కౌశాంబి: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో నరమాంస భక్షక తోడేలు ముగ్గురిపై దాడి చేసింది. వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించాక వైద్యులు బాధితులను ఇంటికి పంపించారు. తోడేళ్ల దాడి అనంతరం ఆ ప్రాంతంలోని ఇటుక బట్టీ సమీపంలో మూడు వన్యప్రాణులకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో గ్రామస్తులలో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామస్తులు రాత్రిపూట కర్రలు,రాడ్లతో తమ పశువులను, కుటుంబాలను కాపాడుకుంటున్నారు. గ్రామస్తుల అందించిన సమాచారంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన కరారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెవారి, ఖోజ్వాపూర్ గ్రామాలలో చోటుచేసుకుంది.
బుధవారం సాయంత్రం తమ కుటుంబ సభ్యులు పశువుల మేతను కోసేందుకు పొలాలకు వెళ్లారని నెవారి గ్రామానికి చెందిన రాజ్‌కరణ్‌పాల్ తెలిపారు. ఆసమయంలో తన రెండున్నరేళ్ల మేనల్లుడు ప్రియాంష్ అక్కడ ఆడుకుంటుండగా, ఒక నక్క పొదల్లోంచి బయటికి వచ్చి, ఆ పిల్లాడి మెడను నోట కరుచుకుని పారిపోయే ప్రయత్నం చేసింది. ఆ చిన్నారి ఏడుపు విన్న మహిళలు గట్టిగా కేకలు పెట్టారు. దీంతో తాను, కొంతమంది గొర్రెల కాపరులు పరిగెత్తి ఆ తోడేలు దగ్గరికి వెళ్లగా, అది తమను చూసి పారిపోయిందన్నారు. ఆ తోడేలు అక్కడి నుంచి పరిగెట్టి మేకలు మేపుతున్న రాందాస్ సరోజ అనే మహిళపై దాడి చేసింది. గ్రామస్తులు దానిని తరిమికొట్టడంతో ఆ తోడేలు ఖోజ్వాపూర్ గ్రామం వైపు పరుగు తీసి, అక్కడ సోనుపాల్ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిందని రాజ్‌కరణ్‌పాల్ తెలిపారు.
నెవారి గ్రామానికి చెందిన ధ్యాన్ సింగ్ గత రెండు రోజులుగా తోడేళ్ల గుంపు తమ గ్రామానికి వస్తున్నదని తెలిపారు. ఏ సమయంలోనైనా తోడేళ్ల గుంపు గ్రామంలోకి వచ్చి పిల్లలు, మేకలు, గేదెలపై దాడి చేస్తుందనే భయం తమను వెంటాడుతున్నదన్నారు. రాత్రివేళ పిల్లలను ఇంటి లోపల పడుకోబెట్టి, తాము తోడేళ్ల నుంచి వారిని రక్షించడానికి రాత్రంతా కాపలాగా ఉంటున్నామన్నారు. అటవీశాఖ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో తామే తమ కుటుంబాన్ని, పశువులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment