గంటకు 130 కిలోమీటర్ల వేగం.. సుదూర ప్రయాణంతో అలసట.. ఆపై మధ్యాహ్నం భోజనం తర్వాత చిన్న కునుకు.. అదే సమయంలో చిన్నపాటి మలుపు.. ముందు వెళ్తున్న ఆటోను ఓవర్‌టేక్ చేయబోయిన కారు అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. కొంచెం ముందుకెళ్లి కల్వర్టును ఢీకొట్టి మంటల్లో చిక్కుకుపోయింది. అప్పటికే మాటేసిన మృత్యువు ముగ్గుర్ని సజీవ దహనం చేసింది. మరో నలుగుర్ని విగత జీవులుగా మార్చింది. మొత్తంగా రెండు కుటుంబాలకు చెందిన ఏడుగుర్ని కబళించింది.
తిరుపతి రూరల్/రాజాం: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మేడమర్తి, విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ముందు వెళ్తున్న ఆటోను కారు ఓవర్‌టేక్ చేయబోగా అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని వంద మీటర్ల మేర ముందుకు దూసుకెళ్లి మూడు పల్టీలు కొట్టి కల్వర్టును ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొన్న సమయంలోనే పెట్రోల్ ట్యాంక్ పగిలిపోగా.. కల్వర్టును ఢీకొట్టిన సమయంలో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో మెరైన్ ఇంజనీర్ కంచా రపు సురేష్‌కుమార్ (40), అతని భార్య మీనా (33), వీరి చిన్న కుమార్తె జోష్మిక నందిత (6 నెలలు), సురేష్‌కుమార్ తండ్రి శ్రీరామమూర్తి (65), తల్లి సత్యవతి (55), మామ పైడి గోవిందరావు, అత్త హైమావతి మృత్యువాత పడ్డారు. సురేష్, మీనా దంపతుల పెద్దకుమార్తె జోషిత (2) గాయాల పాలై మృత్యువును జయించినా.. తన వాళ్లందరినీ పోగొట్టుకుని అనాథగా మిగిలింది. ఈ ఘటనలో సురేష్, తండ్రి శ్రీరామమూర్తి, తల్లి సత్యవతి కారులోనే సజీవ దహనమయ్యారు. సురేష్ చిన్నకుమార్తె జోష్మిక నందిత, భార్య మీనా, అత్త హైమావతి, మామ గోవిందరావు గాయాల పాలై ప్రాణాలొదిలారు.
ప్రమాదం జరిగిందిలా..
శ్రీకాకుళం జిల్లా మేడమర్తికి చెందిన కంచారపు శ్రీరామమూర్తి, విజయనగరం జిల్లాకు చెందిన పైడి గోవిందరావు తమ కుటుంబ సభ్యులతో కలిసి సొంత కారులో శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుపతికి చేరుకున్నారు. సోమవారం వారికి దర్శనం స్లాట్ కేటాయించారు. ఆదివారం కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకున్నారు. భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాణిపాకం నుంచి తిరుమల బయలుదేరారు.
అతివేగంగా వస్తున్న కారు పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై చంద్రగిరికి సమీపంలో ఐతేపల్లి వద్ద టర్నింగ్‌లో అదుపు తప్పడంతో ప్రమాదానికి గురైంది. ఓ వైపు కారు నుంచి వచ్చిన అగ్నికీలలకు తోడు కారు తునాతునకలై ఇనుప ముక్కలు శరీరాల్లోకి దూసుకుపోవడంతో లోపల ఉన్నవారు పెద్దపెట్టున ఆర్తనాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు దుర్మరణం పాలవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment