
అంగన్‌వాడీలకు టీవీల కొను‘గోల్‌మాల్’కు పథక రచన
‘సాక్షం అంగన్‌వాడీ మిషన్ 2’లో రూ.100 కోట్లిచ్చిన కేంద్రం
రూ.25కోట్లతో తొలి దశలో 9,664 అంగన్‌వాడీల్లో స్మార్ట్ టీవీలు
గత అక్టోబరులో టెండర్ బిడ్ దాఖలు చేసిన 11 కంపెనీలు
కమీషన్లు తేలకపోవడంతో కారణం చెప్పకుండా రద్దు చేసిన ప్రభుత్వం
నిధులు మురిగిపోతాయని ఫిబ్రవరిలో ఏపీటీఎస్‌కు రూ.25 కోట్లు బదలాయింపు
ముందస్తు ఒప్పందంతో తమకు నచ్చిన కంపెనీలకు టెండర్ దక్కేలా నిబంధనల మార్పు
మార్చిలో పిలిచిన టెండర్‌లో బిడ్ దాఖలు చేసిన మూడు కంపెనీలు
నాసిరకం టీవీలను కట్టబెట్టి ఎవరి వాటాలు వాళ్లకిచ్చేలా లోపాయికారీ ఒప్పందాలు
అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తువుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా మింగేసేందుకు కూటమి కీలక నేతలు పెద్ద స్కెచ్ వేశారు. ‘సాక్షం అంగన్‌వాడీ పోషన్-2‘ అభియాన్ ద్వారా.. ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార పంపిణీ, వస్తువుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అంగన్‌వాడీల బలోపేతానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.100 కోట్లు ఇచ్చింది. ఈ మొత్తంలో రూ.25 కోట్లతో అంగన్‌వాడీల్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడే అసలు తంతు మొదలైంది. కేంద్ర నిధుల్లో స్మార్ట్‌గా కమీషన్లు కొట్టేసేందుకు కూటమి నేతలు పథక రచన చేశారు. - సాక్షి, అమరావతి
» రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 9,664 సెంటర్లలో కేంద్ర నిధులతో తొలి దశలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క టీవీకి రూ.25 వేల చొప్పున కేటాయించారు. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా గత ఏడాది అక్టోబరులో టెండర్ పిలిచారు.
» పేరున్న కంపెనీలకు చెందిన 11 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. వాటిలో 6 సంస్థలను టెక్నికల్‌గా టెండర్ కమిటీ అనర్హమైనవి (డిస్ క్వాలిఫై) చేసింది. ఇక మిగిలినవారిలో ఎవరికైనా టెండర్ ఖరారు చేశారా? అంటే అదీ లేదు. కారణం చెప్పకుండానే అర్థంతరంగా టెండర్‌ను రద్దు చేశారు. కమీషన్లకు సంబంధించిన డీల్ కుదరకపోవడమే దీనికి కారణమని విశ్వసనీయంగా తెలిసింది.
ముందస్తు ఒప్పందాలతో మళ్లీ టెండర్ ప్రక్రియ
రెండోసారి అనుకూలమైన కాంట్రాక్ట్ సంస్థలతో కొందరు కీలక నేతలు, అధికారులు కలిసి ముందస్తు ఒప్పందాలతోనే మళ్లీ టెండర్ ప్రక్రియ చేపట్టినట్టు విమర్శలు వస్తున్నాయి. కేంద్రం నిధులు సకాలంలో ఖర్చు చేయకుంటే మురిగిపోతాయనే సాకుతో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.25 కోట్లను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్)కి ఈ ఏడాది ఫిబ్రవరిలో బదిలీ చేశారు. దీన్ని అడ్డుపెట్టుకుని ఏపీటీఎస్ ద్వారా మార్చిలో మళ్లీ టెండర్ ప్రక్రియ చేపట్టారు.
ఇదిగో అసలు కథ
ముందస్తు ఒప్పందాలతో తమకు నచ్చిన సంస్థలకు టెండర్ కట్టబెట్టేలా నిబంధనలను మార్చేశారు. మొదటి టెండర్ నిబంధనల్లో ప్రస్తావించిన బిడ్స్ దాఖలు చేసే కంపెనీలు డీఎల్‌ఈడీ, ఈఎల్‌ఈడీ అనేది ఉండాలని, మూడేళ్లలో 9,800 టీవీలు సరఫరా చేసిన అనుభవం ఉండాలని, తాము చెప్పిన ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) మాత్రమే ఉండాలనే తదితర కీలక షరతులను రెండో టెండర్ ప్రక్రియలో లేకుండా చేశారు. దీంతో మొదటి టెండర్ ప్రక్రియలో 11 సంస్థలు బిడ్స్ వేస్తే.. రెండో టెండర్‌లో మూడు సంస్థలు మాత్రమే బిడ్స్ వేశాయి. ఇదంతా ముందుగా ఎంచుకున్న సంస్థకు లబ్ధి చేకూర్చడానికేనని స్పష్టమవుతోంది.