8 మంది వ్యవసాయ కూలీల దుర్మరణం
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లాలో ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
పనులు ముగించుకుని ఇంటికొస్తుండగా దుర్ఘటన
చంద్రబాబు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
గార్లదిన్నె: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యుశకటం కబళించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..
పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో ఎరువు వేసే పనికోసం ఉదయమే ఆటోలో వచ్చారు. అక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు పయనమయ్యారు. తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటో గార్లదిన్నె వైపునకు మలుపు తీసుకుంటుండగా.. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48) రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో నుంచి రోడ్డు మీద పడి తీవ్రగాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్న కూలీలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.
ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్ననాగన్న (55), జయరాముడు (48), కొండమ్మ (50), ఈశ్వరయ్య మృతిచెందారు. లక్ష్మీదేవి, పెద్దులమ్మ, రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్ననాగన్న–చిన్ననాగమ్మ, ఈశ్వరయ్య–కొండమ్మ దంపతులు.
ఒకేరోజు ఎనిమిది మంది మృతిచెందడం, ఐదుగురు గాయపడడంతో ఎల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై గార్లదిన్నె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:వైఎస్ జగన్
అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment