
కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వని అధికారులు
దుర్ఘటన విషయం బయటకు పొక్కనివ్వకుండా చర్యలు
మీడియా వెళ్లకుండా అడ్డుకున్న హోంమంత్రి
గోడ ఎలా కట్టారన్నది తమకు సంబంధం లేదన్న హోం మంత్రి అనిత
సాక్షి, విశాఖపట్నం: సింహగిరిపై ఊహకందని విషాదం సంభవించింది. గోడ కూలిన విషయం సింహగిరి మొత్తం దావానలంలా వ్యాపించింది. అదే సమయంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శనాల కోసం బారులుతీరారు. శిథిలాల కింద భక్తులు చిక్కుకున్న విషయం తెలిసినా.. తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. తమ వారు రూ.300 టికెట్ తీసుకుని దర్శనం కోసం వెళ్లారని, వారి సమాచారం కావాలంటూ భక్తులు కోరుతున్నా సమాధానం చెప్పే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు.
ఈ ఘటన బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తపడేందుకు యత్నించారే తప్ప.. వీలైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేసి పరిస్థితి చక్కదిద్దుదామన్న ఆలోచన అధికారులు, ప్రజాప్రతినిధులకు రాలేదు. వీఐపీ దర్శన మార్గానికి 50 మీటర్ల దూరంలో గాలిగోపురానికి సమీపంలో దుర్ఘటన జరిగింది. ప్రజాప్రతినిధులు వెళ్తున్న సమయంలోనే పోలీసులు, వైద్య సిబ్బంది అటుగా పరుగులు తీశారు. దాన్ని చూసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం జరిగిందని వాకబు చేశారు. విషయం తెలుసుకుని ఆగకుండా దర్శనానికి వెళ్లిపోయారు.
కంట్రోల్ రూమ్ ఎక్కడ?
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధిత కుటుంబాల వారు సమాచారం కోసం ఎదురు చూస్తుంటారు. ఇందుకోసం వెంటనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ.. ప్రమాదం సంభవించి ఏడుగురు మృత్యువాతపడినా అధికారుల్లో కనీస చలనం లేదు. తమ వారు ఎక్కడున్నారో.. ఏమైపోయారో తెలీక.. చాలామంది భక్తులు నానాఅవస్థలు పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రూ.300 టికెట్ క్యూలైన్‌లో ఉన్న వారంతా చెల్లాచెదురయ్యారు. కొండపై మొబైల్ సిగ్నల్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యుల జాడ తెలియక ఆందోళన చెందారు.
కొందరు భక్తులు కంట్రోల్ రూమ్ ఏమైనా ఏర్పాటు చేశారా? అని అడిగితే.. జిల్లా అధికారులు స్పందించలేదు. అక్కడున్న అధికారుల్ని తమ వారి జాడ గురించి అడిగితే.. తమకేమీ సంబంధం లేదన్నట్లు సమాధానమిచ్చారు. ఓ వలంటీర్ తన కుటుంబ సభ్యుల్ని 2 నిమిషాల ముందే ఆ లైన్‌లో చూశాననీ, ప్రమాదం జరిగిన తర్వాత వాళ్లు కనిపించడం లేదంటూ కన్నీటిపర్యంతమైనా.. తోటి వలంటీర్లు ఓదార్చి వారి జాడ కోసం ప్రత్యేక బృందంగా ఏర్పడి వెతకాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఆంక్షలు.. ఆగ్రహావేశాలు
చందనోత్సవ సమయంలో ఏర్పాట్ల విషయంలో విఫలమైన ప్రభుత్వం.. ఘోరం జరిగినా అంతే నిర్లక్ష్యంతో వ్యవహరించింది. అపశ్రుతి చోటుచేసుకుని ఏడుగురు మరణించారన్న విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా చేసేందుకు మంత్రులు, అధికారులు విశ్వ ప్రయత్నం చేశారు. హోం మంత్రి అనిత ఘటనాస్థలానికి వెళ్లే ప్రాంతంలో పహారా కాశారు.
కనీసం మీడియా ప్రతినిధులు వెళ్లేందుకు కూడా వీల్లేదని హుకుం జారీ చేశారు. కొందరు వెళ్లేందుకు ప్రయత్నించినా హోంమంత్రి తన సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. అయినా ఈ విషయం అక్కడకు వచ్చిన భక్తులకు తెలిసిపోవడంతో హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత క్యూలైన్లలోనూ ఆంక్షలు విధించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
బస్సులు లేక అగచాట్లు
మరోవైపు ప్రమాదం సంభవించిన తర్వాత ఘాట్‌రోడ్డు నుంచి భక్తుల్ని అనుమతించడం నిలిపేశారు. వేకువజామున 4 గంటల నుంచి 7 గంటల వరకూ బస్సుల్ని పైకి పంపించకపోవడంతో కొండ దిగువనే భక్తులు నిలిచిపోయి అవస్థలు పడ్డారు. మరోవైపు.. అర్ధరాత్రి నుంచి స్వామి దర్శనం కోసం కొండపైకి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేందుకు కూడా బస్సులు లేకపోవడంతో అగచాట్లు ఎదుర్కొన్నారు. ఉదయం 7 గంటల తర్వాత బస్సుల రాకపోకలు ప్రారంభించడంతో వాటిని అందుకునేందుకు యుద్ధాలే చేయాల్సిన దుస్థితి దాపురించింది.
గోడ ఎలా కట్టారో మాకెలా తెలుస్తుంది?
మృతదేహాల్ని కేజీహెచ్‌కు తరలించిన తర్వాత ప్రమాద స్థలాన్ని హోం మంత్రి అనిత పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ..‘అక్కడ గోడ ఉంది. అది పిల్లర్‌తో కట్టారా... సిమెంట్‌తో కట్టారా... ఇటుకలతో కట్టారా... అనేది మేమెవరం చూసుకోం..’ అని వ్యాఖ్యానించారు. ‘మేమూ వర్షంలో తడుస్తూనే దర్శనం చేసుకున్నాం. అయినా.. ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు వచ్చాను’ అని హోం మంత్రి చెప్పడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గందరగోళ పరిస్థితులు
ప్రమాదం తర్వాత రూ.300 క్యూలైన్లను పూర్తిగా నిలిపేశారు. దీంతో ఆ టికెట్లు తీసుకున్న వేలాది భక్తులు దర్శనానికి ఎటువెళ్లాలో తెలియక నిలిచిపోయారు. దీంతో ఆ ప్రాంతమంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకానొకదశలో అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటికప్పుడు రూ.1,000 టికెట్ క్యూలైన్లను రూ.300 టికెట్ క్యూలైన్లుగా మార్చేశారు. రూ.1,500 టికెట్, రూ.1,000 టికెట్ భక్తుల్ని ఒకే లైన్‌లో కలిపేశారు. గాలిగోపురం వద్ద ఆయా టికెట్ల వారిని వేరువేరుగా పంపించారు. దీంతో ఎవరు ఎటు వెళ్లాలో తెలీక లైన్లు కిక్కిరిసిపోవడంతో భక్తులు నరకయాతన అనుభవించారు.
అనిత.. ఇదేనా మీ బాధ్యత!
27–04–2025
క్యూ లైన్‌లు, భక్తులకు ఇతర సౌకర్యాలపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఐదుగురు మంత్రులం ఏర్పాట్లపై సమీక్షించాం. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధ పెట్టి పర్యవేక్షిస్తున్నాం.
30–04–2024
ఈ ఘటన ఎంతో దురదృష్టకరం. మేం రెండు రోజుల క్రితం ఏర్పాట్ల పరిశీలనకు వచ్చాం. అయితే ప్రమాదానికి గురైన గోడ ఎలా నిర్మించారో మేం చూడలేదు. ఆ గోడ ఇటుకతో కట్టారా? పిల్లర్‌తో కట్టారా? అనేది మేం చూడలేదు. – ఇవీ హోంమంత్రి అనిత వ్యాఖ్యలు