ఎచ్చెర్ల: జిల్లాలో జాతీయ రహదారిపై బుధవారం మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ నెల 2న నరసన్నపేటలో జరిగిన ప్రమాదాన్ని మరకముందే ఎచ్చెర్లలో బుధవారం ఓ లారీ ఆటోను ఢీకొని ఇద్దరు చనిపోవడానికి.. నలుగురు గాయపడానికి కారణం అయింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతకవిటి మండలం మిర్తివలస గ్రామానికి చెందిన సింహాచలం, అతని భార్య నారాయణమ్మ, కోడలు భారతి, మనవడు పూర్ణచంద్రరావు భద్రాచలం మొక్కు తీర్చుకోవడానికి వెళ్లేందుకు స్వగ్రామం నుంచి ఆటోలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సుకు బయలుదేరారు. ఎచ్చెర్ల సమీపంలోని నవభారత్ కూడలి వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొంది. దీంతో ఆటో రోడ్డు పక్కన తుళిపోయి పడింది.
అదే సమయంలో ఎచ్చెర్ల మం డలం బడివాని పేట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, సహ ఉపాధ్యాయుడు హరి.. మోటారు బైక్‌పై పాఠశాల ముగిం చుకుని శ్రీకాకుళం వైపు వెళుతుండగా ఆటో ఈ బైక్‌పై ఎగిరి పడింది. ఈ ఘటనలో తిరుమలరావుకు తీవ్రగాయాలు కాగా, హరికి కొద్దిపాటి గాయాలు అయ్యాయి. ఆటో బోల్తా పడిన ఘటనలో నారాయణమ్మ.. సింహాచలం, కోడలు భారతి, చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో డ్రైవర్ గోవిందరావు పక్కకు దూకేయటంతో స్వల్పగాయాలతో బయట పడ్డాడు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికులు సహాయక చర్యలు చేపట్టారు. 108కి సమాచారం ఇచ్చి వచ్చాక క్షతగ్రాతులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చిత్స పొందుతూ 40 రోజుల పసికందు పూర్ణచంద్రరావు, నాయనమ్మ నారాయణమ్మ మృతి చెందారు. చిన్నారి తలకు రోడ్డు రాపిడైంది. బాలుడి తల్లి భారతికి కొద్ది పాటి గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ ఉపాధ్యాయుడు తిరుమలరావు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ పట్నం కేజీహెచ్‌కు తరలించారు. బాలుడు తండ్రి ఎస్.శ్రీనివాసరావు ఇచ్ఛాపురం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.
కాగా.. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. ఎచ్చెర్ల ఏఎస్‌ఐ రామారావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణం అయిన లారీ వివరాలపై ఆరా తీశారు. అయితే ఆచూకీ లభ్యం కాలేదు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది. ప్రమాదానికి కారణం అయిన లారీ కోసం జాతీయ రహదారి అన్ని పోలీస్‌స్టేషన్లును అప్రమతం చేశారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్ చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మిర్తివలసలో విషాదం
సంతకవిటి: మండలంలోని మిర్తివలసలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన గులివిందల నారాయణమ్మతో పాటు ఆమె మనుమడు శ్రీకాకుళం నవభారత్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో గ్రామస్తులు, మృతులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం నారాయణమ్మతోపాటు ఆమె భర్త సింహాచలం, కోడలు భారతి, మనమడుతో పాటు మరికొందితో కలసి ఆటోలో శ్రీకాకుళం బయలుదేరి వెళ్లగా ప్రమాదం జరిగి విషాదం అలుముకుంది.