రాష్ట్రంలో 3.85 కోట్ల మందికి స్క్రీనింగ్..
20.92 లక్షల మందిలో సమస్య గుర్తింపు
దేశవ్యాప్తంగా 32.33 కోట్ల మందికి గాను 2.96 కోట్ల మందిలో నిర్ధారణ
ఎన్‌సీడీ పోర్టల్ నివేదిక వెల్లడి
రాష్ట్రంలో జీవనశైలి జబ్బులు ప్రమాద ఘంటిక మోగిస్తున్నాయి. ప్రతి 18 మందిలో ఒకరు షుగర్‌తో బాధపడుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించే నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) పోర్టల్‌లోని నవంబరు నెలాఖరు నాటి సమాచారం ఆధారంగా.. రాష్ట్రంలో 3.85 కోట్ల మందికి వైద్యశాఖ స్క్రీనింగ్ చేయగా.. 20.92 లక్షల మందిలో షుగర్ నిర్ధారణ అయినట్లు తేలింది. దేశవ్యాప్తంగా 32.33 కోట్ల మందికి గాను 2.96 కోట్ల మందిలో ఈ సమస్య ఉంది.
ఇందులో అత్యధికంగా 47.92 లక్షల మంది కేరళలో ఉన్నారు. అనంతరం.. మహారాష్ట్రలో 40.03 లక్షలు, కర్ణాటక 28.83 లక్షలు, తెలంగాణలో 24.52 లక్షల మంది బాధితులున్నారు. ఈ లెక్కన గమనిస్తే దేశంలో సగటున 11 మందిలో ఒకరు షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. – సాక్షి, అమరావతి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
⇒ ధూమపానం, మద్యపానం వంటి వాటిని విడనాడాలి.
⇒ తక్కువ కేలరీలున్న ఆహార పదార్థాలు తీసుకుంటూ, బరువు తగ్గించుకోవాలి.
⇒ శరీరంలో కొవ్వు నియంత్రణకు తోడ్పడే జాగ్రత్తలు తీసుకోవాలి.
⇒ ఆహారంలో జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు. పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
⇒ రోజూ కనీసం 30 నిమిషాల నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు విధిగా చేయాలి. క్రమం తప్పని వ్యాయామం వల్ల శరీర కణజాలంలోని ఇన్సులిన్ గ్రాహకాల సెన్సిటివిటీ పెరుగుతుంది.
⇒ తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం మంచిది.
నియంత్రణ మన చేతుల్లోనే..
మధుమేహం రెండు రకాలు. టైప్–1.. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. టైప్–2 ఇది అనారోగ్యకర జీవనశైలితో వస్తుంది. టైప్–1ను ఎవరూ ఆపలేరు. కానీ, టైప్–2 రాకుండా నియంత్రించడం మన చేతుల్లోనే ఉంది. చిప్స్, నూడిల్స్ వంటి అల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం.. కదలికల్లేని యాంత్రిక జీవనంతో పాఠశాల విద్యార్థుల్లోనూ టైప్–2 మధుమేహం వస్తోంది. ఈ అలవాట్లను పూర్తిగా నియంత్రించాలి. వ్యాయామాలు చేయాలి.
మధుమేహ బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ విషయంలో నిర్లక్ష్యంచేస్తే రెటినోపతి, కిడ్నీల వైఫల్యానికి కారణమయ్యే నెఫ్రోపతి, న్యూరోపతి, రక్తనాళాలకు సంబంధించిన పెరిఫెరల్ వాస్క్యులర్ వ్యాధుల వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. – డాక్టర్ ఎం. నాగచక్రవర్తి, జనరల్ మెడిసిన్ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, మంగళగిరి ఎయిమ్స్
Comments
Please login to add a commentAdd a comment