current shock deaths
-
విద్యుత్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనం
కనిగిరి రూరల్: కరెంట్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగింది. వివరాలు.. కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన వీరమాస గౌతమ్‌కుమార్(16), ఇందిరాకాలనీకి చెందిన దేశబోయి నజీర్(16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు.గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు. పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ తీగ(11 కేవీ) తెగి కిందకు వేలాడుతోంది. వీరు ముగ్గురూ స్కూటీపై వెళ్తూ ఆ విద్యుత్ తీగకు తగిలారు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ముగ్గురూ కిందపడిపోగా.. స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ.. ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ, ఎస్సై, విద్యుత్, రెవెన్యూ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృత్యువులోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని మంత్రి చెప్పారు. మా సిబ్బంది నిర్లక్ష్యం లేదు ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేమీ లేదని విద్యుత్ శాఖ డీఈఈ స్పష్టం చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిందన్నారు. అయితే నేలపై పడకుండా చిల్లచెట్లపై ఉండటంతో పునుగోడు ఫీడర్ ట్రిప్ కాలేదని చెప్పారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోలేదన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న విద్యార్థులు విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందారని విద్యుత్ శాఖ డీఈఈ, ఏడీఈలు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళి.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
మహబూబ్‌నగర్ క్రైం: పొలానికి నీళ్లు పెట్టడానికి మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మండలంలోని జమిస్తాపూర్ చెందిన శరత్‌కుమార్(19) ఆదివారం ఉదయం తండ్రి గోపాల్‌తో కలిసి గ్రామ శివారులో ఉన్న వరి పంట పొలానికి నీళ్లు పెట్టడం కోసం మోటార్ స్విచ్ఛాన్ చేసే క్రమంలో షాక్ తగలడంతో తీవ్ర గాయా లు అయ్యాయి. చికిత్స కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ.. చారకొండ: గులికల మందు మింగి మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని జేపల్లి పంచాయతీ పరిధిలో నెమలిగుట్టతండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమలిగుట్టతండాకు చెందిన రాత్లవత్ బుజ్జి (39) అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 20వ తేదీన గులికల మందు తిని అపస్మారకస్థితిలో పడిపోయింది. స్థానికులు గమనించి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టెబుల్ నాగయ్య తెలిపారు. రైలు కిందపడి యువకుడి బలవన్మరణం జడ్చర్ల: రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గొల్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ కథనం మేరకు.. మిడ్జిల్ మండలం బైరంపల్లికి చెందిన గొడుగు మహేశ్(23) జల్సాగా తిరు గుతుండేవాడు. ఈ క్రమంలో తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం మృతదేహాన్ని గుర్తించామని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ వివరించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com మృతదేహంతో ఆందోళన.. మిడ్జిల్: పోస్టుమార్టం అనంతరం మహేష్ మృతదేహంతో బైరంపల్లి సమీపంలోని క్రషర్ మిషన్ ఎదుట బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ బంధువులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మూడేళ్లుగా క్రషర్ మిషన్‌లో టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, శనివారం సాయంత్రం డ్యూటీ ముగిశాక ఇంటికి రాలేదని.. ఆదివారం ఉదయం గొల్లపల్లి సమీపంలో రైలు పట్టాలపై మృతిచెంది కనిపించినట్లు గ్రామస్తులు వివరించారు. యజమానులు అందుబాటులోకి రాకపోవడంతో సాయంత్రం వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. నిప్పంటించుకుని వృద్ధుడు.. ఉండవెల్లి: నిప్పంటించుకుని ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ బాల్‌రాజు వివరాల మేరకు.. తక్కశీలకు చెందిన తెలుగు వెంకట్రాముడు (65), లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల కిందట వెంకట్రాముడికి పక్షపాతం రావడంతో ఎడమ కాలు, చెయ్యి పడిపోయింది. నెలరోజుల కిందట ఇంట్లో కాలుజారి పడటంతో వెన్నెముకకు గాయమైంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతడు.. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు ఉండవెల్లి: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు. ఆయన కథనం మేరకు.. పోతులపాడుకు చెందిన భానుప్రకాష్, మరో ఇద్దరు టోల్‌ప్లాజా సమీపంలోని బహిరంగ ప్రదేశంలో కారు నిలుపుకొని మద్యం తాగుతున్నారు. పోలీసులు రమేష్, హుస్సేన్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దని.. వెళ్లిపోవాలని కోరగా ఆగ్రహించిన మందుబాబులు దురుసుగా మాట్లాడి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో సిబ్బంది ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు. -
అడవి పందుల కోసమని ఏర్పాటు చేస్తే.. చివరికి ఇలా..!
మహబూబ్‌నగర్: అడవి పందుల బారినుంచి పంటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు తగిలి షాక్‌తో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన గురువారం రాత్రి వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని రుక్కన్నపల్లి శివారులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రుక్కన్నపల్లితండాకు చెందిన రాములునాయక్(37) రుక్కన్నపల్లి, కోతులకుంట తండాల శివారులో ఐదున్నర ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. ఈ క్రమంలో అడవి పందులు పంటను నాశనం చేస్తుండటంతో కొన్నిరోజుల నుంచి చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేసి రాములు అత్తగారి ఇంటి నుంచి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. గురువారం రాత్రి అతనికి తోడుగా సోళీపురం గ్రామానికి చెందిన జాలికాడి నర్సింహులు(45)ను పిలుచుకున్నాడు. ఇద్దరూ కలిసి పొలం దగ్గరకు వెళ్లారు. ఇదే సమయంలో ప్రతిరోజు మాదిరిగానే రాములునాయక్ భార్య శారద ఇంటి దగ్గర కరెంట్ ఆన్ చేయడానికి తన భర్తను అడిగేందుకు ఫోన్లో చేసింది. అయితే అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో ప్రతిరోజు లాగే గురువారం సైతం కరెంట్ ఆన్ చేసింది. ఈ విషయం తెలియని రాములునాయక్, జాలికాడి నర్సింహులు ఇద్దరూ వరి చేను దగ్గరకు వెళ్లగా.. కరెంట్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. తర్వాత అటుగా వెళ్లిన ఇతర పొలాల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులతోపాటు రెండు గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. అర గంట ముందు వరకు కళ్ల మందు ఉన్న వ్యక్తులు అంతలోనే విగతజీవులుగా మారడంతో బోరుమని విలపించారు. రాములు నాయక్‌కు భార్యతోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. నర్సింహకు భార్య బొజ్జమ్మతోపాటు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
పులికే ప్రాణ గండమా? ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది
పాపం పులి సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అడవిలో వేట పూర్తిగా ఆగితేనే జాతీయ జంతువు పులికి భద్రత లభిస్తుంది. ఈ ఏడాది కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలో రెండు పు లుల మరణాలు వెలుగులోకి రావడం ముప్పును తె లియజేస్తోంది. నెన్నెల మండలం కుశ్నపల్లి రేంజ్లో పులి అవశేషాలు బయటపడడం తెలిసిందే. రెండ్రోజుల క్రితం మహారాష్ట్ర పరిధి జివితి తాలూకాలో కు మురంభీం జిల్లాలో సంచరించిన ఓ పులిని హతమార్చి చర్మం విక్రయిస్తుండగా అక్కడి అటవీ అధికారులు పట్టుకున్నారు. టైగర్ మిస్సింగ్.? వరుస ఘటనలతో కవ్వాల్ టైగర్‌జోన్‌లో పులుల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. పులులు చనిపోయిన నెలల తర్వాత వాటి అవశేషా లు విక్రయిస్తున్న క్రమంలోనే ఈ ఉదంతాలు బయటకు వస్తున్నాయి. పులి ట్రాకింగ్ వ్యవస్థ స్పష్టత లేక ఏ పులి ఎక్కడ సంచరిస్తుందో తెలియక కనిపించకుండా పోతున్నాయి. ఇలాంటి జాడ లేకుండా పోయిన పులులు ఉన్నాయి. చాలావరకు మహారాష్ట్ర వెళ్లిపోయాయని చెబుతున్నప్పటికీ వాస్తవానికి అవి ఎక్కడున్నాయో స్పష్టత లేదు. కరెంట్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీస్తున్నారు అడవిలో వన్యప్రాణుల వేట కోసం అమర్చుతున్న విద్యుత్ తీగలతోనూ పులులకు ముప్పు వాటిల్లుతోంది. గతంలో అటవీ ప్రాంతాల వరకు విద్యుత్ సదుపాయం ఉండకపోవడంతో ఉరిలు మాత్రమే వేసేవాళ్లు. అడవి పందులు, దుప్పులు, ఏదులు, మెకం వంటి జంతువులను వేటాడేందుకు ఏకంగా 32కేవీ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ లైన్ల నుంచి దొంగచాటుగా అడవి లోనికి ప్రసారం చేస్తూ వాటి ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటికీ అటవీ సమీప ప్రాంతాల్లో యథేచ్ఛగా వేట కొనసాగుతోంది. జాతీయ జంతువుకు గండం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, అంధేరి పులుల సంరక్షణ కేంద్రాల్లో వాటి సంతతి పెరిగి కవ్వాల్‌లోకి అడుగు పెడుతున్నాయి. ఆహారం, ఆవాసం, తోడు కోసం ఇటు వైపు వస్తున్నాయి. ఇలా వచ్చిపోయే వలస పులులతోపాటు కవ్వాల్ పరిధిలో స్థిర నివాసం ఏర్పర్చుకున్న వాటికి ముప్పు పొంచి ఉంది. అటవీ సమీప ప్రాంతాల ప్రజలకు జాతీయ జంతువుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతోపాటు పులులు వస్తే పాటించాల్సిన జాగ్రత్తలపై స్థానికులకు వివరించడం లేదు. భద్రత పేరుతో గోప్యత ఒక్కోసారి పులి వచ్చిందని చెప్పినా అటవీ శాఖ సిబ్బంది పట్టించుకోకపోవడంతోనూ సమస్యలు వస్తున్నాయి. గతంలో ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల పరిధిలో పులి సంచరిస్తోందని అక్కడి అధికారులకు చెబితే ఈ ప్రాంతంలో పులి లేదని కొట్టిపారేశారు. రెండ్రోజులకే అక్కడ ఓ రైతుపై దాడి చేసి ప్రాణాలు తీసింది. పులి భద్రత పేరుతో గోప్యత పాటించి అసలుకే మోసం తెస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక రాత్రి వేళ కరెంటు సరఫరా, తనిఖీలు, గస్తీ, యానిమల్ ట్రాకర్స్ ఉన్నప్పటికీ పులికి ప్రాణగండం తప్పడం లేదు. వేసవిలోనూ వేటగాళ్ల ముప్పు వేసవిలో వన్యప్రాణులు అడవిలో నుంచి వేడిని తట్టుకునేందుకు, నీరు, ఆహారం కోసం బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో వేటగాళ్లు షికారీ చేస్తూ అటవీ జంతువుల ప్రాణాలు తీస్తున్నారు. వానాకా లంలో పత్తి పంటను కాపాడుకునేందుకు అడవి పందుల నియంత్రణకు విద్యుత్ తీగలతో కంచెలు వేస్తుంటారు. ఆ సమయంలో ఏ జంతువు తగిలినా ప్రాణాలు కోల్పోతాయి. వేసవిలో నీటికుంటలు, ఒర్రెలు, లోయలు, వెదురు చెట్ల చల్లదనం కోసం వచ్చే క్రమంలో వేటగాళ్లు ఉచ్చులు వేసి ప్రాణాలు తీస్తున్నారు. దీనిపై పకడ్బందీగా ప్రణాళిక వేసి అమలు చేస్తే గానీ అటవీ జంతువులకు రక్షణ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
పునాదిపై పోయిన ప్రాణం
ధర్మవరం అర్బన్: నూతన ఇంటి పునాదికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ధర్మవరంలో చోటు చేసుకుంది. వన్ టౌన్ ఎస్ఐ మహమ్మద్ రఫి తెలిపిన వివరాల మేరకు... ప్రియాంకనగర్‌కు చెందిన రషీద్(30) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితమే హర్షియాతో వివాహం కాగా, అప్పటి నుంచి ‘వర్క్ ఫ్రమ్ హోం’ కింద ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే రషీద్ కుటుంబం శ్రీలక్ష్మీచెన్నకేశవపురంలో నూతన ఇంటి నిర్మాణం చేపట్టింది. శనివారం పునాదికి నీరు పెట్టేందుకు వెళ్లిన రషీద్, కరెంటు మోటర్ త్రీపిన్ ప్లగ్ పిన్ నీటితో తడిసిపోయి ఉండటాన్ని గమనించిన స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడే పడిపోయాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఎస్ఐ మహమ్మద్ రఫి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. (చదవండి: ‘ఫ్యామిలీ డాక్టర్’తో మెరుగైన వైద్య సేవలు) -
ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్‌తో ఆరుగురు మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. ఇనుప రాడ్డు హైటెన్షన్ విద్యుత్తు తీగకు తగిలి కరెంట్ షాక్‌తో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుల్లో ఐదుగురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. జిల్లాలోని మసుపుర్ గ్రామంలో సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్థులు ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపులో ఉపయోగించిన బండిలో ఏర్పాటు చేసిన ఇనుప రాడ్ హైఓల్టేజ్ విద్యుత్తు తీగకు తగిలి కరెంట్ సరఫరా అయినట్లు స్థానికులు తెలిపారు. కరెంట్ షాక్‌తో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో బాలుడు అరఫాత్(10) ఆసుపత్రిలో మృతి చెందగా.. మృతుల సంఖ్య ఆరుకు చేరినట్లు వెల్లడించారు. మృతుల్లో సుఫియా(12), ఇల్యాస్(16), టబ్రేజ్(16), అష్రఫ్ అలీ(30)లుగా గుర్తించారు. పలువురు గ్రామస్థులకు సైతం కరెంట్ షాక్ తగిలినట్లు చెప్పారు. ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం.. ‘ఆప్’ మంత్రి రాజీనామా -
ఘోర ప్రమాదం
సాక్షి, పుట్టపర్తి, అమరావతి/తాడిమర్రి/సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూలీలు ప్రయాణిస్తున్న ఆటోపై విద్యుత్ తీగలు తెగి పడటంతో మంటలు చెలరేగి ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం 7.30 గంటలకు ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికులు, కూలీలు తెలిపిన వివరాల మేరకు.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన గుండ్లమడుగు మెకానిక్ రాజా ఇటీవల 2 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. కలుపు తొలగించేందుకు ఇతని భార్య కుమారి (28).. గుడ్డంపల్లికి చెందిన మరో 11 మంది కూలీలను తీసుకుని కునుకుంట్ల గ్రామానికి చెందిన పోతులయ్య ఆటోలో పొలానికి బయలుదేరింది. మొత్తం 13 మందితో వెళ్తున్న ఆటో చిల్లకొండయ్యపల్లి సమీపంలోకి రాగానే 11 కేవీ విద్యుత్ తీగ ఉన్నట్లుండి తెగి ఆటోపై పడింది. దీంతో ఆటోకు విద్యుత్ ప్రవహించి మంటలు చెలరేగాయి. దీంతో గుండ్లమడుగు కుమారితో పాటు కొంకా మల్లికార్జున భార్య రామలక్ష్మి (30), కొంకా చిన్న మల్లన్న భార్య పెద్ద కాంతమ్మ (45), కొంకా కిష్టయ్య భార్య రత్నమ్మ (40) కొంకా ఈశ్వరయ్య భార్య లక్ష్మీదేవి (41) సజీవ దహనమయ్యారు. కొంకా మంజునాథ్ భార్య గాయత్రికి తీవ్ర గాయాలు కాగా, కొంకా మధుసూదన్ భార్య అరుణ, కొంకా పెద్దన్న భార్య నాగేశ్వరమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ పోతులయ్యతో పాటు కొంకా ఈశ్వరమ్మ, శివరత్నమ్మ, రమాదేవి, ఎ.రత్నమ్మలు ఆటోలోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తీవ్రంగా గాయపడిన గాయత్రిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. మృతుల్లో కుమారి పెద్ద కోట్ల గ్రామానికి చెందగా.. మిగతా నలుగురు గుడ్డంపల్లి వాసులు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అధికారులను అప్రమత్తం చేసి.. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొంప ముంచిన ఉడుత స్థంభంపై ఇనుప రాడ్డుకు, విద్యుత్ వైరు తగలకుండా మధ్యలో పింగాణీ పరికరాన్ని అమర్చుతారు. కానీ ఉడుత పొడవు ఆ పరికరాన్ని దాటి ఉండటంతో వైరును తాకింది. విద్యుత్ తీగకు స్తంభంపై ఉన్న ఇనుప రాడ్డుకి మధ్య ఉడుత పడటంతో దాని శరీరం గుండా విద్యుత్ ప్రవహించింది. ఆ వెంటనే షార్ట్ సర్క్యూట్, ఎర్త్ కారణంగా స్పార్క్ ఏర్పడి వైరు తెగిపోయింది. అప్పుడే అటుగా వచ్చిన ఆటోపై ఆ వైరు పడింది. అయినప్పటికీ ఆటోకి ఉండే టైర్లు ఎర్త్ అవ్వకుండా అడ్డుకోగలవు. కానీ ఆటోపై ఇనుప మంచం ఉంది. అదీగాక ఆ కంగారులో ఆటోలో ఉన్నవారెవరో కిందకు దిగే ప్రయత్నం చేశారు. వారు ఒక కాలు నేలపై, మరోకాలు ఆటోలో ఉంచడం వల్ల ఎర్త్ అయ్యి ఆటోకి వేల వాట్ల హై టెన్షన్ విద్యుత్ ప్రసరించి క్షణాల్లో కాలి బుగ్గయ్యింది. కాగా, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ హరినాథరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాఖ పరమైన విచారణకు ఆదేశించామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు (సీఎం ప్రకటించిన పరిహారం కాకుండా), తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల తక్షణ సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. ఇటీవలే కొత్త లైన్లు వేశాం కరెంటు పోళ్లు గానీ, వైర్ల విషయంలో గానీ ఎక్కడా లోపం లేదని, ఆరుమాసాల కిందటే కొత్త ఫీడర్లు వేశామని విద్యుత్ శాఖ అనంతపురం ఎస్ఈ నాగరాజు తెలిపారు. విద్యుత్ సరఫరా నిర్వహణలో లోపంగానీ, సాంకేతిక సమస్యలు గానీ ఎక్కడా లేవన్నారు. ఈ ఘటనపై విచారణాధికారిగా ఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ రషీద్‌ను నియమించారు. ఆయన శుక్రవారం ఘటన స్థలికి చేరుకుని పరిశీలించనున్నారు. ఉడుతలతో ప్రమాదం విద్యుత్ తీగలపై ఉడుతలు, తొండలు, పాములు, పక్షులు వంటివి పడటం సాధారణంగా తరచూ జరుగుతుంటుంది. పవర్ గ్రిడ్లలో వీటివల్ల అనేక సార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంటుంది. ప్లాస్టిక్ యానిమల్ గార్డ్లను దాటేసి, చిన్న సందు దొరికితే చాలు సబ్‌స్టేషన్‌లోకి ఇవి దూరిపోతుంటాయి. ఇవి మోషన్ డిటెక్టర్లను దాటి కంచెల కింద సొరంగం కూడా చేయగలవు. టన్నెలింగ్, ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ ద్వారా కొరకడం, నమలడం, వేర్వేరు విద్యుత్ పొటెన్షియల్స్లో ఉన్న రెండు కండక్టర్లపై ఏకకాలంలో పడటం ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా షార్ట్ సర్క్యూట్ జరిగి తీగలు తెగిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఏకకాలంలో జరుగుతుంది. ఇంటర్నెట్, మౌలిక సదుపాయాలు వంటి సేవలకు ఉడుతల వల్ల కలిగే ముప్పు సైబర్, ఉగ్ర దాడుల వల్ల కలిగే ముప్పు కంటే ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ భద్రత సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఉడుతలు అనేక దేశాల్లో పవర్ గ్రిడ్లను నిర్వీర్యం చేయగలవని రుజువైంది. గవర్నర్, సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చిల్లకొండయ్యపల్లిలో జరిగిన ప్రమాదంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారిస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. సీఎంఓ ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. -
పందుల ఉచ్చు.. ప్రాణం తీసింది
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్ (వరంగల్): అడవి పందుల నుంచి మొక్కజొన్న చేనును రక్షించుకునేందుకు విద్యుత్ తీగతో అమర్చిన కంచె ఓ రైతు ప్రాణం తీయడంతో పాటు మూడు మేకల మృతికి కారణమైంది. ఈ సంఘటన మండల పరిధి ఛాగల్లు శివారు కమ్మరిపేటలో గురువారం చోటుచేసుకుంది. కమ్మరిపేటకు చెందిన పెసరు సోమయ్య(50) చిన్నాన్న పెసరు మల్లయ్య.. గ్రామానికి చెందిన శ్యామ్‌సుందర్‌రెడ్డి వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. మొక్కజొన్న పంట సాగుచేస్తున్న మల్లయ్య అడవి పందుల సమస్య నివారణకు చేనుచుట్టూ విద్యుత్ తీగను ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం సాయంత్రం మేకలను తోలుకుని అటువైపు వచ్చిన పెసరు సోమయ్య చేను పక్కన ఉన్న విద్యుత్ తీగ కాలికి తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే మూడు మేకలు సైతం విద్యుదాఘాతంతో మృతిచెందాయి. ఎస్సై రమేష్‌నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సోమలక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
భర్తతో అభిప్రాయ భేదాలు.. బట్టలు ఆరేస్తుండగా..
సాక్షి, చెన్నై(తమిళనాడు): కృష్ణగిరిలో ఆదివారం ఇంటి డాబా మీద బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విగత జీవులయ్యారు. కృష్ణగిరి జిల్లా ఊత్తంకరై శింగారపేట అంబేడ్కర్ నగర్‌కు చెంది న పిచ్చుమణి, ఇందిరా దంపతులకు మహాలక్ష్మి(25) కుమార్తె. భర్త శివతో అభిప్రాయ భేదాల కారణంగా కుమార్తె అవంతిక(03)తో కలిసి తల్లిదండ్రుల ఇంట్లో మహాలక్ష్మి ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం మనవరాలిని చంకలో వేసుకుని డాబా మీద బట్టలు ఆరవేయడానికి ఇందిరా వెళ్లింది. ఈ సమయంలో తడిసిన బట్టలు ఇంటికి సమీపంలోని విద్యుత్ తీగల మీద పడ్డాయి. దీంతో వారిద్దరూ కరెంట్ షాక్‌కు గురయ్యారు. గుర్తించిన మహాలక్ష్మి తన బిడ్డ, తల్లిని రక్షించే క్రమంలో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. ముగ్గురు ఘటనా స్థలంలోనే మరణించారు. ఇంటి డాబా మీద ఇందిరా, మహాలక్ష్మి, అవంతిక పడి ఉండడాన్ని పక్కింటి వారు గుర్తించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విద్యుత్ సరఫరాను ఆ పరిసరాల్లో నిలిపి వేశారు. సింగారపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుదుకోట్టైలో.. పుదుకోట్టై జిల్లా ఆలంకుడి మరమాడి గ్రామానికి చెందిన మది అళగన్ భార్య తమిళ్ సెల్వి ఉదయాన్నే తమ పంట పొలం వైపుగా వెళ్లింది. అయితే, అక్కడ విద్యుత్ తీగలు తెగి పడి ఉండడాన్ని ఆమె గుర్తించ లేదు. విద్యుదాఘాతానికి గురై ఆమె మరణించింది. -
విద్యుత్ తీగ తెగి పడి.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
నెల్లూరు రూరల్: విద్యుత్ లైన్ తీగ తెగి పడటంతో ఓ కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడిన విషాద ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, రూరల్ పోలీసుల కథనం మేరకు... ఎంఐబీ– 207 ఇంటిలో గోవిందు వేణుగోపాల్ (54) కుటుంబం నివసిస్తోంది. ఆయన సైదాపురం మండలం కలిచేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కొరియర్ రావడంతో కవర్‌ను అందుకుని డబ్బులు ఇచ్చే సమయంలో పైనున్న విద్యుత్ లైను తీగ తెగి కొరియర్ బాయ్ టోపీపై పడింది. అతను త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగా ఆ తీగ వేణుగోపాల్‌పై పడింది. ఆయన అరుపులకు ఇంటి నుంచి బయటకు వచ్చిన భార్య లత (45) భర్తను కాపాడే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. వేణుగోపాల్ తల్లి బుజ్జమ్మ (71) కూడా బయటకు రాగా ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురికావడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వేణుగోపాల్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడుకి ఇటీవలే బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. కుమార్తె డిప్లొమా పరీక్షలు రాయడానికి అనంతపురం వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చదువుకుంటానని మేడపైకి వెళ్లి..
సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : రోజూ మాదిరిగానే మేడ మీదకు చదువుకుందామని వెళ్లిన విద్యార్థి విద్యుత్ షాక్ గురై మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ‘ నాయనా.. నువ్వెంతో ప్రయోజకుడవుతావని, ఎన్నో కలలు కన్నాం.. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు పోయావా’ అంటూ.. వీరు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ విషాద సంఘటన గురువారం కొత్తూరులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... కొత్తూరు గ్రామానికి చెందిన సారిపల్లి రామకృష్ణ, లక్ష్మి దంపతుల మొదటి సంతానం భార్గవ్(14) కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ తన ఇంటి శ్లాబ్‌పై అందరి పిల్లలతో కలిసి చదువుకుంటుంటాడు. అదే మాదిరిగా గురువారం రాత్రి వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ బల్బుకు విద్యుత్ తీగతో కనెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా షాక్‌కు గురయ్యాడు. ఒక్కసారిగా కిందపడి అపస్మారక స్థితి చేరుకున్న అతడిని స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానిక సీహెచ్‌సీలో చేర్పించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడ వైద్యం అందించేసరికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించిన వీరిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. సమాచారం మేరకు సీఐ ఎల్ సన్యాసినాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. -
విద్యుత్ షాక్‌తో.. కాటేస్తున్న కంచె!
పంట పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి ఒకరు, పశువులను కాసేందుకు వెళ్లి మరొకరు, పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లి ఇంకొకరు.. ఇలా ఎంతో మంది అమాయకులు పొలాల వద్ద విద్యుత్ షాక్‌తో మృతిచెందుతున్నారు. కొంతమంది రైతులు అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చేను చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఇది తెలియని పక్కరైతులు కంచెకు తగిలి ప్రాణాలు విడుస్తున్నారు. పొలాల వద్ద కరెంట్ షాక్ ఏర్పాటు చేయడం వలన కలిగే నష్టంపై సంబంధిత శాఖల అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయకపోతే మరికొంత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. సాక్షి, వికారాబాద్: అడవి పందుల నుంచి పంట రక్షణకు ఏర్పాటు చేస్తున్న విద్యుత్ తీగలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కంటికి కనిపించనంత సన్నని వైర్లను పంట పొలాల చుట్టూ ఏర్పాటు చేసి వీటికి కరెంట్ షాక్ పెడుతున్నారు. ఈ తీగలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఓవైపు విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, మరో వైపు కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో పొలాలకు ఇష్టానుసారంగా విద్యుత్ షాక్‌లు పెడుతున్నారు. దీంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా 42 మంది విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. వీరిలో 30 మంది రైతులే ఉండటం గమనార్హం. విద్యుత్ స్తంభాలు పాతడంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా కొంతమంది రైతులు మరణిస్తే.. పొలాల చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ షాక్ బారిన పడి ఎక్కువ శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. పంట పొలాల రక్షణకు విద్యుత్ తీగలు వేయడమే పరిష్కారమా..? అనే విషయాన్ని రైతులు గమనించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో పంట పొలాల చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేయరాదనే విషయాన్ని సంబంధిత అధికారులు హెచ్చరించకపోతే ఇలాంటి దుర్ఘటనలు ఇలాగే కొనసాగే ప్రమాదముంది. ఇటీవల జరిగిన సంఘటనలు.. ఐదు నెలల క్రితం ధారూరు మండల పరిధిలోని కొండాపూర్కుర్దు గ్రామానికి చెందిన అల్లాడి సుధాకర్‌రెడ్డి అతని భార్య ఇందు పంట పొలానికి పురుగుల మందు పిచికారీ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు మృతిచెందారు. పాత విద్యుత్ వైర్లను తొలగించి కొత్త వైర్లు బిగించిన విద్యుత్ సిబ్బంది పాతవైరును తొలగించకుండా వదిలేశారు. ఎర్త్ కోసం ఏర్పాటు చేసిన మరోవైరు వేలాడుతూ ఈ వైర్లకు తాకడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కూలీకోసం వెళ్లిన ఓ మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండలం గుండేపల్లిలో గత శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అంజిలమ్మ ఇదే ఊరికి చెందిన మరో రైతు పొలానికి కూలీ పనికి వెళ్లింది. రైతు తన జొన్న పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను తగిలిన ఆమె ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. బొంరాస్‌పేట మండల కేంద్రంలో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్ గురై చనిపోయిన సంఘటన ఈ నెల 23న చోటు చేసుకుంది. వ్యవసాయ పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెను గమనించకుండా వెళ్లిన శివకుమార్, నర్సింలు షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. యాలాల మండలం దౌల్తాపూర్ అనుబంధ గ్రామమైన గిరిజాపూర్‌లో శ్రీశైలం అనే రైతు తన పంట పొలానికి విద్యుత్ సరఫరా సరిచేసుకునే క్రమంలో కరెంట్ షాక్‌కు గురై చనిపోయాడు. ఆరు నెలల క్రితం తాండూరు మండలానికి చెందిన ఓ యువకుడు విద్యుత్ తీగలు రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించి పిల్లలు పట్టుకుంటే ప్రమాదమని ఆ తీగలను పక్కకు వేసే ప్రయత్నం చేశాడు. తీగలకు సరఫరా ఉండటంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో రెండు చేతులు, రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. గత వారం రోజుల క్రితం మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లిలో మాన్య అనే వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు. ఇదే గ్రామనికి చెందిన ఓ రైతు పంట పొలానికి వేసి విద్యుత్ వైర్లు తగలడంతో మృత్యువాత పడ్డాడు. -
షాకిస్తున్న నిర్లక్ష్యం
వెలుగులు పంచాల్సిన విద్యుత్ స్తంభాలు..తీగలు కొందరి బతుకు లను విషాదంలోకి నెడుతు న్నాయి. తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలకు పలువురు మృత్యువాత పడుతున్నారు. గత మూడు నెలల్లో ఒక్క రాయచోటి డివిజన్ పరిధిలోనే ఎనిమిది ప్రమా దాలు జరిగాయి. తొమ్మిది మంది ప్రాణాలను కోల్పోయారు. విద్యు దాఘాతం సంఘటనల వెనుక విద్యుత్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సకాలంలో స్పందించ డంలో అలసత్వం ప్రదర్శించుతుండ టంతో ప్రమాదాల సంఖ్య పెరుగు తోంది. గత ఐదేళ్లలో సుమారు 200 మంది విద్యుత్ ప్రమాదాల్లో చనిపోవడమే ఇందుకు తార్కాణం. కడప అగ్రికల్చర్/రాయచోటి : విద్యుత్ సరఫరా నిర్వహణ తీరు అధ్వానంగా తయారైంది. ఇది ప్రమాదాలకు దారితీస్తోంది. విద్యుత్‌శాఖ అధికారుల..సిబ్బంది ముందుచూపుతో స్పందించకపోవడం వల్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. జిల్లాలో తరచూ విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. గ్రామీణప్రాంతాల్లో వాలిపోయిన స్తంభాలు...దిగువకు వేలాడుతున్న తీగలు, ఎర్త్లేని ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. సకాలంలో సరైన ప్రణాళికలు తయారు చేయకపోవడం, కాంట్రాక్టర్లు పనులు చేసే సమయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని నిబంధనలుపాటించకుండా నల్లరేగడి, ఒండ్రుమట్టి, ఇసుక నేలల్లో విద్యుత్ స్తంబాలు పాతడంతో అవి కొద్దికాలానికే ఒరిగిపోయాయి. వాటిని వెంటనే సరిచేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేలాడుతున్న తీగలను కనీసం సరిచేయాలనే స్పృహ లోపిస్తోంది. అవి కొందరి పాలిట యమపాశాలవుతున్నాయి. ప్రమాదం జరిగినా వెంటనే స్పందించడం లేదు. కడప, రాయచోటి, పులివెందుల, మైదుకూరు, యర్రగుంట్ల, కమలాపురం డివిజన్ల పరిధిల్లోని మండలాల్లో విద్యుత్ స్తంబాలు ఒరిగిపోయి కనిపిస్తున్నాయి. తరచూ మూగజీవాలు విద్యుదాఘానికి బలవుతున్నాయి. మనుషులు కూడా మత్యువాత పడుతున్నారు. రాత్రిపూట గాలులకు విద్యుత్ తీగలు చెట్లను తాకుతూ ప్రమాద సంకేతాలు పంపుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. వాలిన విద్యుత్ స్తంబాలు....నేలను తాకుతున్న తీగలు.. గ్రామీణ ప్రాంతాల్లో 8,9,11,12 మీటర్ల పొడవున్న స్తంభాలను ఏర్పాటు చేశారు. వాస్తవానికి స్తంభానికి ..స్తంభానికి మధ్య 45–60 మీటర్ల దూరం ఎడం ఉండాలి. కానీ 60 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో గుంతలు తీసి స్తంభాలను ఏర్పాటుచేస్తున్నారు. దీనివల్ల స్తంబాలు వాలిపోయి, తీగలు వేలాడుతున్నాయి. స్తంభాలను పాతే సమయంలో ప్రమాణాలు పాటించడంలేదనే విమర్శలున్నాయి. నల్లరేగడి, ఇసుక, బంకమట్టి నేలల్లో గుంతలు తీసి కంకర, సిమెంటు, ఇసుక కలిపిన కాంక్రీటు వాడకుండా నేరుగా స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యలో గుండు రాళ్లు వేసి మట్టి కప్పుతుండడం ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. దీంతో చిన్నపాటి గాలి, వర్షాలకే తీగలు తెగి పడిపోతున్నాయి. తప్పని ప్రమాదాలు.. విద్యుత్ సరఫరాలో అంతరాయం, అడ్డంకులు రానివ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కొన్నిచోట్ల బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడంలేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పలువురు ప్రాణాలను కోల్పోతున్నారు. మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. దెబ్బతిన్న స్తంబాలను, లైన్లను గుర్తించి ప్రణాళికబద్దంగా వ్యవహరించకపోవడంతో అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతినెల రెండో శనివారం, ఆదివారం సబ్స్టేషన్ల పరిధిలో మరమ్మతులు చేస్తున్నామని అ«ధికారులు చెబుతున్నా... అవన్నీ తూతూ మంత్రంగానే జరుగుతున్నాయి. నగరం, మున్సిపాలిటీల్లో కొంతమేరైనా స్పందిస్తున్నా మండల, గ్రామీణ ప్రాంతాల్లో మరమ్మతులు సక్రమంగా చేపట్టడం లేదు. కడప నగరంలోనూ, ప్రొద్దుటూరు, రాయచోటి తదితర పట్టణాల్లో అక్కడక్కడ ట్రాన్స్పార్మర్ల వద్ద రాత్రి పూట నిప్పు రవ్వలు వెదజల్లుతున్న పట్టించుకునే వారు కరువయ్యారు. ఐదేళ్లలో 200 ప్రాణాలు గాలిలో ఐదేళ్లలో 50 మంది విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. వాస్తవానికి రికార్డులకు ఎక్కని సంఘటనలు ఎన్నో ఉంటున్నాయి. నాలుగేళ్ల కిందట సుండుపల్లి మండల పరిధిలో మామిడి తోటలో విద్యుత్తు ప్రమాదానికి గురై నలుగురు చనిపోయారు. వారి వివరాలు లేవు. 2013–14లో విద్యుదాఘాతానికి ఎనిమిమంది, 2014–15లో 9 మంది, 2015–16లో ముగ్గురు.. ..2016–17లో ఒకరు చనిపోయారు. 8 పశువులు మత్యువాతపడ్డాయి. 2017–18లో 18 మంది, ఈఏడాది ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. విద్యుత్‌శాఖ తప్పిదముంటే రూ.5 లక్షలు, పశువులకు మార్కెట్ ధరను బట్టి లెక్కకట్టి పరిహారం అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.స్టార్టర్ లేదా. మోటారు వల్లగాని ప్రమాదం సంభవిస్తే పరిహారం రాదని చెబుతున్నారు. అధికారుల తప్పిదాలను మాత్రం బయటపెట్టక పోవడం గమనార్హం. పాడెగేదె మృతితో ఉపాధి కోల్పోయాం నాకు ఇద్దరు కుమారులు..ఒక పాడిగేదెపై ఆధారపడి బతుకుతున్నాం. మా ఇంటి దగ్గరలో ఒక విద్యుత్ స్తంభముంది. ఏం జరిగిందో తెలియదు గాని గతనెల 27వ తేదీన ఆ స్తంభం నుంచి విద్యుత్ సరఫరా అయింది. అదే సమయంలో మాగేదె దానిని తాకింది. అంతే వెంటనే ప్రాణాలు కోల్పోయింది. మాకు ఉపాధి దూరమైంది. విద్యుత్ శాఖ అధికారులు ఆదుకోవాలని కోరుతున్నాం. ఇలాంటివి జరగకుండా చూడాలి. – జింకల మాభి, రామచంద్రాపురం, కడప తప్పక చర్యలు తీసుకుంటాం... ఎక్కడెక్కడ సమస్యలున్నాయో సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. ఆయా డివిజన్, సబ్ డివిజన్ అధికారులతో చర్చిస్తాం. సమీక్ష సమావేశాలు నిర్వహించి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. దురదృçష్టవశాత్తూ ప్రమాదాలు జరగడం బాధాకరం. మా శాఖ తప్పిదం ఉంటే తప్పని సరిగా బాధ్యత వహిస్తాం. –శ్రీనివాసులు, సూపరింటెండెంట్ ఇంజనీరు, జిల్లా విద్యుత్‌శాఖ -
పుట్టిన రోజు వేడుకలు చేసుకోకుండానే..
పొద్దు పొడిస్తే ఆ విద్యార్థినిది పుట్టిన రోజు. బడి నుంచి ఇంటికొచ్చేటప్పుడు రేపు చాక్లెట్లు పంచుతానని స్నేహితులందరికీ చెప్పి గంతులేసింది. పుస్తకాల సంచి అలా పడేసి, మిద్దెపై ఆరేసిన బొంతలు తెచ్చుకునేందుకు గబగబా మెట్లెక్కింది. మాయదారి కరెంట్ మిద్దెపై మాటు వేసి ఉంది. బొంత పట్టుకోగానే ఎక్కడికి వెళ్తావన్నట్లు తననూ కరెంట్ పట్టేసింది. విడిపించుకునేందుకు యత్నించి ఓడిపోయింది. సాక్షి, పాణ్యం(కర్నూలు) : మండల పరిధిలోని తమ్మరాజుపల్లె గ్రామంలో విద్యుదాఘాతంతో శుక్రవారం ఓ విద్యార్థిని మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మద్దమ్మ, అచ్చెన్న పెద్ద కుమార్తె ఉమాదేవి(22) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు తల్లిదండ్రులతో కొత్త దుస్తులు, చాక్లెట్లు కొనిపించుకొని సిద్ధం చేసుకుంది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం బడి నుంచి వచ్చిన విద్యార్థిని పుస్తకాల సంచి ఇంట్లో పెట్టి మిద్దెపైనున్న బొంతలు తీసుకొచ్చేందుకు వెళ్లింది. మెయిన్ లైన్ నుంచి ఇంట్లోకి తీసుకున్న విద్యుత్ తీగకు సపోర్ట్‌గా పెట్టిన ఇనుప రాడ్‌ను తాకింది. దానికి విద్యుత్ ప్రవహించడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్ప కూలింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆటోలో నంద్యాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అప్పటిదాక ఆడిపాడిన ఉమాదేవి ఇక లేదనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, తోటి స్నేహితులు మృతదేహం వద్ద విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. పైరుకు నీరు పెట్టేందుకు వెళ్లి కౌలు రైతు మృతి సి.బెళగల్ : మండలంలోని పోలకల్ గ్రామానికి చెందిన కౌలు రైతు బోయ బండమీది నడిపి సోమన్న (43) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన రైతు నడిపి సోమన్న తనకున్న రెండు ఎకరాల పొలంతోపాటు, మరో ఎనిమిది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఉల్లి సాగు చేసుకుంటున్నాడు. శుక్రవారం ఉల్లినాటు వేసేందుకు కూలీలతో పొలానికి వెళ్లాడు. పైరుకు నీరు పెట్టేందుకని బావిలో నీటిమట్టం చూస్తూ మోటర్‌ను తాకగానే విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. ఆ వెంటనే విద్యుత్ తీగ రైతుమీద పడటంతో గిలగిలా కొట్టుకుంటూ అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన కుటుంబ సభ్యులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
గుర్రంపై స్వారీ.. అంతలోనే షాక్..!
సాక్షి, నారాయణఖేడ్: చిగురు పండుగ విందులో పాల్గొనేందుకు గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తున్న రౌతు మార్గమధ్యంలో విద్యుత్ షాక్ తగిలి మరణించాడు. సోదరి ఇంట విందు కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షాక్ కొట్టడంతో యజమాని(రౌతు) సహా గుర్రం మృతి చెందింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరా శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని ఎక్కువ శాతం తండాల్లో ప్రతి ఏటా జూలైలో గిరిజనులు చిగురు పండుగ నిర్వహిస్తారు. భీంరా పార్తు తండాకు చెందిన రాథోడ్ వెంకట్(45) చింతమణి తండాలో తన సోదరి ఇంట ఏర్పాటు చేసిన చిగురు పండుగ విందు కోసం గుర్రంపై బయల్దేరాడు. భీంరా శివారులోకి చేరుకోగానే గుర్రం కాళ్ల చప్పుడుకు పంటల రక్షణ కోసం అడవి పందుల బెడదను కాపాడేందుకు ఉంచిన కుక్కలు అరిచాయి. కుక్కల అరుపులకు గుర్రం బెదిరిపోయింది. పక్కనే ఉన్న పంట చేలోకి పరుగులు పెట్టింది. ఈ క్రమంలో పొలంలో వేళాడుతున్న త్రీఫేజ్ విద్యుత్ తీగలు గుర్రం మెడకు తగిలాయి. క్షణంలో విద్యుత్ షాక్ తగలడంతో వెంకట్, అతను స్వారీ చేస్తున్న గుర్రం అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. పొలం యజమాని పంట కాపలా కోసం వెళ్లి చూసి వెంకట్ మృతి చెందిన విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతుడు వెంకట్ భార్య వాలబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మండలంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడ శుభకార్యాలు ఉన్నా, ప్రముఖ రాజకీయ నాయకుల సమావేశాలు ఉన్నా గుర్రంతో మృతుడు వెంకట్‌నాయక్ అందరిని ఉత్సాహపరిచేవాడు. అదే గుర్రంపై స్వారీ చేస్తూ విద్యుత్ షాక్ తగిలి మరణించడంతో పార్తు తండాలో విషాదం నెలకొంది. మృతుడు వెంకట్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. -
కరెంటు తీగలు మెడకు చుట్టుకుని..
సాక్షి, రామకుప్పం(చిత్తూరు) : విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీ కొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన రామకుప్పం మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు... రామకుప్పం మండలంలోని అయ్యప్పగానిపల్లెకు చెందిన సుధాకర్ (22) మామిడి కాయలను దించే పని నిమిత్తం బగలనత్తం సమీపంలోని మామిడి తోటకు వెళ్లాడు. మామిడికాయలను లారీలో లోడ్ చేశారు. అనంతరం మామిడి కాయల లారీలోనే బగలనత్తం నుంచి కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురానికి బయలు దేరాడు. బగలనత్తం సమీపంలో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఆ సమయంలో విద్యుత్ తీగలు సుధాకర్ మెడకు చుట్టుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. -
సొంతింటిలో చేరకుండానే...
సాక్షి, ఆదోని(కర్నూలు) : సొంతింటితో చేరకుండానే ఓ ఉద్యోగిని మృత్యువు కబళించింది. గృహం నిర్మించుకొని ప్రవేశ పూజల్లో నిమగ్నమై ఉన్న అతన్ని విద్యుదాఘాతం రూపంలో అనంతలోకాలకు తీసుకెళ్లింది. ఆదోనిలో శనివారం చోటుచేసుకున్న ఘటన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా ఐజ మండలం సింధనూరు గ్రామానికి చెందిన రవీంద్రబాబు(55) పత్తికొండ సబ్‌జైల్ హెడ్‌గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదోని సబ్‌జైల్ గార్డుగా పనిచేస్తూ ఏడాది క్రితం హెడ్‌గార్డుగా పదోన్నతిపై పత్తికొండ సబ్‌జైలుకు వెళ్లాడు. అయితే ఆదోని నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. భార్య అర్లమ్మ ఆలూరు ప్రభుత్వ బాలికల హైస్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో మంచి ఇల్లు నిర్మించుకోవాలని కలలుగన్నారు. అందులో భాగంగా దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేసి ఆర్టీసీ కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాడు. ఆదివారం గృహ ప్రవేశం ఉండటంతో బంధువులందరికీ కబురంపాడు. పూజల్లో భాగంగా శనివారం పండితులతో హోమం తలపెట్టాడు. హోమంలో కూర్చున్న రవీంద్రబాబు విద్యుత్ తీగ రూపంలో మృత్యువు వెంటాడింది. ఇంటి పెరట్లోని మోటార్‌కు సంబంధించిన వైరు అడ్డుగా ఉందన్న కారణంతో పూజలో నుంచి బయటకు వచ్చి వైరు చుట్టగా చుట్టి గోడపై పెట్టే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కుప్ప కూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శుభ కార్యం జరగాల్సిన చోట రోదనలు.. గృహప్రవేశం పిలుపుతో పలువురు దగ్గరి బంధులు రావడంతో అప్పటి వరకు సందడిగా ఉండేది. కాగా ఇంటి యజమనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని సొంతగ్రామం సింధనూరుకు తీసుకెళ్లడంతో శుభ కార్యం జరగాల్సిన ఇల్లు ఒక్కసారిగా బోసిపోయింది. -
చార్జీంగ్.. హెడ్సెట్లో పాటలు.. షాక్
చండీగడ్ : మొబైల్ ఫోన్‌కు చార్జీంగ్ పెట్టి, హెడ్ సెట్లో పాటలు వింటున్న యువకుడు షాక్ కొట్టి చనిపోయాడు. ఈ సంఘటన బుధవారం హర్యానా రాష్ట్రంలోని యముననగర్ జిల్లా పాండ్యో గ్రామంలో చోటు చేసుకుంది. తాత్‌సింగ్ (22) అనే యువకుడు తన ఇంట్లో ఫోన్‌కు చార్జీంగ్ పెట్టి అలానే హెడ్‌ఫోన్ పెట్టుకుని పాటలు వింటున్నాడు. ఆ సమయంలో ఇంట్లో విద్యుత్ సరఫరా లేదు. కరెంటు వచ్చే సమయానికి చార్జీంగ్ కేబుల్ అలానే ఉండడంతో తాత్‌సింగ్ కరెంటు షాక్‌కు గురైయ్యాడు. దాంతో ఇంట్లో వాళ్లు అతడ్ని యముననగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు. -
రఘునాథపాలెంలో విషాదం
ఖమ్మం జిల్లా: ఖమ్మం అర్బన్ మండలం రఘునాథపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఇద్దరు బలయ్యారు. రఘునాదపాలెంకు చెందిన బానోత్ శంకర్(45), అతని కుమారుడు వెంకటేష్(19)లు 11కేవీ వైర్లు తగిలి మృతిచెందారు. వివరాలు..రఘునాథపాలెంకు చెందిన వీరికి సొంత ట్రాక్టర్ ఉంది. తండ్రీ కుమారులు ఈరోజు(సోమవారం) మధ్యాహ్నా సమయంలో రఘునాథపాలెంలోని గణేష్ టౌన్షిప్ పక్కన ఉన్న ఓ రైతు వ్యవసాయ భూమిని కిరాయికి దున్నేందుకు వెళ్లారు. ఆ భూమిలో 3 రోజులక్రితం 11కేవీ వైరు తెగిపడి ఉన్నట్లు గమనించి, విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బంది ఆ వైరుకు కరెంట్ సరఫరా కావడం లేదు అని చెప్పటంతో వెంకటేష్ ఆ వైరుకు పక్కకు వేద్దామని పట్టుకున్నాడు. దాంట్లో కరెంటు సరఫరా జరుగుతున్న విషయం తెలియక విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. తన కుమారుడికి ఏదో జరిగిందని 11 కేవీ వైరు దగ్గరకు వెళ్లి పట్టుకోగా తండ్రి కూడా మృత్యువాత పడ్డాడు. ఈ విషాద సంఘటనతో రఘునాధపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే రెండు నిండు జీవితాలు బలయ్యాయని గ్రామస్తులు తండ్రీకుమారుల మృతదేహాలను ఖమ్మం కలెక్టరేట్ ముందు పెట్టి నిరసన తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంటు ‘కాటే’స్తోంది!
ప్రమాదాల బారిన రైతన్నలు, మూగజీవాలు పట్టించుకోని ట్రాన్స్‌కో అధికారులు వానకాలంలో మరింత ప్రమాదం జిల్లాలో ఏటా పెరుగుతున్న దుర్ఘటనలు సిద్దిపేట రూరల్: వర్షాకాలంలో ఇళ్లు, పొలాలు, బావుల వద్ద విద్యుత్తు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. జిల్లాలో ఏడాదిన్నరలో విద్యుదాఘాతాలతో రైతులు, సామాన్యులతో పాటు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో తగిన స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. వర్షకాలంలో దాదాపు అన్ని నేలలు తేమతో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్తు సరఫరా, ట్రాన్స్ఫార్మర్లు ఇతర పరికరాల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాప్రాయం తప్పదు. విద్యుత్ విషయంలో అధికారుల తప్పిదంతో కొన్ని సంఘటనలు జరిగితే మరికొన్ని అవగాహన లేకపోవడం వల్ల చేసుకుంటున్నాయి. నష్టపరిహారం కొంతే.. జిల్లాలో 2015 సంవత్సరంలో 123 మంది విద్యుదాఘాతంతో మృతిచెందారు. ఇందులో ఇద్దరు విద్యుత్తు శాఖ ఉద్యోగులు కూడా ఉన్నారు. కాగా, ఇందులో సగానికి పైగా రైతులు ఉన్నారు. అదేవిధంగా 41 పశువులు మృత్యువాత పడ్డాయి. 2016 జూలై 30 వరకు 32 మంది రైతులతో పాటు సామాన్యులు మృతి చెందారు. 70 పశువులు మృత్యువాత పడ్డాయి. వీటిలో గత ఏడాది 47 మందికి ఎక్స్‌గ్రేషియా కింద రూ.2 లక్షల చొప్పున, 35 పశువులకు రూ.20 వేల చొప్పున నష్ట పరిహారం అందించారు. ఈ ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం నస్టపరిహారం పెంచడంతో ఏడుగురికి రూ.4 లక్షల చొప్పున, 32 పశువులకు రూ.40 వేల చొప్పున పరిహారం అందజేశారు. ఇదిలా ఉండగా, జిల్లా వ్యాప్తంగా కరెంట్‌షాక్‌కు ఎక్కువగా రైతులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తున్న అంశం. వారికి ఎలాంటి సూచనలు, సలహాలు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రైతన్న తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలు పెద్దశంకరంపేట మండలం కె.వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎర్ర సాయిలు ట్రాన్స్ఫార్మర్ వద్ద వైర్లు సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మెదక్ మండలం రాజ్‌పల్లిలో బుచ్చ దయాకర్ అనే రైతు పొలం వద్ద విద్యుత్తు తీగలు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కౌడిపల్లి మండలం చిలిప్‌చెడ్ గ్రామ రైతు కలాలి దశరథ్‌గౌడ్ వ్యవసాయ బోరు మోటార్ బాగు చేస్తూ విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. జిన్నారం మండలం జంగంపేటలో గుండా శంకరయ్య రైతుకు చెందిన రెండు పాడి గేదెలు కరెంట్ షాక్‌తో మృత్యువాత పడ్డాయి. శివ్వంపేట మండలం లింగోజి తండాకు చెందిన నెనావత్ బిక్యా కాడెడ్లు మేత మేస్తూ విద్యుత్తు షాక్‌తో మృతి చెందాయి. ఎర్తింగ్ లేకపోవడంతో... విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఎర్తింగ్ లేకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాటిని ఏర్పాటు చేసినప్పుడు కాంట్రాక్టర్లు అవసరమైనంత లోతుగా గుంతలు తీయకపోవడం, నాణ్యమైన పైపులు వేయకపోవడం, ఉప్పు, బొగ్గు లాంటి ముడిపదార్ధాలు సరైన మోతాదులో వేయకపోవడంతో ఎర్తింగ్ వస్తుంటుంది. అంతేకాకుండా నాణ్యత లేకుండా ఎర్తింగ్ చేయడంతో భూమిలో తేమశాతం ఉన్నంత మాత్రమే అది పనిచేస్తుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి రైతులు ఐఎస్ఐ మోటార్లు మాత్రమే వాడాలి మోటార్ పనిచేయకపోతే చేత్తో పట్టుకోకుండా జాగ్రత్త పడాలి టెస్టర్ సహాయంతో మోటార్‌ను పరీక్షించాలి ప్రధానంగా మోటార్లకు కప్పులు ఉంచడం మంచింది ఎర్తింగ్ తప్పనిసరిగా ఉండాలి. మోటార్‌కు మరమ్మతులు చేయాల్సి ఉంటే విద్యుత్ సరఫరా నిలిపివేయాలి ప్యూజ్ బ్యాక్స్‌లు, స్టార్టర్లు అన్ చేసే చోట నీరు, బురద లేకుండా చూసుకోవాలి స్టార్టర్‌ను పంప్‌సెట్ దగ్గరలో పొడిగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలి. స్టార్టర్కు రక్షణ కవచాలు ఉండాలి ట్రాన్స్ఫార్మర్లను రిపేర్ చేయాల్సినప్పడు విద్యుత్తు సిబ్బందికి తెలియజేయాలి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ పోయినప్పడు, తీగలు తెగినప్పడు రిపేర్ల కోసం ఎయిర్ బ్రేక్(ఏబీ) స్విచ్ ద్వారా సరఫరా నిలిపివేయాలి అప్రమత్తంగా ఉండాలి వర్షాకాలంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టార్టర్ డబ్బాలు నాణ్యమైనవి వాడాలి. వాటిని తెరిచే ముందు జాగ్రత్తలు పాటించాలి. రైతులు విద్యుత్తు పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా లైన్మన్లకు సమాచారం ఇవ్వాలి. - పండరి నాయక్, ఏడీఈ, ట్రాన్స్‌కో సిద్దిపేట