మీటర్లలో ‘సర్వీస్‌’ మాయ | Discoms that install electricity meters but do not provide service numbers | Sakshi
Sakshi News home page

మీటర్లలో ‘సర్వీస్‌’ మాయ

Published Fri, Jan 24 2025 5:37 AM | Last Updated on Fri, Jan 24 2025 5:37 AM

Discoms that install electricity meters but do not provide service numbers

విద్యుత్‌ మీటర్లు బిగించి సర్వీస్‌ నంబర్లు ఇవ్వని డిస్కంలు

ఆరేళ్లుగా బిల్లులు లేకుండా అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్‌ సరఫరా 

అమలాపురంలో బయటపడ్డ అధికారుల భాగోతం 

రాష్ట్రవ్యాప్తంగా అనేక సెంటర్లలో ఇదే పరిస్థితి 

మీటర్లనూ ప్రమాదకర స్థాయిలో బిగించిన వైనం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్‌ మీటర్లు అమర్చిన విద్యుత్‌ పంపిణీ సంస్థలు వాటికి సర్వీస్‌ నంబర్లు లేవనే విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించాయి. ఏపీ ఈపీడీసీఎల్‌ పరిధిలోని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం సర్కిల్‌ పరిధిలో ఈ భాగోతం వెలుగు చూసింది. 

దీనిపై నివేదిక సమర్పించాలని ఈసీడీసీఎల్‌ సీఎండీ ఐ.పృథ్వీతేజ్‌ అధికారులను ఆదేశించగా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అమలాపురం ఆపరేషన్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌కు అమలాపురం సర్కిల్‌ ఎస్‌ఈ ఎస్‌.రాజబాబు మెమో జారీ చేశారు. ఇప్పటికైనా ‘మోస్ట్‌ అర్జంట్‌ మేటర్‌’గా పరిగణించి ఏడు రోజుల్లోగా మీటర్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అందులో స్పష్టం చేశారు. 

కాగా.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది అంగన్‌వాడీ కేంద్రాల్లో సర్వీస్‌ నంబర్‌ లేకుండా మీటర్లు అమర్చి, బిల్లులు ఇవ్వకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. మరికొన్ని సర్వీసులకు బిల్లులు జారీ చేసినా వాటిని వినియోగదారులకు ఇవ్వలేదు. దీని వెనుక భారీ కుంభకోణం ఉందని తెలుస్తోంది.  

ప్రాణాలతోనూ చెలగాటం 
రాష్ట్రవ్యాప్తంగా 55,605 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. దాదాపు 35 లక్షల మంది ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణు­లు, బాలింతలు ఈ కేంద్రాలకు వస్తుంటారు. దాదాపు 1.30 లక్షల మంది అంగన్‌వాడీ సిబ్బంది నిత్యం ఈ కేంద్రాల్లోనే విధులు నిర్వర్తిస్తుంటారు. అలాంటిచోట విద్యుత్‌ మీటర్లు 6 అడుగులకు పైగా ఎత్తులో అమర్చాలి. కా..నీ చిన్న పిల్లలుంటారనే కనీస ఇంగితం కూడా లేకుండా ఈ కేంద్రాల్లో కేవలం 3 అడుగులు ఎత్తులోనే మీటర్లు ఏర్పాటు చేశారు.

మొత్తం బిల్లు ఇప్పుడు ఇస్తాం 
కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు బిల్లులు కూడా రూపొందించాం. కానీ.. ఆ బిల్లులను ఎవరికీ ఇవ్వలేదు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు మీటర్లు ఇచ్చినప్పటికీ సర్వీసు నంబర్‌ ఇవ్వలేదు. కొన్నేళ్లుగా రీడింగ్‌ తీయకపోయినా ఆ సమాచారం మీటర్‌లో నిక్షిప్లమై ఉంటుంది. దాని ఆధారంగా మొత్తం బిల్లును ఇప్పుడు జారీ చేస్తాం. – రవికుమార్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, అమలాపురం ఆపరేషన్‌ డివిజన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement