
లక్నో: ఓ పెళ్లి పందిరిలో ఘరానా మోసం వెలుగు చూసింది. వధువు బదులు ఆమె తల్లి పెళ్లి పీఠలెక్కింది. పెళ్లి తంతులో వధువు తన అసలు పేరు బదులు మరో పేరు పలకడంతో పక్కనే ఉన్న వరుడికి అనుమానం వచ్చింది. ముసుగు తొలగించి చూడగా.. అసలు విషయం బయటపడింది. దీంతో తాను మోసపోయానని వరుడు గ్రహించాడు. వధువు బదులు ఆమె తల్లి ఎందుకు ఉందని ప్రశ్నించారు. వధువు తరుఫు కుటుంబ సభ్యులు బెదిరించడంతో పెళ్లి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.
పోలీసుల వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ (uttar pradesh) మీరట్‌లో (meerut) బ్రహ్మపురికి చెందిన వరుడు (22)కు శామలీ జిల్లావాసి వధువు (21)తో పెళ్లి కుదిరింది. కుదుర్చుకున్న సమయానికి పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు సిద్ధమయ్యారు. పెళ్లి తంతు మొదలైంది. అయితే, సరిగ్గా అప్పుడే వధువు తన పేరు చెప్పాల్సి ఉంది. బదులుగా ఆమె తల్లి పేరు చెప్పింది. ఇదేంటని బిత్తరపోయిన పెళ్లి కొడుకు వధువు ధరించిన ముసుగును తొలగించాడు.
అంతే, వధువు బదులు ఆమె తల్లి ఉందని చూసి కంగుతిన్నాడు. ఇదే విషయాన్ని పెళ్లి పెద్దల్ని ప్రశ్నించాడు. పెళ్లి పెద్దలు సైతం వధువు తల్లికి మద్దతు పలికారు. వధువు తల్లిని పెళ్లి చేసుకోవాల్సిందేనని వరుడిని హెచ్చరించారు. లేదని అల్లరి చేస్తే రేప్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. తాను పూర్తిగా మోసపోయానని గ్రహించిన వరుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.
‘నాకు వధువు బదులు ఆమె తల్లిని ఇచ్చి పెళ్లి చేసేందుకు కుట్ర చేశారు. పెళ్లి కోసం రూ.5లక్షలు ఖర్చు చేశా. మీరే న్యాయం చేయండి’ అంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు