ఘోర ప్రమాదం | Heavy Road Accident At Sri Sathya Sai District Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం

Published Fri, Jul 1 2022 3:08 AM | Last Updated on Fri, Jul 1 2022 6:53 AM

Heavy Road Accident At Sri Sathya Sai District Andhra Pradesh - Sakshi

విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందిన మహిళా కూలీలు, దగ్ధమైన ఆటో

సాక్షి, పుట్టపర్తి, అమరావతి/తాడిమర్రి/సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూలీలు ప్రయాణిస్తున్న ఆటోపై విద్యుత్‌ తీగలు తెగి పడటంతో మంటలు చెలరేగి ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం 7.30 గంటలకు ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికులు, కూలీలు తెలిపిన వివరాల మేరకు.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన గుండ్లమడుగు మెకానిక్‌ రాజా ఇటీవల 2 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు.

కలుపు తొలగించేందుకు ఇతని భార్య కుమారి (28).. గుడ్డంపల్లికి చెందిన మరో 11 మంది కూలీలను తీసుకుని కునుకుంట్ల గ్రామానికి చెందిన పోతులయ్య ఆటోలో పొలానికి బయలుదేరింది. మొత్తం 13 మందితో వెళ్తున్న ఆటో చిల్లకొండయ్యపల్లి సమీపంలోకి రాగానే 11 కేవీ విద్యుత్‌ తీగ ఉన్నట్లుండి తెగి ఆటోపై పడింది. దీంతో ఆటోకు విద్యుత్‌ ప్రవహించి మంటలు చెలరేగాయి. దీంతో గుండ్లమడుగు కుమారితో పాటు కొంకా మల్లికార్జున భార్య రామలక్ష్మి (30), కొంకా చిన్న మల్లన్న భార్య పెద్ద కాంతమ్మ (45), కొంకా కిష్టయ్య భార్య రత్నమ్మ (40) కొంకా ఈశ్వరయ్య భార్య లక్ష్మీదేవి (41) సజీవ దహనమయ్యారు.

కొంకా మంజునాథ్‌ భార్య గాయత్రికి తీవ్ర గాయాలు కాగా, కొంకా మధుసూదన్‌ భార్య అరుణ, కొంకా పెద్దన్న భార్య నాగేశ్వరమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్‌ పోతులయ్యతో పాటు కొంకా ఈశ్వరమ్మ, శివరత్నమ్మ, రమాదేవి, ఎ.రత్నమ్మలు ఆటోలోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తీవ్రంగా గాయపడిన గాయత్రిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. మృతుల్లో కుమారి పెద్ద కోట్ల గ్రామానికి చెందగా.. మిగతా నలుగురు గుడ్డంపల్లి వాసులు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ పాటిల్‌ భువనేశ్వర్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అధికారులను అప్రమత్తం చేసి.. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.   
 
కొంప ముంచిన ఉడుత   
స్థంభంపై ఇనుప రాడ్డుకు, విద్యుత్‌ వైరు తగలకుండా మధ్యలో పింగాణీ పరికరాన్ని అమర్చుతారు. కానీ ఉడుత పొడవు ఆ పరికరాన్ని దాటి ఉండటంతో వైరును తాకింది. విద్యుత్‌ తీగకు స్తంభంపై ఉన్న ఇనుప రాడ్డుకి మధ్య ఉడుత పడటంతో దాని శరీరం గుండా విద్యుత్‌ ప్రవహించింది. ఆ వెంటనే షార్ట్‌ సర్క్యూట్, ఎర్త్‌ కారణంగా స్పార్క్‌ ఏర్పడి వైరు తెగిపోయింది. అప్పుడే అటుగా వచ్చిన ఆటోపై ఆ వైరు పడింది. అయినప్పటికీ ఆటోకి ఉండే టైర్లు ఎర్త్‌ అవ్వకుండా అడ్డుకోగలవు. కానీ ఆటోపై ఇనుప మంచం ఉంది. అదీగాక ఆ కంగారులో ఆటోలో ఉన్నవారెవరో కిందకు దిగే ప్రయత్నం చేశారు.

వారు ఒక కాలు నేలపై, మరోకాలు ఆటోలో ఉంచడం వల్ల ఎర్త్‌ అయ్యి ఆటోకి వేల వాట్ల హై టెన్షన్‌ విద్యుత్‌ ప్రసరించి క్షణాల్లో కాలి బుగ్గయ్యింది. కాగా, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) సీఎండీ హరినాథరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాఖ పరమైన విచారణకు ఆదేశించామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు (సీఎం ప్రకటించిన పరిహారం కాకుండా), తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల తక్షణ సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. 
 
ఇటీవలే కొత్త లైన్లు వేశాం 
కరెంటు పోళ్లు గానీ, వైర్ల విషయంలో గానీ ఎక్కడా లోపం లేదని, ఆరుమాసాల కిందటే కొత్త ఫీడర్లు వేశామని విద్యుత్‌ శాఖ అనంతపురం ఎస్‌ఈ నాగరాజు తెలిపారు. విద్యుత్‌ సరఫరా నిర్వహణలో లోపంగానీ, సాంకేతిక సమస్యలు గానీ ఎక్కడా లేవన్నారు. ఈ ఘటనపై విచారణాధికారిగా ఎస్‌పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రషీద్‌ను నియమించారు. ఆయన శుక్రవారం ఘటన స్థలికి చేరుకుని పరిశీలించనున్నారు.  
 
ఉడుతలతో ప్రమాదం 
విద్యుత్‌ తీగలపై ఉడుతలు, తొండలు, పాములు, పక్షులు వంటివి పడటం సాధారణంగా తరచూ జరుగుతుంటుంది. పవర్‌ గ్రిడ్‌లలో వీటివల్ల అనేక సార్లు విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతుంటుంది. ప్లాస్టిక్‌ యానిమల్‌ గార్డ్‌లను దాటేసి, చిన్న సందు దొరికితే చాలు సబ్‌స్టేషన్‌లోకి ఇవి దూరిపోతుంటాయి. ఇవి మోషన్‌ డిటెక్టర్లను దాటి కంచెల కింద సొరంగం కూడా చేయగలవు. టన్నెలింగ్, ఎలక్ట్రికల్‌ ఇన్సులేషన్‌ ద్వారా కొరకడం, నమలడం, వేర్వేరు విద్యుత్‌ పొటెన్షియల్స్‌లో ఉన్న రెండు కండక్టర్‌లపై ఏకకాలంలో పడటం ద్వారా విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను దెబ్బతీస్తాయి.

ఫలితంగా షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి తీగలు తెగిపోవడం, విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం ఏకకాలంలో జరుగుతుంది. ఇంటర్నెట్, మౌలిక సదుపాయాలు వంటి సేవలకు ఉడుతల వల్ల కలిగే ముప్పు సైబర్, ఉగ్ర దాడుల వల్ల కలిగే ముప్పు కంటే ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ భద్రత సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఉడుతలు అనేక దేశాల్లో పవర్‌ గ్రిడ్‌లను నిర్వీర్యం చేయగలవని రుజువైంది. 
 
గవర్నర్, సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి 
చిల్లకొండయ్యపల్లిలో జరిగిన ప్రమాదంపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారిస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. సీఎంఓ ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement