శాస్త్రీయ పద్ధతుల్లో తాటి నీరా సేకరణ
తాటి చెట్ల నుంచి నీరాను సేకరించడం డిసెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుంది. తాటి నీరా అత్యంత ఆరోగ్యదాయకమైన ప్రకృతిసిద్ధమైన పానీయం. తాటిచెట్టు గెలల నుంచి స్రవించే పోషక ద్రవాన్ని పులియకుండా సేకరిస్తే నీరా, పులియబెట్టి సేకరిస్తే కల్లు అవుతాయి. తాజా నీరా చక్కటి రుచితో అంతకుమించిన పోషకాలతో కూడి ఉంటుంది. దీన్ని హెల్త్ డ్రింక్‌గా తాగవచ్చు. తాటినీరాతో బెల్లం, పాకం(సిరప్), పంచదార, పటిక బెల్లం తయారు చేయవచ్చు. ఇళ్లలో, బేకరీల్లో చక్కెరకు బదులుగా వీటిని వాడుకోవచ్చు. తాటి ఉత్పత్తుల గ్లైసెమిక్ ఇండెక్స్(జి.ఐ.) తక్కువ కాబట్టి సాధారణ వ్యక్తులతోపాటు షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడుకోవచ్చని తూ.గో. జిల్లా పందిరిమామిడిలోని ఉద్యాన పరిశోధనా కేంద్రానికి చెందిన ఫుడ్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య చెబుతున్నారు. ఈ పరిశోధనా కేంద్రంలో తాటి నీరాతో వివిధ ఉత్పత్తుల తయారీ కోసం అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పారు. గీత కార్మికులు, రైతులు, గ్రామీణులకు శిక్షణ ఇస్తున్నారు.
తాటి నీరా
ప్రకృతి సిద్ధంగా తాటి చెట్టు నుంచి లభించే పానీయాన్ని పులియకుండా సేకరిస్తే.. దాన్ని నీరా అంటారు. ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. నీరా తియ్యగా ఉండటమే కాకుండా సుక్రోజు వంటి పిండి పదార్థాలు ఎక్కువగా కలిగి ఉంటుంది. నీరాలో ఇంకా అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి.
నీరా చక్కెర శాతం ఎక్కువగా కలిగిన పానీయం. దీనిలో చక్కెరతోపాటు ఐరన్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్, ఆస్కార్బిక్ ఆమ్లాలు వంటి విటమిన్లు ఉన్నాయి. నీరా జీర్ణశక్తిని పెంచుతుంది. కామెర్లు వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉన్న నీరాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడవచ్చు. దీనిలో మినరల్స్, అవశ్యకమైన అమైనో ఆమ్లాలు, బి–కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. గర్భవతులకు, బలహీనంగా ఉన్న పిల్లల ఆరోగ్య రక్షణకు ఉపయోగించే ఆయుర్వే ఔషధాల్లో నీరాను వాడుతున్నారు.
గర్భవతులు నీరాను వారానికి మూడు లేదా నాలుగు రోజులు తీసుకోవడం వల్ల పుట్టబోయే శిశువు మంచి రంగులో, ఆరోగ్యంగా జన్మిస్తుంది. బలహీనంగా ఉన్న పిల్లలకు రోజూ తక్కువ మోతాదులో ఇస్తే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు. మధుమేహం, ఊబకాయం, దంత క్షయం ఉన్న వారికి నీరా ఉపయోగపడుతుంది. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన కేలరీలు తక్కువగా ఉండే పదార్థాలు ఇష్టపడేవారు నీరాతో తయారు చేసిన పదార్థాలను వాడవచ్చు. తాటి నీరా సిరప్ (పాకం), బెల్లం, పంచదారను ఇళ్లలో, బేకరీలో వివిధ రకాల పదార్థాల తయారీలో చక్కెరకు బదులుగా వాడవచ్చు. నీరాను పాకం, బెల్లం, పంచదార వంటి పదార్థాలుగా మార్చడం వలన వీటిని సాంప్రదాయ వంటలు, ఇతర పదార్థాల తయారీలో చెరకు నుంచి తయారు చేసిన బెల్లం, పంచదారకు బదులుగా వాడవచ్చు.
తాటి పటిక బెల్లం
తాజాగా సేకరించిన నీరా (తాజా నీరా ఉదజని సూచిక 7–8 ఉంటుంది)ను 103–105 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద బాగా మరిగించాలి. నీరా బాగా మరిగి దాదాపు మూడో వంతు వరకు ఇగిరిన తర్వాత మంటను ఆర్పివేసి.. సన్నని దారాలు లేదా తీగలతో తయారు చేసిన క్రిష్టలైజర్‌లో పోయాలి. దీన్ని కదలకుండా, గాలి తగలకుండా ఉన్న చోటనే 35–40 రోజుల పాటు ఉంచాలి. తరువాత దారాలు లేదా తీగలకు అంటుకొని ఏర్పడిన స్ఫటికాల(అదే పటిక బెల్లం)ను బయటకు తీసి కడిగి, ఆరబెట్టి నిల్వచేసుకోవచ్చు.
తాటి బెల్లం
తాటి నీరాతో బాండీలో పోసి మరిగించి సులభంగానే బెల్లం తయారు చేసుకోవచ్చు. తొలుత 103–105 డిగ్రీల ఉష్ణోగ్రతతో బాగా మరగబెట్టి, తరువాత తక్కువ మంట మీద కలుపుతూ ఉండాలి. చిక్కబడిన తర్వాత అచ్చులలో పోస్తే బెల్లం తయారవుతుంది. ఎటువంటి ఎంజైములు, రసాయనాలు కలపనవసరం లేదు.
తాటి పంచదార
తాటి చెట్ల పెంపకంలో రసాయనాలు వాడే అవసరం లేదు. కాబట్టి తాటి నీరాతో తయారు చేసే పంచదారను కూడా ప్రకృతి సిద్ధంగా, ఏ విధమైన రసాయనాలు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. రసాయనాలు వాడకుండానే తాటి పంచదారను తయారు చేసుకోవచ్చు. ఇంతులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. నీరా పంచదారను వాడటం వలన బరువు తగ్గడం, మధుమేహం అదుపులో ఉండటంతోపాటు సీరమ్ కొలస్ట్రాల్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కూడా నీరా పంచదార ఉపయోగపడుతుంది. తాజా నీరా(ఉదజని సూచిక 7–8)ను 103–105 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగించి, బాగా చిక్కబడిన తరువాత క్రిస్టలైజర్, సెంట్రిఫ్యూజులను ఉపయోగించి పంచదారను తయారు చేస్తారు.
తాటి సిరప్ (పాకం)
తాజా నీరాను బాణలిలో పోసి 103–105 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బాగా మరిగించాలి. నీరా బాగా మరిగి దాదాపు సగం పరిమాణానికి తగ్గినప్పుడు మంటను ఆర్పివేసి, చల్లబర్చి గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. దీన్ని చక్కెరకు బుదులుగా వాడుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. టీ, కాఫీలలోను, కషాయాల లోను, బేకరీ ఉత్పత్తులలోను, ఐస్‌క్రీమ్‌ల తయారీలోను నీరా సిరప్‌ను ఎక్కువగా వాడతారు.
4 కోట్ల తాటి చెట్లున్నా..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 4 కోట్ల తాటిచెట్లు ఉన్నాయి. ముదురు చెట్ల నుంచి డిసెంబర్ నుంచి 4 నెలల పాటు నీరాను సేకరించవచ్చు. చెరకు రసంతో తయారు చేసే పంచదార, బెల్లం కన్నా తాటి బెల్లం, తాటి పంచదార ఎంతో మేలైనవి. ఈ సహజ తీపి ఉత్పత్తులను గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహ రోగులు కూడా తినొచ్చు. ఇంత ప్రయోజనకరమైన తాటి చెట్లలో 1 శాతాన్ని కూడా మనం ఉపయోగించుకోకపోవడం దురదృష్టకరం. ప్రతి తాటి చెట్టు నుంచి ఏటా గరిష్టంగా రూ. 10 వేల ఆదాయం పొందవచ్చు. గ్రామీణులకు ఉపాధి అవకాశాలను ఇవ్వగల శక్తి తాటి, ఈత చెట్లకు ఉందని ప్రభుత్వాలు, గీత కార్మికులు, రైతులు గుర్తించాలి.
– పి. సి. వెంగయ్య (94931 28932), సీనియర్ శాస్త్రవేత్త (ఫుడ్‌సైన్స్, టెక్నాలజీ), అఖిల భారత తాటిపరిశోధనా పథకం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పందిరి మామిడి, తూ. గో. జిల్లా
తాటి నీరాతో తయారవుతున్న తాటి బెల్లం, తాజా తాటి నీరా
Comments
Please login to add a commentAdd a comment