సాక్షి, అమరావతి: వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే టేక్ హోమ్ రేషన్ పంపిణీ ఆంధ్రప్రదేశ్‌లో బాగా అమలవుతోందని నీతి ఆయోగ్ నివేదిక కితాబు ఇచ్చిది. వివిధ రాష్ట్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీల్లో మంచి పద్ధతులపై నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిగిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పక్కాగా అమలు చేస్తోందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది.
వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ స్మార్ట్ ఫోన్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తోందని, తద్వారా టేక్ హోమ్ రేషన్ పంపిణీకి సంబంధించి బహుళ అంశాలను ట్రాక్ చేస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. తద్వారా రేషన్ పంపిణీ సమయంలో లీకేజీలను నిరోధించడంతో పాటు పక్కాగా ధ్రువీకరణ జరుగుతోందని నీతి ఆయోగ్ తెలిపింది. అంగన్‌వాడీ కేంద్రాల వారీగా అంగన్‌వాడీ వర్కర్లు ప్రతినెలా వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేయడంతోపాటు ప్రతినెలా ఆ డేటాను నవీకరిస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది.
నీతి ఆయోగ్ ఇంకా ఏం చెప్పిందంటే..
► ఈ–సాధన సాఫ్ట్‌వేర్ నుంచి లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ప్రతినెలా టేక్ హోమ్ రేషన్ సరుకులు ఎంత పరిమాణం అవసరమో అంచనా వేస్తారు. గత నెలకు సంబంధించి నిల్వలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను పరిగణనలోకి తీసుకుని, ప్రతినెలా బడ్జెట్ అంచనాలను అభివృద్ధి చేస్తారు.
► సాఫ్ట్‌వేర్ డేటాతో మరోసారి రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రభుత్వంలో నమోదైన సరఫరాదారులకు పాలు, గుడ్లు తదితర డ్రై రేషన్ సరుకులు అంగన్‌వాడీ కేంద్రాల వారీగా ఎంత పరిమాణం కావాలో తెలియజేస్తారు.
► జిల్లాల వారీగా ఏయే అంగన్ వాడీ కేంద్రాలకు ఎంత పరిమాణంలో డ్రై రేషన్ అవసరమో అంచనా మేరకు సరఫరాదారు డెలివరీ చేస్తారు.
►అవసరమైన మెటీరియల్ సరఫరా చేసారా లేదా అనే విషయాన్ని అంగన్‌వాడీ వర్కర్ యాప్‌లోని డేటా ఎంట్రీ ద్వారా బయోమెట్రిక్ ప్రమాణీకరణతో ధ్రువీకరిస్తారు.
►ఆ వెంటనే అంగన్‌వాడీ కేంద్రానికి సరఫరా అయిన టేక్ హోమ్ రేషన్ పరిమాణాన్ని మహిళా సూపర్‌వైజర్ తనిఖీ నిర్వహిస్తారు. ఆ తరువాత శిశు అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ మరోసారి తనిఖీ నిర్వహిస్తారు. నాణ్యతను కూడా నిర్థారిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment