కూలీల మృతిపై పూర్తి వివరాలు మా ముందుంచండి
* మీరు స్పందించకపోతుండటం వల్లే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు
* చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారం అందిందా.. లేదాని ప్రశ్న
* కౌంటర్ల దాఖలుకు జీహెచ్‌ఎంసీ, సీవరేజీ బోర్డులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మ్యాన్‌హోల్‌లో దిగి ఊపిరాడక ఇద్దరు వలస కూలీలు మృతిచెందిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు గురువారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ), సీవరేజీ బోర్డు అధికారులను ఆదేశించింది.
డ్రైనేజీ శుభ్రత విషయంలో మీరు సక్రమంగా స్పందించకపోతుండటం వల్లే ప్రజలు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోందని ఈ రెండు సంస్థల అధికారులను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. చనిపోయిన కార్మికులకు పరిహారం అందిందో లేదో తెలియచేయాలని, అసలు డ్రైనేజీల శుభ్రత విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయో స్పష్టం చేయాలని సూచించింది. డ్రైనేజీలను శుభ్రపరచాలంటూ ప్రజల నుంచి ఎన్ని అభ్యర్థనలు వచ్చాయి.. వాటిలో ఎన్నింటిని పరిష్కరించారు.. తదితర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సుల్తాన్‌బజార్‌లోని కపాడియాలేన్‌లో డ్రైనేజీని శుభ్రపరిచేందుకు దిగిన కార్మికులు వీరాస్వామి, కోటయ్య ఈ నెల 1న విషవాయువుల వల్ల మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించింది. ఈ వ్యాజ్యాన్ని గురువారం విచారించింది. ఈ సందర్భంగా సీవరేజీ బోర్డు తరఫు న్యాయవాది టి.సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏ మ్యాన్‌హోల్‌లో అయితే వీరాస్వామి, కోటయ్య దిగి మృతిచెందారో దానిని శుభ్రపరచాలని తమకు ఎటువంటి అభ్యర్థనలు రాలేదని, ఆ ప్రాంతవాసులు ప్రైవేటు వ్యక్తులను డ్రైనేజీ శుభ్రత కోసం వినియోగించుకున్నారని వివరించారు.
మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం విడుదల చేశామని తెలిపారు. అయితే ఈ వాదన పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిహారం బాధిత కుటుంబాలకు అందిందో లేదో చెప్పాలని ఆదేశించింది. డ్రైనేజీల శుభ్రత విషయంలో ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనలపై సకాలంలో స్పందించకపోతుండటం వల్లే వారు విధిలేక ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించింది. డ్రైనేజీలను శుభ్రపరచాలంటూ ప్రజల నుంచి ఎన్ని అభ్యర్థనలు వచ్చాయి.. ఎన్నింటిని పరిష్కరించారు.. తదితర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హోం శాఖ, జీహెచ్‌ఎంసీ, సీవరేజీ బోర్డు అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.