
మృతదేహాలకు ఆగమేఘాలపై పోస్టుమార్టం
సంతకాల కోసం బాధితుల కాళ్లావేళ్లా పడ్డ రాష్ట్ర హోంమంత్రి అనిత
ఆరిలోవ/డాబాగార్డెన్స్: సింహాచలం ఘటన గురించి తెలిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖకు బయలుదేరారన్న సమాచారం అందుకున్న ప్రభుత్వం కలవరపాటుకు గురైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని వణికిపోయింది. వైఎస్ జగన్ కేజీహెచ్ మార్చురీకి చేరుకునేలోపే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించేందుకు రాష్ట్ర హోం మంత్రి అనిత పడరాని పాట్లు పడ్డారు. పోస్టుమార్టంకు అంగీకరిస్తూ సంతకాలు చేయాలంటూ బాధిత కుటుంబాల కాళ్లావేళ్లాపడ్డారు.
శవపంచనామాకు సహకరించాలని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంతోపాటు రూ.కోటి పరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మొరపెట్టుకున్నారు. తమను నమ్మాలని ప్రాధేయపడ్డారు. అయినా మృతుల కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వారం రోజుల్లోనే నాణ్యత లేకుండా గోడ నిర్మించి తమ కుటుంబీకుల మరణానికి కారణమైన ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదంటూ భీష్మించారు.
రాతపూర్వకంగా ఇవ్వాలని, లేదా మీడియా ముందు స్పష్టంగా ప్రకటించాలని తేల్చిచెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని హోంమంత్రి అనిత వైఎస్ జగన్ వచ్చేలోపే పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్‌తోపాటు పోలీసు అధికారులను ఆదేశించారు.
వారి చేత మృతుల కుటుంబాలపై తీవ్ర ఒత్తిడి చేయించారు. మృతులు భీమిలి నియోజకవర్గం వారు కావడంతో వారిని ఒప్పించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుయాయులనూ బతిమిలాడారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు కూడా మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా యత్నించారు. చివరకు సంతకాలు లేకుండానే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేయించారు. సింహాచలం ఘటన గురించి విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ పట్టించుకోలేదు. సింహాచలం దేవస్థానం వైపు కన్నెత్తి చూడలేదు.