Maharajganj
-
దుర్గాపూజ సందర్భంగా ఘర్షణలు
బహ్రెయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో ఆదివారం దుర్గామాత విగ్రహం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణలు సోమవారం కూడా కొనసాగాయి. మహారాజ్‌గంజ్ ప్రాంతంలోని మన్సూర్ గ్రామంలో విగ్రహం ఊరేగింపులో డీజే భారీ శబ్ధం విషయమై వివాదం మొదలైంది. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పులు, రాళ్లు రువ్విన ఘటనల్లో 22 ఏళ్ల వ్యక్తి చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. సోమవారం కొన్ని చోట్ల అల్లరి మూకలు కర్రలు, రాడ్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వీధుల్లో గుంపులుగా తిరుగుతూ లక్నో సేవా ఆస్పత్రికి, ఆ సమీపంలోని మెడికల్ స్టోరుకు నిప్పుపెట్టారు. ఆస్పత్రిలోని ఎక్స్‌రే యంత్రాన్ని ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. మరో చోట బైక్ షోరూంను అగ్నికి ఆహుతి చేయడంతో పలు వాహనాలు బూడిదయ్యాయి. పలువురి ఇళ్లకు, దుకాణాలకు నిప్పుపెట్టారు. ‘పరిస్థితిని అదుపులోకి తెచ్చాం. అసాంఘిక శక్తులను గుర్తించాం’అని బహ్రెయిచ్ ఎస్పీ వృందా శుక్లా చెప్పారు. ఓ వ్యక్తికి చెందిన దుకాణం/ఇంటి నుంచే ఊరేగింపు పైకి కాల్పులు జరిపినట్లు తేలడంతో అతడిని అరెస్ట్ చేశామన్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. హర్ది పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో సురేశ్ కుమార్ వర్మను, మరో పోలీస్ ఔట్‌పోస్ట్ ఇన్చార్జిని అధికారులు సస్పెండ్ చేశారు. మహ్సి ప్రాంతంలో రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా బ హ్రెయిచ్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపి వేయడంతోపాటు బహ్రెయిచ్ జిల్లా సరిహద్దులను అధికారులు మూసివేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు. ఘటన నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో సమావేశ మయ్యారు. ‘మహ్సిలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిని వదిలిపెట్టం. అల్లరి మూకలను గుర్తిస్తాం. నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా కఠిన చర్యలుంటాయి’అని సీఎం చెప్పారు. అదేవిధంగా, విగ్రహాల నిమజ్జన కార్యక్రమం సజావుగా కొనసాగేలా మత సంస్థల పెద్దలతో మాట్లాడాలని అధికారులను ఆదేశించామన్నారు.అంత్యక్రియల సమయంలో ఉద్రిక్తతఆదివారం ఘర్షణల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి సో మవారం అంత్య క్రియ లు జరిగాయి. శ్మశాన వాటికకు వెళ్లే క్రమంలో మహ్సి తహశీల్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచి నిరసనకు దిగారు. అతడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేపట్టేది లేదని భీష్మించారు. అతడి మరణానికి కారణమైన వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని, వారి ఇళ్లను కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి సంజీవ్ , అదనపు డీజీపీ అమితాబ్ యాశ్ అక్కడికి చేరుకున్నారు. అమితాబ్ యాశ్ పిస్టల్ చేతబట్టుకుని పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించడం కనిపించింది. అనంతరం, బాధితుడి అంత్యక్రియలు ముగిశాయి.ప్రభుత్వంపై మండిపడ్డ ప్రతిపక్షాలుబహ్రెయిచ్లో ఘటనలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం చేతకానితనమే ఘర్షణలకు కారణమని ఆరోపించారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను ఆమె కోరారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే మహ్సిలో గొడవలు జరిగాయని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
కంగనాపై అసభ్య పోస్ట్.. సుప్రియాకు షాకిచ్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: సినీ నటీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌పై సోషల్ మీడియా వేదికగా చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే భారీ మూల్యం చెల్లించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బుధవారం విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో సుప్రీయా శ్రీనతేకు టికెట్ నిరాకరించింది. 2019లో సుప్రీయా శ్రీనతే ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన విషయం తెలసిందే. అయితే ఈసారి కూడా మహారాజ్‌గంజ్ నుంచి తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తుందని సుప్రియా శ్రీనతే ఆశాభావం వ్యక్తం చేశారు. 2019లో సుప్రియా శ్రీనతేపై బీజేపీ అభ్యర్థి పంకజ్ చౌదరీ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి మహారాజ్‌గంజ్‌లో వీరేంద్ర చౌదరీని బరిలోకి దింపింది. సుప్రియా శ్రీనతే సోషల్ మీడియా ఖాతా నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై వెలువడిన అసభ్యకరమైన విమర్శలు కాస్త వివాదం రేపాయి. అయితే ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి తాను లోక్ ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ పార్టీని కోరినట్లు తెలిపారు. అయితే తన స్థానంలో మరో అభ్యర్థి పేరును సూచించినట్లు సుప్రియా పేర్కొన్నారు. కంగనాపై చేసిన అసభ్యకరమైన పోస్ట్‌పై.. సుప్రియా శ్రీనతే వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు. తన సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డులు పలువురికి తెలుసని తనకు తెలియకుండానే కంగనాపై అసభ్యకరమైన సోస్ట్ వేశారని తెలిపారు. ఈ పోస్ట్ తన దృష్టికి రావటంతో డిలీట్ చేశానని తెలిపారు.‘సుప్రియాపేరడీ’ అనే ‘ఎక్స్’ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారని.. దాని నిర్వాకులు ఎవరో తెలియదన్నారు. తన ‘ఎక్స్’ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. అప్పటికే ఆమె పోస్ట్ వివాదస్పదం కాగా.. బీజేపీ నేతలు ఆమెపై మండిపడ్డారు. ఇలా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతేకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 29 సాయంత్రం 5 గంటలోపు స్పందించాలని కోరింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల కోడ్)ని ఉల్లంఘించినట్లు పోల్ ప్యానెల్ తెలిపింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని ఈసీ ఆదేశించింది. -
మరణించి కూడా ఊరిలో వెలుగులు నింపిన జవాను
మహరాజ్‌గంజ్, యూపీ : పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాను పంకజ్ కుమార్ త్రిపాఠి తాను అస్తమించి కూడా తన ఊరికి వెలుగులు తెప్పించాడు. బతికున్నప్పుడు దేశ సేవ కోసం పని చేసి, మరణించిన తర్వాత కూడా తన ఊరి కష్టాలను తీర్చాడు. ఉత్తర్‌ప్రదేశ్-నేపాల్ సరిహద్దులోని మారుమూల ప్రాంతమైన మహరాజ్‌గంజ్‌లో ప్రభుత్వ సహకారం అంతంతమాత్రంగానే ఉండేది. పంకజ్ కుమార్ ఊరిలో ప్రాథమిక పాఠశాల కూడా ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థలో ఉంది. పాఠశాలనుబాగుచేయాలని ఊరిపెద్దలు ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నారు. పంకజ్ కుమార్ త్రిపాఠి వీరమరణంతో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌తోపాటూ ఉన్నతాధికారులు ఆ ఊరికి రావడంతో, ఒక్కసారిగా ఆ ఊరిపై అధికారుల దృష్టిపడింది. పాఠశాల పునర్నిర్మాణపనులు చకచకా ప్రారంభమయ్యాయి. పాఠశాల పేరును కూడా పంకజ్ త్రిపాఠి పేరుగా మార్చారు. అంతేకాకుండా ఊర్లో అధ్వాహ్నంగా ఉన్న రోడ్లకు సంబంధించి మరమత్తు పనులను పూర్తి చేశారు. ఆదిత్యనాథ్ ఆదివారం పంకజ్‌కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించారు. పంకజ్‌చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ ఊర్లో పరిస్థితులను గమనించిన ఆదిత్యనాథ్ వారికి ప్రభుత్వం తరపున మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీఇచ్చారు. రెండు నెలల 17 రోజుల సెలవు అనంతరం ఫిబ్రవరి 10న పంకజ్ కుమార్ త్రిపాఠి తిరిగి ఉద్యోగంలో చేరారు. పంకజ్ కుమార్, భార్య రోహిణి గర్భిణి. మరికొన్ని రోజుల్లో రాబోయే తమ రెండో సంతానం కోసం వీరిద్దరూ ఎన్నో కలలు కన్నారు. బిడ్డపుట్టగానే ఊర్లో అందరికి పెద్ద పార్టీ ఇస్తానని చెప్పేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో పంకజ్ కుమార్ త్రిపాఠికి సంబంధించి కేవలం లైసెన్స్, పాన్ కార్డు మాత్రమే లభ్యమయ్యాయని, చివరి చూపుకూడా చూసుకోలేకపోయామని తండ్రి ఓం ప్రకాశ్ త్రిపాఠి కన్నీటిపర్యంతమయ్యారు. 'పంకజ్ చివరిసారిగా ఉగ్రదాడి జరిగిన ఫిబ్రవరి 14న ఉదయం ఫోన్లో మాతో మాట్లాడాడు. శ్రీనగర్‌కు వెలుతున్నామని, సాయంత్రం వరకు అక్కడికి చేరుకుంటామని నాతో చెప్పాడు. ఉగ్రదాడికి సంబంధించిన వార్తలను రేడియోలో విన్న తర్వాత పంకజ్ ఫోన్‌కు ఎంత ట్రై చేసినా కలవలేదు. ఏ రోజు కూడా సీఆర్పీఎఫ్లో జాయిన్ అవ్వమని నేను నా కుమారుడితో చెప్పలేదు. డబ్బు సంపాదిస్తూ ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తిరిగి వచ్చి మా కళ్ల ముందే ఉండేలా ఏదైనా పని చేసుకోమని మాత్రమే చెప్పేవాడిని' అని ఓం ప్రకాశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. పంకజ్ కుమార్ 2012లో సీఎఆర్‌పీఎఫ్‌లో జాయిన్ అయ్యాడు. -
నేపాల్ ప్రధానిగా ఓలీ
కఠ్మాండు: హిమాలయ దేశమైన నేపాల్‌కు 41వ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మహరాజ్‌గంజ్‌లోని శీతల్ నివాస్‌లో అధ్యక్షురాలు బిద్యా దేవీ ఓలీ చేత ప్రమాణం చేయించారు. ఓలీ ఇంతకుముందు 2015 అక్టోబర్ నుంచి 2016, ఆగస్టు 3 వరకూ నేపాల్ ప్రధానిగా పనిచేశారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఓలీకి చెందిన సీపీఎన్–యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్–మావోయిస్ట్ సెంటర్ 174 సీట్లు గెలిచింది. -
332 కేజీల భారీ సమోసాను చూశారా!
-
332 కేజీల భారీ సమోసాను చూశారా!
గోరక్ పూర్: భారతీయుల ప్రియమైన చిరుతిండి(స్నాక్)గా సమోసా.. మరే ఇతర వంటకానికి అందనంత ఎత్తుకు ఎదిగింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా స్నాక్స్ సెంటర్లలో సమోసాలకు విపరీతమైన గిరాకి. సమోసాకు దక్కిన ఆ క్రేజ్ ను ఇంకాస్త పెంచడంతోపాటు తమకు కూడా ప్రచారం లభిస్తుందన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుల బృందం 332 కిలోల భారీ సమోసాను తయారుచేసింది. మహారాజ్ గంజ్ జిల్లాలోని గోపాల్ నగర్ కాలనీకి చెందిన రితేశ్ సోని.. ఇంటర్ పూర్తిచేసి సొంత ఊళ్లోనే చిన్నపాటి సమోసాల దుకాణం నడుపుతున్నాడు. గిరాకిని పెంచుకోవడానికి కొత్తగా ఏం చేయాలా? అని ఆలోచిస్తోన్న క్రమంలో 'పెద్ద సమోసా' ఐడియా తట్టింది. ఇంటర్నెట్ లో సెర్చ చేయగా.. ఇంగ్లాడ్ లోని బ్రాడ్ ఫోర్డ్ కాలేజీ విద్యార్థులు రూపొందించిన 110 కేజీల సమోసాదే రికార్డని తెలిసింది. దానికంటే పెద్ద సమోసచేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాలనుకున్న రితేశ్.. స్నేహితుల సహాయంతో పని మోదలుపెట్టాడు. 90లీటర్ల రిఫైన్డ్ ఆయిల్, 1.75 క్వింటాల గోధుమపిండి, రెండు క్వింటాల ఆలుగడ్డలు వినియోగించి 332 కేజీల భారీ సమోసాను తయారుచేశాడు. మూడు మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల పొడవు, రెండు మీటర్ల ఎత్తున్న ఈ సమోసాను రూపొందించేందుకు రూ.40 వేలు ఖర్చయ్యాయని రితిశ్ చెప్పాడు. 15 రోజుల సన్నాహక కార్యక్రమాల అనంతరం మంగళవారం ఉదయానికి సమోసా సిద్ధమైందని, గిన్నిస్ రికార్డు అధికారులకు సమాచారం అందించామని పేర్కొన్నాడు. ఇది 'ప్రపంచంలో అతిపెద్ద సమోసగా' గుర్తింపు పొందాలని రితేశ్ బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుదామా! -
బీజేపీ జిల్లా ఇన్చార్జిగా ప్రేమ్‌సింగ్ రాథోడ్
కరీంనగర్ : భారతీయ జనతాపార్టీ జిల్లా ఇన్చార్జిగా మహరాజ్‌గంజ్ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్రాథోడ్ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షడు కిషన్‌రెడ్డి ప్రకటన చేశారు. నిన్నటివరకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జిల్లా ఇన్చార్జిగా కొనసాగారు. గతంలో జిల్లా ఇన్‌చార్జీలుగా ఆలె నరేంద్ర, బద్దం బాల్‌రెడ్డి, నాగూరాం నామాజీ, షణ్ముఖ, ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్, ధర్మారావు వ్యవహరించారు. ఇన్‌చార్జీలుగా ఎవరు కొనసాగినా జిల్లాలో గ్రూపుల సంస్కృతికి తెరదించలేకపోయారు. జిల్లా నుంచి బలమైన నాయకులు రాష్ట్రస్థాయిలో ఉండడం, ఒక్కో నాయకునికి అధిష్టానం వద్ద ఒక్కొక్కరి అండ ఉండడంతో జిల్లాలో పార్టీని ఒక్కతాటిపైకి తేవడంలో ఇన్చార్జీలు విఫలమయ్యారనే అభిప్రాయాలున్నాయి. దీంతో గ్రూపుల సంస్కృతి నాటి నుంచి నేటివరకు కొనసాగుతూనే ఉంది. పార్టీని పటిష్టపరచాల్సిన జిల్లా ఇన్చార్జీలు రెండు మూడు సమావేశాలు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత కనిపించకపోవడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారిన గ్రూపుల సంస్కృతికి అడ్డుకట్ట వేయలేకపోయారనే అపవాదు సైతం లేకపోలేదు. రాష్ట్రస్థాయి పదవుల్లో జిల్లా నుంచి ఎన్నికైన నాయకులు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరించడంతో జిల్లా ఇన్చార్జీలు కూడా చేసేదేమీ లేక చేతులెత్తేయడం వల్ల బీజేపీ పరిస్థితి కుంపట్లమయంగా మారి, అదే మాదిరిగా కొనసాగుతోంది. తాజాగా నరేంద్రమోడీ ప్రధాని కావడం, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ హవా నడుస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలనే ముందుచూపుతో పార్టీ అధిష్టానం ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఇన్చార్జీలను మార్చి కొత్త వారికి పగ్గాలు అప్పగించి పార్టీని గాడిలోపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రేమ్‌సింగ్ రాథోడ్‌ను జిల్లా ఇన్చార్జిగా నియమించారు. గ్రూపులకు అతీతంగా ఉండే పార్టీ క్యాడర్ కొత్త ఇన్చార్జిపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికైనా పార్టీలో గ్రూపుల సంస్కృతి తెరపడుతుందో.. లేదో వేచిచూడాల్సిందే. సివిల్ దావాలో ఎమ్మెల్యే గంగులకు స్పీకర్ ద్వారా సమన్లు కరీంనగర్ లీగల్: సివిల్ కేసులో కోర్టు సమన్లు తీసుకుని విచారణకు హాజరుకాని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు శాసనసభ స్పీకర్ ద్వారా సమన్లు జారీ చేయాలని కరీంనగర్ ప్రిన్స్‌పల్ జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయవాది టి.వేణుగోపాల్ తెలిపిన వివరాలు.. కరీంనగర్ మండలంలోని చామనపల్లికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు గ్రామంలోని రెండుచె రువుల్లో చేపలను పెంచి విక్రయించి రాబడిని పంచుకునేవారు. కొంతమంది సంఘ సభ్యులకు తెలుపకుండా చేపలను తీసుకెళ్లటంతో వారిపై కరీంనగర్ రూరల్ పోలీసులు ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కానీ నిందితులపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదని సంఘం అధ్యక్షుడు బొజ్జ తిరుపతి కోర్టులో దావా 28 మందిపై దావా వేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒత్తిడితోనే నిందితులపై చర్యలు చేపట్టండం లేద నే ఆరోపణతో ఆయనను కూడా ప్రతివాదిగా పేర్కొన్నారు. దావాను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి డిసెంబర్ ఒకటిన ప్రతివాదులు కోర్టు ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. నవంబర్ 30న గంగుల కమలాకర్ నోటీసులు స్వయంగా తీసుకున్నారు. ఆయ న తరపున హాజరయిన న్యాయవాది పీవీ.రాజ్‌కుమార్ మరుసటి వాయిదాకు వకాలత్ దాఖలు చేస్తానని తెలపటంతో డిసెంబర్ 10కి కేసు వాయిదా పడింది. బుధవారం కోర్టులో హాజరయిన ఎమ్మెల్యే తరపు న్యాయవాది వకాలత్ దాఖలు చేయకపోవటమేకాక తన క్లయింట్‌కు అసెంబ్లీ స్పీకర్ ద్వారా నోటీసులు అందేలా ఆదేశించాలని కోరారు. ఈ మేరకు స్పీకర్ ద్వారా నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి అఫ్రోజ్ ఆఖ్తర్ ఆదేశిం చారు. కేసును ఈనెల 30కి వాయిదా వేశారు. మూడురోజుల్లో బిల్లులు చెల్లించకుంటే కరెంట్ కట్ మంథని : రక్షితనీటి పథకాలు... వీధి దీపాల బకాయి బిల్లులు మూడు రోజుల్లోగా గ్రామపంచాయతీలు చెల్లించకుంటే సరఫరా నిలిపివేస్తామని ఎన్పీడీసీఎల్ మంథని డీఈఈ మాధవరావు స్పష్టం చేశారు. 13వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులు పంచాయతీలకు జమయ్యాయని, అందులోంచే విద్యుత్ బిల్లులు చెల్లించాలని డీపీవో నుంచి ఆదేశాలందాయన్నారు. కానీ సర్పంచులు, కార్యదర్శులు బిల్లుల చెల్లింపునకు ముందుకు రావడం లేదన్నారు. మూడు రోజుల్లోగా బిల్లులు చెల్లించకుంటే సర్వీసులకు సరఫరా నిలిపివేస్తామన్నారు. మంథని డివిజన్లోని ఏడు మండలాల్లో రూ.5.86 కోట్లకు పైచిలుకు బకాయిలు ఉన్నాయన్నారు. -
జీపుపైకి దూసుకెళ్లిన రైలు: 13 మంది మృతి
ఉత్తరప్రదేశ్ మహారాణిగంజ్లో కోఠిపూర్ సమీపంలో జీపుపైకి రైలు దూసుకెళ్లింది. ఆ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రమాదం గత అర్థరాత్రి చోటు చేసుకుందని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. వివాహ వేడుకలలో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న జీపు భద్రత సిబ్బంది లేని రైల్వే లెవెల్ క్రాసింగ్ మీదకు రాగానే... అప్పుడు వచ్చిన రైలు ఆ జీపుపై నుంచి దూసుకుపోయిందని పోలీసులు వివరించారు. ఆ ఘటనపై మరింత సమాచారం అందించవలసి ఉంది.