అంగన్‌వాడీ కేంద్రాల్లో తనిఖీలతో హడావుడి
నకిలీ అధికారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు
సీటీఆర్‌ఐ: నేనే ప్రత్యేక అధికారిని.. నేను చెప్పినట్లు వినాలి.. లేదంటే మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటూ కొన్ని రోజులుగా ఒక వ్యక్తి హల్‌చల్ చేస్తున్నాడు. అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని తనిఖీల పేరిట భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే.. మూడు రోజులుగా కొవ్వూరులోని అరికిరేవులు, చాగల్లు, తాళ్లపూడిలోని 124 అంగన్‌వాడీ కేంద్రాలకు ఒక వ్యక్తి వచ్చి తాను ప్రత్యేక అధికారిని అని, రికార్డులు తనిఖీ చేయడానికి వచ్చానని సిబ్బందికి తెలిపాడు. అంతే కాకుండా తన మాట వినకపోతే ఉద్యోగాలు పోతాయని బెదిరించాడు.
అక్కడున్న అంగన్‌వాడీ సిబ్బందితో సెలీ్ఫలు దిగమని బలవంతం చేశాడు. తనిఖీల్లో ఇదో భాగమని, సెల్ఫీలు దిగకపోతే తనిఖీలు పూర్తి కాదని బెదిరించాడు. దీంతో హడలిపోయిన అంగన్‌వాడీ సిబ్బంది ఇతను నిజంగానే ప్రభుత్వ అధికారి అనుకుని తనిఖీలకు అనుమతి ఇచ్చారు.
కానీ ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.బేబీరాణి దృష్టికి తీసుకు రావడంతో ఆమె అంగన్‌వాడీ పీడీకి తెలిపారు. చివరికి అతను నకిలీ అధికారి అని గుర్తించారు. వారంతా కలసి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రశాంతికి వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ అతనెవరో తెలుసుకుని పోలీసు కేసు పెట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment