న్యాయం చేయాలని కార్మికసంఘాల డిమాండ్
ఘటనాస్థలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్, సీపీ
మంచిర్యాల క్రైం: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ముగ్గురు కూలీలు నిర్మాణ పనులు చేస్తూ ప్రహరీ గోడ కూలి దుర్మరణం చెందారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకున్న ఈ దుర్ఘటన వివరాలిలా.. స్థానిక బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో నందిని ఆస్పత్రి నిర్వాహకులు నూతన భవనం నిర్మిస్తున్నారు.
ఈ క్రమంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం రుద్రపురం గ్రామానికి చెందిన ఏనంక హన్మంత్(35), బాబాపూర్‌కు చెందిన ఆత్రం శంకర్(40), చింతలమానెపల్లికి చెందిన గోలేం పోషం(50) సెల్లార్‌లో పనులు చేస్తున్నారు. పనుల్లో భాగంగా పిల్లర్ల మధ్యలో మట్టి, బండలు నింపుతుండగా పక్కనే ఉన్న పాత ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలి పోషం, శంకర్, హన్మంత్‌పై పడడంతో దానికింద నలిగి అక్కడికక్కడే మృతిచెందారు.
వీరి పక్కనే పనిలో ఉన్న రాములును మరో ఇద్దరు కూలీలు లాగడంతో స్వల్ప గాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు, స్థానికులు రెండు గంటలపాటు డ్రిల్లర్, జేసీబీ సాయంతో శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు. çమృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కార్మిక సంఘాలు డిమండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. ఘటనాస్థలాన్ని అదనపు కలెక్టర్ రాహుల్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించి ప్రమాద వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment