Laborers killed
-
ప్రహరీ కూలి ముగ్గురు కూలీల దుర్మరణం
మంచిర్యాల క్రైం: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ముగ్గురు కూలీలు నిర్మాణ పనులు చేస్తూ ప్రహరీ గోడ కూలి దుర్మరణం చెందారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకున్న ఈ దుర్ఘటన వివరాలిలా.. స్థానిక బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో నందిని ఆస్పత్రి నిర్వాహకులు నూతన భవనం నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం రుద్రపురం గ్రామానికి చెందిన ఏనంక హన్మంత్(35), బాబాపూర్‌కు చెందిన ఆత్రం శంకర్(40), చింతలమానెపల్లికి చెందిన గోలేం పోషం(50) సెల్లార్లో పనులు చేస్తున్నారు. పనుల్లో భాగంగా పిల్లర్ల మధ్యలో మట్టి, బండలు నింపుతుండగా పక్కనే ఉన్న పాత ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలి పోషం, శంకర్, హన్మంత్‌పై పడడంతో దానికింద నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. వీరి పక్కనే పనిలో ఉన్న రాములును మరో ఇద్దరు కూలీలు లాగడంతో స్వల్ప గాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు, స్థానికులు రెండు గంటలపాటు డ్రిల్లర్, జేసీబీ సాయంతో శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు. çమృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కార్మిక సంఘాలు డిమండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. ఘటనాస్థలాన్ని అదనపు కలెక్టర్ రాహుల్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించి ప్రమాద వివరాలు సేకరించారు. -
‘కూలిన’ బతుకులు
మొయినాబాద్: నాణ్యత లోపం.. ఇంజనీర్లు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇద్దరు వలస కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంది. నిర్మాణంలో ఉన్న షెడ్ కుప్పకూలడంతో శిథిలాలకింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఫైర్ఫాక్స్ క్లబ్లో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫైర్ఫాక్స్ క్లబ్లో షెడ్ మాదిరి నిర్మాణం చేపడుతున్నారు. సుమారు 100 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తుతో ఇనుప స్తంభాలు ఏర్పాటు చేసి నాలుగు వైపులా 40 అడుగుల ఎత్తు గోడలు నిర్మించారు. వాటిపై ఇనుప బీమ్‌లు పెట్టి వాటిపై ఐరన్ షీట్లు బిగించారు. షీట్లపై ఆర్సీసీ స్లాబ్ వేశారు. బీహార్, పశ్చిమబెంగాల్‌కు చెందిన వలస కార్మికులు కొంత కాలం క్రితం ఇక్కడికి వచ్చి కూలీ పనుల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం 14 మంది కార్మికులు నిర్మాణంలో ఉన్న షెడ్లో పని చేస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పశ్చిబెంగాల్‌కు చెందిన బబ్లూ(35), బిహార్‌కు చెందిన సునీల్ (26), రాకేష్, సంజయ్, విజయ్, సంతోష్, ప్రకాష్, వికాస్కుమార్, రాజన్‌లు శిథిలాల కింద ఇరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీంను రప్పించారు. శిథిలాలను తొలగిస్తూ అందులో ఇరుకున్నవారిని బయటకు తీశారు. బబ్లూ, సునీల్ మృతి చెందగా.. మిగిలిన ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మరో ఐదు మంది ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. దీనిపై మృతుల కుటుంబాల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ ఏవీ రంగా తెలిపారు. నాణ్యతా లోపంతోనే... ఫైర్ఫాక్స్ క్లబ్లో నిర్మిస్తున్న షెడ్ నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం వల్లే కుప్పకూలిందని స్థా నికులు ఆరోపిస్తున్నారు. షెడ్ నిర్మాణం చేపట్టి ఇనుప షీట్లపై ఆర్సీసీ స్లాబ్ వేయడం వల్లే కూలిందని, షెడ్ డిజైనింగ్‌లో ఇంజనీర్ల నిర్లక్ష్యం ఉందని మండిపడుతున్నారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కాగా బాధితులను ఆదుకుంటామని నిర్మాణదారులు చెప్పారు. -
మృత్యుపాశం.. కూలీల ట్రాక్టర్‌పై తెగిపడ్డ 11 కేవీ విద్యుత్ తీగ
రాయదుర్గం/ బొమ్మనహాళ్/ సాక్షి, అమరావతి: కాసేపట్లో ఇంటికి చేరాల్సిన వ్యవసాయ కూలీలను కరెంటు తీగ కాటేసింది. ట్రాక్టర్లో ఇళ్లకు తిరుగు పయనమవుతున్న సమయంలో వారి బతుకులు బుగ్గిపాలయ్యాయి. అప్పటి వరకు మేఘావృతమై కనిపించిన ఆకాశం.. పనులు పూర్తయ్యే సరికి చిరుజల్లులు కురిపించింది. దీంతో 11 కేవీ విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్‌కు గురయ్యాయి. ఓ తీగ తెగి కూలీలు వెళ్తున్న ట్రాక్టర్‌పై పడింది. అక్కడికక్కడే నలుగురు మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు వద్ద బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దర్గా హొన్నూరు గ్రామానికి చెందిన కమ్మూరి సుబ్బన్న అనే రైతు ఊరికి సమీపంలోని తన పొలంలో ఆముదం పంట సాగు చేశాడు. పంట దిగుబడిని తీసేందుకు బుధవారం ఉదయం 8.30 గంటలకు సొంత ట్రాక్టరులో గ్రామానికే చెందిన 14 మంది కూలీలను తీసుకుని వెళ్లాడు. వీరిలో ఎనిమిది మంది మహిళలు.. ఆరుగురు పురుషులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పని పూర్తయ్యింది. అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. అయినా తిరుగు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. కూలీలను ఎక్కించుకుని, ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్ తీగ షార్ట్‌సర్క్యూట్ కారణంగా తెగి ట్రాక్టరుపై పడింది. దీంతో వన్నక్క (52), రత్నమ్మ (40) అనే అత్తాకోడళ్లతో పాటు శంకరమ్మ (34), పార్వతి (48) అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మహిళా, ఇద్దరు పురుష కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (విమ్స్)కు తరలించారు. వీరిలో సుంకమ్మ అనే మహిళా కూలీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న రైతు సుబ్బన్న, ఐదుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, కళ్యాణదుర్గం ఆర్డీఓ నిశాంత్ కుమార్ తదితరులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బళ్లారి ఆస్పత్రికి వెళ్లి మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద విషయాన్ని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి దర్గా హొన్నూరులో విద్యుదాఘాతం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. (విద్యుత్ శాఖ ద్వారా రూ.5 లక్షలు, సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.5 లక్షలు) బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని అధికారులకు ఆదేశించారు. కాగా, మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌కు, ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలిచ్చామన్నారు. ‘కండక్టర్’ తెగడం వల్లే ప్రమాదం ఇన్సులేటర్ ఫ్లాష్ అవ్వడంతో కండక్టర్ తెగడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ కే సంతోషరావు తెలిపారు. ఈ సంఘటనకు బాధ్యులుగా భావిస్తూ నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ (పి–ఎంఎం) డి.వి.చలపతి నేతృత్వంలో చీఫ్ జనరల్ మేనేజర్ (ఓ–యం) కె. గురవయ్య, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ (అనంతపురం) యం. విజయ భాస్కర్ రెడ్డిలతో కమిటీని నియమించామని చెప్పారు. ఈ కమిటీని హుటాహుటిన సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లాల్సిందిగా ఆదేశించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కళ్యాణ దుర్గం) ఎస్.మల్లికార్జున రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (బొమ్మనహాళ్) ఎం.కె. లక్ష్మీరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ప్రొటెక్షన్) హెచ్. హమీదుల్లా బేగ్, లైన్మెన్ (దర్గా హొన్నూర్) కె.బసవ రాజులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామని సీఎండీ తెలిపారు. అనంతపురం ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్స్/రాయదుర్గం) శేషాద్రి శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (యం–పి/అనంతపురం) కె. రమేష్‌ల నుంచి వివరణ కోరుతూ మెమో జారీ చేశామన్నారు. -
ఘోర ప్రమాదం
సాక్షి, పుట్టపర్తి, అమరావతి/తాడిమర్రి/సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూలీలు ప్రయాణిస్తున్న ఆటోపై విద్యుత్ తీగలు తెగి పడటంతో మంటలు చెలరేగి ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం 7.30 గంటలకు ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికులు, కూలీలు తెలిపిన వివరాల మేరకు.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన గుండ్లమడుగు మెకానిక్ రాజా ఇటీవల 2 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. కలుపు తొలగించేందుకు ఇతని భార్య కుమారి (28).. గుడ్డంపల్లికి చెందిన మరో 11 మంది కూలీలను తీసుకుని కునుకుంట్ల గ్రామానికి చెందిన పోతులయ్య ఆటోలో పొలానికి బయలుదేరింది. మొత్తం 13 మందితో వెళ్తున్న ఆటో చిల్లకొండయ్యపల్లి సమీపంలోకి రాగానే 11 కేవీ విద్యుత్ తీగ ఉన్నట్లుండి తెగి ఆటోపై పడింది. దీంతో ఆటోకు విద్యుత్ ప్రవహించి మంటలు చెలరేగాయి. దీంతో గుండ్లమడుగు కుమారితో పాటు కొంకా మల్లికార్జున భార్య రామలక్ష్మి (30), కొంకా చిన్న మల్లన్న భార్య పెద్ద కాంతమ్మ (45), కొంకా కిష్టయ్య భార్య రత్నమ్మ (40) కొంకా ఈశ్వరయ్య భార్య లక్ష్మీదేవి (41) సజీవ దహనమయ్యారు. కొంకా మంజునాథ్ భార్య గాయత్రికి తీవ్ర గాయాలు కాగా, కొంకా మధుసూదన్ భార్య అరుణ, కొంకా పెద్దన్న భార్య నాగేశ్వరమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ పోతులయ్యతో పాటు కొంకా ఈశ్వరమ్మ, శివరత్నమ్మ, రమాదేవి, ఎ.రత్నమ్మలు ఆటోలోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తీవ్రంగా గాయపడిన గాయత్రిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. మృతుల్లో కుమారి పెద్ద కోట్ల గ్రామానికి చెందగా.. మిగతా నలుగురు గుడ్డంపల్లి వాసులు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అధికారులను అప్రమత్తం చేసి.. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొంప ముంచిన ఉడుత స్థంభంపై ఇనుప రాడ్డుకు, విద్యుత్ వైరు తగలకుండా మధ్యలో పింగాణీ పరికరాన్ని అమర్చుతారు. కానీ ఉడుత పొడవు ఆ పరికరాన్ని దాటి ఉండటంతో వైరును తాకింది. విద్యుత్ తీగకు స్తంభంపై ఉన్న ఇనుప రాడ్డుకి మధ్య ఉడుత పడటంతో దాని శరీరం గుండా విద్యుత్ ప్రవహించింది. ఆ వెంటనే షార్ట్ సర్క్యూట్, ఎర్త్ కారణంగా స్పార్క్ ఏర్పడి వైరు తెగిపోయింది. అప్పుడే అటుగా వచ్చిన ఆటోపై ఆ వైరు పడింది. అయినప్పటికీ ఆటోకి ఉండే టైర్లు ఎర్త్ అవ్వకుండా అడ్డుకోగలవు. కానీ ఆటోపై ఇనుప మంచం ఉంది. అదీగాక ఆ కంగారులో ఆటోలో ఉన్నవారెవరో కిందకు దిగే ప్రయత్నం చేశారు. వారు ఒక కాలు నేలపై, మరోకాలు ఆటోలో ఉంచడం వల్ల ఎర్త్ అయ్యి ఆటోకి వేల వాట్ల హై టెన్షన్ విద్యుత్ ప్రసరించి క్షణాల్లో కాలి బుగ్గయ్యింది. కాగా, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ హరినాథరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాఖ పరమైన విచారణకు ఆదేశించామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు (సీఎం ప్రకటించిన పరిహారం కాకుండా), తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల తక్షణ సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. ఇటీవలే కొత్త లైన్లు వేశాం కరెంటు పోళ్లు గానీ, వైర్ల విషయంలో గానీ ఎక్కడా లోపం లేదని, ఆరుమాసాల కిందటే కొత్త ఫీడర్లు వేశామని విద్యుత్ శాఖ అనంతపురం ఎస్ఈ నాగరాజు తెలిపారు. విద్యుత్ సరఫరా నిర్వహణలో లోపంగానీ, సాంకేతిక సమస్యలు గానీ ఎక్కడా లేవన్నారు. ఈ ఘటనపై విచారణాధికారిగా ఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ రషీద్‌ను నియమించారు. ఆయన శుక్రవారం ఘటన స్థలికి చేరుకుని పరిశీలించనున్నారు. ఉడుతలతో ప్రమాదం విద్యుత్ తీగలపై ఉడుతలు, తొండలు, పాములు, పక్షులు వంటివి పడటం సాధారణంగా తరచూ జరుగుతుంటుంది. పవర్ గ్రిడ్లలో వీటివల్ల అనేక సార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంటుంది. ప్లాస్టిక్ యానిమల్ గార్డ్లను దాటేసి, చిన్న సందు దొరికితే చాలు సబ్‌స్టేషన్‌లోకి ఇవి దూరిపోతుంటాయి. ఇవి మోషన్ డిటెక్టర్లను దాటి కంచెల కింద సొరంగం కూడా చేయగలవు. టన్నెలింగ్, ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ ద్వారా కొరకడం, నమలడం, వేర్వేరు విద్యుత్ పొటెన్షియల్స్లో ఉన్న రెండు కండక్టర్లపై ఏకకాలంలో పడటం ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా షార్ట్ సర్క్యూట్ జరిగి తీగలు తెగిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఏకకాలంలో జరుగుతుంది. ఇంటర్నెట్, మౌలిక సదుపాయాలు వంటి సేవలకు ఉడుతల వల్ల కలిగే ముప్పు సైబర్, ఉగ్ర దాడుల వల్ల కలిగే ముప్పు కంటే ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ భద్రత సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఉడుతలు అనేక దేశాల్లో పవర్ గ్రిడ్లను నిర్వీర్యం చేయగలవని రుజువైంది. గవర్నర్, సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చిల్లకొండయ్యపల్లిలో జరిగిన ప్రమాదంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారిస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. సీఎంఓ ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. -
కూలీల జీవితాల్లో పిడుగుపాటు
కాగజ్‌నగర్/కౌటాల/ కోటపల్లి (మంచిర్యాల): వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలను పిడుగుపాటు రూపంలో మృత్యువు కబళించింది. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. కుమురంభీం జిల్లా కౌటాల మండలం వైగాం గ్రామానికి చెందిన సద్గు రే రేఖాబాయి(44) సోమవారం గ్రామ శివారు లోని ఓ రైతు చేనులో సోయాబీన్ విత్తనాలు విత్తేందుకు వెళ్లింది. పనులు ముగించుకుని సాయం త్రం కూలీలు రేఖాబాయి, లలితాబాయి ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలో వర్షం కురిసి పిడు గు పడింది. రేఖాబాయి అక్కడికక్కడే మృతిచెంద గా, సమీపంలోని లలితాబాయి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు భర్త సురేశ్, కూతురు ఉన్నారు. పెళ్లయిన రెండు నెలలకే.. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం రాస్పల్లి గ్రామానికి చెందిన సుమన్ సోమవారం ఉదయం తన భార్య అనూష, చిన్నాన్న, చిన్నమ్మ, కూలీలతో కలిసి గ్రామ సమీపంలోని చేనులో పత్తి విత్తనాలు నాటడానికి వెళ్లాడు. సాయంత్రం పిడుగుపడటంతో సుమన్(28) అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్య అనూష చేతికి స్వల్ప గాయమైంది. ప్రసాద్ అనే మరో వ్యక్తి స్పృహ కోల్పోయాడు. సుమన్, అనూష దంపతులకు పెళ్లయి రెండునెలలే కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో ఘటనలో ఇదే మండలంలోని అంకుసాపూర్ గ్రామానికి చెందిన నానాజీ(35) గ్రామ శివారులో విత్తనాలు వేసేందుకు వెళ్లి పిడుగుపడి మృతి చెందాడు. ఆయనకు భార్య నీలాబాయి, కుమారుడు సందీప్(10), కూతురు సం«ధ్యారాణి(8) ఉన్నారు. పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లి.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం అంకవ్వ(55) ఇదే గ్రామానికి చెందిన రైతు చేనులో సోమవారం పత్తి విత్తనాలు విత్తేందుకు వెళ్లింది. మధ్యాహ్నం భోజనం తర్వాత చేనులో విత్తనాలు విత్తేందుకు వెళ్లగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. దీంతో అంకవ్వ అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
చింతకొమ్మదిన్నె: ఆ కూలీలు శ్రమచేసి ఇంటికొచ్చారు. ఎండ ఎక్కువగా ఉండటంతో సేద తీరేందుకు ఇంటిముందు చెట్టుకింద కూర్చున్నారు. వాహనం రూపంలో దూసుకొచ్చిన మృత్యువు భార్యాభర్త, అక్కాచెల్లెళ్లను విగత జీవులుగా మార్చింది. వైఎస్సార్ జిల్లా మద్దిమడుగు వద్ద బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సీకే దిన్నె ఎస్ఐ ఎం.మంజునాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిమడుగు గ్రామానికి చెందిన గుర్రంకొండ కొండయ్య (35), అతడి భార్య అమ్ములు (28), అదే గ్రామానికి చెందిన చాపల దేవి (28) సమీపంలో చేపట్టిన ఉపాధి పనులకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పని ముగించుకుని గ్రామానికి చేరుకున్నారు. ఎండనపడి వచ్చినందున కొండయ్య ఇంటిముందు గల చెట్టు కింద కాసేపు సేదతీరదామని మంచంపై కూర్చున్నారు. చాపల దేవి సోదరి చిన్నమండెం మండలం కేశాపురానికి చెందిన మండ్ల లక్ష్మీదేవి (42) వారితో మాట్లాడేందుకు అక్కడికి చేరుకుంది. ఇంతలోనే కడప–రాయచోటి ప్రధాన రహదారి మీదుగా రాయచోటి వైపు వెళ్తున్న జాతీయ రహదారుల శాఖకు చెందిన బొలెరో వాహనం వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. ప్రమాదంలో కొండయ్య, అతడి భార్య అమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన చాపల దేవి, ఆమె అక్క లక్ష్మీదేవి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదంలో రోడ్డు పక్కనే ఆడుకుంటున్న చిన్నారులు అబ్దుల్, ధనుష్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ హరిబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో రిమ్స్ నుంచి తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. మద్యం మత్తే ప్రాణాలు తీసింది బొలెరో డ్రైవర్ హరిబాబు మద్యం మత్తులో వాహనాన్ని అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టానికి రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని ఆర్టీవో శాంతకుమారి, బ్రేక్ ఇన్స్పెక్టర్ దినేష్, హైవే పెట్రోలింగ్ పోలీసులు పరిశీలించారు. మృతులు కొండయ్య, అమ్ములు దంపతుల కుమార్తె నందిని పదో తరగతి, కుమారుడు శ్రీకాంత్ నాలుగో తరగతి చదువుతున్నారు. దేవి భర్త వెంకటయ్య లారీ క్లీనర్‌గా పనిచేస్తుండగా, కుమారుడు శ్రీతేజు 4, కుమార్తె వైష్ణవి 2వ తరగతి చదువుతున్నారు. లక్ష్మీదేవి భర్తతో వేరుపడి ఉంటోంది. ఆమె కుమారుడు శ్రీనివాసులు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. -
కూలీ బతుకులు ఛిద్రం
సంగం: తెల్లవారకముందే కూలి పని కోసం బయలుదేరిన వారిని పాల వ్యాన్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కబళించింది. పనుల కోసం వ్యాన్‌లో బయలుదేరిన వారు.. రక్తపుమడుగులో రోడ్డుపైనే విగతజీవులయ్యారు. రక్తసిక్తమైన రోడ్డు, చెల్లాచెదురుగా పడిన వారితో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ఈ దుర్ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం జరిగింది. సంగం మండలం దువ్వూరు వద్ద నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ఉదయం 5 గంటల సమయంలో కూలీలు ఉన్న వ్యాన్‌ను పాల వ్యాన్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. పెద్దశబ్దం రావడంతో చుట్టపక్కలవారు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. అప్పటికే నలుగురు కూలీలు విగతజీవులయ్యారు. కొందరు రక్తమోడుతున్న గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి కన్నుమూశాడు. ఏడుగురు గాయాలతో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. దువ్వూరు ఎస్సీ కాలనీకి చెందిన 18 మంది, మక్తాపురానికి చెందిన నలుగురు కూలీలు విడవలూరు మండలంలో చేపలు పట్టేందుకు వెళ్లాల్సి ఉంది. మక్తాపురానికి చెందిన నలుగురు ముందే వ్యానులో ఎక్కారు. దువ్వూరుకు చెందిన వారు వచ్చి వ్యాను ఎక్కుతుండగా.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి నెల్లూరు వెళుతున్న పాల వ్యాను వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో దువ్వూరుకు చెందిన గాలి శీనయ్య (55), కోటపూరి మాలకొండయ్య (61), తువ్వర రమణయ్య (57), కంచర్ల బాబు (60).. అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మోచర్ల శీనయ్యను నెల్లూరుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలొదిలాడు. వ్యాను డ్రైవర్ విక్రం నాగరాజ్, ఆటో ఎక్కుతున్న గంగపట్నం శ్రీనివాసులు, గడ్డం నందా, వెంకయ్య, కె వెంకటేష్, సూడం రమణయ్య, జి.శ్రీనివాసులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురిని బుచ్చిరెడ్డిపాళెం ఆస్పత్రికి, నలుగురిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. చెల్లాచెదురైన అన్నం.. ఈ ప్రమాదంలో మరణించినవారంతా దువ్వూరు ఎస్సీ కాలనీ వారే. చీకటితోనే బయలుదేరి వెళ్లి పని మొదలుపెట్టే ముందు తినేందుకు బాక్సుల్లో అన్నం పెట్టుకున్నారు. ఈ ప్రమాదంలో బాక్సులు రోడ్డుపై పడి అన్నం చెల్లాచెదురైంది. తెచ్చుకున్న అన్నం తినే అవకాశం కూడా లేకుండానే మరణించారంటూ.. కాలనీవాసులు విలపిస్తున్నారు. కూటికోసం కూలికెళుతుంటే.. బతుకులే పోయాయంటూ ఆయా కుటుంబాలు రోదిస్తున్న తీరు అందరికంట కన్నీరు పెట్టించింది. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమాద స్థలాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, సంగం తహసీల్దారు రవికుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంగం ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. గవర్నర్, మంత్రి మేకపాటి సంతాపం నెల్లూరు జిల్లా దువ్వూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదం తనను కలచివేసిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. గాయపడినవారికి అత్యవసర వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల్లో కొందరికి ఫోన్‌చేసి పరామర్శించారు. -
ఎస్పీఎంలో ఘోర ప్రమాదం..
కాగజ్‌నగర్ టౌన్: కుమురంభీం జిల్లా సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం)లో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాయిలర్ నిర్మాణం చేపడుతున్న ప్రదేశంలో మట్టి పెళ్లలు కూలడంతో ముగ్గురు కూలీలు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైకు చెందిన ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో నూతన బాయిలర్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి బాయిలర్ పిల్లర్ల నిర్మాణం కోసం రాడ్ బైండింగ్ పని చేస్తుండగా భారీ గుంతలో ఓ పక్క భాగం మట్టి దిబ్బలు కూలీలపై పడిపోయాయి. దీంతో రెప్పపాటులో ఎనిమిది మంది కూలీలు మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో 24 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో రఘునాథ్ రాం (38) (జార్ఖండ్) అక్కడికక్కడే చనిపోగా.. మిగతా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఛోటు కుమార్ (25)(జార్ఖండ్), రంజిత్ (24) (ఉత్తరప్రదేశ్) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం ప్రమాద స్థలాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరిశీలించారు. సైట్ సీనియర్ ఇంజనీర్, సూపర్ వైజర్లపై కేసులు నమోదు చేసినట్లు ఇన్చార్జి ఎస్పీ విష్ణువారియర్ తెలిపారు. -
నిద్రిస్తున్న కార్మికులపై దూసుకెళ్లిన టిప్పర్
సిరిసిల్ల క్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న ప్రాణహిత – చేవెళ్ల ప్యాకేజీ అండర్ టన్నెల్ పనుల్లో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున ఎప్పటిలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన చందన్ రాయ్ (20), మధ్యప్రదేశ్‌కు చెందిన సుఖ్‌దేవ్ సింగ్(29) డ్రిల్లింగ్ పనులకు వెళ్లారు. అక్కడ మిగతా కార్మికులు పని చేస్తుండగా.. రాయ్, సింగ్ మాత్రం పక్కన పడుకుని నిద్రలోకి వెళ్లారు. ఈ సమయంలో బయట నుంచి టిప్పర్‌తో వచ్చిన డ్రైవర్.. పడుకున్న ఇద్దరు కార్మికులను గమనించక నడపడంతో వీరిపైకి టిప్పర్ ఎక్కగా అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పా ట్లు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
కూలీల మృతిపై పూర్తి వివరాలు మా ముందుంచండి
* మీరు స్పందించకపోతుండటం వల్లే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు * చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారం అందిందా.. లేదాని ప్రశ్న * కౌంటర్ల దాఖలుకు జీహెచ్ఎంసీ, సీవరేజీ బోర్డులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మ్యాన్‌హోల్‌లో దిగి ఊపిరాడక ఇద్దరు వలస కూలీలు మృతిచెందిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు గురువారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), సీవరేజీ బోర్డు అధికారులను ఆదేశించింది. డ్రైనేజీ శుభ్రత విషయంలో మీరు సక్రమంగా స్పందించకపోతుండటం వల్లే ప్రజలు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోందని ఈ రెండు సంస్థల అధికారులను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. చనిపోయిన కార్మికులకు పరిహారం అందిందో లేదో తెలియచేయాలని, అసలు డ్రైనేజీల శుభ్రత విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయో స్పష్టం చేయాలని సూచించింది. డ్రైనేజీలను శుభ్రపరచాలంటూ ప్రజల నుంచి ఎన్ని అభ్యర్థనలు వచ్చాయి.. వాటిలో ఎన్నింటిని పరిష్కరించారు.. తదితర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సుల్తాన్‌బజార్‌లోని కపాడియాలేన్లో డ్రైనేజీని శుభ్రపరిచేందుకు దిగిన కార్మికులు వీరాస్వామి, కోటయ్య ఈ నెల 1న విషవాయువుల వల్ల మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించింది. ఈ వ్యాజ్యాన్ని గురువారం విచారించింది. ఈ సందర్భంగా సీవరేజీ బోర్డు తరఫు న్యాయవాది టి.సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏ మ్యాన్‌హోల్‌లో అయితే వీరాస్వామి, కోటయ్య దిగి మృతిచెందారో దానిని శుభ్రపరచాలని తమకు ఎటువంటి అభ్యర్థనలు రాలేదని, ఆ ప్రాంతవాసులు ప్రైవేటు వ్యక్తులను డ్రైనేజీ శుభ్రత కోసం వినియోగించుకున్నారని వివరించారు. మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం విడుదల చేశామని తెలిపారు. అయితే ఈ వాదన పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిహారం బాధిత కుటుంబాలకు అందిందో లేదో చెప్పాలని ఆదేశించింది. డ్రైనేజీల శుభ్రత విషయంలో ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనలపై సకాలంలో స్పందించకపోతుండటం వల్లే వారు విధిలేక ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించింది. డ్రైనేజీలను శుభ్రపరచాలంటూ ప్రజల నుంచి ఎన్ని అభ్యర్థనలు వచ్చాయి.. ఎన్నింటిని పరిష్కరించారు.. తదితర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హోం శాఖ, జీహెచ్ఎంసీ, సీవరేజీ బోర్డు అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.