terrible accident
-
దూసుకొచ్చిన మృత్యువు
చింతకొమ్మదిన్నె: ఆ కూలీలు శ్రమచేసి ఇంటికొచ్చారు. ఎండ ఎక్కువగా ఉండటంతో సేద తీరేందుకు ఇంటిముందు చెట్టుకింద కూర్చున్నారు. వాహనం రూపంలో దూసుకొచ్చిన మృత్యువు భార్యాభర్త, అక్కాచెల్లెళ్లను విగత జీవులుగా మార్చింది. వైఎస్సార్ జిల్లా మద్దిమడుగు వద్ద బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సీకే దిన్నె ఎస్ఐ ఎం.మంజునాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిమడుగు గ్రామానికి చెందిన గుర్రంకొండ కొండయ్య (35), అతడి భార్య అమ్ములు (28), అదే గ్రామానికి చెందిన చాపల దేవి (28) సమీపంలో చేపట్టిన ఉపాధి పనులకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పని ముగించుకుని గ్రామానికి చేరుకున్నారు. ఎండనపడి వచ్చినందున కొండయ్య ఇంటిముందు గల చెట్టు కింద కాసేపు సేదతీరదామని మంచంపై కూర్చున్నారు. చాపల దేవి సోదరి చిన్నమండెం మండలం కేశాపురానికి చెందిన మండ్ల లక్ష్మీదేవి (42) వారితో మాట్లాడేందుకు అక్కడికి చేరుకుంది. ఇంతలోనే కడప–రాయచోటి ప్రధాన రహదారి మీదుగా రాయచోటి వైపు వెళ్తున్న జాతీయ రహదారుల శాఖకు చెందిన బొలెరో వాహనం వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. ప్రమాదంలో కొండయ్య, అతడి భార్య అమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన చాపల దేవి, ఆమె అక్క లక్ష్మీదేవి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదంలో రోడ్డు పక్కనే ఆడుకుంటున్న చిన్నారులు అబ్దుల్, ధనుష్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ హరిబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో రిమ్స్ నుంచి తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. మద్యం మత్తే ప్రాణాలు తీసింది బొలెరో డ్రైవర్ హరిబాబు మద్యం మత్తులో వాహనాన్ని అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టానికి రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని ఆర్టీవో శాంతకుమారి, బ్రేక్ ఇన్స్పెక్టర్ దినేష్, హైవే పెట్రోలింగ్ పోలీసులు పరిశీలించారు. మృతులు కొండయ్య, అమ్ములు దంపతుల కుమార్తె నందిని పదో తరగతి, కుమారుడు శ్రీకాంత్ నాలుగో తరగతి చదువుతున్నారు. దేవి భర్త వెంకటయ్య లారీ క్లీనర్‌గా పనిచేస్తుండగా, కుమారుడు శ్రీతేజు 4, కుమార్తె వైష్ణవి 2వ తరగతి చదువుతున్నారు. లక్ష్మీదేవి భర్తతో వేరుపడి ఉంటోంది. ఆమె కుమారుడు శ్రీనివాసులు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. -
నదిలో పడిపోయిన పెళ్లి బృందం వాహనం
కోట(రాజస్తాన్): రాజస్తాన్‌లోని కోట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం నదిలో పడిపోవడంతో వరుడితో సహా 9 మంది మృతిచెందారు. ఈ పెళ్లి బృందం ఆదివారం తెల్లవారుజామున సవై మాధోపూర్ జిల్లాలోని చౌత్ కా బర్వారా గ్రామం నుంచి ఎర్టిగా వాహనంలో బయలుదేరింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చేరుకోవాల్సి ఉంది. ఉదయం 5.30 గంటలకు బ్రిడ్జిపై వెళ్తూ చంబల్ నదిలో పడిపోయింది. నిద్రమత్తు కారణంగా వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, అందుకే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ దుర్ఘటనలోవరుడు అవినాశ్ వాల్మీకి(23), అతడి సోదరుడు కేశవ్(30), కారు డ్రైవర్ ఇస్లాం ఖాన్(35), బంధువులు కుశాల్(22), శుభం(23), రోహిత్ వాల్మీకి(22), రాహుల్(25), వికాశ్ వాల్మీకి(24), ముకేశ్ గోచర్(35) చనిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో 9 మంది మృతి చెందడం పట్ల కోట–బుండీ ఎంపీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, ప్రతి మృతుడి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని సీఎం అశోక్ గహ్లోత్ ట్విట్టర్లో తెలిపారు. -
మొక్కు తీర్చుకునేందుకు వెళుతూ మృత్యు ఒడికి..
గంటకు 130 కిలోమీటర్ల వేగం.. సుదూర ప్రయాణంతో అలసట.. ఆపై మధ్యాహ్నం భోజనం తర్వాత చిన్న కునుకు.. అదే సమయంలో చిన్నపాటి మలుపు.. ముందు వెళ్తున్న ఆటోను ఓవర్టేక్ చేయబోయిన కారు అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. కొంచెం ముందుకెళ్లి కల్వర్టును ఢీకొట్టి మంటల్లో చిక్కుకుపోయింది. అప్పటికే మాటేసిన మృత్యువు ముగ్గుర్ని సజీవ దహనం చేసింది. మరో నలుగుర్ని విగత జీవులుగా మార్చింది. మొత్తంగా రెండు కుటుంబాలకు చెందిన ఏడుగుర్ని కబళించింది. తిరుపతి రూరల్/రాజాం: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మేడమర్తి, విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ముందు వెళ్తున్న ఆటోను కారు ఓవర్టేక్ చేయబోగా అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని వంద మీటర్ల మేర ముందుకు దూసుకెళ్లి మూడు పల్టీలు కొట్టి కల్వర్టును ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొన్న సమయంలోనే పెట్రోల్ ట్యాంక్ పగిలిపోగా.. కల్వర్టును ఢీకొట్టిన సమయంలో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మెరైన్ ఇంజనీర్ కంచా రపు సురేష్‌కుమార్ (40), అతని భార్య మీనా (33), వీరి చిన్న కుమార్తె జోష్మిక నందిత (6 నెలలు), సురేష్‌కుమార్ తండ్రి శ్రీరామమూర్తి (65), తల్లి సత్యవతి (55), మామ పైడి గోవిందరావు, అత్త హైమావతి మృత్యువాత పడ్డారు. సురేష్, మీనా దంపతుల పెద్దకుమార్తె జోషిత (2) గాయాల పాలై మృత్యువును జయించినా.. తన వాళ్లందరినీ పోగొట్టుకుని అనాథగా మిగిలింది. ఈ ఘటనలో సురేష్, తండ్రి శ్రీరామమూర్తి, తల్లి సత్యవతి కారులోనే సజీవ దహనమయ్యారు. సురేష్ చిన్నకుమార్తె జోష్మిక నందిత, భార్య మీనా, అత్త హైమావతి, మామ గోవిందరావు గాయాల పాలై ప్రాణాలొదిలారు. ప్రమాదం జరిగిందిలా.. శ్రీకాకుళం జిల్లా మేడమర్తికి చెందిన కంచారపు శ్రీరామమూర్తి, విజయనగరం జిల్లాకు చెందిన పైడి గోవిందరావు తమ కుటుంబ సభ్యులతో కలిసి సొంత కారులో శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుపతికి చేరుకున్నారు. సోమవారం వారికి దర్శనం స్లాట్ కేటాయించారు. ఆదివారం కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకున్నారు. భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాణిపాకం నుంచి తిరుమల బయలుదేరారు. అతివేగంగా వస్తున్న కారు పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై చంద్రగిరికి సమీపంలో ఐతేపల్లి వద్ద టర్నింగ్లో అదుపు తప్పడంతో ప్రమాదానికి గురైంది. ఓ వైపు కారు నుంచి వచ్చిన అగ్నికీలలకు తోడు కారు తునాతునకలై ఇనుప ముక్కలు శరీరాల్లోకి దూసుకుపోవడంతో లోపల ఉన్నవారు పెద్దపెట్టున ఆర్తనాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు దుర్మరణం పాలవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
మరో ఘోరం
ఎచ్చెర్ల: జిల్లాలో జాతీయ రహదారిపై బుధవారం మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ నెల 2న నరసన్నపేటలో జరిగిన ప్రమాదాన్ని మరకముందే ఎచ్చెర్లలో బుధవారం ఓ లారీ ఆటోను ఢీకొని ఇద్దరు చనిపోవడానికి.. నలుగురు గాయపడానికి కారణం అయింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతకవిటి మండలం మిర్తివలస గ్రామానికి చెందిన సింహాచలం, అతని భార్య నారాయణమ్మ, కోడలు భారతి, మనవడు పూర్ణచంద్రరావు భద్రాచలం మొక్కు తీర్చుకోవడానికి వెళ్లేందుకు స్వగ్రామం నుంచి ఆటోలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సుకు బయలుదేరారు. ఎచ్చెర్ల సమీపంలోని నవభారత్ కూడలి వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొంది. దీంతో ఆటో రోడ్డు పక్కన తుళిపోయి పడింది. అదే సమయంలో ఎచ్చెర్ల మం డలం బడివాని పేట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, సహ ఉపాధ్యాయుడు హరి.. మోటారు బైక్‌పై పాఠశాల ముగిం చుకుని శ్రీకాకుళం వైపు వెళుతుండగా ఆటో ఈ బైక్‌పై ఎగిరి పడింది. ఈ ఘటనలో తిరుమలరావుకు తీవ్రగాయాలు కాగా, హరికి కొద్దిపాటి గాయాలు అయ్యాయి. ఆటో బోల్తా పడిన ఘటనలో నారాయణమ్మ.. సింహాచలం, కోడలు భారతి, చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో డ్రైవర్ గోవిందరావు పక్కకు దూకేయటంతో స్వల్పగాయాలతో బయట పడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికులు సహాయక చర్యలు చేపట్టారు. 108కి సమాచారం ఇచ్చి వచ్చాక క్షతగ్రాతులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చిత్స పొందుతూ 40 రోజుల పసికందు పూర్ణచంద్రరావు, నాయనమ్మ నారాయణమ్మ మృతి చెందారు. చిన్నారి తలకు రోడ్డు రాపిడైంది. బాలుడి తల్లి భారతికి కొద్ది పాటి గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ ఉపాధ్యాయుడు తిరుమలరావు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ పట్నం కేజీహెచ్‌కు తరలించారు. బాలుడు తండ్రి ఎస్.శ్రీనివాసరావు ఇచ్ఛాపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కాగా.. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. ఎచ్చెర్ల ఏఎస్ఐ రామారావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణం అయిన లారీ వివరాలపై ఆరా తీశారు. అయితే ఆచూకీ లభ్యం కాలేదు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది. ప్రమాదానికి కారణం అయిన లారీ కోసం జాతీయ రహదారి అన్ని పోలీస్స్టేషన్లును అప్రమతం చేశారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్ చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మిర్తివలసలో విషాదం సంతకవిటి: మండలంలోని మిర్తివలసలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన గులివిందల నారాయణమ్మతో పాటు ఆమె మనుమడు శ్రీకాకుళం నవభారత్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో గ్రామస్తులు, మృతులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం నారాయణమ్మతోపాటు ఆమె భర్త సింహాచలం, కోడలు భారతి, మనమడుతో పాటు మరికొందితో కలసి ఆటోలో శ్రీకాకుళం బయలుదేరి వెళ్లగా ప్రమాదం జరిగి విషాదం అలుముకుంది.