ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
బహ్రెయిచ్‌లో ఉద్రిక్తతలు
సరిహద్దులు మూసివేత, ఇంటర్నెట్ బంద్
బహ్రెయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో ఆదివారం దుర్గామాత విగ్రహం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణలు సోమవారం కూడా కొనసాగాయి. మహారాజ్‌గంజ్ ప్రాంతంలోని మన్సూర్ గ్రామంలో విగ్రహం ఊరేగింపులో డీజే భారీ శబ్ధం విషయమై వివాదం మొదలైంది. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పులు, రాళ్లు రువ్విన ఘటనల్లో 22 ఏళ్ల వ్యక్తి చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు.
సోమవారం కొన్ని చోట్ల అల్లరి మూకలు కర్రలు, రాడ్‌లు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వీధుల్లో గుంపులుగా తిరుగుతూ లక్నో సేవా ఆస్పత్రికి, ఆ సమీపంలోని మెడికల్ స్టోరుకు నిప్పుపెట్టారు. ఆస్పత్రిలోని ఎక్స్‌రే యంత్రాన్ని ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. మరో చోట బైక్ షోరూంను అగ్నికి ఆహుతి చేయడంతో పలు వాహనాలు బూడిదయ్యాయి. పలువురి ఇళ్లకు, దుకాణాలకు నిప్పుపెట్టారు.
‘పరిస్థితిని అదుపులోకి తెచ్చాం. అసాంఘిక శక్తులను గుర్తించాం’అని బహ్రెయిచ్ ఎస్‌పీ వృందా శుక్లా చెప్పారు. ఓ వ్యక్తికి చెందిన దుకాణం/ఇంటి నుంచే ఊరేగింపు పైకి కాల్పులు జరిపినట్లు తేలడంతో అతడిని అరెస్ట్ చేశామన్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. హర్ది పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో సురేశ్ కుమార్ వర్మను, మరో పోలీస్ ఔట్‌పోస్ట్ ఇన్‌చార్జిని అధికారులు సస్పెండ్ చేశారు. మహ్సి ప్రాంతంలో రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను మోహరించారు.
ముందు జాగ్రత్తగా బ హ్రెయిచ్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపి వేయడంతోపాటు బహ్రెయిచ్ జిల్లా సరిహద్దులను అధికారులు మూసివేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు. ఘటన నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో సమావేశ మయ్యారు. ‘మహ్సిలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిని వదిలిపెట్టం. అల్లరి మూకలను గుర్తిస్తాం. నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా కఠిన చర్యలుంటాయి’అని సీఎం చెప్పారు. అదేవిధంగా, విగ్రహాల నిమజ్జన కార్యక్రమం సజావుగా కొనసాగేలా మత సంస్థల పెద్దలతో మాట్లాడాలని అధికారులను ఆదేశించామన్నారు.
అంత్యక్రియల సమయంలో ఉద్రిక్తత
ఆదివారం ఘర్షణల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి సో మవారం అంత్య క్రియ లు జరిగాయి. శ్మశాన వాటికకు వెళ్లే క్రమంలో మహ్సి తహశీల్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచి నిరసనకు దిగారు. అతడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేపట్టేది లేదని భీష్మించారు. అతడి మరణానికి కారణమైన వారిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలని, వారి ఇళ్లను కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి సంజీవ్ , అదనపు డీజీపీ అమితాబ్ యాశ్ అక్కడికి చేరుకున్నారు. అమితాబ్ యాశ్ పిస్టల్ చేతబట్టుకుని పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించడం కనిపించింది. అనంతరం, బాధితుడి అంత్యక్రియలు ముగిశాయి.
ప్రభుత్వంపై మండిపడ్డ ప్రతిపక్షాలు
బహ్రెయిచ్‌లో ఘటనలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం చేతకానితనమే ఘర్షణలకు కారణమని ఆరోపించారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను ఆమె కోరారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే మహ్సిలో గొడవలు జరిగాయని ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment