రాయదుర్గం/ బొమ్మనహాళ్/ సాక్షి, అమరావతి: కాసేపట్లో ఇంటికి చేరాల్సిన వ్యవసాయ కూలీలను కరెంటు తీగ కాటేసింది. ట్రాక్టర్‌లో ఇళ్లకు తిరుగు పయనమవుతున్న సమయంలో వారి బతుకులు బుగ్గిపాలయ్యాయి. అప్పటి వరకు మేఘావృతమై కనిపించిన ఆకాశం.. పనులు పూర్తయ్యే సరికి చిరుజల్లులు కురిపించింది. దీంతో 11 కేవీ విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్‌కు గురయ్యాయి. ఓ తీగ తెగి కూలీలు వెళ్తున్న ట్రాక్టర్‌పై పడింది. అక్కడికక్కడే నలుగురు మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు వద్ద బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దర్గా హొన్నూరు గ్రామానికి చెందిన కమ్మూరి సుబ్బన్న అనే రైతు ఊరికి సమీపంలోని తన పొలంలో ఆముదం పంట సాగు చేశాడు. పంట దిగుబడిని తీసేందుకు బుధవారం ఉదయం 8.30 గంటలకు సొంత ట్రాక్టరులో గ్రామానికే చెందిన 14 మంది కూలీలను తీసుకుని వెళ్లాడు. వీరిలో ఎనిమిది మంది మహిళలు.. ఆరుగురు పురుషులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పని పూర్తయ్యింది. అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. అయినా తిరుగు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు.
కూలీలను ఎక్కించుకుని, ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్ తీగ షార్ట్‌సర్క్యూట్ కారణంగా తెగి ట్రాక్టరుపై పడింది. దీంతో వన్నక్క (52), రత్నమ్మ (40) అనే అత్తాకోడళ్లతో పాటు శంకరమ్మ (34), పార్వతి (48) అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మహిళా, ఇద్దరు పురుష కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని విజయనగర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (విమ్స్)కు తరలించారు. వీరిలో సుంకమ్మ అనే మహిళా కూలీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న రైతు సుబ్బన్న, ఐదుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, కళ్యాణదుర్గం ఆర్డీఓ నిశాంత్ కుమార్ తదితరులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బళ్లారి ఆస్పత్రికి వెళ్లి మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద విషయాన్ని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం జగన్ దిగ్భ్రాంతి
దర్గా హొన్నూరులో విద్యుదాఘాతం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. (విద్యుత్ శాఖ ద్వారా రూ.5 లక్షలు, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.5 లక్షలు) బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని అధికారులకు ఆదేశించారు.
కాగా, మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌కు, ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలిచ్చామన్నారు.
‘కండక్టర్’ తెగడం వల్లే ప్రమాదం
ఇన్సులేటర్ ఫ్లాష్ అవ్వడంతో కండక్టర్ తెగడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ కే సంతోషరావు తెలిపారు. ఈ సంఘటనకు బాధ్యులుగా భావిస్తూ నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ (పి–ఎంఎం) డి.వి.చలపతి నేతృత్వంలో చీఫ్ జనరల్ మేనేజర్ (ఓ–యం) కె. గురవయ్య, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ (అనంతపురం) యం. విజయ భాస్కర్ రెడ్డిలతో కమిటీని నియమించామని చెప్పారు.
ఈ కమిటీని హుటాహుటిన సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లాల్సిందిగా ఆదేశించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కళ్యాణ దుర్గం) ఎస్.మల్లికార్జున రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (బొమ్మనహాళ్) ఎం.కె. లక్ష్మీరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ప్రొటెక్షన్) హెచ్. హమీదుల్లా బేగ్, లైన్‌మెన్ (దర్గా హొన్నూర్) కె.బసవ రాజులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామని సీఎండీ తెలిపారు. అనంతపురం ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్స్/రాయదుర్గం) శేషాద్రి శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (యం–పి/అనంతపురం) కె. రమేష్‌ల నుంచి వివరణ కోరుతూ మెమో జారీ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment