
చనిపోలేదని.. పడుకున్నాడని తండ్రి సమాధానం
మతిస్థిమితం లేని తండ్రి ఆస్పత్రికి తరలింపు
మంచిర్యాల క్రైం: మతిస్థిమితం కోల్పోయిన ఒక తండ్రి.. చనిపోయిన కుమారుడి శవం పక్కనే మూడు రోజుల పాటు ఉన్న ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్‌రోడ్‌లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాలివి. గూడెల్లి వెంకట్‌రెడ్డి అశోక్‌రోడ్డులో నివసిస్తున్నారు.
ఈయనకు కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నాడు. వెంకట్‌రెడ్డి సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల క్రితం భార్య రాధమ్మ అనారోగ్యంతో చనిపోయాక వెంకట్‌రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. తండ్రీకొడుకులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఎస్టీపీపీలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్న కొడుకు లక్ష్మీనారాయణ.. తండ్రి బాగోగులు చూసుకునేవారు. ఇటీవల మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ.. ఆదివారం కూడా తాగి ఇంట్లోని సోఫాలో పడుకున్నారు. అప్పటి నుంచి బయటకు రాలేదు.
మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. సోఫాలో లక్ష్మీనారాయణ (30) శవమై కనిపించాడు. మరోవైపు వెంకట్‌రెడ్డి అచేతన స్థితిలో పడుకుని ఉన్నాడు. ‘నీ కొడుక్కి ఏమైంది..’ అని ప్రశ్నిస్తే.. ‘పడుకున్నాడు’.. అంటూ సమాధానం చెప్పారు. పోలీసులు లక్ష్మీనారాయణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వెంకట్‌రెడ్డిని వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వెంకట్‌రెడ్డి బంధువు గూడెల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.