బాయిలర్ నిర్మిస్తున్న ప్రదేశం
కాగజ్‌నగర్ టౌన్: కుమురంభీం జిల్లా సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం)లో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాయిలర్ నిర్మాణం చేపడుతున్న ప్రదేశంలో మట్టి పెళ్లలు కూలడంతో ముగ్గురు కూలీలు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైకు చెందిన ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో నూతన బాయిలర్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి బాయిలర్ పిల్లర్ల నిర్మాణం కోసం రాడ్ బైండింగ్ పని చేస్తుండగా భారీ గుంతలో ఓ పక్క భాగం మట్టి దిబ్బలు కూలీలపై పడిపోయాయి. దీంతో రెప్పపాటులో ఎనిమిది మంది కూలీలు మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయారు.
ప్రమాద సమయంలో 24 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో రఘునాథ్ రాం (38) (జార్ఖండ్) అక్కడికక్కడే చనిపోగా.. మిగతా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఛోటు కుమార్ (25)(జార్ఖండ్), రంజిత్ (24) (ఉత్తరప్రదేశ్) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం ప్రమాద స్థలాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరిశీలించారు. సైట్ సీనియర్ ఇంజనీర్, సూపర్ వైజర్లపై కేసులు నమోదు చేసినట్లు ఇన్‌చార్జి ఎస్పీ విష్ణువారియర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment