సేద్యంలో సేవలకు సలాం | Sakshi
Sakshi News home page

సేద్యంలో సేవలకు సలాం

Published Mon, Apr 29 2024 2:21 AM

niti aayog appreciated ap government about agriculture sector

వ్యవసాయ రంగంలో ఏపీ పథకాలపై నీతి ఆయోగ్‌ కితాబు 

రైతుల కోసం సీఎం జగన్‌ సర్కారు అత్యుత్తమ విధానాలు  

ఇతర రాష్ట్రాలూ అనుసరించదగిన విధానాలివి 

కొత్త పథకాల అమలులో ముందంజలో ప్రభుత్వం  

వైఎస్సార్‌ సున్నా వడ్డీతో అప్పుల నుంచి విముక్తి  

పంటకు రక్షణ కల్పించమే లక్ష్యంగా ఉచిత పంటల బీమా  

పగటి పూట 9 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌

ఇందు కోసం ఏడాదికి రూ.8,400 కోట్లు చెల్లింపు 

వ్యవసాయ విద్యుత్‌ నగదు బదిలీ పథకం..

బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ 

సేద్యంలో పెట్టుబడికి వైఎస్సార్‌ రైతు భరోసా పథకం 

ఏడాదికి 3 విడతల్లో రూ.13,500 రైతు ఖాతాల్లోకి నగదు.. 

ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు అధిక ప్రాధాన్యం 

నాణ్యమైన ఇన్‌పుట్స్, సామర్థ్యం పెంపుదలకు ఆర్‌బీకేల సేవలు  

వికసిత్‌ భారత్‌ దిశగా ప్రోత్సాహానికి ఇవన్నీ ఉత్తమ విధానాలు 

సాక్షి, అమరావతి:  రైతుల సంక్షేమం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాలు, ఉత్తమ విధానాలు అమలు చేస్తోందని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలు అనుసరించి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించింది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం అమలు చేయడంతో అప్పుల వలయం నుంచి రైతాంగం విముక్తి పొందుతున్నారనీ, ఆర్‌బీకేలు పారదర్శకంగా ఉంటూ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని కితాబిచ్చింది. 

వికసిత్‌ భారత్‌ దిశగా ప్రోత్సాహానికి వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు, ఆచరణలతో నీతి ఆయోగ్‌ నివేదిక విడుదల చేసింది. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతుల కోసం కొత్తగా అమలు చేస్తున్న పథకాలు.. ఉత్తమ విధానాలు, ఆచరణలను ప్రముఖంగా ప్రస్తావించింది. వీటిని ఇతర రాష్ట్రాలు నేర్చుకోవడానికి, భాగస్వామ్యం చేయడానికి నివేదికను విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ నివేదికలో నీతి ఆయోగ్‌ పేర్కొన్న అంశాలివే.. 

వడ్డీ భారం మొత్తం ప్రభుత్వమే చెల్లింపు  
వైఎస్సార్‌ సున్నా వడ్డీతో రుణ భారం నుంచి రైతులు విముక్తి పొందారు. వారి సంక్షేమం, ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. సకాలంలో పంట రుణాలు చెల్లించే రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ప్రభుత్వం వర్తింప చేస్తోంది. వడ్డీ రాయితీ మొత్తాన్ని రైతుల బ్యాంకుల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తోంది. వడ్డీ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ..లబ్ధిదారులు సకాలంలో రుణాన్ని చెల్లిస్తే ప్రభుత్వం వడ్డీని తిరిగి చెల్లిస్తోంది. పంటలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా రైతుల ప్రయోజనాల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ ఉచిత పంటల బీమా కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఈ పథకం కింద రైతుల నమోదును సులభతరం చేయడంతో పాటు కేవలం టోకెన్‌గా ఒక రూపాయి మాత్రమే వసూలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఉచిత పంటల బీమాను వర్తింప చేయడంతో రైతులకు వరంగా మారింది. వాతావరణ మార్పులు, ప్రకతి వైపరీత్యాలు లాంటి సమయాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఆయా సీజన్‌లోనే క్లెయిమ్‌లను నేరుగా రైతుల ఖాతాలకే జమ చేస్తున్నారు.  దీంతోపాటు పంటల భౌతిక ధ్రువీకరణ కూడా రైతులకు అందిస్తోంది. 

రైతాంగానికి బీమా నమోదు రసీదులను కూడా పంపిణీ చేస్తున్నారు. ఉచిత పంటల బీమా నమోదు ప్రక్రియ వీలైనంత సరళంగా, అవాంతరాలు లేకుండా చేస్తున్నారు. ఈ  పథకం విజయవంతంగా అమలయ్యే తీరు వ్యవసాయ అభివద్ధిని సూచిస్తోంది.  

రైతు భరోసా అందించే ఏకైక రాష్ట్రం  
వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకాలను ఏపీ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తోందని నీతి ఆయోగ్‌ పేర్కొంది. రైతులకు ఆర్థిక సాయం గ్రాంట్‌గా అందిస్తున్నారని తెలిపింది. ఏడాదిలో మూడు విడతల్లో రైతులకు రూ.13,500 చొప్పున అందిస్తున్నారని, సీజన్‌ ప్రారంభంలో భూమిని సిద్ధం చేసి, విత్తనాలు కొనుగోలు చేయడం, ఎరువులు, కూలీల చార్జీల నిమిత్తం రైతులకు ఉపయోగపడేలా ఈ పథకాలను అమలు చేస్తున్నారని నివేదిక వివరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు ఈ పథకంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంది. 

ఉచిత విద్యుత్‌ కోసం ఏటా రూ.8,748 కోట్లు 
వ్యవసాయంలో ఉచిత విద్యుత్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.8,748 కోట్లు చెల్లిస్తోందని నీతి ఆయోగ్‌ నివేదికలో తెలిపింది. దీన్ని మరింత పటిష్టపరిచేందుకు వచ్చే 30 ఏళ్ల పాటు నిరంతరాయంగా కొనసాగించేందుకు ముందస్తు చర్యలను ప్రభుత్వం చేపట్టిందని నివేదిక స్పష్టం చేసింది. దీంతో పాటు వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందని, ఇందుకోసం  అన్ని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల బిల్లులకు ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. 

ఉచిత విద్యుత్‌ బిల్లు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపింది. కేంద్రం సూచించిన సంస్కరణల్లో భాగంగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయనుందని, ఈ పథకంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ అందించడంతో రైతులపై ఆరి్థక భారాన్ని తగ్గిస్తుందని తెలిపింది.

 వచ్చే 30 ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ అందించడానికి 10,000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను అభివద్ధి చేయనుందని తెలిపింది. రైతుల వ్యవసాయానికి ఉచితంగా పగటి పూట 9 గంటలపాటు విద్యుత్‌ సరఫరా కోసం ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.1,700 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసిందని నివేదిక తెలిపింది.

అందివచ్చిన ఆర్‌బీకేలు: వ్యవసాయంలో సవాళ్లను పరిష్కరించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇది ఉత్తమ ఆచరణగా నీతి ఆయోగ్‌ కితాబు ఇచ్చింది. రైతులకు నాణ్యమైన ఇన్‌పుట్‌లు, సేవలు అందించడంతోపాటు సామర్థ్యం పెంపుదల, విజ్ఞాన వ్యాప్తిని ఆర్‌బీకేలు అందిస్తున్నాయని తెలిపింది. ఇవి పంటల సేకరణ కేంద్రాలుగా పని చేస్తూ రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా పారదర్శకంగా రైతాంగానికి భరోసా ఇస్తున్నాయని వ్యాఖ్యానించింది. 

ఈ కేంద్రాలు అధిక దిగుబడి సాధించడంలోను, పంటల నాణ్యతను మెరుగుపరిచేందుకు సహాయపడటంలో విజయవంతమయ్యాయని నివేదిక తెలిపింది. ఆర్‌బీకేలను పంటల కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించిన తరువాత రైతులు తమ ఉత్పత్తులను గ్రామంలోనే విక్రయించుకునే వీలు కలిగింది. వీటి ద్వారా రైతాంగం ప్రభుత్వ పథకాలు నేరుగా పొందుతున్నారు. ముందుగా పరీక్షించడం ద్వారా నకిలీ విత్తనాలను నిరోధించడంతో పాటు ప్రైవేట్‌ అవుట్‌లెట్లలో అధిక ధరలను నిరోధిస్తున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ, ఉచిత పంటల బీమా నమోదు కార్యక్రమాలు ఆర్‌బీకేలు నిర్వహిస్తున్నాయి. రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు శాస్త్రవేత్తలు అందిస్తున్నారు. 

Advertisement
Advertisement