రాష్ట్రంలో పోలింగ్ తర్వాత కూడా ఆగని ‘చేయూత’
లబ్ధిదారుల ఖాతాల్లో కొనసాగుతున్న డబ్బుల జమ
పోలింగ్ అనంతరం 18న రూ. 1,513 కోట్లు
24న మరో రూ. 200 కోట్లు, 27న ఇంకో రూ. 400 కోట్లు
20న ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 629 కోట్లు
ఎన్నికలతో సంబంధం లేకుండా పథకాల లబ్ధి పొందిన మహిళలు
సాక్షి, అమరావతి: ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏటా ముందుగానే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి ఠంఛన్‌గా ఆయా పథకాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వం ఎన్నికల అనంతరం కూడా పథకాల అమలు కొనసాగిస్తూ వస్తోంది. ఎన్నికల కోడ్ కారణంతో మధ్యలో నిలిచిన వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం పథకాల లబ్ధిదారులకు ఈ 13న పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా పథకాల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది.
ఒక్కో మహిళకు రూ. 18,750ల చొప్పున 18న వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా రూ. 1,513.78 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. 24న మరో రూ. 200 కోట్లు, 27న ఇంకో రూ. 400 కోట్లు ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన వారికి కూడా పంపిణీ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు నాలుగు విడతల్లో రూ. 75 వేల మొత్తం అందించేలా వైఎస్సార్ చేయూత పథకం అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగో విడతగా పంపిణీ చేస్తున్న రూ. 5,060.49 కోట్లతో కలిపి ప్రభుత్వం గత ఐదేళ్లలో 26,98,931 మందికి ఈ ఒక్క పథకం ద్వారానే రూ.19,189.60 కోట్లు అందించినట్లు అవుతుంది.
పోలింగ్ ముగిసిన మర్నాటి నుంచే
ఐదేళ్లగా కొనసాగుతున్న పథకాలే అయినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీడీపీ, జనసేనల ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయా పథకాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే పోలింగ్ ముగిసిన మరుసటి రోజు మే 14న 21.56 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకానికి సంబంధించి రూ. 1,843.07 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో 2019 ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం పేరిట ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా అందజేసే ప్రక్రియ పూర్తయింది.
2019 ఏప్రిల్ 11 నాటికి 78.94 లక్షల మంది మహిళలకు రూ.25,570 కోట్లు అప్పు ఉండగా, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆ మొత్తం రుణాన్ని ప్రభుత్వం అందించింది. మరోవైపు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అగ్ర వర్ణాల్లోని 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అర్హులైన పేద మహిళలకు ఈ విడతలోను రూ.15 వేలు చొప్పున లబ్ధిదారులు అందరికీ చెల్లించాల్సిన మొత్తం రూ. 629 కోట్లను చెప్పిన ప్రకారమే పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 20న వారి ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment