చింతకొమ్మదిన్నె: ఆ కూలీలు శ్రమచేసి ఇంటికొచ్చారు. ఎండ ఎక్కువగా ఉండటంతో సేద తీరేందుకు ఇంటిముందు చెట్టుకింద కూర్చున్నారు. వాహనం రూపంలో దూసుకొచ్చిన మృత్యువు భార్యాభర్త, అక్కాచెల్లెళ్లను విగత జీవులుగా మార్చింది. వైఎస్సార్ జిల్లా మద్దిమడుగు వద్ద బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సీకే దిన్నె ఎస్‌ఐ ఎం.మంజునాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిమడుగు గ్రామానికి చెందిన గుర్రంకొండ కొండయ్య (35), అతడి భార్య అమ్ములు (28), అదే గ్రామానికి చెందిన చాపల దేవి (28) సమీపంలో చేపట్టిన ఉపాధి పనులకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పని ముగించుకుని గ్రామానికి చేరుకున్నారు.
ఎండనపడి వచ్చినందున కొండయ్య ఇంటిముందు గల చెట్టు కింద కాసేపు సేదతీరదామని మంచంపై కూర్చున్నారు. చాపల దేవి సోదరి చిన్నమండెం మండలం కేశాపురానికి చెందిన మండ్ల లక్ష్మీదేవి (42) వారితో మాట్లాడేందుకు అక్కడికి చేరుకుంది. ఇంతలోనే కడప–రాయచోటి ప్రధాన రహదారి మీదుగా రాయచోటి వైపు వెళ్తున్న జాతీయ రహదారుల శాఖకు చెందిన బొలెరో వాహనం వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. ప్రమాదంలో కొండయ్య, అతడి భార్య అమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన చాపల దేవి, ఆమె అక్క లక్ష్మీదేవి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదంలో రోడ్డు పక్కనే ఆడుకుంటున్న చిన్నారులు అబ్దుల్, ధనుష్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ హరిబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో రిమ్స్ నుంచి తిరుపతి స్విమ్స్‌కు తరలించారు.
మద్యం మత్తే ప్రాణాలు తీసింది
బొలెరో డ్రైవర్ హరిబాబు మద్యం మత్తులో వాహనాన్ని అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టానికి రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని ఆర్టీవో శాంతకుమారి, బ్రేక్ ఇన్‌స్పెక్టర్ దినేష్, హైవే పెట్రోలింగ్ పోలీసులు పరిశీలించారు. మృతులు కొండయ్య, అమ్ములు దంపతుల కుమార్తె నందిని పదో తరగతి, కుమారుడు శ్రీకాంత్ నాలుగో తరగతి చదువుతున్నారు. దేవి భర్త వెంకటయ్య లారీ క్లీనర్‌గా పనిచేస్తుండగా, కుమారుడు శ్రీతేజు 4, కుమార్తె వైష్ణవి 2వ తరగతి చదువుతున్నారు. లక్ష్మీదేవి భర్తతో వేరుపడి ఉంటోంది. ఆమె కుమారుడు శ్రీనివాసులు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు.
దూసుకొచ్చిన మృత్యువు
Published Thu, Mar 3 2022 5:47 AM | Last Updated on Thu, Mar 3 2022 5:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment