరిబాబు (98495 95355), మత్స్య కళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా వేసవిలో పశువుల సంరక్షణ పద్ధతులివీ.. ముర్రా, మాలి జాతి గేదెలు, ఇంగ్లిష్ ఆవులు ఎండకు తాళలేవు. వేసవి తీవ్రత వల్ల పాల దిగుబడి తగ్గుతుంది, ఎద లక్షణాలు కనిపించవు, వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. చుట్టూ చెట్లుండే పాకల్లో పశువులను కట్టేస్తే మంచిది. గోనె సంచులను తడిపి పాకలకు వేలాడదీయాలి. ఉ. 10 గంటల్లోపు, సా. 4 గంటల తర్వాత మేతకు వదలాలి. వేడి వల్ల జీర్ణ రసాయనాల ఉత్పత్తి తగ్గుతుంది. చల్లటి నీటితో కడిగితే వీటి ఉత్పత్తి బాగుంటుంది. ఇంగ్లిష్ ఆవులకు వేసవిలోనూ పచ్చిమేత వేయడం తప్పనిసరి. గేదెలను ఒకటి, రెండు సార్లు నీటితో కడగాలి. మధ్యాహ్నం 2,3 గంటలు చెరువు నీటిలో పడుకునే వీలు కల్పించాలి. పాలు తీసే ముందు నీటితో కడగడం వల్ల పాల దిగుబడి కొద్దిమేర పెరిగే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. వేసవిలో ఎక్కువ కొవ్వు, ప్రొటీన్లుండే దాణా పెట్టకూడదు. పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే దాణా పెట్టాలి. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా వ్యాధి సోకిన చేపలను గుర్తించడం ఇలా.. వ్యాధిసోకిన చేపలను వ్యాధి నిర్థారణ కోసం నిపుణులకు వద్దకు తీసుకెళ్లడంలో రైతులు మెలకువలు పాటించాలి. వ్యాధి లక్షణాలు స్పష్టంగా ఉండి, బతికి ఉన్న చేపలను నిపుణులకు చూపిస్తే వ్యాధి నిర్థారణ, చికిత్స సులువు అవుతాయి. చనిపోయి, కుళ్లకుండా తాజాగా ఉన్న చేపలనూ చూపించవచ్చు. నీటి ఉపరితలంపైన, గట్ల వెంట నీరసంగా ఈదుతున్న చేపలు, ఎగురుతున్న చేపలు, ఈత తప్పుగా ఈదుతున్న చేపలు సాధారణంగా వ్యాధులకు గురైనవై ఉంటాయి. వీటి సేకరణ ఉదయపు వేళల్లో సులభం. వ్యాధికి గురైన చేపలపై కురుపులు, గాయాలు, రక్తం చెమరింపు ఉంటాయి. మొప్పలపై పరాన్న జీవులుంటాయి. రంగు మారిపోయి ఉంటుంది. - డా. రావి రామకృష్ణ (98480 90576), సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్స, 6-3-249/1, రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034 saagubadi@sakshi.com -
బోర్లు రెండు.. మోటారు ఒకటే!
సాధారణ రైతు అద్భుత ఆవిష్కరణ 50% వ్యవసాయ విద్యుత్ ఆదా! ఉన్న రెండెకరాలకు నీరు పారించడానికి అప్పోసొప్పో చేసి బోరు వేస్తే.. వచ్చిన అంగుళం నీరు ఎకరానికీ చాలదాయె! ఎకరం పంట ఎండిపోక తప్పని దుస్థితి. ఎట్ల చేద్దునురా దేవుడా.. అని మథనపడుతున్న బడుగు రైతుకు.. చప్పున మెరుపు లాంటి ఆలోచన తట్టింది. ఆలస్యం చేయకుండా తనకొచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. తొలి ప్రయత్నమే ఫలించింది! రెండున్నర ఇంచుల నీరు పారింది. అంతేకాదు.. రెండెకరాలతోపాటు మరో అరెకరం పైగా పారే నీరుందిప్పుడు! ఈ అసాధారణ ఘనత సాధించిన సాధారణ రైతు పేరు పందిరి పుల్లారెడ్డి(47). ఆయన ఊరు నల్లగొండ జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం. ఇంతకీ.. ఈ కృషీవలుడు సాధించిన ఘనత ఏమిటంటే.. పొలంలో రెండు బోర్లను ఒక మోటారుతో నడిపించడం! పదో తరగతి వరకూ చదువుకొని మారుమూల గ్రామంలో రెండెకరాల సొంత భూమిలో పంటలు పండించుకొని కుటుంబాన్ని పోషించు కుంటున్న పుల్లారెడ్డి సాధించిన ఈ విజయం చిన్నా, పెద్దా రైతులందరికీ ఊరటనిచ్చే గొప్ప ఆవిష్కరణ. అన్నిటికీ మించి.. విద్యుత్తును సగానికి సగం ఆదా చేసే అద్భుత టెక్నిక్ ఇది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు కిలో మీటరు దూరంలో పుల్లారెడ్డి పొలం ఉంది. రెండేళ్ల క్రితం రూ.25 వేల ఖర్చుతో తన భూమిలో బోరు వేసి మరో రూ. 25 వేలతో 5 హెచ్‌పీ సబ్మెర్సిబుల్ విద్యుత్ మోటారు అమర్చాడు. బోరులో సరిపడా నీరు లేక సాగు చేసిన రెండెకరాలలో ఎకరం భూమిలో వరి పంట ఎండిపోయింది. దీంతో మరో రూ.25 వేలు అప్పు చేసి పాత బోరుకు 30 అడుగుల దూరంలో మరో బోరు వేశాడు. రెండో బోరుకు విద్యుత్ మోటార్ అమర్చడానికి మరో రూ. 25 వేలు కావాలి. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న దశలో.. ఒకే మోటారుతో ఈ రెండు బోర్లను ఎందుకు నడపకూడదు? అన్న వినూత్న ఆలోచన మదిలో మెదిలింది. వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టి రూ. 5 వేల ఖర్చుతో 140 అడుగుల పొడువున ఇంచున్నర (ఒకటిన్నర అంగుళాల) పైపును కొనుక్కొచ్చాడు. రెండో బోరులోకి 100 అడుగుల మేర దింపి.. మొదటి బోరుకు లింక్ కలిపాడు. అంతే..! ఒకే మోటార్‌తో రెండు బోర్లలో ఉన్న నీటిని తోడేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. గతంలో ఒక్క బోరు ద్వారా కేవలం ఒక ఇంచు నీరు వస్తుండగా.. ప్రస్తుతం రెండు బోర్లలోని నీరు కలిపి దాదాపు రెండున్నర ఇంచుల నీరు వస్తోంది. తన ప్రయత్నానికి చక్కని ఫలితం దక్కడంతో పుల్లారెడ్డి ఆనందానికి అవధుల్లేవు. గతంలో ఒక ఎకరంలో ఏడాదికి ఒకసారే వరి పంట పండేది. ఇప్పుడు నిక్షేపంగా రెండెకరాల్లో వరి రెండు పంటలు పండిం చగలు గుతున్నాడు. ఈ టెక్నిక్కు పుల్లారెడ్డి ‘వెంకట శేషాద్రి పంపింగ్ సిస్టమ్’గా నామకరణం చేశాడు. కొందరు రైతులు ఆయన సహాయంతో తమ పొలాల్లోని బోర్లను అనుసం ధానం చేయించుకుంటూ.. ఖర్చు తగ్గించుకుంటున్నారు. - జీఎస్ రెడ్డి, న్యూస్‌లైన్, మునగాల, నల్లగొండ జిల్లా బ్రహ్మాండం.. పుల్లారెడ్డి జ్ఞానం! సాధారణ రైతైన పుల్లారెడ్డి జ్ఞానం బ్రహ్మాండం. 50% వ్యవసాయ విద్యుత్‌ను పొదుపు చేయడం ఎలాగో చేసి చూపించాడు. పేటెంట్ కోసం నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్‌కు నివేదిక పంపాం. - విశ్రాంత బ్రిగేడియర్ పోగుల గణేశం(9866001678) 50 అడుగుల దూరంలో బోర్లను కలిపా రెండు బోర్లను కలిపి ఒకే మోటారుతో నడిపిస్తున్నా. ఆరుగురు రైతుల పొలాల్లో ముప్పయి నుంచి ఏభై అడుగుల దూరంలో ఉన్న బోర్లకు ఇలాంటి మార్పులు చేశా. ఇంకా ఎక్కువ దూరంలో ఉన్న బోర్లకు, 200 అడుగుల కన్నా లోతు వేసిన బోర్లకు ఈ టెక్నిక్ పనిచేస్తుందో లేదో తెలీదు. పేటెంట్ కోసం దరఖాస్తు చేశా. రైతులకు మేలు చేస్తున్నందుకు సంతృప్తిగా ఉంది. - పందిరి పుల్లారెడ్డి (9963239182), రైతు, ముకుందాపురం, మునగాల మండలం, నల్లగొండ జిల్లా -
ఇది సేంద్రియ పాల కాలం!
పాలు సంపూర్ణ ఆహారం అన్నది ఎంత నిజమో.. రసాయనిక అవశేషాలతో కూడిన పాలు అనారోగ్య హేతువన్నది కూడా అంతే నిజం! సేంద్రియ పాలపై మధ్యతరగతి వినియోగదారుల్లో అవగాహన క్రమంగా పెరుగుతున్నది. సేంద్రియ పాల ఉత్పత్తికి దేశీ జాతి పశువులతో పాటు, రసాయనిక అవశేషాల్లేని గడ్డి, దాణా దినుసులు అవసరం. దాణాలో బీటీ పత్తి చెక్కను వాడకూడదు. నిపుణులు సిఫారసు చేసిన ఔషధాలను మాత్రమే వాడాలి. నీడన కట్టేసి ఉండే పశువుల పాల కన్నా.. ఆరుబయట తిరిగే పశువుల పాలు ఇంకా శ్రేష్టమని నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ పాల డెయిరీలు మన రాష్ట్రంలోనూ ప్రజాదరణ పొందుతున్నాయనడానికి ఈ యువరైతుల అనుభవాలే నిదర్శనం.. సేంద్రియ పాడి రైతుగామారిన యువ వైద్యుడు ఆరోగ్యవంతమైన సేంద్రియ పాలను వినియోగదారులకు అందించే లక్ష్యంతో డా. గద్దె సుదర్శనరావు అత్యాధునిక రీతిలో డెయిరీ ఫాంను నెలకొల్పారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలకు చెందిన సుదర్శనరావు హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ చదివిన తర్వాత కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డారు. రసాయనిక అవశేషాలు లేని, ఔషధ గుణాలు కలిగిన పాలను ఉత్పిత్తి చేసి ప్రజలకు అందిస్తే వారికి మంచి ఆరోగ్యాన్నిచ్చినట్టేనని భావించారు. పమిడిముక్కల మండలం వీరంకిలాకులో అత్యాధునిక పద్ధతుల్లో డెయిరీని ఏర్పాటు చేశారు. విశ్రాంత వైద్యుడైన తన తండ్రి డా. జీవీ కృష్ణారావు తోడ్పాటుతో డెయిరీని నిర్వహిస్తున్నారు. ఔషధ విలువలతోపాటు పాలధార ఎక్కువగా ఉండే 40 దేశవాళీ గిర్ జాతి ఆవులతోపాటు 20 జాఫరాబాదే రకం గేదెలతో గత ఏడాది నవంబర్ 1న డెయిరీ ఫాంను ప్రారంభించారు. గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతానికి చెందిన గిర్ ఆవులను కొనుగోలు చేశారు. రోజుకు ఒక్కో ఆవు 20 లీటర్లు, ఒక్కో గేదె 16 లీటర్లు వరకు పాల దిగుబడి ఇస్తున్నాయి. పాలను ప్యాకెట్లలో నింపి హైదరాబాద్ మార్కెట్‌కు తరలిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. ఆధునిక పద్ధతిలో గోధుమ గడ్డి సాగు! సేంద్రియ విధానంలో ఆధునిక హైడ్రోపోనిక్ పద్ధతిలో పచ్చి మేతను సాగు చేస్తుండడం విశేషం. రూ.35 లక్షల వ్యయంతో హైడ్రోపోనిక్ ఫాడర్ మిషన్‌ను నెలకొల్పారు. శీతలీకరణ గిడ్డంగి మాదిరిగా ఉండే ప్రత్యేకంగా రూపొందించిన ఈ పశుగ్రాస యంత్రం ద్వారానే బార్లీ, గోధుమ, అలసంద, మొక్కజొన్న తదితర విత్తనాలతో పచ్చి మేతను పెంచుతున్నారు. ట్రేలలో ఈ గింజలను పోసి.. ఆరు రోజులపాటు 18 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచి, 20 నిమిషాలకోసారి నీటి తుంపరలు పడేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విద్యుత్/ జనరేటర్‌తో నడుస్తున్న ఈ యంత్రాన్ని గోబర్ గ్యాస్‌తో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొలకెత్తిన గింజలు ఏడో రోజుకు సుమారు 5 అంగుళాల ఎత్తు పెరుగుతాయి. రసాయనాలు వాడకుండా పెంచిన ఈ గడ్డిని ఆవులకు మేపుతున్నారు. ఒక కిలో విత్తనాలతో పది కిలోల పశుగ్రాసం లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ గడ్డితోపాటు ఆవులు, గేదెలకు దాణా కూడా పెడుతున్నారు. పచ్చి మేత పెంపకంతోపాటు పాలు పితకడం.. పితికిన పాలను శీతలీకరించడం.. ప్రత్యేకంగా సంచుల్లో నింపడం.. అంతా యంత్రాలతోనే చేస్తుండడం విశేషం. సుధాకరరావు ఆరోగ్యదాయకమైన పాలను ఉత్పత్తి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. - ఐ.ఉమామహేశ్వరరావు సాక్షి, మచిలీపట్నం, కృష్ణా జిల్లా (ఇన్పుట్స్: పామర్తి నాగేంద్రరావు,న్యూస్‌లైన్, పమిడిముక్కల) స్వచ్ఛమైన పాల ఉత్పత్తిలో యువ రైతు మెదక్ జిల్లాలో ఓ యువరైతు సహజమైన పద్ధతుల్లో దేశవాళీ ఆవుల డెయిరీ నిర్వహిస్తూ స్వచ్ఛమైన పాల ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని బేగంపేటకు చెందిన ఒమర్ (27) పదో తరగతి వరకు చదువుకొని కొన్ని సంవత్సరాలు చిన్నా చితకా ఉద్యోగాలు చేశాడు. సంతృప్తి చెందక వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. జగదేవ్‌పూర్ మండలం గణేష్‌పల్లిలో మూడేళ్ల క్రితం ఏడెకరాల భూమిని కొనుగోలు చేసి రెండు బోర్లు వేశాడు. తొలి ఏడాది మొక్కజొన్న సాగు చేశాడు. ఆ తర్వాత అతని మనసు పాడి పరిశ్రమ వైపు మళ్లింది. ఏదైనా ప్రత్యేకత ఉంటే మార్కెటింగ్ సులువు అవుతుందన్న భావనతో నాటు ఆవులతో డెయిరీని నిర్వహించడం మేలనుకున్నాడు. గుజరాత్ వెళ్లి అధి కంగా పాలిచ్చే 17 నాటు ఆవులను కొనుగోలు చేశాడు. నిపుణుల సలహా మేరకు.. ఆవులను స్వేచ్చగా ఆరుబయట తిరిగి మేత మేసే విధంగా తన వ్యవ సాయ క్షేత్రానికి చుట్టూ ఫెన్సింగ్ వేయించాడు. పొ లంలో రసాయనిక ఎరువులు వినియోగించకుండా జీవామృతంతో పశుగ్రాసం సాగు చేసి ఆవులకు మేపుతూ మంచి ఆదాయం పొందుతున్నాడు. ప్రస్తుతం 9 ఆవులు ఒక్కొక్కటి రోజుకు 10 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. ఈ ఉత్సాహంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయల సాగు కూడా చేపట్టడానికి ఒమర్ సంసిద్ధమవుతున్నాడు. - వై.సురేందర్, న్యూస్‌లైన్, గజ్వేల్, మెదక్ జిల్లా మొదట్లో ఎవరూ ఆదరించలేదు! స్వచ్ఛమైన పాలను తొలుత తా ను ఊరురా తిరిగి అమ్మే వాడిని. అయితే అవగాహనలేక ప్రజలు కొనడానికి ఆసక్తి చూపలేదు. హైద్రాబాద్ లోని ప్రముఖ మిఠాయి వ్యాపారవేత్త ఇటీవలే నా గురించి తెలుసుకొని పాలను కొనుక్కెళ్తున్నారు. ఏపూటకాపూట తాజాగా వినియో గదారులకు అందిస్తున్నారు. సంకర జాతి ఆవు పాలకన్నా ఈ పాలకు రెట్టింపు ధర పలుకుతుండడంతో మంచి ఆదాయం పొందగలుగుతున్నా. రసాయనాల అవశేషాలు లేని, ఔషధ విలువలు కలిగిన ఈ పాలు చక్కని ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందిస్తాయని వినియోగదారులు అర్ధం చేసుకుంటున్నారు. స్వచ్ఛమైన పాలకు డిమాండ్ ఇంకా పెరుగుతుంది. - ఒమర్ (99085 71176), దేశీ ఆవు పాల రైతు, గణేష్‌పల్లి, జగదేవ్‌పూర్ మండలం, మెదక్ జిల్లా సహజమైన పాలు అందించడమే లక్ష్యం! సహజసిద్ధమైన ఆవు పాలను అందించే లక్ష్యంతో రసాయనాలు వాడని మేతను ఆవులకు మేపుతున్నాం. ఆయుర్వేద ఔషధాలను వాడాలనుకుంటున్నాం. సేంద్రియ పాల ఉత్పత్తిపై ఆసక్తితో వివిధ రాష్ట్రాల్లో పర్యటించి డెయిరీలను పరిశీలించి ఆధునిక పద్ధతిలో ఈ డెయిరీని ఏర్పాటు చేశా. యంత్రాల వాడకం ద్వారా కూలీల కొరతను అధిగమించాం. మా డెయిరీలో ముగ్గురు కార్మికులు, ఒక సూపర్వైజర్ పనిచేస్తారు. మా నాన్న డా. జీవీ కృష్ణారావు (99590 90105, 99632 00729) పర్యవేక్షిస్తున్నారు. డెయిరీ ఫాంకు అనుసంధానంగా గోబర్ గ్యాస్ ప్లాంట్, సోలార్ సిస్టంను పెట్టుకుంటే కరెంటు ఖర్చు తగ్గుతుందనుకుంటున్నాం. - డా. గద్దె సుదర్శనరావు, సేంద్రియ డెయిరీ యజమాని, వీరంకిలాకు, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా నాటు పశు జాతుల ప్రత్యేకతేమిటి? ఎ2 బీటా కెసిన్ అనే ప్రొటీన్ పుష్కలంగా ఉండే సేంద్రియ పాలకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈ పాలకు మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పెరుగుతోంది. మోపురం ఉండే దేశీ/నాటు జాతుల ఆవులు, బర్రెల పాలల్లో ఎ2 కెసిన్ 94 నుంచి 100% వరకు ఉందని హర్యానాలోని భారతీయ జంతు జన్యు వనరుల సంస్థ(ఎన్ బీఏజీఆర్) అధ్యయనంలో తేలింది. గిర్ తదితర జాతుల ఆవు పాలలో ఎ2 కెసిన్ 100% ఉండగా, ఒంగోలు ఆవు తదితర దేశీ పశుజాతుల పాలలో 94 శాతం ఉందని వెల్లడైంది. దేశీ ఆవు పెరుగుతో మధుమేహానికి చెక్! దేశీ లేదా నాటు ఆవు పెరుగుతో మధుమేహం తగ్గించవచ్చని హైదరాబాద్(ఇక్రిశాట్ ఆవరణ)లోని అంతర్జాతీయ పశు పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎం. సాయిబుచ్చారావు అంటున్నారు. అధ్యయనంలో భాగంగా ఆయన ఒంగోలు, గిర్ ఆవులకు మూలికలతో ప్రత్యేకంగా రూపొందించిన దాణా పెట్టి.. ఈ ఆవుల పాలతో తయారైన పెరుగును స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ముగ్గురు మధుమేహ రోగులకు తినిపించారు. ఈ అధ్యయనం ప్రాథమిక దశ విజయవంతంగా పూర్తయిందని డా. సాయిబుచ్చారావు తెలిపారు. తదుపరి దశ అధ్యయనం కొనసాగుతోందన్నారు. దీని ఫలితాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదిస్తామని ఆయన వివరించారు.