కరీంనగర్ : భారతీయ జనతాపార్టీ జిల్లా ఇన్‌చార్జిగా మహరాజ్‌గంజ్ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌రాథోడ్‌ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షడు కిషన్‌రెడ్డి ప్రకటన చేశారు. నిన్నటివరకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జిల్లా ఇన్‌చార్జిగా కొనసాగారు.
గతంలో జిల్లా ఇన్‌చార్జీలుగా ఆలె నరేంద్ర, బద్దం బాల్‌రెడ్డి, నాగూరాం నామాజీ, షణ్ముఖ, ఎన్‌వీఎస్‌ఎస్.ప్రభాకర్, ధర్మారావు వ్యవహరించారు. ఇన్‌చార్జీలుగా ఎవరు కొనసాగినా జిల్లాలో గ్రూపుల సంస్కృతికి తెరదించలేకపోయారు. జిల్లా నుంచి బలమైన నాయకులు రాష్ట్రస్థాయిలో ఉండడం, ఒక్కో నాయకునికి అధిష్టానం వద్ద ఒక్కొక్కరి అండ ఉండడంతో జిల్లాలో పార్టీని ఒక్కతాటిపైకి తేవడంలో ఇన్‌చార్జీలు విఫలమయ్యారనే అభిప్రాయాలున్నాయి.
దీంతో గ్రూపుల సంస్కృతి నాటి నుంచి నేటివరకు కొనసాగుతూనే ఉంది. పార్టీని పటిష్టపరచాల్సిన జిల్లా ఇన్‌చార్జీలు రెండు మూడు సమావేశాలు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత కనిపించకపోవడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారిన గ్రూపుల సంస్కృతికి అడ్డుకట్ట వేయలేకపోయారనే అపవాదు సైతం లేకపోలేదు. రాష్ట్రస్థాయి పదవుల్లో జిల్లా నుంచి ఎన్నికైన నాయకులు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరించడంతో జిల్లా ఇన్‌చార్జీలు కూడా చేసేదేమీ లేక చేతులెత్తేయడం వల్ల బీజేపీ పరిస్థితి కుంపట్లమయంగా మారి, అదే మాదిరిగా కొనసాగుతోంది.
తాజాగా నరేంద్రమోడీ ప్రధాని కావడం, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ హవా నడుస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలనే ముందుచూపుతో పార్టీ అధిష్టానం ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఇన్‌చార్జీలను మార్చి కొత్త వారికి పగ్గాలు అప్పగించి పార్టీని గాడిలోపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రేమ్‌సింగ్ రాథోడ్‌ను జిల్లా ఇన్‌చార్జిగా నియమించారు. గ్రూపులకు అతీతంగా ఉండే పార్టీ క్యాడర్ కొత్త ఇన్‌చార్జిపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికైనా పార్టీలో గ్రూపుల సంస్కృతి తెరపడుతుందో.. లేదో వేచిచూడాల్సిందే.
సివిల్ దావాలో ఎమ్మెల్యే గంగులకు స్పీకర్ ద్వారా సమన్లు
కరీంనగర్ లీగల్: సివిల్ కేసులో కోర్టు సమన్లు తీసుకుని విచారణకు హాజరుకాని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు శాసనసభ స్పీకర్ ద్వారా సమన్లు జారీ చేయాలని కరీంనగర్ ప్రిన్స్‌పల్ జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయవాది టి.వేణుగోపాల్ తెలిపిన వివరాలు.. కరీంనగర్ మండలంలోని చామనపల్లికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు గ్రామంలోని రెండుచె రువుల్లో చేపలను పెంచి విక్రయించి రాబడిని పంచుకునేవారు. కొంతమంది సంఘ సభ్యులకు తెలుపకుండా చేపలను తీసుకెళ్లటంతో వారిపై కరీంనగర్ రూరల్ పోలీసులు ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
కానీ నిందితులపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదని సంఘం అధ్యక్షుడు బొజ్జ తిరుపతి కోర్టులో దావా 28 మందిపై దావా వేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒత్తిడితోనే నిందితులపై చర్యలు చేపట్టండం లేద నే ఆరోపణతో ఆయనను కూడా ప్రతివాదిగా పేర్కొన్నారు. దావాను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి డిసెంబర్ ఒకటిన ప్రతివాదులు కోర్టు ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. నవంబర్ 30న గంగుల కమలాకర్ నోటీసులు స్వయంగా తీసుకున్నారు.
ఆయ న తరపున హాజరయిన న్యాయవాది పీవీ.రాజ్‌కుమార్ మరుసటి వాయిదాకు వకాలత్ దాఖలు చేస్తానని తెలపటంతో డిసెంబర్ 10కి కేసు వాయిదా పడింది. బుధవారం కోర్టులో హాజరయిన ఎమ్మెల్యే తరపు న్యాయవాది వకాలత్ దాఖలు చేయకపోవటమేకాక తన క్లయింట్‌కు అసెంబ్లీ స్పీకర్ ద్వారా నోటీసులు అందేలా ఆదేశించాలని కోరారు. ఈ మేరకు స్పీకర్ ద్వారా నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి అఫ్రోజ్ ఆఖ్తర్ ఆదేశిం చారు. కేసును ఈనెల 30కి వాయిదా వేశారు.
మూడురోజుల్లో బిల్లులు చెల్లించకుంటే కరెంట్ కట్
మంథని : రక్షితనీటి పథకాలు... వీధి దీపాల బకాయి బిల్లులు మూడు రోజుల్లోగా గ్రామపంచాయతీలు చెల్లించకుంటే సరఫరా నిలిపివేస్తామని ఎన్పీడీసీఎల్ మంథని డీఈఈ మాధవరావు స్పష్టం చేశారు. 13వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులు పంచాయతీలకు జమయ్యాయని, అందులోంచే విద్యుత్ బిల్లులు చెల్లించాలని డీపీవో నుంచి ఆదేశాలందాయన్నారు.
కానీ సర్పంచులు, కార్యదర్శులు బిల్లుల చెల్లింపునకు ముందుకు రావడం లేదన్నారు. మూడు రోజుల్లోగా బిల్లులు చెల్లించకుంటే సర్వీసులకు సరఫరా నిలిపివేస్తామన్నారు. మంథని డివిజన్లోని ఏడు మండలాల్లో రూ.5.86 కోట్లకు పైచిలుకు బకాయిలు ఉన్నాయన్నారు.
బీజేపీ జిల్లా ఇన్‌చార్జిగా ప్రేమ్‌సింగ్ రాథోడ్
Published Fri, Dec 12 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM
Advertisement