332 కేజీల భారీ సమోసాను చూశారా!
గోరక్ పూర్: భారతీయుల ప్రియమైన చిరుతిండి(స్నాక్)గా సమోసా.. మరే ఇతర వంటకానికి అందనంత ఎత్తుకు ఎదిగింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా స్నాక్స్ సెంటర్లలో సమోసాలకు విపరీతమైన గిరాకి. సమోసాకు దక్కిన ఆ క్రేజ్ ను ఇంకాస్త పెంచడంతోపాటు తమకు కూడా ప్రచారం లభిస్తుందన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుల బృందం 332 కిలోల భారీ సమోసాను తయారుచేసింది.
మహారాజ్ గంజ్ జిల్లాలోని గోపాల్ నగర్ కాలనీకి చెందిన రితేశ్ సోని.. ఇంటర్ పూర్తిచేసి సొంత ఊళ్లోనే చిన్నపాటి సమోసాల దుకాణం నడుపుతున్నాడు. గిరాకిని పెంచుకోవడానికి కొత్తగా ఏం చేయాలా? అని ఆలోచిస్తోన్న క్రమంలో 'పెద్ద సమోసా' ఐడియా తట్టింది. ఇంటర్నెట్ లో సెర్చ చేయగా.. ఇంగ్లాడ్ లోని బ్రాడ్ ఫోర్డ్ కాలేజీ విద్యార్థులు రూపొందించిన 110 కేజీల సమోసాదే రికార్డని తెలిసింది. దానికంటే పెద్ద సమోసచేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాలనుకున్న రితేశ్.. స్నేహితుల సహాయంతో పని మోదలుపెట్టాడు.
90లీటర్ల రిఫైన్డ్ ఆయిల్, 1.75 క్వింటాల గోధుమపిండి, రెండు క్వింటాల ఆలుగడ్డలు వినియోగించి 332 కేజీల భారీ సమోసాను తయారుచేశాడు. మూడు మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల పొడవు, రెండు మీటర్ల ఎత్తున్న ఈ సమోసాను రూపొందించేందుకు రూ.40 వేలు ఖర్చయ్యాయని రితిశ్ చెప్పాడు. 15 రోజుల సన్నాహక కార్యక్రమాల అనంతరం మంగళవారం ఉదయానికి సమోసా సిద్ధమైందని, గిన్నిస్ రికార్డు అధికారులకు సమాచారం అందించామని పేర్కొన్నాడు. ఇది 'ప్రపంచంలో అతిపెద్ద సమోసగా' గుర్తింపు పొందాలని రితేశ్ బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుదామా!