అంగన్‌వాడీలను అందంగా తీర్చిదిద్దాలి | AP: Anganwadis should be beautified | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలను అందంగా తీర్చిదిద్దాలి

Published Tue, Dec 19 2023 3:54 AM | Last Updated on Tue, Dec 19 2023 3:54 AM

AP: Anganwadis should be beautified - Sakshi

సాక్షి, అమరావతి: ‘మన అంగన్‌వాడీ నాడు–నేడు’ రెండో దశలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రెండో దశలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌(మౌలిక సదుపాయాలు) కె.భాస్కర్‌ సాంకేతిక మార్గదర్శ­కాలను సోమవారం జారీచేశారు.

‘మన అంగన్‌వాడీ నాడు–నేడు’ రెండో దశలో రూ.214.22 కోట్లతో 20,534 కేంద్రాల రూపురేఖలు మార్చనున్నట్లు మార్గ­దర్శకాల్లో స్పష్టంచేశారు. ఈ పనులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లను ఆదే­శించారు. మొత్తం 20,534 అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ప్రధాన, చిన్న మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు గుర్తించాలని పేర్కొన్నారు.

ఇప్పటికే ఉన్న టాయిలెట్‌లో రన్నింగ్‌ వాటర్‌ సమస్యలు, రక్షిత మంచినీటి పైపు­లు, సంప్‌లు, ఎలక్ట్రికల్‌ వైరింగ్, ట్యూబ్‌లైట్లు, సీలింగ్‌ ఫ్యాన్లు, పెయింటింగ్, శ్లాబ్, ఫ్లోరింగ్, గోడలకు మరమ్మతులు వంటివి ఈ నెలాఖరులోగా గుర్తించాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. 

ఈ నెల మూడో వారంలో కమిటీల సమావేశాలు
ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లల తల్లులతో కమిటీలు నియమించాలని మార్గదర్శకాల్లో పేర్కొ­న్నారు. ఒక్కో కమిటీలో ముగ్గురు తల్లులు, సచివా­లయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్, వార్డు కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్, మహిళా శిశు సంక్షేమశాఖ సూపర్‌­వైజర్, మహిళా పోలీసు, సమీపంలోని స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు ఉండాలని తెలిపారు. ఆ కమిటీల పేరుతో జాతీయ బ్యాంకుల్లో ఖాతాలను తెరవాలని సూచించారు.

ఈ నెల మూడో వారంలో తల్లుల కమిటీల సమావేశాలను ఏర్పాటుచేసి అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టాల్సిన మరమ్మతు పను­లను గుర్తించడంతోపాటు వాటికి అంచనాలను రూపొందించి తీర్మానం చేసి అంగన్‌వాడీ సూపర్‌వై­జర్‌కు సమర్పించాలని ఆదేశించారు. ఈ నెల చివరి వారంలో మరమ్మతు పనుల అంచనాలను సమగ్ర శిక్ష పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

అంచనాలకు జిల్లా కలెక్టర్లు పరిపాలన అనుమతులను మంజూరు చేస్తారని తెలిపారు. మరమ్మతులకు అవసరమైన మెటీరి­య­ల్‌ను స్థానికంగా కొనుగోలు చేసి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. తలుపులు, కిటికీలు, వాటర్‌ ట్యాంకులు, పైపులైన్లు, సంప్‌లతోపాటు ఏమైనా పరిక­రాలకు మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోతే కొత్తవి ఏర్పాటుచేయా­లని ఆదేశించారు. మెటీరియల్‌ కొనుగోలు, పనుల వివరాలను ఎప్పటికప్పుడు ‘ఎం బుక్‌’లో నమోదు చేయాలని సచివాలయాల ఇంజినీరింగ్‌ అసిస్టెంట్, వార్డు కార్యదర్శులకు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement