
ఊరేగింపులో ఉపయోగించిన బండిలో ఏర్పాటు చేసిన ఇనుప రాడ్ హైఓల్టేజ్ విద్యుత్తు తీగకు తగిలి కరెంట్ సరఫరా..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. ఇనుప రాడ్డు హైటెన్షన్ విద్యుత్తు తీగకు తగిలి కరెంట్ షాక్‌తో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుల్లో ఐదుగురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. జిల్లాలోని మసుపుర్ గ్రామంలో సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్థులు ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపులో ఉపయోగించిన బండిలో ఏర్పాటు చేసిన ఇనుప రాడ్ హైఓల్టేజ్ విద్యుత్తు తీగకు తగిలి కరెంట్ సరఫరా అయినట్లు స్థానికులు తెలిపారు.
కరెంట్ షాక్‌తో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో బాలుడు అరఫాత్(10) ఆసుపత్రిలో మృతి చెందగా.. మృతుల సంఖ్య ఆరుకు చేరినట్లు వెల్లడించారు. మృతుల్లో సుఫియా(12), ఇల్యాస్(16), టబ్రేజ్(16), అష్రఫ్ అలీ(30)లుగా గుర్తించారు. పలువురు గ్రామస్థులకు సైతం కరెంట్ షాక్ తగిలినట్లు చెప్పారు. ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం.. ‘ఆప్’ మంత్రి రాజీనామా